నారిసారించిన నవల-21

                      -కాత్యాయనీ విద్మహే         

 రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి 1976 నాటి ముద్రణ ఇప్పుడు అందుబాటులో ఉంది. హాస్పిటల్ లో అవసాన దశలో వున్న స్త్రీ ఆత్మకథగా వ్రాసుకొంటున్న తన అనుభవాల,  పొరపాట్ల జ్ఞాపకాల కథనమే ఈనవల.భాగ్యవంతురాలు సౌందర్యవంతురాలు అయిన ఆ స్త్రీ జీవితాన్నిఎలా తీర్చిదిద్దు కోవాలో తెలియని దాన్ని అని ఒప్పుకొంటూ 18 సంవత్సరాల వయసులో తనజీవితం ఎక్కడ ప్రారంభమై ఏ ముగింపుకు వచ్చిందో చెప్తుంది. 18 ఏళ్ళవయసులో తన లోని ఆకర్షణకు  , ఈ నాటి సంఘర్షణకు  మూలం తాను కళావంతుల ఇంటి బిడ్డ కావటంలో ఉందని  ఆమెకు తెలుసు. ఆమె పేరు విద్య.

ఇంటర్ మీడియేట్ చదువుతూ యువతీ యువకుల మధ్య ఆకర్షణలను,ఆశలను, సినిమాలు,షికార్లు, అంతకు మించిన సాన్నిహిత్యాలు ఏక బిగిన చెప్పుకుపోతూ కళావంతుల ఇంటి బిడ్డ కావటం వల్ల లోకం తనను సులభంగా లభించే వస్తువు అన్నట్లు చూస్తున్నారా అన్నఅనుమానానికి గురిఅవుతూ, ఒక్కొక్కసారి గొప్పపోతూ గడిపేసిన విద్య జీవితం చూస్తాం ఈనవలలో.తనకు  అందం సంపద – విద్య వంటి ఎన్ని ఎక్కువలు ఉన్నా-సంఘంలో తాను తక్కువ గా చూడబడుతున్నజాతి దానను అన్నన్యూనత ఆమెను వెన్నాడుతూనే ఉంటుంది. బోగం కులంలో పుట్టిన స్త్రీ పెళ్లిచేసుకొన్నా, ఒక వ్యక్తినే నమ్ముకొని జీవిస్తున్నా ఆమె శీలం ఎప్పుడూ అనుమానించ తగిందే అనుకొనే  సమాజంలో విద్య పెళ్ళికి ఆమె తల్లి  కూడా అంత సుముఖురాలు కాదు.కూతురు  అనవసరపు కష్టాలలో ఇరుక్కోరాదన్నదే ఆమె కోరిక. తాను ఇష్టపడిన మోహించిన యువకుడికి తనను తానుసర్వ సమర్పణం చేసుకొన్నప్పటికీ , అతనితో పెళ్ళికి కలలు కన్నప్పటికీ అతను తల్లిదండ్రుల ఒత్తిడి మీద తన జన్మకు కారణమైన జమీందారు గారి ధర్మపత్నికి పుట్టిన వాణి కి భర్తగా కావటం కల్లోలానికి గురిచేసింది విద్యను. 

వైద్యవిద్యను అభ్యసిస్తూ  ఉన్న కాలంలో ఆమె స్నేహాలు , సామాజిక  కలాపాలు , తాత్విక ఆలోచనలు మరొక ముఖ్య భాగం ఈ నవలలో. భారతి స్నేహం వల్ల ఆర్ధిక అసమానతలు, పేదరికం లోని దైన్యం తెలియ వచ్చాయి.ఎనాటమీ  థియేటర్ లో అస్తి పంజరం చూసినరోజున చివరకు మిగిలేది ఇదేనా అని ఒక నిర్వేదం కలిగింది. కులమతదేశకాలపాత్ర బేధంలేకుండా వర్ణ వైష మ్యాలు, ధన గర్వాలు, స్త్రీపురుష వివక్షతలూ అన్నీవాటి దారిన అవి పోగా మిగిలేది ఇదేనా అని చింతనకు గురైంది. మెడిసన్ చేస్తూనే సినిమా రంగప్రవేశం…ఎన్ని లభిస్తున్నా తాను ఇష్టపడినవాడు తనకుకాకుండా పోవటం వల్ల కలిగే వేదనను, అసంతృప్తులను తోసేసుకొని జీవయాత్ర సాగించటానికి  చేసిన ప్రయత్నాలు ఈ నవలేతివృత్తంలో భాగం.

వైద్యవిద్య పూర్తి చేసుకొని విద్య హాస్పిటల్ తెరిచి వైద్యం చేయటం గురించిన అనుభవాలు కూడా ఈనవలెత్తివృత్తంలో భాగమయ్యాయి. తన ఇంటర్మీడియట్ స్నేహితురాలు, రాజా నుఇష్టపడి కూడా తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకొని కాపురానికి వెళుతూ ఎందుకిలా చేసావే అంటే ఆడపిల్లలం కదా! అంటూ వెళ్ళి పోయిన జానకి మూర్ఛలు పోతూ హిస్టీరియా తో బాధపడుతున్న తరుణంలోకలిసి విద్య ఆమెను తన హాస్పిటల్ లో చేర్చుకొని వైద్యం చేసిన పద్ధతి చివరకు మిగిలేది నవలలో దయానిధి  శ్యామలకు చేసిన వైద్యాన్ని గుర్తుకు తెస్తుంది. బుచ్చిబాబు శ్యామల అపసామాన్య ప్రవర్తనకు   సౌందర్య రాహిత్యం కారణం  అంటే ఇక్కడ లత అదేమిటో ప్రత్యక్షంగా చెప్పకపోయినా ప్రేమరాహిత్యం అని భావించినట్లు కనబడుతుంది. రాజాను ప్రేమించినా ఆడపిల్లగా ఆ భావన మనసు మూలకు తోసేసి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటే అక్కడ జానకికి ప్రేమ దొరకలేదు. భర్త సుఖ వ్యాధులు సంసార జీవితమే లేకుండా చేశాయి. ఆ ఖాళీ ఆమెను హిస్టీరియా పేషంటుగా మార్చింది. తన హాస్పిటలలో పెట్టుకొని బయట నుండి రాజా చేత పాటలు పాడించి వినిపిస్తూ జానకిలో  రాగలత  చిగురువేయటానికి  దోహదపడింది విద్య.కాకతాళీయం గా రాజా ఎదురుపడిన ఉద్విగ్న సందర్భంలో జానకి దేహం ప్రతిస్పందించడం  ఆమె కోలుకొనటానికి కారణమైంది. దయానిధి లాగానే విద్య కూడా శీలంలేని మనిషిగా నిందకు గురి కావటం, హాస్పిటల్ నడిపే పరిస్థితి లేక మూసెయ్య వలసి రావటం చూస్తాం. స్త్రీగా యవ్వనోద్రేకాలను తప్పించుకోలేక బోగం కులంలో పుట్టిన స్త్రీగా తన పట్ల  లోకపు  లోకువ చూపును అనుమానాలను తప్పించుకొనే ప్రయత్నంలో  ఒంటరి దైన విద్య జీవితంలో మిగిలిందేమిటి? అంటే తనకు తానుగా బతకాలని చేసిన ఒంటరి పోరాటంలో ఓడిపోయి  అనుభవాలు , జ్ఞాపకాలు తలచుకొంటూ పరితపించటమే..ప్రాణాలు కోల్పోవటమే.

