జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-10

-వెనిగళ్ళ కోమల

కాలేజ్ సర్వీస్

అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. తన పుట్టిన రోజున మాకు పార్టీలిచ్చేవాడు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. రాఘవేంద్ర మాన్వీ, క్రిస్టీనా, జాఫ్రీ – అందరం ఒక కుటుంబ సభ్యులుగా అమెరికాలో పెరిగేవాళ్ళం. నేను క్రిస్టీనా ఖమరున్నీసా బేగం (ఎకనామిక్స్) స్నేహంగా, కలిసికట్టుగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చాలా మంది త్రీ మస్కెటీర్స్  అనేవాళ్ళు. ఖమరున్నీసా తన కారులో మాకు రైడ్ యిస్తుండేది తరచు. ఆమె చక్కని వ్యక్తి, సమర్ధురాలు కూడా. ముగ్గురం తరచు ఫోనులో మాట్లాడుకుంటాం ఇప్పటికీ.

సుభాషిణీ నీలోఫర్ (బోటనీ) నాకు మంచి స్నేహితురాలు. అమెరికాలో సెటిల్ అయ్యాక టచ్ లేకుండా అయ్యాం. ఆమె అడ్రస్ తెలియలేదు అమెరికాలో. శ్రవంతి క్లారెన్స్ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్. అందరితో సఖ్యతగా ఉండేది. అమెరికాలో సెటిల్ అయ్యింది. మంచి టాలెంటెడ్ వ్యక్తి. ఫోనులో పలకరించుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఎ.ఆర్.వర్మ, నాగరాజు (సైన్స్ వాళ్ళు) ఎక్కువ మాతో కలిసేవారు. 

కామర్స్, సైన్స్ సెక్షన్లలో 120 మంది విద్యార్థులుండేవారు. ఆర్ట్స్ లో సంఖ్య తక్కువే. కొందరు బాగా చదివే విద్యార్థులుండేవారు. వారికోసం శ్రద్ధగా పాఠాలు చెప్పాలనిపించేది. 14 ఏళ్లు ఉన్నా నా కాలేజీలో ఎవరూ ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. 

ఆ టైములోనే ఆంధ్రా యూనివర్సిటీ ప్రొ. విశ్వనాథం దగ్గర పిహెచ్.డి.కి రిజిస్టర్ చేసుకున్నాను. కేథరిన్ మేన్స్ ఫీల్డ్ రచనలు – నా టాపిక్. ఉత్సాహంగా చాలా వరకు మేటర్ సేకరించిన తరువాత గైడ్ టాపిక్ మార్చుకోమని లెటర్ రాశారు. దిక్కు తోచలేదు. వారం టైమిచ్చారు నా నిర్ణయానికి  హెన్రీ ఫీల్డింగ్ – ఆయన నవలలు ఎన్నుకున్నాను. సీరియస్ గా కొంత వర్క్ చేశాను. ప్రి పిహెచ్.డి. పరీక్ష పాసయ్యాను. నెమ్మదిగా ఇంటరెస్ట్ పోయింది. సేకరించిన మెటీరియల్ అటకెక్కింది. పిహెచ్.డి. పూర్తి చేయలేదు. 

ఇన్నయ్య పిహెచ్.డి గైడ్ మధుసూదన రెడ్డి అతనికి డిగ్రీ రాకుండా చాలా కాలం నాటకాలాడాడు. తన సొంత అన్నకు ముందు డిగ్రీ వస్తే అతన్ని ఇన్నయ్య ప్లేస్ లో లెక్చరర్ గా వేయాలని అలా చేశాడు. తీరా ఆ అన్నకు వయసు మీరటం వలన ఉద్యోగం అవలేదు. ఇన్నయ్యకు మాత్రం ద్రోహం చేశాడు మధుసూదన రెడ్డి. ఎన్.కె.ఆచార్య (లాయరు) ఇన్నయ్య తరఫున హైకోర్టులో కేస్ వేశాడు. జస్టిస్ అమరేశ్వరి యూనివర్సిటీని, గైడ్ ని తప్పు పట్టి ఇన్నయ్యకు డిగ్రీ ఇవ్వాలని తీర్పు చెప్పారు. గైడ్ మీద స్ట్రిక్టర్సు పాస్ చేశారు. అతను అభాసుపాలయ్యారు.  రిజైన్ చేయవలసి వచ్చింది. ఇన్నయ్య కాంపెన్ సేషన్ కోరలేదు. కోరి ఉంటే అనుకూల తీర్పు వచ్చి ఉండేది. ఇదంతా 12 సంవత్సరాలు పట్టింది. 

