జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-5

-వెనిగళ్ళ కోమల

నాకు 8 ఏళ్లుంటాయి  నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది అన్నాడు. నాన్న అతని మాటలు నమ్మాడని కాదుగాని అతను నాన్నను ప్లీజ్ చేయటానికి వాడిన సమయస్ఫూర్తి నచ్చి అతనికి 2 రూపాయలు (అప్పుడది ఎక్కువ) యిచ్చి పంపాడు. దానధర్మాలు చేయటం, చందాలు విరివిగా ఇవ్వటం నాన్నకు అలవాటు. ఒకసారి పెదపూడిలో (పెద్దక్క ఊరు) బజారుకెళ్ళారు. అక్కడ భిక్షకోసం వచ్చినవారు చక్కని వాయిద్యం వాయించారని జేబులో 50 రూపాయల నోటు ఉంటే వాళ్ళకిచ్చివచ్చారు. అంతెందుకు అని నేనంటే చిల్లర లేదమ్మా పైగా వారి వాద్య సంగీతం నాకు నచ్చింది అన్నాడు నాన్న.

అమ్మ దసరాలప్పుడు గౌరీ వ్రతం చేసేది. సంక్రాంతి కాలంలో బొమ్మల కొలువు పెట్టి పెద్దగా 5 రోజులు ముత్తయిదువులను పిలిచి రోజుకొకరకం పండ్లు, శనగలు, తాంబూలం పంచేది. ఆ బొమ్మలు విడప్పుడు రెండు పెద్ద కావిడి పెట్టెల్లో బట్టల మధ్య భద్రపరిచేది. అన్నయ్య పిల్లలాటలాడి వాటిని విరిచేదాకా అవి అలా భద్రంగా ఉన్నాయి. ఏడాదికొక కొత్త బొమ్మ కొనేది. పాతవిరంగు మాసితే మరల రంగులు వేయించేది. ఆరోజుల్లో రంగులు వేసేవాళ్ళు వచ్చేవారు. ఇళ్ళ వెంట. సంక్రాంతి కాలంలో ఆవరణలో రెండు పెద్ద పురులూ, రెండు పాతరలు ధాన్యాగారాలుగా ఉండేవి. ఎప్పుడూ బంధువుల రాకపోకలతో యిల్లు సందడిగా ఉండేది. అమ్మ కజిన్స్ పిచ్చాడమ్మ, భూషణమ్మ పెద్దమ్మ (భుసెప్ప అనేవారు) అనసూయ పిన్ని, ముగ్గురు వెంకటేశ్వర్లు మామయ్యలు సంవత్సరానికి ఒకసారి వచ్చి అమ్మ, మామయ్యలను చూసిపోతుండేవారు. మా యింట్లోనే వారందరికీ ఆతిథ్యం. అతిథిదేవోభవ అని అమ్మా, నాన్న మా ఐదుగురికి నేర్పారు. మేము అదే వరవడి పాటించాము. 

