అనుసృజన

నిర్మల

(భాగం-11)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

[పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు బిడియపడసాగింది. సుధ ఒంటరిగా దొరికినప్పుడు మాటల్లో కృష్ణకి తన మరిది సంబంధం కుదిర్చింది సుధేనని నిర్మలకి తెలుస్తుంది.కట్నం తీసుకోకూడదని మామగారిని ఒప్పించింది కూడా తనేనని తెలిసి నిర్మల ,”ఎంత టక్కరి దానివి? నాకు తెలీకుండా ఇంత కథ నడిపావా?” అంటూ కోపం నటించింది. మనసులో సుధ మీద గౌరవం కొన్ని రెట్లు పెరిగింది.తన భర్తా, డాక్టర్ సిన్హా పక్క పక్కనే కూర్చునుండటం చూసిన నిర్మల మనసు ఒక్క క్షణం ఇద్దర్నీ పోల్చుకుని బాధ పడింది.ఒకరు ఆరోగ్యంగా యౌవనంతో మిసమిసలాడుతూ ఉంటే మరొకరు పైన ఆలోచించేందుకు ఆమెకి మనస్కరించలేదు.]

***

కృష్ణ పెళ్ళి అయాక సుధ వెళ్ళిపోయింది, కానీ నిర్మల పుట్టింట్లోనే ఉండిపోయింది. తోతారామ్ ఇక ఇంటికి వచ్చెయ్యమని ఎన్ని ఉత్తరాలు రాసినా ఆమె వెళ్ళలేదు.అక్కడ ఆమెని అంతగా ఆకర్షించేదేమీ లేకపోయింది. పుట్టింట్లో తల్లికి సాయం చేస్తూ, తమ్ముళ్ళతో గడపటమే సరదాగా ఉందామెకి. భర్త స్వయంగా వచ్చి తీసుకెళ్తే వెళ్ళేదేమో కాని ఆయన రాలేదు.చివరికి సుధ ఆమెకి ఉత్తరం రాసి , స్వయంగా వెంటబెట్టుకుని వెళ్ళేందుకు వచ్చింది.

సుధ నిలదీసేసరికి,” పెళ్ళైన మూడేళ్ళకి పుట్టింటి మొహం చూశాను. ఈసారి వెళ్తే మళ్ళీ రాగలనో లేక అక్కడే నా ఆయువు చెల్లిపోతుందో ఎవరికి తెలుసు సుధా? ఇక ఇక్కడికి నన్నెవరు రమ్మని పిలుస్తారు?”అంది నిర్మల.

అదేమిటీ,నీ పుట్టిల్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడే రావచ్చు.లాయర్ గారు నువ్వు లేకపోయేసరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా?”

అవునా? రాత్రిళ్ళు నిద్రపట్తటం లేదేమో లే!”

ఎంత రాతి గుండె నీది?ఆయన్ని చూస్తే బలే జాలేస్తోంది.ఇంట్లో తనని ఎవరూ పట్టించుకోవటం లేదనీ, మాట్లాడేవాళ్ళే కరువయారనీ అన్నారు.చాలా దుఃఖంలో ఉన్నారు నిర్మలా.”

ఏం దేవుడిచ్చిన ఇద్దరు కొడుకులున్నారుగా?”

వాళ్ళ మీద ఆయనకి ఎన్నో ఆశలుండేవి, కానీ జియారామ్ ఆయన చెప్పిన మాట వినకుండా ఎదురు జవాబులిస్తున్నాడు.చిన్నవాడు అన్న ఎంత చెపితే అంత.పాపం పెద్దవాణ్ణి తలుచుకుని ఏడుస్తూ ఉంటాడాయన.”

అదేమిటి,జియారామ్ చాలా నెమ్మదస్తుడే,నేను చెప్పిన మాట ఎన్నడూ కాదనలేదు.ఇలాంటి రౌడీ గుణాలు ఎక్కడ నేర్చుకున్నాడు?”

