జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన వైవిధ్యం కోసం తపించి రాశారు. అటువంటి వాళ్ళలో యస్. జయ కూడా ఒకరు. ఎస్. జయ ’రెక్కలున్నపిల్ల’, ’నిజం’ ’అన్వేషణ’, ’అమ్మ మనసు’ ’అమ్మా నాన్న నన్ను చంపేయండి’, ’ఇంకానా.. ఇకపై చెల్లదు’, ’కన్నీళ్లు’, ’ఖరీదు’, ’నా రాత్రి నాకు కావాలి’, ’నిజం’, ’పగిలిన అద్దం’, ’బ్లాంక్ చెక్’, ’మా అమ్మాయి’, ’ప్లాస్టిక్ పువ్వులు’ మొదలగు కథలు రాశారు. ’రెక్కలున్నపిల్ల’ పేరుతో ఒక కథాసంపుటి కూడా వచ్చింది. ప్రగతిశీల భావాలుగల జయ వామపక్ష ఉద్యమాల్లో, స్త్రీల ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈమె సోషలిస్ట్ స్త్రీవాది. కథావస్తువు స్వయంగా తనఆలోచనల నుంచి ఆమె అనుభవం నుంచి వెలువడి నందున అత్యంత ఆచరణీయమైనవిగా నేలవిడిచి సాముచేయని శిల్పంతో ఈమె కథలు పాఠకుల్ని అతిసున్నితంగా స్పృశిస్తూ మార్పుకు అవకాశం కల్పిస్తాయి. 

ఎస్. జయ కథ “రెక్కలున్న పిల్ల” అటువంటి విభిన్నత ప్రదర్శించిన కథ, ఆకాశం లో స్వేచ్చగా ఎగిరే పక్షి రెక్కలను ఒక మెటఫర్ గా చాలా కీలకంగా తీసుకొని రాయటం అరుదు. అటువంటి అరుదయిన పనిని జయ ఈకథలో రూపించారు. అందరికి తెలిసిన సామాన్య విషయాన్ని మేధావులు సైతం అంగీకరించలేని విషయాలను అంగీకరించక తప్పనిస్థితి ఈమెటఫర్ సాధిస్తుంది. అందుకే  ఈకథలో రూప విశిష్టతతోపాటు వస్తువిశిష్టత కూడా వుండటం గమనించదగిన అంశం. స్త్రీలను కుదించే బుద్ధి కేవలం తల్లిదండ్రులకే కాక తనని ప్రేమించిన తన భావాలను అర్థం చేసుకున్న ప్రేమికులలో కూడా అచేతనంగా అటువంటి లక్షణం దాగి వుండటాన్ని ఈ కథ బహిర్గతం చేస్తుంది.

ఈ కథలో ఆశ చిన్నప్పటి నుండి చాలా స్వతంత్ర భావాలున్న వ్యక్తి, ఆ భావాలు ఆమె పెద్దయిన తరువాత కూడా కొనసాగుతాయి. ఈ స్వతంత్ర భావాల వలన ఆమె తల్లిదండ్రుల్ని వదలి తనకు ఆ భావాల్ని పరిచయం చేసి, తన చైతన్యస్థాయిని పెంచిన శ్యామలా టీచర్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆశపాత్రలో క్రమంగా పెరుగుతూ వచ్చిన చైతన్య స్థాయిని రచయిత చాలా నేర్పుతో ఒక క్రమంలో చిత్రించటం జరిగింది. శ్యామలా టీచర్ సాంగత్యంలో మామూలు పుస్తకాలతో మొదలైన ఆమె అధ్యయనం రంనాయకమ్మ జానకి విముక్తినుంచి విద్యార్థి ఉద్యమాన్ని గురించి రచించిన “రెక్కలిప్పిన రెవల్యూషన్” చదివేంతవరకు పెరుగుతుంది. ఈచైతన్యం ఏ Source నుంచి వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సారాంశంలో అది వ్యక్తి జీవితంలో అనవర్తితం చేసుకోవటానికి వుపయోగ పడగలగాలి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానానికి విలువ ఉంటుంది. ఈ కథలో ఆశ సరిగ్గా ఆ భావాల్ని తన జీవితంలో అమలయ్యేటట్లు చూసుకోగలుగుతుంది. వారు రూపొందించు కున్న వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని ఎవ్వరికోసమూ, తాను ప్రేమించిన వ్యక్తికోసం కూడా వదలుకోదు. తన రెక్కలు కత్తిరించటానికి, తన వ్యక్తిత్వాన్ని కుదించ టానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటుంది.

