ఆలాపన       

-గోటేటి లలితా శేఖర్

  సంధ్య ముఖంలో  అందం, ఆనందం ఒకదానితో ఒకటి   పోటీపడుతున్నాయి . 

“ సూర్య మెసేజ్ పెట్టారా?……….నిజంగానేనా……?”   ఉద్వేగంగా అడిగాను.

సంధ్య నవ్వుతూ   అవునన్నట్టు తలూపింది. 

“ జ్యోతీ …….” వీలుచూసుకుని వస్తావా? నిన్ను  చూడాలని ఉంది. “ అంటూ  సంధ్య పెట్టిన  మెసేజ్  చూసుకుని  రెండు రోజులు  ఆఫీసుకి లీవ్ పెట్టి   రాజుతో చెప్పి బయలుదేరాను..  హైదరాబాద్ నుంచి విజయవాడకు  ప్రయాణం చేసిన  సమయమంతా సంధ్య గురించిన  ఆలోచనలతో ,  జ్ఞాపకాలతో గడిచింది.

“చెప్పు సంధ్యా  సూర్య వచ్చారా?  ఎలా తెలిసింది? ఫోన్ చేశారా?”ఇంట్లోకి అడుగుపెడుతూనే     నా   ఆరాటాన్ని చూసి సంధ్య నవ్వింది. “   రెండు రోజుల క్రితం  మెసేజ్ వచ్చింది” అంది. 

     సంధ్య లో  దాగని సంతోషం  ముఖంలో మెరుస్తోంది. నా గుండె   గబగబా కొట్టుకుంది.   అతనే   అని  ఎలా తెలుసు ?     నాలో  ఇంకా ఏదో  సందిగ్ధత, అపనమ్మకం  చూసి  “  ముందు  నువ్వు స్నానం చేసి    రిలాక్స్ అవ్వు చెపుతాను అంది . నా చేతిలో పెట్టి  అందుకని  గదిలో పెట్టి వచ్చింది.   సంధ్య అంతే!   ఎప్పుడూ   క్లుప్తంగానే  మాట్లాడుతుంది.

 స్నానం కానిచ్చి , సంధ్య పెట్టింది తిని , వరండాలో కూర్చున్నాను. బంగారపువన్నె  నీరెండ తో  పరిసరాలు వెలుగుతున్నాయి. శ్రావణ సంధ్య లో  చల్లని గాలి స్పర్శ హాయిని కలిగిస్తోంది.    వాన జల్లు పడుతోంది.   మనసు, తనువు   తేలికైన  అనుభూతి  కలిగింది.                        

నేను లేచి    చేతులు చాచి  వానలో తడుస్తున్నాను.  నా సంతోషం  నన్ను   గిర గిరా  తిప్పేస్తోంది.      “జ్యోతి  ఆగవే   యాభై కి  చేరిన  శరీరాలు  మనవి. జాగ్రత్త!  పడిపోతావు” అంటూ  నా చెయ్యి  అందుకుని  లోపలికి   లాక్కొచ్చింది . ఇద్దరం   నవ్వుకున్నాం.  తడిసిన బట్టలు  మార్చుకుని   వచ్చాక  టవల్ తొ నా తల  తుడుస్తోంది సంధ్య.    నా  సెల్ తీసుకుని  సంధ్య కి ఇష్టమైన పాట  ప్లే చేశాను. “జబ్  దీప్  జలే  ఆనా  జబ్  షామ్      ధలే  ఆనా  సంకేత్  మిలన్ కా   భూలన జానా  మేరా  ప్యార్  న  బిసరానా” .  జేసుదాసు  స్వరంలో కవి  పలుకుతున్న  అభ్యర్థన,   ఆ మాధుర్యం లో ఇరువురం కరిగిపోతున్నాం.      చిత్  చోర్  సినిమా ఎన్నిసార్లు చూసాం మనం?  

నాలుగు సార్లు అన్నాను    . మొదటిసారి  నువ్వు,  సూర్య  కలిసి చూశారు  కదూ అన్నాను.      అవునంది.      “కలండు  కలండు   అనువాడు  కలడో లేడో అన్న  నా   అనుమానం  తీరింది  సంధ్యా  డియర్!”  అన్నాను సంతోషంగా.  

థాంక్యూ   అంది సంధ్య.  సంధ్య  స్నానం చేసి వచ్చి కడిగిన ముత్యంలా ఉంది.  దేవుడి మందిరంలో  దీపం వెలిగించింది.   సంధ్య  ఒంటరి జీవితం చూస్తే  నాకు  కొండంత దిగులు.     ఎన్నేళ్ళుగా  ఇలా  దీపాలు  వెలిగిస్తున్నవు సంధ్యా?       