ఏమో నిర్మలా.లాయర్ గారే మన్సారామ్ కి విషమిచ్చి చంపారని అందరితోనూ అంటున్నాట్ట.మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నారని వాళ్ళ నాన్నని ఎత్తిపొడుస్తూ ఉంటాడట.వాడి మాటలకి ఆయన పాపం కన్నీళ్ళు పెట్టుకుంటాడు.ఒకరోజు ఆయన్ని రాయితో కొట్టేందుకు కూడా వచ్చాడని విన్నాను.”

అది విని నిర్మల బాధ పడింది.తను వెళ్తే మాత్రం లాభమేమిటి? తండ్రి మాటే వినకుండా మొండిగా తయారైన వాడు తన మాటేం వింటాడు? అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తన కూతుర్ని పెంచి పెద్ద చెయ్యాల్సి ఉంది.దీని ఖర్మ కొద్దీ నా కడుపున పుట్టింది. ధనవంటుడి ఇంట్లోనో పుట్టి ఉండకూడదూ? అనుకుంటూ పసిపిల్లని గుండెలకి అదుముకుంది నిర్మల

రాత్రి సుధ, నిర్మల పక్కపక్కన మంచాలమీద పడుకున్నారు.నిర్మలకి ఆలోచనలు తెగటం లేదు.నిద్ర పట్టటం లేదు.

మనకి ఏదైనా ఒక పెద్ద విపత్తు సంభవించినప్పుడు దానివల్ల మనం బాధ పడటమే కాకుండా , ఇతరులు మనమీద రువ్వే వాగ్బాణాలు కూడా తీవ్రంగా బాధపెడతాయి.ఎవర్ని విమర్శిద్దమా అని కాచుకు కూర్చునేవాళ్ళకి బలే మంచి అవకాశం దొరికినట్టవుతుంది.

మన్సారాం చనిపోవటం జనానికి ఇలాటి అవకాశాన్నే ఇచ్చింది.అందరూ సవిత్తల్లినే తప్పుపట్టారు.

కొందరుంటారు, వాళ్ళు నోటికొచ్చినట్టు విమర్శ చేసి ఊరుకోరు.హఠాత్తుగా జియారామ్ మీదా సియారామ్ మీదా కొందరికి అవ్యాజమైన ప్రేమ పుట్టుకొచ్చింది.వాళ్ళని చూసి జాలి పడటం మొదలెట్టారు.ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళైతే వాళ్ళ తల్లిని తల్చుకుని నాలుగు కన్నీళ్ళు కూడా కార్చారు,” అయ్యో పాపం ఆవిడకేం తెలుసు? తను పోగానే తన పిల్లలకి పాలు, పెరుగు కూడా దొరకనంత దుస్థితి పడుతుందని అనుకుని ఉంటుందా?”

నిర్మల చంటిపిల్లతో పుట్టింటికి వెళ్ళాక తోతారామ్ పాలు కొనటమ్ పూర్తిగా మానేశాడు.పిల్లలిద్దరూ గొడవ చేశారు.

మనం ప్రస్తుతం డబ్బుకి ఇబ్బంది పడుతున్నామని తెలీదా?” అన్నాడు తోతారామ్.

అసలు మనకి అలాటి పరిస్థితి ఎందుకొచ్చింది?” అన్నాడు జియారామ్.

వయసు పెరుగుతోందే కాని నీకు బొత్తిగా బుద్ధి లేకుండా పోతోందిరా. కోర్టు పని చెయ్యలేకపోతున్నాను.మనసు దానిమీద నిలవటం లేదు.అసలు నా ఉత్సాహమంతా మన్సా తోటే వెళ్ళిపోయింది!”

అది మీరు చేతులారా చేసుకున్నదే కదా?” అన్నాడు జియారామ్.

ఏమిట్రా వాగుతున్నావు? అది భగవంతుడి ఇచ్ఛ.ఎవరైనా తన గొంతు తనే నరుక్కుంటాడా?”

కానీ మీ పెళ్ళి భగవంతుడొచ్చి చేయించలేదు కదా?”