ఈ కథలో మురళి ఆశ వ్యక్తిత్వాన్నిచైతన్యంతో పురివిప్పిన ఆమె రెక్కల్ని చూసి ప్రేమిస్తాడు. ఆశతో అతని ప్రేమ గురించి తెలిసిన అతని స్నేహితుడు మురళి ఆశకు మొలిచిన చైతన్య రెక్కల గురించి హెచ్చరించినా, ఖాతరు చేయని సంస్కారం మురళిది. ఆశకు రెక్కలున్నాయని, చాలాసార్లు ఆ రెక్కల చప్పుడు విన్నానని స్నేహితుడు మురళిని హెచ్చరించినపుడు, మురళి అన్నమాటలు, అతని వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి.

“ఆమె వ్యక్తిత్వం చూసే స్నేహం చేశాను. ఆమె రెక్కల్ని ప్రేమించాను. కలిసి వుండాలను కుంటున్నాం” అంటాడు మురళి, అలాగే మురళి సంస్కారం వ్యక్తమయ్యే మరొక సన్నివేశం ఒక వ్యవస్థగా (institute) పెళ్ళిని వ్యతిరేకించటం. పెళ్ళంటే ఒక ఇంట్లో ఇద్దరిని బంధించి వుంచి, కాపురం చేయండి అని అందరూ ఆమోదించటంగా భావిస్తాడు మురళి. ప్రేమలేని ప్రపంచాన్ని మురళి ఊహించలేకపోతాడు. మురళి సంస్కారాన్ని గౌరవించే, అతని అభిప్రాయాలకు విలువనిచ్చే, తల్లిదండ్రులుకూడా మురళి ఆశను చేసుకోవటానికి నిరాకరిస్తారు. ఈ నిరాకరణకు కారణం కూడా ఆశకు రెక్కలుండటమే. అసలు ఆశకు రెక్కలుండటం అనేది ఆశకు సంబంధించిన వైయక్తిక అంశంకాక సామాజిక అంశంగా పరిణమించిన వైనాన్ని, మొత్తం సమాజం ఆమె రెక్కలు కత్తిరించటానికి చేసే ప్రయత్నాలను కూడా రచయిత చాలా శక్తివంతంగా చిత్రించారు.  చైతన్యంలోంచి పుట్టినపుడే  కదా నిజంగా జన్మించినట్టు” అని ఆశ అన్నపుడు ఆమెలో కొత్త అందాలు చూడగలిగిన భావుకత వున్న మురళి, చివరకు ఆమె రెక్కల్ని కత్తిరించాలని చూస్తాడు.

ఏ రెక్కలయితే అతనిని ఆమెవైపు ఆకర్షించేటట్లు చేయగలిగాయో ఆ రెక్కలే ఆమెతో కలిసి జీవిస్తున్నపుడు, అభ్యంతరకరంగా తోస్తాయి. ఆ విషయమే ఆమెతో ప్రస్తావిస్తాడు. ధృడమైన వ్యక్తిత్వం, అభ్యుదయంకరంగా ఆలోచించే మురళే ఆమె స్వేచ్చకు ఆటంకమవడం ఈకథలోని బలమైన పాయింట్. సోకాల్డ్ ప్రగతిశీలవాదులు, కుహనా మేధావులు తాము స్త్రీల స్వేఛ్చకు వ్యతిరేకులు కాదనే ప్రకటనల్లోని నిజాయితీ శాతం పట్ల గుమ్మడికాయల దొంగల్లా తడుముకుంటారు.

 “నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలనుఅని చాలా assertive గా అతనితో చెప్పటమే కాక, అతనితో ఒకరి స్వేచ్ఛ మరొకరికి అడ్డంకి కాకూడదుఅని, పరివర్తనకు కారణమవుతుంది. చాలా చిన్న కథలో లోతయిన విషయాన్ని చాలా Convincing గా చెప్పటంలో జయ విజయం సాధించారు. స్త్రీవాద కథలు శక్తివంతంగా వైవిధ్యంతో వస్తున్నాయి. కానీ సంఖ్యాపరంగా చాలా తక్కువగానే వున్నాయి.