1961 జూన్ నుండి అక్టోబర్ వరకు ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చిన పథవిహీన నవలలో లత  స్త్రీకి పాతివ్రత్యాన్ని మించింది లేదని నూరిపోసిన సంస్కృతి   స్త్రీల కుతెచ్చిపెట్టే గర్వాన్ని,  వాళ్ళ జీవితం మీద బరువై కుంగదీసే పద్ధతిని నిరూపించి నిరసించింది. అలాంటి స్త్రీలకు ప్రతినిధిగా విజయను కేంద్రంగా చేసి ఈ నవల నడిపిందామె. విజయ అవినీతి,  అపవిత్రత అనేవి గిట్టని మనిషి. అసహ్యం కూడా . విజయ భర్త జయప్రదరావు. భార్యగా  అతనిని ఎంతగానో ప్రేమించి ఆరాధిస్తుంది.  భర్త  ఉద్యోగం పోయి దమ్మిడీ ఆదాయం లేని పేదరికంలోనూ ఏవో ఒకటి అమ్మి , ఏదో ఒకటి చేసి అతని ఆకలిని ఎలా తీర్చాలా అని తపన పడుతుంది. తాను పస్తులుండి ఉన్నది అతనికి పెడుతుంది. అది తన ధర్మం అనుకొంటుంది. ఆ ధర్మ నిర్వహణ ఆమెకు తెలియకుండానే ఆమె లో ఒక రకమైన  అహంకారాన్ని అభివృద్ధి చేసింది.  అది ఎలాంటిదంటే భర్త పట్ల నీతి తప్పినవాళ్లను క్షమించలేనంత . వరసకు మరిది అయిన నాగేశ్వర రావు పదేళ్ల క్రితం ఒక తోట కొని అన్నగారికి అజమాయిషీ అప్పగించిన సందర్భంలో స్త్రీల పట్ల వ్యామోహం కల అతను ఆమె అందానికి భ్రమసి చేయికి చేయి తగిలిస్తే చెయ్యి కాల్చుకొనేంత . అలాంటి విజయ  భర్త ఇంట లేని సమయంలో జ్వరంతో నిస్సహాయంగా మంచాన ఉన్నప్పుడు వచ్చిన ఆ నాగేశ్వరరావే చేతులమీద మోసుకెళ్లి హాస్పిటల్ లో చేర్పించాడు. వైద్యం కోసం విజయవాడ తరలించారు. మూడవరోజున ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆమె అంటే గౌరవం ఉన్న తమ్ముడు లాంటి జగన్నాథం , కొద్దికాలం జైల్లో ఉండివచ్చిన  ఆమె భర్త , ఆమెను హాస్పటల్ లో చేర్చిన నాగేశ్వరరావు ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. చనిపోయిందేమో అని అనుమానపడ్డారు. చివరకు విజయవాడ దుర్గ గుడిలో  భిక్షుకి గా జీవిస్తున్న ఆమె శివానంద స్వామి సలహా మీద భర్తకోసం నూజివీడు వెళ్ళటం అతను మరో పెళ్లి చేసుకున్నాడని గ్రహించి వాళ్ళ జీవితంలో కల్లోలం సృష్టించటం ఇష్టంలేక  వెళ్ళిపోవటం , అవసాన కాలంలో మళ్ళీ వచ్చి పూర్వం చెప్పినట్లుగానే  భర్త చేతుల్లో మరణించటం ఈ నవలలో కథ.  

