వెనుతిరగని వెన్నెల(భాగం-22)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-22)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

ఎమ్మే మొదటి సంవత్సరం పరీక్షల మొదటి రోజు తన్మయికి బాగా బెదురు పట్టుకుంది. ప్రశ్న పత్రం చదివేముందు కళ్లు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చింది

సరిగ్గా సగం రాసేక సబ్జెక్టు  ప్రొఫెసరు వచ్చి అందరినీ ఉద్దేశించిఏవైనా సందేహాలున్నాయా?” అన్నాడు

“‘హమ్మయ్య చివరి ప్రశ్న సరిగా అర్థం కాక బుర్ర పగలగొట్టుకుంటూంది ఇప్పటి వరకూ.”

తన్మయి లేచి నిలబడింది.

సమాధానంగా ప్రొఫెసరు భృకుటి ముడివేసి “అసలు నువ్వెప్పుడైనా నా క్లాసుకు వచ్చేవా?” అని సీరియస్ గా అడిగేడు.

అనుకోని ప్రశ్నకు బిత్తరపోయి, నీళ్లు నములుతూన్న తన్మయి వైపు తీక్షణంగా చూస్తూఎన్నో సార్లు క్లాసులో ప్రశ్నకు సంబంధించిన వివరాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడిక్కడ ప్రశ్నకు అర్థం నీకు  కొత్తగా చెప్పాలా? క్లాసుకు రాని వాళ్లు చదువులకు యూనివర్శిటీలకు ఎందుకు వస్తారోఅని విసుగ్గా అన్నాడు.

అప్పటికే తెలీని భయంతో బిక్కచచ్చిపోయిన తన్మయికి కళ్లల్లోకి వెంటనే నీళ్లు వచ్చేసాయి

ఆయన వెళ్లిన అయిదు నిమిషాల తరవాత కూడా కళ్లు ఒత్తుకుంటూ పరీక్ష రాస్తున్న తన వైపు ఇన్విజిలేటరు జాలిగా చూస్తూమంచి నీళ్లు తాగుతారా?” అన్నాడు.

తన్మయి వొద్దన్నట్లు తలూపింది. “మంచినీళ్ల  కోసం బయటకు వెళ్లొచ్చే సమయం కూడా వృథా చెయ్యడం ఇష్టం లేదు తనకి. తనకీ పరీక్షలు అతి ముఖ్యం.”

తన్మయి పరీక్ష రాసి బయటకు వచ్చేక అనంత వెనకే వస్తూరాజు చెప్పేడు. ఏం బాధపడకు. ప్రొఫెసరు నిజానికి చాలా మంచివారు. ఆయన అలా మాట్లాడక పోతే ఆశ్చర్యపోవాలి. మన హెడ్డాఫ్ డిపార్టుమెంటు గా ఆయన మొదటగా అటెండెన్సు పట్టించుకోవాలి కదా! నువ్వు  ఎందుకు క్లాసులకు రాలేకపోయావోనీ  పరిస్థితులేవిటో తెలియక అని ఉంటారు. నాతో రా. ఆయనకు పరిచయం చేస్తాను.” అంది

తన్మయివద్దు అనంతా! నాకిప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని లేదు“. అంది నిరాసక్తంగా

డిపార్టుమెంటులోకి ఆహ్వానిస్తూ కౌన్సిలింగు రోజు ఆయన అభినందనగా నవ్విన నవ్వు ఇంకా గుర్తుంది తనకి. అలాంటిది ఇవేళ ఇలా

నిజమే, డిపార్టుమెంటు హెడ్డు  క్లాసుకే వెళ్లలేకపోయిన దౌర్భాగ్యం తనది. అంతేనా! లౌక్యం చాతకాని తను మధ్యలో ఒకట్రెండు సార్లు ఆయన ఎదురుపడినప్పుడు తన మానాన తను ఏదో ఆలోచనల్లో ఉండి నమస్కారం పెట్టడం కూడా మర్చిపోయింది.  

..మరింకేం. మీ వైపు నించి కావలిసినన్ని తప్పిదాలున్నాయి అటెండెన్సుతో బాటు. అయిన అవేమీ పట్టించుకోకండి. మనందరకూ ఇప్పుడు కావలసినవి ప్రశంసలు కాదు. మార్కులు.”  అన్నాడు కరుణ వాతావరణాన్ని తేలిక చేస్తూ.