రెండేళ్ళ ఉద్యోగానంతరం 1961 వేసవిలో ఖాళీగా ఉన్నాను. నా స్నేహితురాలు వసంత కుమారి డెక్కన్ క్రానికల్ లో ఇంగ్లీషు టీచర్లు కావాలని నారాయణ గూడా మల్టీపర్పస్ స్కూలు, హైదరాబాదు వారిచ్చిన ప్రకటన కట్టింగ్ మధిర నుండి పోస్ట్ లో పంపింది. చకచక అప్లికేషన్ పెట్టాను వివరాలతో. జూన్ మొదటి వారంలో ఇంటర్వ్వూకి రావలసిందని వారు కార్డు పంపారు. నాన్నకు నన్ను ఒంటరిగా పంపటం యిష్టం లేకపోయింది. అన్నయ్య వెంటబడి మారాం చేశాను, తిండి మానాను అలిగి. అన్నయ్య పంపిద్దామని నాన్నతో మాట్లాడాడు. అదే టైములో వేసవి సెలవులకు ఆవుల సాంబశివరావు బాబాయి, కుటుంబంతో మూల్పూరు వచ్చి ఉన్నారు. నాన్న బాబాయితో విషయం ప్రస్తావించగా, పంపించండి అన్నయ్యా. అక్కడ దగ్గర లోనే (బరఖత్ పురా) వర్కింగ్ వుమెన్స్ హాస్ట ల్ఉన్నది. జయప్రద ఆ బోర్డు మెంబరు, లెటర్ రాసి యిస్తుంది. ఉద్యోగం వస్తే అక్కడ ఉండవచ్చు అని ధైర్యం చెప్పారు నాన్నకి. అలా ప్రయాణానికి రెడీ అయిపోయా. పెట్టా బేడా సర్దుకుని (ఉద్యోగం వచ్చినంత సంబరంతో) బయలుదేరా. అక్తర్ అక్కడ ఉద్యోగంలో ఉంటే తనకు టెలిగ్రాం యిచ్చా స్టేషన్ కు రమ్మని. అన్నయ్య తన స్నేహితుడు అత్తోట భాస్కరరావుగారికి టెలిగ్రాం యిచ్చాడు. నేను బండి దిగగానే అక్తర్ కనిపించింది. తనతో  వై.డబ్ల్యు.సి.ఎ. హాస్టల్ కి వెళ్ళా. నాన్న మనవాళ్ళ చౌదరి అనే లాయరు (నాన్న స్నేహితులు) గారి పేర ఏదో లెటర్ రాసి యిచ్చారు. ఆయన నారాయణగూడాలోనే ఉంటారు. ఇంటర్వ్యూ అయింది. భాస్కరరావు మామయ్య వచ్చి నన్ను తమ యింటికి తీసుకెళ్ళారు. ఆయన భార్య ఇందిర. నాలుగు రోజులు వారింట్లో ఉన్నాను. వారింటి దగ్గర స్కూలులో హెడ్ క్లర్క్ ఉంటారు. సెలెక్ట్ అయ్యానని అప్పాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొని మామయ్య యింటికొచ్చారాయన. ఆయనది అమృతలూరు, మా వూరికి దగ్గరే. బహుశ మనవాళ్ల చౌదరిగారు స్కూలు సెక్రటరీతో మాట్లాడి ఉండవచ్చు. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. 1961 జూన్ పన్నెండున స్కూలులో డ్యూటీ చేరాను. హాస్టల్ వసతి బాగున్నది. స్కూలుకు నడిచి వెళ్లే దూరమే. అప్పటికి కనకమణి – (నా క్లాసుమేట్), లక్ష్మీ కుమారి (యూనివర్సిటీలో పరిచయం) అదే స్కూలులో పని చేస్తూ అదే హాస్టల్లో ఉంటున్నారు రెండేళ్ళుగా.

నా వృత్తి నాకిష్టం. అమ్మాయిల స్కూలది. వారితో పాఠాలు చెపుతూ గడిపిన రోజులు మరపురానివి. కొందరు సన్నిహితులయ్యారు. అరుణ, ఉషారాజు అందులో ముఖ్యులు. ఇద్దరూ డాక్టర్లు. ఉష అమెరికాలో పెథాలజిస్ట్ గా స్థిరపడింది. అరుణ ఎనస్తీషియా ప్రొఫెసర్ గాంధీ మెడికల్ కాలేజి హాస్పిటల్లో. ఇద్దరూ ఇప్పటికీ ఈ కోమలా టీచర్ని కలుస్తారు. 50 ఏళ్ళకు పైగా పెనవేసుకున్న అనుబంధమది. అరుణ భర్త డా.సుభాష్ బాబు మాకు ఫామిలీ డాక్టరు. ఎంతో శ్రద్ధగా వైద్యం చేస్తారు. ఇన్నయ్యకు ఆస్తమా ట్రబుల్ ఉండేది. సుభాష్ గారి వైద్యంలో ఇన్నయ్య తానొకప్పుడు ఆస్తమాతో బాధపడ్డాననేమాట మరచిపోయాడు. అంతటి హస్తవాసి ఆ డాక్టరుగారిది అని చెప్పాలి. ఇప్పటికీ (అమెరికాలో ఉంటూ) ఆయనకు ఇండియా ఫోను చేసి వైద్య సలహాలు పొందుతూనే ఉన్నాం. మా పిల్లలంటే డాక్టరుగారు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. రాజుని (మా అబ్బాయిని) రాజా సాహెబ్ అని పిలుస్తారు. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత దాగి ఉన్నది. అరుణక్క, సుభాష్ అంకుల్ మా పిల్లలకు ప్రేమపాత్రులు. 

స్కూలులో మంచి మిత్రులు – రామలక్ష్మి (ఇంగ్లీషు టీచరు)  సరోజిని (బోటనీ-సరో) హేమారాణి (సైన్స్ టీచరు). సరో ఇటీవలే తనువు చాలించింది. హేమారాణి పిన్నవయసులోనే వెళ్ళిపోయింది సుదూరతీరాలకు. రామలక్ష్మి తన వృత్తికి న్యాయం చేయాలని ఎప్పుడూ తాపత్రయ పడేది. మంచి వ్యక్తి. మనసు విప్పి మాట్లాడుకునేవాళ్ళం. వాళ్లన్నగారికి ట్రాన్సఫర్ (ఆల్ ఇండియా రేడియో) అవటాన విడిపోయాం.  ఇప్పటికీ ఒకసారి కలవగలిగితే ఎంత బాగుండును అనుకునే స్నేహితురాళ్ళలో ఆమె ఒకరు. ఎక్కడ ఉన్నా నాకు మంచి మిత్రుల సాంగత్యం. వారి ఆదరణ, అభిమానం కోకొల్లలుగా లభించాయి. ఇంకా లభిస్తూనే ఉన్నది. అది వారందరి ఉదార స్వభావానికి స్నేహశీలతకు, సహృదయతకు తార్కాణం. నా అదృష్టం. 

