మంకుపట్టు

-వసంతలక్ష్మి అయ్యగారి

కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ  యీడురాగానే జరిపారు. 
అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. 
వీర్రాజు గారు తమవైపుబంధువులపెళ్లిళ్లెన్నో  మధ్యవర్తిత్వం జరిపి చేయించిన ఘనతకలిగినవారు.స్వంతానికి కొడుకుపెళ్లి విషయంలో బొత్తిగా  విఫలమవడం బంధుమిత్రులందరినీ ఆశ్చర్యంలో ముంచింది.
 
కాంతమ్మగారిది ప్రతి విషయంలోనూ అవసరానికి మించి వంకలుపెట్టే గుణం. దొడ్డచేయి. పెట్టుపోతలు అన్నీ బ్రహ్మాండం. కూతుళ్ల పెళ్లిళ్ల లోనూ వియ్యాలవారితో చిరువంకలతో చిర్రుబుర్రులాడిన సందర్భాలు లేకపోలేదు. వీర్రాజుగారి మాటకారితనంతో గట్టెక్కుతూ వచ్చారు. తీరా కొడుకు పెళ్లి విషయంలో సరిగ్గా పుష్కర కాలం పెళ్లిచూపులప్రహసనాలకే సరిపోయింది. ఓపక్క  కూతుళ్లిద్దరూ నచ్చచెప్పినా  యేదో వంకతో… ముక్కు చట్టిదనో… పిల్లపొట్టిదనో… రంగుతక్కువనో… జుట్టు యెరుపనో… కళ్లు లోతనో.. నడుము లావనో…చెడగొట్టి పిల్లవాడికంటూ చాయిస్ లేకుండా చేసేవారు.
కొన్ని సంబంధాలకైతే చూపులకెళ్లి.. ఆవిడపక్కన పిల్లని నిలబడమనడం… నడచిచూపమనడం..వంటి పాతకాలపు చేష్టలతోపాటూ చేతిలో యెప్పుడూ టేపు కూడా తీసుకెళ్లి నిర్మొహమాటంగా ఆమ్మాయిని కొలిచిపారేసి తనుకోరిన హైటుకి యించిలు కాదు మిల్లీమీటర్లుతేడావున్నా తిరస్కరించేవారు. కొన్ని జాతకాల్లోనే వీగిపోయేవి. వీర్రాజుగారికి అందులోనూ ప్రావీణ్యం ఉండడంతో … మిగతా అన్నిబాగుండి.. జాతకాలు కలవని పక్షంలో పిల్లవాడిజాతకాన్ని కాస్త మతలబుచేసి మార్చేసైనా పెళ్లి చేయడానికి సిద్ధ పడేవారు రానురాను.వివాహవేదికల చుట్టూ తిరగడమే వారి ఏకైక వ్యాపకమైంది.ఇలా అబ్బాయికి ముప్ఫై యెనిమిదొచ్చేశాయి. తల్లిదండ్రులు నోములూ పూజల పిచ్చిలో పడిపోయారు.లక్షవత్తులనోమనీ..చిత్రగుప్తుడునోమని .. యెన్నెన్నో పూజలకు  వయసు మీదపడి నడవలేని భర్తగారిని కూడా కూర్చోబెట్టేది కాంతమ్మ.
ఏనోములు ఫలించాయో.. ఆడపిల్లలు పూనుకుని మాట్రిమనీ ద్వారా చూడచక్కని ,తెలుగురాని రాజస్థానీ పిల్లను తమ్ముడికి కుదిర్చారు తల్లినోరునొక్కి.
 
ఓపక్క పెళ్లిబాజాలు మ్రోగుతుంటే కాంతమ్మ మతిభ్రమించినట్టే ప్రవర్తిస్తూ.. వచ్చిన ప్రతివారికీ తన మూలానే కొడుకుకి తెలుగు భాష రాని పిల్లని కట్టబెడుతున్నామనీ… లేటయిపోతోందికనుక తప్పలేదనీ, వాడిఖర్మ అలా కాలిందనీ  యేవేవో అప్రస్తుతపు మాటలతో  వచ్చినవారందరికీ చెప్పడం చూసి  ఓపక్క చుట్టాలూ మరోవైపు కూతుళ్లు కంగారుపడిపోయారు.
అబ్బాయికి  బరోడాబదిలీ.వేరుకాపురం కొంత కలిసొచ్చింది రోజూవారీ అత్తాకోడళ్లకలహాలు పెరగకుండా.మూడేళ్లైనా సంతానం కలుగకపోవడంతో ఓపక్క పరీక్షలు.. మరోపక్కమళ్లీనోములతో సతమతమవడం మామూలైంది ఆదంపతులకు. అంతలో అకస్మాత్తుగా భర్త గుండెపోటుతో మరణించడంజరిగింది.
 
కాంతమ్మగారికి కొడుకు వద్దకు వెళ్లకతప్పలేదు.పుట్టుకతోవచ్చినబుద్ధులు పుడకలతోగానీ పోవన్నట్టు… యింతజరిగినా ఆవిడలో పిసరంత మార్పు రాకపోగా.. నావంట..నీవంట…నాపూజ…నీపూజ అంటూ పిచ్చిని చేజేతులా ముదరపెట్టుకున్నారు.
తెలుగు నేర్వాల్సిందేనని అత్తగారూ… అవసరమేలేదని కోడలు… యిదీ ఆ యింటి కథ.
సర్దుబాటు గుణమన్నది మనిషిలో లేకపోగా వంకలు పెట్టడమే వ్యసనంగా మారితే ఒరిగే పర్యవసానాలు కాంతమ్మ ముదుమివయసులో కోరితెచ్చుకోవడమేకదూ!

****

Please follow and like us:

3 thoughts on “మంకుపట్టు (హాస్య కథ)”

  1. వసంత గారు, మీరు రాసిన ‘మంకు పట్టు’ కధ వంటివే కొన్ని నేను అమెరికాలోనూ చూసాను. మీ రచన శైలి సాఫీగా చక్కగా సాగింది. అవును ఇటువంటి వ్యక్తిత్వాలు స్త్రీలలో ఎక్కువగా నేను చూసాను. వయసుతో నిమత్తం లేకుండా అలా మొండిగా తమ చుట్టూతా ఉన్న వారిని బాధపెడుతూ, అవాంతరాలు కల్పిస్తూ జీవించేస్తారు.. మరి మీ రచన లోని కాంతమ్మ గారు మరి వృద్దాప్యాన్ని ఎలా గడుపుతారో .. మంకు పట్టు వీడకపోతే…
    నేను కూడా నాకు తెలిసిన సంఘటనల ఆధారంగా ఇలా సాఫీ గా చక్కగా రాసే inspiration ఇచ్చింది మీ రచన.. బాగుంది.. శుభాకాంక్షలు మీకు.

    ఉమాభారతి

  2. స్త్రీల శత్రువులలో స్త్రీలు కూడా ఉన్నారని బాగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published.