అందువలన ఇన్నయ్య నన్ను ఎగతాళి చేసేవాడు. నా పిహెచ్.డి. చరిత్ర నిన్ను పిహెచ్.డి. మీద నమ్మకం పోగొట్టుకునేలా చేసింది. అందుకే పూర్తి చేయలేదు అంటాడతను. నా బద్ధకం నాకడ్డుపడిందంటాను నేను. 

రేడియో ప్రసంగాలు

ఆరోజుల్లో రేడియోలో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. వేలూరి సహజానంద ప్రోగ్రాం డైరెక్టర్ గా ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ లో ఉన్నారు. ఇన్నయ్యకు మంచి స్నేహితుడాయన. నాకు అవకాశం కల్పించారు. విశ్వరచయితలు అనే శీర్షికన ఇతర దేశాల ప్రముఖ రచయితలను తెలుగు శ్రోతలకు పరిచయం చేయటం. ఆరు టాపిక్స్ గా మాట్లాడాను. నా ప్రోగ్రాం ప్రముఖ జర్నలిస్ట్ ఎం. చలపతి రావుగారిని ఆకట్టుకున్నది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన నా ప్రోగ్రాం గురించి సద్విమర్శ చేశారు. 

సహజానందగారు – సన్నకారు రైతులు సలహాలు అని ఐదు టాపిక్స్ మాట్లాడమన్నారు. 5 నిమిషాల టైము ప్రతి టాపిక్ కీ ముందు రాసి వారి అనుమతి పొంది నడిపించాను. ఆయన స్నేహ పాత్రుడు అనేకమంది మన్ననలు పొందిన సౌమ్యుడు. గౌరవనీయుడు. 

ఆ తరువాత స్త్రీల కార్యక్రమాలలో పాల్గొన్నాను. అంతటితో రేడియో అనుభవాలు ముగిసాయి. 

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనుభవాలు

ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభం నుండి ఇంగ్లీషు డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసాను. కాలేజి నుండి 6 నెలల డెప్యుటేషన్ మీద వచ్చి చేరి తరవాత ఇంటర్ వ్యూలో సెలెక్ట్ అయి స్థిరపడ్డాను.

ప్రొ. జి. రాంరెడ్డి వైస్ ఛాన్సలర్. ఆయన అప్పటికే బ్రిటిషు ఓపెన్ యూనివర్సిటీ గురించి బాగా అధ్యయనం చేసి ఉన్నాడు. ఆయన వైస్ ఛాన్సలర్ అవటానికి ఇన్నయ్య చాలా సహాయం చేశాడు. ఇద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో మంచి స్నేహితులు. ఇన్నయ్య ఏర్పాటు చేసిన అనేక సదస్సులు, సమావేశాలల్లో రాంరెడ్డి ఉపన్యసించాడు. స్నేహరీత్యా మాయింటికి కూడా వస్తుండేవాడు. నాకు ఓపెన్ యూనివర్సిటీలో అవకాశం కల్పించాడు.