కరుణ వైపు పరీక్షగా చూసింది. చప్పున వనజ గుర్తుకు వచ్చింది. విశాఖపట్నం వచ్చిన కొత్తలో వనజ లేని లోటు తనని బాగా బాధించేది. అదిప్పుడు అనంత రూపంలోనూ, కరుణ రూపంలోనూ తీరుతూంది.  

అయినా ఎందుకో తన్మయి తేలికగా తీసుకోలేకపోయింది. మొన్నటికి మొన్న తెలుగు ఎమ్మే చదివి ఏం  చేస్తారనే ప్రశ్న. ఇప్పుడు ఇంత కష్టపడి చదువుతున్నా క్లాసులకు అటెండ్ కాలేక పోతుందన్న బాధ.  

ఆయన అన్నారని కాదు, క్లాసులు ఎగ్గొట్టడం వల్ల తనకూ సబ్జెక్ట్ల పట్ల  అవగాహన సరిగా ఉండడం లేదు. శేఖర్ తో విషయం మాట్లాడాలి. ఇక అతని గురించి భయపడ్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు.” దృఢంగా అనుకుంది.

***

శేఖర్  మర్నాటితో చివరి పరీక్ష అనగా  రాత్రి వచ్చేడు.

వస్తూనేబాబుని వొదిలి వచ్చేసేవా? నువ్వసలు తల్లివేనా?” అన్నాడు.

ఇలాంటిది జరుగుతుందని తన్మయికి బాగా తెలుసు. కాబట్టి ముందే తయారు చేసుకున్న సమాధానం చెప్పింది.

అది విని, “ఆహా, మీ వాళ్లకు మనవడి మీద అంత ప్రేమే ఉంటే, వాడి పుట్టిన రోజు ఎందుకు జరిపించలేదో?” అని,

ఇదిగో ఇదే చివరిసారి. ఇక మీదట వాడు మన దగ్గిర, లేదా మా ఇంట్లో మా అమ్మా, నాన్నల దగ్గిర పెరుగుతాడు. అంతే గానీ డబ్బుకు లంకె పెట్టుకుని బతికే మీ వాళ్ళ మధ్య కాదుఅర్థమైందా?” అన్నాడు.

తన్మయి ఇవన్నీ విని, చెవికెక్కించుకునే ఆలోచనలో లేదు. పని చేస్తున్నా కళ్ల ముందు పరీక్షలు, పుస్తకాలు. అంతే

అర్థరాత్రి దీక్షగా ముందు వరండాలో చాపేసుకుని పుస్తకాల ముందు కూచున్న  తన్మయిని ఆశ్చర్యంగా చూస్తూనీకు పిచ్చి బాగా ముదిరిందే.” అన్నాడు.

అదేమి మాటన్నట్టు అతని వైపు చూసింది. తన్మయి.  

చదివింది చాల్లే. రేప్రొద్దున్న మా తాత గారింటికి వెళ్లాలి మనం.” అన్నాడు.

అదిరిపడింది తన్మయి. “రేపా? చివరి పరీక్ష రేపు. ఎల్లుండి వెళ్దాం.” అంది.

ఎదవ పరీక్షలు. మానేస్తే వచ్చే నష్టం ఏవీ లేదు. అయినా నీకు లెక్కేవుందిలే. చదువు తప్ప వేరే ప్ప్రెపంచం లేదు గదా తవరికి.  రేపు మన పెళ్లి రోజనయినా గుర్తుందా? అదీ నేను చెప్పాలా?”

పెళ్లిరోజు తనెలా మర్చిపోతుంది?! ఎన్నో కలలతో చేసుకున్న పెళ్లి ఇది.  అతన్ని ఎంతో గొప్ప సహచరుడిగా ఊహించుకుంది.  ప్రాణంగా ప్రేమించింది.  అతనితో కలకాలపు అందమైన జీవితాన్ని ఊహించుకుంది.

