వెనుకటి వెండితెర-1

-ఇంద్రగంటి జానకీబాల

తెలుగువారు చాలా తెలివైన వారు, కార్యశూరులు, ఉత్సాహవంతులు, ధైర్యం కలవారు అని చెప్పడానికి మనకి చరిత్రలో చాలా సందర్భాలే స్ఫురణకొస్తాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం విషయంలో మన పెద్దలు చాలామందికంటే ముందు వున్నారని చెప్పుకోక తప్పదు.

భారతీయ చలనిత్ర నిర్మాణంలో టాకీ (మాట్లాడే సినిమా) వచ్చిందనగానే తెలుగులోనూ టాకీలు తీయాలని ఉత్సాహపడి ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో దక్షిణాదిని తెలుగువారు మొదటివారు. 

1931లోనే హెచ్.ఎమ్. రెడ్డిగారు తెలుగు సినిమా నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. సినిమా రూపొందించటం అంటే మాటలా? దానికి ఒక కథ వుండాలి – కథ అంటే నాటకీయంగా తెరకెక్కించగల వీలున్న మంచి రచన వుండాలి – అందుకే అప్పటికే రంగస్థలం మీద అత్యంత ప్రచారం పొంది, ప్రజల మనసుల రంజింపచేసిన నాటకాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో నాటకాలంటే పౌరాణికాలే. అవన్నీ వడ్డించిన విస్తళ్ళతో విందు భోజనానికి సిద్ధంగా వున్నాయని గ్రహించి, తెలుగు సినిమా నిర్మాణం మొదలుపెట్టారు. అందులో, పాటలు, పద్యాలు – వాటికి అనువైన బాణీలు వాద్యాలనుపయోగించవలసిన విధానం అన్నీ అమరి వున్నాయి. నటీనటులూ తర్ఫీదు పొంది సిద్ధంగా వున్నారు. అయితే ఏది ముందు చెయ్యాలి? అందులో ఏ ఏ నటీనటులుండాలు అని నిర్ణయించేసి 1931లో భక్తప్రహ్లాద నాటకం, సినిమాగా – అదే టాకీగా తీయడానికి ప్రారంభించారు. పూర్తిచేశారు.  ఆనాటి ఆ సినిమా (భక్తప్రహ్లాద) ప్రజల్ని అలరించింది ఆనందింపజేసింది కానీ, దాన్ని భద్రపరచాలనే ధ్యాసలేని కారణంగా అవేమీ ఇప్పుడు లభ్యం కావడం లేదు. అందుకే అందులో నటించిన నటీనటుల వివరాలుగానీ, సాంకేతికంగా పనిచేసిన వారి గురించి గానీ సవిస్తరమైన సమాచారం లేదు. భక్తప్రహ్లాదుని తల్లిగా సురభి కమలాబాయి నటించారనీ, ఆమె ‘పరితాపభారంబు – భరియింపతరమా’ అంటూ తనకి తనే పాడుకుంటూ అద్భుతంగా నటించారని మనకి తెలుస్తూ వుంది. అప్పట్లో నటీనటులు వారి పాట వారే పాడుకోవాలి. ప్లేబ్యాక్ అనేదే రాని కాలం- పాడుతూ, నటిస్తూ, మిగిలిన పరిస్థితులన్నీ పరిశీలించుకుంటూ భావం చెడకుండా, రాగం పోకుండా, భాషలో పొల్లు పోకుండా నటించాలని ఆమె నటిస్తూ పాడి సన్నివేశాన్ని రక్తికట్టించిన తీరు చూసి ప్రఖ్యాత బొబాయి నట గాయకుడు సైగల్ ఎంతో ప్రశంసించారని చెప్పారు. 

ఏడుస్తూ – నవ్వుతూ, పరిగెడుతూ – శృంగార అభినయం చేస్తూ, ఎదుటి వారిని దూషిస్తూ – కోపిస్తూ – ఇలా అన్ని భావాలూ ఏకకాలంలో చేసి ఒప్పించాలి. అదీ ఆనాటి నటీనటులకు ఛాలెంజ్ – అలా నెగ్గుకు రాగలితేనే సినిమాలో నిలబడే అవకాశం – ప్రేక్షకుల మన్ననలు పొందితేనే మళ్ళీ మళ్ళీ కనిపించే అవకాశం – అందుకే ఆనాటి సినిమాలో పనిచేయడమంటే అదొక తపస్సుగా, అదే జీవితంగా భావించేవారు. ఆనాటివారు – నిర్మాతలైనా, దర్శకులైనా, రచయితలైనా, కవులైనా, గాయకులైనా, కెమెరా పని చేసిన వారైనా – నటులైనా, నాట్యకత్తెలైనా, నాట్యదర్శకులైనా, సంగీత దర్శకులైనా – ఎవరైనా అదే జీవితంగా బ్రతికారు. సినిమాలో డబ్బు బాగా వచ్చి, పేరు వస్తుంది.  ఒక విధంగా అది వ్యాపారమే. కానీ అదీ పూర్తిగా వ్యాపారం కాదు. కళాత్మకమైన వ్యాపారం. ఆ కళారూపంతో ప్రేక్షకుడి మనసుని తాకగలిగినప్పుడే డబ్బు వచ్చినా, ఖ్యాతి వచ్చినా, లేకపోతే శుష్క ప్రయాసే మిగులుతుంది- మనం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్ళినా అసలు మానవ హృదయానికి సంబంధించిన కళను దానికి జోడించలేకపోతే ప్రయోజనం శూన్యం. నీ భావాన్నీ, కళనీ అందంగా, అద్భుతంగా చూపించగలగడంలో టెక్నాలజీ వుపయోగపడుతుంది కానీ, అందులోంచి ‘కళ’ను పుట్టించలేదు-సృష్టించలేదు – 

