గోరాతో నా జీవితం

   -అనురాధ నాదెళ్ల

రచనః సరస్వతి గోరా

ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, నాస్తికవాద నాయకుడు శ్రీ గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి భార్య శ్రీమతి సరస్వతి గోరా తన జీవనయానం గురించి రాసుకున్న పుస్తకం ‘’గోరాతో నా జీవితం.’’ 

మతపరంగా, విద్య పరంగా, సంప్రదాయాల పరంగా సంఘంలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకు వచ్చేందుకు కృషి చేసిన భర్త ఆలోచనలను అర్థం చేసుకుని, అనుసరించి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి సరస్వతీగోరా గారు. ఆమె ఎనభైయ్యవ  పుట్టినరోజున ఈ పుస్తకాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఆమె శతజయంతి ఉత్సవాల సమయంలో రెండవ ముద్రణకు వచ్చిన ఈ పుస్తకం ఎన్నో రకాలుగా ప్రత్యేకత కలిగినది. 

                                       జీవితానికి ధ్యేయం మోక్షమో, స్వర్గమో అనుకుంటే అది కేవలం మరణం తర్వాత మాత్రమే లభిస్తుంది. విధి లిఖితంగా జీవితాన్ని నమ్మితే దానికి వ్యక్తి కర్తృత్వం ఏదీ ఉండదు. అలాకాక జీవితానికి ఒక లక్ష్యము, అర్థం ఉండాలంటే తగిన నిర్ణయాలను తీసుకుని, వాటిని అనుసరించే స్వేచ్ఛ అవసరమని నమ్మి,తన జీవితానికొక లక్ష్యాన్ని ఎంచుకుని సమాజ అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి సరస్వతీ గోరా.

సమకాలీన సమాజ పరిస్థితులపై తిరుగుబాటు భావాన్ని పెంచుకున్న గోరాగారు దేనికీ భయపడేవారు కారు. భయంలోంచి బానిసత్వం తొంగిచూస్తుందని, స్వేచ్ఛ సహకారాన్ని కోరుకుంటుందని నమ్మిన గోరాగారు, సహకారం అనేది సమానుల మధ్యనే సాధ్యం కనుక తోటి మానవులను సమానంగా ఆదరించాలన్నారు.  

                                  సంప్రదాయ కుటుంబంలో 1912 లో పుట్టి దేవుళ్లు, పూజల మధ్య పెరిగిన సరస్వతి పెళ్లి తరువాత భర్త జీవనవిధానం గమనిస్తూ, తనకు కలిగిన సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలను పొంది, హేతువాద దృక్పథం అలవరచుకున్నారు.  ఆదర్శాలకి కట్టుబడి ఉన్నవాళ్లకంటే భిన్నంగా ఆమె నాస్తికదృష్టికి కట్టుబడి ఉన్నారు. 

స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే. కానీ మతం, సమాజం, సంప్రదాయం, ప్రభుత్వం కూడా స్త్రీ, పురుషులకిచ్చే విలువల్లో తేడాను చూబిస్తున్నాయని చెబుతూ, సరస్వతీ గోరా దళితులు, స్త్రీలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలంటారు. స్త్రీలపై జరిగే అత్యాచారం  పురుషులలోని మానవత్వానికి కళంకమనీ, అలాగే దళితులపై జరిగే అత్యాచారం ఉన్నత కులాల మానవత్వానికి కళంకమనీ చెబుతారు. ఇతరులను అవమాన పరిచేవారి వ్యక్తిత్వాలు ఎంత అధమస్థాయికి పడిపోతాయో అర్థమైతే ఎవరూ కూడా మరొకరిని అవమానానికి గురిచెయ్యరు.  

సరస్వతి తండ్రి విజయనగర ఆస్థానంలో చిన్న ఉద్యోగం చేసేవారు. తల్లి మేనమామగారైన చెరుకుపల్లి లక్ష్మీ నరసింహారావుగారి భార్య మరణించటంతో, వారింటనే తోడుగా సరస్వతి  తల్లిదండ్రులు ఉండేవారు. ఎదురుగా గురజాడ అప్పారావుగారిల్లుండేది. తరచూ గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, గిడుగు రామ్మూర్తి పంతులుగారు, ఆదిభట్ల నారాయణదాసుగారి వంటివారు సరస్వతి తాతగారింటికి వచ్చి కబుర్లు చెప్పుకునేవారు.

                               1922లో సరస్వతికి ఒక వివాహం సంబంధం కనుక్కుందుకు కాకినాడ వెళ్లిన ఆమె తండ్రి అనుకోకుండా తన చిన్ననాటి మిత్రుని కలుసుకుని వారి కుమారుడైన గోపరాజు రామచంద్రరావుతో వివాహాన్ని స్థిరపరచుకున్నారు. వివాహ సమయంలో వధూవరులు ఉపవాస దీక్షలో ఉన్న సందర్భంలో వరుడు రామచంద్రరావు నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినప్పుడు పెళ్లికొచ్చిన పలువురు  అపశకునమంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేసారు. అంతలో ఆయన తేరుకోటంతో సరస్వతి బడిలో చదువుకునేటప్పుడు సతీసావిత్రి నాటకంలో సావిత్రి పాత్ర పోషించింది కనుకనే ఆమె భర్త తేరుకున్నాడని కూడా వ్యాఖ్యానాలు చేసారు. మనదేశంలో ప్రతిదానికీ నప్పేట్టుగా సరిపెట్టుకోవటం అలవాటని చెబుతారు సరస్వతి గారు.