ఇక తోతారామ్ కోపం ఆపుకోలేకపోయాడు.ఆయన కళ్ళు చింతనిప్పులా చేసుకుని ,” ఇవాళ నాతో పెట్టుకుందామనే వచ్చినట్టున్నావు! ఏం చూసుకుని అలా ఎగిరిపడుతున్నావు? నీ మోచేతి కింది నీళ్ళేమీ నేను తాగటమ్ లేదే? అంతటి వాడివైనప్పుడు నాకు నీతి బోధలు చేద్దువుగాని.ఇప్పుడింకా నీకా హక్కు లేదు.కాస్త మంచీ మర్యాదా నేర్చుకో.ఇది నేను సంపాదించిన ఆస్తి.నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను.నువ్వెవడివిరా అడగటానికి? ఇంకోసారి నాతో ఇలా మాట్లాడావంటే ఊరుకునేది లేదు.మన్సారామ్ పోతేనే నా ప్రాణం పోలేదు.నీ మాటలకి చచ్చిపోతానని అనుకుంటున్నావేమో,అలాటిదేం జరగదు,అర్థమైందా?”అన్నాడు.

తండ్రి అంత మండిపడినా జియారామ్ అక్కణ్ణించి కదల్లేదు,పైగా,” అంటే మాకు ఎంత కష్టంగా ఉన్నా నోరిప్పకూడదా? నాకది సాధ్యం కాదు.అన్నయ్య మర్యాదగా అణిగి మణిగి ఉండి ఏం సాధించాడు?”అన్నాడు.

నాతో ఇలా మాట్లాడేందుకు నీకు సిగ్గుగా లేదా?”

పిల్లలు తమ పెద్దలనే అనుకరిస్తారు!”అన్నాడు జియారామ్.

***

నిర్మలకి సుధ వెంట రాక తప్పలేదు.ఇంట్లోకి రాగానే రుక్మిణి పనొమనిషితో,” చూశావే కోడలు పుట్టింటినుంచి ఎంత చక్కగా తయారయి వచ్చిందో!”అంది.

అవునమ్మా, ఎంతైనా తల్లి చేతి వంట రుచే వేరు కదమ్మగారూ,”అంది పనిమనిషి.

బాగా చెప్పావు, పిల్లల ఆకలి తల్లికి తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు.”

తన రావటం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని నిర్మల గ్రహించింది.భర్త పైకి ఎంత సంతోషం నటించినా ఆయన మనసులో  ఆందోళన పడుతున్నట్టు తెలిసిపోతూనే ఉంది.నిర్మల కూతురికి ఆశ అని సుధే పేరు పెట్టింది.పేరుకి తగ్గట్టు పిల్ల మొహం చూడగానే నిర్మలకి జీవితం మీద ఆశ పుట్టేది.అన్ని కష్టాలూ మరిచిపోయేది.తండ్రి దగ్గరకి వెళ్ళకుండా పసిది తల్లికే అతుక్కుని ,ఆయన ఎత్తుకోబోతే ఆరున్నొక్క రాగం అందుకునేది.తోతారామ్ కూతుర్ని మిఠాయిలతో మభ్యపెట్టి దగ్గరకి రప్పించుకోవాలనుకున్నాడు.సియారామ్ ని పిలిచి బజారుకెళ్ళి కాసిని మిఠాయిలు తెమ్మని పురమాయించాడు.

జియారామ్ అక్కడే ఉన్నాడు,” మా కోసం ఎప్పుడూ మిఠాయిలుఉ తెప్పించలేదే!”అన్నాడు వెటకారంగా.

మీరేమైనా పసిపిల్లలా?” అన్నాడు తోతారామ్ విసుగ్గా.

అయితే ముసలాళ్ళమా?మిఠాయిలు తెప్పిస్తే తెలుస్తుంది చిన్నపిల్లలమో, ముసలాళ్ళమో.ఇంకొంత డబ్బిచ్చి మాకు కూడా తెప్పించండి.”

ప్రస్తుతం నా దగ్గర ఇంతే ఉందిసియారామ్ వెళ్ళరా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేం?” అన్నాడు తోతారామ్.

వాడెక్కడికీ వెళ్ళడు.మీ నౌకరు కాదు వాడు.ఆశ మీకెంత కూతురో వీడూ మీకంతే.”

