గమనం

-లలిత గోటేటి

  “ఈ రోజు పనమ్మాయి రాలేదా?

     భర్త అడిగిన ప్రశ్నలో పనమ్మాయి గురించిన ఆరా కంటే “నువ్వింకా తెమలలేదా” అన్న భావమే ధ్వనించింది ఉమకు “టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది” అన్నాడు అసహనంగా సుధాకర్. 

     ఈ చలి వాతావరణానికి రాత్రంతా దగ్గుతూండటం చూస్తూనే వున్నాడు. తానొక యంత్రంలా తిరుగుతూండాలి కాబోలు. ఒక్కరోజు కూడా ఈ యంత్రం ఆగకూడదు మరి. ఇద్దరు చిన్న పిల్లల్ని లేపి, స్కూల్కు సిద్ధం చేసి, పాలు, టిఫిన్ పెట్టి వాళ్ళకు లంచ్ బాక్స్ లు సర్దేసరికి తనకీ రోజు నీరసం వచ్చింది..

“ఈరోజు లీవ్ పెట్టాను. వెళ్ళలేను జ్వరం వచ్చినట్టుగా వుంది మీరు వెళ్ళండి. లంచ్ బాక్సపెట్టాను కారన్ ప్లేక్స్ పాలల్లో వేశాను. తిని వెళ్ళండి.” అంది ఉమ అంతకంటే మాట్లాడాలంటే నీరసంగా వుంది.

 “పేరాసిట్ మాల్ వేసుకోలేకపోయావా? క్రితం సారి మీ బాస్ వార్నింగ్ ఇచ్చాడు లీవులు పెట్టద్దని మర్చిపోయావా?”

“ఎలా మర్చిపోతాను? ఉద్యోగం కదా! ఏమైనా సరే ఈరోజు వెళ్ళటంలేదు” అంటూ మాసిన బట్టల్ని సర్ఫ్ లో పెట్టడానికి లేచింది. ఉమ.

ఉమకు కళ్ళలో నీళ్ళోచ్చాయి. “ఎలావున్నావమ్మా” అని అడిగేందుకు తల్లి తండ్రీ లేరు. పెళ్ళి చేసిన అక్కా, బావ ఎక్కడో దూరంగా ముంబయిలో వుంటారు. భర్త సుధాకర్ బాధ్యతాయుతమైన భర్త జాగ్రపరుడు తల్లితండ్రులకు ఒక్కడే ఆడపిల్ల చిన్నది పెళ్ళి అయ్యి అమెరికా వెళ్ళిపోయింది. నాలుగేళ్ళక్రితం మావయ్యపోయారు. అత్తగారు ఒక్కతే, స్వంత ఇల్లనే మమకారంతో ఆ పల్లెటూర్లో పెన్షన్ డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ వుంటోంది. తల్లిలేని తనకు అత్తయ్యే రెండు పురుళ్ళుపోసింది. మావయ్య కన్న తండ్రిలా ఆదరించారు. వాళ్ళెప్పుడొచ్చినా తనకెంతో సుఖంగా వుంటుంది. అత్తయ్య పిల్లల కోసం, తినుబండారాలూ, పచ్చళ్ళూ, పొడులు చేసి పట్టుకొచ్చేది. మావయ్య పిల్లలకు కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. తాను ఆఫీసు నించి వచ్చేసరికి, వంటపని చేసి, పిల్లలకు పెట్టి గిన్నెలూ, బట్టలూ సర్టి తాను హాయిగా ముస్తాబై నవ్వుముఖంతో ఎదురొచ్చే అత్తయ్యను చూస్తే అమ్మవుంటే ఇలాగే వుండేదేమో అనిపించేది. ఆ సంతోషం వాళ్ళున్న పదిరోజులే వుండేది.

“చిన్న చిన్న సౌకర్యాలు కూడా చూసుకోకుండా సుధాకర్ లోన్  తీసుకుని డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనేశాడు. అతని జీతం బ్యాంక్ కు కట్టేస్తే ఇక తన జీతంతోనే ఇల్లు గడవాలి. కనీసం వాషింగ్ మెషీన్ కొనుక్కుందామన్నా ఏనెలకానెలే కష్టంగా వుంది’ అనుకుంది ఉమ. ఉమ బట్టలు అరెయ్యడం పూర్తిచేసేసరికి సుధాకర్ న్యూటర్ వెళ్ళిపోయింది.

“ఉమ గారూ!”

