మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

ఐతే ఎక్కువమందికి పని ఇస్తున్నాకొద్దీ మొదట పని ఇచ్చిన వాళ్ళకి పని ఇస్తామన్నారు. ఖనిజంకంటే తక్కువ నాణ్యతగల రాళ్లన్నిటినీ గని లోంచి తీయగానే కుప్పగా పడేస్తే ఈ గుట్ట తయారయింది. గని పని మొదలయిన రోజుల్లో లోపలినుంచి వచ్చే రాళ్లు నల్లగా బొగ్గులాగ ఉండేవి. అది చాల నాణ్యమైన ఖనిజంగల రాయి అన్నమాట. దీంట్లోంచి ఖనిజాన్ని వేరుచేసి రాళ్ళను పారేస్తే ఈ గుట్ట తయారయింది. అయితే ఈ రాళ్ళలో మరికొంత ఖనిజం మిగిలి ఉండేది. మాకు వాళ్ళు అప్పగించిన పని ఈ ఖనిజాన్ని ఏరడం. మేం ఈ రాళ్ళను చూసి, కొంచెం ఖనిజం మిగిలి ఉన్న రాళ్ళను ఏరి వాటిని బస్తాల్లో వేసుకుని, మర దగ్గరికి తీసుకెళ్ళి, సానపట్టించి కం పెనీకివ్వాలి. బస్తాల లెక్క చొప్పున స్త్రీలకు డబ్బులిస్తామని వాళ్ళన్నారు. ఈ పని ప్రయోగాత్మకంగా మూడు నెలలపాటు జరుగుతుంది. మూడు నెలల తర్వాత ఈ పని ఒప్పందం మీద సంతకాలు జరుగుతాయి.

“ఎంత మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు?” అని మేనేజర్ నన్ను అడిగాడు.

“రెండు వందలమంది.”

“సరే-మేం అందరినీ పనిలోకి తీసుకుంటాం, అందర్నీ ఇటు రమ్మనండి. మాట్లాడుదాం” అన్నాడు.

నేను స్త్రీలందరినీ దగ్గరికి పిలిచి విషయమంతా వివరంగా చెప్పాను. వాళ్ళలో చాలమంది, ముఖ్యంగా వితంతువులు “అమ్మో! రాళ్ళ గుట్టకా? వద్దాద్దు – మేం . అక్కడ పనిచేయం” అన్నారు.

మేం మొదటినుంచీ ఎవరికి పనికోసం వెతుకుతున్నామో వాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదు. వాళ్ళు పనిచేయడం మొదలెట్టారు. వాళ్ళు ప్రతిరోజూ దుమ్ముకొట్టుకొని, అలసిపోయి ఇంటికి చేరేవాళ్ళు. వాళ్ళ చేతులు బొబ్బలెక్కి రక్తాలు కారుతుండేవి. వాళ్ళు ప్రతిపనీ, ఖనిజం ఏరడమూ, దాన్ని వేరుచేయటమూ, సంచుల్లో నింపడమూ – అన్నీ చేతితోనే చేయాల్సి ఉండేది.

వాళ్ళకు నెలకు నాలుగువందల పిసోల దాకా ఇచ్చేవారు. అబ్బ వాళ్ళాపనినే స్వర్గంగా భావించారు. వాళ్ళెంత సంతోషపడ్డారో మీరు చూసి ఉండాల్సింది. వాళ్ళకు జీతం డబ్బులు చేతికందగానే మా ఇంటికి పరిగెత్తుకొచ్చి “ఏమమ్మోవ్ మాకు నాలుగు వందల పిసోలొచ్చాయి. మాకు డబ్బులొచ్చాయోచ్” అని ఆనందంగా అరిచేవాళ్ళు. ఎంత కష్టపడ్డా తమ జీవితంలో ఒక మార్పు వచ్చింది గనుక వాళ్ళు చాల సంతోషపడ్డారు.

