ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5

 పాపినేని శివశంకర్

-డా.సిహెచ్.సుశీల

సగం తెరిచిన తలుపు::
సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.
 
 ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.
 
      నిజానికి, స్త్రీ మీద అత్యాచారం చేసినప్పుడు ‘పవిత్రత’ కోల్పోతున్నది స్త్రీ మాత్రమేనా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ కథ. ‘ఒక స్త్రీకి మానభంగం జరిగితే…. నో. మానభంగం అనే మాట సరైంది కాదు. మనిషికి అభిమానమే కానీ ‘మానం’ ఎక్కడ ఉంది?ఒకవేళ ఉంటే అది స్త్రీ తో పాటు పురుషుడికి ఎందుకు లేదు?’ ఈ ప్రశ్నలు నరేంద్ర మాటల్లోవి కావు. పాపినేని విశ్లేషణాత్మకమైన వ్యాఖ్యల్లోనివి.  గుడ్డిగా స్త్రీని దోషిగా నిలబెట్టి, ఆ దోషం లో భాగం పంచుకున్న పురుషుని నిర్దోషిగా నిలబెట్టే అన్యాయాన్ని నడివీధిలో నిలబెట్టి ప్రశ్నించాడు.
 
       ఏతా వాతా ‘శీలం’ అంటే ఏమిటి – అని అడుగుతూ, భర్తను తప్ప పరపురుషుని మనసా కర్మణా కోరుకోకుండా పవిత్రంగా ఉండటమే శీలమా!  కథ పేరు ‘సుశీల’. కథలో నాయిక పేరు ‘సుశీల’. చెడిపోయిన అమ్మాయి పేరు సుశీల ఎలా అవుతుంది! అయితే సుశీల చెడిపోయిందా, చెడగొట్ట బడిందా! దానికి నరేంద్ర చెప్పే సమాధానం లాంటి ప్రశ్న – “తన ప్రమేయం లేకుండా తన మీద జరిగిన దాడికి ఆమెను ఎందుకు తప్పు పట్టాలి?  అందువల్ల సుశీల చెడిపోయిందన్న మాట నేనొప్పుకోను”.
 
      కథా సంవిధానంలో సుశీల చెప్పే భావాలు విప్లవాత్మకమైనవి. తనను గూర్చి లోకానికి అంతా తెలుసు. మరి చేసుకునే వాడికి తెలియకుండా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. తెలిసిన తర్వాత అతని మనోభావాల ప్రకంపనలు భవిష్యత్ పై ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ ఇప్పుడు లేకపోయినా తర్వాత తెలిస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయి. అందుకే ఆ సత్యాన్ని సత్యంగానే  చెప్పి ఆత్మతృప్తి పొందవచ్చు. ఆత్మవంచనకు, పరవంచనకు దూరంగా ఉండవచ్చు. అబద్ధం చెప్పి సంతోషాన్ని కనుక్కోలేం. ఆమె పై జాలి చూపించడం ఆమె సహించలేదు. అందుకే ఆమె అంటుంది ” బాధను సహించ గలను, కానీ జాలినే సహించలేను'”.  ఇదీ ఆమె ఆత్మాభిమానం. ఆమె తన పెళ్లి విషయంలో దృఢమైన అభిప్రాయాలు కలిగి ఉంది.
 
     “…. ముక్కు మొహం తెలియకుండా భావాలు కలవకుండా ఎవరినైనా ఎందుకు పెళ్ళాడాలి..?” నరేంద్ర విశాల దృక్పథం,  వాక్చమత్కారం ఆమెకు నచ్చాయి. ఈ కథ చెబుతున్నది నరేంద్ర బావగారే. నళిని భర్తే. సుధాకర్ రావుకు స్నేహితుడే. కానీ ఎక్కడా పేరు ఊసుకైనా చెప్పకపోవడం కథాకథనంలో ఒక పోకడ. కథ అంతా ఉత్తమ పురుషలో నడుస్తుంది. ఏవైనా తాత్విక సిద్ధాంతాలు ఉన్నప్పుడు, తార్కిక చర్చల్లో న్యాయవాది అయినప్పుడు – నరేంద్ర బావగారి స్థానంలో పాపినేని శివశంకర్ ప్రాణం పోసుకుంటాడు.
 