పిలుపు విని తలతిప్పి చూసింది. పక్కింటి బాల్కనీలోంచి సునీత పిలుస్తోంది.

సునీతను చూడగానే ఇంకాస్త నీరసం వచ్చింది ఉమకు… బాల్కనీ గోడ దగ్గర నిలబెట్టి గంటసేపు మాట్లాడుతుంది.

ఇప్పుడు తనకు నిలబడే ఓపిక లేదు.

“ఉమగారూ! ఈ రోజు మీరు ఆఫీసుకు వెళ్ళలేదా?

“లేదండీ! ఒంట్లో బాగాలేదు. మీరేం అనుకోపోతే నాకు ఇంకా పనవ్వలేదు” అంది అభ్యర్ధనగా ఉమ –

“ఒక్క అరగంటలో నేనే వస్తాను మీ ఇంటికి” అంది సునీత “దేవుడా!” అనుకుంటూ పనుల్లో పడింది ఉమ..

సునీత వచ్చిందంటే తన కుటుంబ విషయాలన్నీ ఏకరువు పెడుతుంది. ఇంట్లో సునీత, ఆమెభర్త, అత్తగారూ, మామగారూ, పెళ్ళికావలసిన మరిది, ఇద్దరు చిన్నపిల్లలూ వుంటారు. భర్తది మంచి హోదాగల ఉద్యోగం సంపన్నులు, అన్ని ఆధునిక సౌకర్యాలూ వున్న ఇండివిడ్యుయల్ ఇల్లు వాళ్ళది. సునీతకు ఉమ్మడి కుటుంబంలో వుండటం ఇష్టం లేదు.

“మీకేం ఉమగారూ! హాయిగా గంటలో పనిచేసుకుని మీ వారి స్కూటర్ ఎక్కేస్తారు. నా పని చూడండి ఎప్పుడూ వచ్చేపోయే బంధువులూ, కేజీలకు, కేజీలు కూరలు తరగాలి అందరి బట్టలూ మడతలేసి ఎవరివి వాళ్లకు పెట్టాలి?” అంటూ నిత్యంచేసుకునే పనుల్ని భూతద్దంలో చూపెడుతుంది .

అన్నట్టుగానే అరగంట లో వచ్చేసిందిసునీత.

“ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాబు ఎక్కడ వున్నాయండీ? మా ఆయన చెపితే వినరు. పైగా వాళ్ళు మన దగ్గరలేరు. మనమేవాళ్ళదగ్గరున్నాం అంటారు. బామ్మకూ, తాతకు పిల్లలు చేరికయ్యారు ఎలావెడతాం?” అంటారు.

 “నా ఇంట్లోనేను పరాయిదానిలా బతుకుతున్నానుకోండి ఉమా! సునీత కళ్ళుతుడుచుకుంది ముందు కాఫీ తాగండి సునీతగారూ! కమ్మటి సువాసనలోస్తున్న వేడి, వేడి కాఫీ తెల్లని కప్పులో పోసి సునీత కందించింది ఉమ.

ఇరువురు మాట్లకుండా, మౌనంగా  కాఫీని ఆస్వాదించారు. కప్పులు రెండూ సింకులో పెట్టొచ్చింది ఉమ. 

“మీరేమీ అనుకోనంటే ఒకటి చెపుతాను దృష్టి మారితే సృష్టి మారుతుందంటారు. నా వాళ్ళు అనుకుంటే సమస్యేలేదు” మీరు “నా కుటుంబం” అనుకోలేకపోతున్నారని చెప్పగలను” అంది ఉమ.

“చెప్పడం తేలికేమీలాగా, అత్త మావలేని కాపురం అయితే నేనూ ఎన్నికబుర్లు అయినా చెపుతాను” అంది ఉక్రోషంగా సునీత.

 “నాది అనుకోలేకపోయాక, కలిసి వుండటంలో అర్ధంలేదు. మీ వారికి చెప్పలేకపోయారా? అంది ఉమ.

 “వినరు” తల అడ్డంగా పూపింది సునీత. వాళ్ళ వల్ల మీ కొచ్చే సమస్య లేమిటి? కోడళ్ళను మాట అనే ధైర్యంఈ రోజుల్లో అత్తగార్లకుందంటే ఆశ్చర్యమే మరి” అంది నప్పుతూ ఉమ.

 “అవును….. మరి మాపై ప్రేమ కురిపించేస్తారు. మా ఆయన ఇంట్లో వుంటే టైమంతా వాళ్ళతోనే గడవటం ప్రతీ విషయానికి వాళ్ళని సంప్రదించాలి. అది మండుతుంది నాకు.

