యుద్ధం ఒక గుండె కోత-6

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి

యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని

తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా

పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి

కాలాన్ని కొనగోట నిలిపి

దానిమీద భూగోళాన్ని బొంగరంగా తిప్పాలని

అహంకిరీటం ధరించి

రింగుమాష్టరువి కావటమే కాక

జగన్నాటక సూత్రధారుడివి అనుకున్నావు

నియంతవి కావటానికై క్షుద్రబుద్ధితో

నువ్వు నేర్పిన విద్య లక్ష్యం తప్పి 

నీ పైనే ప్రయోగింపబడేసరికి

మకుటం జారేసరికి

తల్లడిల్లి చిందులేస్తున్నావు

చర్యకి ప్రతిచర్య తప్పదుకదా

అసలు చర్య ఎక్కడ మొదలైందో తేలాలి ఇప్పుడు

నీ గుండె నువ్వు నిజాయితీగా

ఒక్కసారి తడుముకొని చూడు

కనిపించని గాయాలు

ఏ గుండెని ముందు తాకాయో 

స్కేనింగులు తీసి పరిశీలించాలి

ఏ యింట్లో పొయ్యి బోర్లించే పరిస్థితి వచ్చిందో

ఏ పెరటిచెట్టు వేళ్ళు హక్కుల్ని కోల్పోతున్నాయో

ఏ తల్లిగుండె రిమోట్‌ లేకుండానే పిగిలిపోయిందో

కనిపించని లెక్కలన్నీ తేలాలిప్పుడు

దేశాల్ని కబ్జా చేసినంత సులువు కాదు

కన్నవాళ్ళ స్వప్నాల్ని స్వాధీనం చేసుకోవటం

బ్రెడ్‌ముక్క ఎరవేసి

ప్రపంచాన్ని సర్కస్‌ ఎరినా చేసి

గారడీ నడుపుదామనుకున్నావు

నోరులేని జంతువులని మూగదెబ్బకొడితే

నీ ఆయువుపట్టు దగ్గరే గాయం చేస్తాయ్‌

భద్రం సుమా!

ఇంక అప్పుడు

నిన్ను నువ్వు కాపాడుకోడానికి 

బొడ్డుచుట్టూ నువ్వే సూదులు గుచ్చుకోవాలి

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.