కలలు అలలు

-శాంతి ప్రబోధ

పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది.  

ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . 

బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , బూట్లు , సాక్స్ వేసింది. 

సాధారణంగా ప్రతి రోజూ  పాపాయి బయటికి వెళ్తుంది . అలా పార్కుకో, గ్రౌండ్స్ కో వెళ్లి అక్కడ కొంత సేపు గడపడం పాపాయికి చాలా ఇష్టం.  

ఆ పార్కుల్లో చెట్లు గాలికి తలలూపూతూ ఉంటే అవి తనని రమ్మని ఆహ్వానిస్తున్నాయని అనుకుంటుంది .  ఈలలు వేసే గాలిని చూసి  తనకోసం పాట పాడుతుందని సంతోషపడుతుంది .  అక్కడుండే సెలయేటి పక్షులు తన నేస్తాలని వాటితో కబుర్లాడుతుంది .  అందుకే అక్కడికి వెళ్లడం అంటే పాపాయికి చాలా చాలా ఇష్టం . 

వర్షం వచ్చినప్పుడూ, చలిగాలులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడూ  పాపాయిని షికారుకి తీసుకెళ్లరు . 

ఇంట్లోనే ఆమ్మ , అమ్మమ్మ కబుర్లు చెబుతారు. ఆటలు ఆడతారు . 

ఇరవై నాలుగుగంటలూ ఇంట్లో ఉండడం అంటే ఎవరికైనా విసుగే కదా .. పాపాయికి కూడా విసుగే . 

బయటికి తీసుకుపొమ్మని గడప దగ్గరకి వెళ్లి తలుపును లాగుతూ ఉంటుంది.  కానీ  తలుపేమో ఎంత లాగినా రాదు . 

అదేంటో .. అమ్మకి , అమ్మమ్మకి , నాన్నకి ఇట్లా పట్టుగానే అట్లా వచ్చేస్తుంది .  మరి తనకెందుకు రావడం లేదని అనుకుంటుంది పాపాయి .  ఆ తలుపు తీయడం వచ్చేస్తే ఎంచక్కా బయటికి వెళ్లి పోవచ్చు కదా .. అని ఆశపడుతుంది పాపాయి . 

పార్క్ కి వెళ్లదామని కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటుంది .   “మమ్మా.. పాక్ , డాడ..  పాక్ ,అమ్మా .. పాక్ పాక్ ” అని ఇంట్లో  ఉన్న పెద్దలను బతిమాలుతుంది. చెయ్యి పట్టుకుని తలుపు దగ్గరకు లాక్కొచ్చి బయటకు పోదాం పదమంటుంది. పాక్ అంటే పార్క్ అని మనం అర్ధం చేసుకోవాలి .    

 పార్క్ కి గానీ , షో గ్రౌండ్స్ కి కానీ తీసుకెళ్లడం లేదని దిగులుపడుతుంది.  తలుపుకు ఉన్న గ్లాస్లోంచో, కిటికీ లోంచో దిగాలుగా బయటికి చూస్తుంటుంది. 

గత వారం రోజులుగా బయట చల్లటి చలి గాలులు చాలా ఎక్కువగా వీస్తున్నాయి . వణుకు వచ్చేస్తున్నది .  ఒక్కోరోజేమో టపటపా అంటూ పెద్ద వర్షం వస్తున్నది.  రోడ్డుమీద వర్షపు నీళ్లు కాలువల్లాగా పోతున్నాయి . కిటికీలోంచి పాపాయి వాటిని చూస్తూ ఉంటుంది .  

ఆ నీళ్లలోంచి దారిచేసుకుంటూ కార్లు వెళుతుంటాయి . అప్పుడు నీళ్లు చప్పుడు చేసుకుంటూ ఇంత ఎత్తుకు లేసి మళ్ళి కిందపడి ఆ నీళ్లలో కలిసిపోతూ ఉండడం చూస్తుంటే పాపాయికి తమాషాగా ఉంటుంది .  వాటిని చూస్తూ చప్పట్లు కొడుతుంటుంది .  ఆ కారులాగే తాను కూడా బయటి నీళ్లలోకి వెళ్తే ఎంత బాగుంటుందని తలపోస్తుంటుంది. 

 ఆ చలిగాలుల్లో తిరిగితే జలుబు , జ్వరం వంటివి వస్తాయేమోనని పెద్దవాళ్ళేమో బయటికి తీసుకెళ్లడం లేదు . 

ఈ వేళ వర్షం లేదు. చలిగాలులు ఫరవాలేదు . మరీ అంతగా లేవు . పల్చని ఎండ వచ్చింది .  వాతావరణం బాగుంది. 

అమ్మ నాన్న పనిమీద అటుగా వెళ్తూ పాపాయిని , అమ్మమ్మని పార్క్ దగ్గర దింపారు . 

ఇంట్లో ఉంటే తెలియలేదు కానీ , కారు దిగగానే సన్నటి గాలి ఈడ్చి మొహం మీద కొట్టింది .  

