నారిసారించిన నవల-16

డా. పి. శ్రీదేవి

-కాత్యాయనీ విద్మహే 

 

5

జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు ఎంచుకొనవలసిన పద్ధతులేమిటి ? ఈ మొదలైన ప్రశ్నలతో మనిషి చేసే అన్వేషణను,  నిర్దేశించుకొనే గమ్యాన్ని, అది చేరుకొనేందుకు చేసే క్రియాశీలక కార్యకలాపాన్ని కలిపి జీవిత తాత్త్వికత అనవచ్చు . 

కాలాతీత వ్యక్తులు నవలలో స్త్రీ పురుషులందరూ చదువుకున్న, చదువుకుంటున్న, ఉద్యో గాలు చేస్తున్న వాళ్ళు, హృదయం, మెదడు ఏకకాలంలో పదునుగా పనిచేస్తున్నవాళ్ళు. ఎవరో నిర్దే శించిన జీవితాన్ని జీవించటం కాక ప్రతివాళ్ళూ జీవితం గురించి తర్కించారు. సంఘర్షించారు. సమాధాన పడ్డారు. వీళ్ళల్లో మరీ ఎక్కువగా జీవితం గురించి తర్కించిన వాళ్ళు ప్రకాశం , కల్యాణి. జీవితం అంటే ఇద్దరికీ భయమే.

ప్రకాశానికి మేనమామ తన జీవితంపై చూపే అధికారం ఇష్టం లేనిదే. అయినా   ధిక్కరించ లేడు. మేనమామ అంటే భయం. సకాలంలో తన అవసరాలకు డబ్బు పంపమని అడగలేడు. తన పొలాల ఆదాయ వ్యయాల గురించి అడగలేడు. తనకోసం తాను బ్రతకటం అతనికి చేతకాదు. లోకం ఏమనుకొంటుందోనని భయం. ఇందిరతో షికార్లకు వెడితే ప్రొఫెసర్లు ఎక్కడ చూస్తారోనని రాత్రిపూట కానీ వెళ్ళడు.ఇందిరంటే కూడా భయమే.తన యిష్టాయిష్టాలను ఆమె ముందు చెప్పలేడు. తనకు చదువుకొనే పనివున్నా ఆమె రమ్మంటే ఆ భయంతోటే ఆమె వెంట వెడతాడు.  కల్యాణితో తన స్నేహం గురించి , ప్రేమ వ్యవహారంగా వ్యాఖ్యానించిన సహ విద్యార్థితో తగాదా పెట్టుకొన్నాడు. అంటే లోకానికి తానెప్పుడూ మంచివాడిగా వుండాలనే లక్షణం అది . అసలతనికి ఏం కావాలో అతనికే తెలియదు. కల్యాణి ముగ్ధత్వం, మృదుత్వం కావాలి. కల్యాణి కనుమరుగుకాగానే కల్యాణికి నువ్వెలా సాయపడగలవు అని ఇందిర నిలదీస్తే కల్యాణిని వదులుకోనూగలడు.  తనను ఆదుకొని ధైర్యాన్నిచ్చే చనువు, చొరవ చూపగల ఇందిర కావాలని అనుకోనూ గలడు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకొనాలో అందుకు కావలసిన ఆత్మజ్ఞానం అతనికి లేదు. ఆత్మజ్ఞానంతో ముడిపడిన స్వతంత్ర ప్రవృత్తికి ఇక  అవకాశమే లేదు . అందువల్లనే అతను కల్యాణిని వదులుకొన్నాడు . ఇందిరను పొందలేకపోయాడు. వీళ్ళిద్దరివల్లా తనకు ఒరిగేదేమీ లేదని , మేనమామ కుదిర్చిన పెళ్ళిలోనే భద్రత వుందని లొంగిపోయాడు. కుత్సిత విశ్వాసాలలో జీవితం నుండి బాధ్యతల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. ఇందిర అన్నట్లు బీటలు వేసిన వ్యక్తిత్వం అతనిది.  ఆత్మ వంచనకు పాల్పడి అధఃపతనానికి దిగజారాడు. ఇందిరను , కల్యాణిని వాళ్ళకు పనికివచ్చే మగాడికి ఉచ్చులుపన్నే రకంగా అనుకొని తన లొంగుబాటును తానే సమర్థించుకొన్నవ్యక్తి  ప్రకాశం.