“వెలుగు ని  వెలిగించటం ఏమిటి  అంతటా ఉన్న వెలుగు  నా చిన్న గూటిలో  కూడా ఉంది” అంది.  

ఆ వెలుగులో  ఈ చెట్లు  పూలు  పరిసరాలు  ఎంత బాగున్నాయో  చూడు  అన్నాను.  చెట్లన్నీ  సంతోషంతో ఎలా తలలూపుతూ  ఉన్నాయో చూడు. ఇదంతా  ప్రేమ సంకేతం  కాదా?  అన్నాను.  

సంధ్య  నా  ఉద్వేగం  చూసి నవ్వింది.     “మళ్లీ ఆ కబుర్లు వినాలని ఉంది”  అన్నాను. 

ఏ కబుర్లు   నవ్వు దాచుకుంది. ఆ  కబుర్లు… ఇరవై ఏళ్ల క్రితం ఇద్దరం చెరువు గట్టున,  వేణుగోపాల స్వామి గుడి లోను  ఉమెన్స్ కాలేజీ  ఆవరణలోనూ  చెట్ల కింద కూర్చుని చెప్పుకున్నాం………… ఆ కబుర్లు.      ఇరవై లో ఉన్న రంగులు   యాబై లో  మారవా జ్యోతీ ?

 నిజమే  రంగు మారుతుంది కానీ  వెలుగు పోదుగా   అన్నాను.   అవును   జ్యోతి  వెలుగు పోదు   అంది.  

            “పొడుస్తూ  భానుడు పొన్న  పువ్వు ఛాయ  పొన్న పువ్వు మీద  బొగడ  పువ్వు  ఛాయ. ఉదయిస్తూ  భానుడు ఉల్లి పువ్వు  ఛాయ. శ్రీ సూర్యనారాయణా మేలుకో.” అంటూ పాడాను.   

                  ఆ సూర్యనారాయణ మూర్తి  సరేగాని  నీ సూర్య కబుర్లు చెప్పు అన్నాను.   ఇంతలో  సంధ్య సెల్   మోగింది .    ఇంకెవరు  సూర్యే నేమో     చప్పున  సెల్  చేతిలోకి  తీసుకున్నాను.  స్క్రీన్ మీద  వంశీ  అన్న  అక్షరాలు చూసి  నా ఉత్సాహం  నీరుగారిపోయింది.           

 హాయ్ వంశీ నాన్నా…!  జ్యోతి ఆంటీ హియర్  అన్నాను నీరసంగా.       ……  ఓహో  మీరు వచ్చేసారా ఆంటీ? ఇంక అమ్మతో నన్ను  ఏం మాట్లాడని స్తారు  అన్నాడు వంశీ.  

“వంశీ బాబూ!   బాగా చదువుకుంటున్నావా? కాలేజీ ఫస్ట్ రావాలి”  అన్నాను  నాటకీయంగా.   “బాగా చదువుకో వట్లేదు ఆంటీ, ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాను” అన్నాడు నవ్వుతూ.  నేను   కాలేజీ  ఫస్ట్ రాను గానీ అమ్మకి ఫోన్ ఇవ్వండి అన్నాడు. కొంటె వెధవి అని నవ్వేసి సంధ్య కి ఫోన్ ఇచ్చాను .   తల్లి కొడుకులు  మాటలు  చెప్పుకుంటుంటే  కుక్కర్ పెట్టి వచ్చాను. వంశీ సంధ్య ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు.      

సంధ్య అక్క బావ యాక్సిడెంట్ లో చనిపోతే అక్క కొడుకు  ఏడాది బిడ్డ వంశీని  ఇంటికి తెచ్చుకుంది  సంధ్య. అలా వంశీ కు  అమ్మ అయ్యింది సంధ్య. ఇప్పుడు వంశీ కాలేజి చదువు కు వచ్చేశాడు. 

