స్త్రీవాదంలోని  కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం15

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పని చేశారు. ఆంగ్లంలో ఎం.ఎ. చేసి, 1980 నుంచి 1996 వరకూ విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాకులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత విజయవాడలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. గోరా శాస్త్రి, పి. శ్రీదేవి  సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్ర పత్రికలో తొలి కథ రాశారు. “సత్యవతి కథలు”, “ఇల్లలకగానే….” “మంత్ర నగరి”, మెలకువ” అనే నాలుగు కథాసంపుటాలు, “అన్నపూర్ణ”, “గొడుగు”, “మర్రినీడ”, “పద్మహ్యూహం”, “ఆతప్పు నీది కాదుఅనే నవలలూ రాగం భూపాలం” అనే వ్యాస సంపుటి వెలువరించారు. సత్యవతి కథలు పలు సంకలనాలలో చోటుచేసుకున్నాయి, ఇతర భాషల్లోకి అనువాదమైనాయి. నవలా రచయిత్రి, కథకురాలు, వ్యాసకర్త, కాలమిస్ట్ గా సత్యవతిగారి స్థానం తెలుగు సాహిత్యాకాశంలో చిరస్మరణీయం. 

1980ల తరువాత స్త్రీవాద భావాలతో రంగం మీదకు వచ్చిన రచయిత్రులు సునాయాసంగా కాల్పనిక సాహిత్య రచనకు పూనుకోగలిగారు. అయితే 80ల తరువాత మారిన నేపథ్యంలో, కొత్తగా రూపుదిద్దుకొన్న సామాజిక సందర్భాలలో కథారూపం క్రమంగా పెరగడంతో చాలామంది స్త్రీలు కథవైపు మొగ్గు చూపారు. అచిరకాలంలోనే తెలుగు సమాజంలోకి దూసుకు వచ్చిన స్త్రీవాదం అన్ని సాహిత్య రూపాల మీద పట్టు సాధించాల్సిన అవసరాన్ని గుర్తుచేసిన నేపథ్యంలో, స్త్రీలు అన్ని రూపాలలో రచనలు చేశారు. కథా రచన అనేది స్త్రీల చేతుల్లో ఒక గొప్ప సాధనంగా వెలువడింది. కానీ కొద్దిమంది రచయిత్రులు తమ భావ ప్రచారానికి సాధనంగా చేసుకున్నారు. కాని పి. సత్యవతి అటువంటి ప్రయత్నం లేశమాత్రం కూడా చేయలేదని ఆమె కథలే నిరూపిస్తాయి. 

సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకుని, తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆదారిలో తనకెదురైన అనుభవా లను పాఠకులతో సంభాషిస్తున్నారు. పితృస్వామ్య సమాజంలో మహిళల మీద బలవంతంగా రుద్దిన పీడనకు, అపచారాలకు, అవమానాలకు అంతేలేదు. ఈముప్పేట దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను చర్చకు పెట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఆ బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో తలకెత్తుకున్న స్త్రీవాద రచయితలలో పి. సత్యవతి ముందువరుసలో నిలుస్తారు. 

పి. సత్యవతి వస్తు శిల్పాల సమన్వయాన్ని సాధించడం  స్త్రీవాద కథకు గౌరవాన్ని అందించిన స్త్రీవాద రచయిత. ఈమె సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు ఈమె కథలలో చేసిన స్త్రీస్వేచ్చకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్దిష్టమైనవే కాదు నిరాకరించలేనివి కూడా. సాహిత్య ప్రపంచంలో సత్యవతి కథాసాహిత్యంపై గానీ, రచనావ్యక్తిత్వం పైనగానీ ఒక్క వివాదాస్పద వ్యాఖ్య కనిపించకపోవడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 

ఇప్పటికే అసంఖ్యాకంగా కథలు రాసిన సత్యవతి  స్త్రీవాద ఉద్యమం మొదలైన తరువాత రాసిన రచనల్లోని స్త్రీవాద సిద్ధాంత సాధికారతను సాథించిన కథలు ముఖ్యంగా స్త్రీ స్వేచ్చను  కేంద్రంగా చేసుకొని కుటుంబంలో స్త్రీలు కోల్పోతున్న స్పేస్ ను, ఇంటిచాకిరిని చాలా స్పష్టంగా భోదపరిచిన  కథలు ”ఇల్లలకగానే….,’ ’సూపర్ మామ్ సిండ్రోమ్’, తెలుగుకథా సాహిత్యానికి చేసిన దోహదాన్ని చర్చించటం, ఆ కథలలో ప్రతిపాదించిన కొత్త విలువలను ప్రస్తావించటం ఈ రచనకున్న లక్ష్యాలలో ఒకటి.

జీవితంలో బాహాటంగా కనిపించే హింసను స్త్రీవాదం రాకముందు చాలామంది చిత్రించారు. కానీ హింసా రూపాలు మారాయి. కనిపించని హింస అనేకరూపాల్లో పెరిగింది. మగవాళ్ళ అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆడవాళ్ళ బతుకును నిర్దేశించడంలో ఉండే హింస యావజ్జీవ శిక్ష లాంటిది.  జీవితంలో స్త్రీకి తనకంటూ సొంతం ఏదీ ఉండదు. పుట్టినప్పట్నించి తండ్రి, అన్న, భర్త, కొడుకు అనే మగవాళ్ళు అనేకరకాలుగా ఆమెను శాసిస్తారు. ఇదంతా ప్రేమపూర్వకంగానే జరుగుతున్నట్టు కనిపించే నియంత్రణ. తాము నిర్దేశించిన మూసల్లోనే ఆడవాళ్ళు ఒదిగి జీవించాలనే దృక్పథంతో మగవాళ్ళు వ్యవహరించే పద్ధతి. దీనితో స్త్రీ తనది కాని జీవితాన్ని గడపాల్సి వస్తుంది. తనకు నచ్చని పాత్రల్ని పోషించాల్సి వస్తుందన్నవాస్తవాల్ని “గోవు” “ గాంధారి రాగం” “ గణితం” కథల్లో చెప్పారు. ఈ అంశాలనే కొంత ఎక్స్ టన్షన్ తో మరికొన్ని కథల్లో కూడా చిత్రించారు.

కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థల పై ధిక్కారం స్త్రీవాద కథల్లో కనిపించే ప్రధానాంశం. ఈ వాదానికి ముందు వచ్చిన కథలకీ, తర్వాత వచ్చిన కథలకీ అంతరం కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థల ప్రజాస్వామికీకరణ జరగాలన్న అవగాహన అంతకు ముందు వచ్చిన కథల్లో వ్యక్తమయ్యేది. ఏదో విధంగా ఈ రెండు వ్యవస్థల్లో సర్దుబాటుతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవడం అవసరమన్న అవగాహనను రచయితలు అందించేవారు. వీటిలో ఉండే లోపాల్ని అధిగమిస్తే మనుషుల జీవితాలు చక్కబడతాయన్న దృక్పథాన్ని అందించేవి. కానీ ఈ అవగాహనకు వున్న పరిమితిని సత్యవతి తేల్చి చెప్పారు. ఈ రెండు వ్యవస్థలకు ఆవల సాంతంగా జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం సత్యవతి కథల్లోని స్త్రీ పాత్రలు చేయవు. పెళ్ళిలో ఉండే ఊపిరాడనివ్వనితనాన్ని “సప్తవర్ణ సమ్మిశ్రితం”లోని మామ్మ, “మాఘసూర్యకాంతి” లోని తల్లీ కూతురు, “గణితం” లోని తులసి, “భద్రత” లోని కథకురాలు ఇలా  చాలా పాత్రలు గుర్తిస్తాయి. అందుకే “మాఘసూర్యకాంతి” కథలో  భర్త నిర్ణయాలను  భార్యగా ఏస్థాయిలోకానీ ఎదుర్కోలేని తల్లి తనకూతుర్ని యాతన పెడుతున్న వైవాహిక సంబంధాన్ని తిరస్కరించే  విషయంలో చొరవచేసి విజయం సాధించగలుగుతుంది.

వివాహం, కుటుంబం అనే వలయాల్లో నిస్సారంగా కొట్టుకులాడుతున్న వాస్తవాల్ని చాలా కథల్లో సత్యవతి చిత్రించారు. అయితే ఈ రెండు వ్యవస్థలకి ప్రత్యామ్నాయం ఏమిటని చాలామంది ప్రశ్నిస్తారు..కానీ జీవితాచరణ క్రమంలో ప్రత్యామ్నాయం ఏర్పడుతుందే కానీ ముందే సిద్ధాంతాలు చేసుకొని కూర్చోవడం వల్ల సాధ్యం కాదని ఈమె కథలు ఎరుకపరుస్తాయి.

అంతేకాదు వివాహన్యవస్థలోని అససమానతల్ని, ఆపనవ్యతల్ని ఎత్తిచూపుతాయి. స్త్రీల రక్షణకు పెళ్ళి మార్గమనే వాదనల్ని ధిక్కరిస్తాయి. పెళ్ళిలో ఉండే ఊపిరాడనివ్వనితనాన్ని గుర్తింపజేస్తాయి. స్త్రీవాద భావనలు విస్తరించక ముందు స్త్రీలు రాసిన కథలు కూడా స్త్రీల చైతన్యానికి దోహదం చేశాయి. అప్పటివరకు స్త్రీల జీవితంలోని భిన్న కోణాల్ని ఇతివృత్తంగా తీసుకుని రాశారు. అందరి దృక్పథం ఒక్కటే కాదు. కానీ తమదైన అనుభవ దృష్టికోణం నుంచి కథారచనకు శ్రీకారం చుట్టారు. బహిష్టు, మాతృత్వం, వివాహం, విడాకులు మొదలైన అంశాల గురించి వీరు చిత్రించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న తీరును తమ కథల్లో చూపారు. కుటుంబంలో, సమాజంలో ఆడవాళ్ళ అణచివేతకు గల మూలాల్ని ఒక్కొక్కరు ఒక్కో తీరున అర్థం చేసుకున్నారు. అణచివేత ఉందన్నది నిజం. కానీ మూలాలు ఎక్కడపరిష్కారాలేమిటిఅన్న విషయంలో అంతరాలు కనిపిస్తాయి. ఇది ఆయా రచయిత్రుల అవగాహనా పరిమితుల ఫలితం. అప్పటివరకు ఎవరూ స్పృశించని జీవితకోణాల్ని తమ కథల్లో సత్యవతి  చిత్రించినందున వాటికి ఉన్న ప్రత్యేకతను గమనించాలి. 