రాళ్ళగుట్టమీద పనిచేసే స్త్రీలు నెలకు నాలుగువందల పిసోలు సంపాదించుకున్నారని తెలియగానే. ఆ పని చేస్తామంటూ ఎంతోమంది రావడం మొదలెట్టారు. అలా దాదాపు ఐదువందల మంది స్త్రీలు కటావికి వెళ్లి పని చూపమని యాజమాన్యాన్ని కోరారు. అందరినీ అప్పటికప్పుడే తీసుకోవడం సాధ్యంకాదనీ, నెలకు వందమందికి చొప్పున పని ఇస్తామనీ యాజమాన్యం చెప్పింది. ఐతే ఎక్కువమందికి పని ఇస్తున్నా కొద్దీ మొదట పని ఇచ్చిన వాళ్ళకి తక్కువ జీతం ఇవ్వడం మొదలెట్టారు. రెండో నెలలో మూడువందల పిసోలు, ఆ తర్వాత రెండువందల పిసోలు, చివరికి నూటెనభై సోలు ఇచ్చారు.

అనుకున్న మూడు నెలల ప్రయోగకాలం పూర్తికాగానే కాంట్రాక్టు ద్వారా ఉద్యోగాలకు చట్టబద్ధం చేసుకురావడానికిగాను మేం మా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్గోనె న్ను మేనేజర్ దగ్గరికి పంపాం. మేం తయారు చేసిన కాంట్రాక్టు ప్రణాళికలో ఈ రాళ్ళగుట్ట కార్మిక స్త్రీలందరినీ కంపెనీ కార్మికులుగానే గుర్తించి సాంఘిక భద్రత, కిరాణా వస్తువుల రాయితీలు, వైద్య సౌకర్యాలు, మొదలైనవన్నీ కల్పించాలన్నాం. మా డిమాండ్లను అంగీకరించకపోతే ప్రత్యక్ష చర్యకు దిగుతామని హెచ్చరించాం.

మేం ఈ ఆలోచనలు చేస్తూండగానే మాకొక సంగతి తెలిసింది. ఒరురొ నుంచి వచ్చిన ఒక ప్రభుత్వ ఏజెంటు ఆ స్త్రీల విశ్వాసాన్ని ఎంతగా చూరగొన్నాడంటే, వాళ్ళతన్ని తమ సలహాదారుగా నియమించుకున్నారు. మాకు మాట మాత్రమైనా చెప్పకుండానే వాళ్ళు ఫలానా అతను తమ సలహాదారు అనీ, రాళ్ళగుట్ట స్త్రీల డిమాండ్లకు అతనే ప్రతినిధిగా వ్యవహరిస్తాడనీ యాజమాన్యానికి ఉత్తరం రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు యూనియన్ నుంచీ, గృహిణుల సంఘం నుంచి వైదొలిగారు.

ఈ సంగతి తెలిసి మేం మేనేజర్ దగ్గరికి వెళ్లాం. “ఏదో పనిమీద వచ్చినట్టున్నారే?! ఏమిటి సంగతి? ఏం కావాలి?” అని ఆయన అడిగాడు.

ఆయన పాత మేనేజర్ కాదు. ఆ మేనేజర్ ను వాళ్ళు మార్చేశారు. రాళ్లగుట్ట మీద స్త్రీలు పనిచేయడం మొదలెట్టి మూడునెలలైపోయింది గనుక ఇక ఒప్పందానికి రావలసిన సమయం వచ్చిందని ఆయనకు చెప్పాం.

మా అనుభవ శూన్యతవల్ల పాత మేనేజర్ నోటిమాటమీద ఒప్పుకున్నదాన్నే మేం ప్రమాణంగా తీసుకున్నాం. ఏం ఒప్పందం జరిగిందో చూపడానికి మా దగ్గర కాగితాలేమీ లేవు.