గుంటూరులో ఉద్యోగానికి చేరేముందే కాలేజీవారు మూడు నెలల వేసవి ప్రత్యేక కోర్సుకు పంపారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ (CIEFL, Hyderabad) వారు ఆ కోర్సు ఊటీలో నిర్వహించారు. 

టీచర్లందరూ అప్పటికి విదేశీయులే. Mr. Bruton, Mr. Barren, Mr. George (German, a Vegetarian) Mr. Hill మొదలైనవారు. వారి సౌకర్యార్ధం చల్లని ప్రదేశం ఊటీలో కోర్సు జరిపారు. నవాబు ప్యాలెస్ – వుడ్ కాక్ హాల్ అందుకు ఉపయోగించారు.

దేశంలోని అన్ని  రాష్ట్రాల నుండి లెక్చరర్స్ కోర్సులో పాల్గొన్నారు. వారంతా అనుభవం గడించినవారే. నేనే వారందరిలో చిన్నదాన్ని. అప్పుడే ఉద్యోగం ప్రారంభించబోతున్నాను. 

కోర్సులో ఫోనెటిక్స్ లిటరరీ అప్రీసియేషన్, ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ గా ఎలా బోధించాలి అనే అంశాలు సూక్ష్మంగా నేర్పించారు. ఆ అనుభవం నాకు బోధనలో ఎంతో ఉపకరించింది. ఆ అవకాశం కల్పించిన సెయింట్ జోసెఫ్ కళాశాలవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఈ కోర్సులో పాల్గొన్నవారిలో పి.యల్.యన్.శర్మగారు, షేఖ్ మౌలానాగారు ఇంకా బాగా గుర్తున్నారు. శర్మగారు కోమలమ్మా – 40 ఏళ్ళ వయసున్న ప్రతి మగవాడు ఒక రోగ్ (దుష్టుడేమో) అనేవారు. నవ్వేదాన్ని ఆయన అలా అంటుంటే. చక్కగా మాట్లాడేవారు. షేక్ మౌలాగారు సౌమ్యుడు. నిశితంగా కోర్సులో మునిగితేలినవాడు. తరవాత కాలంలో ఆయన స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా తారసిల్లారు. టీచర్సుి తప్పులెన్నటం ఆయన లక్ష్యం కాదు. ఇన్స్పెక్షన్ టైములో వారు మిస్ అవుతున్న విషయాలను చూపి ఎలా బోధించాలో చెప్పటం వారి ఉద్దేశ్యం – చాలా అరుదుగా ఉంటారలాంటి వారు. 

ఈ కోర్సు టైములో రెండు వింతలు జరిగాయి. (కోర్సుకు సంబంధం లేదు) నేను, వెల్మాదయాల్ (నాగపూర్, కొత్తగా పరిచయ మయ్యారు). రోజూ సాయంత్రం మార్కెట్ కి వెళ్ళి పండ్లూ, ఇతర అవసరమైన వస్తువులూ కొనుక్కునేవాళ్ళం. వస్తూ మల్లెపూలు కొని శిగలో తురుముకునేవాళ్ళం. పంజాబ్ నుండి వచ్చిన ఒక పెద్దాయనకు ఈ పూల విషయం వింతగా తోచేదట. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాడు – ఎందుకు మేమిద్దరం పూలు పెట్టుకుంటున్నామని. మాకు (ముఖ్యంగా దక్షిణ భారత స్త్రీలకు) అది ఆచారం, అలవాటు అని చెప్పాము. అసలు సంగతేమిటంటే ఆయన వచ్చిన ప్రదేశంలో వేశ్యలే పూలు ధరిస్తారట. ఈ అమ్మాయిలు చూస్తే ఎంతో మర్యాదస్తులుగా ఉన్నారు. ఈ పూలేంటి అనేది ఆయన సందేహం. మేము విడమరచాము ఆయనకు. ఇంకానయం అడిగారు. సందేహనివృత్తి అయింది. లేకుంటే మా పట్ల దురభిప్రాయంతో వెళ్ళుండేవాడాయన.

 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.