పెద్దవాళ్ళున్నడు అలాంటివి సహజమే కదా సునీత గారూ! మీ భర్త మంచివారు. పనులు చెయ్యడంలో మీ అత్తగారూ – మామగారూ సాయంగా వుంటారనీ, ఇతర పనులు చెయ్యటానికి మనుషులున్నారని మీరే చెప్పారునాకు. వాళ్ళు మిమ్మల్నికలుపుకొవాలనుకుంటున్నారు. మీరు మాత్రం కలవకూడదని అనుకుంటున్నారు”. అంతే అంది ఉమ నవ్వుతూ.

 చెప్పినా అర్ధంకాదు మీకు. మీరు పాతకాలం మనిషి” అంది కాస్తకోపంగా సునీత.

“పాతకాలం, కొత్తకాలం అంటూ ఏమీలేదు సునీతగారూ! ఇష్టాలు, అయిష్టాలు అంతే” అంది ఉమ.

“అమ్మాయ్ ఉమ! మా సునీత మీ ఇంటికి వచ్చిందా? గోడ మీంచి సునీత అత్తగారూ పిలుస్తోంది.

“చూశారా?. ఇలా వచ్చానో లేదో అన్నీ ఆరాలే” విసుక్కుంటూ లేచివెళ్ళింది సునీత.

ఉమ పెద్దావిడ మీద జాలిపడింది. అత్తగారేమో మా సునీత అనుకుంటుంది. కానీ సునీత అలా అనుకోవడం లేదని ఆవిడకు తెలియదు పాపం.

సునీత వెళ్ళాకా  స్నానం చేసి వంటపూర్తిచేసి నడుం వాల్చింది. విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కూడా తప్పక పనులు చెయ్యాల్సి వచ్చే పనిమనిషి మీదా, వయసైపోయినా చాకిరీ తప్పని ఆడవాళ్లందని మీద జాలి కలిగింది ఉమకు. తన దాకా వస్తే గానీ ఎదుటి వారి బాధ తెలియదనుకుంది ఉమ.

ఉమకు అత్తగారు జ్ఞాపకం వచ్చారు. చాలాసార్లు సుధాకర్ తల్లికి చెప్పాడు ఇల్లుఅమ్మేసి తన వద్దకు వచెయ్యమని ఆవిడ మౌనంగా వుండిపోయేది కారణం తనకు తెలుసు. అందుకే సుధాకర్ అభిప్రాయాన్ని తాను సమర్థించలేకపోయింది అత్తయ్య ఇక్కడికొస్తే విశ్రాంతి వుండదు. పనులు మీద వేసుకుంటుంది. చెప్పినా వినదు. “నువ్వు అవస్థ పడుతుంటే చూస్తూ ఎలా కూర్చోనూ?” అంటుంది. అక్కడ ఎన్నో ఏళ్ళుగా స్నేహంగా వున్నవాళ్ళ మధ్య జీవిస్తూ ఒకర్తి ఇంత ఉడకేసుకుని సంతోషంగా వుంటోంది. వేసవి శెలవలకు పిల్లల్ని తీసుకుని తానక్కడికి వెళ్లినపుడు స్వర్గంలో వున్నట్టు వుంటుంది. విశాలమైన పెద్ద ఇల్లు పెరడంతా విరబూస్తున్నపూల మొక్కలు, కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టిన ముంగిలి ,రావయ్యగారి కోడలు, మనవలూ పచ్చారంటూ పళ్ళు కూరలు పంపించే అత్తయ్య స్నేహితుల పలకరింపుల మధ్య వంటపనీ, ఆఫీసుపనీ లేక తనప్రాణం సేద తీరేది.