పాపజుట్టు మొఖమంతా పరుచుకుంది . పాప కెవ్వుమంది .  నడవని మొండి కేసింది . అమ్మమ్మ ఎత్తుకుంటుందని ఆశపడింది .  కానీ అమ్మమ్మ ఎత్తుకోలేదు . అట్లాగే నిలబడింది . 

నిలువెత్తు పెరిగిన చెట్లపై నుండి  వినవచ్చే సంగీతం పాపను ఆకట్టుకుంది. 

పాప మళ్ళీ ఏడిస్తే వెనక్కి పిలుద్దామని పాప అమ్మా నాన్న కొద్దిసేపు కారు ఆపి అలా ఆగి చూస్తున్నారు . 

ఆ నీరెండలో చెట్లపైకి చూస్తూ, కదులుతున్న ఆ కొమ్మలపైనుండి వస్తున్నశబ్దాలు ఆలకిస్తూ  నెమ్మదిగా ముందుకు కదిలింది పాప . 

గాలి విసురుకి పడిపోతానేమోనని భయమేసింది పాపకి . గబుక్కున అమ్మమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది . 

గాలి మోసుకొచ్చిన కమ్మని వాసనలు ఎటునుంచో తెలియక చెట్లకేసి చూసింది . నీలాకాశంలోకి ఎగబాకిన పైన్ చెట్ల కొమ్మలు అటూ ఇటూ ఊగిపోతున్నాయ్ . తనని రమ్మని పిలుస్తున్నాయని అటు అడుగేసింది . అంతలో తెల్లటి పక్షులు కొన్ని వచ్చి ఆకుపచ్చటి చెట్టుకొమ్మలపై వాలాయి .  

చెట్టుకు తెల్లటి పువ్వులు పూసినట్లుగా అనిపించింది పాపాయికి. 

 కొద్దిసేపు తన గుండ్రటి పెద్ద కళ్ళను అటూ ఇటు తిప్పుతూ చుట్టూ చూసింది.  ప్రకృతిని  పరవశంతో చూస్తూ నెమ్మదిగా  జారుడుబల్ల ఉన్న వైపు అడుగులు వేస్తున్నది పాపాయి .  

మనవరాలి వెనకే  అమ్మమ్మ నెమ్మదిగా అడుగులువేసింది. 

జారుడుబల్ల ఎక్కుతున్న పిల్లవాడిని చూసింది . 

జారుడుబల్ల ఎక్కుతుంటేనే జాగ్రత్త పడిపోతావు హెచ్చరిస్తుంది అమ్మమ్మ . చిటారు కొమ్మలపై ఉన్న పక్షులు పడిపోకుండా ఎట్లా ఉన్నాయో అర్ధం కాలేదు పాపకి. 

అమ్మమ్మని అడుగుదామని పక్కకు తిరిగేసరికి  మళ్ళీ చల్లటి గాలి ఈడ్చి ఈడ్చి కొడుతోంది.  

అసలు విషయం మర్చిపోయి అమ్మమ్మ కొంగుని మొహానికి అడ్డంగా పెట్టుకుంది .

కానీ అది అసలే నచ్చలేదు . కొంగు వదిలేసింది . మళ్ళీ గాలి గిలిగింతలు పెట్టింది . 

ఇక్కడ ఇంత గాలి ఎందుకు వచ్చిందో .. పిచ్చి గాలి .  ఇంటి దగ్గర ఇట్లా గాలి లేదు . ఏయ్ .. గాలీ నువ్వు నా ఫ్రెండ్ కాదు అనుకుంది . 

అంతలో కిడ్స్  పార్క్ కి చేరుకున్నారు అమ్మమ్మ , ఒకటిన్నరేళ్ళ  మనవరాలు. 

అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప లేరు . చాలా ఖాళీగా ఉంది. మాములుగా అయితే శని ఆదివారాల్లో పిల్లలు, వాళ్ళవెనకే వచ్చిన పెద్దలతో షో గ్రౌండ్స్ లోని పార్క్ కళకళ లాడుతూ ఉంటుంది .   

ఏప్రిల్ నెల చివరికొచ్చేసింది . వేసవి పోయి చలి మొదలవుతున్నది అనుకుంటూ పంజాబీ బామ్మ వచ్చిందేమోనని చుట్టూ పరికించింది అమ్మమ్మ . 

బామ్మ , ఆమె మనుమడు ఎక్కడ కనిపించలేదు. 

జారుడు బల్ల జారుదామని చెక్కమెట్లు ఎక్కింది పాప .  చేతులు చల్లదనానికి జివ్వుమన్నాయి.  అయినా జారుదామని పైదాకా వెళ్లి కూర్చుంది. చల్లదనం శరీరంలోకి ప్రవహిస్తుండడంతో ఆ ప్రయత్నం మానుకుంది. జారమని అమ్మమ్మ చెప్తున్నా వినకుండా దిగేసింది . 

అమ్మమ్మవైపు చూస్తూ ఈ అమ్మమ్మ మారిపోయింది .  అమ్మమ్మకి భయం పోయినట్టుంది . ఏది ఎక్కుతానన్నా అమ్మో .. పడిపోతావ్ వద్దు అని వెనక్కి లాగేది . 