“అలాగా.. చూద్దాం” అని ఆ మేనేజర్ తన కార్యదర్శిని పిలిచి “ఏదీ రాళ్ళగుట్ట. స్త్రీలు రాసిన ఉత్తరం ఇలాతే. ఏం రాశారో చూద్దాం” అన్నాడు. మాకాయన ఆ ఉత్తరం చదివి వినిపించాడు. దాంట్లో వాళ్ళు తాము తమ తోటి కార్మికుడిని, ఆ ఒరురో వాడిని తమ ప్రతినిధిగా, తమ సలహాదారుగా ఏకగ్రీవంగా నియమిస్తున్నామని రాశారు.

“చూడండమ్మా – ఈ ఉత్తరం ప్రకారం- రాళ్ళగుట్ట స్త్రీలు మరో నాయకత్వం కిందికి పోయారన్నమాట” అన్నాడాయన.

ఈ సంగతి మాకు తెలియనే తెలియదు. ఏం జరిగి ఉంటుంది? ఎంత ఆశ్చర్యం? ఇది ఇట్లా ఎందుకు జరిగింది? మాలో మేమే మధన పడ్డాం.

“కనుక నేను రాళ్ళ గుట్ట స్త్రీల గురించి మీతో మాట్లాడడానికేమీ లేదు. మీరు మరేపనిమీదైనా వస్తే ఇక్కడికి రావచ్చు. మేం ఆ స్త్రీల సమస్యమీద వాళ్ళ ప్రతినిధితో చర్చలు ప్రారంభించాం. అన్నీ సవ్యంగానే పరిష్కారమవుతాయి” అన్నాడు.

ఈ విషయం మమ్మల్ని చకితుల్ని చేసింది. ఒక కుదుపు కుదిపింది. మేం చాల నిరుత్సాహపడ్డాం. ఏం జరిగి ఉంటుందని విచారించాం.

నా చెల్లెలు ఇంటికి రాగానే నేను దాన్ని అడిగాను. “మాకు చెప్పనైనా చెప్పకుండా అలా ఎందుకుచేశారు? అసలేం జరిగింది?”

“నాకాసంగతులేమీ తెలియవు. మాకు కూడా వాళ్ళేమీ చెప్పలేదు” అంది. తను ఈ సంగతి మిగిలినవాళ్లకు తెలియజెప్పుతానంది.

కొందరు కార్మికులూ, “సలహాదారూ” సంతకాలు చేసిన ఒప్పందంతో కార్మికులు ఏమాత్రమూ లాభపడలేదు. వాళ్లు గతంలో లాగనే బానిసత్వంలో మగ్గిపోయారు.

ఆ సమయానికే ఫెడరికొ ఎస్కోబార్ విడుదలై సైగ్లో-20కి తిరిగి వచ్చేశాడు. కాని ఆయన ఏ పనీ చేసే వీలులేక పోయింది. 1953లో ఎం.ఎన్.ఆర్. ప్రభుత్వ కాలంలో ఒక చట్టం ద్వారా అమలులోకి వచ్చిన ‘కార్మిక అధికారం’ నిషేధించబడడంతో ఆయనకు ఏ పనిచేసే అధికారమూ లేకపోయింది. ‘కార్మిక అధికారం’ గనుల జాతీయకరణ కాలం నుంచి అమలయింది. దాని పరిధిలో కంపెనీ వ్యవహారాలన్నీ ఉండేవి. ఎంత తగరం బయటికి తీస్తున్నదీ, ఎంత లాభాలొస్తున్నదీ, ఆ లాభాల పంపకం ఎట్లా జరుగుతున్నదీ, వ్యాపార కాంట్రాక్టులు ఎట్లా కుదురుతున్నదీ మొదలైన విషయాలన్నీ ఈ ‘కార్మిక అధికారం’ కింద ఉండేవి. అంటే గనులు దాదాపుగా ప్రజల చేతుల్లోనే ఉండేవన్నమాట. ఈ ‘కార్మిక అధికార చట్టం’ స్వేచ్ఛగా ఎన్నికైన ఒక ప్రతినిధికి అధికారాన్ని కలిగించేది.