వివాహం తరువాత రామచంద్రరావుగారు పైచదువులకోసం మద్రాసు వెళ్లటం, చదువు ముగించి మధురలో అమెరికన్ కాలేజీలో ఉద్యోగంలో చేరటం జరిగింది. అయితే ఆ కాలేజీవారు గోరాగారిని క్రైస్తవ మతాన్ని తీసుకొమ్మనటంతో దానికి అంగీకరించక ఆయన రాజీనామా చేసారు. అక్కడ ఉన్నప్పుడే దయ్యాలుంటాయని చెప్పే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని దయ్యాలనేవి లేవని నిరూపించారాయన. మతం, ఆచారాల పట్ల తనలో కలుగుతున్న ఆలోచనలను ప్రశ్నించి, ధిక్కరించి, వాస్తవాలను నిరూపించే ధోరణి వారిలో మొదలైంది. మధురలో ఉద్యోగంలో చేరిన తరువాత సరస్వతిని తీసుకెళ్తానన్న కబురు రాకపోవటంతో ఆయన అక్కడ మరొక వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆనాటి సమాజ మౌఢ్యపు పోకడలకు ఇది ఉదాహరణగా సరస్వతి చెబుతారు. 

                               ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతనే భార్యను కాపురానికి తీసుకువెళ్లాలన్న గోరాగారి ఆలోచన ఎవరికీ అర్థం కాలేదు. ఆ ఉద్యోగం వదిలేసాక కోయంబత్తూరులో గోరాగారికి వ్యవసాయశాఖలో ఉద్యోగం రావటంతో సరస్వతిని గోరాగారి మేనత్త జోగమ్మగారిని సాయమిచ్చి భర్త దగ్గరకు పంపారు. భర్త ఇంట మొదటిసారిగా భోజనం చేసేటప్పుడే సరస్వతికి సంప్రదాయం పట్ల వ్యతిరేకత ఎదురైంది. మడిబట్టను కట్టుకుని భోజనం చేసే అలవాటును గోరాగారు అవసరం లేదని మాన్పించటంతో కొన్నాళ్లు అసౌకర్యంగా భావించినా భర్త చెప్పినట్టు శుభ్రత అవసరం కానీ మడి అర్థం లేనిదని తెలుసుకుని ఆచరణలో పెడతారామె. ఆచారాల విషయంలో మేనత్త జోగమ్మ గారితో ఘర్షణ పడుతుండేవారు గోరా. మతం, దేవుడు అబధ్ధం అని, జంధ్యం తీసివేయటం  జరిగింది. 

జోగమ్మగారు బాల వితంతువు అవటం వలన అన్నగారింట ఉంటూ పూజలలో మునిగితేలుతూ తను కొలిచే దేవత కామేశ్వరమ్మ తనను పూనిందంటూ తరచూ చెబుతూండేవారు. గోరాగారి తల్లిదండ్రులు సనాతన ఆచార సంపన్నులు అవటంతో దేవత పూనిందన్న జోగమ్మగారి మాటను గౌరవించేవారు. ఆవిడ మాటల వలన గోరాగారి అన్నగారికి భార్యతో విడాకులు ఇప్పించి, ఆయనకు రెండో వివాహం జరిపారు.

                                  ఇది చూసిన సరస్వతి భయపడూతుండేది. భర్త దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించటంతో ఆయన ఒకసారి జోగమ్మగారికి దేవత పూనిందన్న సమయంలో అదేమిటో తేలుస్తానని ఆవిడను ఒక పేముబెత్తంతో బెదిరించి ఆ వ్యవహారాన్ని అంతటితో మాన్పించారు. అలాటి నమ్మకాలకి గల కారణాలను హేతుబధ్ధంగా వివరిస్తారు. వితంతువుల జీవితంలో మంచి బట్ట, మంచి తిండి కూడా నిషేధంగావటం, సహజమైన కోర్కెలు కూడా తీరే అవకాశం లేకపోవటం, ఎవ్వరూ లక్ష్యపెట్టకపోవటం వంటి కారణాలతో వారు పూజల్లో మగ్గుతూ తమను దేవత ఆవహించినప్పుడు, తమ మాటలను ఆచరణలో పెట్టనట్టైతే అనర్థమన్న ఆచారాన్ని సమాజంలో పుట్టించారు. సరస్వతి అత్తమామలు, జోగమ్మగారు ఆసంగతిని అక్కడితో వదిలిపెట్టారు. జోగమ్మ గారికి ఆ తర్వాత మరెప్పుడు దేవత ఆవహించలేదు.