”ప్లాస్టిక్ పువ్వులు” కథలో చిన్నపిల్లలు యాంత్రికంగా గడియారంలాగా బ్రతుకుతున్న తీరు నుంచి భూమిమీద సహజసిద్ధ పరిమళాలు విరజిమ్మే సహజాత పుష్పాలుగా మార్చడం ఇందులోని ఇతివృత్తం. పెద్దవాళ్ళలో ప్రవేశించిన యాంత్రిక జీవితం పిల్లల పెంపకంలో కూడా ప్రభావం చూపిస్తుంది. గడియారాన్ని ఒక ఆభరణంలాగా మెడలోవేసి గుదికట్టెలా వేలాడతీస్తారు. (పశువులు స్వేఛ్చగా పరిగెత్తకుండా గుంపులోనే వుండేట్లుగా పశువుల మెళ్ళో కడతారు.)  ప్రతిపనిని గంటల ప్రకారం జరిపించే పెద్దల ప్రవర్తనను గంటలతో సహజీవనం చేయడానికి, ప్రోత్సహించడాన్ని ఈకథ వ్యతిరేకిస్తుంది. ఈ కథలోని ప్రత్యేకత ఏమంటే ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఒక జ్ఞాపకాల పెట్టె. దాన్ని అప్పుడప్పుడు తెరిచి పెట్టి, మననం చేసుకుంటూ ఆ బాల్య స్మృతులల్లో బ్రతికే భవిష్యత్తు కు పునాది బాల్యం.  అలా గడియారపు గంటలలో బంధించబడుతున్న భావి తరాన్ని కాపాడుకోవటం లోని అనివార్యతను ఈకథ గుర్తుచేస్తుంది. 

“మా అమ్మాయి” కథలో జండర్ సామాజిక వివక్షతో ఎన్ని రకాలుగా విద్యార్థినుల జీవితం మలచబడుతుందో,వాళ్ళకు ఎదురైన అడ్డంకుల్ని ఎదుర్కోడానికి కుటుంబంలో తల్లులు నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తుచేసిన కథ. పుట్టుకతో జండర్ వ్యవస్థకు ఆవల పెరుగుతున్న కరుణ లాంటి అమ్మాయిలు ఎంత శక్తివంతంగా, అవలీలగా ఆ సవాళ్లను ఎదుర్కోగలరో రచయిత్రి ఈకథలో చిత్రించారు. సీమన్ దబోవార్ అన్నట్లుగా స్త్రీలు తయారు చేయబడతారన్న ప్రయోగాత్మక వాక్యం ఎంత వాస్తవమో ఈ కథ నిరూపిస్తుంది. ఆమె తల్లి కరుణకు ఎలాంటి అదుపాజ్ఞలు లేకుండా స్వేచ్ఛగా, సహజంగా ఎదగనిస్తుంది. తల్లిదండ్రులు “పిల్లల్ని పెంచడం ఏమిటి? వాళ్లే పెరగాలి” అని ధైర్యంగా తన ఉపాధ్యాయులకే పాఠం చెప్పగలిగిన మానసిక వికాసాన్ని రచయిత్రి ఆపాత్రకు అందించింది. సమాజంలో పిల్లలను తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి అనే అంశాన్ని అన్ని తరాలు, అన్ని సామాజిక వ్యవస్థలు అంగీకరించిన నగ్నసత్యం. స్త్రీ వాదులు మొట్టమొదటి అజెండాగా చర్చించిన అంశాలలో అమ్మాయిల పెంపకంలోని జండర్ వివక్ష ప్రధానమైంది. జెండర్ పాత్రను గుర్తించి అమ్మాయిలను బాల్యం నుండే స్త్రీలుగా తయారు చేస్తారు అనే అంశాన్ని చాలా రకాలుగా స్త్రీవాదులు పరిశీలించి, అనేక అధ్యయనాల ఫలితంగా ఆవిష్కరించిన సత్యాలను జయ ఈ కథలో చాలా నేర్పుగా పొందుపరిచారు. కుటుంబంలో వివక్షను చవిచూడని అమ్మాయిలకు సమాజంలో తక్షణమే వివక్ష ఎదురయ్యే ప్రదేశం విద్యాలయాలు. చదువు చెప్పే ఉపాధ్యాయులు ఆడపిల్లలకు సౌందర్య పరిరక్షణ, వస్త్రధారణ విషయాలలో విధించే ఆంక్షలు, సలహాలు పసి హృదయాలను బాధిస్తాయన్న ఆలోచన లేకుండా పితృస్వామిక పెట్టుబడిదారీ వ్యవస్థ భావజాలాన్ని తమకు తెలియకుండానే విస్తరించే బాధ్యతల్ని స్వీకరిస్తుంటారు. పైగా విద్యార్థినుల మంచి కోసమే ఆ సలహాలను ఇస్తున్నట్లు ప్రకటనలు కూడా చేస్తుంటారు. ఈ అంశాలన్నింటినీ సన్నటి నడుము కోసం పెట్టుకునే బెల్ట్, పొడవైన జుట్టు కోసం, జుట్టు రాలకుండా వుండటంకోసం తల్లుల పెంపకం విషయాలలో కల్పించుకోవడం, తల్లి పెంపకాన్నితప్పు పట్టడాన్ని కూతు రు దృష్టికోణం నుండి చర్చకు పెట్టడంలో రచయిత్రి చూపిన కథనకౌశలం అభినందనీయం. అలాగే పురుష అధ్యాపకులు చేసే అసభ్య వ్యాఖ్యానాలకు, ఎత్తుగడలకు కరుణ చాలా ధైర్యంగా జవాబిస్తుంది.