ఆది నుండి అక్కడ పనిచేయటం వలన ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేయటం. డిగ్రీ లెవెల్ విద్యార్థులకు కోర్సు మెటీరియల్ తయారు చేయటం, ఆడియో లెసన్స్ చేయటం, శని ఆదివారాల్లో స్టడీసెంటర్లలో క్లాసులు తీసుకోటం, ప్రెస్ లో బుక్స్ ప్రింటవుతుంటే ప్రూఫులు దిద్ది యివ్వటం – అలా అనేక విధులు నిర్వహించాను. చాలా కాలం నేనొక్కదాన్నే డిపార్ట్ మెంట్ లో. ప్రొ. సేతురామన్ (ఎస్.కె.యూనివర్సిటీ) గైడెన్స్ తో పనులు చేయగలిగాను. సి.ఐ.ఎఫ్.ఎల్. నుండి డా. అమృతవల్లి, డా. బాలగోపాల్ పాఠ్యవిషయాలు తయారీలో చాలా సహాయపడ్డారు. 

ప్రొ.పుష్పా రామకృష్ణ (ఇంగ్లీషు), ప్రొ. గిరిజ (జూవాలజీ) డా. విద్యావతి (సోషియాలజీ), నాతో స్నేహంగా ఉండేవాళ్ళు. ప్రొ. పుష్పతో కలిసి పనిచేయటం చక్కని అనుభవం. సౌమ్యురాలు, శక్తి సామర్ధ్యాలుగల వ్యక్తి ఆమె. ఇప్పటికీ వారందరితో నా స్నేహం కొనసాగుతూనే ఉన్నది. తరచు ఫోనులో పలకరించుకుంటూ ఉంటాము. 

ప్రొ. టి. వి. సుబ్బారావు మధురై నుండి వచ్చి డిపార్ట్ మెంట్ హెడ్ గా చేరారు. వారితో పనిచేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 

ఇన్నయ్యకూ రాంరెడ్డికీ ఉన్న స్నేహాన్ని కొందరు (ఆయన ఇష్టులే) సహించలేకపోయారు. చాడీలు మోసి, ఆకాశరామన్న ఉత్తరాలు రాసి స్నేహాన్ని చెడగొట్టాలని ఎత్తులు వేశారు. ఆయన ఆలోచనకు స్వస్తి పలికి చాడీలను నమ్మి స్నేహాన్ని వదులుకున్నాడు. అందుకు కారకుల్లో ఇన్నయ్య సహాయం పొందినవారూ ఉండటం విశేషం. వారంతా లాభించి ఉండవచ్చు. కాని ఇన్నయ్య పోగొట్టుకున్నది ఏమీ లేదని ఖచ్చితంగా చెప్పగలను. 

ఇన్నయ్య పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలని వారంతా నెల రోజులపాటు తీవ్రంగా కృషి చేశారు. చివరికి ఆయన్నేమీ చేయలేక యూనివర్సిటీలో నన్ను కొంత ఇబ్బంది పెట్టారు. కొందరికి ఓవర్ నైట్ ప్రమోషన్ లభించాయి. నేను ఆశించనూ లేదు అడగనూ లేదు. ఉన్న పదవితో సంతృప్తి పడ్డాను. 

పే రివిజన్ లో నాకు పెరిగిన జీతం ఇవ్వకుండా ఒక సంవత్సరం ఆపారు. కొందరు నన్ను ఉద్యోగం నుంచి తొలగించమని వైస్.ఛాన్సలర్ కు సూచించారు. నా నుండి లీగల్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ ఆలోచనను విరమించారు. ఇది జరిగింది ప్రొ.సి.నారాయణ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడే. 

కొందరు నా మీద బురద జల్లాలని అనేక విధాల ప్రయత్నించారు. వారు చాటిన విషయాలు పసలేని అవాస్తవాలు అవటం వలన బురద వెనుదిరిగి బ్యూమ్ ర్యాంగ్ అయింది. ఆ సందర్భంలో  నాకు చిన్న నాడు మాష్టరు గారు బట్టీ పట్టించిన పద్యం తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా గుర్తుకు వచ్చింది. వారి తప్పులను దాచి కొమ్ము కాచేవాళ్ళు వాళ్ళకున్నారని ధీమా. పెద్దలు చెప్పిన గురువింద గింజ సామెత వారికి బాగా సరిపోతుంది.