నోర్మూసుకుని పొద్దున్నే తాత గారి కాళ్లకి నమస్కారం పెట్టడానికి రా. అక్కణ్ణించి మా పిన్ని భోజనానికి పిల్చింది. సాయంత్రం……” అతను చెప్పుకెళ్లిపోతున్నాడు.

శేఖర్ ఊళ్లో ఉన్నాడంటే ఇంతే. ఎప్పుడూ చుట్టాల ఇంటికి తిరుగుతూనే ఉంటాడు. వాళ్లూ అంతే. ఎప్పుడు పడితే అప్పుడు  భోజనాలకు వస్తారు.

ఇన్నాళ్లలో  తన్మయి ఇవన్నీ ఎప్పుడూ కాదనలేదు. వచ్చిన వాళ్లకు శాయశక్తులా వండి పెడ్తూ ఉంది. అతని కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూనే ఊంది.

మారు మాట్లాడకుండా అతని కూడా వెళ్లకపోతే జరిగే రాద్ధాంతం కంటే, చివరి పరీక్ష రాయక పోవడం వల్ల వచ్చే నష్టం ఎక్కువగా కనిపించింది. తన్మయికి.

పరీక్ష 12 గంటల కల్లా అయిపోతుంది. మధ్యాహ్నమంతా అతనిష్టం ప్రకారం చెయ్యడానికి తనకి అభ్యంతరం ఏవీ లేదు. ఎప్పటిలాగే, అలవాటు పడిపోయిన జీవితం

అదే చెప్పింది దృఢంగా. తన్మయి గొంతులోని నిశ్చయానికి అసహ్యంగా చూసి, వెనక్కి తిరిగి పడుకున్నాడు శేఖర్.

అతని ముఖంలోకి చూసి బాధ పడే సమయం లేదు తన్మయికి.

ఏదో రకంగా గండం గట్టెక్కితే చాలన్నట్లు  ఉదయం అతను లేవక ముందే ఇంట్లోంచి బయట పడాలని ఆలోచిస్తూ నిద్ర రాక అటు ఇటూ దొర్లుతూ గడిపింది

చివరి పరీక్ష సంస్కృతం

కరుణకుమార సంభవంనుంచి చెప్పిన కాళిదాస శ్లోకం చప్పున జ్ఞాపకం వచ్చింది

వికారహేతౌ సతి విక్రియన్తే 

 యేషాం చేతాంసి ఏవ ధీరాః! ||”  

వికారం కలిగించే పరిస్థితి ఉన్నప్పడు కూడా  పరిసరముల ప్రభావమునకు లోబడని మనోదృఢత కలిగినవారే ధీరులు.” 

తన్మయి మనసులో  దానిని   విపత్తి హేతౌ  అంటే,

 “ప్రతికూల పరిస్థితి ఉన్నప్పడు కూడా పరిసరముల ప్రభావమునకు లోబడని మనోదృఢత కలిగినవారే ధీరులు. అని మార్చుకుని ధైర్యం తెచ్చుకుంది.

***

ఎనిమిది గంటలకి ముందే  డిపార్టుమెంటు బయట చెట్టు కింద పుస్తకం పుచ్చుకుని కూచున్న తన్మయిని చూస్తూనే

ఏవిటీ, నిన్నట్నించీ ఇక్కడే కూచుని పరీక్ష కోసం తపస్సు చేస్తున్నారా?” అన్నాడు కరుణ నవ్వుతూ.

దగ్గరగా వచ్చి ఎర్రగా ఉన్న తన్మయి కళ్లని చూస్తూమయీ! అంతా ఓకేనా?” అన్నాడు ఆదుర్దాగా.

అతని స్వరంలో ఆప్యాయతకు కళ్ల నిండిన కృతజ్ఞతా బాష్పాలతో అతని వైపు చూసి చిన్నగా నవ్వింది.

హమ్మయ్య, పీక్కు పోయిన మీ ముఖం చూసి భయపడ్డాను. అలా వెళ్లి కొంచెం కాఫీ తాగి వద్దాం, పదండి“. అన్నాడు.