స్త్రీలు ఉద్యోగాలు చేయడం, కుటుంబ చట్రంలోనే వ్యక్తిత్వంతో వ్యవహరించడానికి పెనుగులాడటం, ఎమోషనల్ ఎక్స్ ప్లాయిటేషన్ ను వ్యతిరేకించడం, ఆత్మాభిమానంతో ముందుకుపోవడానికి చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి. స్త్రీవాద దృష్టితో ఆడవాళ్ళ జీవితంలోని విభిన్న కోణాల్ని చిత్రించిన కథలు ఎవరికోసమో తమ జీవన పరిధిని కుదించుకోవాల్సిన పనిలేని సమాజ నిర్దేశిత చట్రాల్లో కూరుకుపోయి జీవితానందాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఈమె కథలు చెబుతాయి. తమ ఇష్టాలను మన్నించలేని సంబంధాల నుంచి పక్కకు తొలగడానికి గుంజాటన పడుతూనే తాము కోల్పోతున్న స్పేస్ ను,  స్పృహను అందిస్తాయి. తమదైన పద్దు జీవితానికి అలుపెరుగని సైనికుల్లా  బతుకు సమరపు కౌటుంబిక  చట్రాల్లోనే కూరుకుపోతుంటాయి. “గోవు” కథలోని గోమతి, “భార వాహిక”లోని దుర్గలాంటి పాత్రలు నిరక్షర, శ్రామిక పాత్రలు అతి అరుదుగా తిరగబడుతుంటాయి. చదువుకొని, వుద్యోగం చేస్తున్న పాత్రలు కూడా కుటుంబ చట్రం నుండి విడివడడానికి ఇష్టపడవు.

అనూరాధ పెళ్ళయిన కొత్తలో చెస్ ఆడి గెలిచిన మెదడు. బ్యాంక్ టెస్ట్ లోమంచి ర్యాంక్ తెచ్చుకున్న మెదడు. పాచిపట్టి పోవడానికిగల కారణాలుగా పితృస్వామిక భారతీయ సమాజం మాతృత్వాన్ని, ఇంటిచాకిరిని ఉదాత్తీకరిస్తూ తనను తాను పూర్తిగా త్యాగం చేసుకోవడమే ఆమె జీవనసాఫల్యం అన్నకునేట్లుగా బిరుదులు, ఇమేజ్ లలో కూరుకుపోతున్న పర్యవసానాన్ని“సూపర్ మామ్ సిండ్రోమ్” కథలోని అనూరాధ స్నేహితుడు ప్రకాశరావు గుర్తించారు. అందుకే  అమె కూతురు రజనీతో మీ ఇంట్లో సింకులూ – బాత్రూంలూ తళతళా మిలమిలా మెరిసేలా కడిగేది కదా! ఆ పాచంతా వాటిల్లోంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది” అని చెప్పడంలోని వ్యవస్థీకృతమైన పితృస్వామ్య భావజాల ప్రభావం స్త్రీలను ఎంతగా ప్రభావితం చేస్తుందో కూడా ఈకథలో తెలుస్తుంది.

సమాజం దృష్టిలో తెలివి సమర్ధతా అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తళతళ లాడేలా వుంచుకోవడం, తగినంత డబ్బు దాచుకోవడం, కష్టపడి పని చెయ్యడం, పిల్లల్ని గొప్పవాళ్లని చెయ్యడం ఇవే స్త్రీల తెలివికి తార్కాణాలు. వాళ్ళ దృష్టిలో గొప్పవాళ్ళని చెయ్యడం అంటే డాక్టర్లో, ఇంజనీర్లనో చేయడం, కుదరకపోతే అమెరికాలో వుండే అబ్బాయికిచ్చి పెళ్ళి చేసి పంవడం – ఇదే ప్రాతినిధ్య స్త్రీల జీవిత ధ్యేయం. అలాచేయడానికి ప్రతీ క్షణం శ్రమించడంలో పితృస్వామిక (స్టీరియో టైప్) మూస పాత్రల్ని నిర్వహించడానికి స్త్రీ  పడుతున్న శ్రమను రొమాంటిసైజ్ చేస్తున్న భావజాలాన్ని సత్యవతి గుర్తించగలి గారు. 

 ’అమ్మయ్య ఇక నేను  మగవాళ్ళలా నెలకి ముప్పైరోజులు పనిచేస్తాను” అని  నెలసరి పోస్ట్ పోన్ మెంట్ పిల్స్ తిని తమ పనిసామర్థ్యానికి సంతోషించిన స్త్రీల నిరంతర శక్తి, గుర్తింపుకు నోచుకోని ఇంటి చాకిరిని ఈకథలో సత్యవతి సమస్యాత్మకం చేసింది. అనూరాధ లాంటి స్త్రీల దారిలో నడవాలనుకున్న ప్రతి ఉద్యోగిని అనుభవిస్తున్న ఒత్తిడే ఈకథాంశం. స్త్రీలు దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ సంతోషాల్నే కాదు ప్రాణాల్ని సైతం కోల్పోవాల్సి రావడంలోనే విషాదం. జండర్ అవగాహనలేని అమాయకపు స్త్రీలందరికీ చేసిన ఒక హెచ్చరిక ఈకథ. 

“అమ్మని పట్టించుకునే టైం నీకెక్కడిదీ” అన్న ప్రకాశరావు మాటలతో, “సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడినదల్లా గబగబ ఇంట్లోకి పరిగెత్తింది. ఆ పిల్ల వాళ్ళమ్మను కౌగిలించుకుని భోరుమని ఏడవాలనిపించింది. ఆవిణ్ణి రక్షించుకోవాలనిపించింది”. అన్న వాక్యాలతో పాఠక సమ్మితంగా కథ ముగుస్తుంది.  సత్యవతి కథాలక్ష్యం ఇదే. 