కల్యాణి ఆలోచనల పుట్ట. ఆమె పుట్టుక పెరుగుదల అన్నీఆమె ఆలోచనల ద్వారానే మనకు  తెలుస్తాయి. తన ప్రవర్తనను తాను తరచి చూచుకొనటం, ఇతరులు ఏమనుకొన్నారోనని ఆలోచనలో పడటం ఆమె జీవిత లక్షణం. అన్నిటికి బాధపడటం తన లక్షణమని ఆమె గుర్తించింది. అదే ప్రకాశం లక్షణమని కూడా గ్రహించింది. కల్యాణి ప్రకాశంతో మాట్లాడే సందర్భంలో నవ్వటానికే భయపడిందీ  అంటే జీవితంపట్ల ఆమెకున్న భయానికి సూచనే అది. ఆశించింది అందకపోవటం ఆ భయాన్నిస్థిరీకరించింది. యం.బి.బి.యస్. చదువుదామనుకొన్నది. చదవలేక పోయింది . ఆనర్స్ లో చేరింది. తండ్రి మరణం వలన అది కూడా సాధించలేకపోయింది. ప్రకాశం తన ఒంటరి తనంలో తోడై వుంటాడని నమ్మింది . ఆ నమ్మకం వమ్ము అయింది. తండ్రి మరణానంతరం తనకు సహాయపడాలని ముందుకు వచ్చిన మునుసుబు రామినాయుడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. ఈ పరిణామాలన్నీ జీవితంపట్ల ఆశను , విశ్వాసాన్ని పోగొట్టాయి ఆమెలో. ఈ విషయం డా. చక్రవర్తి గుర్తించాడు. ఆమెతో ప్రస్తావించాడు కూడా. చక్రవర్తి చూపిన స్నేహం , కృష్ణ మూర్తి అందిస్తానన్న సహాయం, వసుంధర ఆదరణ ఇవన్నీ ఆమెకు  జీవితమంటే భయపడుతూ సందేహపడుతూ అడుగు కదపకుండా ప్రవాహం ఎటు తీసికెళితే అటే వెళ్ళిపోవటం కాదన్న కొత్త అవగాహనను ఇచ్చాయి. బతకాలనే సంకల్పం, బతకగలననే ధైర్యం కలిగాయి. ఏదయినా ఊహిం చుకున్న కొద్దీ భయం వేస్తుంది ; ఎదుర్కొన్న కొద్దీ ధైర్యం వస్తుంది.అన్న నిశ్చయానికి వచ్చింది.  తన చదువు వల్ల సంపాదించ గలిగిన ఉద్యోగాల గురించి ఆలోచించసాగింది.  స్వతంత్రంగా బ్రతక టానికి వసుంధర ఇంటి నుండి బయటకు వచ్చి, గది అద్దెకు తీసుకొని ట్యూషన్ కుదుర్చుకొన్నది . అక్కడనుంచి ఆమెదంతా నిర్మాణాత్మక దృష్టి. 

జీవితం అంటే భయం ప్రకాశానికి , కల్యాణికి మొదట్లో ఒకేరకంగా వున్నా, జీవితం గురించి ఊహించి భయపడటంకన్నా ఎదుర్కొని ముందుకు సాగాలన్న జీవనసూత్రం కల్యాణి ఏర్పరచు కొన్నట్లు ప్రకాశం ఏర్పరచుకొనలేక పోయాడు. మామయ్య గురించి భయం, బ్రతుకు భయం వీటినుండి విముక్తుడు కావటానికి ఏ ఎదురీతకు అతను సిద్ధం కాలేదు. మామయ్య కుదిర్చిన పెళ్ళికి అంగీకరించి భయం నుండి భయానికే ప్రయాణం చేశాడు . భయం మనిషిలోని అన్ని సుగుణాలను ధ్వంసం చేస్తుందంటాడు రావిశాస్త్రి . కనుకనే ప్రకాశం కల్యాణిపట్లగానీ , ఇందిరపట్లగానీ నమ్మకంతో ప్రవర్తించలేకపోయాడు. కల్యాణి అలాకాదు. జీవితం గురించిన భయం నుండి విముక్తికి ఆమెకు దొరికిన ఆధారం ఆర్థిక స్వావలంబన . దానితో ఏదో నిగూడ సత్యం కనుక్కున్న తపస్వివలె ఆమెకు జ్ఞానోదయంఅయింది అని అప్పటి ఆమె మనఃస్థితిని వ్యాఖ్యానించింది రచయిత్రి. ఆ సత్యం తాను స్వేచ్ఛాజీవినన్న భరోసా ఇచ్చింది ఆమెకు.స్వేచ్ఛాజీవిగా ఎదగటానికి ఆమె ప్రయత్నపరురాలైంది. ఆ క్రమంలోనే మీరంతా కలిసి స్నేహం యివ్వండి . కాని జాలిపడకండి అని చక్రవర్తికి స్పష్టంగా చెప్పగలిగింది. 