      సుశీల కురూపి కాదు. ఆమె సుధాకరరావు మాటల్లో ‘బంగారు బొమ్మ. తెలివైన పిల్ల. దశరధ రామయ్య గారి పెద్ద కూతురు. ఆమె వేసిన ల్యాండ్ స్కేప్ పెయింటింగ్ నెపంతో మరికొన్ని ఆధునిక చిత్ర కళారీతులని పరిచయం చేయడం జరిగింది. ఏం.ఏ. డిస్టన్స్ కోర్స్ చదువులో ఆంగ్ల భాషాధ్యయనం’. నరేంద్ర బావ గారు ఆమెను గూర్చి క్రోడీకరించిన వ్యక్తిత్వ చిత్రం అసాధారణమైనది. మేక్ బెత్ నాటకం లోని ‘మంత్రకత్తెలతో” నాటకం ఎందుకు షేక్స్పియర్ ప్రారంభించాడు అన్న ప్రశ్నకు ఆమె సూక్ష్మబుద్ధి చెప్పిన సిద్ధి పొందిన జవాబును ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
 
        సుశీలకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే వాటిని శాశ్వత సత్యాలుగా భావించకుండా సాపేక్షంగానే ప్రతిపాదిస్తుంది.
 
“అభిప్రాయ కాఠిన్యం వల్ల మనిషి చాలా కోల్పోతాడు”. ” తన అభిప్రాయాల చట్రంలోనే కాస్త అటు ఇటు కదలగల వెసులుబాటు ఉన్నప్పుడు సంతోషంగా జీవించగలడు. పక్కవాళ్ళని సంతోష పెట్టగలడు”… అలా అంటూనే సుశీల వెళ్ళిపోయింది పెయింటింగ్ తీసుకొని. ఒక చల్లని పరిమళం వెళ్లిపోయినట్లు అనిపించింది. అందమూ, తెలివితేటలతో పాటు సుశీల అభిరుచులు అభినందించగల స్థాయిలో ఉన్నాయి. అందుకే నరేంద్ర బావగారు అంటారు  “సుశీల నా పక్కనే కూర్చుంది. ఆమె మొహంలో ముఖ్యంగా కళ్ళల్లో ఏదో అసాధారణ ప్రజ్ఞ దాగి ఉన్నట్లు అనిపించింది”.
 
       కానీ సంఘం అంటూ ఒకటి ఉన్నది. దానికి అందమూ కావాలి. తెలివితేటలూ కావాలి. శీలమూ కావాలి – అంటూ నరేంద్ర బావగారు అంతర్మథనంలో పడ్డారు. నరేంద్ర నిదానంగా, ఆలోచన తర్వాత అన్న మాటలు “సుశీలను ఇష్టపడక పోవటానికి బలమైన కారణం ఉందా అని నా ఆలోచన”. అందుకే సుశీల వైపే మొగ్గాడు . నరేంద్ర తర్కంలో రెండే రెండు పాయింట్లు. ఒకటి సుశీల చెడిపోయిందా అనేది. రెండు చెడిపోయిన అమ్మాయి అయితే మాత్రం పెళ్లి చేసుకోకూడదా అనేది. ‘చెడిపోవటం’ అంటే నిర్వచనం కోరాడు నరేంద్ర . ‘అంటే శీలం లేకపోవడం’ అని బావ జవాబు. ‘శీలం అంటే ఏమిటి’ నరేంద్ర క్రాస్ ఎగ్జామినేషన్.
 
        ఎన్నడూ పర పురుషుని గురించి మనసా –కాసేపు కర్మణా తీసేద్దాం, ‘ఇష్టంగా’ ఆలోచించని స్త్రీలు ఎంతమంది ఉంటారు? పెళ్లికాకముందు వేరే ఎవరినీ ఇష్టపడకుండా ‘కాబోయే’ భర్త ని మాత్రమే ఇష్టపడతాం – అని ఏ స్త్రీ అయినా మనసు బిగదీసుకొని ఉండగలదా! అలాగే మగవాడైనా! అంటే స్త్రీ పురుషులు అందరికీ “శీలం” ఉన్నట్టా లేనట్టా!” 
 