ఎవరేమి చేసినా నేను రిటైరయ్యే వరకు ఉద్యోగంలో కొనసాగాను. నాకు ఉద్యోగం అవసరం, అది నా హక్కు కూడా. నా పని నేను సక్రమంగా చేసుకుంటూ పోయాను. మంచి స్నేహితులను పొందగలిగాను. మే 31, 1995న ఉద్యోగ విరమణ జరిగింది. మనుషుల మీద ద్వేషం పెంచుకునే బదులు జాలిపడటం నేర్చుకున్నాను. 

పరిమితంగా సాగిన నా రచనా వ్యాసంగం

ఆలోచనలెన్నో చేసినా వాటిని కాగితం మీద పెట్టాలంటే బద్ధకం అడ్డొచ్చింది. ఇన్నయ్య ప్రోత్సాహంతో కొంత రాయగలిగాను. ముఖ్యంగా అనువాద రచనలే అవి. 

ఎం.ఎన్.రాయ్ రాసిన ది మెమోయిర్స్ ఆఫ్ ఎ క్యాట్ తెలుగులోకి అనువదించాను. చిన్న పుస్తకం. ఆయన మిగతా రచనలన్నీ చాలా సీరియస్ విషయాలు. ఇన్నయ్య సరళంగా వాటిని తొలగించాడు. ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాసి మ్యాన్యుస్క్రిప్ట్ లు తయారు చేశాను. అలా విషయం సంగ్రహించగలిగాను. వాటిని చాలావరకు తెలుగు అకాడమీ పబ్లిష్ చేసింది. 

డాక్టర్ తస్లీమా నస్రీన్ – బంగ్లాదేశ్  రచయిత్రితో పరిచయం 1992లో అమెరికాలో అయింది. అప్పటి నుండి టచ్ లో ఉన్నాము. ఆమె రచనలు (ఇంగ్లీషు అనువాదాలు) చదివాను. సోథ్ అనే నవల నచ్చి ఆమె పర్మిషన్ తో అనువదించాను. ఆ బుక్ రిలీజ్   ఫంక్షన్ కి ఆమె హైదరాబాద్ మా ఆహ్వానంపై వచ్చారు. సభకు ఓల్గా ముఖ్య అతిథిగా ఉన్నారు. సభానంతరం కొందరు ముస్లింలు వాళ్ళ ఎం.ఎల్.ఎ.తో వచ్చి తస్లీమాను ఎటాక్ చేశారు. బండ బూతులు (వారి భాషలో ఉన్నవన్నీ) తిట్టారు ఇస్లాంను కించపరిచిందంటూ. నేను చాలా భయపడ్డాను. ఆమెకేదన్నా హాని జరుగుతుందేమోనని. పోలీసు ఎస్కార్ట్స్ తో ఆమెను సురక్షితంగా కలకత్తా పంపించ గలిగాము. నా అనువాదానికి పేరు చెల్లుకు చెల్లు అని శ్రీరమణ సూచించారు. ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా వేశారు ఆయన దాన్ని. 

చైనా రచయిత్రి యంగ్ చాంగ్ రాసిన ది వైల్డ్ స్వాన్స్ ను అడవి కాచిన వెన్నెల పేరుతో అనువదించాను. ఆ పుస్తకావిష్కరణకి స్వయంగా రచయిత్రి యంగ్ చాంగ్ రావటం మిక్కిలి సంతోషం కలిగించింది. ఆమె తన భర్త జాన్ హాలీడే (హిస్టారియన్)తో కలసి ఇంగ్లండు నుండి ప్రథమంగా ఇండియా టూర్ కి వచ్చిన సందర్భమది. కాకతీయ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసారు  అక్షర బుక్స్ వారు. నేనసలు ఆ అనువాదం మా అబ్బాయి స్నేహితుడు అట్లూరి అశోక్ కోరగా చేశాను. అశోక్ ఆమెను హైదరాబాద్ కు ఆహ్వానించగా వచ్చి బుక్ రిలీజ్ చేసారు. ఆ పుస్తకం అనువాదం చేయటం వలన చైనా గురించి ఎన్నో విషయాలు అవగతమయ్యాయి.  ఆ సభలో యంగ్ చాంగ్, ఆమె భర్త క్లుప్తంగా మాట్లాడారు. ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇదంతా జరగటానికి వెనుక అశోక్ ముఖ్యపాత్ర నిర్వహించాడు. నేను అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