జియారామ్ తోఏమిట్రా తెగ వాగుతున్నావు? పసిపిల్లతో పోటీ పడటానికి సిగ్గెయ్యటం లేదా నీకు? ఒరే త్వరగా వెళ్ళి మిఠాయి కొనుక్కురా !”అన్నాడు సియారామ్ ని ఉద్దేశించి.

వెళ్ళకురా,నువ్వేం నౌకరువి కావు.”

సియారామ్ కి ఎవరి మాట వినాలో అర్థం కాలేదు. చివరికి అన్న మాటే వినాలని నిశ్చయించుకున్నాడు.తమ్డ్రి మహా అయితే కసురుతాడు,కానీ అన్న తంతాడని వాడి భయం.”నేను పోను,”అన్నాడు తండ్రితో.

ఓహో, మాట విననంత పెద్దవాడివైపోయావా? అయితే ఇంకెప్పుడూ నన్ను ఏమీ అడక్కు.” అన్నాడు తోతారామ్ కోపంగా. తనే వెళ్ళి మిఠాయి కొనుక్కొచ్చాడు.

సియారామ్ కి మిఠాయిల వాసనకి నోరూరింది కానీ అన్న కొడతాడని ఊరుకున్నాడు.

ఇంతలో పనిమనిషి రెండు పళ్ళేలలో మిఠాయిలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది.

వీటిని తీసుకుపో!”అన్నాడు జియారామ్ అలిగినట్టు కోపంగా.

ఎందుకు బాబూ అంత కోపం? మిఠాయి ఇష్టం లేదా?” అంది పనిమనిషి.

మిఠాయిలు ఆశ కోసం తెచ్చారు,మా కోసం కాదు.తెస్కెళ్ళిపో, లేకపోతే వీధిలో పారేస్తాను.పైసా పైసా కోసం మేం బతిమాలుతూ ఉంటే ఇక్కడ బోలెడంత డబ్బు పోసి మిఠాయిలు తెస్తున్నారు!” అన్నాడు జియారామ్.

నువ్వైనా తీసుకో బాబూ,ఈయనగారు చాలా కోపంలో ఉన్నట్టున్నారు,”అంది పనిమనిషి సియారామ్ తో.

సియారామ్ భయం భయంగా చెయ్యి జాపేంతలో,” ముట్టుకున్నావో చేయ్యి విరిగిందే ,దేబె మొహం వెధవా!” అంటూ అరిచాడు జియారామ్. అరుపుకి సియారామ్ భయపడిపోయాడు.

పనిమనిషి మిఠాయిలు వెనక్కి తేవటం చూసి నిర్మల ఇదేమిటని అడిగింది. విషయం తెలిసి ఆమె పిల్లలిద్దరి దగ్గరకీ వెళ్ళబోతూంటే తోతారామ్ ఆపాడు,నా మీదొట్టే అన్నాడు. జియారామ్ తనని నానా మాటలూ అనటం గురించి బాధపడుతూ చెప్పాడు.”వాడు నా కొడుకు కాదు,నా శత్రువు!”అన్నాడు.

జియారాం తలుపు వార నిలబడి వీళ్ళిద్దరి మాటలూ విన్నాడు.తండ్రి చివరిగా అన్న మాటలు విని ఇక ఉండబట్టలేక గదిలోకొచ్చి,” అవును మరి,మీ గురించి నాకంతా తెలుసు కాబట్టి నేను మీకు శత్రువులా కనిపిస్తాను.నా దగ్గర మీ పప్పులు ఉడకవు.అన్నయ్య పాపం అమాయకుడు.లోకమంతా కోడై కూస్తోంది అన్నయ్యకి ఈంట్లో వాళ్ళే విషమిచ్చి చంపారని.మరి నేనా మాటంటే మీకు తప్పుగా ఎందుకు తోస్తుంది?”అన్నాడు.