ఆడవాళ్ళ జీవితాల్ని పిల్లల పెంపకం గృహ నిర్వహణ బాధ్యతల్లో ’ఆదర్శ గృహిణి’, ’ప్రౌడ్ మదర్’ లాంటి గౌరవప్రద భావనలు (ఫాల్స్ మొటివ్స్)   స్త్రీల శక్తిని, ఆరోగ్యాన్ని ఎంతగా  కబలిస్తాయో అనురాధ పాచిపట్టిన మెదడే నిదర్శనం. బాత్ రూంలో సింక్ లు, అంట్లుగిన్నెలు, మురికిబట్టలు, దుమ్ముకొట్టుకపోయిన నేలలు, బూజుపట్టిపోయిన ఇల్లు ఇలా సమస్త ప్రక్షాళనల్లోనుంచి శుభ్రతా కార్యక్రమాలు స్త్రీల శరీరాలను మెదళ్ళను ధ్వంసం చేస్తాయి. ప్రతీకాత్మకంగా సాగిన కథనంతో ఈ కథలో సాధారణ స్త్రీలందరూ ఐడెంటిఫై అవుతారు. ఇంటి చాకిరి విషయంలో శ్రమ బదలాయింపు ఈకథ పరోక్షంగా డిమాండ్ చేస్తుంది.

కుటుంబ పరిధి దాటి తమ జీవిత సాఫల్యాలను నిర్మించుకోవడానికి అటునుంచి ఊహించడానికి కూడా అనుమతించని పితృసామ్య నియంత్రిత రూపాల వికృతత్వం స్త్రీలు తమకు తాముగా సూపర్ లేడి సిండ్రోమ్ లుగా మార్చివేయబడుతున్న క్రమాన్ని గుర్తుపట్టి సెటేరికల్ గా  రాసిన కథ.  సుశీల, రజినీల ప్రవర్తనలో వచ్చిన మార్పుగా కథ ముగించడంలో ఈ కథ సాధించిన ప్రయోజనం వ్యక్తమవుతుంది. సాధారణంగా ముగింపు వాక్యము (కన్ క్లూజన్ స్టేట్ మెంట్) గా ఇవ్వడం వల్ల కథా ప్రయోజనం, పరిధి సన్నగిల్లే అవకాశం వుంది. కానీ ఈ కథ మాత్రం  భర్తలు, కూతుర్లు అనురాధలాంటి అమ్మలు  ఏ విధంగా బ్రతుకుతున్నారో పట్టించుకోని పిల్లల కెరీర్ వ్యామోహం పట్ల వేసిన చురక. కాదు..కాదు.. కొరకంచువాత అన్నా తప్పేమిలేదు.

ఆధునిక సమాజ క్రమ పరిణామంలో కొత్త, కొత్త ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఆలాంటి వాటిలో వృద్ధాప్యంలో చూసుకోవడానికి కేర్ టేకర్ పని కూడా ఒకటి. పొలాల్లో కూలిపనులు చేసే స్వర్ణ తనకంటే యాభై, అరవై ఏళ్ళ ముసలమ్మను చూసుకోవడంలో పడిన వేదన ముసలమ్మ ధీన స్థితి కంటే తక్కువగా చిత్రించ బడింది. అందులోని సాధక బాదకాలను రచయిత్రి చిత్రించారు కానీ ఒకరి వేదన మరొకరి వేదనను కమ్మేయడం కొంత అసంతృప్తికి  గురిచేసింది. ముసలమ్మ జీవితంలో విరిసిన రంగు రంగుల చీరల అబ్ సెషన్ సప్తవర్ణ సమ్మిశ్రితమైతే, ఇంద్రధనుస్సు లాంటి అమాయకపు స్వర్ణ జీవితంలో సప్తవర్ణాలకు అవకాశం ఎక్కడుందీ? అన్ని వర్ణాలకు మూలమైన తెలుపురంగు మాత్రమే మిగిలింది ముసలమ్మ జీవితంలోనే కాదు స్వర్ణ జీవితంలో కూడా.

పాత్రచిత్రణలో కనిపించే లక్షణాలు  పురుష ద్వేషాన్ని పాఠకుల్లో అనుభూతి కాకుండా స్త్రీ పురుషుల మధ్య సమతౌల్యత, అవగాహన  పెంపొందాల్సిన అవసరాన్ని తన కథల్లో ప్రతిపాదించారు.

వర్తమాన సమాజంలో స్త్రీ జీవితం స్వేచ్ఛారాహిత్యంలో మొదలై స్వేచ్ఛా రాహిత్యంలోనే అంతమౌతుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా స్త్రీకి స్వేచ్ఛ నిచ్చే క్రమంలో ఎదురయ్యే అపసవ్యతలను పి. సత్యవతి చర్చించారు. స్వేచ్ఛ అనేది మౌలికమైన విలువగా సత్యవతి కథల్లోని ప్రధాన ప్రతిపాదన. ఈభావన పౌరులకు స్వేచ్ఛ వుండాలనే భావనను బలపరుస్తుంది. తమ అహానికి అధినాయకులుగా వుండే వ్యక్తులకు సహజంగానే స్వేచ్ఛవుంటుంది. ఇది స్త్రీ పురుషలిద్దరికీ వుండాలనే భావనలో నుంచే  సత్యవతి స్త్రీవాద దృష్టికోణం మొదలవుతుంది. సత్యవతి కథల్లో కనిపించే స్త్రీవాదాన్ని ప్రధాన స్రవంతి స్త్రీవాద స్వరూపంగా(mainstream feminism)అనిపిస్తుంది.  స్త్రీపురుషులిద్దరికీ రాజకీయంగా, చట్టపరంగా కూడా సమాన అవకాశాలు ఉండాలని, వారిమధ్య ప్రజాస్వామిక సంబంధాలు వుండాలని రచయిత్రి నమ్ముతుంది. కొంతమంది దృష్టిలో ఉదారవాద స్త్రీవాదంస్త్రీవాదానికి వైయక్తిక రూపం (individualist form). స్త్రీలు తమ తమ స్వేచ్చను తమ వ్యక్తిగత చర్యలు, ఎన్నిక ద్వారా చాటుకుంటూ వుంటారు. స్త్రీపురుషుల మధ్య ఏర్పడే వ్యక్తిగత సంబంధాలనుంచి క్రమంగా ఇద్దరి మధ్య సమానత్వ భావన ఏర్పడుతుంది. స్త్రీలందరూ కూడా సమానత్వ హోదా పొందేందుకు సామర్థ్యం కలవారేస్త్రీ పురుష నిర్మితుల మధ్య సమానత్వాన్ని సాధించేందుకు సామాజిక నిర్మాణాలలో మార్పురావాలనేది రచయిత్రి ఆకాంక్ష. సాధారణంగా కనిపించే స్త్రీ విద్య, స్త్రీలుగా గుర్తింపు, ఇంట్లో బయట ఎదురయ్యే వేధింపులు,  జండర్ అసమతౌల్య వాతావరణం లాంటి దైనందిన సమస్యల పరిష్కారాల కోసం పనిచేయాల్సిన అవసరాన్ని కల్పిస్తాయి సత్యవతి కథలు .