యూనివర్సిటీ కేంటీన్ బయట గుంపులుగా నిలబడి అంత పొద్దుటే హడావిడిగా ఎందరో టిఫిన్ లు, కాఫీలు తాగుతున్నారు

పొగలుకక్కుతున్న ఇడ్లీ తింటున్నారు ఎవరో. అది చూడగానే తన్మయికి బాగా ఆకలేసింది. పరీక్షల వల్ల  మధ్య ఎందుకో సరిగా తినడం లేదు

కాఫీ వొద్దు గానీ ఇడ్లీ తిందాం.” అంది.

సంశయిస్తున్న అతన్ని చూసిబిల్లు నేనిస్తాలే“. అంది

గత కొద్ది నెలలుగా ఇంట్లో డబ్బులకు కొదవేం లేదు. శేఖర్ బీరువాలో ఉంచమని  చెప్పి అడపా దడపా డబ్బులు ఇస్తూ నే ఉన్నాడు

ఇన్ని ఎక్కడివి అని అడిగితే, “చెప్పినా నీకు అర్థంకాదులే. ఎన్నాళ్లు జీతం డబ్బుల మీద ఆధారపడతాం.  ఫ్రెండుతో కలిసి సముద్రం మీద చిన్న యాపారం మొదలెట్టేను. మా బాసుకి, ఓనరమ్మకి పొరబాటున కూడా చెప్పకు.” అన్నాడు.

పెళ్లిరోజుకని అతను ముందు రాత్రి తెచ్చిన పట్టుచీర, బంగారం గొలుసు సరిగా చూడను కూడా చూడలేదు తను.  

హలో, లోకంలోకి వెళ్లిపోయారు?” అన్నాడు కరుణ ఇడ్లీ ప్లేటొకటి తెచ్చి చేతికి ఇస్తూ.

అబ్బా, ఎంత బావుందో ఇడ్లీ. పచ్చడి మరీనుఅని ఆదరాబాదరా తింటున్న తన్మయి వైపు ఆశ్చర్యంగా చూస్తూఇది మీకు నచ్చిందంటే గ్రేటే. కేంటీన్ల కూడు తినలేక మేం బాధపడ్తూంటాం.” అన్నాడు.

బిల్లు కట్టడానికి ముందుకెళ్తున్న తన్మయిని కళ్లతోనే ఆపి, జేబులోంచి చక్కగా మడత పెట్టిన యాభై కాగితం తీసేడు కరుణ.

అదేవిటి చాలా జాగ్రత్తగా దాచిన కాగితం మారుస్తున్నట్లున్నారు?” అంది.

కష్ట సమయాలలో వాడమని మా అమ్మ ఇచ్చింది.” అని నవ్వేడు.

ఇప్పుడిది మార్చడం అవసరమా?…”అనేదో అనబోతున్న తన్మయి వైపు చూస్తూమొదటి సారి మనిద్దరం కలిసి తిన్న గుర్తుగా కాగితాన్ని మార్చడం కంటే గొప్ప సందర్భం ఏవుంటుంది? అయినా మరో అరగంటలో పరీక్ష. అయిదు నిమిషాలలో మనమక్కడ  ఉండాలి.   విషయం మరో సారి తీరిగ్గా మాట్లాడుకుందాం.” అని వేగంగా ముందు నడిచేడు.

అతని దగ్గిర తనకు నచ్చనిదదే. డిపార్ట్మెంటుకు తనతో కలిసి అడుగులు వెయ్యడానికి ఎందుకో భయపడతాడు.” నిట్టూర్చి అతని వెనకే అడుగులు వేసింది తన్మయి

పరీక్ష రాసి బయటకు వచ్చేక చాలా నిస్సత్తువ వచ్చేసింది తన్మయికి. అన్ని పరీక్షలూ సజావుగా రాసిన ఆనందమో, పరీక్షల వల్ల కలిగిన ఒత్తిడో

అందరం సినిమాకి వెళ్దాం.” అంది అనంత.

హడావిడిగా లేస్తున్న తన్మయిని చూస్తూఎక్కడికి తప్పించుకుంటున్నావ్?” అంది నవ్వుతూ.

నేను వెళ్లాలి.” అంది తన్మయి.

కారణం ఎవరికీ చెప్పడం ఇష్టం లేదు తన్మయికి.