వసుంధర పినతల్లి చేసిన అవమానంలో ఆ రాత్రి వసుంధర ఇల్లు వదిలి వచ్చిన కల్యాణి పుట్టినరోజు నాడు స్వతంత్ర జీవనం ఇచ్చిన కొత్త ఉత్సాహంతో బయలుదేరిన తనకు ఈ అనుభవా లేమిటి ? తనను అర్ధం చేసుకొనేవారెవరూలేరా ? తాను ఒంటరిదేనా అన్న ప్రశ్నలతో వేగిపోతూ చక్రవర్తి ఇంటికి వెళ్ళి తన దు:ఖోద్వేగాన్ని అతనితో పంచుకొనటం ఒక ముఖ్య ఘట్టం. ఇక్కడ పడిపోకుండా తననుతాను నిలబెట్టుకొనటానికి కల్యాణి గొప్ప ప్రయత్నం చేసింది. తనిప్పుడు హాయిగా లేచి నిలబడాలి ; ధైర్యంగా ప్రపంచాన్ని చూసి చిరునవ్వు నవ్వాలి . తనకు పునర్జన్మ వచ్చింది. తనొక కొత్త కల్యాణి. ఈ కొత్త కల్యాణి లోకానికి భయపడదు‘ – అనుకొంటుంది. ఆ ధైర్యం లోనే చక్రవర్తితో  పెళ్ళికి అంగీకరిస్తుంది. తన జీవితానికి తానే బాధ్యత వహించగల స్థితిలో తనపై హక్కు తనదేనన్న స్థిర సంకల్పంలో చక్రవర్తితో  సంబంధంలోకి రావటానికి ఆమోదిస్తుంది. పెళ్ళికి వెళ్ళే దారిలో కారుకు యాక్సిడెంటు కావటం ఆమె ధైర్యాన్ని కొంత సడలింపచేసినా మళ్ళీ తనకు తానే సర్చిచెప్పుకొంటుంది. జీవితంలో జీవితంపట్ల భయసందేహాలు అనుక్షణం ఆమెను వెంటాడు తూనే వున్నా,  కృంగదీస్తూనే ఉన్నా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనటమే చేయవలసినదల్లా అన్న ఏకదీక్షతో  జీవించింది కల్యాణి . 

ఆ క్రమంలోఆమె తన వ్యక్తిత్వాన్ని అభావం చేసే అధికార వ్యవస్థలను నిర్వంద్వంగా తిరస్క  రించింది . భర్తకు కూడా తనమీద ఎలాంటి హక్కు ఇవ్వరాదనుకొనటంలో తనకు కావలసింది ఆర్థిక భర్తకాదు అనీ, ఆ మాటకొస్తే భర్త అనే మాటలోని సాంఘిక అర్ధాన్ని అమలులో పెట్టే వ్యక్తి కూడా కాదు అనీ అనుకొనటంలో చక్రవర్తికి ఆ విషయం చెప్పటంలో తనకోసం తాను బ్రతకటమే వుంది . భార్యగా లోకం నిర్దేశించిన చట్రాన్ని అస్తిత్వ స్పృహతోనే నిరాకరించింది . స్వాభిమాన ప్రకటన దాని లక్షణమే . 