“అక్కడెలాగూ చాకిరీ తప్పదు. ఇక్కడైనా విశ్రాంతిగా వుండు” అంటూ తనని పనిచెయ్యనిచ్చేది కాదు. పిల్లలు పొరుగు పిల్లలతో ఆడుకుంటూ, బామ్మచేతి ముద్దలు తింటూ శెలవలైపోయి ఇంటికి వెళ్ళాలంటే ఏడ్చేవాళ్ళు. తనకు తలదువ్వి వద్దన్నా వినకుండా జడవేసేది. నాకు లక్ష్మి ఒక్కతీ, నీవూవేరు కాదు” అంటూ అమెరికాలో వున్న కూతుర్ని తలుచుకునేది. పెరట్లో పూసిన కనకాంబరాల దండలల్లి జడను అలంకరింపజేసేది. నిజానికి పూలు పెట్టుకునే అలవాటూ, కొరికా తనకు లేకపోయినప్పటికీ ఆవిడ సంతోషాన్ని కాదనలేకపోయింది. అత్తయ్య తనకోసం కొన్న పేటేరు పువ్వుల చీర కట్టుకుని, కంటికి సన్నగా కాటుక పెట్టుకుని అద్దంలో తనను తాను పదిసార్లు చూసుకునేది. సుధాకర్ తనను ఆశ్చర్యంగా చూస్తూంటే తనకెంతో సంతోషం కలిగేది. “ఊరి చెరువునిండా ఎర్రతామరలు కిక్కిరిసి పూసాయి. చూసిరా! ఉమా… అనేది అత్తయ్య ఇద్దరూ టి.వి.లో పాత సినిమాలు చూసి ఆనందించేవారు. అత్తయ్యకు తన  మనసు, ఇష్టాయిష్టాలూ తెలుసు. సాయంత్రాలు సత్యనారాయణస్వామి గుడికి వెళ్ళటం. ప్రశాంతమైన వాతావరణం తనకెంతో శాంతిగా వుండేది అలాంటి స్వర్గాన్ని వొదిలి, తనింటికి వచ్చి, అరవైదాటిన వయసులో పనులతో సతమతమయ్యే అత్తయ్యను ఊహించుకోవాలంటేనే  బాధగా వుంది తనకు.

ఆ సాయంత్రం సునీత ఇంట్లో పనిమనిషి పరిగెత్తుకుంటూ వచ్చి “అమ్మగారు నిద్రమాత్రలు మింగారటమ్మా! ఆస్పత్రికి తీసుకెళ్ళారు. . పెద్దమ్మగారు ఏడుస్తున్నారు.” అని చెప్పడంతో కంగారుగా సునీతింటికి పరుగెత్తింది ఉమ.

 “అమ్మాయ్ ఉమా! నువ్వు చెప్పుతల్లీ! మా సునీతకు స్నేహితురాలివేగా, వాళ్ళు మాదగ్గర వుండక్కరలేదని కోడలికి చెప్పు. ఈ వయస్సులో మాకీ కష్టం వద్దు. నా కొడుకు వెర్రినాగన్న వాడికి మా మీద ప్రేమ. మాకు మాత్రం పిల్లలు సంతోషంగా వుండటం కంటే ఏం కావాలి తల్లీ! అంటూ ఉమ చేతులు పట్టుకుని ఏడ్చింది సునీత అత్తగారు.

“మీరే మీ అబ్బాయికి చెప్పవచ్చుగా?” అంది ఉమ.

అయ్యో చెప్పాను తల్లీ! నా నోటితో నేనే నా కొడుకుని బయటకు పొమ్మనమని చెప్పాను.

ఉమకు  కళ్ళలో నీళ్ళు తిరిగాయి

 సునీత పరిస్థితి బాగానే వుందనీ, ఎక్కువ నిద్రమాత్రలు మింగకపోవడం వల్ల ప్రాణభయం లేదనీ, చెప్పి భార్యా, భర్తలివురికి  కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు డాక్టరుగారు. అందరూ స్థిమిత పడ్డారు. 

ఇంటికి వచ్చాకా ఉమ ఆలోచనల్లో పడింది. క్రమేపీ మనిషి సమూహన్నుంచి ఒంటరి వాడైపోతున్నాడనిపించింది. భవిష్యత్తులో పెద్దవాళ్ళందరకూ ఒంటరి బ్రతుకులూ, వృద్ధాశ్రమాలే శరణ్యం అయితే, ఇక పిల్లల్ని కనీ, పెంచీ, వాళ్ళ కోసం సమస్థం ధారపోసి చదివించడం, ఇవన్నీ ముందు ముందు వుంటాయా? “మెన్ మేక్ హౌసెస్, విమెన్ మేక్ హోమ్స్” అంటారు కదా! అదెంతనిజం బాంధవ్యాలను పదిలంగా అల్లడం ఆడవారికి తెలిసిన విద్య హోం  స్వీట్ హోమ్ అన్నారు. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలలో, పిల్లలు హాస్టళ్ళల్లో, భార్యా భర్తలు ఆఫీసుల్లో మగ్గిపోతుంటే అసలు హోమ్ ఎక్కడ వుంది? ఇక స్వీట్ నెస్ ఎక్కడుంది? బాల్యానికి మాధుర్యాన్ని అద్దే” బామ్మల్ని అమ్మమ్మలనూ, తాతలనూ మనం ఎక్కడ చూడాలి? జీవనగమనానికి నిర్దేశిత మార్గం అంటూ వుండదుకదా! నిట్టూర్చింది.ఆలోచనలో ఉన్న ఉమ ఫోను మ్రోగడంతో లేచింది.