ఇప్పుడేంటో ఎక్కమని చెబుతున్నదే .. అమ్మమ్మను విచిత్రంగా చూసింది పాపాయి. 

 బోలెడన్ని సన్నటి పిలక జడలు వేసుకున్న పాప వచ్చింది . ఉయ్యాలపై కూర్చుంది . ఆ పాప జుట్టు రింగులు రింగులు తిరిగి ఉంది .  ఆ జుట్టును దువ్వి బోలెడన్ని పిలకలు వేసుకుంది . వాటికీ రంగు రంగుల్లో ఉన్న  చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకుంది.  ఆ అమ్మాయినే కొంచెం సేపు చూసింది పాపాయి . 

ఆ జడలు భలే ఉన్నాయే అనుకుంది .  

తన జుట్టులో చెయ్యి పెట్టింది . గాలికి కదిలిపోతున్న జుట్టుని సుతారంగా సవరించుకుంది .  అన్ని జడలేసుకోవాలంటే .. అమ్మో .. వద్దులే .. అమ్మ దువ్వెనతో దువ్వుతుంటే ఏడుపొస్తుంది . నాకు నచ్చదు . అన్ని జడలేసుకోవాలంటే బోలెడంత సేపు దువ్విచ్చుకోవాలి . ఊహూ .. నాకొద్దు ఆ జడలు అనుకుంది . 

జారుడు బల్ల దగ్గర నుండి ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది .  జడలమ్మాయి పక్కనున్న ఉయ్యాలలో అమ్మమ్మ ఎక్కించబోయింది .  నో .. అని ఇవతలికి వచ్చేసింది .  

ఈ పిల్ల వేలెడంత లేదు కానీ తనకేది కావాలో , ఏది వద్దో ఎంత స్పష్టంగా చెబుతుంది అని మానవరాలికేసి అబ్బురంగా చూసింది అమ్మమ్మ . 

అంతలో పాపాయి వయసున్న బాబు పరుగుపరుగున వస్తూ జారిపడ్డాడు .  కాస్త దూరంగా ఉన్న వాళ్ళమ్మ  కమాన్ గెటప్ ..అంటూ నవ్వేసింది . ఆ బాబు కూడా నవ్వేస్తూ మళ్ళీ పరుగు మొదలుపెట్టాడు . 

అది అమ్మమ్మ చూసింది .  వీళ్ళ పద్ధతేంటో .. చంటివాడు పడిపోతే కనీసం ఎత్తుకోకుండా ఆ తల్లి అనుకుంది .  మళ్ళీ వెంటనే తను చూసిన సంఘటనలు కళ్ళముందు మెదిలాయి .  

ఆటలు ఆడేటప్పుడు పిల్లలు పడితే అయ్యో అనడం ఇక్కడ ఎవర్నీ చూడలేదు .  కమాన్ గెటప్అనో , చీరప్ అనో..అంటూ నవ్వేస్తారు.  పడినా మళ్ళీ మళ్ళీ పిల్లల్ని జారుడుబల్ల ఎక్కడానికి , ఉయ్యాల ఊగడానికి అన్నిటికీ ప్రోత్సహిస్తారు . ఆ పిల్లల్లో ధైర్యం నింపుతారు .  భయపెట్టరు అనుకున్నది అమ్మమ్మ.  

పాపాయి తనకేసి నవ్వుతూ వస్తున్న వాళ్ళని చూస్తున్నది . ఇదివరకు ఒకసారి వాళ్ళు తనని ముద్దు చేసిన విషయం గుర్తొచ్చింది ఆమెకు . 

అంతలో ఇంకో ఇద్దరు పిల్లలు పరిగెత్తుకొచ్చారు . వాళ్ళ అమ్మానాన్న వెనకాల నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు .  ఆ పిల్లలు పాపాయి కంటే చాలా పెద్దవాళ్ళు . అయినా వాళ్ళతో కొద్దిసేపు దాగుడుమూతలు ఆడింది . 

వాళ్ళు స్మాల్ బేబీ అంటూ పాపాయిని ముద్దు చేశారు.  

కొద్దిగా ఆవలగా ఉన్న సెలయేరు పాపాయికి అత్యంత ఇష్టమయిన ప్రదేశం .  అక్కడికి వెళ్లాలని ఆ చిట్టి మనసు ఆరాటపడుతున్నది.  ఆటలయ్యాక అక్కడ కాసేపు కూర్చోబెడుతుంది అమ్మమ్మ .  

ఆ నీటిలో తేలియాడుతున్న నీలి , బూడిద రంగులతో ఉన్న పక్షులజంట పాపాయిని రమ్మని పిలుస్తున్నట్లు తోచింది . 

రెండుచేతులూ వెనకవైపు  కలిపి పట్టుకుని వచ్చిన పిల్లల్ని , వస్తున్న వాళ్ళని చూస్తూ అటూ ఇటూ కాసేపు తిరిగింది .  