ఇందిర కృష్ణమూర్తి దాదాపు ఒకలాంటివారు . జీవితాన్ని గురించి ఆలోచించరు . జీవిస్తారు . భయమన్నది ఎరగనివారు. ఇందిర గురించిన మొదటి ప్రస్తావనలో ప్రకాశం నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తి గది మార్చేస్తే బాగుండునని తోస్తుంది అని అంటే భయం దేనికీ అంటాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తికి జీవితంపట్ల ఆసక్తి తప్ప భయంలేదు. ఇందిర గురించి తెలుసుకొనాలని తపనపడ్డా, ఆమెతో పరిచయం పెంచుకొన్నా, కల్యాణి ఏమైందని విచారించినా , వెతికినా , కల్యాణికి సాయపడాలని తపనపడ్డా అన్నీ  జీవితంపట్ల ఆసక్తితో, జీవితాన్ని ఒక ఉత్సవంగా జీవించాలనే తత్త్వంలో భాగంగా చేసినవే.

కృష్ణమూర్తి ఎప్పుడూ ఇతరులకోసం బ్రతకలేదు. ఇంట్లో వాళ్ళకు, సంఘానికీ, అతనెప్పుడూ భయపడలేదు. విలాసవంతంగా జీవితం గడిపినా, పరీక్షలో ఫెయిలవుతున్నా, పేకాటలాడినా , సినిమాలకు తిరిగినా, ఇందిరతో కాలక్షేపం చేసినా, కల్యాణి కోసం వెతికినా, ఇందిరను పెళ్ళాడాలని నిర్ణయించుకొన్నా అన్నీ తనకోసం , తనకు వాటిల్లో ఆనందం, తృప్తి వున్నాయి కనుక చేశాడు . తన అంతరాత్మకు తాను జబాబుదారీగా ప్రవర్తించాడు. తనకోసం తాను బ్రతికాడు. వసుంధర అతని గురించి ఒక మాట అంటుంది . బురదను కెలికే అలవాటు లేకపోలేదుగాని అది యితన్నేమీ అంటుకోలేదు. ఆ సంగతి దాచుకోవాలనే తత్త్వం కూడా లేదు ” అన్న మాటలు లోకం కోసం కాక తనకోసం తాను పారదర్శకంగా బ్రతికే కృష్ణమూర్తి అస్తిత్వ చైతన్యాన్ని సూచిస్తాయి. భవిష్యత్తులో తనకేదైనా ఆపదవస్తే కాపాడతారా అని వసుంధర అడిగినప్పుడు నేను మనిషిని వసుంధరగారూ ! మేకను కాదు అని ఆత్మాభిమానంతో అన్నమాట కూడా గమనించదగింది. తనేమిటో తనస్థాయి ఏమిటో తెలిసి ప్రవర్తించగలిగినవాడు. 

జీవిత భాగస్వామిగా వసుంధరనా ఎంచుకొనవలసింది ఇందిరనా అన్న సంఘర్షణకు గురి అయినప్పుడు కృష్ణమూర్తి ఎవరిని ఎంచుకోవటానికయినా స్వేచ్ఛ వున్నవాడతను. స్వాతంత్య్రం  వున్నవాడతను. అయితే ఆత్మజ్ఞానం వున్నవాడతను. అందువల్లే తాను ఇందిరను పెళ్ళాడటం ఇద్దరికీ మేలు చేసేదిగా వుంటుందని నమ్మాడు.  ఆత్మవంచనా పరుడయితే వసుంధరను ఎన్ను కొనేవాడు. కృష్ణమూర్తి అస్తిత్వ చైతన్యం అతనిని ఉన్నతుడుగా నిలబెట్ట గలిగింది . అతనిలోని ఈ ఉదాత్తతను సరిగా గుర్తించగలిగాడు చక్రవర్తి.  తాను జీవిస్తూ ఇతరులు జీవించటానికి ఆసరా ఇవ్వాలనే తత్త్వం కృష్ణమూర్తిది. తప్పు తనదికాదు పరిస్థితులది అనుకొనే ప్రకాశం లాంటివాడు కాదతను. పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకొని తప్పును సవరించాలనేది అతని తత్త్వం. అందుకే కల్యాణిని కనుగొనేంత వరకు అతను అన్వేషణ మానలేకపోయాడు . కల్యాణిని కనుక్కొన్న తరువాత ఆమెకు తానెంత వరకూ సాయపడగలనా అని నిజాయితీగా ప్రయత్నించాడు. జీవితం అడుగడుగునా భూతంవలె పీడిస్తున్నా  ఎదురుతిరిగి పెనుగులాడుతున్నదనే అతను ఇందిరను అభిమానించాడు.ఆమెను చూచి సంతోషపడ్డాడు. ఆమె కోసం కుటుంబాన్ని, సంఘాన్ని ఎదిరించ టానికి సిద్ధపడ్డాడు. ఈ మొత్తం క్రమంలో జీవితాన్ని ప్రేమించి జీవించటమే కృష్ణమూర్తి తత్త్వంగా అర్ధం అవుతుంది .

