వాన

-సంధ్యారాణి ఎరబాటి

 

ముసురుపట్టిన వాన

 కురుస్తుఉంటే

గుండెల్లో ఎదో గుబులైతాది

గరం గరంగా తిందామంటూ

నోరేమో మొరబెడుతాది

దోమనర్తకీలు  వీధుల్లో 

భాగోతాలు మొదలెడతాయి

మ్యాన్ హోలులు

సొగసరిప్రియురాళ్లలా

నవ్వుతూ నోరంతా తెరుస్తాయి

గుంతలన్నీ నిండి

నిండుచూలాలవుతాయి

వీధులన్నీ గోదారిలా

వయ్యారాలు పోతాయి..

రోడ్డులన్ని పుటుక్కున

తెగిపోతాయి

దారులన్నీ కర్ఫ్యూ

పెడతాయి..

మురికి కాలువలన్నీ ఒక్కసారే

ఉరికి ఉరికి పారుతాయి

వీధి చివరి బజ్జీల బండి

తీరిక లేకుండా వెలుగుతుంది

మూలన ముదురుకున్న

ముసలమ్మ  మరికాస్త

ముడుచుకుంటుంది

ఆరుబయట  లాగుతో 

బాబిగాడు

నానుతూ కేరింతలు కొడతాడు

 గూళ్లని వదలని పిచ్చుకలు

చూరునీళ్లను  చూస్తుంటాయి

గువ్వల్లా మారిన  జంటలకు

వాన ఓ పరిమళపు సోన

భవనాలలో బడాబాబులు

మాత్రం వర్షం తో 

నిమిత్తం లేకుండా

సుఖాన్ని సీసాలతో

సేవిస్తూ ఉంటారు

జల్లెడలా జారే వానకి

పేదోళ్ళ గుడిసెలతో పాటు

వారి కళ్ళు కూడా 

 జలమయమౌతాయి.

నేలతడిలో వాన..

కవి కనులలో  కవితల

నెరజాణ….

వాన

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.