ఆ తిరగడంలో ఉన్న ఆలోచనని అమ్మమ్మ పసిగట్టింది . వద్దని అమ్మమ్మ కళ్ళతో వారించింది . 

వాటర్ స్పోర్ట్స్ వైపు చూసింది . వాటర్ ఫౌంటైన్స్ లోంచి జల్లులు పడుతున్నాయి .  ఆ జల్లుల్లో తడుస్తూ ఆడుకొంటున్నారు కొందరు పిల్లలు. 

అక్కడికి అమ్మమ్మని చేయిపట్టుకుని లాక్కు పోయింది .  నీటి తుంపరలు మీద పడ్డాయి . ఆవి పడగానే ఒక్కసారి జలదరించింది .  మళ్ళీ పడుతుంటే బాగా అనిపించింది .  కానీ తర్వాత వచ్చిన గాలికి చలిగా ఉంది. ఇక  అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయింది . 

ఏమి చేస్తున్నా . చూస్తున్నా చెట్లపైనుండి పక్షుల అరుపులు, సెలయేటిలో ఉన్న నీటి పక్షుల చప్పుళ్ళు  ఆమెను ఆకర్షిస్తూన్నాయి  .. మనసు ఆటే లాగేస్తున్నది.  అడుగులు ఆటే పడుతున్నవి . 

అమ్మమ్మ చెయ్యి పట్టుకుని అటు లాక్కెళ్ళింది . ఆ పార్కులో పారే స్ట్రీమ్ కేసి దారి తీస్తున్న పాపని అటకాయిస్తూ ఇక్కడ ఆడుకోకుండా అటెక్కడికే అంటున్న అమ్మమ్మను పట్టించుకోకుండా ఆ సెలయేటికి పక్కనున్న సిమెంట్ బెంచి పై కూర్చుంది . అమ్మమ్మ  చేతిలో ఉన్న చిన్న బాక్స్ తీసుకోబోయింది. ఎక్కడ కిందపడేస్తుందోనని అమ్మమ్మ చెయ్యి వెనక్కి లాక్కుంది . 

 అందులోంచి అమ్మమ్మే డ్రై ఫ్రూట్ లడ్డు తీసి ఇచ్చింది .  అది కొద్దికొద్దిగా కొరుక్కుంటూ వాటిని దా దా .. అనీ కం .. కం .. అనీ సెలయేటి ఒడ్డున ఆహరం వెతుక్కుంటున్న కొంగని పిలిచింది . వాటికి తాను తినే లడ్డు పెట్టాలనుకుంది .  

మనం తిన్నవన్నీ పక్షులు తినవు . అవి తింటే వాటికి బొజ్జలో ఆయి అవుతుంది.  మనవరాలి మనసు అర్ధం చేసుకున్న అమ్మమ్మ చెప్పింది. 

ఆ డ్రై ఫ్రూట్ లడ్డు తింటూ నీళ్లలో ఈదుతున్న బాతులు , హంసలను ఇంకా రకరకాల పక్షులను చూస్తూ కూర్చుంది. అవి కదిలినప్పుడల్లా వాటిచుట్టూ వలయాలుగా ఏర్పడుతున్న నీటి కదలికల్ని , ఆ నీటిఅలలపై పడుతున్న సన్నటి ఎండ పోడని , ఎండపొడకి బంగారు రంగులో మెరిసే నీటిని చూస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది పాపాయికి . 

వాటిని అట్లా చూస్తుంటే పాపాయికి కూడా నీళ్ళలోకి వెళ్లి ఈదాలని కోరిక పుట్టింది.   నీటిలో నునులేత కిరణాలు పడి మెరిసే మెరుపుల్ని దోసిట బంధించాలనిపించింది. 

ఆ పక్షులు నీళ్లలో అటూ ఇటూ కదులుతూ ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే అవి తనతోనే మాట్లాడుతున్నాయని అనుకుంది.  

పక్షులు తనతో మాట్లాడుతున్నాయనుకుని తానూ వాటితో తన భాషలో మాట్లాడడం మొదలు పెట్టింది పాప . 

పాపాయి హావభావాలు ఎన్నిసార్లు చూసినా అమ్మమ్మకి  ఆశ్చర్యమే… ఎప్పటికప్పుడు కొత్తగానే .. అద్భుతంగానే అనిపిస్తున్నాయి . 

అంతలో అలా ఎగురుతూ వచ్చి నీటిని తాకి మళ్ళీ పైకి ఎగిరిపోతున్న గోరింకల జంట పాపని విపరీతంగా ఆకర్షించింది . ఆ పిట్టలు అలా ఆకాశంలోంచి ఒకసారి ఎగిసి, చెట్టు కొమ్మల సందుల్లోంచి ఒకసారి కిలకిలా నవ్వుతూ వచ్చి నీటిని తాకుతూ వెళ్తుంటే తనకీ అట్లా చేయాలనిపించింది . వాటివైపు తదేకంగా చూస్తూ ఉన్నది . లేచి నుంచుని తానూ ఎగరబోయింది.  వీలుకాలేదు . 