 తాను అవినీతిపరుడు, బాధ్యతా రహితుడు , స్వసుఖపరాయణుడు అయిన ఆనందరావు కూతురిని అన్న వాస్తవాన్నిగుర్తించి, తన గురించి పట్టించుకొనే వాళ్ళు ఎవరూ లేరని గ్రహించి  తనకోసం తాను బ్రతకటం అలవరచుకొన్న స్త్రీ ఇందిర. లోకానికి తాను విషయంగా వుండటం ఇష్టం లేకపోయింది. అందుకనే లోకం ఒక ఆడపిల్ల ఎలా వుండాలని ఆశిస్తుందో తద్భిన్నంగా స్వేచ్ఛా ప్రవృత్తినలవరచుకొంది. మగవాళ్ళతో చొరవగా చనువుగా మాట్లాడటం, లోకం కోసం ఒకమాట తనలో ఒకమాటగా కాక తానేమనుకొంటున్నదో అదే నిర్భయంగా పైకి అనెయ్యటం, ప్రకాశంతోనైనా కృష్ణమూర్తితోనైనా సినిమాలకు షికార్లకు వెళ్ళటం ఇవన్నీ ఆ స్వేచ్ఛాప్రవృత్తిలో భాగాలే . స్వతంత్ర ప్రవృత్తి బాధ్యతను కోరుతుంది. ఇందిర తన జీవితానికి బాధ్యత తనదేనన్న ఆత్మచైతన్యంతోనే చివరివరకు ప్రవర్తించింది. ఇందిర  తనకు ఏది ఇష్టమో ఏది సుఖకరమో అది చేయగలిగిన మనిషి.  ఇతరుల కోసం అసౌకర్యాలను జీవితంలోకి ఆహ్వానించదు. తన గురించి ఎవరూ ఆలోచించని కుటుంబంలో ఒంటరిగా తన భద్రతకు, తన బ్రతుకుకు తానే బాధ్యత వహించవలసి వచ్చిన పరిస్థితులలో రాటు తేలిన ఇందిరకు జీవితం విలువ తెలుసు. నిత్యోత్సవంగా జీవించటం తెలుసు. స్నేహం, ప్రేమ ఇయ్యగలదు. అవి అనవసరపు బరువై తన జీవిత గమనానికి ఆటంకం అనిపిస్తే వాటిని తెంచుకోనూ గలదు. కల్యాణితో స్నేహం చేసింది. తన ఇంట్లో వచ్చి వుండమంది. జ్వరం వస్తే సేవచేసింది . ప్రకాశం విషయంలో తనకు పోటీ అవుతున్నదని ఆ స్నేహాన్ని తెంచుకొంది. తనకోసం ధైర్యంగా నిలబడలేని మనిషని ప్రకాశం గురించి తెలిశాక అతనిపట్ల తన వ్యతిరేకతను వ్యక్తంచేసింది . తాను బలంగా నిలబడి ఇతరులకు బలం ఇవ్వాలనుకొనటం, ఏదైనా కళ్ళు తెరిచి అంటే పూర్తి స్పృహలో వుండి స్వంత బాధ్యత పైనే చేయటం, ఏం చేయటానికైనా సందేహించక పోవటం, బాధపడక పోవటం,ఏం జరిగినా ధైర్యంగా నిలబడటం -ఇవన్నీ జీవితాన్ని  ఒక ఆటగా భావించి ఆడే క్రీడాకారుల  లక్షణాలు. 