                                          బోధన పట్ల మక్కువ ఉండటంతో గోరాగారికి కోయంబత్తూరు ఉద్యోగం నచ్చక రాజీనామా చేసి కాకినాడ వచ్చేస్తారు. ఇష్టం లేని ఉద్యోగం చెయ్యనక్కరలేదని సరస్వతి భర్త ఆలోచనకి మద్దత్తు చెబుతారు. దాచుకున్న కొద్ది ధనంతో ఆ దంపతులు దేశాటన చేస్తున్న సమయంలో తిరుమలను దర్శించినప్పటికీ దేవాలయంలోకి వెళ్లాలనిపించలేదని, ఆ కొండ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి వచ్చామని సరస్వతి రాసారు. చిన్నతనంలో దేవుళ్లు, పూజల మధ్య పెరిగినా పెళ్లి తరువాత భర్త ఆలోచనల్లోని హేతువాద దృక్పథాన్ని తానూ ఆచరిస్తూ వచ్చారు.  

కొలంబో లో ఉద్యోగానికి వెళ్లినప్పుడు అక్కడ గోరాగారికి తెలుగు కుటుంబాలేవీ తటస్థపడలేదు. తెలుగువారు తమ ప్రాంతాలను దాటి పొరుగు ప్రాంతాలకు వెళ్లేందుకు ఆరోజుల్లో ఇష్టపడేవారు కారు. కొలంబో జీవితం తమకు మరింత విశాల దృక్పథం ఏర్పడేందుకు తోడ్పడిందని సరస్వతి చెబుతారు. ఒకసారి ఇంట్లో దొంగ ప్రవేశించినపుడు భయపడకుండా బయటకెళ్ళి నలుగురినీ పోగుచేసి దొంగను పట్టిస్తారు సరస్వతి. అక్కడ గడిపిన జీవితం తనకు ఆత్మధైర్యాన్నిచ్చిం దంటారు.  

                               అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీ ఇంటిలోపల తలుపులు వేసుకుని ఉండాలని, గ్రహణం చూడటం, ఆ సమయంలో అటుఇటు తిరగటం చేసినట్టైతే పుట్టబోయే బిడ్డ అవకరంతో పుడతాడని ఒక నమ్మకం హిందువులలో ఉండేది. దానిని తాను అంతవరకూ నమ్మినప్పటికీ కొలంబోలో గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణానికి గల శాస్త్రీయ కారణం భర్త విడమరచి చెప్పేక ఆ మూఢ నమ్మకాన్ని వదిలిపెట్టాననీ, భవిష్యత్తులో మిగిలిన స్త్రీలకు కూడా అర్థమయ్యేలా చెప్పానని సరస్వతి చెబుతారు. ఆటంకాలకి భయపడి వొదిగి కూర్చోవటం కన్నా ఎదిరించి జయమో పరాజయమో పొందటం నేర్చుకున్నానని అంటారు. 

కొలంబోలో మిత్రుల ఇళ్లకి తరచు విందులకి వెళ్లేవారనీ, విందుల్లో మాంసాహారం తప్పనిసరిగా ఉండేదని అది ముందరలో అభ్యంతరకరంగా ఉన్నా, స్నేహితులతో సత్సంబంధాలు కావాలంటే వారి అలవాట్లకు సర్దుకుపోవాలన్న విషయం నేర్చుకున్నానని సరస్వతి చెబుతారు. తొలిసంతానం మూల నక్షత్రంలో పుట్టినప్పుడు శాంతి చేయటం అవసరమని ఇంట్లో పెద్దలు చెప్పినప్పటికీ ఆ విషయంపై నమ్మకం లేనందున తాము శాంతి చేసుకోలేదని చెబుతారు. అలా చేసుకోక పోవటం వల్ల ఎవరికీ ఏకీడూ జరగలేదు. అందువల్ల అది అర్థంలేని మూఢనమ్మకమని తేలిపోయింది.

                                     కాకినాడలో పి. ఆర్. కాలేజీలో బోటనీ తరగతులు ప్రారంభమైనప్పుడు కాలేజీవారి కోరిక మీద గోరా కొలంబో వదిలి కాకినాడలో ఉద్యోగంలో చేరారు. గోరాగారి తండ్రి  సనాతన ధర్మ పరాయణులు, జంధ్యం తీసివేసిన కొడుకు పనికి ఆయన మనసుకు కష్టం కలిగి తనతో సహపంక్తి భోజనానికి అభ్యంతరం చెబుతారు. ఆ కారణంగా గోరాగారు అద్దె ఇంటికి మకాం మారుస్తారు. కానీ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు మాత్రం ఎప్పటిలానే ఉంటాయి. తాను నాస్తికుణ్ణి అని బాహాటంగా ప్రకటించటం వల్ల అద్దెకు ఇల్లు దొరకటం కూడా కష్టమే అని ముందుచూపుతో ఆలోచించి గోరా, సరస్వతిగార్లు నగలను అమ్మి ఊరికి దూరంగా స్థలం కొంటారు.  