పవిత్రంగా ఉండటం మంచిదే కానీ పవిత్రులు కారని కొందరిని ద్వేషించటం , హీనపరచటం సరైంది కాదని లత అభిప్రాయం. చిట్టి పాత్ర పరమార్ధం ఆ అభిప్రాయ నిరూపణమే. చిట్టి జగన్నాథం  పెళ్ళాడుదామనుకొన్న వ్యక్తి  చిట్టి. ఆమె తండ్రికి శత్రువు అయిన వాడి కొడుకును ప్రేమించి అతనివెంట వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు దూరం అయింది.  మురళి తండ్రిమాటను జవదాటి  తనను పెళ్లాడ సాహసించలేడని తెలిసినా తనను నిర్లక్ష్యం చేసి తనను ప్రేమిస్తున్న వాసంతి వెంట తిరుగుతున్నాడని తెలిసినా అతని వైపు నుండి చూసి పెళ్లిచేసుకొని సుఖపడనీ అనుకున్నదే కానీ తప్పొప్పుల తీర్మానానికి దిగలేదు. క్షమించటం నేర్చుకో ని లోకం గురించి ఆవేదన పడుతుంది. స్త్రీలు జీవితంలో తప్పటడుగులు వేయవచ్చు , అంతమాత్రాన వాళ్ళను కులటలు అనటం సరైంది కాదని ఆమె అభిప్రాయం. క్షమించటం నేర్చుకొన్నాడు గనుకనే జగన్నాథం  మురళి వాసంతిని పెళ్లిచేసుకొనటానికి సిద్ధపడగా ఒంటరిదై జ్వరపడ్డ చిట్టి బాధ్యత తీసుకొన్నాడు. నాగేశ్వరరావు ఆసుపత్రిలో చేర్పించిన మూడోరోజే ఆమె అక్కడినుండి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిందని తెలిసినప్పుడు ఆడదానికి పాతివ్రత్యాన్ని మించింది లేదని నూరిపోసి చివరకు ఈ స్థాయికి తీసుకువచ్చింది దేశం అనిపించింది  జగన్నాథానికి .ఆడది ఇల్లుదాటవలసిన అస్తవ్యస్త పరిస్థితులను సృష్టించిన సమాజం మాగవాడిలా ఆడదానికి  తిరిగివచ్చే దారి ఎందుకు మూసేస్తున్నదని బేజార్ అయ్యాడు. స్త్రీలు పథవిహీనలు అవుతున్నారని జగన్నాథం ఒకవైపుఆందోళన పడుతుంటే విజయలాంటి స్త్రీలు మృత్యుసమయంలోనైనా తాము చేరవలసిన పథం భర్త పద చరణాలేనని మళ్ళీమళ్ళీ నిరూపిస్తూ ఉండాటాన్ని గమనించమంటుంది లత మృత్యు సమయంలో  భర్త సన్నిధికి వచ్చి మరణించిన విజయను చూపించి ..  

ఇష్టమైన స్త్రీని పొందటమే జీవితంగా ఉన్న నాగేశ్వరరావు , అతని మిత్రులు  డాక్టర్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బాల చంద్ర ముగ్గురూ జీవితంలో తాను తన అవసరాలు కేంద్రంగా ఆస్తులు, కీర్తి వీటన్నిటితో పాటు స్త్రీ సుఖాన్ని,  స్త్రీతో సంబంధాన్ని కోరుకున్నారు. స్త్రీల పట్ల, స్త్రీల పాత్వ్రత్యం పట్ల తాను అపచారం చేస్తున్నానా అన్న విచికిత్సకు నాగేశ్వరరావు లోనవడం చూస్తాం. నానా బాలచంద్రకు జీవితం అంటే సంపాదన , సంతోషాలు సంసారం ఇవే కావు  స్త్రీ పురుషులు భౌతిక ఆస్తి సంపాదన ఆరాటాలను, వ్యామోహాలను వదులుకొని ఒకరికొకరుగా జీవించటం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. చివరకు లత ఈ నవలలో శివానంద స్వామిని కూడా స్త్రీపురుష సంబంధాలు, నీతి అవినీతి మొదలైన వాటికి వ్యాఖ్యాతగానే చూపింది. అసహజాలైన మత భేదాలచేత పాప పుణ్యాల నీతి అవినీతుల గాభరా చేత స్త్రీపురుషుల సహజ అభివృద్ధి అణచివేయబడుతున్నదని అంటాడు. శాసనాలు, నిర్బంధాలు లేని ప్రేమ లాలసలే సక్రమమైన మానసికాభివృద్ధికి కారణమవుతాయని అంటాడు. తన పవిత్రతను నిలుపుకొంటూ పతితులపట్ల సానుభూతితో ఉండాలని సాటివాళ్ళు తప్పుచేశారనే అభిప్రాయం గర్వాన్ని, ఆధిక్యతను ఇస్తున్నంత కాలం పవిత్రతకు విలువే లేదని విజయకు బోధిస్తాడు.మతం మానవుడి మనుగడను అయోమయం చేస్తే నిబంధన మానవుడి ఆంతర్యాన్నిరాయిగా మార్చిందని స్వామి ఆవేదన పడ్డాడు.ఆరకంగా లత మతం కన్నా నీతినిబంధనల కన్నా మనిషి సహజ మానవీయ సంస్పందనతో బతకాలని ఆశించింది. 

తిరగబడిన దేవతలు ఒక అభూతకల్పనా కథ. నవల ప్రచురణకాలం తెలియరావడం లేదు కానీ అందులో  కథ నడిచిన కాలం 1957 అని అంతర్గత సాక్ష్యాలు చెబుతున్నాయి. ఉదయలక్ష్మి మరణంతో మొదలవుతుంది ఈ నవల . పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ 30 న ఆమె పుట్టినట్లు రేడియో శ్రద్దాంజలి కార్యక్రమం చెబుతున్న దగ్గర నుండి మొదలు పెట్టి  ఆమె జీవిత  కథనంగా సాగుతుంది ఈ నవల .  మరణించేనాటికి ఆమెకు తొంభైతొమ్మిదేళ్ల వయసు అని కూడా నవలలో చెప్పబడింది.అంటే ఆమె మరణించింది 1957 కావాలి.అందువల్ల కథ అక్కడే ప్రారంభమైనట్లు. అయితే అది అక్కడ ప్రారంభమైనా గతంలోకి ప్రయాణించి మళ్ళీ అక్కడికే వచ్చి ముగుస్తుంది. ఆమె మరణానంతరం రేడియోలో ప్రసారమవుతున్న శ్రద్దాంజలి కార్యక్రమం వింటున్న  ప్రియ శిష్యుడు  సుకర్నో  కోణం నుండి కథ విచ్చుకొంటుంది. 