కృష్ణమూర్తి ఇందిర ఒక్కతే వున్నప్పుడు వాళ్ళింట్లో పడుకొనటానికి సందేహిస్తూ ఇరుగూ పొరుగువాళ్ళేమను కుంటారు ? అన్నప్పుడు ఇరుగు పొరుగువాళ్ళు అసలు ఎవరో  నాకు తెలీదు . వాళ్ళ జోలికి నేనెప్పుడూ పోలేదు . నా జోలికి వాళ్ళెప్పుడూ రాలేదు అంటుంది . ప్రపంచానికి తాను విషయం కాదలచుకొనక పోవటం, లోకంతో పనిలేకుండా తనకు యిష్టమైన పద్దతిలో తాను జీవించటం ఇందిర అలవాటు చేసుకొంది . లోకం కోసం  లేని దుః ఖాన్ని నటించలేనని తండ్రి జైలుకెళ్ళిన సందర్భంగా కృష్ణమూర్తికి తెలియజెప్పిన సందర్భం కూడా ఆమె అస్తిత్వ చైతన్యానికి గుర్తు. కృష్ణమూర్తితో పెళ్ళికి ఆమోదం తెలిపాక నాన్న ఏమనుకొంటాడో అన్న ఆలోచన వచ్చిం దామెకు. మరుక్షణం తనకు కావలసింది దొరికినప్పుడు దానిని అందుకొనటం నాన్నకో  మరొకరికో ఇష్టం వుంటుందో పుండదోనని సందేహించటం, అందుకొనక త్యాగం చేయటం బుద్ధిహీనం అన్న నిర్ణయానికి వస్తుంది. అలాగని ఆమె ఆత్మజ్ఞానం, స్వతంత్ర ప్రవృత్తి ఇతరులపట్ల బాధ్యతను విస్మరించినవి కావు. తన ఉద్యోగం, స్వతంత్రం తాను నిలుపుకొని నాన్నకు ఆసరాగా ఇకముందు వుండటానికి కూడా ఆమె సిద్ధంగానే వుంది.  

కల్యాణి ధైర్యంగా నిలబడాలి, నిలబడాలి అనుకొంటూ ఎప్పటికప్పుడు శక్తి కూడ దీసు కొంటూ నిలబడితే ఇందిర ధైర్యమే జీవితంగా జీవించింది. జీవితంలో ప్రతి మనిషికి సమస్యలుం టాయి, కానీ సమస్యలున్నాయని దిగులుపడుతూ కూర్చోటం కాదు చేయాల్సింది అని ఇందిర గట్టిగా నమ్ముతుంది. నవల చివరలో కృష్ణమూర్తితో ఆమె చెప్పిన మాటలు ఆమెలోని తాత్వికురాలి ని  చూపిస్తాయి. నిర్భయంగా బతకాలి. మానవత్వంతో బతకాలి. స్వార్ధం, రోషం, క్రౌర్యం, భయం  సర్వత్రా వ్యాపించి వున్నాయి. అందరిలో వున్నాయి కనుక వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకొని మసలాలి. జీవితంపై ఆశలు, స్వప్నాలు, అనురాగాలు , అభిమానాలు వుండటం మంచిదే కానీ అవే సర్వస్వం కాదు. అవసరం అయినప్పుడు నిర్మోహంతో వాటిని కోసేసుకోవాలి . ఆశాభంగాలను మరిచిపోవాలి. జీవితం అంటే జీవించటమే- అని అలా జీవించటానికి తాను సిద్ధపడి కృష్ణమూర్తిని సంసిద్ధం చేస్తుంది . 

చక్రవర్తి కూడా మనిషి వికాసానికి అవరోధంగా వున్న మూఢ ప్రేమలను,  మూర్ఖత్వాలను గురించి అనుభవంలో తెలుసుకొన్నాడు. తనకిక జీవితమే లేదన్న స్థితికి చేరుకొన్నాడు . అస్తిత్వ కొరకైన అన్వేషణలో ఆందోళనలో ఒక డాక్టరుగా వైద్య సేవలందించవలసిన వ్యక్తిగా తనను తాను గుర్తించుకొన్నాడు . సంతృప్తికరమైన వృత్తి జీవితాన్ని ఏర్పరచుకొన్నాడు . తనలోపాలతో తానేమిటో తెలిసిన వ్యక్తి చక్రవర్తి . దేనినీ కప్పి పుచ్చాలనుకొనకపోవటమే అతని స్వభావం . కల్యాణి కృష్ణమూర్తి సహాయాన్ని నిరాకరించి చదువు మానెయ్యటానికయినా సిద్ధపడిన విషయం గురించి ప్రసావిస్తూ ఒక వితంతువు ఆస్తి సహాయంతో  చదువుకుని, ఆ ఒక్క చదువుకోసం ఎన్నెన్నో పౌరుషాలు తాకట్టు పెట్టి   కాలం గడిపిన తాను కల్యాణి కంటే తాహతులో ఎంత మాత్రం పైస్థాయి వాడిని కాదని ఆమెతో చెప్ప టంలో అతనెంత ఆత్మజ్ఞాన స్థాయి అర్ధం అవుతుంది. ఆ ఆత్మజ్ఞానం కారణంగానే భార్యమీద అధికారం చేయటానికి పురుషుడిగా ఈ సమాజం నుండి తనకు లభించిన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకొనటానికి సిద్ధపడ్డాడు. 