ఆ సాయంత్రం సుధాకర్ ఆఫీసు నుంచి వచ్చేసరికి ముందు గదిలో ఉమ నలుగురు పిల్లలకు ట్యూషన్ చెపుతోంది. 

“హాట్ బాక్స్ లో టిఫెన్ వుంది తినండి. పాలు వేడిగా వున్నాయి కాఫీ పెట్టుకోండి” అంది సుధాకర్ తొ పిల్లలు వెళ్లకా రెండు కప్పులతో కాఫీతీసుకొచ్చాడు సుధాకర్ ఒక కప్పు ఉమకు ఇచ్చి “అమ్మ ఫోన్ చేసింది.” అన్నాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుండటం ఉమ గమనించింది.

“అమ్మ ఇక్కడకు వచేస్తానంది. ఇంటికి మంచి బేరం వచ్చిందిట. నువ్వు ఫోన్ చేశావటగా వచ్చెయ్యమని అమ్మకు కొడుకు మాటకంటే కోడలిమాటే ముఖ్యం అన్నమాట” అన్నాడు నవ్వుతూ

“అంతేగా మరి” నవ్వింది ఉమ.

“అయితే మీకు తెలియనిది ఒకటుంది నేను ఉద్యోగానికి రాజీనామ చేశాను.” అంది నెమ్మదిగా.

 “రెజైన్ చేశావా….? ఎందుకు? నిజమేనా?

నిజమేనన్నట్లు తలాడించింది ఉమ.

బుద్దుందా నీకు?…..ఈ ఖర్చులన్న ఎలా భరిద్దామనుకుంటున్నావు? గట్టిగా అరిచాడు సుధాకర్,

“కంగారు పడకండి. అత్తయ్య ఇల్లు అమ్మిన డబ్బుతో లోన్ కట్టి, మిగతాది అవిడ ఖర్చులకు వుంచుకుంటానన్నారు. మీ జీతం వస్తుందిగా ఇల్లు గడవడానికి… అత్తయ్య మనింటికి పని మనిషిగా రావడం నాకిష్టంలేదు. అవిడకిప్పుడు అరవైనాలుగేళ్ళు అసలు వారం రోజుల క్రితం ఆవిడ కాలు జారి పడకపోయుంటే ఇప్పట్లో అత్తయ్యని ఇక్కడకు రమ్మని అడిగేదాన్నికాదు. 

“అమ్మపడిందా…?” కంగారుగా లేచాడు సుధాకర్

“భయంలేదు. కాలు బెణికిందంతే మీకు చెప్పద్దన్నారు దేవుడి దయవల్ల విరగలేదు. ఇక అవిడ ఒంటరిగా వుండటం మంచిది కాదనిపించింది. అందుకే వచ్చెయ్యమని అడిగాను. విశ్రాంతి తీసుకుంటూ పిల్లలతో ఆనందంగా గడపాల్సిన కాలం ఇది. ఆవిడకు మరెన్నో సంతోషాలను ఇవ్వాలనుకున్నాను గానీ పనిఒత్తిడినికాదు. అందుకే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇంట్లో నా పని నేను హాయిగా చేసుకుంటాను. ఆవిడ ఇల్లు అమ్మిన డబ్బుతో మీరు బ్యాంకులోన్ తీరుస్తారు. మీ జీతంతో ఇల్లు నడుస్తుంది. నేను రోజూ రెండుగంటలు ట్యూషన్ చెప్పుకుంటే వచ్చే డబ్బుపై ఖర్చులకు సరిపోతుంది.”

“ఇంట్లో పెద్దవాళ్ళుండాలంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు మానెయ్యాలా ఇదేం పరిష్కారం? కోపంగా అన్నాడు సుధాకర్

“నాకు మాత్రం ఇదే పరిష్కారం, ఉద్యోగాన్ని నేనెప్పుడూ సంతోషంగా చెయ్యలేదు డబ్బుకోసం తప్ప. ఈ కాలనీలో చాలామంది  నన్ను పిల్లలకు లెక్కలు చెప్పమని అడుగుతున్నారు. అది నాకు సంతోషం అంతేకాదు అత్తయ్యను ఇంట్లో విశ్రాంతిగా వుంచాలనే నా కోరిక కూడా తీరుతుంది” అంది.