తెలుగు సినిమా సుమారు 50ల వరకు పౌరాణికాల కథలు అంటే భారతంలోని, రామాయణంలోని, భాగవతంలోని కథల ఆధారంగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. అక్కడొకటి అక్కడొకటి జానపద కథల ఆధారంగా సినిమాలు నిర్మించినా, వాటికి రచన (స్క్రిప్ట్) తయారుచసుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి నాటక రూపాల్లో వున్న వాటినే సినిమాలు రూపొందిస్తూ వచ్చారు.

1950లకు ముందు కొన్ని సాంఘిక సినిమాలు వచ్చాయి. మాలపిల్ల (1938 అపవాదు-తల్లిప్రేమ-దేవత-ధర్మపత్ని-భలేపెళ్ళి, పంతులమ్మ-భాగ్యలక్ష్మి, గృహలక్ష్మి (1938) రైతుబిడ్డ (1939), వందేమాతరం (1939)-46లో గృహలక్ష్మి, తాహసిల్దార్-స్వర్గసీమ-గృహప్రవేశం-ద్రోహి, ఇల్లాలు- అలాగే సుమంగళి, చదువుకున్న భార్య లాంటి కొన్ని సాంఘిక సినిమాలు తెలుగులో వచ్చాయి. అయితే 1950 తర్వాత వచ్చిన షావుకారు-బీదల పాట్లు – సంసారం – జీవితం –లాంటి కొన్ని సినిమాలు మాత్రం స్పష్టంగా సమాజంలోని సమస్యల్ని ఎత్తిచపాయి.

కాలక్షేపం, వినోదం కోసం జానపద చిత్రాలు, పౌరాణికాలు, భక్తిచిత్రాలు రూపొందించినా, సమాజంలో వున్న లోటుపాట్లను స్థితిగతులను చిత్రించే, వాస్తవిక సమస్యలతో వున్న కథాంశాలను సినిమాలుగా రూపొందించటం ఎంతో అవసరం అనే ఆలోచన మేధావులను నిద్రలేపింది. చిత్ర నిర్మాణంలో మార్పుకు ప్రేరేపించింది.

తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం కనుక 1950 నుడి 1960 వరకు వచ్చిన కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటే గతకాల వైభవమూ తెలుస్తుంది. ఇప్పుడు మనం క్రమంగా ఏం కోల్పోతున్నామో కూడా నెమ్మదిగా అర్థమవుతుంది.

అయితే 50-60మధ్యనున్న పదేళ్ళ కాలంలో తెలుగులో వచ్చిన సినిమాలన్నీ గొప్పవని గానీ, అర్థవంతంగా తీయబడిన సినిమాలని గానీ అనుకుంటే అది తప్పే – ఎన్నో సినిమాలు పేలవంగా, చాదస్తంగా, పాడయినవీ వున్నాయి. కథావస్తువులే బాగుండక, ఒకటి చెప్పుదామని మరొకటి చెప్పి చివరికి పేలవంగా తేలిపోయినవీ వున్నాయి –కానీ ప్రతిభావంతులైన సాహిత్యకారులు, బయటప్రపంచంలో కవులుగా, రచయితలుగా గొప్ప పేరు గడించిన సాహిత్యకారులు ఆ కాలంలో సినిమా పరిశ్రమలో, అడుగుపెట్టడంతో కథలకీ, సంభాషణలకీ మంచి గుర్తింపు, నాణ్యత ఏర్పడింది – శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) ఆత్రేయ-ఆరుద్ర అనిసెట్టి – పినిశెట్టి, సదాశివబ్రహ్మం లాంటి హేమాహేమీలు రావడంతో బాటు అప్పటికే పనిచేస్తున్న సముద్రాల రాఘవాచారిగారు పింగళి నాగేంద్రరావుగారు పదునుతేరి కదం తొక్కారు. 

1950లో విజయాసంస్థ పుడుతూనే ఒక మంచి సాంఘిక సినిమా తీయాలని నిర్ణయించుకుని అడుగు ముందుకేసింది. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా ప్రసాద్ (ఎల్.వి. ప్రసాద్) దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. ఇందులో ఎన్.టి. రామారావు – జానకి (తర్వాత ఆమె పేరు ముందు చిత్రం పేరు శాశ్వతంగా నిలిచిపోయింది అదే ‘షావుకారు’.