తనలో తాను ఏవేవో శబ్దాలు చేస్తూ మాట్లాడుతున్నది . 

నీళ్లలో ఈదుతున్న రంగు రంగుల చేపలు , తాబేళ్లను అబ్బురంగా చూసింది.  

నీళ్లు అలలు అలలుగా కదులుతూ ఉంటే వింతగా ఉంది .. ఆ నీటిపై కదలాడుతున్న గట్టుమీది మొక్కల నీడలూ, స్వచ్ఛమైన  నీటిలోపలనుండి కనిపించే గులకరాళ్లు..  ఒకటేమిటి అక్కడున్న ప్రతిదీ పాపాయిని ఆకర్షించాయి . నింగి , నేల , నీళ్లు .. పిట్టలు , చెట్లు కొమ్మలు , గాలీ అన్నీ తనకోసమే అనుకుంది . వాటిని  మనసుకు హత్తుకుంది, ప్రేమించింది పాపాయి . 

అప్పటివరకూ సెలయేటిలో ఒంటికాలిపై నుంచున్న కొంగ పక్కనుండి రెండు తెల్లటి కొంగలు నడుచుకుంటూ ఒడ్డుపైకి వచ్చాయి,  పాపాయి కూర్చున్న సిమెంట్ బెంచి సమీపంలోకి వచ్చాయి .  వాటి ముక్కును చూసి బెదిరిపోయి అమ్మమ్మని అతుక్కుపోయింది  పాపాయి .  అవి తమను దాటి కొద్దిగా ముందుకు పోగానే వాటితో మాట్లాడడం మొదలు పెట్టింది . రెండు చేతులు ఊపుతూ , కళ్ళు తిప్పుతూ తన భాషలో లొడలొడా మాట్లాడేస్తున్నది . 

అట్లా మాట్లాడుతున్న పాపాయిని చూసి అమ్మమ్మ మైమరపుతో చూస్తున్నది. ఇంటిదగ్గర ఎప్పుడూ పాపాయి ఇట్లా కనపడదు . ఆమెలో ఉరకెలేస్తున్న ఉత్సాహం..  రెక్కలు తొడుగుతున్న ఊహలు .. ఊసులు ..  ఎన్నెన్ని కలలు కంటున్నావే చిట్టితల్లీ .. అనుకుంటూ నిండా రెండేళ్లు లేని ఈ చిట్టిపాపాయికి ప్రకృతి అంటే ఉన్న ప్రేమకు అమ్మమ్మ మురిసిపోయింది . 

తలపై ఉన్న చెట్టుపై చేరిన పంచరంగుల చిలుకలు నేలమీదకి , చెట్టుమీదకు చక్కర్లు కొడుతున్నాయి . వాటి కబుర్లు వింటున్న పాపాయి తాను వాటితో ముచ్చట మొదలుపెట్టింది . 

కలలు కంటున్న పాపాయి మొహంలోని మెరుపులు చూస్తున్నది  అమ్మమ్మ.

అలా చూస్తుంటే కల్లలైపోయిన తన కలలు మదిపొరల్లోంచి అకస్మాత్తుగా బయటికి తొంగి చూశాయి.  ఒక నిట్టూర్పు విడిచింది . 

చిన్నప్పుడు తనకి కూడా ఆకాశంలో పక్షిలా విహరించాలని ఉండేది . ఎదుగుతున్న కొద్దీ అది బలపడింది . 

పక్షిని కాలేను కాబట్టి అటువంటిఅవకాశం ఉన్న ఉద్యోగం చేయాలనీ కలలుకనేది.  ఎయిర్ హోస్టెస్ గా వెళ్లాలని అందుకు సంబంధించిన సమాచారమంతా సేకరించుకుంది . డిగ్రీ పరీక్షలు పూర్తి అయ్యాక ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేయాలని నిర్ణయించుకుంది . 

అంతలో జబ్బుపడిన నాయనమ్మ  మనవరాలు పెళ్లి చూడాలని పట్టు పట్టింది .  తనకు చెప్పకుండానే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లోవాళ్ళు. 

పరీక్షలు పూర్తికాకుండానే అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు , తెలిసిన మంచి సంబంధం అంటూ పెళ్ళికి సిద్ధం చేశారు . 

తన పెళ్లయిపోయింది  కానీ నాయనమ్మ మాత్రం  ఆ తర్వాత పదిహేనేళ్లపైనే శుభ్రంగా రాయిలా బతికింది. కానీ తన కలే చెదిరిపోయింది .  గూడు చెదిరిన పక్షిలా జీవిస్తున్నదిప్పుడు.  

అప్రయత్నంగా వచ్చిన నిట్టూర్పు .. 

లోలోపల సంచరించే గతాన్ని విసిరి ఆవల పారెయ్యాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది ఆమె . ఇప్పుడూ ఆ ప్రయత్నంలో ఉంటూనే పాపాయిని గమనిస్తున్నది. 

ఎంత వద్దనుకున్నా గతం తాలూకు ముళ్ళు అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉన్నాయి అమ్మమ్మలో . 

