ఏది నేరం – హజారీబాగ్ జైలు గాధలు

   -పి.జ్యోతి

ఏది నేరం” అనే ఈ పుస్తకంలో హజారీబాగ్ జైలు గాధలు కొన్ని ఉన్నాయి. రచయిత్రి బి.అనురాధ గారు మావొయుస్టు ఖైదీగా ఈ జైలులో 2009 నుండి 2013 దాకా మహిళా వార్డులో ఉన్నారు. అక్కడ పరిచయమైన కొందరి స్త్రీల జీవిత కథలను ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేసారు. మొత్తం 16 కథలలో ఎన్నో జీవిత కోణాలను వారు చూపించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకంలో అన్ని కథలూ వివిధ పత్రికలలో వచ్చినవే. పుస్తకంగా ఇలా 2015 లో వీరు కథలన్నీ ఒక సంకలనంగా రూపొందించారు. మన చుట్టూ స్త్రీల పై సమాజంలో జరుగుతున్న దోపిడి ఎన్నో రకాలుగా ఉంది. దాని వెనుక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్త్రీల కథలను చదువుతుంటే చాలా మందికి తెలియని కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచం ఇప్పుడు కొత్తగా సృష్టింపబడినది కాదు. అనాదిగా మన చుట్టూ ఉన్నదే. కాని మనం ఆ ప్రపంచాన్ని చూసే ప్రయత్నం ఏ రోజూ చేయలేదు. మనం నిర్మించుకున్న కంచె లోపల ఉంటూ అదే ప్రపంచం అని నమ్ముతున్నాం. కాని ఆ కంచె ఆవల ఉన్న నిజమైన జనాన్ని వారి సమస్యలను మనం చూడం. అది చూడనంతవరకు మనకు మన సమాజం పట్ల సరి అయిన అవగాహన లేనట్లే. అనురాధ గారు ఈ కథల ద్వారా ఆ ప్రపంచాన్ని మన మధ్యకు తీసుకువచ్చారు. దాని వైపుకు చూసి ఆ కథలలోని స్త్రీల జీవితాలలోని ప్రశ్నలకు జవాబులు వెతికే భాద్యత మనకు ఉందో లేదో తేల్చుకోమని అంటున్నారు. ఆ స్త్రీలు కేవలం నేరం చేసి ఆ జైలుకు చేరారా, వారు చేసిన నేరానికి కేవలం వారే భాద్యులా అన్నది ఈ  గాధలు చదివిన తరువాత మనలో రావలసిన మొదటి ప్రశ్న. 

ఇదే హజారీబాగ్ జైలులో మేరో టైలర్ అనే ఒక బ్రిటీష్ జాతీయురాలు నక్సలైట్ ఖైదీగా 1970-75 మధ్య కాలంలో గడిపారు. ఆ జైలులో తాను చూసిన అమానవీయ పరిస్థితుల గురించి “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఒక పుస్తకాన్నీ రాసారు. ఇంగ్లీషు లో వారు రాసిన ఆ పుస్తకం తెలుగుతో పాటు ఎన్నో భాషలలోకి అనువాదం అయింది. అదే జైలులో అదే పరిస్థితులలో కొన్ని సంవత్సరాలు గడిపిన అనూరాధ గారు అక్కడి ఖైదీల జీవితాల గురించి చెబుతూ ఆ జైలులోని పరిస్థితులను  మరో సారి మన ముందుకు తీసుకువస్తారు. పసి పిల్లలకు పాలు ఆహారం ఇవ్వడం తప్ప పెద్దగా ప్రస్తుత మార్పులు ఏం జరగలేదని చెప్పుకొస్తూ ఆ రోజుల్లో మేరీ టైలర్, కల్పన లాంటీ రాజకీయ ఖైదీలను విడి విడిగా ఖైదులో ఉంచారు. కాని ఇప్పుడు ప్రతి సెల్ లో గుంపులా మందను తోలినట్లు ఖైదీలతో నింపేస్తున్నారని. అప్పటి కన్నా ఇప్పటి పరిస్థితులలో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదని చెప్పుకొస్తారు.

