సరోజినీ నాయుడు

-శర్వాణి

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు,
బెంగాలీయుల ఆడపడుచు, తెలుగు వారి కోడలు.స్వాతంత్ర్య సమరయోధురాలు,
కవయిత్రి. మార్చ్ 22 న ఆవిడవర్ధంతి సందర్భముగా ఆవిడ గురించిన విశేషాలను
తెలుసుకుందాము. 1879 వ సంవత్సరం పిబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్లో
జన్మించారు.తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి.
అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (అనగా నేటి నిజాం కాలేజీ)
మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడి గా పనిచేసారు తల్లి వరదాదేవి చక్కని
రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు
వ్రాయడం జరిగింది.పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని
నిరూపించిన మహిళలలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు.
తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం,
బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు
ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయంలో డాక్టరు పట్టాను
పొందటం జరిగింది శ్రీమతి సరోజినీ నాయుడు సద్ వంశంలో జన్మించటం వలనా,
తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా,
పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా
ఎవరి మాటలు విన్నా పట్టించు కోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది.
కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి ఏది,
ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. రెండవ కోవకు చెందిన మేధావి
శ్రీమతి సరోజినీ నాయుడు.చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా
మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ
పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది.
సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువుకుంది. పదకొండో సంవత్సరం
వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని
చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా.
ఆమె పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పూర్తి
చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల భక్తి భావం
మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ,
విద్య యందు దృష్టి నుంచక, గురువులు చెప్పే పాఠాలు, కాలక్షేపానికి
భావిస్తూ, గురువులను సాటి విద్యార్థులనూ ఆవహేళన చేస్తూ కాలం విలువ తెలియక
ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధకాలు ఎదురయ్యాక వృధా చేసిన
కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు
నిజంగా ఆదర్శమూర్తి.
సరోజినీ నాయుడు పదమూడవ యేట “సరోవరరాణి ” అనే పదమూడు వందల పంక్తుల పెద్ద
రచన రచించింది.అది అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల
హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా కమ్మని శైలిలో చిన్న తనం నాడే
రచనలు ప్రారంభించిన ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాంనవాబు ఆమె యందు
గల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిర్ణయించుకుని, ఆమె వివిధ
శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ ఆమెకు ప్రతి సంవత్సరం
నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు కూడా
అంగీకరించాడు.నిజాంనవాబు ప్రోత్సాహం దొరికేసరికి, ఆమెకు చదువుమీదనున్న
ఆసక్తి గ్రహించిన తల్లి దండ్రులు ఆమెను విదేశాలకు పంపారు. సరోజినీ లండన్
కింగ్స్ కాలేజీ లోను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్
కాలేజిలోనూ విద్యాధ్యయనం చేసింది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్
లోని ఆంగ్ల భాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు
అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలా మందిని కలసి వారికి గల
పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి
సలహాలపై, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది ఆమె రచించిన
కావ్యాలలో “కాలవిహంగం” (Bird of time), “స్వర్గ ద్వారం” (the Golden
Threshold), విరిగిన రెక్కలు (the broken wings) అనేవి చాలా
ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ
జీవితాలు ప్రతిబింబించేటట్లు చేయడం మన జాతి ప్రత్యేకతలు. అందులో
చొప్పించి కథా విధానం నడిపించడం విశేషం.
1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి
వచ్చాక, ఆమె ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడటం జరిగింది.
ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి.
కులం మతమూ అనే మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే
నచ్చేవి కావు  ఈ కుల, మతము లేకమై జాతి జీవనంపై గొడ్డలి పెట్టు పెడుతూ,
వర్గ భేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులు అంటూ
జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే
ప్రజానీకం మాత్రమే సమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం.ఆమె అదే
అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు తన కులము కాకపోయినా భారతీయ
మహిళా లోకానికి ఆదర్శము కావాలన్న అభిప్రాయంతో ఆనాడే వర్ణాంతర వివాహం
చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు
వీరి వివాహం జరిపించారు. ఆమె చేసిన పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి
వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవతా ముఖ్యం కాని, అర్థం లేని
గ్రుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనము చేసే కులము కాదని ఆమె
నిరూపించగలిగింది. తనూ, తన భర్త, ఆచార వ్యవహారాలు భిన్నమైన కులాలైనా
మనసున్న మనుషులుగా సంస్కార వంతులుగా నియమ బద్దమైన జీవితం సాగించసాగారు.