‘’నమ్మిన విషయాన్ని బహిరంగంగా ప్రకటన చేసి ఆచరించటం దోషం కాదని, తమ కుమారుడు చేసేది న్యాయమైనదేనని’’ క్రమేపీ గోరాగారి తల్లిదండ్రులు అర్థం చేసుకుని, కుమారుడితో కలిసి ఉండటం ప్రారంభిస్తారు. కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులకు ఇంటివద్ద అనేక విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవారు గోరా. సరస్వతి వారందరికీ కాఫీలు, టిఫెన్లు చేసి పెడుతుండటం , సహపంక్తి భోజనాలు పెట్టటం జరిగేది. అత్తమామలు దీనికి అడ్డు చెప్పలేదు.

గోరాగారు వెనుకబడిన కులాలవారు చదువుకోవటం ద్వారా సాంఘిక సమానత్వం వస్తుందని నమ్మి, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు భోజన సదుపాయం కలిగించటం, ఫీజులు కట్టటం చేసేవారు. వారాంతపు సెలవుల్లో విద్యార్థినీ విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లేవారు. దాని వలన ఆయా కొత్తప్రాంతాలలోని విశేషాలను తెలుసుకోవటం, ప్రజలతో మమేకం అవటం జరుగుతుండేది. సరస్వతి సమిష్టి కుటుంబంలో బాధ్యతలు నిర్వహించేటప్పుడు అత్తమామలకు కావలసిన విధంగా ఉంటూనే భర్త సంస్కరణలకు మద్దత్తునిస్తూ ఎవరినీ నొప్పించకుండా నడుచుకునేవారు.

                                      దుర్గాబాయమ్మగారు ఇంగ్లీషు చదువులు చదువుకోవాలన్న ఆశతో గోరాగారి సహాయం కోరగానే ఆయన తగిన సాయమందించి ఆమెను ప్రోత్సహించారు. దుర్గాబాయిగారి ద్వారా గోరాగారికి కాంగ్రెస్ నాయకులతోనూ, గాంధీతోనూ సన్నిహిత సంబంధాలు పెరిగాయి.

గోరాగారి నాస్తికభావాల వలన పి. ఆర్. కాలేజీలో ఆయన ఉద్యోగంపోయింది. నాస్తికత్వం అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందని, విద్యాసంస్థలో వ్యక్తికి అది చాలా అవసరమని గోరాగారు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అప్పీల్ చేసారు. రాధాకృష్ణగారు గోరాగారిని ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవలసిందిగా తీర్పు ఇచ్చారు. 

                                        బందరులో హిందూ కాలేజీలో 1934లో బోటనీ ప్రారంభించి గోరాగారిని ఆహ్వానించారు. కాకినాడలో గడిపిన ఆరు సంవత్సరాలు గోరా దంపతుల ఆలోచనలకు బలాన్ని, స్పష్టతనూ ఇచ్చాయి. కుటుంబంలో ఘర్షణ, సాంఘిక వెలి, కాలేజీలో ఘర్షణ, జాతీయోద్యమంతో సన్నిహిత సంబంధం ఇలా అనేక సవాళ్లు, పాఠాలు నేర్చుకున్నారు. రెండు విభిన్న జీవిత విధానాలతో సమిష్టి కుటుంబంగా జీవించటం, సాంఘికంగా అణగారిన కులాలవారితో సామీప్యం, సంప్రదాయాలను వ్యతిరేకించి నిలదొక్కుకునే ధైర్యం నేర్చుకోవటం వంటివి ఆ దంపతుల భావి కార్యక్రమాలకు ఒక రూపును, నమ్మకాన్ని ఇచ్చాయి.

బందరు జీవితంలో గోరాగారికి అనేకులు స్నేహితులయ్యారు. అక్కడికి వెళ్లిన కొత్తలోనే జోగమ్మగారు మరణించారు. గోరాగారు తను నమ్మిన సిధ్ధాంతాన్ననుసరించి ఆమెకు ఎలాటి కర్మకాండలూ చెయ్యలేదు. ఆయన తండ్రి కూడా ఆ విషయాన్ని గోరాగారి ఆలోచనకే వదిలేసారు. దానివల్ల ఇంట్లో పిల్లలకు కీడు కలుగుతుందన్న ఇరుగుపొరుగుల మాటలను, ఒత్తిడిని సరస్వతి గారు పట్టించుకోలేదు. బందరులో తరచు నాస్తికత్వం పై గోరాగారి ఉపన్యాసాలను విద్యార్థులు, అధ్యాపకులూ ఏర్పాటు చేస్తుండేవారు. అలాటి సభలలో గోరాగారు నిజాయితీగా, హేతుబధ్ధంగా చెప్పే విషయాలను అందరూ ఇష్టపడేవారు. 