కరుణ పాత్ర పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన పాత్ర. ఈ పాత్రను తల్లి పాత్ర ద్వారా రచయిత ఎంత ఆత్మగౌరవంతో తీర్చిదిద్దారో, సమాజం అంత పొగరుబోతు పిల్లగా దర్శి స్తుంది. కారణం అమలులో ఉన్న పితృస్వామిక విలువల్లో నుంచి చూడటం తప్ప, కాలం చేస్తున్న మార్పును అంగీకరించే స్థితి వీరికి లేదు. అలా అంగీకరిస్తే తాము అనుభవిస్తున్న పెత్తందారీ సౌకర్యాలు అందకుండా పోతాయేమోననే ఆలోచన వారిది. స్త్రీల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలు పొగురుబోతుల్లాగానే చూడటం పితృస్వామిక సమాజానికి పరిపాటే. 

ఆత్మీయతలు, అనుబంధాలు వాటి విలువ తెలియని మనుషులు “బ్లాంక్ చెక్” లాంటివాళ్ళని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ “బ్లాంక్ చెక్.”

మెరిసేదంతా మేలిమి కాదంటారు. ఆదర్శాలు వల్లించేవారు చౌకబారుగా ప్రవర్తించటం, మొరటుగా అనాగరికులుగా అవహేళనలకు గురయ్యేవారు సున్నితమైన, మంచిమనసు గలవారిగా ఋజువవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరు ఎటువంటివారో ఎవరి నిజస్వరూపాలు ఏవిధంగా ఉంటాయో కొంతకాలం గమనించిన తర్వాతగాని ఒక నిర్ణయానికి రాకూడదు అనేది “నిజం” కథ సారాంశం.

ఒంటరిస్త్రీల విషయంలో తమ భావాలను, అభిప్రాయాలను వెలిబుచ్చడానికి, ఒకానొక దశలో రుద్దటానికి. వాళ్ళ ప్రవర్తనపై నిఘా వేయడానికి కూడా వెనుకాడరు. అలా ఆలోచించటం సరికాదని అనిపిస్తున్నా, ఒంటరి స్త్రీగా ఉండటం లోని అసౌకార్యాన్ని గమనించి, ఒక స్త్ర్రీగా అర్థం చేసుకోలేక పోతుంది. కారణం తాను ఇంటియజమానురాలిని అనే అహం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. స్త్రీల విషయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా వెంటాడుతుంది. ఉద్యోగం చేసే చోట, సొంత ఇంట్లోకానీ, అద్దెఇంట్లోకానీ, ఇక్కడ, అక్కడ అనే వ్యత్యాసం లేకుండా బంధువులు, స్నేహితులు, శత్రువులు, అనే భేదం లేకుండా అందరూ ఒంటరిస్త్రీలను అనుక్షణం గమనిస్తూ ఉంటారు. పితృస్వామిక వ్యవస్థ స్త్రీలపట్ల వేసే నిఘా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక హక్కుగా సమాజం హస్తగతం చేసుకుంటుంది. కుటుంబంలో, సమాజంలో పురుషులు, స్త్రీలు మూకుమ్మడిగా పోషించే పాత్ర చాలామంది ఉద్యోగం చేస్తున్న వంటరి స్త్రీల విషయంలో బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్యను ఎస్. జయ ’నిజం’ కథగా మలిచారు.

