పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు

-నాగరాజు రామస్వామి

 పరామర్శ 

( Visit )

హాస్పిటల్.

కాళీమాత రక్తవర్ణ నోటిచొంగ లాంటి

ఎర్రెర్రని దుస్తుల్లో ఆయాలు.

క్రిక్కిరిసిన వరండాలలో కోలాహలం;

కడుగుతున్న బెడ్ పాన్ల గణగణలు,

ఓదార్పుల, దూషణల రణగొణలు,

అన్ని చికాకుల నడుమ

ఆమె గదిలో బట్టలు వేలాడుతుంటవి,

గృహకలతలు చెలరేగుతుంటవి,

పెళ్ళి ముచ్చట్లు కొనసాగుతుంటవి,

పరామర్శకులు పద్యాలు పాడుతుంటరు,

ఆమె ఓ వృద్ధవర్షీయసి,

ఆమె కోర్కెలు తెగిన పతంగులు,

తొంటి విరిగినా తీరని మరణేచ్ఛ;

వచ్చిన వాళ్ళందరు

రాని మృత్యువును కోరుకుంటరు,

అమెరికన్ యాసల మనుమలు

ఆమె పాదాలకు మొక్కుతుంటరు, 

ఆంటీలు లోనికీ బయటకూ వస్తూపోతుంటరు, 

వేట కుక్క వంటి ఇంటి డాక్టరు రీడింగులు తీస్తుంటడు.

మా నాన్న గారి మంచి మనసు 

అస్పష్ట అవగాహనను శంకిస్తుంటుంది.

                 నిర్గమనం 

                  (Departure)

ఆమె లేచి మంచంలో కూర్చుంది,

చర్మం బాధల ఉలిపిరి కాగితం,

జుట్టు కోమల తెలిపుష్ప దళం

పుడమి లోంచి పైకిలేస్తున్న లిల్లీలా.

ఆమె పాల కళ్ళలో పాలిపోయిన మాతృత్వం;

రాలనున్న పండుటాకుల్లాంటి చేతులతో హత్తుకుంది నన్ను

ఒక నవజాత శిశువును ఎత్తుకున్నట్టు.

ఏది ఆమె రక్తంలో పారాడుతుందో అదే నాలో;

నన్ను నేను దర్శించుకోగల అంతిమ కాంతి!

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.