కథా మధురం  

సయ్యద్ నజ్మా షమ్మీ

 అమ్మతనానికి అసలైన అర్ధం చెప్పిన కథ  – ఆపా!

-ఆర్.దమయంతి

 Being a mother is an attitude, not a biological relation

– Robert A. heinlein

దేవుని దృష్టిలో ఆడదెప్పుడూ గొప్పదే. 

ఆయన స్త్రీ మూర్తి కి ఇచ్చిన స్థానం  ఎంత గొప్పదీ అంటే, తన పేరుకి ముందు భార్య పేరు పెట్టుకుని మరీ గౌరవించాడు ఆ తండ్రి.  

అందుకే, అమ్మ మనకు ప్రధమ పూజ్యురాలైంది. మాతృదేవోభవ..అంటూ  వందనాలు అందుకుంటుంది.

ఈ క్రమం లో అమ్మ కాలేని వారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. కానీ, కంటేనే తల్లా? కాదు. కమ్మని మనసున్న ప్రతి ఆడదీ అమ్మేరా..’ అని చెప్పాడు ఓ మధురకవి. అమ్మ కడుపు చల్లగా ఎంత గొప్ప మాట చెప్పాడు కదూ?

సరిగ్గా ఈ ఆపా కథలో కూడా  ఈ ఆత్మతత్వమే  ప్రతిబింబిస్తుంది. 

ఇంతకీ అమ్మ మనసున్న  ఆపా (అక్క) ఎవరు? ఏమా సంగతీ అంటే.. 

అసలు కథ : 

అదొక చిన్న వూరు. ఆ వూళ్ళో అరవై యేళ్ళ  సీనియర్ సిటిజెన్ – ఆపా. ముక్కు సూటి మనిషి. నిజాయితీ పరురాలు. సహాయకారి. కష్టం లో వున్న వారికి వెంటనే గుర్తొచ్చే ఆపద్బాంధవి. ఎంత మంచిదో, అనుకుని హద్దులు మీరితే అంత గానూ వొణికించగల సమర్ధురాలు. ఒక్క అరుపు అరిచిందంటే , ఊరి జనమంతా పరుగులెత్తుకుంటూ ఆమె ఇంటిముందు గుమి కూడాల్సిందే.

ఆ రోజు కూడా ఇదే జరిగింది. ఆపా ఎందుకు అరుస్తోందంటే – ఆమె ఇంటి ముందున్న చిన్న తోటలొ కూరగాయల మొక్కలున్నాయి. అవి అమ్ముకునే తాను బ్రతకాలి. అదే జీవనోపాధి ఆమెకి. అలాటి మొక్కలన్నీ ఖాదర్ మేక వచ్చి మేసి పోతోంది.  ఎన్ని సార్లు ఖాదర్   ని హెచ్చరించినా, మేక వస్తూనే వుంది మేసి పోతూనే వుంది. మరి ఆవేశం రాదా ఆ కష్ట జీవికి? ఆపా బాధావేశం చూసి, ఖాదర్ చలిస్తాడు.   మాఫీ అడుగుతాడు. ఇక మీదట మేక తో బెడద రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి వెళ్ళిపోతాడు.

ఇప్పుడు తోటలోకి ఖాదర్ మేక రావడం లేదు. మొక్కలతో బాటు ఆపా కి కూడా కొత్త ఊపిరొచ్చినట్టైంది. మనసు స్థిమితపడినంత సేపు పట్టలేదు.. సందేహం మెదడుని తొలిచేస్తోంది. ఏమనంటే –  మేక కనిపించడం లేదని. అటుగా వెళ్తున్న ఖాదర్ కొడుకు ని అడిగుతుంది.  చెబుతాడు.  తండ్రి మేకని అమ్మేశాడని.  

ఎందుకు అమ్మేశాడు? తెలుసుకోవాలని ఖాదర్ ఇంటికెళ్తుంది. అక్కడ తల్లి లేని మేక పిల్ల ఒంటరిగా, దిక్కులేని బిడ్డలా కనిపిస్తుంది. ఆమె గుండె పట్టేసినట్టౌతుంది. 

బక్రీ ఏమైందని అడుగుతుంది అతన్ని. మటన్ మస్తాన్ కి ఇచ్చేసానంటాడు..తీసుకున్న అప్పు కి వడ్డీ కి జమ గా..