నిర్మల అవాక్కయి నిలబడిపోయింది.తన ఒంటిమీద ఎవరో కణకణలాడే నిప్పులు పోసినట్టు అనిపించింది.తోతారామ్ కోప్పడి జియారామ్ నోరు మూయించాలని ప్రయత్నించాడు.కానీ వాడు మాటకి మాట జవాబు చెపుతూనే ఉన్నాడు.దాంతో నిర్మలకి కూడా ఒళ్ళు మండింది. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు వీడేమిటి ఇలా రెచ్చిపోతునాడు!ఇంటి బాధ్యతంతా వీడే మోస్తున్నట్టు ఏమిటా పొగరు? ” ఇక ఆపు,నువ్వు ఎంత యోగ్యుడివో మాకు తెలిసిందిలే.బైటికి పోయి కూర్చో,” అంది కళ్ళెర్రజేసి.

అంతవరకూ సౌమ్యంగా మాట్లాడుతున్న తోతారామ్ కి నిర్మల మాటలతో ధైర్యం వచ్చినట్టయింది.నిర్మల ఆయన్ని వారించే లోపల పళ్ళు కొరుకుతూ విసురుగా లేచి జియారామ్ దవడ పగలగొట్టటానికి చెయ్యెతాడు. చెయ్యి కిందికి దిగేలోపల నిర్మల అడ్దం రావటంతో దెబ్బ ఆమె మొహం మీద పడింది.నిర్మల కళ్ళు బైర్లు కమ్మాయి. సన్నగా ఉండే ఆయన చేతుల్లో అంత బలం ఉంటుందని అనుకోలేదామె.రెండు చేతులతో తల పట్టుకుని చతికిలబడింది.అది చూసి ఆయన కోపం తారస్థాయికి చేరుకుంది. సారి పిడికిలి బిగించి కొడుకుని కొట్టబోయాడు.కానీ జియారామ్ ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక్క తోపు తోసి,” దూరంగా ఉండి మాట్లాడండి.ఎందుకు అనవసరంగా నన్ను ఉసికొల్పుతారు? అమ్మ ఎదురుగా మిమ్మల్ని అవమానించటమ్ భావ్యం కాదని ఊరుకుంటున్నాను.లేకపోతే నా తడాఖా చూపించేవాణ్ణే,” అన్నాడు.

మాట అనేసి జియారామ్ బైటికి నదిచాడు.తోతారామ్ మ్రాన్పడి చూస్తూ ఉండిపోయాడు. సమయంలో కొడుకు మీద పిడుగు పడితే ఆయన సంతోషించేవాడు.చిన్నప్పుడు వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని లోకాన్నే మర్చిపోయేవాడాయన.కానీ ఈరోజు వాడి గురించి ఇలాంటి చెడు ఆలోచనలొస్తున్నాయేమిటి!

***

రాత్రి నిర్మలా, పిల్లలూ భోంచెయ్యలేదు.తోతారాం  నాలుగు ముద్దలు తితిని లేచాడు.ప్రస్తుతం నిర్మలకి కొత్త సమస్య వచ్చి పడింది.జీవితం ఎలా గడుస్తుంది? ఒక్క తన కడుపు నిండటమే అయితే ఎలాగో సర్దుకునేది.ఇప్పుడు పసిపిల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో భగవంతుడా, అని రోజూ ఆందోళన పడుతూ ఉంటుంది.

మనసుకి స్థిమితం లేనప్పుడు నిద్రెలా పడుతుంది? మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ నిద్ర పడితే బావుణ్ణు అనుకుంటోంది.దీపం ఆర్పేసి కిటికీలూ, తలుపులూ తెరిచింది. టిక్ టిక్ అని చప్పుడు చేసే గడియారాన్ని కూడా ఇంకో గదిలోకి మార్చేసింది.అయినా నిద్ర రాదే!ఆలోచించవలసిన విషయాలూ, ఆందోళన పడవలసిన విషయాలూ అన్నీ అయిపోయాయి, అయినా కళ్ళు మూతపడలేదు.ఇక లాభం లేదని లేచి బెడ్ ల్యాంప్ వెలిగించి పుస్తకం తెరిచింది.మూడు నాలుగు పేజీలు చదివే సరికి కళ్ళు మూతలు పడసాగాయి.పుస్తకం తెరిచే ఉంది, నిర్మల నిద్రలోకి జారుకుంది.