ఇండోనేషియా ప్రాచీన చరిత్రను ,అందులో ముఖ్యంగా డచ్చి వలస పాలనలో ఆదేశ ప్రజలు,ప్రత్యేకించి డచ్చి వలస పాలకుల వాంఛలు తీర్చేపనిముట్లుగా  స్త్రీలు గడిపిన దుర్భరమైన జీవితాన్ని వివరిస్తూ ఆ నేపథ్యంలో ఆడపిల్ల పుట్టుకే అవాంఛనీయమైన స్థితిలో పుట్టిన హెలెనా  జీవితంలో వచ్చిన పరిణామాలను ఈనవలకు ఇతివృత్తం చేసింది లత.హెలెనా రెండునెలల పసికందుగా ఉండాగా డచ్చి సైనికుల సామూహిక అత్యాచారానికి గురై తల్లి మరణిస్తే చదువు సంధ్యలు లేక గాలికి పెరిగి బాల్యం వీడుతూనే యాభైఏళ్ల డచ్చి అధికారి లైంగిక వాంఛలు తీర్చే పనిముట్టుగా మారి ఆ హింసామయ జీవితం భరించలేక ఇండోనేషియా నుండి పారి పోయిన హెలెనా కు అనుభవమైంది మనిషిలోని రాక్షసత్వమే. రాక్షసుడిని అదుపులోపెట్టి అధికారం చలాయించాలన్నా, మనిషిగా మార్చాలన్నా అతీతమానవశక్తులు కావాలనుకొని వాటిని సాధించటానికి టిబెట్ చేరటం ఆమెప్రయాణంలో మొదటి మజిలీ. అక్కడి నుండి ఒక కొనసాగింపు స్పష్టంగా లేని ఆమె జీవిత యానం లోని  కొన్ని శకలాలను చూపిస్తుంది  రచయిత్రి. 

 కాశీలో సర్కస్ కంపెనీలో చేరటంరెండవ మజిలీ..  కోరిన అతీత మానవశక్తులు ఆమెకు స్వాధీనమైనాయి  అన్నది అక్కడ రూఢి అయింది. ఆ అతీత శక్తులతోటే ఏడాది తరువాత పారిస్ లో ప్రపంచశాంతికోసం జరిగిన స్పిరిట్చ్యువలిస్టుల సమావేశానికి హాజరు కాగలిగింది.  రచయిత అయింది. తరువాత రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వస్తున్న సమయంలో ఒకవిమానంలో ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తు భారతదేశపు మన్యం ప్రాంతాలలో చిక్కుకు పోవటం మరొక మజిలీ. అక్కడ ఆమెకు అల్లూరి రామరాజు తో సంబంధం. అతను ఈమెను సీతా అనిసంబోధించటం..ఆమెపేరుతోనే అతను సీతారామరాజు అయ్యాడని సూచన.రామరాజు మరణానికి ముందే ఆమె మళ్ళీ టిబెట్టుకు..అక్కడినుండి మధురతో హైదరాబాద్ కు.వాళ్ళు అక్కడికి చేరేసరికి ప్లేగువ్యాధి. ఆతరువాత  హోంరూల్ లీగ్ కు  ఒక  కేంద్ర సంఘాన్ని  ఏర్పాటు చేసి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి  దోహదం చేసింది. ఆమె సేవలకు ప్రతిఫలంగా స్వతంత్ర భారతదేశంలో పౌరసత్వం , ఉదయలక్ష్మి అనే పేరు ఆమెకు వచ్చాయని  విజయవాడలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది. హైదరాబాద్ మిర్రర్ పత్రిక, దాని ఎడిటర్ లక్ష్మి, జిడ్డు కృష్ణమూర్తి ..వీళ్ళందరూ ఆమె జీవితాన్ని స్పృశిస్తూ విడిపోతూ ఉండే రేఖలు. లక్ష్మి జరిపే ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా బెర్నార్డ్ షాను కూడాఇందులో పాత్రను చేసింది లత. ఇవన్నీ ఆమె పాండిత్యాన్ని తెలియచేసేవి కావచ్చు. కానీ ఈ మొత్తంలో  పొసగని విషయాలు, అసందర్భాలు అనేకం.  

ఇండోనేషియాలో హెలెనా గా పుట్టి భారతదేశంలో  ఉదయలక్ష్మి గా మరణించిన ఈ స్త్రీ జీవితం ద్వారా లత ఏమి చెప్పదలచుకొన్నది.? బాల్యంలో ఎదురయ్యే విపరీత అనుభవాలు మనుషులలో తీవ్రభావాలను ప్రకోపింపచేస్తాయి. ఏ మార్గంలోనైనా  ముందూ వెనుకా చూడకుండా వెళ్లిపోయే తెగింపును ఇస్తాయి. అతీత మానవశక్తులను  సాధించాలన్న హెలానా ఆకాంక్ష మూలం అదే. అయితే అదే ఆమె నమ్మిన ఆదర్శమా అంటే కాదు .. ఎప్పటికప్పుడు ఆ వలయం నుండి బయటపడటానికి పెనుగులాడింది. ఈ ద్వైదీభావం, ద్వంద్వత్వం ఆమె వ్యక్తిత్వంలో లైంగిక ఆసక్తుల విషయంలోనూ కనిపించేవే.  సౌందర్యాత్మకంగానో, గౌరవంగానో సంతృప్తి పరచుకొన వలసిన సహజమైన యవ్వనోద్రేకాలు దారుణంగా భంగపడిన అనుభవం ఆమెది. డచ్చి అధికారితో మూడునెలల లైంగిక సంబంధం ఆమెలో భయాన్ని, అసహ్యాన్ని  జుగుప్సను  స్థిరపరిచాయి. చైతన్య స్థాయిలో ఆమె శారీరక సంబంధాలపట్ల విముఖత వ్యక్తం చేస్తుంటుంది. కానీ యవ్వన సహజమైన  ఆకర్షణలు, బాహిర ప్రేరణలు, శరీరంలో జరిగే రసాయన చర్యలు ఆమెను శారీరక వాంఛా పరితృప్తికి రెచ్చగొడతాయి.  ఆత్మలను  ఆహ్వానించి , వేదాంతం బోధిస్తూ జీవించిన జీవితం  సంపూర్ణ అంగీకారంతో , ఇష్టంతో చేస్తున్నది కాదు, నమ్మి చేస్తున్నది కాదు.  కనుకనే ఆ ఒత్తిడిని తట్టుకొనటానికి సిగిరెట్లు తాగుతుంది. మద్యం తీసుకొంటుంది. నల్ల మందు వేసుకొంటుంది.  ఇష్టం , అనిష్టం-  మోహం ద్వేషం వంటి ద్వంద్వాల మధ్య సాగిన అశాంత జీవితం ఆమెది. అందువల్లనే ఇంత పరుగులాట తరువాత ఇన్ని అనుభవాల తరువాత మిగిలిందేమిటి, జనాన్ని మోసం చేస్తూ బతికెయ్యటమేనా  అని కించపడింది. నవల  ముగింపులో ఉదయలక్ష్మి ముఖంగా ఇదంతా ఇన్నాళ్లుగా జనాన్ని మోసం చేసిన ప్రక్రియ అని అనిపించినంత మాత్రాన  అతీతశక్తుల సాధనకు జరిగే వామాచారాలను ,అతీతశక్తుల కరాళ నృత్యాన్ని యధార్ధం అన్నట్లుగా నవల ఇతివృత్తం మొత్తాన్ని  నిర్మించుకొంటూ వచ్చిన లత ఉద్దేశ్యమూ, ప్రయోజనమూ శంకించవల్సినవి కాకుండా పోవు.  