చక్రవర్తిది అనుభవాలతో రాటుదేలిన జీవితం. కష్టాలలో ధైర్యంగా వుండటమేకాదు నిబ్బరాన్ని కలిగివుండటం, తాను చెయ్యవలసింది చేస్తూ ఫలితం ఏదైనా సరే స్వీకరించగలననే హామీని ప్రవర్తనలో భాగంగా సూచించగలగటం సరియైన జీవిత విధానం అని అతను అనుకొం టాడు. కల్యాణి పట్ల ఆకర్షణ కలగటానికి ఆమె ప్రవర్తనలో ఆ నిబ్బరాన్ని అతను చూడగలగటం వల్లనే.  దుఃఖాన్ని ప్రేమించే వాళ్ళంటే అతనికసహ్యం . కల్యాణి దుఃఖాన్ని ప్రేమిస్తున్నదేమోనన్న అనుమానం కలగగానే సినిమాకు పోదామా అని ఒక పరీక్ష పెట్టాడు ఆమెకు. ఆమె ఆ పరీక్షలో నెగ్గి అతనికి దగ్గరయింది . నీ దు: ఖాన్ని లోపల దాచుకొని నీ ఆనందాన్ని నల్గురికీ పంచి పెట్టాలి అనే చైనా సూక్తి అతనికి ఇష్టం అని చెప్తుంది రచయిత్రి.  అది చక్రవర్తి జీవిత దృక్పథాన్ని పట్టిచ్చేమాట. దేనికోసం బతకాలో తెలిస్తే ఎలా బతకాలో  నిర్ణయించు కోవచ్చునన్నది అతని అవగాహన. ఏదో ఒక విశ్వాసం, నమ్మకం లేకపోతే మనిషి బతకలేడు అని అతని అభిప్రాయం. దేనిమీద నమ్మకం పెట్టుకున్నా చివరికది చెదిరిపోవచ్చు దానివల్లే గాయపడవచ్చు. ఐనా గత్యంతరం లేదు – మరేదో నమ్మకాన్ని వెతుక్కొని దాని ఆసరాతో బతకవలసిందే- మనిషి జీవించటానికి మరో పద్ధతిలేదు అని డా. చక్రవర్తి అనుకొంటాడు. కల్యాణి గురించి ఆలోచిస్తూ జీవితం గురించి అతను అనుకొన్న మాటలివి. 

ఈ పద్ధతి అతను అనుభవం నుండి రూపొందించుకొన్నదే. తండ్రి డబ్బాశ, పెంపుడుతల్లి మూర్ఖత్వం,  ఐదేళ్ళు కాపురంచేసి మరణించిన భార్య బ్రతికినన్నాళ్ళూ తనపై చూపిన ద్వేషం అత నికి బ్రతుకు అంటే వెగటు కలిగేట్లు చేశాయి. అయినా ఆ జ్ఞాపకాలను పీడకలలుగా భావించి వైద్యు డుగా కొత్త జీవితం ప్రారంభించాడు. ఇతరత్రా ప్రలోభాలులేని స్నేహంకోసం అతని అన్వేషణ.  కల్యాణివల్ల అటువంటి స్నేహం దొరికింది. దానిని శాశ్వత బంధంగా చేసుకోవాలనుకొన్నప్పుడు భర్తగా తనకొక కొత్త హోదా ఇవ్వడం గురించి ఆమె భయపడింది . ఆ భయం హామీల వల్ల పోదు  అని అతనికి తెలుసు. కొన్నాళ్ళకు పోతుందనే ధైర్యం అతనికి వుంది. ఆ ధైర్యంతోనే ఆమెను పెళ్ళికి ఒప్పించాడు. కొన్నాళ్ళకు పోతుందంటే అది ప్రవర్తనలో తన నిజాయితీని బట్టి  తాను పంచే స్నేహగౌరవాలను బట్టి ఆమెకు ఆ భయం పోతుందని అతను అనుకొన్నాడన్నమాట. అంటే జీవితం  గురించి ఆలోచించటం, హామీ ఇవ్వటం పైన  గాక చక్రవర్తికి  జీవించటం పైనా , జీవితా చరణ పైననే పూర్తి నమ్మకం . 