                                     సరస్వతి అన్నగారు మరణించినపుడు ఆ దుఃఖం తట్టుకోలేని ఆమె వదిన ఎక్కువ మోతాదులో నల్లమందును తిని మరణిస్తారు. భర్త మరణించినపుడు భార్య కూడా మరణించటం గొప్ప పాతివ్రత్య గుణంగా నమ్మే సమాజం తీరును సరస్వతి ఈసడిస్తారు. భర్త పోయినపుడు పిల్లలను తల్లి బాధ్యతగా పెంచవలసిన అవసరం ఉందని ఆమె నమ్మకం. ఆ సమయంలో అన్న, వదినలు సరస్వతిగారికి కలలో రోజూ కలలో కనిపించటంతో ఆమె వారి ఆత్మలు ఏదో చెప్పాలనుకుంటున్నాయని అనుకుంటారు. గోరాగారు మిత్రుడి సహాయంతో సరస్వతి ఆత్మలున్నాయన్న మూఢ నమ్మకాన్ని పోగొడతారు. సోదరి భర్త మరణించినపుడు ఆమె బొట్టు, గాజులు తియ్యవలసిన అవసరం లేదని గోరాగారు చెప్పినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆమోదిస్తారు. గోరాగారు ఆమెను చదువులో ప్రవేశపెడతారు. ఛాందసులు ఎన్ని మాట్లాడినా లెక్కచెయ్యరు. 

                                      తమ పిల్లలకు కులం, మతం లేవని బడిలో రాయించటం కొంతమంది టీచర్లకు కొరుకుడుపడదు. అలాగే నాస్తికత్వం పై ఇన్ని ఉపన్యాసాలు, ఇంత ప్రచారం చేస్తున్న గోరా కుటుంబం వాస్తవంలో ఎలా ఉంటారో చూసేందుకు కొందరు పనిగట్టుకుని వారి ఇంటికొచ్చి పరీక్షించేవారు. బందరు జీవితంలో నాస్తికోద్యమం ఉధృతంగా ప్రచారం చేసే సమయంలో గోరాగారిని నిప్పుల మీద నడవమని కోరగా ఆయన నడిచి చూబించారు. అలా నడవటానికీ, దైవమహిమకూ సంబంధం లేదని నిరూపించారు. అలాగే ఒక భూతవైద్యుడితో భూతాన్ని చూబిస్తే తుపాకీతో కాల్చివేస్తానని చెప్పి ఆయన పారిపోయేలా చేసారు. ఇలాటి అనుభవాలన్నీ సరస్వతిగారిలో హేతువాద దృక్పథం పెంచాయి.

                                      నాస్తికవాద ప్రచారం, బందరు కాలేజీ విద్యార్థులు కమ్యూనిజం వైపు ఆకర్షితులవుతూన్నప్పుడు ఆ నూతన రాజకీయ చైతన్యానికి మద్దత్తు ఇవ్వటం వలన గోరాగారిపై కాలేజీ యాజమాన్యం వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. గోరాగారు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి కృష్ణాజిల్లాలోని ముదునూరు ప్రజల కోర్కె మీద అక్కడికి కుటుంబంతో సహా మకాం మార్చారు.

ముదునూరు అప్పటికే రాజకీయ, సాంఘిక  చైతన్యం ఉన్న గ్రామం. హరిజన వాడల్లో సహపంక్తి భోజనాలు, రాత్రిపూట వయోజన పాఠశాల ప్రారంభించారు గోరాగారు. గామస్థులు ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో నాస్తికకేంద్రాన్ని స్థాపించారు. క్రమంగా గ్రామంలోని వారి కోరికననుసరించి ఒక జాతీయ విద్యాలయాన్ని సహకార పధ్ధతిలో నడిపారు. విద్యార్థులలోని జిజ్ఞాస, కర్తృత్వ దీక్షలు విద్య ద్వారా వికసించేందుకు కృషిచేస్తూ బెనారస్ మెట్రిక్ పరీక్షకు విద్యార్థులను తయారు చేసారు. కానీ రెండు నెలలుగడిచేసరికి గాంధీ పిలుపుతో 1942 ఆగస్టులో స్వాతంత్రోద్యమం తీవ్రతరమై, విద్యాలయాన్ని మూసివేసారు. 

                             ముదునూరు నాస్తికకేంద్రం కృష్ణాజిల్లాలోని ఉద్యమానికి కేంద్రం అయింది. వచ్చేపోయే వారితో పెద్ద సంచలన కేంద్రంగా మారింది. పోలీసు నిఘా ఉండేది. రహస్య కార్యకర్తల కోసం భోజనం వండి, రహస్యంగా పంపిణీ చేసేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో 1943లో గోరాగారు, వారి పెద్ద కుమారుడు పదకొండేళ్ల లవణం అరెస్టు అయ్యారు. స్త్రీలు కూడా సత్యాగ్రహం చెయ్యాలన్న సంకల్పంతో సరస్వతిగారు తమ పెద్దమ్మాయి మనోరమతో సహా 1944లో జలియన్ వాలా బాగ్ దినోత్సవం నాడు విజయవాడలో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు.

ముదునూరు నాస్తికకేంద్రం నిర్మించటంలోనూ, నాస్తిక జీవిత ఆచరణను రూపొందించటంలోనూ గోరాగారితో పాటు సరస్వతిగారి కృషి ఎంతో ఉంది. నాస్తిక కేంద్రం గురించి విన్న గాంధీ గోరాగారిని సేవాగ్రాంకు రమ్మని పిలుపునిచ్చారు. గోరాగారు కుటుంబంతో సేవాగ్రాంలో ఉన్న రోజుల్లో పిల్లల అవసరాలను గాంధీ ప్రత్యేకం అడిగి తెలుసుకునేవారు. గాంధీ హృదయం తల్లి హృదయమని అర్థమైంది సరస్వతికి. 