నీహారిక నవలలోనూ చివరకుమిగిలేది లో వలెనె తల్లి పాపం పిల్లల జీవితంలో సృష్టించిన విధ్వంసమే కీలకాంశం. చివరకు మిగిలేది నవలలో శీలం గురించిన అపవాదు మోసిన తల్లి నవల ప్రారంభంలోనే మరణిస్తుంది. ఆ తల్లి కొడుకు గా అవమానాలు మోసినవాడు కొడుకు. ఈనవలలో ఆతల్లి జీవించే వుంది. ఆమెజీవితాన్ని వెన్నాడుతూ వచ్చిన అపవాదు నీడ పిల్లల జీవితాలమీదకూ పరివ్యాప్తం అయింది. శీలం మంచిది కాదన్నఅపవాదు వెంటాడుతున్న  శారదాదేవికి భర్తకు మధ్య జరిగే నిత్యసంఘర్షణలో నలిగిన పిల్లలలో కొడుకు చిన్నబాబు చదువుకోసం బయటకు పోయి కొంత విశాలతను అలవరచుకొని తల్లిని, ఆమె కోణం నుండి అర్ధం చేసుకొనటానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్వార్థపరుడై పవిత్రంగా జీవిస్తున్న తండ్రి, నిస్వార్ధపరురాలై అపవిత్రంగా జీవిస్తున్న తల్లి వీళ్లిద్దరి జీవిత మార్గాలలో ఏది మంచి ఏది చెడు అని వితర్కిస్తున్నాడు. కూతురు అరుణ అలా కాదు. పూర్తిగా తల్లిని ద్వేషించింది. ఆతల్లి కూతురువి నిన్నుపెళ్ళాడలేను అన్నాడు ఆమె  ప్రియుడు. తల్లి శీలం తన జీవిత గమనానికి, కోరికలకు అవరోధం అవుతున్నదని అరుణ తల్లిని ద్వేషించటమే కాదు ,  ఆద్వేషంలో తనను తాను ధ్వంసం చేసుకొన్నది. 

చివరకు మిగిలేది నవలలో  తల్లి అసంతృప్తులు, బయటి సంబంధాలు నేపథ్యంలో ఉండగా తండ్రి ఆమెను ద్వేషించటం, పెద్దకొడుకు ఆమెను ఇంటినుండి బయటకు పంపాలని పట్టు బట్టటం, దయానిధి ఒక్కడే ఆమెగురించి సానుభూతితో ఆలోచించటం ఇతివృత్తంలో భాగం కావటం  చూస్తాం. ఈనవలలో చినబాబు కొంతవరకు దయానిధి వంటివాడే. అయితే ఆనవలలో తల్లికి లేని స్వరం , చైతన్యం, చర్య ఈనవలలో తల్లికి ఉన్నాయి. ఆస్తికోసమే తనను పెళ్లిచేసుకొని స్వార్ధంతోనూ, చవుకబారు   ఆలోచనలతోనూ ఇంటిని తన జీవితాన్ని కలుషితం  చేసిన భర్త మిగిల్చిన అసంతృప్తి లో ఆమె జీవన లాలసకు  ఆలంబనగా నిలిచినవాడు కాకతాళీయంగా ఎదురుపడి  స్నేహాన్ని పంచిన వ్యక్తి  తొలి పెళ్లి భర్త  శేషగిరి.  ఆమె కోసం ఇంటికి వచ్చిపోతుంటాడు. పడకగదికి కూడా రాగలిగిన చనువు. విధి నిషేధాలకు ప్రాధాన్యమియ్యని స్వీయ  ప్రవృత్తికి , సుఖం కలిగించే ఏ పాపాన్ని అయినా రహస్యంగా చెయ్యాలనే లోకనీతికి మధ్య ఘర్షణలో ఒత్తిడిని తట్టుకొనటానికి తాగటం తప్ప తాను చేసిన పాపం ఏదీలేదని కూతురి దగ్గర ఆమె చెప్పుకొనటం గమనించదగినది. 