జీవితం సుఖకరంగా సంతృప్తికరంగా లేదని తెలిసినా, జీవితాన్ని అంతకంటే ప్రకాశ వంతంగా మార్చుకొనే పద్ధతిని రూపొందించుకొనే సాహసం తెగువ లేక, ఉన్న స్థితితో రాజీపడ్డాడు ప్రకాశం. జీవితం గురించి మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకొనటం గురించి ఆలోచించినంతగా జీవించటానికి ఏమి చెయ్యాలో అర్థం చేసుకొనటానికి అతను చేసిన ప్రయత్నం ఏమీలేదు. జీవితం లో ఆశలూ, దుఃఖాలు నిరంతరం తనకు వెంటాడుతుండగా ఆలోచిస్తూ ఆందోళనపడుతూ తన బతుక్కు కావలసింది స్వేచ్ఛ స్వతంత్రాలు, ఏ ప్రలోభాలులేని స్నేహం అని అర్థం చేసుకొని వాటిని పొందటానికి తనదైన నిర్ణయం తీసుకొని దు:ఖభరితం, నిరాశజనకం అనుకొన్న జీవితాన్ని సంతో షంతో నింపుకొని నిలబడటానికి ప్రయత్నించింది కల్యాణి. జీవితం అంటే జీవించటం అని , కావాలనుకొన్నవి దొరకటం లేదని ఏడుస్తూ కూర్చోక అంది పుచ్చుకొనటానికి వీలయినవాటిని అంది పుచ్చుకునే క్రియాశీల సృజన స్వభావంతో నిర్మోహంగా జీవించటమే తన పద్ధతిగా చేసుకొన్నది ఇందిర.  జీవితాన్ని , మనుషులను ప్రేమించటం తప్ప మరొకటి  తెలియని కృష్ణమూర్తి జీవితం అంటే ఇలా జీవించాలన్న సూత్రం ఏదీ తనకై తాను విధించుకోకుండానే ఎప్పటికప్పుడు ఎదురయ్యే అనుభవాలకు స్పందిస్తూ జీవితం అంటే నిలబడటానికి నిలబెట్టటానికి మనుషులు చేసే నిరంతర ప్రయత్నమని కల్యాణి వసుంధరల స్నేహంలో గ్రహించినవాడు . తాను ఆ ప్రయ త్నంలో వుండి అలాంటి ప్రయత్నమే జీవిత విధానంగా చేసుకొన్న ఇందిరను అభిమానించ గలిగాడు. అభినందించగలిగాడు. జీవితమంటే ఆశ, ఆనందం,దు:ఖాన్ని కళగా భావించి వాస్తవంలో ఆశ ఆలంబనగా బ్రతకటం, ఆశయాల సాధనకు ఆచరణను పదునెక్కించుకొనటం జీవితవిధానంగా చేసుకొన్నాడు చక్రవర్తి

ఎవరి పరిధులలో వాళ్ళు పోరాడుతూ జీవించేవాళ్లదే భవిష్యత్తు. పోరాటం వదిలేసిన యువకులు పుట్టుకతో వృద్ధులు. తాతగారి నాన్న గారి భావాలకు వారసులైన వాళ్ళది గతకాలమే. జీవితాన్ని ఎట్లా నిర్మించుకోవాలో  ఆ వివేకాన్ని మేల్కొల్పే నవల కాలాతీత వ్యక్తులు. 

1963 లో వచ్చిన చదువుకున్న అమ్మాయిలు సినిమాకు మూలకథ కాలాతీత వ్యక్తులు నవల  అని చెబుతారు గానీ నవలకు సినిమాకు ఎక్కడా సంబంధం కనబడదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.