హఠాత్తుగా జియారామ్ గదిలోకొచ్చాడు.వాడి కాళ్ళు వణుకుతున్నాయి.చుట్టూ చూశాడు.నిర్మల నిద్రపోతోంది.ఆమె తలవైపు గూట్లో ఒక చిన్న ఇత్తడి పెట్టె ఉంది.జియారామ్ చపుడు చెయ్యకుండా అక్కడికి వెళ్ళి , పెట్టె తీసుకుని వేగంగా గదిలోంచి బైట పడ్డాడు.సరిగ్గా సమయానికే నిర్మలకి మెలకువ వచ్చింది.ఉలిక్కి పడి లేచి తలుపు దగ్గరకెళ్ళి తొంగి చూసింది. వచ్చింది జియారామేనా? నా గదిలో అతనికేం పని? ఇది కల కాదు కదా? నాకేమైనా చెప్పాలని వచ్చాడా? ఉద్దేశంతో వచ్చాడు? ఆలోచిస్తున్న కొద్దీ నిర్మల మనసు భయంతో వణికిపోసాగింది.

తోతారామ్ డాబామీద పడుకున్నాడు.పిట్టగోడ లేకపోవటం వల్ల నిర్మల పైన పడుకోదు.

వెళ్ళి ఆయన్ని లేపాలని అనుకుంది కానీ జియారామ్ తన గదిలోకి వచ్చాడని చెపితే ,అసలే అనుమానం మనిషి,మళ్ళీ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఊరుకుంది. పడుకుని మళ్ళీ పుస్తకం చదువుకోసాగింది. విషయమేదో పొద్దున్న తేల్చుకుందాం లెమ్మని అనుకున్నా ఆమెకి మళ్ళీ నిద్ర పట్టలేదు.

పొద్దున్న నిర్మల స్వయంగా పలహారం తీసుకుని జియారామ్ కి ఇచ్చేందుకు అతని గదికి వెళ్ళింది.ఆమెని చూడగానే వాడు ఉలిక్కిపడ్డాడు.రోజూ పనిమనిషి కదా వస్తుంది,ఇవాళ ఈవిడగారు వచ్చిందేమిటి?అనుకున్నాడు.ఆమె వైపు చూసే ధైర్యం లేకపోయింది వాడికి.

నిర్మల వాడివైపు మామూలుగా చూస్తూ,”రాత్రి నువ్వు నా గదిలోకొచ్చావా?” అని అడిగింది.

నేనా? రాత్రిపూట నేనెందుకొస్తాను? ఏం,ఎవరైనా వచ్చారా?” అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ.

వాడి మాటల్ని పూర్తిగా నమ్మినట్టు,”అవును, ఎవరో నా గదిలోంచి బైటికెళ్తున్నట్టు అనిపించింది.మొహం కనిపించలేదు , కానీ వీపు చూస్తే నువ్వే ఏదో పనిమీద వచ్చావేమోనని అనుమానం వచ్చింది.అది ఎవరో ఎలా తెలుసుకోవటం? ఎవరో వచ్చారన్నది మాత్రం నిజం,” అంది నిర్మల.

జియారామ్ తను ఏమీ ఎరగనని అనేందుకా అన్నట్టు,” నేను రాత్రి సినిమాకెళ్ళాను.ఆ తరవాత ఒక స్నేహితుడింట్లో పడుకున్నాను.ఇంతకుముందే వచ్చాను.చాలామంది స్నేహితులం కలిసి వెళ్ళాం.కావాలంటే అడిగి చూడండి.ఇంట్లో ఏదైనా వస్తువు పోతే నామీదకొస్తుందని నాకు చాలా భయం.నాన్నగారు చావగొడతారు !” అన్నాడు.

“నీమీదకెందుకొస్తుంది? ఒకవేళ అది నువ్వే అయినా నువ్వు దొంగతనం చేసావని ఎవరూ అనలేరు కదా? దొంగతనం ఇంకొకరింట్లో చేస్తాం గాని మనింట్లో మనమే దొంగతనం చెయ్యంగా?”అంది నిర్మల.