స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కులము
గొడవ ఏదీ లేదనై మిగిలిన సమాజానికి నిరూపించారు.తండ్రి మరణాంతరం రచించిన
విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్’ బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది.
శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్ల దాంపత్య చిహ్నంగా
వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల
జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు,
హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెలలో ఒకరైన పద్మజా
నాయుడు బెంగాల్ గవర్నర్ గా  పనిచేశారు కూడా
వివాహమై బిడ్డలు పుట్టినా, ఆమె కేవలం తన సంతోషం తన పిల్ల సుఖమే
ఆలోచించలేదు. ఆనాడు భారతదేశము బ్రిటిష్ వారి పాలనలో శాంతి, స్వేచ్ఛ
స్వాతంత్య్రాలు లేక, ప్రతిక్షణం బ్రిటిష్ వారి దౌర్దన్యాలకు గురవుతూ
బాల్య జీవితాలు గడుపుతున్నారు. ఎందరో నాయకులు దేశము నాలుగు మూలల నుండి
ప్రజల్లో స్పాతంత్ర్య భావాలు రేకెత్తించాలని ఉద్యమాలు సాగిస్తున్నారు.
భారతీయులలో విప్లవ భావాలు తలెత్తడము సహించ లేకపోయింది బ్రిటిష్
ప్రభుత్వం. గంగిరెద్దుల్లా వారు చెప్పిన దానికల్లా తలలూపుతూ మన సంపదనంతా
వారికి నచ్చ చెప్పి మనము చెప్పు క్రింద తేళ్ళ మాదిరిగా జీవిస్తూ పర
ప్రభుత్వానికి నివాళులివ్వాలని వారి అభిప్రాయం. అఖిల భారత జాతీయ
కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణగోఖలే నాయకత్వంలో ఉద్యమాలు
సాగిస్తోంది
స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ
నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ
సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభ లకూ, 1916 లో జరిగిన లక్నో
కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది]సరోజినీనాయుడు భారతదేశములో గల
ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి,
ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ,
ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యథార్థ
స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం శ్రోతలకు కాలం, శ్రమ
తెలియనిచ్చేవి కావు. సరోజినీ దేవి 1925డిసెంబరులో కాన్పురులో జరిగిన అఖిల
భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు గా పనిచేసింది.ఒక
భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారనికి బ్రిటిష్ ప్రభుత్వం
బెంబేలెత్తిపోయింది. ఆమెను స్వేచ్ఛగా తిరగనీయడం తనకూ, తన దగాకోరు
పరిపాలనకూ తగదని తలంచి 1930 వ సంవత్సరం మే 23 వతేదీన శ్రీమతి సరోజినీ
నాయుడును అరెస్టు చేసింది. అరెష్టయినందుకు గానీ, జైలు జీవితం
అనుభవించేందుకు గానీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. అవసరమైతే ప్రాణాలే ధార
పోయాలని నిశ్చయించుకున్న దేశభక్తురాలికి ఏడెనిమిది నెలల జైలు జీవితం
మొకలెక్కా, సమర్థురాలైన నాయకురాలిని. నిస్వార్థ దేశభక్తురాలిని అరెష్టు
చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డాడు.
భారతీయ ప్రతినిధిగా 1931 వ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్కు
వెళ్ళింది సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 లో బ్రిటిష్
ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర్య పోరాటం సాగించిందామె.
అందుకు ఫలితంగా అరెష్టు చేయబడి, దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస
జీవితం నవ్వుతూ అనుభవించింది. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల
చెయ్యవలసి వచ్చింది
 స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా జీవితమంతా మానవ సేవకు,
దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 22 వ తేదీన లక్నోలో
ప్రశాంతంగా కన్ను మూసింది.హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ అనేపేరుతో
గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు1975 నవంబర్ 17న ఆనాటి
ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని జాతికి అంకితము చేశారు. ఈమె జ్ఞాపకార్థం
భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల
చేసింది.ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి
సరోజినీ దేవి రోడ్డూ’ అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ
కంటి ఆసుపత్రీ’ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ
సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా
ఉన్నాయి.ఆమె జీవితము నేటి తరము యువతకు యావత్తు జాతికి ఆదర్శము.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.