 అయాన్ హిర్సీ అలీ సోమాలీ దేశస్తురాలు. ఆమె తస్లీమా మాదిరిగానే, ఆడవారిని ఇస్లాం హీనంగా చూడటం తప్పుపట్టారు తన రచనల్లో. దేశం వదలి యూరప్ లో ఆశ్రయం పొంది, పెద్ద చదువులు చదివి, పార్లమెంటు మెంబరు (డచ్) అయి రచనలు చేశారు. ఆమె రచనలు ది కేజ్డ్ బర్డ్, ఇన్ ఫిడల్, ది నోమాడ్ ఆమె అనుమతితో తెలుగు చేశాను. ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. 

ఇన్నయ్య అతియిష్టులైన ఆవుల గోపాలకృష్ణమూర్తి అమెరికాలో టూర్ చేశారు 1963లో, తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చారాయన. అది చదివితే తెలుగు ప్రజలకు ఆనాటి అమెరికా గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎన్నో విషయాలు ఎంతో రమణీయంగా రాశారాయన. ఆ పుస్తకాన్ని ఇటీవలె ఇంగ్లీషులోకి అనువదించాను. ఆయన భాష సొంపును, భావవ్యక్తీకరణను ఎంత వరకు ఇంగ్లీషులో తేగలిగానో గాని, అలా రాయగలిగినందుకు సంతోషపడుతున్నాను. 

ప్రస్తుతం ఏమీ రచనలు చేయటం లేదు. ఒకటీ అర బుక్ రివ్యూలు తప్ప, వయసు, ఓపిక సహకరిస్తే కొన్ని తెలుగు కథలను ఇంగ్లీషులో తేవాలనే తలంపు ఉన్నది. బద్ధకానికి పెద్ద కూతుర్ని. ఎంత వరకు సాధించగలనో చెప్పలేను. 

రాజు – బిడ్డలు – యూరప్ జీవితం

రాజు, కిమ్ ల మొదటి బిడ్డ జనవరి 22, 2002లో న్యూయార్క్ లో పుట్టింది. లేలా అని నామకరణం చేశారు. పసిబిడ్డ ఫోటోలు మాకు పంపించారు. మొదటి మనవరాలు పుట్టిందని ఎంతో సంతోషంగా స్వీట్లు పంచుకున్నాను. నా కాలు సహకరించక పోవటాన వాళ్ళదగ్గరకు వెళ్ళలేకపోయాను. ఇన్నయ్య వెళ్ళి మనవరాలితో రెండు నెలలు సంతోషంగా గడిపి వచ్చాడు. కిమ్ వాళ్ళ అమ్మమ్మ కొన్ని నెలలు పాపకు సాయంగా ఉన్నది. కిమ్ ఉద్యోగం మానేసి పాప పెంపకం ప్రథమ కర్తవ్యంగా భావించింది. లేలా కొన్ని నెలల పాపగా ఉన్నప్పుడే రాజు ది వాల్ స్ట్రీట్ జర్నల్, యూరోప్ కు మేనేజింగా ఎడిటర్ గా నియమితుడయి సకుటంబంగా బ్రస్సెల్స్ (బెల్జియం)కు వెళ్ళాడు. అక్కడంతా ఫ్రెంచ్, డచ్ భాష మాట్లాడేవారే ఎక్కువ. పాప బేబీ సిట్టర్ కూడా ఫ్రెంచి అమ్మాయే. అలా ఫ్రెంచ్ వాతావరణంలో పెరగటాన ఫ్రెంచ్ స్కూల్లోనే జాయిన్ చేశారు రెండేళ్ళకు. అప్పటి నుండి ఫ్రెంచ్ స్కూల్లోనే ఆమె చదువు. ఇప్పుడు మిడిల్ స్కూల్లోనే ఉన్నది. ఫ్రెంచ్ మాతృభాషగల వారికంటె చక్కని ఫ్రెంచ్ మాట్లాడుతుందని లేలా టీచర్స్ మెచ్చుకుంటారామెను. ఇన్నయ్య, రోహిత్ వెళ్ళి బ్రసెల్ల్స్ లో ఒక నెల రోజులు రాజు కుటుంబంతో గడిపారు. లేలా వాళ్ళిద్దరికీ బాగా చేరువయింది. ఇప్పటికీ అలానే ఉంటుంది వారిరువురితో. 