నిర్మల ఇంకా తన నగల పెట్టె తను పెట్టినచోట లేదని గమనించనే లేదు.సుధని కలిసి చాలా కాలమైంది, ఒకసారి వెళ్ళిరావాలని అనిపించి, పనిమనిషిని తన గదిలో ఉన్న నగల పెట్టె తీసుకురమ్మని పంపింది.

ఆమె వచ్చి,” గదిలో ఎక్కడా నగల పెట్టె కనిపించలేదు.ఎక్కడ పెట్టారు?” అంది.

“నువ్వు ఏ పనీ సరిగ్గా చెయ్యలేవు.అక్కడే ఉంటుంది.అల్మైరా లో చూశావా ?” అంది విసుగ్గా.

“లేదమ్మా.”

నిర్మల నవ్వి,”సరే వెళ్ళి చూడు.త్వరగా రా,”అంది.

ఒక్క క్షణంలో వెనక్కి వచ్చి అక్కడా లేదని చెప్పింది పనిమనిషి.

“నీకు ఆ దేవుడు కళ్ళిచ్చింది ఎందుకు? శుద్ధ దండగ.చూడు ఆ గదిలోంచే నేనిప్పుడు ఆ పెట్టె ఎలా తెస్తానో!”అని నిర్మల లేచింది.పనిమనిషి కూడా ఆమె వెనకే వెళ్ళింది.

నిర్మల గదంతా గాలించింది.గూట్లో, అల్మైరా లో, మమ్చమ్ కిందా, ఆఖరికి తన బట్టల పెట్టెలో కూడా వెతికింది.పెట్టె ఎక్కడా లేదు.మరి ఆ నగలు ఏమైనట్టు అని అశ్చర్యపోయింది.

ఉన్నట్టుండి రాత్రి జరిగిన సంఘటన ఆమె కళ్ళలో మెరుపులా మెరిసింది.గుండె గొంతులోకొచ్చినట్తయింది.ఇంతవరకూ దొరుకుతుందిలే అనుకుని వెతుకుతోంది.ఇప్పుడు ఒళ్ళు వేడెక్కింది. ఆత్రుతగా గదంతా తలకిందులు చేసి మరీ వెతికింది.ఆ పెట్టె దుప్పటి కింద ఉండటం అసంభవం, అయినా దుప్పటి తీసి దులిపి చూసింది.ఆమె మొహంలో కత్తి వేటుకి రక్తపు చుక్క లేదు.గుండె దడ దడలాడింది.చివరికి నిరాశతో కూలబడి ఏడవసాగింది.

ఆడదానికి నగలే ఆస్తి.భర్త ఆస్తి మీద ఆమెకి ఎలాటి హక్కూ ఉండదు.నగలవల్లే ఆమెకి బలం గౌరవం దక్కుతాయి.నిర్మల దగ్గర ఐదారు వేలు ఖరీదు చేసే నగలున్నాయి.వాటిని పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆమె మనసులో ఉల్లాసం వెల్లివిరుస్తుంది.ఒక్కో నగా ఆమెని ఆపదనుంచి కాపాడే రక్షరేకులా అనిపిస్తుంది.క్రితం రాత్రే అనుకుంది, తోతారామ్ ఉండగానే తన జీవితం, తన కూతురి జీవితం ఒక ఒడ్డున పడాలనీ,జియారామ్ దయా దాక్షిణ్యాలమీద తను ఆధారపడకూడదనీ.ఇవాళ నాకు అలంకరణ గా ఉన్న ఈ నగలే రేపు నాకు ఆధరవు అవుతాయి.ఆ ఆలోచన ఆమె మనసుకి చెప్పలేనంత ఊరటనిచ్చేది.కానీ ఆ నగలే ఇప్పుడు చేజారిపోయాయి.ఇక తనకే ఆధారమూ లేదు.ఇక లోకంలో తనకెవరు ఆసరా? అనుకోగానే ఆమెకి కన్నీళ్ళు ఆగలేదు.భోరుమని ఏడ్చింది. ఒళ్ళంతా చెమట్లు పట్టాయి.ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి.మనసులో ఎగసిపడే జ్వాలలని ఆ కన్నీళ్ళు ఆర్పలేకపోయాయి.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.