‘నరేంద్ర మాటల్లో ఎక్కడో సబబు ఉన్నట్టే తోస్తుంది’ నరేంద్ర బావ మనసులోనే మెచ్చుకున్నాడు. “కాబట్టి మానసిక పవిత్రత మీద నాకు అంత నమ్మకం లేదు. శారీరక పవిత్రత అయినా అంతే. స్త్రీ అయినా, పురుషుడైనా తనకిష్టమైన వ్యక్తిని కాంక్షించడంలో తప్పులేదు. ఆ కాంక్షలో మనశ్శరీరాల సమతౌల్యాన్ని బట్టి దాని మంచిచెడ్డలుంటాయి. అంటే ఒక వ్యక్తి ఎదుటివాళ్ళ మనసుతో పని లేకుండా శరీరాన్నే కోరుకోవడం తప్పనుకుంటాను. అంతేగాని వేరుగా ‘శీలం’ అన్న పవిత్ర పదార్థం ఎక్కడ ఉంది? పవిత్రత, అపవిత్రత అనేవి చాలా పెద్ద మాటలు. ఈ పవిత్రతని నిర్ణయించడానికి పెళ్లీ పెటాకులు ప్రమాణాలే కావు” – ఇక్కడ శీలాన్ని చాలా ఇరుకున పడేసాడు. ఇంక శీలవంతులే లేరనిపిస్తుంది – సుశీలతో నరేంద్ర కవ్వింపుగా అన్న మాటకు సుశీల ఎలా రియాక్ట్ అయిందో చూడండి: 
 
     “మీరనే శీలం మన జీవితంలో కలిగించగల మార్పు లేదు. ఇక సంఘం దృష్టిలో విలువ అంటారా! తాళిబొట్టు చాటున వ్యభిచరించే  పతివ్రతలు ఎంత మంది లేరు?”
 
  ” ఈ విషయం తెలిస్తే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?” అని నరేంద్ర అంటే ఆమె ధైర్యంగా చెప్పిన మాట నరేంద్ర అభినందనలు పొందింది. “తెలియకుండా  నన్నెవరైనా పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరించను”- ఇది ఆమె సత్యసంధానత. ఇదీ ఆమె నిశ్చయమైన నిర్ణయం.
 
  ఇప్పుడు సుశీల వ్యక్తిత్వం నరేంద్ర దృష్టిలో హిమనగోన్నతమైంది. అందుకే ఆమెను కోరుకున్నాడు. ఆమెను చేరుకొన్నాడు. సుశీల, నరేంద్రులు భార్యాభర్తలు అయ్యారు.
 
   ఈ కథలో స్త్రీల పట్ల జరిగే అమానుషమైన అత్యాచార పర్వంలో దోషి ఎవరో తేల్చబడింది. “శీలా”నికి నిర్వచనంగా సుశీలను తీర్చిదిద్ది, జీవితాన్ని – స్త్రీ జీవితాన్ని మగ వారి స్వార్థం ఎలా కాటు వేస్తుందో, ఆ తర్వాత ఆమె జీవితం ఎలా ‘కాటు’ బోతుందో తెలుస్తుంది. కానీ ఆమె ఆత్మస్థైర్యం ఆమెను ఎలా ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా తీర్చిందో సుశీల పాత్ర చిత్రణలో పాపినేని స్పష్టంగా చెప్పారు. మనిషి సుఖంగా బతకడానికి అంతోఇంతో ధైర్యసాహసాలు అవసరం అనుకుంటాను. అవి సుశీల నరేంద్ర లో పుష్కలంగా ఉన్నాయి. పరస్పర విశ్వాసం ఉంది. వాళ్ళు సుఖపడగలరనే  నా విశ్వాసం . కానీ  అనుమానం సంఘం మీద- అని అనుమానం వ్యక్తం చేశాడు రచయిత. ‘సుశీల, నరేంద్రుల’ నామకరణం ఈ కథలో సార్థకాలు.
 
 *మనుషులు వదులవుతారు::* 
 
    ‘ నార్మన్ మెయిలర్’  ఘాటైన మాటల్తో మొదలైన ఈ కథ స్త్రీ పురుష సంబంధాల్లో లైంగిక ప్రాధాన్యాన్ని, మానసిక అస్థిరత్వాన్ని, మాటల మాటునున్న గుట్టును రట్టు చేస్తుంది. చక్రపాణి అనే ఒక అర్భక సంసారిని, ‘ఫార్టీ ఇయర్స్ సిండ్రోమ్’ తో ఇప్పుడిప్పుడే దేహంలో ‘వదులుతనం’ అందుకుంటున్న అనేకమందికి ప్రతీకగా ఈ కథ సాగుతుంది.
 