                                       1942లో ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లిన నాస్తికకేంద్ర కార్యకర్తలందరూ సేవాగ్రాం దర్శించటం, గాంధీజీని సన్నిహితంగా చూడటం ఒక బహుమానంగా భావించారు. గోరాగారి  నాస్తికకేంద్ర కార్యకర్తల పనిపాటలు, నిబధ్ధతపై గాంధీకి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆయన గోరాగారితో,’’ నా ఆస్తికత్వం ఒప్పు అనిగానీ, నీ నాస్తికత్వం తప్పు అనిగానీ అనలేను. ఇద్దరం సత్యాన్వేషకులం. ఎవరు ఒప్పో, ఎవరు తప్పో కాలం నిర్ణయిస్తుంది. ఎవరిది ఒప్పైతే వారు రెండో వైపు రావచ్చు. లేదా ఇద్దరం కలిసి మరో మార్గాన్ని రూపొందించవచ్చు.’’అన్నారు.

                            భార్య మెడలో మంగళసూత్రం అనవసరమని గోరాగారు చెప్పి తీసివేస్తారు. వివాహం జరిగిన పురుషుడికి అలాటిదేమీ లేనప్పుడు స్త్రీకి మాత్రం ఎందుకన్న ఆయన వాదన సరస్వతిగారికి నచ్చింది. నాస్తిక జీవిత విధానంలో సాంఘిక సమానత్వానికి ఇచ్చిన విలువను గాంధీ గుర్తించారు. దానితో నాస్తికకేంద్ర కార్యకర్తలందరికీ ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెరిగి తమ దారి సరైనదన్న నమ్మకం ఏర్పడింది.

                             గాంధీ 74 వ జన్మదినోత్సవానికి దేశంమొత్తం మీద 74లక్షల రూపాయలను వసూలు చేసి ఆయనకు బహుమతిగా ఇచ్చారు. 1942 ఉద్యమంలో గాంధీతో పాటు నిర్బంధంలో ఉన్న కస్తూర్బాయి మరణించినందున ఆ ధనంతో ఆమె పేరు మీద భారతీయ స్త్రీ, ముఖ్యంగా గ్రామీణ స్త్రీ అభివృధ్ధికి ‘’కస్తూరిబా స్మారకనిధి’’ అనే సంస్థను ప్రారంభించారు గాంధీ. కస్తూరిబా స్మారకనిధి శాఖలు దేశమంతా పెట్టేందుకు నిర్ణయించి గోరాగారు అప్పటికే చేస్తున్న సేవను గమనించి వారి కోరికపై ముదునూరులో ఒక శాఖను మొదలుపెట్టారు. ఆ కేంద్రాలలో నలభై సంవత్సరాలు దాటిన స్త్రీలను, తక్కువ చదువుకున్నవారిని కార్యకర్తలుగా తీసుకోవాలని, వారు అస్పృశ్యత, కులబేధం లేకుండా అన్ని కులాలవారితో కలిసిపోవాలన్న గాంధీ సూచనలను అమలు పరిచారు. మూఢ నమ్మకాలపై, సంప్రదాయాలపై స్త్రీలను చైతన్యవంతం చేస్తూ, చేతిపనులను నేర్పటం మొదలు పెట్టారు. 

సమాజంలో అంటరానివారి కుటుంబంనుంచి పెద్ద కుమార్తె మనోరమకు వరుని ఎంపిక చెయ్యాలని భావించి తమ నాస్తికకేంద్రంలో సమర్థుడైన కార్యకర్త అర్జునరావును సంప్రదించి వివాహాన్ని జరిపారు. దానికి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ముందుకు సాగే ధైర్యం, చొరవ గోరాగారు చూపించారు. స్వాతంత్రోద్యమ కాలంలో భారతీయులంతా ఒక్కటిగా పోరాడి, అనంతరం హిందువులు, ముస్లింలుగా భారతీయులు చీలిపోయి పరస్పర ద్వేషంతో ప్రవర్తించటం చూసి సరస్వతి గారు అలాటి పరిస్థితులు ఇప్పటికీ మన సమాజంలో ఉండటం బాధాకరమని చెబుతారు. 

                                         గోరాగారు తన భావాల ప్రచారానికి ప్రెస్సు పెట్టి ఒక పత్రిక నడపాలనుకుని ముదునూరు చిన్న గ్రామం కనుక పెద్ద పట్టణానికి వెళ్లాలన్న్న ఆలోచనతో విజయవాడ వచ్చారు. పటమటలో గోరాగారి అభిమానులు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. ముదునూరు ప్రజలకు గోరాగారు గ్రామాన్ని విడిచి వెళ్లటం ఇష్టం లేకపోయినా భారతదేశంలో రానున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజీ పడ్డారు. ఆవిధంగా గోరాగారితో పాటు నాస్తికకేంద్రం విజయవాడలో స్థావరమేర్పరచుకుంది. హరిజనవాడలో వయోజన విద్యా పాఠశాల, దగ్గరలోని లంబాడీ తండాలో సాంఘిక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. 