చిన్న కోపంతో సన్నగా అదురుతున్న ముక్కు పుటాలతోఆవిణ్ణి వెళ్లనివ్వండి. ఎప్పుడు మనతో వచ్చింది గనకఅన్నాడు కరుణ.

కనీసం మళ్లీ ఎప్పుడు కలుస్తారో అయినా చెబుతారా?” అన్నాడు తన్మయి వైపు చూస్తూ  ఉక్రోషంగా.

తన్మయి మనసులో ఒకటే ఆలోచన. “ఎప్పుడెప్పుడు ఇవేళ్టి గండం గడిచి, ఊరెళ్ళి బాబుని చూస్తానా?” అని.

అదే చెప్పింది

సరేరిజల్ట్సు వచ్చేక కలుద్దాం. కాలేజీ తెరవడానికి వారం ముందు డిపార్టుమెంటులో బోర్డు పెడతారట. కనీసం సెలవుల్లోనైనా చదువు గురించి మరిచిపోయి హాయిగా బాబుతో గడుపుఅంది అనంత.

కానీ….” అనేదో అనబోతున్న రాజు వైపు చూసి, “మా పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకున్నారు. సెలవుల్లో సంబంధం సెటిల్ చేసుకోవదానికి ముహూర్తం పెట్టబోతున్నారు.” అంది అనంత.

మీరంతా తప్పక రావాలని రాజు పిలుద్దామని అనబోతున్నాడు. మీ ఆయనకి సెలవులు ఉండవని నువ్వు చెప్పేవు కదా.” అని తన్మయి వైపుఅతన్నితీసుకురావొద్దన్నట్టు  సైగ చేస్తూ  అంది అనంత.

వెంటనే గ్రహించి “మీ ఇద్దరికీ కంగ్రాట్స్.  నీకు తెలీనిదేవుంది అనంతా, శేఖర్ కి సెలవు ఉండదునేనూ మా ఊరి నించి ఎప్పుడొస్తానో తెలీదు. ఏవీ అనుకోవద్దు.” అంది తన్మయి.

అనంత దగ్గరగా వచ్చి నెమ్మదిగా “తన్మయీ, నిన్ను రావొద్దని నా భావం కాదు…” అని చెప్పబోయింది

బదులుగాఆల్ డి బెస్ట్ అనంతా!” అని,  అందరికీ చెయ్యి ఊపింది.

కనీసం మాతో కలిసి బస్టాండు వరకైనా రావా?” అంది అనంత.

కరుణ మరింత చికాగ్గా మొహం పెట్టి, “ఆవిణ్ణి వెళ్లనివ్వండి, టైం అవుతున్నట్లుందిఅన్నాడు.

అతని బాధ తన్మయికి అర్థమయినా, పట్టించుకునే పరిస్థితిలో లేదు

***

ఇంటి స్టాపులో  బస్సు దిగగానే  ముందు ఫోను బూత్ కి పరుగెత్తింది తన్మయి.

అట్నించి బాబుఉంగా ఉంగాకబుర్లు  వినే సరికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది తన్మయికి.

రేపే వస్తాను నాన్నా. అంత వరకు బొజ్జ నిండా బువ్వ తిని హాయిగా బజ్జో.” సంతోషంగా అంది.

ఏదో అర్థమవుతున్నట్లుకొట్టసాగేడు బాబు.

కంగరేం లేదులే. బాబు చక్కగా ఉన్నాడుఅంది జ్యోతి.

ఇంటికి వచ్చేసరికి శేఖర్ లేడు.

తలారా స్నానం చేసి అతను తెచ్చిన పట్టు చీర కట్టుకుని, గొలుసు వేసుకుంది

అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోయిందిసన్నగా జాజిమల్లెలా ఎంత అందంగా ఉంది చీరలో

ఎంత బావుంటే ఏం లాభం? శేఖర్ కి నచ్చకపోయేక.” అనుకుంది.