ఫెడరికో ఎస్కోబార్ గని కంపెనీ యజమానులకు పంటి కింద రాయి అయిపోయాడు. ఆయన చాల నిజాయితీ పరుడు. ఆయన ఎన్నడూ కం పెనీకి అమ్ముడు పోలేదు. కనుకనే వాళ్ళు కార్మిక అధికారాన్ని నిషేధించాలనుకున్నారు. ఈ నిషేధం 1965లో జరిగింది. ఐతే తర్వాత మేం మళ్ళీ చాల సంవత్సరాల పోరాటంతో దాన్ని సాధించుకున్నా మనుకోండి.

సరే – ఆయన విడుదలై వచ్చాక నేను ఫెడరికోతో మాట్లాడడానికి వెళ్లాను.

“చూడండి – ఈ స్త్రీ కార్మికుల విషయంలో కాంట్రాక్టు కుదుర్చుకోవడమో, ఒక ఒప్పందం సంతకం కావడమో ఏదో ఒకటి జరిగి ఉండవలసింది. మనం ఇప్పుడేం చేయగలం? వాళ్ళు కనా కష్టంగా, బాధలతో బతుకు వెళ్ళదీస్తున్నారు. కంపెనీ ఏమో వాళ్ళకు అబద్దాలు చెప్తూ పబ్బం గడుపుకుంటోంది. వాళ్ళు చాల తక్కువ ప్రతిఫలానికి చాల కష్టమైన పని చేస్తున్నారు. వాళ్ళకు కం పెనీ కార్మికులకుండే ఏ సౌకర్యాలూ లేవు” అని నేనాయనకు వివరించి చెప్పాను.

ఆ తర్వాత వీలైనన్ని చోట్ల ఈ విషయం గురించి ఒత్తిడి తెచ్చాం. ఎస్కోబార్ సాయంతో వాళ్ళకు దుకాణంలో సరుకులు కొనుక్కునే హక్కు వచ్చింది. పిల్లల్ని కంపెనీ బడికి పంపించే సౌకర్యం వచ్చింది. ఈ రకంగానే మేం వాళ్ళకు మరికొన్ని చిన్న చిన్ని రాయితీలు కూడా సంపాదించి పెట్టాం.

రాళ్ళ గుట్ట స్త్రీలు ఈ పద్దతిలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. ఈలోగా వాళ్ళలో వాళ్లకే ఎన్నో విభేదాలొచ్చాయి. ఎన్నో చీలిక గ్రూపులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఒక పెద్ద గ్రూపుకు ఇద్దరు రాజకీయ కార్యకర్తలు నాయకత్వం వహించారు. వాళ్ళు ఈ స్త్రీలను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ప్రదర్శనలు జరిగినప్పుడల్లా వాళ్ళు ఈ స్త్రీలను ట్రక్కులో నింపుకెళ్ళే వాళ్ళు. దీనితో ఈ స్త్రీలందరూ బారియెంటోసను సమర్థిస్తున్నట్లే కనబడింది. మరొక చిన్న బృందం మాత్రం ఎవరితో సంబంధం లేకుండా మిగిలిపోయింది.

1970లో జనరల్ టారెస్ అధికారానికొచ్చినప్పుడు రాబోయేది ప్రజాస్వామిక ప్రభుత్వమని ప్రచారమయింది. కనుక మేం ఈ సమయాన్ని వినియోగించుకోవాలనుకున్నాం. “ఆరేళ్ల తర్వాతనైనా కళ్లు తెరవండి. ఏదో ఒకటి చేయండి. పరిస్థితి మళ్ళీ ఎప్పుడూ ఇలాగే ఉండదు’ ‘ అని నేను మా చెల్లెలితో చెప్పాను. చట్టం ప్రకారం మూడు నెలలపాటు పనిచేస్తే పాం కార్మికులకు పూర్తిస్థాయి కార్మికుల హక్కులు వస్తాయి. ఇది ఒక ప్రతిపాదనగా పెట్టమని నేను సూచించాను.

