కనక నారాయణీయం -18

పుట్టపర్తి నాగపద్మిని

      పుట్టపర్తికి ఇది చాలా మనోవేదనగా తయారైంది. తానిక్కడ పనిచేస్తున్నది చిలుకూరి వారి మాటమీద గౌరవంతో!! పైగా అఖండ మేధో సంపన్నతతో విశ్వాన్నే అబ్బురపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేసిన కళాశాలలో తానిప్పుడు పనిచేస్తున్నానన్న ఆరాధనాభావంతో!! అంతే కానీ, యీ ఉద్యోగమే పరమావధి కాబట్టి అనుకుని కాదు. పైగా విద్వాన్ పరీక్ష అనుభవాన్ని బట్టి, విద్వత్తుకున్న విలువ ఇప్పటికే తన జీవితంలో నిరూపించబడింది కూడా!!
            పోనీ ఒకసారి సెలవుపెట్టి పెనుగొండకు వెళ్ళి, అయ్యగారికి ఇక్కడి పరిస్థితి విశదపరచి, వారేమంటారో వింటే??
            ఈ ఆలోచన రాగానే, పుట్టపర్తి రెండురోజులు సెలవు పెట్టి పెనుగొండకు చేరుకున్నారు.
             ఉన్నట్టుండి కుమారుడు నారాయణాచార్యులను చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాసాచార్యులవారు.
       అనంతపురం ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకు నిగా తనకు తాత్కాలిక ఉద్యోగం వచ్చినట్టు, తనకీ అవకాశం ఏ విధంగా వచ్చిందీ అక్కడ తనకు తెలియలేదు కానీ, ప్రొద్దుటూరు పాఠశాల అధికారుల అనుమతి వెంటనే లభించటం, పైగా ఎక్కువ సమయమూ లేకపోవటంతో చేరటానికి ఎక్కువ సమయం లేకపోవటంతో, నేరుగా వెళ్ళీ చేరిపోయాననీ చెప్పారు నారాయణాచార్యులు.
        అనంతపురం కళాశాలలో తన ప్రవేశానికి చిలుకూరి నారాయణరావుగారి పాత్ర గురించి చెబుతుంటే, శ్రీనివాసాచార్యులవారి మోములో దరహాస కాంతులు!!
         అంతా బాగానే ఉంది కానీ, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ వ్యవహారం గురించి చెబుతుంటే, పుట్టపర్తిలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
       విద్యార్థులు తనపై అభిమానం పెంచుకుంటుంటే సహించలేకపోవటం పై అధికారిగా మీనన్ కు నచ్చకపోవటం సహజమే!! ప్రిన్సిపల్ కు తనకింద పనిచేసే ఉద్యోగస్తులు విద్యార్థుల ప్రేమాదరణలు తలకెక్కి తమపై సవారీ చేస్తారేమోనని అనుమానించటం, దాన్ని అణచివేసే ప్రయత్నాలు చేయటం మామూలే!! ఐనా తానేమీ శాశ్వతోద్యోగి కాదుకదా!! చిలుకూరి నారాయణరావుగారి సెలవు సమయంలో వచ్చిన తాత్కాలికోద్యోగి. తనమీద ఇంతగా కారాలు మిరియాలు నూరటానికి కారణం, తన పెనుగొండ లక్ష్మి కావ్యం, అందులో విజయనగర సామ్రాజ్య వైభవ చరిత్ర చెబుతుంటే విద్యార్థుల్లో జాతీయతాభావం పెల్లుబికి, వాళ్ళేమైనా అల్లర్లు చేస్తే, ప్రిన్సిపాల్ గా తన ఉద్యోగానికి బాధాకరం కదా!!
        ఆంగ్ల ప్రభుత్వం కనుసన్నలలో మెలుగుతున్న కళాశాల ఇది. ఇక్కడ ఇటువంటి అల్లర్లు చెలరేగితే ఇంకేమైనా ఉందా?? ఇది మీనన్ గారి బాధగా వర్ణిస్తున్నారు పుట్టపర్తి తండి గార్కి!!
