యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-6

ఏంకరేజ్ నుండి ఆ ఉదయం బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అత్యంత హాయిగా ప్రయాణించి దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో చేరుకున్నాం. 

దెనాలి నేషనల్ పార్కు చూడకుండా అలాస్కాని చూసినట్టే కాదని ఎన్నో చోట్ల చదివేను. 

మొత్తానికి ఈ రోజు ఆ పార్కులో బస చెయ్యబోతున్నామన్న విషయం భలే ఆనందాన్నిచ్చింది. 

పట్టాల్ని అనుకుని ఉన్న పార్కింగు లాటులో మా విడిదికి మమ్మల్ని చేరవేసే బస్సు సిద్ధంగా ఉంది. 

కాని బస్సు మన ఎర్రబస్సులా  దారుణంగా ఉంది. అదే కాదు నేషనల్ పార్కులో ఎక్కడికి వెళ్లాలన్నా తిరిగే ప్రతి షటిల్ బస్సూ అలాగే ఉంది. పైగా కొండలు ఎక్కిదిగడమేమో ఎట్టి పడేస్తూ. అమెరికాలో ఇంతవరకూ అటువంటి అనుభవం కలగని మాకు ఈ బస్సుని చూస్తేనే నవ్వొచ్చింది.  

సరిగ్గా అరగంటలో అక్కణ్ణించి నేషనల్ పార్కులో మా రిసార్టుకి చేరుకున్నాం. 

దారంతా ఎక్కడా చెట్టూ చేమా లేని నునుపైన కొండలు ఎక్కుతూ దిగుతూ. 

నేషనల్ పార్కులో రిసార్టులన్నీ కొండమీదే ఉన్నాయి. 

అవి ఉన్న ఎత్తుని బట్టి ఖరీదు కూడా ఉన్నట్టున్నాయి. 

అన్నిటికన్నా పైనున్న రిసార్టులో మమ్మల్ని చివరగా దించేరు. 

చుట్టూ పైన్ వృక్షాలతో కొండ కొసన ఉన్న ఆ కాటేజీ నాకు భలే నచ్చింది. 

వెళ్తూనే రిసార్టు నేషనల్ పార్కులో పదిహేను నిమిషాల ప్రయాణపు దూరంలో ఉన్న మైనర్స్ ప్లాజాలోని హోమ్ ఆఫ్ కాబిన్ నైట్ డిన్నర్ థియేటర్ అనేచోట సాయంత్రం డిన్నర్ తో కలిపి ఉన్న ప్రదర్శనశాలకి టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళేం. 

అయిదు గంటలకి ప్రారంభమయ్యే ప్రదర్శన చివర్లో డిన్నర్ అదే హాల్లో వడ్డిస్తారు. పెద్ద పెద్ద చెక్క బల్లలకి అటూ ఇటూ ఉన్న పొడవాటి బల్ల మీద మాకు నిర్దేశించిన చోటులో కూర్చున్నాం. మాకెదురుగా ఒక  అమెరికన్ ఫామిలీ కూర్చున్నారు. 

పెద్ద స్వరాలతో సంగీత రూపకంగా సాగుతున్న ఆ ప్రదర్శన అలాస్కాకి తొలిరోజుల్లో వచ్చి సెటిల్ అయిన వ్యాపారుల జీవన విధానం గురించిన ప్రదర్శన. ఇది అలాస్కాలోని స్థానిక ఆటవికజాతుల గురించి అని ఊహించుకున్న నాకు ఈ ప్రదర్శన ఆశాభంగమైంది. 

ఇక ప్రదర్శన తర్వాత భోజనం దగ్గర పెట్టిన తినుబండారాలు మా అందర్నీ నిరుత్సాహపరిచాయి. మేం అస్సలు తినని పోర్క్ రిబ్స్, కాస్తో కూస్తో మా పెద్దమ్మాయి మాత్రమే తినే మేక్ & ఛీజ్, ఎవరూ ఇష్టపడని ఉడకబెట్టిన బంగాళా దుంపలు, నేను మాత్రమే తినగలిగిన ఆకులూ అలములతో ఆ డిన్నర్ పూర్తిగా డబ్బులు దండగ కార్యక్రమంగా మిగిలింది. 

ఇక దెనాలి నేషనల్ పార్క్ ను అని చూసే అలాస్కాను లాస్ట్ ఫ్రాంటియర్ అని పిలుస్తారా అనిపించింది. అమెరికాలోని అత్యంత సహజమైన నేషనల్ పార్క్స్ లలో  దెనాలి నేషనల్ పార్క్ ఒకటి. దెనాలి నేషనల్ పార్క్ ను మౌంట్ మెక్ కిన్లీ పార్క్ అని పిలిచేవారు. మౌంట్ మెక్ కిన్లీ ఉత్తర అమెరికాలోనే అతిపెద్దదైన పర్వతం. 

దెనాలి నేషనల్ పార్క్ చుట్టుప్రక్కల మనుషులు దాదాపు 11,000 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నారట. దెనాలి చుట్టూ అనేక త్రవ్వకాల సైట్లు 8,000 సంవత్సరాల నాటి నాగరికతకు సంకేతాలుగా ఉన్నాయి. 1906 ప్రాంతంలో ఛార్లెస్ అలెగ్జాండర్ షెల్టాన్ దెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో సౌందర్యాన్ని గుర్తించి దానిని ఒక జాతీయ ఉద్యానవనంగా మార్చాలని భావించాడు.

షెల్టన్ ఆలోచనకు స్థానిక అలాస్కాన్ల మద్దతును చేర్చుకునేంతవరకు అది సాధ్యం కాలేదు. 1916 ఏప్రిల్లో కాంగ్రెసులో ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది, చివరికి ఫిబ్రవరి 19 1917 న ఆమోదించబడింది. చాలా భాగం నిర్జన ప్రదేశంగా గుర్తించబడి, ఆరులక్షల ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ  పార్క్   కేవలం ఒక్క రోజులో చూడగలిగే పార్కు కాదు. 

అయితే మర్నాటికి నిర్దేశించబడిన మా టూరు దెనాలి నేషనల్ పార్క్ లో మౌంట్ మెక్ కిన్లీ వ్యూ పాయింట్ వరకు కవర్ చేసే ఒన్ డే టూరు. 

మర్నాడు ఉదయానే మేం దెనాలి నేషనల్ పార్కు సందర్శనకు వెళ్లాల్సి ఉండడంతో పెందరాళే నిద్రకుపక్రమించాం. బయటి వెలుతురు కళ్ళల్లోకి రాకుండా ఉండడం కోసం మూడు వరసల చిక్కని కర్టెన్లు ఉన్నా నిద్రపోవడం మళ్లీ మామూలుగానే ఇబ్బంది అయ్యింది. ఇక మర్నాడు చూడబోతున్న టూరు గురించిన సంతోషంతో సగం నిద్రే రాలేదు.  

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.