ఆ మాట విన్న ఆమె మనసు విలవిలలాడుతుంది..మరుక్షణమే ఓ నిర్ణయం తీసుకుంటుంది.. 

ఏమిటా నిర్ణయం అంటే..? అదే! – కథ చదివి తెలుసుకోవాల్సిన అసలు రహస్యం. 

తప్పక చదవండి ఫ్రెండ్స్!

***

కథలో స్త్రీ పాత్రలు, స్వభావ స్వరూపాలు :

ఆపా :  ఈ కథలో ప్రధాన పాత్రధారిణి, కథానాయిక  – ఆపా! బాల్యం లోనే వివాహమౌతుంది. ఆ వెనకే వైధవ్యమూ కలుగుతుంది.  ‘తనకు జరిగింది అన్యాయం..’ అని కూడా తెలీని తనం లోనే జీవితం సమాప్తమై పోవడం కంటె మించిన విషాదం ఏముంటుంది ఏ ఆడపిల్లకైనా! 

భర్త పోయాక ఆడదానికి పుట్టిల్లే తనిల్లు అవుతుంది..ఆపా కి కూడా అంతే. తల్లి తండ్రులతో కలిసి బ్రతుకుతుంటుంది.  అదే జీవితం అనుకుంటుంది కానీ ఆమె కో తోడు ఇచ్చి, తాము  పోవాలని తల్లితండ్రులు తపన పడినప్పుడు ఆమె ఆలోచించడం మొదలుపెడుతుంది. పెళ్ళి అంటే కొందరికి కొత్త కలల సౌధం. మరి కొందరికి కటిక వాస్తవాలతో కూడిన సన్నివేశం. తానెళ్ళిపోతే ఈ గూడు గోడౌతుంది. తల్లి తండ్రులు ఆగం అయిపోతారన్న స్ఫురణ తో ‘మళ్ళీ పెళ్ళి’ అనే  ప్రసక్తికి స్వస్తి పలుకుతుంది. ఓ రకంగా చెప్పాలీ అంటె, కన్నవారి  కోసం వైవాహిక  జీవితాన్ని త్యాగం చేస్తుంది. జీవితంలో పెళ్ళి కంటే అమ్మానాన్నల బాధ్యతే త మకు ముఖ్యమనుకునే ఉదాత్త స్వభావం ఆపాలో చూస్తాం. ముఖ్యం గా పేరెంట్స్ ని ముసలి వయసులో దగ్గరుండి సేవ చేసుకోవాలనే ఇంగితం అనండి, జ్ఞానం అనండి సంస్కారం అనండి..ఆడపిల్లల్లోనే అధికం గా వుంటుంది. ‘ ఆడపిల్ల ప్రేమే వేరు ‘ అని అందుకే   పెద్దల అంటుంటారు . అలాటి ఆణి ముత్యం లాటి ఆడ పిల్లే  ఈ ఆపా!

రైటర్ ఒక మాట అంటారు, ఆపా గురించి చెబుతూ..’ బాల్యం లో వున్న అల్లరితనం, యవ్వనం లో కంట్రోల్ చేసుకుందనీ, ఆరు పదులు దాటగానే, వూరి వారి నోట్లో నాలిక లా..యధా స్థితికి వచ్చేసింది..’ అని వివరిస్తారు. 

నిజమే. పెద్దతనం వచ్చేస్తుంటే నెమ్మదితనమూ సొంతమైపోతుంది.  వయసు పెరుగుతున్న కొద్దీ, మాట్లాడటం తక్కువై, విండం ఎక్కువౌతుంది. బహుశా ఆపా కి కూడా ఇదే అలవాటై వుండొచ్చు.  జీవితానుభవం నేర్పిన పాఠమూ కావొచ్చు.

ఆపా కాపురం చేసిందే లేదు కాబట్టి  ఇక పిల్లల ప్రసక్తీ లేదు.  ‘తానిక ఎప్పటికీ  ఒంటరినే ‘  అనే నిజమొక్కటే జీర్ణమైపోయాక, ఇక అన్ని సంబంధ బాంధవ్యాలతోటి తెగతెంపులై పోతాయి.  జీవితం లో మళ్ళీ పెళ్ళే  వొద్దనుకున్న ఆమెకి పిల్లలు లేరన్న చింత ఎక్కడుంటుంది? లేదు. అంతా నిశ్చింతే. శూన్యం సొంతమైపోయాక, అలవాటైపోయాక, అదే జీవితం అనుకున్నాక, మనసు ఇక వేటినీ  కోరుకోదు. భర్తీ చేసుకునే తపనలు,  తహతహలు  ఏవీ వుండవ్. అన్నిటికీ శాశ్వతమైన  శలవే!  