“అంతేగా మరి! తమరి నిర్ణయం అయిపోయిం తర్వాత” అంటూ నీరసంగా లేచాడు సుధాకర్ తల్లితో మాట్లాడడానికి.. అపార్ట్మెంట్ ముందుగా కారాగడం చూసి “బామ్మోచ్చింది అంటూ పిల్లలు కిందకి పరుగెత్తారు. అత్తగారికి స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఉమని పిలిచింది సునీత “ఉమాగారూ! ఈ రోజు మేం వేరే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం” అంది సంతోషంగా.

సునీత ఇంటి ముందు మినీవేన్ ఆగివుంది. అందులోకి మనుషులు సామాన్లు సర్దుతున్నారు. 

కంగ్రాట్యులేషన్స్  సునీతగారూ! సంతోంషంగా వుండండి” అంది ఉమ మనఃస్ఫూర్తిగా.

“థాంక్స్! అంది సునీత.

సుధాకర్ కారులోంచి తల్లిని దింపి చెయ్యపట్టుకుని నెమ్మదిగా నడిపించి తీసుకొస్తున్నాడు. కారు వెనకాలే చిన్నలారీలో సామాన్లువచ్చాయి.

“అవిడెవరు? ఈ సామాన్లు ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది సునీత. 

సునీతగారూ! ఈవిడ మా అత్తయ్యగారు ఇక ఇక్కడే వుంటారు అంది నవ్వుతూ ఉమ. 

“అయితే ఇప్పుడు మీకు చుట్టుకుందన్న మాట సమస్య” అంది సునీత

 సమస్యకాదు సంతోషం, బాధ్యత, నేనే అత్తయ్యను  రమ్మనమని అడిగాను.

 “గొప్పసాహాసమే” అంటూ వెక్కిరింతగా అని గిర్రున వెనుతిరిగి విసవిసా నడిచిపోతున్న సునీతను చూస్తూ కాదు సామరస్యం సునీతా! అంది. జీవన గమనంలోని వ్యత్యాసాలను చూస్తూ అత్తగారికి స్వాగతం చెప్పడానికి ముందుకు నడిచింది ఉమ.

****

Please follow and like us:

6 thoughts on “గమనం (కథ)”

  1. గమనం కథ లో ఉమ అత్త లాంటి అత్తగారు ఉంటే ఆవిడ్ని నిర్లక్ష్యం చేయటం నిజంగా అవివేకమే. నిజ జీవితం లో అలాంటి అత్తా – కోడలు దొరకటం చాలా అరుదు. ఉమ్మడి కుటంబంలోని కష్ట సుఖాలు అర్థం చేసుకుని కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకుని మెలగ గలుగతే అంత కంటే ఏం కావాలి ?

  2. గమనం కధను చక్కగా నడిపించారు. ఎందరో సునీతలు మనకి కనిపిస్తూనే వుంటారు
    ఉమ పాత్ర చక్కగా మలిచారు. పెద్ద వాళ్ళకి
    సేవ చేయడం కోసం job కూడా మానేసింది. కుటుంబం కావాలనుకుంది. ఉమ్మడి కుటుంబాల గొప్ప దనం తెలీక…. నేడు…. సునీత లాంటి వాళ్ళు……. పెద్ద వాళ్ళని వదులు కున్నారు

  3. కుటుంబ గమనానికి సర్దుకు పోవడం తప్పనిసరి ఒకరి నొకరు అర్ధం చేసుకోక పోవడమే…… కుటుంబ కలహాల కు దారితీస్తోంది. సునీతలు ఉమలు మనకి కనపడుతూనే వుంటారు. యద్బావం తద్భవతి.. మంచి కధ ను చదివించారు

  4. అభినందనలు లలిత మేడంగారు!
    ఉమ్మడి కుటుంబాల విలువలు మరచిపోతున్న నేటి తరానికి కనువిప్పు మీ కథ. కుటుంబం సహకారంతోనే జీవితం సాఫీగా నడుస్తుందనడానికి చక్కని చుక్కాని మీ “గమనం” కథ.

  5. బావుంది లలిత గారూ!కోడళ్ల బుద్ధుల లోని వ్యత్యాసాలను చక్కగా చెప్పేరు.మంచి కథ.👍

Leave a Reply to Renuka rao Cancel reply

Your email address will not be published.