                                  పటమటలో నాస్తిక కేంద్రానికి స్థలాన్నిచ్చిన వ్యక్తి గోరాగారి పెద్ద కుమార్తె వివాహం సమర్ధించలేనని చెప్పటంతో చెన్నుపాటి రామకోటయ్యగారిచ్చిన స్థలంలోకి నాస్తిక కేంద్రం శాశ్వతంగా మారిపోయింది. స్త్రీలలో వాస్తవిక చైతన్యాన్ని, సంఘదృష్టిని పెంచి, వారి వ్యక్తిత్వాన్ని పెంచుకునే విధంగా వారిని తీర్చి దిద్దేందుకు నాస్తిక కేంద్రం నడుం కట్టింది.                           పబ్లిక్ బావులను హరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు  గోరాగారు, సరస్వతి గారు కృషిచేసారు. తమ కుమార్తె విద్య వివాహం కూడా ఆదర్శవంతమైనదే. కులమతాల ప్రసక్తి లేకుండా జరిగింది. రెండో అమ్మాయి వివాహం కాకుండానే గర్భవతి అయినప్పుడు, అవతల వ్యక్తి వివాహితుడవటం వల్ల అతనితో పెళ్ళి చేసే అవకాశం లేకపోయింది. అయినా స్త్రీకి మాతృత్వం అనేది సహజమైన విషయం కనుక దానిని గౌరవించాలని, మానవత్వంతో కూడిన పరిష్కారం చూబించాలని గోరాగారు నమ్మారు. చాలామంది స్నేహితులు దూరమయినా పట్టుదలగా గోరాగారు తను నమ్మిన దానిపైనే నిలబడ్డారు. సన్నిహితులైన డాక్టర్ అచ్చమాంబ, పొట్టి శ్రీరాములు గారు వంటివారు వ్యతిరేకించినా  లక్ష్యపెట్టలేదు. చివరికి డాక్టర్ అచ్చమాంబగారే గోరాగారి అమ్మాయికి కానుపు చేసారు.

వితంతు వివాహాలను ప్రోత్సహిస్తున్నామంటే వివాహితలంతా వితంతువులు కావాలని అర్థం కాదంటారు సరస్వతీగోరా. ఒక గ్రామంలో ఒక వితంతువు గర్భవతి అని తెలిసినపుడు గ్రామమంతా ఆమెను వెలివేసి చీదరించుకున్నప్పుడు గోరాగారి కుటుంబం ఆమెకు ఆశ్రయమిచ్చారు. పురుషాధిక్య సమాజం పెట్టిన అర్థంలేని నియమాలు, విలువలు పాటించేవారు మానవత్వకోణాన్ని మరిచిపోతున్నారు. అందువల్ల మానవత్వాన్ని కించపరిచే ఏ ఆచారమైనా వ్యవస్థ అయినా మారవలసిందే అని గోరాగారు, సరస్వతిగారు నమ్మి, ఆచరించారు.

                                     లవణం వివాహం ప్రముఖ కవి శ్రీ జాషువా గారి కుమార్తె హేమలతతో జరిపారు. హేమలత, గోరాగారి కుమార్తె మైత్రి కలిసి వాసవ్య విద్యాలయం ప్రారంభించారు. అది 16సంవత్సరాలు కొనసాగింది. ‘’వాసవ్య’’ అంటే, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఇవన్నీ ప్రతివారికి ఉండవలసిన లక్షణాలని తద్వారా కర్తృత్వ దీక్షను, వ్యక్తిత్వాన్ని పెంచుకోవటం సాధ్యమంటారు. స్వాతంత్రం వచ్చాక నాయకులు పార్టీలకు, హోదాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఆడంబరాలకు అలవాటు పడుతుండటంతో ప్రజలకోసం వారు పనిచెయ్యవలసిన అవసరాన్ని చెబుతూ అనేక సత్యాగ్రహాలను గోరాగారు, సరస్వతి గారు చేసారు. వాటివలన పెద్దగా ప్రయోజనం కలగక పోయినప్పటికీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అవసరమన్న విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లారు.

జీవితమంతా ప్రజలకోసం, ప్రజల మధ్య గడిపిన గోరాగారు తన కుటుంబసభ్యులతో పాటు సమసమాజ నిర్మాణానికి ఎందరెందరినో కూడగట్టారు. సరస్వతిగారు చదువులేని, గ్రామీణ స్త్రీలను సైతం ముందుకు నడిపించారు. జీవితాలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసి దాన్ని నెరవేర్చుకునే ఆత్మధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించారు.