నా చెల్లెలు స్త్రీలతో మాట్లాడడం మొదలెట్టింది. వాళ్ళు చర్చిలో ప్రీస్టులను కూడా సాయం చెయ్యమని కోరారు. అప్పుడు చర్చివాళ్లు ఈ స్త్రీలు ఎంత అవమానకరమైన, కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్నదో వివరించే కరపత్రాలు ప్రచురించారు. ఇలా రాళ్ళ గుట్ట స్త్రీలు కూడా సంఘటితమయి తమను పూర్తిస్థాయి కంపెనీ కార్మికులుగా గుర్తించమనీ, అన్ని సౌకర్యాలూ కలిగించమనీ ఆందోళన చేయడం మొదలు పెట్టారు.

కాని ఈలోగా స్త్రీ కార్మికుల ప్రతినిధి బృందం ఒకటి కొమిటీల్ తో చర్చలు జరిపింది. కొన్ని డబ్బులిచ్చి ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వాళ్ళను కొమిటీల్ ఒప్పించింది. చాల మంది స్త్రీలు ఇందుకు అంగీకరించారు. చాల కొద్దిమంది మాత్రం తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, పని పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి పోరాడారు. ఐతే ఎక్కువమంది కోరిందే తక్కువమంది కూడా పాటించాల్సి వస్తుందిగదా! చివరికి అలాగే జరిగింది.

ఓ సారి జువాన్ లెచిన్ నాకో కార్మికుల సమావేశంలో కలిసాడు. నేనక్కడ “రాళ్లగుట్ట స్త్రీ కార్మికులను అలా వెళ్ళగొట్టడం ఏమీ మంచిపని కాదు. ఎంతమంది వెళ్లి పోదలచుకుంటే అంతమందిని వెళ్ళిపోనివ్వండి. కాని పని చేయదలచుకున్న వాళ్లకు మాత్రం పని చూపాల్సిందేగదా! వాళ్లకు ఏదో బతుకుతెరువు చూపించమని మేం అడుగుతున్నాం. వాళ్ల పని పరిస్థితులు మెరుగుపరచాలి. వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించొద్దు. మరి ఈ స్త్రీలకు పని ఎక్కడ దొరుకుతుంది? వాళ్లకు మరెక్కడా పనిచేసే అవకాశం లేదు. అంతేగాక వాళ్లిన్నాళ్లూ కూడబెట్టుకున్నదీ ఏమీలేదు. ఇప్పుడు వాళ్ల మొఖాన ఏవో నాలుగు డబ్బులు పారేసి వెళ్లి పొమ్మనడం ఏం న్యాయం? వాళ్ళలో చాలామందికి అప్పులున్నాయి, రోగాలున్నాయి. వాళ్లను అట్లాగే రోగంతో, అప్పులతో వీధిలోకి నెట్టేద్దామా? వాళ్లు చేతిలో డబ్బూ లేక బతుకుదెరువూ లేక ఏం చేసి బతుకుతారు? మీరు కూడా కార్మికులే. ఇలా జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మనందరమూ వాళ్ళకు మద్దతివ్వాలి” అన్నాను. ఆ తర్వాత రాళ్ళగుట్ట స్త్రీ కార్మికులు కొందరు నా దగ్గరికొచ్చి వాళ్ల సమస్యతో నాకేం సంబంధమని అడిగారు. తాము గృహిణులంకామనీ, కార్మికులమనీ చెప్పారు. వాళ్ళన్నమాట నిజమే. కాని వాళ్లను సంఘటిత పరిచింది. గృహిణుల సంఘం. మా కార్యక్రమ ప్రకటనలో మేం “వితంతువుల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి పోరాడుతాం” అని రాసి పెట్టుకున్నాం. కనుక వితంతువులకు మేం చేసి పెట్టవలసిన పనిలో భాగంగానే మేం వాళ్ళకు ఉద్యోగాలిప్పించాం. ఆ రోజుల్లో నేను సంఘం కార్యదర్శిగా ఉన్నాను గనుక, సంఘం ఆ పనిని నాకు అప్పజెప్పింది. గనుక నేను చేయగలిగినంత చేశాను. అంతేకదూ!