 ప్రేమించిన సూర్యతో  వెళ్లి పోవడమా   ఒంటరి వాడై  కంటి చూపు మందగించి నిస్సహాయుడైన  తండ్రి కోసం , తల్లిని  తండ్రిని పోగొట్టుకున్న పసిబిడ్డ కోసం ఉండిపోవడ మా…! అన్న మలుపు దగ్గరే   ఆగిపోయింది సంధ్య.   సంధ్య   నిర్ణయాన్ని   విని  చాలా  బాధ పడిపోయాడు సూర్య. ఆడవాళ్ళు  త్యాగం చేయటం  ఓల్డ్ ఫ్యాషన్  ఇప్పుడు ఎవరూ చేయటం లేదు  అన్నాడు కోపంగా, బాధగా. త్యాగం కాదు   జీవితాన్ని లైట్ గా తీసుకోవడం. అయినా నువ్వు నీ బాధ్యతలను   వదిలిపెట్టి నాతో వుండటం కూడా నాకు బావుండదు  సూర్యా! 

 ప్రణయం  సింధూరపు  వర్ణం  లా  చాలా ఆకర్షణీయంగా  ఉంటుంది నిజమే. అంతేకాదు  మిగిలిన  వర్ణాలను  డామినేట్ చేస్తుంది.  కానీ సూర్యా….  కరుణ  అన్ని  రంగులను  తనలో కలిపేసుకునే  సూర్యకాంతి లాంటిది . సూర్యుడు రాకపోతే   జీవికి  మనుగడ  లేదుగా . కరుణ  లేకపోతే  ఎలా సూర్యా? అంది సంధ్య.    

కళ్ళు చమర్చగా సూర్య రెండు చేతులు చాచాడు. ఇరువురు….  గాఢ  పరిష్వంగంలో  ఓదార్పు  పొందారు. సూర్య తన జీవితంలోకి తాను వెళ్ళిపోయాడు. అంతటితో ఓ ప్రేమ ఘట్టం ముగిసింది అనుకున్నాను. 

    ఇంకా సంధ్య మాట్లాడుతూనే ఉంది ఫోన్ లో. సంధ్య పాటల పుస్తకం  చేతిలోకి తీసుకుని  చూస్తున్నాను.      ప్రేమ  ప్లస్  విరహం  గోస్ టు ప్రణయం. ప్రేమ   ప్లస్ కోపం    గోస్ టు మౌనం.  ప్రేమ   ప్లస్  ఎడబాటు గోస్ టు  ధ్యానం,  ఆలాపన   అంటూ సంధ్య రాసుకున్న  వాక్యాలు చదివి  నా కళ్ళు చెమ్మగిల్లాయి.  సంధ్య వంటగదిలోకి వెళ్ళింది.  వాడిన గులాబి లా ఉంది సంధ్య.. రెండు దశాబ్దాల కాలం  ఎలా  గడిచింది తనకు?.    

ఇద్దరం భోజనాలు కానిచ్చి మంచం మీదకి చేరాం. రాజు ఎలా ఉన్నాడు జ్యోతి? అంది సంధ్య.        

మహారాజులా ఉన్నాడు. రొటీన్ బోర్ కొట్టేస్తోంది  ప్రేమించుకుందాం రా అబ్బాయీ అంటాను. నీకూ, నీ కోసం వచ్చే స్నేహితుల కోసం కాఫీలు కలపడం  పని మనిషి  లేని రోజున అంట్లు తోమడం, నువ్వు   ఊర్లు  పోతున్నప్పుడు  నిన్ను  రైళ్లు బస్సులు ఎక్కించడం, జ్వరం వస్తే కాళ్ళు నొక్కడం ఇంతకంటే ప్రేమించ  లేనే నా జీవన జ్యోతీ! అంటాడు”, అన్నాను. 

దొంగ పిల్లవు రాజు కాబట్టి నిన్ను భరిస్తున్నాడు;  అంది నా బుగ్గ గిల్లి.  

          రాజు, సంధ్య క్లాస్ మేట్స్. రాజుతో నా పెళ్లి సంధ్య  మధ్యవర్తి  గా ఉండి జరిపించింది.  

       నాలో ఉన్న సందిగ్ధతను బయట పెట్టాను.  

   సంధ్యా! “ఇన్నేళ్ల  ఒంటరితనం లో  నువ్వేం  పొందావు? మనిషి కనబడకపోతే  ప్రణయ భావన నిలుస్తుందా?” సూటిగా అడిగాను. 