      శ్రీనివాసాచార్యులవారన్నారు.. ‘సహించటం కష్టమేరా నారాయణా!! నీకీ అవకాశం నా స్నేహితుడు చిలుకూరి నారాయణరావు వల్లే వచ్చింది. నా స్నేహితుడి పట్ల నీకున్న గౌరవం బాగానే ఉంది కానీ, నీ భావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నచోట పనిచేయటం కంటే నరకం లేదు. నీకు మరీ బాధాకరంగా ఉంటే, నీ నిర్ణయాన్ని నీవు తీసుకునే హక్కు నీకెటూ ఉంటుంది. ఒక మాట!! విద్యార్థులతో పని!!వాళ్ళు పిల్లలు!! ఆవేశానికి గురౌతుంటారు సులభంగా!! ఈ పరిస్థితి – తీవ్రంగా పరిణమిస్తే, నీ భవిష్యత్తుమీద మరేరకమైన ప్రభావం చూపుతుందో, ఎవరికేమి ఎరుక?? శృతి మించకముందే, నీ నిర్ణయాన్ని నీవు తీసుకోవటం మంచిది.!! ఇప్పటికే ఒకసారి, ఉత్తరదేశ యాత్ర చేసి వచ్చావు నీ ఆవేశo కారణం గా!! నీ వెంట నీ సంసారం ఉంది. పిల్లలున్నారు. కాబట్టి మీనన్ కోపానికి గురికాకుండా ఉండే విధంగా నీ పద్ధతి మార్చుకుంటావో, లేదా, నీ గూటికి నీవు చేరుకుంటావో – నీ ఇష్టం!!’ అని తేల్చి చెప్పేశారు వారు!!
       అయ్యగారి మాటల్లోని సందేశం అర్థమయింది తనయునికి!! మనం వెళ్తున్నదారిలో ఇక్కట్లు ఉన్నాయని గ్రహించినప్పుడు, వేరు మార్గాన్వేషణ చేసుకోవాలే కానీ, పట్టుదలతో అదే దారిలో నడిచి కడగండ్లపాలు కావటం వివేకం కాదేమో!! పైగా అక్కడి విద్యార్థులింకా జీవిత ప్రథమాంకంలో ఉన్నవారు. వారి అభిమానాన్ని పొందేమార్గాలింకా అనేకమున్నాయి తనకు – కళాశాల బైట, స్వేఛ్చా విహంగంగా!! అటువంటప్పుడు, మీనన్ తనను అవమానకరంగా అభియోగాలు మోపి మరీ వెళ్ళగొట్టే ప్రయత్నాలు ప్రారంభించక ముందే, తానే ఆ రాజీనామా లేఖ అతని ముందు గిరాటేసి వెళ్తే, కవినైన తన స్వాభిమానంతో పాటూ, జాతీయ భావానికున్న పౌరుషం కూడా అతనికి తెలిసివస్తుందని గట్టిగా తోచింది. 
         అంతే!! తల్లిదండ్రులకు సేవించుకుని, అనంతపురం చేరుకున్నారు పుట్టపర్తి.
         అనుకున్న విధంగానే తన రాజీనామా లేఖను మీనన్ ముందుంచి, వెనుదిరిగి చూడకుండా, కడపకు చేరుకున్నారు, మరోసారి విజయ దరహాసంతో!! 
        కళాశాల ఉద్యోగం వదులుకుని ప్రొద్దుటూరుకు చేరుకున్న భర్తను చూసి, విస్తుపోయినా, కారణం తెలిసి, సంతోషించింది ఇల్లాలు కనకవల్లి.
  మళ్ళీ, కొప్పరపు వారి వద్దే కొలువు మొదలయింది. 
  పాఠశాలలో వెక్కిరింతలూ కాస్త వినబడుతున్నాయి. 