రాజు ప్రధమంగా ఎక్సెస్ స్టాఫ్ ను తగ్గించి పనిచేయడానికి పనికి వస్తారనే వారితోనే తనతోపాటు పనిచేయించాడు. అప్పటికి పేపర్ పరిస్థితి బాగాలేదనే రాజుకు బాధ్యతలప్పజెప్పారు. అనతికాలంలోనే పేపరును సరైన ట్రాక్ మీదకు తెచ్చి ఎన్నో మార్పులు చేర్పులు చేశాడు. రాజు సమర్ధత నెరిగిన సంస్థ వారు రాజును ఎడిటర్ గా నియమించి మరిన్ని బాధ్యతలు అప్పచెప్పారు. 

రాజు పేపరు సైజు, కంటెంట్ అన్నిటిలో మార్పులు తెచ్చి పేపర్ను బతికించాడు. తోటి జర్నలిస్టులు కూడా రాజుతో నిబద్ధతగా పనిచేయటం అలవరచుకున్నారు. ఒక బిజినెస్ టైకూన్ ఫ్రాడ్ ను రాజు ఛేదించగలిగాడు. ఇన్ వెస్టిగేటివ్ జర్నలిజంలో రారాజు అనిపించుకున్నాడు. పేపర్ను డిజిటల్ మీడియాగా మార్చి, న్యూయార్క్ మెయిన్ సంస్థతో అనుసంధానం చేశాడు. రాజు పస్ట్ ఏషియన్ గా ఆ పదవి నిర్వహించినవాడు. ఇండియన్ పేపర్లు రాజును గురించి, ఆయన ప్రతిభ గురించి గొప్పగా రాశాయి. అది చూచి చాలామంది స్నేహితులు మా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపారు. మేము బిడ్డ శక్తి యుక్తులకు గర్వపడ్డాము. ఇంత కీర్తి రావటానికి రాజు ఎనలేని కృషి కారణం.

లేలాను పది నెలల బేబీగా రాజు, కిమ్ ఇండియా తీసుకువచ్చారు. నేనదే పసితల్లిని చూడటం. నన్ను ఎప్పటి నుండో ఎరిగిన దానిలా కారు దిగి లోనకు రాగనే నాతో ఆటలాడింది నా చుట్టూ తిరుగుతూ. నానమ్మతో అనుబంధం అలా ప్రకటించింది. మొదటిసారిగా లేచి నిలబడటం హైదరాబాద్ యింటిలోనే ప్రారంభించింది. సెంటర్ టేబుల్ పట్టుకుని మాటికొకసారి లేచి నిలబడుతుంటే టేబుల్ మూతికి కొట్టుకుంటుందేమో అని రాజు భయపడ్డాడు. నేను టేబుల్ అక్కడ నుండి తీయించివేసాను. కుర్చీలు, మంచం ఆసరాగా లేచి నడక ప్రారంభించింది. ముద్దు ముద్దు అడుగులు ముచ్చట గొలిపాయి. పదిరోజులుండి బ్రస్సెల్స్ తిరిగి వెళ్ళిపోయారు. 