     వయసు పెరిగేకొద్దీ దేహం సడలడం షరా మామూలే. కానీ చక్రపాణికి మనసు కూడా వదులయి, ఆలోచనలు వదులయి, ‘కొత్త’ కోసం వెర్రి వేషాలు వేయడం మొదలు పెట్టడంతో ఈ కథ మొదలవుతుంది. తన భార్య మీద, ఆమె’లూజ్ నెస్’ మీద విసుగు వచ్చినా, విరక్తి వచ్చినా – కథను కథలాగా కాకుండా,  భార్యాభర్తల అనుబంధాన్ని, అనిర్వచనీయమైన అనంతమైన అఖండమైన శాశ్వతత్వాన్ని కథాంతానికి నీతిదాయకంగా మలిచిన తీరు అద్భుతం.
 
      మధుబాల మధ్యలో మధువులా వచ్చినా, కైపెక్కి కాసేపు తైతక్కలాడినా, చక్రపాణి ప్రాణం గుక్క తిప్పు కోకుండా ఆమె వెంటే పరిగెత్తినా, చివరికి గాని తెలియలేదు ‘మంచు ముక్క వేడిగా ఉంటుందని’. ఆలనా పాలన సరిగా లేక, సంసారిక ఆనందానికి అల్లంత దూరాన ఉన్న మధుబాలకు తన భర్త వల్ల వచ్చే ఆనందం ఆవంతేనని, అదీ అరకొరే నని తెలిసి, మరో మార్గం వెతుక్కునే సమయంలో సరిగ్గా చక్రపాణి పరిచయమయ్యాడు. పరిచయం ప్రణయంగా మారింది. ప్రణయం పరిణయానికి దారి తీసింది. డబ్బు పిచ్చి ఉన్న భర్తతో సంసారంలో సారాన్ని  ఆస్వాదించ లేని తన అభిప్రాయాన్ని వాళ్ళ నాన్నతో చెప్పింది. ఆయన కొంచెం ఆలోచించి ‘ఒక సమస్య నుండి ఇంకో సమస్యకి వెళ్తున్నావేమో’ అని తన అనుమానాన్ని, చెప్పి తన కూతురు ఏ కష్టం లో కూరుకుపోతుందో నని భయపడ్డాడు.
 
    చక్రపాణి మాటిమాటికి ‘ఐ లవ్ యు’ అంటూ, “దానిని ఇక భరించలేను. వట్టి లూజ్ బాడీ” అంటూ తన భార్యను కామెంట్ చేయటం మధుబాలకు ఏదో అర్థం కాని భావం భూతద్దంలో కనిపిస్తుంది. “చాలా మోహంగా ఉన్నావు” అన్న పొగడ్త లాంటి మాటతో మధుబాల తికమక పడింది.
 
