లేఖావలోకనం పై లేఖారూప సమీక్ష

-రమాదేవి బాలబోయిన

 
ప్రియాతి ప్రియమైన మేనకోడళ్ళు యశో, వర్థిని లకు వెన్నెలాక్షరాలతో రమాదేవి బాలబోయిన లేఖ-
 
                                                                                            
మై డియర్ బంగారాలూ….
     మేమంతా క్షేమం,మీరంతా క్షేమమని తలుస్తాను. మళ్ళీ స్కూళ్లు ప్రారంభమైనై. అందరం బిజీబిజీగా మారిపోయాం. కాలంతో పోటీపడుతున్నాం. విద్య అభ్యాసంలో మీరు, బోధనలో నేను మునిగిపోయాం.
 
బంగారు తల్లులూ!ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకమైనా చదవందే,కనీసం ఓ నాలుగు పేజీలైనా చదవందే నాకు ఆరోజు అసంపూర్ణమని మీకు తెలియనిది కాదు. మీకూ అదే అలవాటు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ రోజే మనింటికొచ్చిన ఈ అద్భుతమైన పుస్తకం లేఖావలోకనం ని చదివాను. ఇందులో నా రచన కూడా ఉంది. లేఖలు రాయడమే మరిచిన మాచే ‘పసిపిల్లల పై లైంగిక హింసను ఖండిస్తూ, సమస్యలపై అక్షరాలతో యుద్దం చేయమంటూ,సమస్యలకు పరిష్కారాలు సూచించమంటూ ప్రోత్సహించి కేవలం రెండు నెలల వ్యవధిలో ఉత్తరాలు రాయించి తెలుగు సాహితీ చరిత్రలోనే  మునుపెన్నడూ లేనివిధంగా డెభై లేఖలతో  లేఖావలోకనం పొత్తంగా కూర్చింది మన జ్వలితమ్మ.
 
ఇందులో ఆవేదనాయుక్తమైన మా లేఖలతో పాటు ఆలోచనాపరులైన సావిత్రిబాయి, ముక్తాబాయి, ఔరంగజేబు, అబ్రహం లింకన్, బోయిభీమన్న వంటి ప్రముఖుల లేఖలను కూడా చేర్చడం సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. స్కూలు పుస్తకాలలో కూడా మనం ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన లేఖలను చదువుకుంటూనే ఉన్నాం. లేఖలో ఉండేవి మామూలు అక్షరాలు కావు మనసాక్షరాలు. గుండెలోతుల్లోంచి పొంగు కొచ్చే భావాలనెన్నింటినో గుదిగుచ్చి మరో హృదయానికి చేరవేసేదే లేఖ. పూర్వకాలంలో వార్తాహరులు, పశుపక్ష్యాదులు,మరియు మేఘాలతో పంపిబడిన సందేశాలు,కొన్నాళ్ళకు కాగితాన్ని తమ వాహకంగా చేసుకుని రాజ్యమేలి ఇపుడు సెల్ఫోన్, ఫ్యాక్స్, మెయిల్ రూపాల్లోకి మారిపోయాయి‌.
 
చేరాల్సిన సందేశం చేరాల్సిన చోటికి చేరడమే గా తల్లీ అసలు ఉద్దేశ్యం. అందుకేనేమో ఈ పుస్తకంలోని ప్రముఖ రచయితలు, రచయిత్రులు అందరూ రాసినటువంటి లేఖలు గుండెకు చేరి మనసునెంతగానో దోచేస్తాయి. కొన్ని లేఖలు ఆవేశంతో పిడికిలి బిగించేలా చేస్తే, మరికొన్ని ఒళ్ళు జలదరించేలా చేసి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. అందరి భావం ఒక్కటే పసి పిల్లలపై అఘాయిత్యాలు రూపు మాయాలీ అని, లైంగిక హింస జరగకూడదని. ఒక్కొక్క ఉత్తరం ఒక్కొక్క కన్నీటి సంద్రానికి సాక్ష్యంలా ఉంది. కట్నాలకీ,కష్టాలకీ కామానికీ బలైపోయిన ఎందరెందరినో ఉటంకిస్తూ,అలాంటి వెతలు మరో పసి హృదయానికి రాకూడదంటూ తమ ఆవేదనా నదులు ప్రవహింపజేసిన 63గురు మానవతా మూర్తులు ఈ లేఖావలోకనం పుస్తకానికి తమ రచనలను అందించారు.
 