స్త్రీకి ఒకరకంగా , పురుషుడికి ఒక రకంగా  అనువర్తించే ద్వంద్వ లైంగిక నీతి  గురించిన స్పృహ శేషగిరికీ శారదకు ఇద్దరికీ ఉంది.పెళ్లయి ఇద్దరు పిల్లల తండ్రి అయిన తనకు శారదాతో ఉన్న సంబంధం భార్యకు, పిల్లలకు బంధువర్గానికీ తెలిసిందే అయినా వాళ్ళు ఆయనను తప్పుపట్టలేదు.అది అతని ఆధిక్యతగానే భావించారు అని శేషగిరి గుర్తించాడు.కానీ శారద స్త్రీకావటం వల్ల తనతో సంబంధం ఆమెను న్యూనతకు గురిచేసింది అని అతను బాధపడతాడు. పిల్లల ద్వేషానికి గురి అవుతూ ఆమె పడిన హింసకు అతను విలవిలలాడాడు. శేషగిరి ఎవరో, తానుఅతనిని ఎలా కలిసిందో చెప్తూ రంగూన్ లో తండ్రి తనకు చేసిన పెళ్లి వల్ల అయిన భర్త అని తెలుసుకొన్నానని ఆరోజునుంచి నేను పతితను అయ్యాను అంటుంది. “ ఇద్దరు భార్యల భర్త పవిత్రుడు, ఇద్దరు భర్తల భార్య పతిత..ఈలోకంలోని న్యాయ సూత్రాలు ఈతీరుగా అఘోరించాయి. చిత్రమేమిటంటే ఆయన నా భర్త మాత్రమే కాదు.ప్రేమికుడు.ఈ నికృష్టజీవితంలో ఏకైక  ప్రియ బాంధవుడు.” అని ముగిస్తుంది తన కథను.ఆరకంగా ఆమె కూడా లైంగిక ద్వంద్వ విలువలను ప్రశ్నించింది.

సంసారాలు …స్త్రీపురుష  సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు అన్నిటినీ ఒకమూసలో పోసి ఇలాఉండాలి ఇలాఉండకూడదు అని నిర్దేశించటం వృధా ప్రయాస అని లత భావన. అవిస్త్రీపురుషుల ప్రవృత్తులను బట్టి పరిస్థితులను బట్టి భిన్నభిన్నంగా ఉంటాయని ఈనవలలో అనేక జంటల ద్వారా చూపించింది ఆమె. ఆడదాన్ని మోసంచేసి, అధికారం చెలాయించే మగవాళ్లు, ప్రేమ కోసం తపన పడుతూ తమను తాము సమర్పణం చేసికొని ప్రేమను ఇయ్యటంలో ఎన్నిఎదురుదెబ్బలుతగిలినా మళ్ళీ మళ్ళీప్రయత్నిస్తూ, ప్రయాణించేస్త్రీలు, భర్తల అవసరాలుకనిపెట్టి చూస్తూ కొందరూ,  ఆధిపత్యం చేస్తూ మరికొందరూ సంసారం నిర్వహించుకొనే స్త్రీలు, భర్త ఎన్నిహింసలు పెడుతున్నా సర్దుకొని చిరునవ్వు చెదరకుండా,మానవత్వం మరుగునపడకుండా  కాపురాలు చేసే స్త్రీలు ఇలా ఒక  బహుళ ప్రపంచం ఈనవలలో కనబడుతుంది.భర్తనించీ కాపాడుకోటానికి స్వాతంత్రాన్ని, భర్తను ప్రేమించటానికి బానిసత్వాన్ని ఎలా ఉపయోగించటమో అదీఅర్ధంకావటం లేదని రాజ్యలక్ష్మి చేత చెప్పించిన మాటలు ఆలోచనీయాలు.స్వాతంత్య్రం..బానిసత్వం అనే రెండు విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణలో స్త్రీలు ఎటుపోవాలో నిర్ణయించుకొనలేని ఒక అసందిగ్ద స్థితికి నెట్టబడుతున్న స్థితిని కూడా సూచించిన ఈనవలలో లత ఆడదాని పురోగమనానికి గాని తిరోగమానికి గానిఅనుభవమే దారి అన్నఅవగాహనను కనబరచటం చూస్తాం.

 బ్రాహ్మడు  అయిన శారదాదేవి తాత ఒక విపత్కర పరిస్థితిలో హిందూమత విద్వేషాన్నిపెంచుకొని క్రైస్తవం తీసుకొని మాంసం  కూడా  తిన్నప్పుడు ఆ పతనానికి దుఃఖపడి  నాయనమ్మ కులమత భ్రష్టుత్వం తరువాతి తరాలకు కొనసాగకుండా ఇంతపుట్టిన వాళ్లకు పెళ్లిళ్లు నిషేధించి, వంశం నిర్వంశం అవుతుందని శపించి చచ్చిపోయిందని ఒక కథ కల్పించి శారద జీవిత పరిణామాలకు అన్వయించే పని వల్ల అదనంగా ఈ నవలలో సాధించబడిన ప్రయోజనం ఏమీ కనబడదు. అంతేకాదు. “లోకాన్ని ధిక్కరించి జీవితాన్ని నడపటం కత్తి మీద సామువంటిదని గ్రహించ గలిగాను. ఈ ధిక్కారం ఎన్నో ఆవేశాల్ని రేపుతుంది. ఆ ఆవేశానికి గురి అయినా వ్యక్తిని గురించి అపవాదుల్ని ప్రచారం చేస్తుంది. అయినా చాలా రోజులు భయపడకుండానే నెట్టుకొచ్చాను. కానీ చివరికి ఊపిరి సలపటం లేదు” అని చెప్పి ఇహాన్ని త్యజించి  నన్ కావటానికి శారదాదేవి తీసుకొన్న నిర్ణయంతో  లత నవలను ముగించటంలో   మతావరణలోకి ప్రవేశపెట్టి శారదకు  సామాజిక సమ్మతిని సంపాదించటం తప్ప మరొక ప్రయోజనం ఏమీలేదు. అది అల్పమూ అనవసరమూ కూడా. 

