నైజం

-గిరి ప్రసాద్ చెల మల్లు

అమ్మున్నంత కాలం 
ఎగబడ్డాయి పక్షులు 
అమ్మ పోయింది 
పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి 
 
అమ్మ వున్నప్పుడు 
ఎంగిలిచేతిని విదిలించని 
ఇళ్ళపై వాలుతున్న పక్షులు 
విదిలిస్తారని ఆశతో 
ఈసడించిన చేతులవైపు 
 
అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతం
ముక్కున కర్సుకుపోయిన  పక్షులు 
మరోవైపు 
 
అమ్మ చేతి వంట 
తిన్న పక్షులు 
మర్చి మరబొమ్మల్లా
తారాడుతున్నాయి 
 
బెల్లమున్నప్పుడే ఈగలు
అమ్మ చెబుతుండేదెప్పుడూ 
కాని అమ్మే గుర్తెరగలేదనేది 
నేడు కన్పిస్తుంది కళ్ళముందు 
 
గూటిపక్షులు
వలస పక్షులు 
అన్నీ అవే కోవలో
ఇసుమంతైనా తేడా లేదు సుమీ !
 
ముసిముసినవ్వుల వెనుక 
దాగిన మర్మం విషం 
గడపలో ఓ కుక్క విశ్వాసంగా 
అప్పుడూ ఇప్పుడూ 

****

Please follow and like us:

One thought on “నైజం (కవిత)”

Leave a Reply

Your email address will not be published.