 అయితే, జీవితం లో ఇక  తాను ఎప్పటికీ అమ్మ కాలేని ఆ స్త్రీ మూర్తి  చిన్ని గుండెలో అమ్మ తనం నింపుకున్న  అమృతభాండం వుందని మనకే కాదు..ఆమెకీ తెలీదు ఆ సంఘటన ఎదురయ్యేదాకా! చిత్రమే మరి. అందుకే పెద్దలు  అంటారు, ప్రతి స్త్రీ లో నూ అమ్మ వుంటుందని. 

ఆపా సహనవంతురాలే కానీ,  పొట్ట కూటి కోసం పెంచుకుంటున్న కూరగాయల తోటని మేక మేసి పోతుంటే చూస్తూ ఊరుకునేంత సహ నమైతే లేదు.  ఇది సహజ నైజం. తన కష్టం కాష్టమైపోతుంటే రగిలిపోకుండా ఎవరుంటారు?

అందుకే రగిలింది. ఖాదర్ మీద అరిచింది. ఇదే తన లాస్ట్ వార్నింగ్ అంటూ బెదిరించింది. హెచ్చరించింది. ఖాదర్ క్షమించమంటాడు. మేక కట్టు దిట్టం చేస్తానని చెబుతాడు.  శాంతిస్తుంది.  

అన్నట్టుగానే, మేక రాదు. చిత్రమేమిటంటే, బెడద తప్పినందుకు నిశ్చింతగా వుండాల్సిన ఆపా, మేక ఏమైందా అని చింతన సాగిస్తుంది. ఆడ దాని చిత్రమైన మనసు కి ఆపా ఒక ఉదాహరణ గా పేర్కొనాలి.  ఏదో జరిగింది అని ఆమె కి గ్రహిస్తుంది. ఆ ఏమిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజ ఉత్సుక స్వభావినికి అద్దం పట్టిన పాత్ర – ఆపా!

ఆ.!.వెధవ మేక. పీడా పోయింది.  అది ఏమైతే నాకెందుకు నా తోట బావుంది చాలు అని ఎందుకు అనుకోలేకపోతుంది అంటే, ఆమె స్త్రీ కనుక!  మూగ జీవులను ప్రేమించే కారుణ్య హృదయిని కనుక!

చిలికే వరకూ పెరుగుకీ తెలీదట, తనలో వెన్న దాగుందని..ఎంత కమ్మని వాక్యమో కదూ..ఆపా కీ ఆ క్షణం వరకు తెలిసి వుండదు..తనలో అమ్మ నిద్ర లేచి ఓ బిడ్డ కోసం వెదుకుతోందని.. 

ఆపా కారెక్టర్ సరిగ్గా ఈ మలుపులోనే శిఖరమై కనిపిస్తుందని  చెప్పక తప్పదు.

బక్రీ గురించి ఖాదర్ కొడుకుని అడుగుతుంది. తండ్రి అమ్మేసాడని చెప్పి తుర్రుమంటాడు. విని వూరుకోవచ్చు కదా. ఊహు. అతడికి జీవనాధారమైన మేకని ఎందుకమ్మేశాడూ, తన మూలానా? ఏమో.. మనసు పరిపరి విధాల పోతుంటుంది.  ఇతరులకు మేలు చేయడం మాత్రమే తెలిసిన ఆపా కి – తన కారణం గా  మేక ని దూరం చేసుకోలేదు కదా అనే సందేహం ఆమెని నిలవనీదు అంటే..అంత సున్నిత మనస్కురాలు అని మనకు అర్ధమౌతుంది.

వెంటనే ఆపా ఖాదర్ గుడిసె వైపు దారితీస్తుంది . అక్కడ మేక పిల్ల జాలి గా తన వైపు  చూస్తూ..’నీ మూలాన నేను తల్లి లేని  దాన్నైపోయాను చూశావా?!’  అని అడుగుతున్నట్టు .. ఆపా మనసుని మెలిపెడుతుంది.