పనిచేయదలచుకున్న కొద్దిమంది స్త్రీలు నా సహాయం కోరారు. కనుక మేం కొమిబొల్ తో మాట్లాడడానికి తపాజ్ వెళ్లాం. కొమిబొల్ ఒక కుట్టుపని సహకార కేంద్రాన్ని తెరవడానికి ఒప్పుకుంది. ప్రభుత్వం కుట్టు మిషిన్లను విరాళంగా ఇవ్వడానికి అంగీకరించింది. ఐతే మా స్త్రీలెవరికీ కుట్టుపని రాదు గనుక ముందే మూడు నెలల జీతం ఇమ్మనీ, దానితో వాళ్లు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని నేర్చుకుంటారనీ మేం ప్రతిపాదించాం. ఆ తర్వాత కం పెనీయే వాళ్లకు ఉద్యోగాలిస్తుంది. వాళ్లు కం పెనీకి సంబంధించిన కుట్టుపనులే చేయాలి. మేం ఈ రాళ్ళగుట్ట స్త్రీ కార్మికుల కోసం ఈ మాత్రమైనా సాధించగలిగాం. ఆ సహకార కేంద్రం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఐతే దాంట్లో పనిచేసేది చాల తక్కువ మందే.

రాళ్లగుట్ట స్త్రీ కార్మికులకు మేం సాధించి పెట్టినది మరొకటి ఉంది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ వాళ్లకు కంపెనీ ఎనిమిది వందల పిసోల నష్టపరిహారం చెల్లించదలచింది. ఐతే చట్టం ప్రకారమూ, యూనియన్, లెచిన్ల సాయంతోనూ మేం కం పెనీని రెండువేల పిసోల చొప్పున ఇవ్వడానికి ఒప్పించాం. కం పెనీని వదిలిపోయే ఇతర కార్మికులకు దొరికే సౌకర్యాలన్నీ వీళ్ళకు కూడా వర్తింపజేయడానికి ఒప్పించాం.

ఎంత వ్యతిరేకత వచ్చినా ఈ విషయంలో నేను నిజమైన నాయకురాలినైనానని అనుకున్నాను. విచారపడడానికి గానీ, ‘వాళ్ళు నా పట్ల సరిగా ప్రవర్తించలేదు గనుక ఇక వాళ్ళ , సంగతులు పట్టించుకోను’ అని అలగడానికి గానీ అవకాశమే లేదు. జనం అజ్ఞానం వల్ల మాత్రమే అలా ప్రవర్తిస్తారని నేనర్థం చేసుకున్నాను. అంతేకదూ? పాపం! వాళ్లకి కార్మిక చట్టాలు తెలియక ఇలా జరిగింది.

ఈ రాళ్ళ గుట్ట స్త్రీ కార్మికుల సమస్య నన్ను చాల విషయాలు ఆలోచించేట్టు చేసింది. ఏమంటే, మేమందరమూ, స్త్రీలమూ పురుషులు కూడా, కార్మిక చట్టాలను సరిగా అర్థం చేసుకుంటే మేం మా డిమాండ్లను సంఘటితంగా, మరింత సరిగా పెట్టవచ్చును. మాలో చాల మందికి మాకేం హక్కులున్నాయో తెలియదు. మమ్మల్ని ఏ చట్టాలు రక్షిస్తాయో తెలియదు. మాకు అనుకూలంగా ఏ నిబంధనలున్నాయో తెలియదు. అందువల్లనే మాకు న్యాయంగా రావలసిన వాటినీ, మా యజమానులు మాకివ్వాల్సిన వాటిని అడగడానికి కూడ మేం భయపడుతున్నాం. ఎప్పుడు ఎలా అడగాలో తెలియనందువల్లనే ఎన్నో ప్రయోజనాలు పోగొట్టుకున్న కార్మికుల గురించీ, వితంతువుల గురించీ నాకు తెలుసు. వాళ్ళకు చట్టం గురించి తెలియదు. శ్రద్ధాలేదు. అందుకనే వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా సరిగా అమలు కావడం లేదు.