మహానగరంలో స్త్రీ 1969 లో ఎమెస్కో ప్రచురణగా  వచ్చింది. ఒక మాట పేరుతో వ్రాసిన ముందుమాటలో బుచ్చిబాబుగారు ఈ నవల చదవలేదే అని బాధగా ఉంది అంటుంది లత. కాళాకారుల జీవితాలకన్నా వస్తువులు లేవని ఆయన అంటుండేవాళ్ళని ఆయన సూచనప్రకారమే తాను సినిమారంగాన్ని కేంద్రంగా చేసుకొని ఈ నవల వ్రాశానని చెప్పుకొన్నారు ఆమె. ఆమె పేర్కొన్న బుచ్చిబాబు  చివరకుమిగిలేది నవల వ్రాసిన బుచ్చిబాబు. రేడియో ఉద్యోగులుగా వాళ్ళిద్దరికీ  మధ్య స్నేహానికి , సంభాషణకు అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా లత ఆయన సూచనను  పట్టుకొని ఈ నవల వ్రాసిందన్నమాట.1967 లో ఆయన మరణించాడు. అందువల్ల పూర్తయిన ఈ నవలను ఆయన చూడలేకపోయాడే అని ఆమె విచారించింది.    తల్లి  శీలం గురించిన అపవాదు పిల్లల జీవితాన్ని వెంటాడి వేధించి లోకంలో  పెడగా నిలబెట్టటం అనే అంశాన్ని లత తన నవలెత్తి వృత్తాలలో  వైన వైనాలుగా భాగం చేయటాన్ని గురించి బుచ్చిబాబు ఏమనుకొని ఉంటాడా అన్నది కుతూహలకరమైన  ప్రశ్న. అయితే ఆయన డైరీలలో ఎక్కడా లత ప్రస్తావన కానీ, ఆమె రచనల ప్రస్తావనా విమర్శలు కానీ కనిపించవు. లత చివరకు మిగిలేది నవలను వంశీ ప్రచురణగా వేద్దాము అని అడుగుతూ బుచ్చిబాబుకు వ్రాసిన ఉత్తరం ఒకటి మాత్రం ఉంది. ప్రచురణ పని జరిగినట్లు లేదు. అది వేరే విషయం. 

ఈ నవలలో మహానగరం హైదరాబాద్. విజయవాడ తరువాత హైదరాబాద్ లతకు ఇష్టమైన నగరం. చాలా నవలల్లో అది కథాస్థలం. ప్రసక్తాను ప్రసక్తంగా హైదరాబాద్ నగర చరిత్రను, సంస్కృతిని వివరించటం ఆమెకు ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్ లలో1920 -30 ప్రాంతాలలో సంభవించిన ప్లేగు విపత్తును ఆమె అనేక నవలేతి వృత్తాలలో భాగం చేసింది.  వేరువేరు నేపథ్యాల నుండి వచ్చిన ముగ్గురు స్త్రీల జీవితం వస్తువుగా మహానగరంలో స్త్రీ నవల వ్రాసింది. హైద్రాబాద్ నగరానికి మొదటి పేరు భాగ్యనగర్.తన ప్రియురాలు భాగమతి పేర మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించిన కొత్త రాజధాని అది. ఈ మహానగరానికీ స్త్రీకి ఆదినుంచీ అద్భుతమైన ఒక విచిత్ర సంబంధం ఉంది అంటుంది లత. నవాబుల ప్రేమ చరిత్రలు చెప్తూ మొదటినుండి స్త్రీకి ఆమహానగరానికి , నగరంలోని అనేక భవనాలకి ఉన్నసంబంధాన్నిప్రస్తావించింది. ప్రేమకు , ప్రేయసికి, మదిరకు నవాబుల పాలనలో వున్న ప్రాధాన్యత హైదరాబాద్ జీవన సంస్కృతిలో భాగమై పోయిందంటుంది.

హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ అందరికీ ఒక ఆకర్షణ అయిందని కూడా చెప్తుంది లత.ఆ ఆకర్షణకు కారణం పర్మిట్లు సంపాదించటం దగ్గర నుండి ఉద్యోగాలలో ప్రమోషన్ల వరకు సెక్రటేరియట్ కేంద్రంగా చేసుకోవలసిన పనులు, పొందవలసిన ప్రయోజనాలు అని కూడా లత గుర్తించి చెప్పింది.1956 తరువాత హైదరాబాద్ సాధించిన అభివృద్ధి లోని నైతికానైతికతలు కూడా లత దృష్టిలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న నగరాలు బతుకుతెరువులకు ఎందరినో ఆకర్షిస్తుంటాయి. వాళ్లలో స్త్రీలు కూడా ఉంటారు. ఎదో ఒకరకంగా   పైపైకి ఎదగాలనుకొనే వర్గంలో భాగంగా స్త్రీలు తమ  శరీరాలను మదుపుగా పెట్టి చేసే ప్రయత్నాలు,  పొందే వైఫల్యాలు మహానగరంలో స్త్రీకి ఇతివృత్తాన్ని సమకూర్చాయి. 

వరంగల్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగి, బాల్యంలో పక్కింటి పెద్దమనిషి బలవంతానికి లొంగి పోయి ఆ తరువాత స్త్రీపురుష సంబంధాలలోని సౌఖ్యానికి అలవాటుపడి ,విశృంఖల సంబంధాలు ఏర్పరచుకొని, తల్లి దండ్రులు చనిపోయాక అన్నగారి అదుపును భరించలేక హైదరాబాద్ చేరి చిన్న ఉద్యోగంతో మొదలు పెట్టి అనేక పరిచయాల తో ఎదుగుతూ సినిమా నటి అయి,  దానితో విసిగి పోయి  అవసరమైన వాళ్ళను ఆశ్రయిస్తూ   పాటలు పాడే అవకాశాలను అందిపుచ్చుకొంటున్న సావిత్రి ఒకస్త్రీ . చిన్నప్పుడే పెళ్లయి పల్లెటూరి రైతు అయిన భర్త,  అతని పని నచ్చక హైదరాబాద్ వచ్చి తన  హైస్కూల్  చదువుతో ఒక ఉద్యోగం సంపాదించి రేడియో నాటకాలలో పాల్గొంటూ రచయిత్రి అవుతూ కొత్త పరిచయాలతో సినిమాకు పాటలు , కథలు, సంభాషణలు వ్రాస్తున్న చింతామణి మరొక స్త్రీ. విశాఖ పట్నంలో సముద్ర తీరంలో చేపలు కొని మారుబేరానికి అమ్ముకొంటూ , సముద్రం నుండి స్మగుల్డు వస్తువులు చేరుస్తూ పోలీసుకు పెట్టుబడి అతని సహాయంతో ఒక సెట్టి గారింట్లో పనికి కుదిరి, ఆయన ను ఆకర్షించి ఎంకిగా పిలిపించుకొని దగ్గరై సినిమా తీయాలని ప్రోద్బలం చేసి విశాఖ నుండి మద్రాసుకు మకాం మార్చి వెంకటేశ్వరిగా పేరు మార్చుకొని సినిమాలలో కథా నాయికగా విజయాలు సాధిస్తూ విపుల గా స్థిరపడిన అప్పులు మరొక స్త్రీ. అవకాశాల కోసం  పోటీ, ప్రయోజనాలకోసం ఐక్యత, వాళ్ళ సంబంధాల నిర్ణాయక శక్తి. డబ్బున్న వీరస్వామికి భార్య అయిన పేదింటి వెంకమ్మ భర్త ఆస్తినంతా దురలవాట్లకు ఖర్చుచేసిన స్థితిలో జబ్బు పడి ఆసుపత్రికి పోతూ రోడ్డుమీద స్పృహ తప్పి పడిపోయి ఒకాయన రక్షించి మద్రాసు తీసుకుపోతే ఆయన సలహా మీద సినిమాలలో భవిష్యత్తు చూచుకొని విమలగా స్థిరపడిన స్త్రీ కూడా హైదరాబాదు నగరంలో ఉంది.విపుల ఈమెను గురించి తనగురువు అని చెప్పుకొంటుంది.