వ్యక్తి స్వేచ్ఛ అంటే స్త్రీపురుషులిద్దరి స్వేచ్ఛఈ స్వేచ్ఛ కోసం పరితపించటం అనేది ఒకానొక పరిమిత రంగానికి చెందిన అంశంకాదు. స్త్రీని ఈస్వేచ్ఛ అంతరంగికలైంగిక, పునరుత్పత్తి లాంటి అన్ని రంగాలలో అత్యవసరం. లైంగిక స్వయం ప్రతిపత్తి కూడా ఇందులో భాగమే, భావవ్యక్తీకరణ (freedom expression) సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పునరుత్పత్తి స్వేచ్ఛతో పాటు అన్నిరకాలుగా స్త్రీ స్వేచ్ఛ అంతర్థానాంశాలే. వాటిని నిరాకరించటమంటే, స్త్రీస్వేచ్ఛను నిరాకరించటమేస్త్రీని పురుషుడి నుంచి వేరుచేసి చూడటమే, ఇంకా చెప్పాలంటే తక్కువగా పరిగణించటమే. అలాగే చట్టం దృష్టి కూడా స్త్రీ పురుషులపట్ల సమానంగా వుండటం, రాజ్యం పితృస్వామిక స్వభావాన్ని సంతరించుకోవటం, సాంస్కృతికంగా స్త్రీని తక్కువ చేసిచూడటం కూడా స్త్రీకి స్వేచ్ఛ నిరాకరించటంలో భాగాలే. నిజానికి స్త్రీవాదాన్ని – నిర్వచించడంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఆ ఇబ్బందులు (స్త్రీవాదానికి సంబంధించినవి కాక అసలు ఉదారవాదంలోనే ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అయితే స్థూలంగా ఉదారవాదం వ్యక్తివాదం, న్యాయం సమానత్వాల గురించి అధికరణ. రాజ్యమనేది ప్రజలు దానితో సంభాషించడానికి అనువుగా ఉండే వ్యవస్థ అనేటువంటి అంశాలు స్త్రీవాద చైతన్యంలో అంతర్లీనంగా ఉంటాయి. ఉదారవాదులకు రాజ్యం యొక్క మౌలిక కర్తవ్యం వ్యక్తిని ఇతరుల జోక్యం నుంచి రక్షించటం. స్వేచ్ఛ సమానత్వం లాంటి అంశాలను వినిమయం చేసుకోవడంలో వ్యక్తికి సహకరించటం, ఆ క్రమంలో రాజ్యం అండగా ఉండటం మొదలైన విధులను గురించి నిర్దిష్టమైన ప్రతిపాదన ఉదారవాదం చేస్తుంది. స్థూలంగా ఈఉదారవాద భావాలను ఆమోదిస్తూనే వాటితోపాటు స్త్రీల హక్కుల గురించి ముఖ్యంగా ఒక వ్యక్తిగా స్త్రీకి ఉండే హక్కుల గురించి, స్త్రీని సమానంగా చూడాల్సిన బాధ్యత గురించి, అంతిమంగా స్త్రీ ఒక స్వతంత్ర ప్రతిపత్తిలో ఉండగలిగే వాతావరణాన్ని కల్పించే వ్యవస్థ రూపకల్పనే సత్యవతి కథల లక్ష్యంగా వుంటుంది. ఈ క్రమంలోనే సామాజిక రంగంలో స్త్రీ స్వేచ్ఛాయుత ప్రవర్తనకు అడ్డంకిగా ఉండే అసమానత్వ రూపాన్ని, పితృస్వామ్యం నిర్మించిన కృత్రిమ గోడలను నిరాకరిస్తూ సత్యవతి తన కథల ద్వారా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తుంది. 

సామాజిక నియంత్రణను, నియమితులను నిరాకరిస్తూ స్త్రీ స్వేచ్ఛను అమలు చేసే లక్ష్యంతో కూడా స్త్రీవాదం పనిచేస్తుంది. సమాజంలో స్త్రీస్వేచ్ఛాయుత జీవితానికి అడ్డంకులుగా నిలిచిన సాంప్రదాయాలు, కట్టుబాట్లు లాంటి వాటిని ధిక్కరిస్తూ పురుషులతో సమానంగా ఏవివక్షలు లేని భావప్ర పంచాన్ని స్త్రీవాదులు కాంక్షించినట్లుగానే సత్యవతి “నేనొస్తున్నాను” కథ రాశారు. యంత్రికజీవన విధానంవల్ల కోల్పోతున్న ప్రాకృతిక అందాలు, ఆనందాలు ఆస్వాదించలేక పోతున్నారన్న అనంతమైన ఆలోచనలకు ఈకథ ప్రాతినిధ్యం వహిస్తుంది. 