ఇందులో ఎన్ని విషయాలున్నాయో తెలుసా చిన్నితల్లులూ…
సూర్య ధనంజయ, యశస్వి సతీష్, శీలా సుభద్రాదేవి గార్లు పొత్తంపై తమ చక్కని అభిప్రాయాలు వ్యక్తం చేసారు…స్త్రీ బలిపశువూ, భోగవస్తువుగా మిగిలి పోకూడదని ఆత్మరక్షణకు స్వయం ఆయుధాలు అవ్వాలని  అనిశెట్టి రజిత గారు, పసి పిల్లలు కుటుంబంలోని ఆర్థిక సామాజిక సమస్యల సుడిగుండాల సుళ్ళలో గిలగిల లాడుతున్నారని ఏ.రాజ్య లక్ష్మీ గారు, తల్లిదండ్రుల రెక్కల కష్టం విలువ పిల్లలకి తెలవాలని మగపిల్లలకి కుటుంబ విలువలు, బాంధవ్యాల తీయదనం తెలియాలని ,ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి నేర్పాలని సూర్య ధనుంజయ గారు, ఇంట్లో పెద్ద వారు లేని సమయంలో చిన్నపిల్లల ప్రైవేట్ స్థానాల్లో తగిలే దరిద్రులు ఉంటారంటూ,వారిపై ఓ కన్నేసి ఉంచాలని వెన్నెలమ్మ గారు, ఆన్ లైన్ లలో సోషల్ మీడియా ల లో వల విసిరే వాళ్ళ వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న ఆడవాళ్ళ గురించి సరితానరేష్ గారు, బిడ్డకో ఉత్తరమంటూ కట్టా శ్రీనివాస్ గారు, మహిళలకు hakkulu ఉండాల్సిన ఆవశ్యకతను గురించి కుప్పిలి పద్మ గారు, పిల్లలకు ఏ దాపరికం లేకుండా లైంగిక వేధింపుల గురించి చెప్పాలంటూ కేఎల్ సత్యవతి గారు, ఆడ పిల్లలకు వచ్చే ముప్పులను తెలియజేసేందుకు వారిని జాగృత పరిచేందుకు ఉపాధ్యాయుల పాత్ర ను గురించి కోమాకుల వినోద గారు, శారీరక సామర్ధ్యమేకాదు ,మానసిక స్థైర్యంతో ఉండేలా పిల్లలకి నేర్పాలని గొల్లమూడి సంధ్య గారు, సెల్ ఫోన్ల వల్ల ఉపయోగాలతో పాటు ఎలాంటి అపకారాలు ఉన్నాయో చల్లా సరోజినీ దేవి గారు, సమాజ ప్రగతికి మహిళల పాత్ర అత్యంత కీలకం బహుముఖ ప్రజ్ఞ కలిగిన మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందాలంటూ పులి జమున గారు,ఆడపిల్ల అంటే అంగడి సరుకు కాదు ఆదిపరాశక్తి అంటూ దేవరకొండ జోష్ణ దేవి గారు, శత్రువు కు ప్రేమతో ఉత్తరం రాసిన రాణి గారు, తల్లి అటువైపు వెళ్ళకు అంటూ డా.కె.గీత గారు, దుర్వ్యసనాలు నుండి యువత విముక్త అయితే అఘాయిత్యాలు తగ్గుతాయి అంటున్న కొండపల్లి నీహారిణి గారు, పిల్లల్ని కాచుకుంటూ ఉండాలి ఎవరినీ నమ్మొద్దు అంటూ జాగ్రత్తలు చెప్పిన అమ్మ సీతాలక్ష్మి చీదెళ్ళగారు, పకడ్బందీ చట్టాలు ఉంటే నేరాలు ఆగుతాయి అంటున్న తంగెళ్ల శ్రీదేవి రెడ్డి గారు, చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వైఖరితో సమాజంలో ప్రబలుతున్న అవినీతి అక్రమాలు, పొంతనలేని న్యాయ విధానం, విద్యా విధానం. సమాజంలో  మార్పులు రావాల్సిన అవసరం ఉందంటూ  తిరునగరి దేవకీదేవి గారు, ముక్కుపచ్చలారని సంగీత అత్యాచారానికి గురైన విధానాన్ని తెలియజేస్తూ శిలాలోలిత గారు..చదువుకుంటానంటే వినకుండా పెళ్లి చేసి తనపై పరోక్షంగా గృహహింసకు బాధ్యులైన తల్లిదండ్రులకు లేఖతో తేజస్విని, ఇలా ఒకటేమిటి అన్నీ కన్నీటి కుండలే తమ లేఖలలో. ప్రతి ఒక్క లేఖ మనసును కదిలించేదే…ఓ పోటు పొడిచేదే.
 
ఇంకా చెప్పాలంటే తల్లులూ! జరుగుతున్న అన్యాయం అక్రమాలకు సాక్షులు సమాజంలోని బాధ్యత లేని వారే. వారివల్లనే పెరుగుతున్నాయనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదు అమ్మలారా!…మొన్నటికి మొన్న ఒక పుస్తకం పై ఒక అర్ధనగ్న చిత్రాన్ని ఖండించినందుకు నా స్నేహాన్ని వదులుకుందో రచయిత్రి.  ఒకరకంగా వీరు నేరాలను ప్రోత్సహిస్తున్నారు అని కూడా అనిపిస్తుంది. ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి.
 
సమాజ మనం అనుకున్నంత పారదర్శకంగా లేదు. ఎన్నో కుళ్లులూ, కుతంత్రాలూ, మోసాలు, ఘోరాలు, నేరాలు తనలో నింపుకుని మేడిపండులా ఉంది.
అందం కోసం కాకుండా ఆరోగ్యము,ఆత్మస్థైర్యం, శారీరక దారుఢ్యం కోసం ప్రయత్నిస్తే మీరు ఎవరికీ భయపడనవసరం లేదు. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే ఎవరి సహాయం తీసుకోవాల్సిన అవసరం రాదు. మీరు ఆ దిశగా ఆలోచించండి.
అమ్మాయిలు కాదు ఆదిపరాశక్తులుగా మారండి. విచక్షణ కలిగి మెలగండి. మీకు మీరే ఆయుధాలు కండి. ఇంకా ఎంతో ఎంతో రాయాలని ఉంది చిన్ని తల్లులూ! కానీ ఒక్కసారే బలవర్థకమైన భోజనాన్ని శరీరం, మెదడు తట్టుకోలేదు కదా!అందుకే మరో ఉత్తరంతో మీ ముందుకు వస్తాను. ఇకఉంటాను రా చిన్నారి తల్లులూ. వేల ముద్దులతో
 
ప్రేమతో మీ మేనత్త
మృదువిరి
వరంగల్ 
5/3/21

 

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.