సావిత్రి, చింతామణి మధ్యతరగతి భద్ర వర్గం నుండి వచ్చినవాళ్లయితే విపుల గాపెరుమార్చుకొన్నఅప్పులు అప్పలమ్మ అత్యంత దిగువ వర్గం నుండి, శ్రామిక వర్గం నుండి వచ్చింది.ఎండు చేపల్ని నిప్పుల మీద కాల్చుకుని తింటూ గంజి తాగి పనిలోకి పోయే మగవాళ్ళు, తిండిలేకపోయినా తిరగేసి చుట్ట కాల్చేఆడవాళ్ళూచేపబొమికల్నిపీక్కుతినే పసిపిల్లలూ , ఇరవై నాలుగు గంటలూ తగులాడుకొనే ఆలూమగలూ తుపుకూ తుపుకూ ఉమ్మేస్తూ అందర్నీ తిట్టే ముసిలాళ్ళు..రోగమూ – ఆకలీ- మురికీ- బీదతనమూ వీటిమధ్య గడిచిన జీవితం అది.మూడో పెళ్ళివాడికి పెళ్లామై ఉప్పు చేపలమ్ముకొంటెగానీ, అక్రమ రవాణాలో పని చూసుకొంటే గానీ గడవని ఒళ్ళుఇస్తే గానీ గంజి నీళ్లు దొరకని జీవితం ఆమెది. అక్కడినుండి సెట్టి ఆధారంతో  సినిమా తారగా ఎదగ గలిగిన తెలివితేటలు, బతుకుతెరువు మాయలు ఆఅనుభవం వల్ల పొందినవే. అందరి కంటే అట్టడుగు నుంచీ వచ్చిన  విపుల అందరికంటే ఎక్కువగా ఉండటం అందరికంటే ఎక్కువగా ఆమె జీవితానికి దగ్గరగా ఉండటం వల్లనే అని రచయిత్రి  చెప్పిన విషయం గమనించదగినది.

సావిత్రి చింతామణి విపుల ముగ్గురూ  ఒకరికి అవకాశంవచ్చినచోట మరొకరికి చోటు కల్పిస్తూ స్నేహానికి, బలానికి సంకేతాలై ముగ్గురూ కలిసి ఒక ఇల్లు కొనుక్కొని ఆదర్శంగా ఉంటూనే బతుకు భద్రత సందేహాస్పద మైనప్పుడు స్వార్ధంతో ఎవరి ప్రయోజనాలకోసం వాళ్ళు పనిచేసినవాళ్ళే. జీవనసౌధాన్ని అధిరోహించటానికి నిచ్చెనమెట్లుగా ఎందరినో వాడుకొన్నవాళ్ళే.ఎక్కివచ్చిన మెట్లను మరిచినవాళ్ళే.బొంబాయి సినీమాయలో మోసపోయి దివాలా తీసిన విపుల శారీరకంగా, మానసికంగా ఒంటరి వేదనను అనుభవిస్తున్నప్పుడు చింతామణి హైదరాబాద్ నుండి సావిత్రి మద్రాస్ నుండి అప్పుచేసి విమానం టిక్కెట్లు కొనుక్కొని మరీవచ్చారు.విపుల చెయ్యి తమచేతిలోకి తీసుకొని ఓదార్పునిచ్చారు. నీకు మేమిద్దరం ఉన్నాం, భయం లేదు అని భరోసా ఇచ్చారు. “మనల్ని మనం బజారులో అమ్ముకునైనా సరే ఊపిరి పీల్చి బతకటంలో సుఖముంది” అని చింతామణి అంటే “ అధైర్య పడితే ఆరిపోతాం..బ్రతకాటానికి అబద్ధాలాడదాం…అన్యాయం చేద్దాం..మిగిలినకొద్దిపాటి స్త్రీత్వాన్నిమహా నగరంలో తాకట్టు పెట్టైనా బ్రతికే ఉందాం” అని సావిత్రి వివరంగా చెప్పింది. అసూయతో స్వార్థపరులై ప్రవర్తించిన ఆ మాహానగరంలో స్త్రీలు మానవత్వానికి ఇంకా పరాయి వాళ్ళు కాలేదనటానికి సంకేతాలు ఈ మాటలు. “సుఖంలో ద్వేషించుకొన్నా కష్టంలో ప్రేమించుకుందాం” అని ఉన్నతమైన జీవన విలువను పతాకగా ఎగరేయటం స్వతంత్ర జీవన లాలస వల్లనే మహానగరంలో స్త్రీలకు సాధ్యమైంది. 

*****

( ఇంకా ఉంది ) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.