తన అభిప్రాయాల్ని గట్టిగా చెప్పలేని బేలతనం వల్లనో, తన కోరికలు , ఆశలు వెల్లడించేంత చనువు తండ్రి దగ్గర లేకపోవడం వల్లనో, ఎంత చదివినా చివరికి పెళ్లి పిల్లలు ఆడదానికి తప్పవు కదా .. మంచి సంబంధం పట్నంలో సుఖపడతావు అని తల్లి అనునయంగా చెప్పడం వల్లనో , మొదటి మనవరాలినని ఎంతో గారాభం చేసిన నాయనమ్మంటే ఉన్న ప్రేమవల్లనో .. లేక అన్ని కారణాలు కలగలిసి తనని రాజీపడేలా చేయడం వల్లనో గానీ చూపించిన అబ్బాయితో మూడుముళ్ళూ వేయించుకుని ఏడడుగులు నడిచింది . అతని చిటికెన వేలు పట్టుకొని అతనింటికి వెళ్ళిపోయింది. 

ఆ పెళ్ళితోనే , ఆ వెళ్లడంతోనే నా ఆశలు , కలలు అన్నీ అటకెక్కేశాయి.  తర్వాత తర్వాత ఆ కలల్నే మరచిపోయింది. 

వాస్తవంలో ఉంటూ ఉన్నంతలో బతుకును దిద్దుకోవాలని తపన పడింది . 

పెళ్లయిన ఏడాదిలోపే కొడుకు , ఆ తర్వాత మరో ఏడాదికి కూతురు పుట్టడంతో వాళ్లే లోకంగా బతికింది.  పిల్లలు బడిలో చేరే సమయానికి తాను టీచర్ గా మారాలనుకుంది . అలా అయితే, పిల్లలు బడిలో తన కళ్లెదురే ఉంటారని ఒకే ఒక్క కారణంతో వాళ్లతో పాటే తాను ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేరింది.  

చక్కని సంసారం .. చల్లని సంతానం అని అందరూ అంటుంటే నాకింతకన్నా ఏమి కావాలని పులకించిపోయింది.  సంతృప్తిపడిపోయింది. 

అంతలో ఆక్సిడెంట్ లో దూరమయిన భర్త . సంసార బాధ్యత పూర్తిగా తనపైనే పడింది .  అలా పిల్లలకోసం అని చేరిన ఉద్యోగం జీవనాధారం అయింది . భర్త కి వచ్చిన ఎల్ ఐ సీ , ప్రావిడెంట్ ఫండ్ సొమ్మంతా బ్యాంకు లో ఫిక్స్ చేసింది పిల్లల చదువుల కోసం .  అలా ఒంటి చేత్తో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది . ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాక పెళ్లిళ్లు చేసింది.  రెక్కలొచ్చిన పక్షులు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు . 

దేశాలు దాటారు. ఆపలేదు.  నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు . కాదనలేదు . వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడిపోయారు. 

తల్లిగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిందన్న తృప్తిగా ఉన్న  సమయం అది.. ఇక తనకోసం తను.. తనకు నచ్చినట్టు తాను బతకాలని అనుకుంటున్న తరుణంలో 

ఇన్నాళ్లూ ఉద్యోగం చేశావు. చాలా కష్టపడ్డావు .  ఇంక చాల్లే అమ్మా ఎన్నాళ్లని కష్టపడతావు ..మేము రెండు చేతులా సంపాదిస్తున్నాం . ఇక నువ్వు సంపాదించి ఎవరికి పెట్టాలిట .. ఆ ఉద్యోగం ఇక మానేసేయ్ అని ఒకరంటే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకో అని మరొకరు .. మా దగ్గరకి వచ్చెయ్ ..  ఫోనుల మీద ఫోన్ లు .. ఇద్దరూ ఒకటే ఒత్తిడి .  

పిల్లలు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు వేగవంతమైన జీవితంలో అమ్మ అవసరం వాళ్ళకి చాలా కనిపించింది .

ఎప్పటిలాగే తన ఆలోచనలని , ఆశల్ని వెనక్కి తోసేసి వాళ్ళకోసం ఉద్యోగం మానేసింది.  పిల్లలకోసం ఆమాత్రం చేయలేకపోతే ఎట్లా అనుకుంది. అదంతా వాళ్లపై ప్రేమతోనే కదా .. నాకు మాత్రం ఎవరున్నారు .. వాళ్లే కదా .. అని మనసుని సరిపుచ్చుకుని వాళ్ళకోసం, వాళ్ళపిల్లలకోసం ఆరునెలలు అమెరికా , ఆరునెలలు ఆస్ట్రేలియా తిరుగుతున్నప్పుడు అర్ధమయింది అసలు విషయం. 

చిన్న తనంలో ఏం కలలు కన్నదో తెలియదు కానీ పెరిగిన తర్వాత కన్న కలలేవి నెరవేర్చుకోలేకపోయింది. 