గృహిణుల సంఘంలో మేం ఇలా తెలుసుకోవలసినవెన్నో ఉన్నాయి. కాని మనం స్త్రీల నుంచి వాళ్ళు ఇవ్వగలిగిన దానికన్న ఎక్కువ అడగలేంగదా!? ఇక్కడ ప్రతిదీ ఇంత కష్టభరితంగా ఉన్నప్పుడు, బతకడానికే ఎంతో శ్రమపడాల్సి ఉన్నప్పుడు ఇలాంటి ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా అధ్యయనం చేసే వీలెక్కడుంటుంది?

నా వరకు నాకు కార్మిక చట్టాలన్నీ చదివే అవకాశం దొరకనే లేదు. ఐతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం యూనియన్ గ్రంథాలయానికి వెళ్ళి ఆ చట్టాలు తెచ్చుకుని చూస్తాను. నేను కార్యదర్శితో ఫలానా సమస్య గురించి సమాచారం కోసం వెతుకుతున్నానని చెప్పగానే ఆయన ‘అది ఫలానా పేజీలో, ఫలానా వ్యాసంలో ఉంది’ అని చెప్పేవాడు. మా నాయకులకి ఈ చట్టాలు బాగా తెలుసు.

రాళ్ళగుట్ట కార్మికుల ప్రధాన సమస్య అజ్ఞానమే అనుకుంటాను. కదా? తమను రక్షించే చట్టాల గురించి వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడమేగాక తమకు ద్రోహం చేసి వెళ్ళిపోయిన ఆ ఇద్దరు నాయకులను వాళ్ళు చాల ఎక్కువగా నమ్మారు. అందువల్లనే మేం వాళ్ళకు సాయం చేద్దామని పోయినప్పుడు వాళ్ళు నిజంగానే మమ్మల్ని దూరం కొట్టారు. చివరికి ప్రభుత్వం రాళ్ళగుట్ట మీద స్త్రీలు పనిచేయడం జాతికి అవమానమని ప్రకటించి, ఆ అవమానానికి ముగింపు పలికింది. అయితే వాస్తవమేమంటే సమస్యకు సవ్యమైన పరిష్కారం వెతికే బదులు వాళ్ళు నాలుగువందల మంది స్త్రీలను ఆకలి చావులవైపు నెట్టారు.

ఆ స్త్రీలలో చాలమంది ఇప్పుడు “మేం అప్పుడు పొరపాటు చేశాం. అలా చేసి ఉండకపోతే ఇప్పటికీ పనిలో ఉండేవాళ్ళమే” అంటూ ఉంటారు. వాళ్ళలో చాలామంది రోజు రోజూ పనికోసం వీధుల్లో తిరుగుతుంటారు. వాళ్ళలో చాల మంది ఇప్పుడు సంఘటిత పడదలచుకున్నారు. కాని ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది కదూ?

రాళ్ళగుట్ట స్త్రీ కార్మికుల పరిస్థితులు, వాళ్ళు పనిచేయవలసి ఉండిన పరిసరాలు నిజంగానే ‘జాతికి అవమానం’ అనే మాటకు తగినవే. ఐతే స్త్రీలకు పనిలేకపోవడం మాత్రం బొలీవియాకు అవమానం కాదూ? మరీ ముఖ్యంగా భర్త చనిపోయాకనో, భర్త ప్రవాసం పంపబడితేనో, భర్త ఉద్యోగం నుంచి తొలగించబడితేనో దారిద్ర్యంలో మగ్గిపోయే స్త్రీకి బతుకు దెరువుకు ఓ ఉద్యోగం కావద్దూ?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.