ఈ సంకలనంలో మొదటిది “ఒక పారో కథ” ఇది జైలులో ఉన్నప్పుడే రాసానని చెప్తారు. మూడు పిల్లి పిల్లలను ముద్దుగా క్రమశిక్షణ తో పెంచుకుంటున్న పారో అనే మరో ఖైదీ కథ ఇది. మర్డర్ కేసులో భార్యా భర్తలిద్దరికీ యావజ్జీవ శిక్ష పడింది. అప్పడు పారోకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప ను తోటికోడలు దగ్గర ఇంటివద్దనే వదిలిపెట్టి రెండో కూతురుతో జైలుకి చేరింది పారో. జైలులో ఐదేళ్ళ వరకు పిల్లలను తమతో ఉంచుకోవచ్చు తల్లులు. కాని పారో ఆ బిడ్డను సూపెరింటెండెట్ కాళ్ళూ పట్టూకుని తనతోనో ఆ తరువాత కూడా ఉంచుకుంది. పద్నాలుగేళ్లు వచ్చాక ఆమెను ఇక తనతో పెట్టూకునే పరిస్థితి లేక, అప్పటికే ఆమెకు సహకరించిన ఆపీసర్లు ఇక మేం ఏం చేయలేం అని చెబితే ఒక మిషినరీ సంస్థకు బిడ్డను అప్పగించింది పారో. ఇంటి దగ్గర ఉన్న బిడ్డ నుండి ఏ కబురూ లేదు. ఈ బిడ్డ గురించి కూడా జైలు నుండి వెళ్లాక ఏం సమాచారం లేకపోతే రచయిత్రి సహాయంతో బిడ్డ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పారో. బిడ్డ మరొకరిపై మానభంగం కేసు పెట్టిందని, అంటే ఆమె పై అత్యాచార యత్నం జరిగి ఉండవచ్చని, ఆమె కేసుని విన్న మెజిస్ట్రేటు ఆమెకు గార్డియన్ గా ఇవరూ లేకపోవడం వలన ప్రభుత్వ హోమ్ కు ఆమెను తరలించారని తెలుస్తుంది. బిడ్డపై అత్యాచార యత్నం జరిగిందని, తాను నమ్మిన మిషనరీలు బిడ్డకు అండగా నిలబడలేదని తెలుసుకున్నాక పారో కూతురుకి ఒక ఉత్తరం రాస్తూ “పోరాడాలి బిడ్డా” అని చెప్పడం ఆమెలోనె ధైర్యానికి నిదర్శనం. చివరకు పదహారేళ్ళ శిక్ష ముగించుకుని ఇంటికి వెళ్ళాక ఆమె మొదటి బిడ్డ ఆమె జైలుకి వచ్చిన సంవత్సరంలోపే మరణించిందని ఆమెకు తెలుస్తుంది. తరువాత పారో ఏమయిందో రచయిత్రికి తెలియకపోయినా, ఆమె ధైర్యం పట్ల ఆమెకున్న నమ్మకం  అర్ధం వుతుంది. పిల్లులనే క్రమశిక్షణలో పెట్టగల పారో, బిడ్డకు ధైర్యం ఒకటే ఆయుధం అని నమ్మిన పారో లాంటి స్త్రీల ధైర్యం సమాజానికి అవసరం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయినా పోరాడడమే కర్తవ్యమని నమ్మే పారో కథ ఎంతో స్పూర్తిదాయకమైన కథ. 

“నేరమూ – శిక్ష” అనే మరో కథలో శకున్ అనే చిన్న అమ్మాయి జీవితం కనిపిస్తుంది. చిన్నప్పుడే పెళ్ళి అయి ఇద్దరు పిల్లల తల్లి అయిన శకున్ భర్త తాగుపోతు, భార్యను నిత్యం హింసించేవాడు. శకున్ ఆ భాధ భరించలేక పిల్లలతో బావిలో దూకుతుంది. కాని పిల్లలు మరణించి ఆమె బ్రతికి బయటపడుతుంది. భర్త హత్యా నేరం మోపితే పిల్లలను చంపిన నేరానికి జైలుకి చేరింది. ఐదున్నర ఏళ్ళూ జైలులో గడిపాక ఆమెకు విరుద్దంగా సాక్షం చెప్పేవారు లేని కారణంగా నిర్దోషి గా ప్రకటించి విడుదల చేసింది కోర్టు. ఆమె తరుపున వాదించిన లాయరు ఆమె పరిస్థితి తెలిసి కూడా ఆమె నుండి డబ్బు వసూలు చేయాలనుకోవడం, మన న్యాయవ్యవస్థ గురించి కొన్ని నిజాలను బైటపెడుతుంది. చివరకు శకూన్ విడుదలయి వెళ్ళిపోయింది. కాని బిడ్డలను పోగొట్టుకున్న ఒక అమాయక తల్లిగా మిగిలిపోయింది. 