అంతలోనే చప్పున అతను వేసిన వేషాలు గుర్తుకు వచ్చి తన మీద తనకే విరక్తి కలిగింది

తనెంతగా అతనిని ప్రేమించిందో  అతను కూడా తనని అంతగా ప్రేమిస్తాడని తను ఊహించుకోవడం తప్పా? అసలతను తనని ప్రేమించకపోయినా  తనే  ప్రేమిస్తున్నాడని ఉహించుకుందా? …ఎన్ని విధాలుగా ఆలోచించినా అతని ప్రవర్తనకు అర్థం బోధపడడం లేదు తన్మయికి

తను అతన్ని ఆకర్షించలేకపోతున్నందు వల్లే అతనిలా పరాయి ఆడవాళ్ల వెంట పడుతున్నాడా?” న్యూనతతో కుంగిపోయింది కాస్సేపు

ఆకలి వేస్తూన్నా శేఖర్ వచ్చి భోజనానికి  తీసుకు వెళ్తాడని ఎదురు చూస్తూ అలాగే పడి నిద్రపోయింది.

చీకటి పడ్తూన్న వేళ మెలకువ వచ్చింది తన్మయికి.

శేఖర్ జాడ లేడు. ఫ్రిజ్ లోంచి కాసిన్ని పాలు తీసుకుని తాగింది.

బాబు కోసం మనసు కొట్టుకుంటూంది. ఇంక ఒక్క క్షణం కూడా ఉండలేదు తను. పొద్దున్నే బయలుదేరి బాబు దగ్గిరికి వెళ్లిపోవాలి.

మంచం కింద సూట్ కేసు బయటికి తీసి సర్ద సాగింది. మనసంతా చికాకుగా ఉంది

అప్పటిదాకా ఆకలితో వేచి చూసి విసిగి పోవడంతో  శేఖర్ వచ్చిన చప్పుడైనా వెనక్కి తిరిగి చూడలేదు. ఎంత సర్దుకుని పోదామని ప్రయత్నిస్తున్నా బాధ తన్నుకు వస్తోంది

లోపలికి వస్తూనేనేన్నీకు ఏం ద్రోహం చేసేనే? పెళ్లి రోజు కూడా మొగుణ్ణి లెక్క చెయ్యకుండా పరీక్షలని బయటికి పోయి పరాయివాడితో తిని తిరుగుతావా?” అన్నాడు.

తాగొచ్చేవా?” అంది అతని ఎర్రని కళ్లని చూస్తూ.

అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు.” అని అరిచేడు.

ఏం చెప్పాలి?” అంది బట్టలు సర్దుకుంటూ.

మా పిన్ని మొగుడు తన కళ్లతో చూసేడట. నువ్వు పొద్దున్నే యూనివర్శిటీ కేంటీన్ లో ఎవడితోనో కలిసి తినడం, తిరగడం. ఇదేనా నీ చదువు నాటకం?” అన్నాడు గట్టిగా.

పరీక్షకి ముందు ఆకలేస్తే కేంటీన్ కు వెళ్లి తిన్నాను. కాలేజీలో  కలిసి చదువుకునే వాళ్లతో  కేంటీన్ కు  వెళ్లడం కూడా తప్పేనా? అయినా నీకు చెప్పినా అర్థం కాదులే.” అంది విసుగ్గా.

అవునే. నాకు చెప్పినా అర్థం కాదు. నేనొక చదువు లేని ఎదవని. నా పెళ్లాం నిప్పని నమ్మిన ఎదవని. అందుకేనా నీ ఏషాలకి అడ్డం రాకుండా ఉంటాడని పిల్లోణ్ణి కూడా అమ్మగారింట్లో దిగబెట్టి వచ్చేవు?” 

ఛీ. ఆపుతావా?” అని అరిచింది తన్మయి.

ఏవిటే, నేను ఆపేది? పొద్దుట్నించి నేనొక్కణ్ణే చుట్టాల ఇంటికి తిరుగుతూంటే, నీ పెళ్లాం ఎవడితో తిరుగుతూందిరా అని అందరూ యెక్కిరించి నవ్వుతున్నట్లు కంపరం పుట్టుకొస్తాంది. ఎక్కడికి బట్టలు సర్దుతున్నావు? ఆడితో లేచిపోవడానికా?” అని నిలబడలేక మంచానికి అడ్డం పడ్డాడు. ఒంటి మీద తెలివి లేకుండా ఏదేదో గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడు.