విజయాప్రొడక్షన్స్ వారు వారి సంస్థ స్థాపించి తీసిన మొదటి సినిమా ఈ ‘షావుకారు’ – దీనికి చక్రపాణి, సముద్రాల, ప్రసాద్ పనిచేశారు. 

ఇందులో గోవిందరాజుల సుబ్బారావు (ఆనాటి సాటిలేని మేటినటులు గొప్ప నటులు షావుకారుగా, ఆయన కొడుకు ఎన్.టి. రామారావు, పక్కింటి (బంధువు) కూతురు శంకరమంచి జానకి (తర్వాత ఆమె పేరు షావుకారు జానకిగా చిరస్థాయిగా మారిపోయింది. ఇంకా ఎస్.వి. రంగారువ, కనకం, శాంతకుమారి, శివరాం మొదలైనవారున్నారు.

షావుకారు బాగా డబ్బు సంపాదించి ఆస్థిపరుడవుతాడు. వడ్డీలకి అందరికీ అవసరాల్లో డబ్బు యిచ్చి వడ్డీ వసూలు చేయాలో రంగన్న (పాత్ర) అండతుకుంటాడు. అందుకుగాను అతనికి డబ్బు ముట్టచెప్తూ వుంటాడు. ఎస్.వి.ఆర్. (రంగన్న) ఓ రౌడీలాంటి వాడు అతన్ని చూసి అందరూ భయపడుతూ వడ్డీ డబ్బులు ఎలాగోలాగ సర్దుతూ వుంటారు.

తన డబ్బు బలంగా చూసుకుని షావుకారు అరాచకాలు చేస్తూనే వుంటాడు – ధర్మసత్రం అరుగు మీద కొట్టు పెట్టుకునేందుకు యిచ్చి, అద్దె వసూలు చేస్తాడు. అది పంచాయతీకి వస్తే పక్కింటి రామయ్య చెప్పిన సాక్ష్యం వల్ల, షావుకారికి కోపమొస్తుంది ఆ రెండు ఇళ్ళ మధ్య వున్న తలుపు మూసుకుపోతుంది. షావుకారు కొడుకు పట్నంలో రూం తీసుకుని చదువుకుంటూ వుంటాడు. అతను ఆదర్శవంతుడు మంచివాడు (ఎన్.టి.ఆర్) పక్కింటి అమ్మాయి, అతనూ ఒకరితో ఒకరు ప్రేమలో వుంటారు – జానకి అన్నయ్య పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వుంటాడు – నిజాయితీపరుడు.

షావుకారు వీరి కుటుంబం మీద కక్షబూని, ఆ కొడుకు మీద దొంగతనం మోడి జైలుకి పంపిస్తాడు – కానీ తన కొడుకు కడా అన్యాయంగా దొంగతనం నేరం మోసబడి జైలుకొస్తాడు.

చివరికి మోసాలు బయటపడి, షావుకారు పశ్చాత్తాపపడతాడు. కథ-సంభాషణలు- కథ నిచే తీరు (స్క్రీన్ ప్లే) చాలా గొప్పగా వుంటాయి. దీనికి అందంగా అమిరింది ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం ఇందులో దీపావళి పాట పలుకురాదటే చిలుకా! ఏమనెనే చిన్నారి ఏమననే లాంటివి ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. 

ఇందులో, సమాజంలో, డబ్బు వెనుక దాగి వుండే కుట్రలు బాగా చూపారు. కష్టపడినా జీవితం సజావుగా సాగని జీవితాలు అద్దంపట్టి చూపించారు. 

తెలుగు సినిమా చరిత్రలో ఈ షావుకారు ఒక విప్లవం – పల్లెటూరి జీవితాలు – వడ్డీ వ్యాపారాలు- రౌడీలను పోషించే భూస్వాములు –ఆస్థిపరులు – వారి దుర్మార్గాలు బాగా చూపారు.

డబ్బులెంత వచ్చాయో చెప్పలేము కానీ తెలుగు సినిమా చరిత్రలో ఇదొక మైలురాయి. అదీ మొదటనే పడిన మంచి మైలురాయి. 

మరో సినిమా గురించి మళ్ళీ నెల మాట్లాడుకుందాం.

*****

Please follow and like us:

2 thoughts on “వెనుకటి వెండితెర -1”

  1. తెలుగు చలనచిత్రాల పుట్టుక , మైలురాళ్ళ లాంటి అప్పటి గొప్ప చిత్రాలను పరిచయం చేయడం చాలా బాగుంది .
    -నెల్లుట్ల రమా దేవి

  2. ఈ తరం వారికి తెలియని ఒకనాటి అపురూప చలనచిత్రాలను పరిచయం చేయటం చాలా బాగుంది జానకీ బాల గారూ.మనసారా అభినందనలు

Leave a Reply

Your email address will not be published.