లేలాకి మూడేళ్ళు దాటాక రాజు వాళ్ళకు మరో పాపపుట్టింది 2005 ఆగస్టు 4న. Zola  అని పేరు పెట్టారు. పెద్ద కళ్ళు, చక్కని రూపం, లేలాకు రూపాయి బిళ్ళ సైజులో బుగ్గమీద చొట్ట, నవ్వితే ప్రపంచమే వెలిగినట్టు మొఖమంతా వెలుగుతుంది. అది చూచి ఆనందించవలసిందే. చెపితే అర్ధమయ్యేది కాదు. Zola కళ్ళు నవ్వు నింపుకొని వుంటాయి. మేనత్త నవీన పోలిక వచ్చింది కళ్ళలో. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని మురిపించే నైజం Zolaది. చూడముచ్చటగా ఉంటుంది. హాస్యం పండిస్తుంది. రోహిత్ అంటే Zolaకు చాలా యిష్టం. ఇప్పటికీ ఎత్తుకొని దించమంటుంది అలాగే చేస్తాడు. అత్త యింటిలో రోహిత్ ఆమె మొదటి ప్రిఫరెన్స్. అతనితో ఆటలు, పాటలు సాగుతాయి. గోరింటాకు డిజైన్లు పెట్టించుకుంటారిద్దరూ. వారిద్దరితో అందరికీ కాలం యిట్టే జరిగిపోతుంది. Zola గూడా ఫ్రెంచ్ స్కూల్లోనే చదువుతుంది. ఇప్పుడు లేలా మిడిల్ స్కూల్లో, Zola ధర్డ్ స్టాండర్డ్ లో ఉన్నది. బర్త్ డే పార్టీలప్పుడు ఫ్రెంచ్ లోనే హేపీబర్త్ డే పాట పాడతారు అక్కచెల్లెళ్ళిద్దరూ. ఎప్పుడూ ఆర్ట్ డిజైన్ ను వేస్తూనో, పియానో వాయిస్తూనో, డాన్స్ చేస్తూనో బిజీగా ఉంటారు. ఇద్దరూ కొంతకాలం బ్యాలే డాన్స్ నేర్చుకున్నారు. చక్కగా పాడగలరు. నేర్పిస్తే మంచి సింగర్స్ అవగలరు. స్కూల్లో అన్ని యాక్టివిటీస్ లో చురుగ్గా పాలు పంచుకుంటారు. లేలాలో ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు మెండు.  బొమ్మలు గీసినా, రంగులద్దినా తనలోని ఆర్టిస్ట్ తొంగి చూస్తుంది. కిమ్ ఇద్దరినీ బాగా పద్ధతిగా పెంచింది. మంచి డిసిప్లిన్ అలవాటయింది. వారిద్దరూ జీవితంలో రాణించగలరని అనిపిస్తుంది. తండ్రితో బాగా చనువుగా ఉంటారు. వారిని సుకుమారంగా చూసుకుంటాడు. పని వత్తిడి, ఇంటర్నేషనల్ ప్రయాణాల వత్తిడితో వాళ్ళతో గడిపే టైము తక్కువయినా గడిపిన టైము విలువైనది – క్వాలిటీ టైము తనది. 

బ్రస్సెల్స్ లో తాననుకున్న దానికంటే ముందుగానే అనుకున్నది సాధించాడు రాజు. పేపర్ను నిలబెట్టాడు, పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. పనిమీదేగాని, సంపాదన మీద రాజుకు దృష్టిలేదు అంటుంది కిమ్. ఆయనకెలా యిష్టమైతే అలానే నడుచుకోనివ్వమంటాను నేను. బ్రస్సెల్స్ నుండి ప్రతి సంవత్సరం కుటుంబంతో  హైదరాబాద్ వచ్చి 10 రోజులు గడిపేవాడు రాజు. నాకు  ఇద్దరు మనవలు (నవీన కొడుకులు), ఇద్దరు మనవరాళ్ళు (రాజు బిడ్డలు) లెక్క సరిపోయింది అని సంతోషపడుతుంటాను. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్లు మనవల మీద నాకు ధ్యాస ఎక్కువే. వారితో కాలక్షేపం ఎంతో ఆనందాన్ని అందిస్తున్నది. 

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.