ఒక ప్రతీకని కేంద్రం చేసుకుని మిగతా ప్రతీకల్ని ఒకదాని తరువాత వేరొకటి ప్రయోగిస్తూ పోవటంనల్ల కథలో సాంధ్రతా లక్షణం పెరుగుతుంది. అందువల్లే సత్యవతి “మంత్రనగరి” కథలో ’మేకు’ (ప్రతీక) కేంద్రంగా చేసుకొని కథ నడుస్తుంది. ఈ తరహా రచనలో వేరొక ఉపయోగం పుంది. రచయిత్రి మానసిక ప్రపంచంలో వున్న స్థిరరూపాలను కథలో చదవటం ద్వారా రచయితకే పరిమితమయిన రూపాలు నిరంతరం రూససంబంధ విస్తృతిని నియంత్రిస్తూ వుంటాయి. ఈ నియంత్రణనుంచి బయటపడడం ఈతరహా కథరచనలోనే సాధ్యపడుతుంది. బాల్యం నుంచి స్త్రీల జీవితం నియంత్రణా చట్రాలలోనే కుదింపబడి వుండటంవల్ల కృష్ణవేణి, ఝాన్సీల మెడమీద పితృస్వామ్య  తక్షణ ప్రతినిథులైన భర్తలు దిగగొట్టిన మేకులతోనే జీవితం కొనసాగిస్తారు. కానీ నవతరం ప్రతినిధి ఝాన్సీ మాత్రం తన తలలో ఆమె భర్త గిరీశం మేకు దించడానికి ప్రయత్నించిన ప్రతిసారీ మేకుకు అందకుండా, పొందకుండా  ధిక్కరిస్తూనే వుంటుంది. తనతల్లి మెడలో దిగబడిన  మేకును కూడా తీయించేస్తుంది. పురుషాధిక్యతను శిరోధార్యంగా భావించాల్సిన అవసరం తన కూతురు గీతకు రాదని కృష్ణవేణి సంతోష పడుతుంది. ఈతరహా కథా రూపానికి మెటఫర్లు ఉపకరిస్తాయి. ఉదాహరణకు, మేకు ఒకటే కాదు.’మెరిసే నీలి కళ్ళవాడు’, ’మంత్రనగరి’ ఇలా ఒక పరంపరంగా వచ్చే ప్రతీకలు దేనికదే ఒకదానితో మరోటి సంఘర్షించి రెండవదిగా రూపొందుతూ వుంటుంది. ఇవన్నీ మెటఫర్లు కావటం వల్ల కథాసంక్షిప్తతకు కూడా ఇవి తోడ్పడుతూ వుంటాయి. మెటఫర్ మీద పట్టులేని రచయిత తన సాహిత్యంలో శుద్ధ వచన సంప్రదాయాన్ని మాత్రమే పాఠకులకు అందించగలరు. సత్యవతి మెటఫర్ల ద్వారా స్త్రీలు చదువుకోసం, ఉద్యోగిగా తన కాళ్ళమీద తాను నిలబడడంకోసం, స్వేచ్చకోసం, జీవితేచ్చకోసం పరితపించిన స్త్రీలు పెట్టుబడి మాయాజాలంలో మార్కెట్ విసిరిన విషసంస్కృతి నిర్మించిన మంత్రనగర నిర్మాణాల ప్రవేశ పరిణామాలను  ఈకథలో ప్రతీకాత్మకంగా తీర్చిదిద్దారు. ఈకథా ప్రయోజనాన్ని అంచనావేసే పరికరాలను తెలుగు స్త్రీవాద విమర్శకులు ఇంకా సమకూర్చుకోవలసే వుందనిపిస్తుంది. 

స్త్రీకి పెళ్ళితర్వాత సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కుకోసం జరిగిన ఉద్యమాన్నినేపథ్యంలోనుంచి స్త్రీపాత్రల అంతర్మధనాన్ని చిత్రించారు. స్త్రీవాదంలో చాలా కీలకంగా గుర్తించబడిన స్త్రీపురుషుల సమానత్వాన్ని ఆకాంక్షిస్తూ స్త్రీకి నిరాకరించబడుతున్న హక్కులను, పోరాటాలను గురించి ఈమె కథలు ప్రస్తావించాయి. ఈస్పృహ లైంగికంగా స్త్రీపురుషులు వేరుగావున్నప్పటికి స్వాభావికంగా ఉన్న ఒకానొక ఏకత్వం వలన ఇద్దరిని ఏ సమాజ క్షేత్రంలోనైనా తక్కువగా చూడటం అనేది సరికాదన్న నైతిక స్పృహ పాఠకులకు కలుగుతుంది. అలాగే ఈ రెండు బృందాల మధ్య వున్నది సంఘర్షణాత్మక సయోధ్యతే. అయితే ఈ సయోధ్యతలో స్త్రీపాత్ర పరిమితం చేయటంవలన పురుష సమమైన ప్రవృత్తి కలిగి ఉంది. అయితే ఆ ప్రవృత్తికి సంబంధించి పూర్తి వ్యక్తిత్వానికి ఆస్కారం లేని స్థితిని సత్యవతి ప్రశ్నించింది. క్రమంగా ఈ సందర్భంలో తలెత్తిన స్త్రీవాద తాత్విక సిద్ధాంతం. మానవులు మౌలికంగా హేతుబద్ద జీవులు. ఇద్దరిలోనూ, హేతువు సమంగా ఉందని వాళ్ళ మధ్య ఉన్న భౌతిక విభిన్నత సామాజిక సందర్భాలలో వివక్షకు గురిచేయడం సరికాదని “పతివ్రత” కథ నిరూపిస్తుంది. 