ప్రజలసేవలోనే జీవితాన్ని గడిపి వాళ్లమధ్య మాట్లాడుతూ, మాట్లాడుతూనే గోరాగారు 1975లో మరణించారు. హరిజనవాడకు చెందిన సత్యానందం వారి చితికి నిప్పు పెట్టారు. 49సంవత్సరాలు సహవాసం చేసిన సరస్వతిగారు భర్త నేర్పిన నవసమాజ నిర్మాణానికి నడకను కొనసాగించారు. నాస్తికత్వమంటే మానవత్వం అనీ, సక్రియ జీవితమనీ గోరాగారు నిర్వచించారు.  ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పనిలో వారు జీవించి ఉన్నట్టే సరస్వతిగారు భావించారు. గోరాగారి మరణం తరవాత కూడా నాస్తిక కేంద్రాన్ని ఎలాటి అవరోధంలేకుండా నడిపించాలన్నది ఒక చాలెంజ్ గా తీసుకున్న కుటుంబసభ్యులు, కార్యకర్తలు తమ సమర్థతని, నైపుణ్యాన్ని ఉత్తమ స్థాయిలో ప్రదర్శిస్తూ నిర్వహిస్తున్నారు. ‘’గోరాగారి తరువాత నాస్తిక కేంద్రంలో నాయకులు లేరు. కానీ నాయకత్వం ఉంది.’’ అన్న లవణం గారి మాటలు వాస్తవం చేస్తూ ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తోంది. నాస్తికకేంద్రం స్వర్ణోత్సవాలు 1990లో జరుపుకుంది. సరస్వతి గోరా గారికి ‘’ఉత్తమ సంఘ సేవకురాలు’’ అవార్డును చళ్లగళ్ల ట్రస్టు ఇచ్చి గౌరవించింది. 

                        1974లో స్టువర్టుపురంలో నేరస్థుల సంస్కరణ కార్యక్రమం, 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో చేసిన సహాయ కార్యక్రమాలు, సాయిబాబా వంటి వారి మ్యాజిక్కులను హేతువాదంతో ప్రశ్నించి, శాస్త్రీయ పరిశోధనకు నిలబడమని కోరటంలోనూ, నిజామాబాద్ జిల్లాలో జోగిని పునరావాస కార్యక్రమాలు నిర్వహణలోనూ, పోలియో పిల్లలకి చితిత్సా పునరావాస కార్యక్రమ నిర్వహణలోనూ నాస్తికకేంద్రం తనదైన ముద్రను సమాజంలో బలంగా వేసింది. సరస్వతీగోరా తన సంపూర్ణ జీవన యాత్రలో ఎందరెందరి జీవితాలనో ఉన్నత మార్గాలవైపు మళ్లించారు. ఆమె జీవితమే ఒక సామాజిక విప్లవం. భర్త నేర్పిన మానవత్వం, సమానత్వం ఆమె నమ్మి ఆచరించారు. ఇంటి సభ్యులకూ, నాస్తికకేంద్రం కార్యకర్తలకూ తానే వంటచేసి పెట్టిన అన్నపూర్ణ ఆమె. 

ఒక నెల క్రితం నాస్తిక కేంద్రాన్ని దర్శించినప్పుడు గోరాగారి కుమారుడు నియంతగారు దగ్గరుండి కేంద్రాన్ని వివరంగా చూబించారు. గాంధీతోనూ, కాంగ్రెస్ నాయకులతోనూ గోరాగారి ఫోటోలను, అనేక స్వాతంత్రోద్యమ ఘట్టాలున్న చిత్రాలను భద్రంగా కాపాడుతున్నారు. ఒక పెద్ద లైబ్రరీ ఉంది. అక్కడ సరస్వతిగోరా అందరికీ వంట చేసిన వంటగది కూడా ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరికీ ఒక్కటే వంటిల్లు అని చెప్పారు నియంతగారు. పేషెంట్ల మధ్య ఉన్న డాక్టర్ సమరంగారిని కూడా కలవటం జరిగింది. ఒక అపూర్వమైన చరిత్ర, వర్తమానం, భవిత ఉన్న కుటీరమది. విజయవాడ వచ్చినవారంతా చూడవలసిన అరుదైన స్థలం. ఆనాటి గొప్ప జీవితాలను అక్కడి చిత్రాలలో కళ్లకు కట్టినట్టు చూడవచ్చు. ఈ సంపదను భద్రంగా రాబోయే తరాలకు అందించేందుకు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కుటుంబసభ్యులు.

****

Please follow and like us:

2 thoughts on “‘గోరాతో నా జీవితం” పుస్తక సమీక్ష”

  1. విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గరగా ఉన్న నాస్తిక కేంద్రం ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఆనాటి చరిత్ర తాలూకు ఆనవాళ్లను గోరాగారి వారసులు అపురూపంగా భద్రపరుస్తున్న తీరు చూడవలసిందే.
    శేషుగారూ, మీరు సమీక్షను చదివి స్పందించినందుకు సంతోషమండీ.
    నాదెళ్ల అనూరాధ

  2. సమీక్ష బావుంది. గోరగారి గురించి వినడమే కానీ ఎప్పుడూ తెలుసుకోలేదు. ఈ సమీక్ష ద్వారా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలే కాక, ఆయన అసలైన సహధర్మచారిని గురించి కూడా చాలా విషయాలు తెలిశాయి. To live by the principles one believes in is itself great. Happy to read it. Thanks to Anuradha for giving this opportunity.

Leave a Reply

Your email address will not be published.