  స్త్రీవాద భావజాలంతో విశేష పరిచయమున్న జయ ఈ సమస్యను ’నిజం’ కథలో ఒక స్కెచ్ లాగా డిటాచ్డ్ గా రాశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని ఇంటి యజమానురాలు గుర్తించడాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. వేరేవాళ్ళ అనుభవంలోంచి  ఒక స్త్రీజీవితాన్ని నిఘాయించటం, ఒకవిధంగా స్కాన్ చేయటం ఎంతవరకు సబబైనది. అయితే తన స్నేహితురాలు వరలక్ష్మి చెప్పిన విధంగా నిర్మల విషయంలో జరగలేదు. ఒక ఇంటి యజమానురాలు తన ఇంట్లో అద్దెకు దిగిన అమ్మాయి నిర్మల ప్రవర్తనను ఆమె ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. కానీ ఆమెకు ఆదివారం రోజు పక్కింట్లోనుంచి మగగొంతు వినిపిస్తుంది. అది నిర్మల ఇంట్లోనే టేప్ రికార్డర్ నుంచి వస్తుందని గుర్తించడంతో ఆమె మనసు కుదుటపడుతుంది. 

కథ ముగింపులో మగగొంతు టేప్ రికార్డ్ లో నుంచి కాకుండా నిర్మల సహోద్యోగికానీ స్నేహితుడు కానీ అయివుంటే ఇంటి యజమానురాలు ప్రవర్తన ఎలా ఉండేదన్న ఆలోచన పాఠకులను కలవరపెడుతుంది. ఒక స్త్రీవాద రచయిత్రిగా సినిమాటిక్ గా సన్నివేశాన్ని ముగించడంలో రచయిత్రి చెప్పదలుచు కున్న అంశం ఏమిటి? పితృస్వామిక భావజాలం, నిరంతరం బాధిస్తూనే ఉంటుంది. నిజానిజాలు తేల్చుకోవడానికో, మరొకదుంకో ఇంటి యజమానులు నిర్మల లాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడుతుంటారు. వరలక్ష్మి చెప్పినట్లుగా నిర్మల లైంగికవృత్తిలో వున్న స్త్రీ లాంటిది  కాదనుకుంటుందే తప్ప, ఆమెను అకారణంగా అనుమానించానని బాధపడదు. చైతన్యవంతమైన పాఠకులకు అంతకు మించిన ముగింపు సాధ్యంకాదా అనే సందేహం కలుగుతుంది.  ’నిజం’కథ  చాలా పరిమిత మైనపరిధిలో కుందింపబడిన కథ. నిర్మల వ్యక్తిగత జీవితం లోనికి ప్రవేశించే హక్కు తనకు లేదని ఇంటి యజమానురాలు పశ్చాత్తాప పడినట్లయితే కథా ప్రయోజనం మరింత విస్తృతం అయ్యేది. ఒంటరి స్త్రీలు అద్దె ఇండ్ల యజమానుల నుంచి సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యే. సామాన్యజనం ఆలోచనల్లో మార్పు రావాల్సిన మంచి కథాంశమే. కానీ రచయిత్రి మంచి కథావస్తువును ఎన్నుకొని కూడా కథనాన్ని సంవిధానించడంలోని చిన్న (పశ్చాత్తాప) భావం  మిస్ అవటం వల్ల ఈకథ సాధించే ప్రయోజనాన్ని పాఠకులు కోల్పోవలసి వస్తుంది.

సమాజంలో అమ్మాయిల పెంపకం విషయంలో చూపించే వివక్ష కేవలం లింగ సంబంధమైనదే కాదు. అది సాంస్కృతిక నిర్మితి కూడా. ఈ నిర్మితిని విచ్ఛిన్నం చేయకుండా పితృస్వామిక భావజాలం నుండి స్త్రీల విముక్తి సాధ్యం కాదు. పురుషులు మాత్రమే స్త్రీలను తక్కువగా భావించేటట్లు చేయలేదు. స్త్రీలు కూడా తమని తాము నిరాకరించుకునే విధంగా, తక్కువ చేసుకునేవిధంగా చేయగలిగింది పితృస్వామ్యం. స్త్రీల శరీర అనుభవాల గురించి అమలులో ఉన్న అనేక భ్రమ(మిత్)లను చేదించడం కూడా స్త్రీవాద రచయిత్రిగా జయ తన కథల్లో చేయగలిగారు. సమాజంలో మనుషుల కామన్సెన్స్ లో భాగమైన అనేక అంశాలలో ఉన్న పితృస్వామిక సూక్ష్మ నిర్మాణాలను (micro structures) ధ్వంసంచేయకుండా స్త్రీలకు పురుషులతో పాటు ధీటైన గుర్తింపు, సమానత్వం రాదు. ఈక్రమంలో ఎస్, జయ కథలు పాఠకుల ఆలోచనలను స్త్రీ చైతన్యం వైపు త్వరితంగా అడుగులు వేయిస్తాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.