జ్యోతీ! ఇది జీవితం  వ్యాపారం కాదు. లాభాలు నష్టాలు లెక్కలు వేసుకుంటానికి. నువ్వు అనుకున్న పొందటం, ఇవ్వడం వీటికి ఏమైనా లెక్క లు కొలతలు ఉన్నాయా?  చెప్పు.  ఇక “మనిషి కనపడకపోతే ప్రేమ  నిలుస్తుందా” అన్నావు. పూజారి రోజూ విగ్రహాన్ని చూస్తున్నా దేవుడిని  చూడగలుగుతాడా? ప్రేమ ఒక ఏర్పాటు ఒక ఒప్పందం కాదు. అది ఒక సంభవం. ఒకసారి ప్రేమని అనుభవించటం మొదలయ్యాక అది కాలంతో పాటు సాగుతూనే ఉంటుంది. అభిప్రాయాలు మారతాయి కానీ ప్రేమ మారదు. ప్రేమంటే అభిప్రాయం కాదు అంది సంధ్య.

  నేను  నివ్వెరపోయి వింటున్నాను. స్మృతి ఉన్నంతకాలం ప్రణయ భావన కూడా  ఉంటుంది.   ప్రేమంటే కేవలం భౌతికం కాదుగా. నిన్నటి మల్లె దండ ఈరోజుకి వాడిపోతుంది. నిజమే.. అది భౌతికం.అనివార్యమైన మార్పు. కానీ మల్లెల రూపం, సుగంధం ఎప్పుడూ నీకు తాజా గానే ఉంటుంది కాబట్టి స్మ్రుతి ఉన్నంత కాలమూ ప్రణయ భావన కూడా ఉంటుంది. 

తల్లితండ్రులూ, పిల్లలూ కనబడనంత మాత్రాన  మనలో  వారిపట్ల ప్రేమ పోతుందా?  కనపడని దేవుడిని  దేనిలో చూసి మనుషులంతా ఆరాధిస్తున్నారు? 

        జ్యోతీ… నేను సూర్యని మించి జీవితాన్ని ప్రేమించాను. కనుకనే నాన్నని చివరి క్షణం వరకు జాగ్రత్తగా చూసుకో గలిగాను. వంశీకి అమ్మని అయ్యాను.  మీ అందరితో స్నేహానుబంధాన్ని పొందగలిగాను అంది.         

నేను సంధ్య ని చూస్తూ ఉండిపోయాను. “సంధ్యా… ప్రేమానుభవం ఎంత గొప్పది! “వలపెరుంగక కులికి మురిసి బ్రతికే కంటే వలచి విఫలమ్మొంది విలపింప మేలురా”, అన్నారు బసవరాజు అప్పారావు గారు. ఇందుకేనేమో అన్నాను. నవ్వింది సంధ్య.  

    సూర్య ఎప్పుడు వస్తున్నారు తెలియదు. ఏముంది ఆ మెసేజ్  లో నాకూ చూపిస్తావా? అడిగాను. లేచి వెళ్లి  సెల్  నా చేతిలో పెట్టింది సంధ్య. “బంగారమ్మా చూడాలని ఉంది. త్వరలోనే వస్తాను… నీ సూర్య”.         

 “ఎదురు చూస్తున్నాను”, సంధ్య పెట్టిన జవాబు కూడా చూశాను. అలా తను మాత్రమే పిలుస్తాడు నన్ను. అలా అంటున్నప్పుడు సంధ్య ముఖం ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది నాకు. 

“ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోను? అందుకే నిన్ను పిలిచాను అంది”.    “……ఏదో ఉద్వేగం నన్ను ముంచెత్తింది .పాట పాడు    సంధ్యా!”  అన్నాను.సంధ్య ఆలాపన వింటున్నాను. జాజి పూల పరిమళంతో పాటు సంధ్య తీయని తేనెలూరు గొంతు నన్ను పరవశురాలిని చేసింది. పాటలతో ఆ రాత్రి  మధురంగా సాగింది.

             బంగారాన్ని  పెరడంతా ఒలక పోస్తూ సూర్యుడు వచ్చాడు.  కాఫీ తాగుతూ చెప్పాను సంధ్య  ఈరోజు  నేను  వేడతాను  అన్నాను .  

“అప్పుడేనా! నువ్వు ఉంటావని నేను రేపు కూడా  ఆఫీసుకు సెలవు పెట్టాను. ఏం రాజు  బెంగ పెట్టుకుంటాడా అంది” సంధ్య  నవ్వుతూ..  కాదమ్మా మీ సూర్యుడు వస్తాడని  అన్నాను. సూర్యుడు రోజూ వస్తాడు అంది. 

గేటు ముందు ఆటో వచ్చి ఆగింది.  నడి వయసులో పొడవుగా ఉన్న ఆ వ్యక్తి  ఆటో దిగి డబ్బులు ఇస్తున్నాడు. అప్రయత్నంగా  ఇద్దరం లేచి  నిలబడ్డాం. 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.