“జైల్లో సీరియల్ సీరియల్లోజైలు” అనే మరో కథలో జైలు పరిస్థితులకు సినిమాలల్లో, టి వీ సీరియల్లలో చూపే జైలు వాతావరణానికి ఎంత తేడా ఉందో చెబుతారు రచయిత్రి. అయితే అమాయక గిరిజన యువతి కమిలి ఒక టీ.వీ సీరియల్ ను చూసి అందులో చూపిన విధంగా తన బిడ్డను పిలిపించండని నిరాహారదీక్ష చేయడం, ఆమెను పోలీసులు మందలించదం, సీరియల్ లో చూపింది, నజజీవితంలో ఎందుకు జరగదు అని ఆమె ప్రశ్నించడం లో ఆమె అమాయకత్వం కనిపిస్తుంది. ఆమె గురించి రచయిత్రి “కమిలి బ్రతికిన గిరిజన ప్రపంచంలో ఒకటి నిజమూ, ఒకటి బూటకంలాగా వుండవు. అంతా ఆకలంత సహజం. అన్నమంత నిజం. టివీలోలా తనకు ఎందుకు జరగలేదో ఆమెకు అర్ధం కాదు” అని రాస్తారు. నిజంగా కమిలి లాంటి వారు కూడా ఊంటారని తెలుసుకుని సినిమాలను జాగ్రత్తగా తీయవలసిన అవసరం నేటి దర్శకులకు లేదా అన్నది మనం ప్రశ్నించుకోవలసిన విషయం. 

“మనిషి వర్సెస్ జంతువు” అనే కథలోమనుష్యులను చంపే ఒక రాజకీయ నాయకుడు జైళ్ళ మినిస్టరు అవడం గురించి ప్రస్తావిస్తూ, ఎవరిదో మేక తాను వండిన పాత్రలోతిండి తినడానికి ఇంట్లో దూరి కిటికీ మధ్యన కొమ్ము ఇరుక్కుని చనిపోతే మేక ఖరీదు ఇవ్వలేనందుకు జైలుకు బిడ్డతో సహా తీసుకురాబడిన మరో అమాయక గిరిజన స్త్రీ గురించి తెలుస్తుంది. మూడు నెలల తరువాత బెయిల్ పై ఆమె వెళ్ళిపోయినా ఆమెను జైలుకు తిసుకువచ్చిన పరిస్థితుల గురించి ఆలోచనలు రచయిత్రిని వేదనకు గురు చేస్తాయి. 

“లాఠీ బుడియా” అనే కథ ఒక ఎనభై సంవత్సరాల ముసలి స్త్రీ గురించి. కోడలు చనిపోతే ఆమెను ఆమె భర్తను కోడుకుని నిందితులుగా ప్రకటించి శిక్ష వేస్తుంది ప్రభుత్వం. ఆమె గర్బసంచి క్రిందకు జారి నందువలన నిత్యం చిన్న పిల్లలకు కట్టినట్లు డైపర్లు గా గుడ్డ పీలికలు కట్టుకుని  అవస్థ పడుతూ ఉంటుంది ఆమె. ఆమె ఆరోగ్యం కారణంగా కూడా ఆమె విడుదలకు నోచుకోలేదు. కొన్ని సంవత్సరాల జైలు జీవితం తరువాత ఆమె భర్త చనిపోతాడు. తాను జైలులో చనిపోకూడదని ఆమె పట్టుదల. ఆ భర్తే ఆమె వయసులో ఉన్నప్పుడు ఆమె కడుపు మీద తంతే ఆమె గర్భసంచి జారిపోయిందట. అయితే ఆమె అప్పుడు కూడా ఆపరేషను చేయించుకోలేదు. తన భర్త తన దగ్గరకు రాకుండా శశ్వతంగా అతనికి శిక్ష వేయాలని ఆ సంచిని అలాగే వేలాడేలా ఉంచుకుంది ఆమె చివరి దాకా. అయినా ఆ భర్తతో జైలు వారిచ్చిన సమయంలో మాట్లాడడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపేది. అతను మరణించిన తరువాత పట్టుదలగా జైలరును తన వద్దకు రప్పించుకుని కోడలు ప్రమాదవశాత్తు చనిపోతే తాము చెప్పేది వినకుండా జైలుకు పంపించిన ప్రభుత్వం, తన భర్త అకారణ చావుకు జైలరుకి ఏ శిక్ష విధిశ్తుందని ప్రశ్నిస్తుంది. ఆమెలో ప్రభుత్వం పట్ల కోపం కసి ఆ జైలరుని అడిగిన ప్రశ్నలలో అర్ధం అవుతుంది.  రచయిత్రి విడుదలయి వెళ్ళిపోయాక ఆమెకూ విడుదల లభించిందని చివర్లో తెలుస్తుంది. 