“ఆవిడ” కథలో ఆస్తితో ముడిపడిన స్త్రీపురుషసంబంధాలలో స్త్రీల ఔదార్యం, సంస్కారం సున్నితమైన మానవ సంబంధాలలో భాగంగా చిత్రించారు. ఆర్థికాంశాలకు ఆవల నిర్మితమైన సహజమైన మానవీయ సంబంధాల పార్శ్వం ఎంత బలమైనదో ఈకథలో సత్యవతి ఆవిష్కరించారు. మారుతున్న సామాజిక సంధర్బంలో వినూత్న వైవాహిక సంబంధాలలోకి వెళ్ళాల్సిన అనివార్యత ఇందులో  కథాంశమైతే, నివాసమున్న ఇల్లు చట్టరీత్యా పొందే హక్కు ఆమెకుంది. కానీ అతడు తన కూతురికి ఆఇల్లు చెందాలని, కేవలం ఆమె జీవికకు సరిపడే పెన్షన్ డబ్బు మాత్రమే ఆమెకు చెందుతుందనే అవగాహన ఒప్పందాన్నిరామారావు శేషుతో చేసుకుంటాడు. కానీ బంధు సమూహం మాత్రం ఆమె ఇల్లు తనపేర రాయించేసుకునే వుంటుందన్న ప్రిజుడీస్ లోనే వుంటారు. పితృస్వామిక భావజాలం స్త్రీల పట్ల స్త్రీ సమూహం పట్ల నిర్దారిత మూసపాత్రలకు భిన్నంగా అవలంభించాల్సిన మానవ సంబంధాల నిరూపణలకు నిదర్శనగా ఈపాత్రల రూపకల్పన జరిగింది.

రామారావు పదవీవిరమణ అనంతరం కూతురు, కొడుకు ఇళ్ళల్లో ఇమడలేని తనదైన జీవన శైలిని కోల్పోతున్న దశలో తన జీవితాన్ని తానే నిర్ణయించుకుంటాడు. నిజానికి శేషుకు జీవితాన్నివ్వడం కాదు. తన జీవితావసరానికి అనుగుణంగానే శేషు తోడు కోరుకుంటాడు. రామారావు కూతురు రోశ్నీ పాత్రచిత్రణలోని ఆత్మవిమర్శ, ఆమె భర్త దీపక్  చేసిన విశ్లేషణ ఈకథలోని కీలకాంశం. మనుషుల ప్రవర్తనా సరళిని నిర్దేశించే ఆర్థికాంశాల ప్రభావం నుండి ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ భ్రమలుగా తేలిపోయే విశ్లేషణాత్మక కథనాన్ని ఎక్కాడా సైద్ధాంతిక స్పర్శ కనిపించకుండా చాపకింద నీరులా ఏఆర్భాటాలూ లేకుండా అలవోకగా రాయగల శైలీశిల్పం సత్యవతి  సొంతం.

తాత్వికంగా చూసినపుడు సత్యవతి కథలు ఉదారవాద రాజకీయ ఆలోచన ధోరణి ప్రభావితం చేసిన J.S. Mill లాంటి తాత్వికుల ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత తలెత్తినా స్త్రీవాదంలో ఒకానొక జండర్ దృష్టి అమలయ్యిందని మితిమీరిన ప్రాముఖ్యత ఇవ్వటం వలన పిల్లల్నికనటం, పెంచటం లాంటి విషయాలు స్త్రీ పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడంలో పరిమితమైందని, తత్ఫలితంగా ఆమె స్త్రీల సమస్యలను హక్కుల వుద్యమంలో భాగంగా లేక పరిష్కారంగా చూడలేక పోయిందనే  విమర్శ కూడా సత్యవతి కథల పట్ల చేయటం జరిగింది. కానీ ఇందులో వాస్తవం లేదనిపిస్తుంది. ఒక్కో రచయితకు, రచనకు, దృక్పధానికి ఒక్కో క్రమంలో పరిమితి వుంటుందని విస్మరించడం వల్లనే ఇలాంటి వ్యాఖానాలు చేశారనిపిస్తుంది.  

స్వేచ్ఛ అనేది మౌలికమైన విలువగా వుండాలనే భావనను ఈమె కథలు బలపరుస్తాయి. తమ అహానికి అధినాయకులుగా వుండే వ్యక్తులకు సహజంగానే స్వేచ్ఛవుంటుంది. ఇది స్త్రీపురుషలిద్దరికీ వుంటుందనే భావనలో ఉదారవాద స్త్రీవాదం మొదలవుతుంది. స్త్రీవాద ప్రధాన స్రవంతి (mainstream feminism) స్త్రీపురుషులిద్దరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలని సత్యవతి నమ్ముతుంది. 

 స్త్రీలందరూ కూడా సమానత్వ హోదా పొందేందుకు సామర్థ్యం కలవారే, స్త్రీపురుష నిర్మితుల మధ్య సమానత్వాన్ని సాధించేందుకు సామాజిక నిర్మాణాలను మార్చేంత అవసరం ఏమీలేదు. వాళ్ళు ఎక్కువగా లైంగిక వేధింపులు, ఓటు హక్కు, స్త్రీ విద్య, వివక్షలేని స్నేహపూరిత  వాతావరణం లాంటి దైనందిన సమస్యల పరిష్కారాల కోసం పని చేస్తూ వుంటారు. 