తన్మయి వరండా బయటికి వచ్చి నిలబడింది. చీకటిలో ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న చుక్కల్ని  చూస్తూ  గొణిగింది

మిత్రమా! ఎక్కడున్నావు? ఇంత పెద్ద విశ్వాంతరాళంలో భూమ్మీద ఉన్న మనిషి జీవిత కాలమెంత? అందులో మనిషి సంతోషంగా గడిపే కాలమెంత? ఒక్క నిమిషమైనా ఫర్వాలేదు. నాకు ప్రశాంతంగా, సంతోషంగా జీవించే అవకాశాన్నివ్వు. ప్లీజ్.” చేతులు రెండూ జోడించి నేల మీద కూలబడింది.

కన్నీళ్లు తనకి తెలియకుండానే ఎంత సేపట్నించో చెంపల్ని కారుతూనే ఉన్నాయి

శేఖర్ చేసేవి చేస్తూ తనని శంకిస్తున్నాడు పైగా

ఏదో ఒక మోస్తరుగా ఉన్న తన లాంటి అమ్మాయిని చూడచక్కని రూపం ఉన్న శేఖర్ కావాలని వచ్చి పెళ్లి చేసుకోవడమే గొప్ప అనుకుని మురిసిపోయింది తను.

అతని మీద ఉండాల్సిన దానికంటే అధికంగా ప్రేమని పెంచుకుంది.

ప్రతిగా తను పొందుతున్నదేంటి?  మనసూ, శరీరమూ గాయాలు. పచ్చి ఆరని గాయాలు

కళ్లు తుడుచుకుని లోపలికి వచ్చింది.  నిద్రపోతున్న శేఖర్ వైపు చూసింది. నిద్రలో అందమైన బాలుడిలా కనబడుతున్నాడు. మెలకువలో ఇతనిలో రాక్షసుడు పరకాయ ప్రవేశం చేస్తాడనుకుంటా.  

అటు ఇటూ చూసి కనబడ్డ  పెన్సిలుతో బల్ల మీద చీటి రాసి పెట్టింది

బాబుని తీసుకురావడానికి ఊరు వెళ్తున్నాను. నీ లాగా, నువ్వు అనుకుంటున్నంత చెడ్డగా నేను దిగజారలేదు.”

***

తెల్లారి మొదటి బస్సెక్కింది తన్మయి. బస్సు కిటికీ లో నుంచి ఆహ్లాదంగా వీస్తున్న ఉదయపు గాలికి ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు

ఏవమ్మా, మీ ఊరు వచ్చింది. దిగవా?” కండక్టరు అరుపుకి దిగ్గున లేచింది

ఇంటికి చేరుకోగానే బయటే వరండాలో ఆడుకుంటున్న  బాబు తల్లి వైపు పడుతూ లేస్తూ  అడుగులేసాడు. సూట్ కేసు గుమ్మం దగ్గిరే వొదిలేసి ఒక్క ఉదుటున వాడి వైపు పరుగెత్తింది తన్మయి. రెండు చేతుల్లో పైకి ఎత్తుకునిచిన్న ఎముకలు గుచ్చుకునే వాడి పసి గుండెల మీద తలవాల్చగానే ప్రపంచం లోని వేదనలన్నీ తొలగిపోయిన నిశ్చింత కలిగింది.

ఇంకెప్పుడూ నిన్ను వొదిలి వెళ్ళను నాన్నాఅంది కళ్లు మూసుకుని

ఎప్పటిలాగే వచ్చి పదిరోజులవుతున్నా శేఖర్ నించి ఫోను లేదు.

దేవి మాత్రం రెండో వారం లో ఫోను చేసి తమ మనవడు తమ ఇంట్లోనే ఉండాలన్నట్లు ఆర్డరు జారీ చేసింది.

ఇదేమీ కొత్త కాదు కదా తన్మయికి. మారుమాట్లాడకుండా వెళ్లి, సెలవులయ్యేంత వరకూ అత్తగారింట్లో చెప్పిన పనల్లా చెయ్యడానికి సిద్ధ పడింది.

ఎప్పటిలాగే తల్లి అడ్డుకోబోయింది

అసలే అతనికి ఇష్టం లేకుండా వచ్చింది తను. కాలేజీ విషయంలో అతనికీ, తనకీ భేదాభిప్రాయాలు తప్పడం లేదు. కనీసం సెలవుల్లోనయినా అతని ఇష్ట ప్రకారం కొన్నాళ్ళు ఉంటే కాస్త శాంతిస్తాడేమో.” 