“ఏక్ చాదర్ మైలీసీ” సోనమ్ అనే మరో పేద మహిళ కథ. భార్య బ్రతికి ఉండగానే ఆమెకు విడాకులివ్వకుండా ఆమెను ఆమె మరిది పెళ్ళి చేసుకుంటాడు. భర్త చనిపోయాక సోనమ్ ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా మరిది ఆమెను వివాహం చేసుకుంటాడు. ఉత్తర్ ప్రదేశలోని వారి ఇంట ఆ సాంప్రదాయం ఉంది. కాని మరదలు జార్ఖండ్ మనిషి. తన భర్త తనకు తోటికోడలితో పాటు చేరి అన్యాయం చేసాడని ఆమె కేసు వేస్తే జైలుకు వచ్చారు ఇద్దరు. తన ప్రమేయం లేకపోయినా సాంప్రదాయం పేరిట బలి అయిన స్త్రీ సోనమ్. “పెహచాన్” అనే మరో కథలో శిల్ప అనే మరో గిరిజన యువతి కనిపిస్తుంది. చిన్న పిల్లగానే పని కోసం పట్నం చేరుతుంది శిల్ప. అక్కడే వంటపని చేసే స్థాయికి ఎదుగుతుంది. ఒక ముస్లిం ను ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. తన లాంటి దుర్బర పరిస్థితులలో ఉంటూ ఇంటి నుండి పారిపోవాలనుకునే మైనర్ బాలికను తీసుకుని వచ్చి పట్నంలో పనిలో పెడుతుంది. ఆమెకు సహాయం చేస్తున్నాను అనుకుంటుంది. కాని ఆ అమ్మాయి తల్లితండ్రులు శిల్ప, ఆమె భర్త పై కిడ్నాప్ కేసు పెడతారు. జైలుకు వచ్చాక శిల్ప గర్భవతి అని తెలుస్తుంది. జైలులోనే ఒక పాపకు జన్మనిస్తుంది. ఆ పాప పేరు చాందని. తన భర్త ఇంటి వారు తనని ఒప్పుకోకపోయినా వారి కోసం గిరిజన చిహ్నాలైన తన పచ్చబొట్లను తుడిచేసుకోవడానికి ముఖంపై  కాల్చుకుంటుంది. నమాజు చేయడం నేర్చుకుంటుంది. తన నాలుగు సంవత్సరాల శిక్ష తరువాత భర్తతో బిడ్డతో కలిసి జీవించాలని కలలు కంటుంది. తాను చేస్తున్న పని మంచిదని చట్టం తెలియని కారణంగా ఒక ఆడపిల్లకు సహాయపడుతున్నానని అనుకుని శిక్షకు గురయిన అమాయకురాలు ఆమె. 