వర్తమాన సమాజంలో స్త్రీలకు సంబంధించి గుర్తింపు అంటే కేవలం శరీర సంబంధమైన గుర్తింపుగా మాత్రమే వుంది. సమాజం మనిషంటే mind and body అనే విషయాన్ని స్త్రీలవిషయంలో గుర్తించటానికి నిరాకరిస్తూ, ఆమె కేవలం body సంబంధిత గుర్తింపును మాత్రమే ఇస్తుంది. సత్యవతి కథల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, విశేషమైన ఆదరణకు దారితీసిన కథ “ఇల్లలకగానే”. వామక్షీయుల నుంచి తీవ్రమైన| వ్యతిరేకతను ఎదుర్కొన్న స్త్రీవాద సాహిత్యం, సత్యవతి కథలను రెండోమాట లేకుండా అంగీకరించింది.

 ఈమె కథలు కాల్పనిక సాహిత్య రూపంలో కొన్ని కొత్త Propositions ని ముందుకు తెచ్చింది. స్త్రీకి స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండో సంపాదించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికిని అత్యవసరమైన విషయాలను మనం గుర్తించటమే స్వేచ్ఛ”.  అని “నేనొస్తున్నాను” అనే ఈకథ సోదాహరణంగా రుజువు చేసింది. స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన భావాలు సత్యవతి కంటే ముందే తెలుగు సాహిత్యంలో చాలామంది చెప్పినప్పటికీ వాటిల్లో మితిమీరిన కాల్పనికాంశం వుండటం వలన వాటిని సమాజం అంత సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ పరిగణించక తప్పని స్థితిలో తీసుకున్నపుడు చాలా తీవ్రంగా కొట్టి వేసింది. అయితే సత్యవతి చేసిన ప్రతిపాదనలను తెలుగు సమాజం కొంత సీరియస్ గా పరిగణించటమే కాకుండా వాటిని గురించి కొంత ఆలోచనాత్మకమైన చర్చనే పెట్టింది. ఈ చర్చలో ఆమె భావాలు నిలబడగలగటానికి వాటికున్న వాస్తవిక పునాదేనని చెప్పక తప్పదు. వాస్తవానికి సత్యవతి ఈ కథలో చేసిన ప్రతిపాదనల కన్నా ఆమె ఆలోచనలు అంత రాడికల్ ఆలోచనలేమీ కాదు. కానీ చలంలో వుండే romantic దృష్టి చాలా అరుదుగా అపురూపంగా సత్యవతి కథకుల్లో కనిపిస్తుంది. (యువతరం స్త్రీవాద రచయిత్రులు కుప్పిలి పద్మ, సింధుమాదురి, సామాన్య లాంటివారు మినహాయింపు.) ఆమె పాత్రలు ఊహాత్మకాలు కాదు. యదార్థ జీవితం నుండి రూపొందినవి. రోజువారీ జీవితంలో నిరంతరం అణచివేతను ఎదుర్కొంటూ అందులో రాటుదేలిన పాత్రలు, ఆ అణచివేతలో నుంచే అవి తమనుతాము చాలా శక్తివంతంగా assert చేసుకుంటాయి.

 “తాయిలం” కథలో ప్రతి మగవాడి వెనకా ఓ స్త్రీ వుంటుంది. ప్రతి స్త్రీ తనని తాను మర్చిపోడం వెనక తనని తాను పారేసుకోడం వెనక ఓ పురుషుడే కాదు పితృస్వామిక వ్యవస్థ మొత్తం ఉంటుందేమో అనిపించింది. స్త్రీల మనుగడను, అస్తిత్వాన్ని, అప్పటివరకు సమాజం ఉపేక్షించిన మహిళల జీవితంలోని బహుముఖ కోణాల్ని సత్యవతి కథలు రాయడం, స్త్రీవాద భావజాలం విష్తృతమయ్యే క్రమంలో సాధ్యమైంది.

వర్తమాన సమాజంలో జరుగుతున్న సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు సత్యవతి కథలు ప్రయత్నించాయి. అందుకే ప్రతికథా స్త్రీపురుషులిద్దరినీ (Inclusive Politics)కలుపుకు పోయే రాజకీయతను సాధించేందుకు ఆమెకు సహకరించిన శిల్పం కలగలపు కథనం అదే ఆమెకథల అంత:సూత్రం.

*****

Please follow and like us:

One thought on “కథాకాహళి- పి.సత్యవతి కథలు”

  1. సత్యవతి గారి ఇంటర్వ్యూ చూసాను. సూపర్ మామ్ సిండ్రోమ్ కథ ఇదివరకే చదివాను. ఆ శీర్షిక చదవగానే టాబ్లెట్ లు రాలుతున్న శవం కనిపించింది అంటే ఆ కథ మనసులో ఎంత గూడు కట్టుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యల మూలలను విశ్లేశించి వాటికి సరైన పరిష్కారాలు చూపి పాఠకులను ఆలోచింప చేసే అరుదైన రచయిత్రి లలో సత్యవతి గారు ఒకరు అని ఈ పరిచయం, ఇంటర్వ్యూ చూసాక బాగా అర్థం అయ్యింది. వీరి మిగిలిన కథలను వెతుక్కుని మరీ చదువుతాను. మీ వంటి రచయిత్రి పరిచయం కావటం నా అదృష్టంగా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published.