        ‘జబ్బలు చరచుకుంటూ వెళ్ళినంత సేపు పట్టలేదు, అయ్యగారి తిరుగు ప్రయాణం!! విద్యార్థులూ, దేశ భక్తీ ఇవన్నీ కట్టుకథలు కాక మరేమిటో?? అక్కడేదో ఘన కార్యం చేసి, వారితో మాటలు పడలేకే ఇంటికంటే గుడి పదిలమనుకుని, వచ్చేసి ఉంటుందీ శాల్తీ?? ఏది ఏమైనా మనకు మళ్ళీ యీ బాధ తప్పలేదు!!’ అని ఉసూరుమన్నట్టూ తెలిసింది.
        మళ్ళీ ప్రొద్దుటూరు లో కొప్పరపు సుబ్బయ్యవారి వద్దకు చేరి నింపాదీగా కుటుంబం తో జీవితం వెళ్ళదీస్తుంటే, విధికి కన్నుకుట్టిందేమో , కొప్పరపు సుబ్బయ్యగారు, హఠాత్తుగా పరమపదించారు. 
      ఆ సౌజన్యమూర్తి అండదండలతో తన సాహిత్య యాత్ర నిరంతరాయంగా జరిగిపోతుందని నమ్మకం స్థిరపడుతున్నవేళ, అశనిపాతం వలె యీ వాస్తవం, పుట్టపర్తి ఆశా సౌధాన్ని పెకలించివేసింది.
  నిద్దుర దూరమైంది. రాత్రికి రాత్రే ఆ దు:ఖం ‘బాష్ప తర్పణం’ అన్న ఖండ కావ్యంగా వెలుగు చూసింది. 
   కొప్పరపు వారి భౌతిక కాయం ప్రజల సందర్శనం కోసం ఉంచారు. సాధారణంగా పుట్టపర్తి ఎవరినీ వారి గుణాగుణాలతో ప్రమేయం లేకుండా తమ స్వలాభాలకోసం పద్య పంచ రత్నలతోనో, నవ రత్నమాలికా స్తుతులతోనో పొగడటం అసలు గిట్టని వారు.
  కంచి కామకోటి పరమాచార్యులవారిని స్తుతించి మెప్పునందిన కలాన్ని పరుల ప్రశంస చేసి నవభాగ్యములందుట (పాద్యము) కోసం వెచ్చించటం, మొహమాటం కోసమైనా చేయని ధీమంతులు!!
      అటువంటి పుట్టపర్తి, వయసుతో నిమిత్తం లేకుండా, తనను తననుగా గౌరవించి ఆదరించిన కొప్పరపు వారి సౌజన్య ఛత్ర ఛాయ, హఠాత్తుగా దూరమవటాన్ని తట్టుకోలేక పోయారు. సుబ్బయ్యగారి నిస్తేజమైన శరీరం చూస్తున్నకొద్దీ వారి కళ్ళలో కన్నీటి జలపాతాలే!!
      ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సతీర్థునిగా, అనాథ శరణాలయ సేవాసదన పాఠశాలల స్థాపకునిగా, సర్వ మత సమ భావ తత్పరునిగా, గ్రంధాలయోద్యమ కృషీవలునిగా, నిస్వార్థ సేవా రతునిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన కొప్పరపు వారు, యీ విధంగా కన్ను మూయటం అందరికీ దుస్సహంగా ఉంది.
     వారి పార్థివ దేహం వద్ద నిల్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అందరూ, వారితో తమ తమ ఆత్మీయతానుభవాలు పలవరిస్తూనే పలవిస్తున్నారు. 
   పుట్టపర్తి కలం కూడా సుబ్బయ్యగారికి అశ్రునివాళిని సమర్పించింది.
             ఆంధ్రదేశంబు నందెందు నతనిజేతి
            దయను బంచికోనట్టి యుద్యమమె లేదు,
            అతని సాహాయ్యమున బట్టెడన్నము దిని 
            కనులు మూసి మ్రొక్కని బిచ్చగాడు లేదు!!