గుడుగుడుగుంచం గుళ్లో దీపం అన్నట్టు  కుటుంబం , పిల్లలు , ఉద్యోగం బాధ్యతలచుట్టూ గిరగిరా తిరిగింది.  ఇప్పుడేమో పిల్లల పిల్లల బాధ్యతల బరువు కూడా నెత్తిమీద చేరుతున్నట్టుగా ఉన్నది పరిస్థితి .   

మార్పు చేర్పు లేకుండా ఇన్నాళ్ల జీవితం గడిచిపోయింది . ఇక అట్లా ఉండకూడదు .  

ఎక్కడుంటే అక్కడ మనవలతో గడపడం ఆనందమే .. ఎంజాయ్ చేస్తున్నది కూడా .. పిల్లలు తమతో పాటు తామున్న దేశంలో తిప్పుతూనే ఉన్నారు . వారితో జీవితంలో ఊహించని ప్రాంతాలు , ప్రదేశాలు చూసింది . కానీ అంతకు మించి తనకేదో కావాలనిపిస్తోంది .  పిల్లల సంతానంతో గడుపుతూ తనకి ఆనందం కలిగించే పనులు కూడా చేసుకోవాలి స్థిరంగా అనుకున్నదామె.  

మిగిలిన జీవితాన్ని అర్ధవంతంగా ఆనందంగా ఆహ్లాదంగా గడపడం కోసం ఏమి చెయ్యాలి, తనని తాను ఎలా మలుచుకోవాలి .. ఏం చేస్తే నేను మరింత సంతోషంగా ఉంటాను .. ఏం చేస్తే నాలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది .. అవధులు లేని ఆనందాన్ని ఎలా పొందగలను .. కొద్ది క్షణాల్లోనే ఎన్నో ఆలోచనలు .. కొత్త ద్వారాలను తెరుస్తూ ..  అందుకు తగిన ప్రణాళికలు మనసులో రూపొందుకుంటున్నాయి… తనకు తానే ఆశ్చర్యపోతూనే ఆలోచిస్తున్నది అమ్మమ్మ  

ఆస్ట్రేలియాలో ఉన్న ఈ సమయంలో కారు డ్రైవ్ చేయడమన్నా నేర్చుకోవాలి .  ఈ మాట చెబితే కూతురు ఆశ్చర్యంగా చూస్తుందా .. అల్లుడు ఏమనుకుంటాడో.. 

కొండల్లోకి లోయలోకి కూడా ఎంతో ఒడుపుగా కారు నడిపే కూతుర్ని చూస్తే ఒకింత గర్వంగా ఉంటుంది. తాను చేయలేని పనులు కూతురు, కోడలు అలవోకగా చేసేస్తున్నారు . ఇదొక్కటేమిటి చాలా చేస్తున్నారు.  తన  ఆలోచన చెబితే కాదనరనే నమ్మకం ఉంది. 

కారు స్టీరింగ్ తన చేతిలో ఉంటే.. రయ్ రయ్ మంటూ వెళ్లిపోతుందా..

కుటుంబపు స్టీరింగ్ చేతబట్టి బాధ్యతలు నిర్వహించలేదూ ..ఇదీ అంతే ..  

ఆమె ముందునుంచీ సాగిపోతున్న కాలేజీ పిల్లల బాగ్ పైనున్న పారాచూట్ బొమ్మ అమ్మమ్మని ఆకర్షించింది . 

దాన్నలా చూస్తూ తాను అలా పారాచూట్ లో ఎగరగలదా ..అనుకుంది .  

సౌత్ సిడ్నీలోని వొలొంగాంగ్  వెళ్ళినప్పుడు బాల్డ్ హిల్ మీదనుండి పారా గ్లైడింగ్ చేస్తున్న బామ్మని చూసిన దృశ్యం కళ్ళముందు కదలాడింది . మొహంపై సన్నని చిరునవ్వు .. పెదాలు విరిసీ విరియనట్లుగా .. 

 ఆ బామ్మ పసిఫిక్ సముద్రం పైన అలా అలా ఆకాశంలో పక్షిలాగే విహరిస్తుంటే కళ్లింతవి చేసుకుని చూసింది .  ఆ బామ్మ స్థానంలో తనని ఊహించుకుని చిన్నగా నవ్వుకుంది .   కొత్త కొత్త ఊహలలో విహరిస్తుండగా ఓ చిరుగాలి హత్తుకుంది.   

చెదిరిన కలల అలల స్థానంలో ఎగిసిపడుతున్న  రేపటి కలల్లో విహరిస్తున్న అమ్మమ్మని చల్లటి చిరుగాలి తిమ్మెర మెత్తగా స్పృశించింది .  ఆ వెంటనే వేగంగా  వచ్చిన గాలి తిమ్మెర ఈడ్చి కొట్టింది . పరిగెత్తుకొచ్చిన మనవరాలు అమ్మమ్మ చీర కుచ్చెళ్ళలో తలపెట్టింది . 

అదిగో అప్పుడు  ఈ లోకంలోకి వచ్చేసింది అమ్మమ్మ.   