 ఏ మనిషికైనా తాను చేసిన తప్పు తనకి తెలియాలంటే ఎవరో వచ్చి చెప్పనవసరం లేదు. ఆత్మ సాక్షి ఒక్కటి చాలు.  కానీ ఆత్మల్లేని ఈ నాటి మనుషుల్లో ఇక సాక్ష్యా తావెక్కడుంటుంది..

కానీ ఈ స్త్రీ మూర్తి స్వచ్ఛమైన   మనసున్న స్త్రీ కాబట్టి – మేక కోసం..తన తోటని మేసి, పంటని నాశనం చేసి మాయమైపోయిన మేక కోసం..వెదుకుతోంది. ఎందుకంటే ఆ మేక కూన కి తల్లి దూరమవడాన్ని భరించలేక..

‘దాన్నేం చేసావ్?’ అని ఖాదర్ ని అడిగినప్పుడు..కటిక వాని దగ్గర తీసుకున్న బాకీ తీర్చలేక వడ్డీ కింద బక్రీ ని అమ్మేసానని చెప్పినప్పుడు..ఆపా గుండె వేగం చప్పుడు అక్షరాల్లోంచి పాఠకులకు స్పష్టం గా వినిపిస్తుంది. 

ఆ తల్లి మేక ఎక్కడ కి చేరకూడదో అక్కడ కి తోసేయబడింది. ఇక  దాని బిడ్డ  కి ఆ తల్లి శాశ్వతం గా దూరమైపోయినట్టే కదూ? ఇంత  దారుణం జరగడానికి వీల్లేదు.. తక్షణ కర్తవ్యం ..వెంటనే స్ఫురిస్తుంది. వెంటనే అక్కణ్ణించి కదులుతున్నప్పుడు..పాఠకుల మనసు కూడా కదిలిపోతుంది.  సమస్యలు ఎదురైనప్పుడు స్త్రీలు చతికిలబడి కుర్చోరు. చురుకుగా ఆలోచిస్తారు. మెరుపు వేగం లో పరిష్కారాన్ని కనుగొంటారు. 

ఆ సన్నివేశంలో ఆపా పాత్రలో పెల్లుబికే  కారుణ్య హృదయాన్ని, కల్లా కపటం ఎరుగని స్వచ్చమైన మాతృ ప్రేమ మమకారాన్ని  మనం చూస్తాం. 

ఎంత అందమైన స్త్రీ కానీండీ, అన్ని యాంగిల్స్ లోను  అందం గా వుండదు. అదేం అద్భుతమో కానీ, అమ్మ అందంగా కనిపించని యాంగిలే  వుండదు.. – అదే దేవుని దివ్య సృష్టి –  స్త్రీ!

ఈ నిజావిష్కరణ కి వేదిక గా మారిన కథే ఆపా!

కథలో చివరి వాక్యాలకి నవ్వుకోని పాఠకులు వుండరంటే ఒట్టు..హ హా!

మరి కథ ముగింపు కోసం కథని ఆశ్రయించాల్సిందే తప్పదు. 

ఆపా క్షమా గుణం ఎంత గొప్పదో వివరించే ఒక చిన్న సన్నివేశం వుంది ఈ కథలో. ఖాదర్ గుడిసెకి వచ్చి, బక్రీ గురించి అడుగుతున్నప్పుడు లోపల్నించి వచ్చిన అతని భార్య ఆమెని నిందిస్తుంది..నీ కళ్ళు ఇప్పుడు చల్ల బడ్డాయి కదా అని. ఖాదర్ భార్యని అడ్డుకుంటుంటే..ఆపా అంటుంది..’ఆమె కూడా నా బిడ్డలాటిదే..’ అంటూ ఊరడిస్తుంది మాటలతో.

తల్లికి  తన బిడ్డలందరూ సమానమే అనే మాటకి నిర్వచనం లా నిలిచే పాత్ర – ఆపా!

* ఖాదర్ భార్య, మరదలు – సైదాబీ : 

ఈ స్త్రీ పాత్రలు గురించి గొప్పగా చెప్పుకునేందుకేమీ లేదు. ఆపా –  మేక ని ఆడిపోసుకుంటొందనే ఉక్రోషం తో  తమ  తప్పు ని ఒప్పుకోలేక  మాటలతో ఎదురు దాడి కి దిగి, వాదులాడి,  చలామణి కావాలనే   మనస్తత్వం గల స్త్రీలు.  