కవులను ఆదరించినాడు. బీదలకు జీవన మార్గాన్ని చూపినాడు. పoడితులకు కానుకలు పంపినాడు. ఆతడు యీ ఆంధ్ర దేశంలో చేయని పని ఇంక ఏమున్నది?? మొలక నవ్వులు చిలికించనిదే మాటాడడు. ప్రతి చేత లోనూ, ఆతలి వారి శుభ కామనే!! దైవగుణముతోనే ప్రతి కార్యాన్నీ చేపట్టే కొప్పరపు సుబ్బయ్యగారు యీ విధంగా మమ్ములనొదిలి వెళ్ళిపోవటం, భావ్యమే కాదు. ఇప్పుడింక ఇక్కడన్నీ చీకటి గుడులే!!
       ‘పరమ కరుణ్య మూర్తి సుబ్బయ్యగారి
        కరుణకెల్లయు నేరుబందరము లేదు.’
హిందూ, ముస్లిం భేద భావములేమాత్రమూ లేకుండా, తల్లి వలె ప్రేమతోనూ, తండ్రి వలె క్షేమ కాంక్ష తోనూ తనవారిని చేసుకున్న సుబ్బయ్యగారి హృదయమంతా తీపేనట!!
    బ్రాహ్మణులన్న గురువులే వారికి!! తన్ను నిందిస్తున్నారంటే, నవ్వు మొగముతో తల ద్రిప్పికొనుచు వెడలిపోవుటే వారి యలవాటు!! తన్ను కీర్తిస్తున్నారంటే, ఆ సభ నుంచీ మెల్లిగా జారుకొని వెళ్ళిపోవటం వారి రివాజు!! పొగడ్తలు గిట్టని వ్యక్తిత్వం మరి!! తనను విమర్శించేవారి వద్ద కూర్చుని మరీ వినటం వారి నైజం.
        సుబ్బయ్యగారి సుగుణాలలో మరొకటి, గాంధీ వలెనే వారు, నాగరికతకు ప్రథమ చిహ్నమైన కాఫీకి ప్రియుడు కాకపోవటం కూడా!! ఋష్యాశ్రమములలోని శాంతి ఆతని వదనమండలంలో తాండవించేది. సంకుచిత భావజాలమంటే అస్సలు పడనివాడాతడు!! 
  తానింతవరకూ ఎదుర్కొన్న అవహేళనల ఘాత దెలిసినవాడైనందున పుట్టపర్తి యీ మాటకూడా అన్నారు.
         ‘ఎదుటివాని గుణంబు గ్రహించు నడత,
         చిప్పికొననేల, రాయలసీమ లేదు 
         కొండ బోలిన నరునైన గొంతుబట్టి, 
        మహిని బడదన్ని నవ్వుటే మాకు బ్రియము!’
ఎదుటివానిలోని సుగుణాన్ని గుర్తించి మెచ్చే గుణం రాయలసీమలో లేదని ఘంటాపథంగా చెబుతూ, సీమ వాసులు యీ లోపంతో ఆదరించని గొప్పవారిని గుర్తు చేశారు పుట్టపర్తి. మహా భాగవత కర్త పోతన్న మొదలు శ్రీయుత వావిలికొలను, హరి సర్వోత్తమ రావు, కల్లూరి సుబ్బారావు, బళ్ళారి రాఘవ, రాళ్ళపల్లి, జనమంచి – ఇలా ఎందరినో నోరారా కీర్తింపని గుణాన్ని తూర్పారబట్టారు పుట్టపర్తి యీ నివాళిలో!!
        సుబ్బయ్యగారిని కూడా విమర్శించేవారికి చెంప పెట్టుగా కొన్ని పద్యాల తరువాత, 
   ఆత్మకును పూర్వాసనలావరించి
   యుండుటే తథ్యమగునేని యొక్కసారి,
   యైన గారుణ్య వారధి యతడు హృదయ
   మిలకు వంచుచు మనల వీక్షించు గాత!! 
   పరమ కారుణ్య ఋషుల నివాసమైన
   లోకములనాతడందెడు గాక!! శాంతి
   రాయలేలిన సీమలో బ్రదుకు వారు
   బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!!
ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి సందేశం కాగా, యీ శతకాన్ని, కొప్పరపు సుబ్బయ్యగారి అభిమానులు, వెంటనే ముద్రించటం కూడా జరిగింది. 
   పుట్టపర్తి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పడింది. 

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.