   ఆరోజు, అంటే మరునాటి రోజు పెళ్లి జరగబోయే రోజు. తాను కాలు జారి కింద పడి కాలు గీసుకుపోతే
” మై గాడ్. ఐ యాం లక్కీ. అదే మొహానికి తగిలి ఉంటే నీ అందమంతా ఏమైపోయేది!  ఐ కాంట్ బేరిట్” అన్నాడు. మధుబాల ఉలిక్కిపడింది. పైపై సౌందర్యాన్ని ఆరాధించే చక్రపాణి తన ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోగలడు!  ఇంతకాలం అతని భార్య పతివ్రతా శిరోమణిలా, సావిత్రిలా ప్రేమించి, అతనికి ఒక కూతుర్ని కూడా బహుమతిగా ఇచ్చిన శ్రీమతిని – ఆమె లూజ్ నెస్ ని అడ్డం పెట్టుకొని తన మోహంలో పడ్డాడా! తాను సావిత్రి సంసారంలో నిప్పులు పోస్తోందా! వారి కుమార్తె ప్రీతి భవిష్యత్తును భగ్నం చేస్తోందా! తన స్వార్ధానికి ఇద్దరు బలి కావడం ఖాయం. చక్రపాణి లోని ఈ సౌందర్య దృష్టి మారదని  గ్యారంటీ ఏమిటి ? పదిహేడేళ్ల సంసారం తరువాత చక్రపాణి మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నాడు. సావిత్రి కీళ్లనొప్పులతో బండెడు చాకిరి చేసి చేసి, రాత్రికి ఒళ్ళంతా పచ్చి పుండైతే, ‘నువ్వు ఎందుకు పనికిరావు’ అని చక్రపాణి తన ఫ్యూచర్ ప్లాన్ కు పునాది వేసుకుంటున్నాడు
              సావిత్రి భోళా మనిషి. గంటన్నర లోనే తన సంసార జీవితాన్ని సగం చెప్పేసింది. కపటం లేకుండా “ముప్పైమూడేళ్ళకే ముసలిదానిలా కనిపిస్తున్నా కదూ” అని చక్రపాణి ఇంటికి తేగా వచ్చిన మధుబాలకు చెప్పేసింది. చక్రపాణి కూతురు ప్రీతి “ఆంటీ” అంటూ మధుబాలను పలకరించి “మా డాడీ మీలాంటి స్నేహితుల్ని ఇంటికి తీసుకు రావడం ఇదే మొదలు” అంది. మధుబాల లో అంతర్మధనం ప్రారంభమైంది. ఆమెలో ఇంకా మనస్సాక్షి ఉంది. రీజనింగ్ ఉంది. సావిత్రిని, కూతురుని ఇంత తేలిగ్గా వదులుకునే వాడు ఏదో ఒక రోజు నన్ను వదిలేయడా? మధుబాల తన సమస్య మూడు కోణాల్లో చూసుకొంది. చక్రపాణికి తన మీద ఆసక్తి ఎందుకు కలిగింది? తన అందం కావచ్చు. అతని భార్య పట్ల అసంతృప్తి కావచ్చు. చెస్ తను ఎంత బాగా ఆడుతుందో, అతను ఎత్తుకు పైఎత్తు వేస్తూనే ఉంటాడు. రెండు రోజుల్లో సావిత్రి కొంప కొల్లేరు అవుతుంది. ప్రీతి భవిష్యత్తు బజారుపాలు అవుతుంది.సావిత్రి స్థానంలో తను ఉంటే …. !మధుబాలకు సమాధానం దొరకలేదు.
   మూడో కోణంలో – అతనిలో లాలస తప్ప లాలన కనిపించలేదు. ఇక తన నిర్ణయాన్ని చెప్పింది – “మనుషులు  వదులవుతారు, నిజమే కానీ నువ్వు కూడా ఒకనాటికి వదులవుతావు. దృఢంగా ఉండాల్సిందే మనస్సే”.    
          కథలో కమ్మిన పొగ మంచు విడిపోయింది. ‘దూరాన కొండలు నీరెండలో మెరుస్తున్నాయి’ అనే కొసమెరుపు తో కథ ముగిసింది. 
 
   “నాకన్నా సాహిత్యం ఎత్తు ఎక్కువ. అది నా ఆత్మోన్నతికి నేనెన్నుకున్న సాధనం. కథ గాని, కవిత గాని తాత్విక స్థాయికి తీసుకెళ్ళడం నాకిష్టం. జీవిత తాత్వికత లేని రచన నేను ఊహించలేను. మన సిద్ధాంతాలన్నీ మానవ కేంద్రాలే — “నేను నా కథలు” అనే ‘సగం తెరిచిన తలుపు’ పీఠికలో పాపినేని చెప్పిన పరిణితి వాక్యాలివి.

*****

Please follow and like us:

One thought on “ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు”

  1. పాపినేని శివశంకర్ కథల్లో చాలా మంచి కథ మనుషులు వదులౌతారు. దాంపత్య సంబంధాల్లో కొంతకాలం తర్వాత పిల్లలు, సంసారంలో కూరుకుపోయిన భార్యలలోని లూజ్ నెస్ ను ఎంచి చూపే భర్తలు తమలోని శారీరక, మానసిక లూజ్ నెస్ నీ తడుముకోరనే అంశాన్ని గొప్పగా కథనీకరించారు రచయిత.ఈ కథని అందులోని స్త్రీ వాద దృక్పథాన్ని పట్టు కుంది సమీక్షించిన విధానం చాలా బాగుంది.రచయితకూ, సమీక్షించిన సుశీల గారికి అభినందనలు.

Leave a Reply to శీలా సుభద్రా దేవి Cancel reply

Your email address will not be published.