అర్హత

(‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

-చాందినీ బళ్ళ

యశోదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ – అయిదవ ఫ్లోర్**
 
బిల్డింగ్ ఎంట్రన్స్ లో ఉన్న బోర్డు పై ఈ వివరాలు చూసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ తలుపు మూసుకునేలోగా పరిగెత్తుకు వెళ్ళింది
సుభద్ర.. ఆమె రావడం చూసి చేయి పట్టి లిఫ్ట్ ఆపాడు లోపల ఉన్న సారథి. 
“థాంక్యూ” అని నవ్వింది సుభద్ర. పక్కనే ఉన్న శరత్ ని కూడా చూసి “హలో” అని మర్యాదగా పలకరించింది. హడావుడిగా టక్ చేసుకుంటూ
 “ఏ ఫ్లోర్?” అడిగాడు శరత్.
 
“మీరు వెళ్ళేదే!!” అంది అక్కడ అప్పటికే నొక్కబడిన అంకె చూసి.
“ఇంటర్వ్యూ కోసమా?” మళ్ళీ అడిగాడు శరత్.
 
“అవును, మీరు ఇద్దరూ కూడా దానికేనా?” అడిగింది సుభద్ర.
 
“అవును” అని సమధానం ఇచ్చారు శరత్, సారథి.
 
“ఓకే” అంది.
 
రావలసిన ఫ్లోర్ రాగానే బయట ఉన్న రిసెప్షనిస్ట్ ని ఆంగ్లంలో అడిగి వెయిటింగ్ ఏరియాలోకి వెళ్తూ..
 
“ఇలాంటి వాళ్ళని రిసెప్షనిస్ట్గా పెట్టుకుంటే కంపెనీ మీద ఫస్ట్ ఇంప్రెషన్ కూడా పోతుంది,అసలా కుర్చీ ఎలా సరిపోతుంది” అని అన్నాడు శరత్. చిత్రంగా చూసి అతడు చూడగానే ఫక్కున నవ్వింది సుభద్ర.
 
“అది ఏ హెరిడిటరి, లేదా అనారోగ్యం అయుంటుంది అనుకోచ్చు కదా?” అన్నాడు సారథి.
“వీడికెందుకు ఆమెని అంటే” అనుకుంటూ కూర్చున్నాడు శరత్.
సుభద్ర కూడా మౌనంగా ఉండిపోయింది.
కాసేపటికి,
“ప్రిపేర్ అయ్యారా బాగా?” అడిగింది శరత్ ని.
 
“చాలా ప్రశ్నలు ప్రాక్టీస్ చేసా అండి. నేను మా కాలేజీలో అగ్రికల్చర్ విభాగంలో టాపర్ ని. ఏం అడిగినా టకటక చెప్పేస్తా” అన్నాడు శరత్.
 
“మరి మీలాంటి టాపర్ ఇంత చిన్న కంపెనీ కి ఎందుకు అప్లై చేసారు?”  అడిగింది సుభద్ర.
 
“చిన్నది అయినా మీడియా వల్ల బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళకి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది, భవిష్యత్తు బాగుంటుందని,పైగా ఇలాంటి చోట అయితే నాలాంటి వాళ్ళకి విలువ బాగా ఉంటుంది” చెప్పాడు శరత్.
“మీరు చెప్పింది నిజమే, వీళ్ళకి ఆ పోటెన్షియల్ ఉంది” అంది సుభద్ర అతడిని చూసి.
 
“మరి మీరు?” అడిగింది సారథిని.
 
“చెయిర్మెన్ యశోద గారు మా గ్రామం వారే, మా గ్రామానికి ఎంతో సేవ చేసారు. అలాగే గ్రామీణ అభివృద్ధి కోసం ఆవిడ చేసే కొత్త ప్రాజెక్ట్ లో పాల్గొని ఎంతో మంది వ్యవసాయదారులకు,పేదరికంలో మగ్గుతున్న తోటి గ్రామాలకు సహాయ పడాలని వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నా కోరిక.ఒక వేళ రాకపోయినా,ఆవిడే ఇంటర్వ్యూ చేస్తారని తెలిసి నాకు స్ఫూర్తినిచ్చిన ఆవిడని ఇలా అయినా కలవొచ్చు అని వచ్చాను” వివరించాడు సారథి.
 
“ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి..” అని మధ్యలో విసుక్కున్నాడు శరత్.
 
శరత్ మాటలు పట్టించుకోకుండా
“ఇంతకీ మీరెందుకు అప్లై చేసారు, ఏ పోస్టుకు అప్లై చేసారు?” అడిగాడు సుభద్రను సారథి.
 
ఆమె సమాధానం ఇచ్చేలోగా రిసెప్షనిస్ట్ వచ్చి “లోపలికి పిలుస్తున్నారు” అని చెప్పడంతో శరత్ కి, సారథి కి “బాయ్,గుడ్ లక్” చెప్పి సుభద్ర వెళ్ళింది.
 
కాసేపటికి శరత్ ను, సారథి నీ కలిపి లోపలికి రమ్మన్నారని చెప్పడంతో ఇద్దరూ వెళ్ళారు.
 
చెయిర్మెన్ యశోద గారు మర్యాదగా కూర్చోమని చెప్పి”ముందుగా ఆలస్యం చేసినందుకు క్షమించండి.. ఒక ఇంటర్వ్యూ కి వచ్చాం అంటే కేవలం ఇంటర్వ్యూ రూం లోనే జరగుతుంది అనుకోవడం తప్పు. అలా మనం వేసే స్టాండర్డ్ ప్రశ్నల వల్ల ఒక మనిషి గురించి పూర్తిగా తెలీదు.విదేశాల్లో స్థిరపడాలని అనుకున్నా మనకి చదువు కన్నా విలువలు ముఖ్యం.వారి హోదా, స్థితి,రంగు,వారి ఆకారం బట్టి కాకుండా కష్టపడే ప్రతీ వ్యక్తిని గౌరవించడం ముఖ్యం. అందుకని ఈ సారి మనం చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కి సరి కొత్తగా ఇంటర్వ్యూ చేద్దాం అని సలహా ఇచ్చిన నా కూతురు సుభద్ర ఐడియా తీసుకుని మేము చేసిన ఈ ప్రయత్నంలో సఫలమై అర్హత సాధించిన సారథికి అభినందనలు” అని చెప్పింది.
 

****

Please follow and like us:

5 thoughts on “అర్హత (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)”

  1. కధ చాలాబాగుంది,యువతరానికి ఎంతో ఉపయోగం.

  2. కథ చాలా బాగుంది.
    మన ప్రవర్తన నీ బట్టి కూడా ఉద్యోగము వస్తుంది అని సందేశం ఇచ్చారు.

  3. ఇంటర్వ్యూ రూంలోనే కాదు అన్ని చోట్లా అందరితో మన ప్రవర్తన మంచిగా ఉండడమే అర్హత ఇస్తుందని చాలా చక్కగా తెలిపారు .

  4. ఉద్యోగంలో ప్రతీ వ్యక్తిని గౌరవించే సంస్కారం ఉండాలని చిన్న కథ ద్వారా మంచి సందేశం అందించారు. ధన్యవాదాలు చాందిని గారు.

Leave a Reply

Your email address will not be published.