అదే చెప్పింది తల్లికి.

ఏమోనమ్మా, నీ  ఇష్టం”  నిష్ఠూరంగా అని, “పిల్లాడు చక్కగా అలవాటు అవుతున్నాడు మాకు. మేం  మాత్రం వాణ్ణి వొదిలి ఎలా ఉండగలం?”  అని దుఃఖపడింది.

అత్తగారింట్లో బాబుని పొద్దున్నే తయారు చెయ్యడం,  మధ్య మధ్య అన్నం తినిపించడం వంటి పనులకు మాత్రమే తన్మయి దగ్గిర వదిలే వాళ్లు. మిగతా సమయమంతా వాళ్ల దగ్గిరే గడిపే వాడు బాబు.

రోజల్లా వంటింటి పని, ఇంటి పనీ సరిపోయేది తన్మయికి. మాత్రం సమయం చిక్కినా పుస్తకం, పెన్ను పట్టుకుని రాసుకోవడం అలవాటుగా మారింది. ఎమ్మే మొదటి సంవత్సరంలో చదివిన పుస్తకాల గురించి అభిప్రాయాలు రాయడమో, నచ్చిన పద్యాలు గుర్తు తెచ్చుకుని రాసుకోవడమో, స్వంతంగా అర్థం పర్థం లేని రాతలు రాయడమో ప్రప్రంచంగా మారింది

కలర్ టీవీ లో దూరదర్శన్ కాకుండా కొత్తగా మొదలైన టీవీ ఛానెల్  కి ఇంటి వాళ్లంతా అతుక్కుని కూచుంటే, తన్మయి కాగితాల మధ్య గడపడాన్ని అత్తగారు చాలా విచిత్రంగా చూసేది.

అసలు ఏం రాస్తూందో అని కుతూహలం బాగా పెరిగిపోయినట్లు ఆవిడ ముఖమే చెప్తూండేది.

రోజు తన్మయి స్నానానికి వెళ్లొచ్చే సమయానికి  పుస్తకం తెరిచి ఉండడం కనిపించింది.

అందులో అజ్ఞాత మిత్రుడి ఉత్తరం పేజీ దగ్గిర ఆగిపోయిన చదువరి మన:స్థితిని ఊహించుకుని నవ్వుకుంది

వారంలో సెలవులవుతాయనంగా బాబుని ఒళ్ళో ఆడిస్తున్న దేవి దగ్గిరికి వెళ్లింది తన్మయి.

అత్తయ్యా, రేపు, ఎల్లుండిల్లో నేను వైజాగు బయలుదేరుతాను.” అంది.

ఎందుకు?” అంది తన్మయి వైపు చూడకుండానే.

అసలా ప్రశ్నకు అర్థం బోధ పడలేదు తన్మయికి

మా ఇంటికిఅంది స్థిరంగా.

శేఖర్ నాతో చెప్పేడు నువ్వక్కడ చేస్తన్న పనులు. నువ్విప్పుడు గొప్ప చదువు చదివి ఎవరినీ ఉద్ధరించక్కరలేదు. మా దగ్గిరే ఉండు. శేఖర్ కి కుదిరినప్పుడు వచ్చి చూసెళ్తాడు.” అంది కఠినంగా.

తన్మయికి  భయంతోనూ, ఆందోళనతోనూ దు:ఖం గబుక్కున ఉబికింది.  గొంతు పూడుకుపోయింది. ఏవీ మాట్లాడలేక  కాళ్లు వణకసాగేయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “వెనుతిరగని వెన్నెల(భాగం-22)”

  1. మీనవల 22వ భాగం విన్నాను/చదివాను.
    బాగా రాసారు, అంతకంటే బాగా చదివారు.మీకు అభినందనలు. మాది కూడా తూర్పు గోదావరి ఆకాశవాణి-విశాఖపట్నం కేంద్రం లో మా చిన్నన్నయ్య డా.కె.మధుసూదన్ పనిచేసేవారు.

Leave a Reply

Your email address will not be published.