ఆకాశాన ఎర్రెర్రని వర్ణాలతో సాయం సంధ్య. కొద్దిక్షణాల్లో ఎంతమారిపోయింది వాతావరణం  అనుకుంటూ చేతికున్న ఫిట్ బిట్ వాచ్ చూసుకుంది. నాలిగింటికే పడమటి వైపు వాలిపోయిన సూర్యుడు .  

ముచ్చటైన మొహంపై పడిన సంధ్యాకిరణాల కాంతిలో కొత్త నేస్తాల ఊసులతో ఊహల్లో విహరిస్తున్న బుజ్జిపాపాయికి ఎన్ని కలలో ..  

అలలు అలలుగా ఎగిసిపడే కలల్ని చిట్టితల్లి కళ్ళలో  చూస్తున్నది అమ్మమ్మ. 

వచ్చి రాని ముద్దు మాటల పాపాయి అమ్మమ్మ చెయ్యిపట్టుకొని ఇక లే వెళదాం అన్నట్టుగా చూసింది . 

కిచకిచ, క్రీక్ క్రీక్, ఖ్వాక్ ఖ్వాక్ అంటూ పక్షుల భాషలో అమ్మమ్మ చెయ్యి వత్తిపట్టుకుని పలకుతున్నది. 

మరో చల్లటి గాలి తెర రావడంతో అమ్మమ్మ చీరకొంగు లాగి  మొహానికి అడ్డంగా పెట్టుకుని అమ్మమ్మ మొహంలోకి చూస్తూ చిలిపిగా నవ్వింది పాపాయి.  

గాలి తనను దాటిపోగానే అమ్మమ్మ చెంగు పక్కకు తొలగించుకుంటూ ఇంటికి పోతున్న పిల్లల్ని చూస్తున్న పాపాయికి  దూరంగా పార్కింగ్ చేస్తున్న  నీలిరంగు  కారు కనిపించింది . వెంటనే తమ కారుని గుర్తుపట్టేసి వావ్ .. వావ్ .. అంటూ చప్పట్లు కొట్టింది. 

సెలయేట్లో ఉన్న బాతులకు , చెట్టుపై చేరిన కొంగలు , చిలుకలు , గోరింకలు ఇంకా రకరకాల పక్షులకు బై బై .. సి యూ .. అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మూతిని మురిపెంగా సున్నాలా చుట్టింది .  ఆ నోటిపై కుడిచేతి వేళ్ళుంచి మ్మ్..  ముమ్మ … అంటూ చేతిని పైకిలేపుతూ వరుసగా ముద్దులు గాలిలోకి విసిరింది.  మళ్ళీ రేపొస్తాను అని మాట ఇస్తూ వీడ్కోలు తీసుకుంది పాప. 

పక్షులు చేసే సవ్వడి వింటూ అవి తనకు బై చెబుతున్నాయని సంతోషపడింది . అలా వాటి సవ్వడిని మదిలో నింపుకుంటూ అమ్మమ్మ చెయ్యి పట్టుకుని కారువేపు చూపిస్తూ మమ్మా .. డాడా .. అంటూ కార్ పార్కింగ్ వైపుకి లాక్కెళ్ళింది చిట్టి పాపాయి. 

అనుసరిస్తూ అమ్మమ్మ. 

****

Please follow and like us:

One thought on “కలలు అలలు (కథ)”

 1. చిన్న పాపాయి ఆలోచనల అలలతో కథ మొదలై చివరికి అమ్మమ్మ కలల తో ముగించారు..బావుంది..ఏప్రిల్ నెలలో చలికాలం ఏమిటా అని అనుకునే లోపు..వారుండేది విదేశంలో అని ఇంకొంచెం కథ ముందుకు జరిగాక తెలిసింది.
  ఒక రెండు చిన్న సవరణలు చెప్పడానికి సాహసిస్తాను
  1. ప్రైవేట్ ఫీల్డ్ లో ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ లో vrs ఉండదు డ్రాప్ అవడమే ఉంటుంది
  2. రెండు విభిన్న అంశాలను ఒకే కథలో ఇమడ్చకుండా…రెండు కథలు రాయవచ్చు.
  ఇప్పుడు చిన్ని పాప మనసులో ఆలోచనలు..అనుభూతులు..ఎలా ఉంటాయో చక్కగా వర్ణిస్తూ..హఠాత్తుగా..అమ్మమ్మ ఫ్లాష్ బాక్ స్టోరీ కి వెళ్లారు..పూర్తి రొటీన్ కథ ఇది..కొన్ని వందల సార్లు చదివిన విన్న ప్లాట్..ఇది add చేయడం వలన..మామూలు కథే అన్న ఫీల్ వస్తుంది పాఠకుడికి..
  అలా కాకుండా..చిన్న పాప..అనుభూతులు..అలాగే కొనసాగిస్తూ..ఆ పాప పెద్ద అయినాక తన బాల్య స్మృతుల్ని మరొక్కసారి మననం చేసుకున్నట్లు ఉంటే బావుండేదేమో..
  ఒక సూచన మాత్రమే.
  మన్నించగలరు

Leave a Reply

Your email address will not be published.