“బేబీస్ డే అవుట్’ అనే కథలో జైలులో తల్లుల దగ్గర ఉండిపోయే పిల్లల గురించి రాస్తారు రచయిత్రి. బైటి ప్రపంచంతో సంబంధం లేక కనీసం కుక్కను కూడా గుర్తుపట్టలేక బాల్యాన్ని నాలుగుగోడల మధ్య పోగొట్టుకుని కనీస ప్రపంచ అవగాహన లేక మిగిలిపోయే ఆ పిల్లలు పెద్దవారితో పాటు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఆ పిల్లలను సరదాగా ఒక్క రోజు బైటకు తీసుకెళితే వారికి ప్రపంచం ఎంత వింతగా కనిపించిందో చెప్పే కథ ఇది. పిల్లల పై ఈ జైలు జీవితం ఎలాంటి ప్రభావం చూపుతుందో, వారు సహజ ఎదుగుదలకు ఎలా అది అడ్డంకి అవుతుందో ఊహిస్తే నిజంగా ఆ పిల్లల భవిష్యత్తు పట్ల బాధ కలుగుతుంది. “చందమామను చూడని వెన్నేల” అనే కథలో శిల్ప కూతురు చాందిని మొట్టమొదటి సారి ఆకాశంలో చంద్రుని చూసినప్పుడు ఆ అమ్మాయి పడిన ఆరాటం గురించి చెప్తారు రచయిత్రి. సూర్యాస్థమయం లోపే సెల్ లలో చేరే ఆ ఖైదీలు ఆకాశాన్ని రాత్రి పూట చూడరు. చందమామ టి.వీ లోనే కనిపిస్తాడు అనుకునే చాందిని అది ఆకాశంలో ఒక రోజు కనిపించేసరికి చూపే ఆశ్చర్యం గురించి వింటే ఆ పిల్లల అసహజ జీవితనికి భాధ్యులు ఎవరు అని ఆలోచిస్తాం. 

“పేదింటి పొగ” అనే కథలో ఉష, ఆశ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కనిపిస్తారు. పక్కవారితో గొడవ ఆ ఇంట్లో ముసలి స్త్రీ మరణం తరువాత వీరిపై హత్యా అభియోగం తో జైలు చేరతారు వీరు. జైలుకి వచ్చాక పెద్దమ్మాయి డి.ఆర్.డి.ఎల్ రాత పరిక్ష పాస్ అయిందని ఇంటర్వ్యూ కి వెళ్ళాలని కాల్ లెటర్ వచ్చిందని వారికి తెలుస్తుంది. ప్రభుత్వ పర్మిషన్ తో ఆ ఇంటర్వ్యూ పాస్ అయి ఉద్యోగం తెచ్చుకుని తరువాత నిర్ధోషులని నిరూపించబడిన తరువాత బైటకి వెళతారు వారు. “మున్నీ బద్నామ్ హుయీ” అన్న కథలో మున్నీ అని పిలవబడే ఒక డాన్సర్ కనిపిస్తుంది. ప్రేమించిన మనిషిని పెళ్ళి చేసుకున్నాక అతనికి వివాహమయ్యిందని తెలుస్తుంది మున్నీకి. అతని భార్య గుండె జబ్బుతో చనిపోతే ఆమె మరణానికి కారణం ఆ జంట అని ఆ ఇద్దరికీ శిక్ష వేసి జైలుకి పంపిస్తుంది ప్రభుత్వం, అయితే భర్త చేసిన మోసం తెలిసినా తనను అనుభవించడానికి తయారుగా ఉన్న ఊరి మగవారి నుండి ఆ భర్త అన్న ప్రాణి రక్షణ కలిపించగలడని తనకు బెయిల్ వచ్చినా భర్తకు రాలేదని జైలులోనే ఉండిపోయిన మున్ని చుట్టూ ఉన్న పరిస్థితులు, అంతటి అసహాయతలో కూడా తనను తాను రక్షించుకుంటూ భర్త బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోవలసిన మున్ని జీవితం ఎందరో పేద దళిత స్త్రీల ప్రస్తుత స్థితిని చూపెడుతుంది. 