చివరిగా, మంచి కథని అందించిన రచయిత్రి శ్రీమతి సయ్యద్ నజ్మా షమ్మీ గారికి నెచ్చెలి తరఫున, నా తరఫున శుభాభినందనలు తెలియచేసుకుంటూ..

వచ్చే నెల మరో కథా మధురం తో కలుస్తాను.

అందరకీ వందనాలు..అభివందనాలు!

***

రచయిత్రి పరిచయం :

నా పేరు సయ్యద్ నజ్మా షమ్మీ

నా మాతృభాష – ఉర్దు

చదువు – టెన్త్ క్లాస్.

ఊరు -నెల్లూరు జిల్లా

రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్

గృహిణిని. రచయిత్రిని.

భర్త – పోలీస్ ఉద్యోగం.

పిల్లలు – ఇద్దరు మగపిల్లలు. ఒకరు మెడిసిన్, మరొకరు బీటెక్ చదువుతున్నారు.

నేను నెల్లూరు జిల్లా రచయితల సంఘం , మరియు నవ్యాఒధ్రా రచయితల సంఘంలో గత నాలుగేళ్లుగా కార్యదర్శిగా పనిచేస్తున్నాను.

నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ ఖైరున్నిసా.తను ఎన్నో వేల ఉర్దూ షాయేరీలు రాసేది.నా కలం పేరు అమ్మ పేరు ‘ ఖైరున్’.

నన్ను సాహిత్యపరంగా నా భర్తా, పిల్లలు చాలా ప్రోత్సహిస్తారు.

నాకు తెలుగుభాషాభిమానం చాలా ఎక్కువ.తెలుగుభాష మీద మక్కువ తో భాషను నేర్చుకుని కధలు వ్రాయడం మొదలెట్టాను.దాదాపు 60 చిన్నా పెద్దా కధలు, కవితలు, వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశాను.

నా కథలు –  ఆకాశవాణి ఆలిండియా రేడియో విజయవాడలో ప్రసారమవుతున్నాయి.

విశాలాక్షి మాస పత్రికలో, వెబ్ పత్రికలు ప్రచురించాయి.విశాలాక్షి లో ఇప్పటికీ వస్తున్నాయి.

‘శ్రావణం’ పేరుతో ఓ నవల రాశాను. మరోటి ‘రాగాల పల్లకిలో’ కొత్త నవల మొదలుపెట్టాను. ‘పర్దా’ అనే పేరుతో నా 20 ఉర్దూ కధలను తెలుగులో రాసి  సంపుటి తెద్దామనే ఆలోచన ఉంది.

నాకు నెల్లూరుజిల్లా పురమందిరంలో తిక్కన సాహిత్య అవార్డుతో పాటు,   హైదరాబాదు,ఒంగోలు, ఏలూరు విజయవాడలో అనేక సన్మానాలు జరిగాయి. ఉగాది విశిష్ట అవార్డు తో పాటు చిన్నా చితక అవార్డులు, సర్టిఫికెట్లు, ఇలా చాలానే వచ్చాయి.

అలాగే జీ టాకీస్ వారి హాస్య కథల పోటీల్లో ‘వేపువ్వు’ అనే నా కథ పారితోషకం గెలుచుకుంది.

నాకు తెలుగు సాహిత్యం అన్నా, కధలు రాయాలన్నా చాలా ఇష్టం.ముఖ్యంగా స్త్రీల ఉన్నతికి పాటుపడే విధంగా కథలు, హాస్య కథలు వ్రాయాలన్నా నాకు ఎంతో నచ్చుతుంది.

సమాజంలో ఏ సమస్య అయినా –  కవుల, రచయితల రచనల ద్వారనే మార్పు తీసుకోరావచ్చనేది నా నమ్మకం. 

నా ఆశయం తెలుగుభాషాభివృద్ధికి పాటుపడాలి.మన తెలుగు గొప్పదనాన్ని ప్రపంచ నలుదిక్కులా చాటి చెప్పాలన్నదే నా లక్ష్యం.

*****

Please follow and like us:

One thought on “కథా మధురం- సయ్యద్ నజ్మా షమ్మీ”

  1. ఆపా కథ కనపడటం లేదు. మీరు కథ యిచ్చారా.

Leave a Reply

Your email address will not be published.