“ఏది జైలు” అనే కథలో వరకట్నం కేసులో జైలు చేరిన ఒక గొప్పింటీ కోడలు సునీతా సింగ్ కనిపిస్తుంది. పెళ్ళి తరువాత ఆ ఇంటి కోడళ్ళకు అత్తగారిల్లే జైలు అవడం, అది భరించలేక తోటికోడలు ఆత్మహత్య చేసుకోవడం గురించి చెబుతూ తనకు అత్తగారిల్లు కన్నా జైలే బావుందని ఆమె ఒప్పుకుంటుంది. చివరకు బెయిల్ వచ్చాక పిల్లలతో వేరు ఇంటిలో ఆమె ఉండాలని నిశ్చయించుకోవడం తో జైలు జీవితం ఆమెను ఒక అసహాయ గృహిణి నుండి ఒక తిరగబడిన యువతిగా మార్చిన విధానం కనిపిస్తుంది. “వంటే నేరమైన చోట” అన్న కథలో స్వయంగా వంట చేసుకుని అదో పెద్ద ఆనందించే విషయంలా గడిపే ఆడ ఖైదీల జీవితం కనిపిస్తుంది. పావురాలను పట్టుకుని వాటిని వండి, సెనగలు దాచుకుని వాటితో వడలు వేసుకుంటూ తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటారు ఖైదీలు. జైలులో ఖైదీలు వంట చేసుకోవడం నిషిద్దం. అయినా ఈ చిన్న చిన్న సరదాలు వారు తీర్చుకుంటూ ఉంటారు. దాని కోసం కనిపించిన చెత్తనంతా పొయ్యు క్రిందికి సేకరిస్తూ ఉంటారు. 

“మంత్రాలకి చింతకాయలు” అనే కథలో మూఢ నమ్మకాలతో నిండిఉన్న తాను చూసిన అక్షరాస్యత లేని జనం గురించి రాస్తారు. ఒకోసారి ఇది వారిని కొన్ని ఆపదల నుండి కాపాడడం కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు రచయిత్రి. పోలీసులను ఊరిలోకి రానీయకుండా దెయ్యం కథ అల్లిన గ్రామ పెద్ద లాంటి వారి సహాయంతో గూడెంలలో మావొయుస్టూ మీటింగులు జరుగుతూ ఉంటాయ్ అని చెపుతూ జైలులో డబ్బు పోయిన ఒక ఖైదీ తనపై అమ్మవారు పూనినట్లు నటించి ఆ డబ్బును తిరిగి ఎలా పొందిందో చెప్పే కథ ఇది. మిగతా కథలలో మేరీ టైలర్ ను గుర్తు చేసుకున్నారు రచయిత్రీ. ఆవిడ పుస్తకాన్ని తాను జైలులో చదవడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో చెప్పుకొచ్చారు. 

మేరీ టైలర్ తన పుస్తకంలో జైలు పరిస్థితుల గురించి రాసారు. అయితే అనూరాధ గారు ఈ పుస్తకంలో అక్కడి ఖైదీల జీవితాలను, వారి నేపద్యాలను గురించి చెబుతూ, నిరక్షరాస్యత, పేదరికం, అమాయకత్వం తో నిండి ఉండి, పితృస్వామ్య ప్రపంచంలో దోపిడికి గురి అవుతున్న వివిధ స్త్రీల జీవితాలను చర్చకు తీసుకు వస్తారు రచయిత్రి. ఎక్కువ శాతం ఈ స్త్రీ లంతా పేదవారు. అండ లేని వారు. తమ మనుగడ కోసం నిత్యం శ్రమపడే సాధారణ వ్యక్తులు. వీరి నేరాల వెనుక ఉన్న సామాజిక కారణాలను పరిశీలిస్తే తప్ప వారి స్థితి పట్ల అవగాహన కలగదు. బిడ్డను చంపుకున్న తల్లులు, బిడ్డలను కాపాడుకోలేని తల్లులు, తమ శరీరాలతో వ్యాపారం చేయడం తప్పించుకోవడానికి వివాహాన్ని నమ్ముకున్న మున్నీలు, ఇంటి కన్నా జైలు పదిలం అనుకునే గొప్పింటి కోడళ్ళూ, వీరందరి బాధాల వెనుక సామాజిక కారణాలు అనేకం. ఈ స్త్రీల జీవితాలలో వాస్తవికత ఉంది. అది అర్ధం చేసుకోవడానికి మన కళ్ళకున్న పొరలను తొలగించుకోవలసిన అవసరం మనది. ఈ పుస్తకం అందుకు ఉపయోగపడుతుంది. ఈ నిజ జీవిత గాధలు మన చుట్టూ ఉన్న సమాజ వాస్తవికతను పరిచయం చేస్తాయి. 

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.