కనక నారాయణీయం -22

పుట్టపర్తి నాగపద్మిని

పుట్టపర్తి ‘మేఘ దూతం’ కావ్య రచన సమయంలోనే రాయలనాటి కవితా జీవనము – వ్యాసం ( పరిశోధన _ ఏప్రిల్ 1954)

అల్లసానివారి అల్లిక జిగిబిగి – వ్యాసం (పరిశోధన జూన్ 1954) వర్ణనా సంవిధానంలో పెద్దన సమ్యమనం – వ్యాసం (పరిశోధన

ఆగస్ట్,సెప్టెంబర్ 1954) పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన్న నేర్పు, రామభద్రుని శయ్యలో ఒయ్యారం – వ్యాసం (పరిశోధన అక్టోబర్,

నవంబర్ 1954) శ్రీమదాంధ్ర మహాభాగవతము -మహాకవి పోతన రాయల్ అండ్ కో వారి ప్రచురణకు పీఠిక – ఇటువంటి

వ్యాసాలన్నీ ప్రచురితమవటం చూస్తే, పుట్టపర్తి రచనా స్రవంతికి అసలు విశ్రాంతే లేదేమోననిపిస్తుంది కదా!!

ఇదే సమయంలో మరోసారి పుట్టపర్తి జీవితం, ఊహించని మలుపు తిరిగింది!!

ఉన్నట్టుండి ఒక రోజు ఒక లేఖ వచ్చింది,’కేరళ తిరువాన్కూరు విశ్వా విద్యాలయ భాషా విభాగంలో ద్రావిడ భాషా నిఘంటు నిర్మాణంలో మిమ్ములను అధికారిగా తీసుకొనడమైనది. మీకు అంగీకరమైతే, ఫలానా తేదీకల్లా మీరు ఇక్కడికి వచ్చి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించవలసినదిగా వినతి.’ అని ఆ లేఖ సారాంశం.

పుట్టపర్తి ఆనందానికి అడ్డుకట్ట లేదు. కానీ, సందేహం. ఎక్కడి కేరళ?? ఎక్కడి కడప?? తన ద్రావిడ భాషా పరిజ్ఞానాన్ని వాళ్ళు గుర్తించి, తన కీ విధంగా అవకాశమివ్వటానికి కారణం ఏమై ఉంటుందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి, ఇలా లేఖ రావటమేమిటి?? అసలిదంతా నిజమేనా?? తీరా వెళ్తే, అక్కడేమౌతుందో??

ఈ విచికిత్స ఇలా ఉండగా, అసలు తనకు ఇక్కడి యీ ఉద్యోగం నుండి అక్కడికి వెళ్లేందుకు అనుమతి వస్తుందా ?? రామకృష్ణ హై స్కూల్ కరస్పాండెంట్ రంగనాథం గారు చాలా మంచి వ్యక్తి. తన లోని ప్రత్యేకతలను ఎప్పుడూ ఆ యన ఇష్టపడుతూనే ఉంటాడు. ఈ విషయమై తక్కిన ఉపాధ్యాయుల కుళ్ళుమోతు తనం సంగతి ఎలా ఉన్న, ఆయనెప్పుడూ, ఇంతవరకూ తననే విషయంలోనూ అదిలించినది లేదు. కానీ ఆ యన మంచితనాన్ని యీ విధంగా ఇబ్బంది పెట్టటం బాగుంటుందా??

భార్య కనకమ్మకు యీ విషయం చెబితే, ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికే సంసారంలో అనేక ఢక్కా మొక్కీలు తిని ఉండటం వల్లే ఉండవచ్చు.

ఈ సంగతిని రాచమల్లు, వై. సి.వి. రెడ్డి వంటి వారితో చర్చిస్తే వారన్నారు, చక్కటి అవకాశం!! జారవిడుచుకోవటమెందుకు?’ అని!!

పైగా, బతుకలేక బడి పంతులు అన్న నానుడి కి తన జీవితమూ ఒక ఉదాహరణగా మారనవసరం లేదిప్పుడు!! ఎటువంటి డిగ్రీలూ లేని తనను విశ్వవిద్యాలయంలో, అధికారిగా నియమించే వారి నిర్ణయం వెనుక తన కృషి, విస్తారమైన భాషా పరిశోధన కూడా ఉండటం – దానికొక గుర్తింపు రావటం , అనే అంశాలు, పుట్టపర్తిని పురికొల్పాయి. రామకృష్ణ హై స్కూల్ రంగనాథం గారు, ఎటువంటి నియమాలు లేని సెలవు మంజూరు చేశారు . ఇంకేముంది? కేరళ వాసం ప్రారంభమైంది.

కేరళ తిరువనంతపురంలో విశ్వవిద్యాలయ ద్రావిడ భాష నిఘంటువు కార్యాలయంలో అడుగుపెట్టారు పుట్టపర్తి. తనకి ఇక్కడ అవకాశం రావడానికి కారణం, ముఖ్యంగా, ద్రావిడ భాషలపై తనకున్న పట్టు, మద్రాసు ఆకాశవాణి వారు, సాహిత్య అకాడమీ వారు దీనికితోడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి సౌజన్యం. తన కృషిని తాను చేసుకుంటూ వెళ్లారే గాని, సిఫార్స్ కోసమో , మరి దేని కోసమో కాదు. నిజానికి, ఎవరి విషయంలోనైనా ఇది సత్యం. నిజాయితీగా తన పరిశ్రమ తాను చేసుకుంటూ వెళ్లడం ఒకటే, అన్నిటికంటే ముఖ్యం. ఇతరులు గుర్తిస్తారా లేదా అన్నది, తరువాతి సంగతి. కానీ నిజమైన కృషికి ఏనాటికైనా ఇప్పుడైనా గుర్తింపు ఉండి తీరుతుంది అన్నదానికి తన జీవితంలోని సంఘటనలే , ఉదాహరణ లేమో!! ఇంతమంది తన పని పట్ల సంతృప్తికరంగా ఉన్నారని, అవసరం ఏదైనా వస్తే తన పేరును సూచించటం లో ఏమాత్రం వెనుకంజ వేయరని అవగతం అయిన తరువాత పుట్టపర్తికి తనపై తనకు నమ్మకం కుదిరింది. ఇక విశ్వవిద్యాలయంలో పని మొదలైంది.

ఆధునిక భారతీయ భాషలో చేపట్టిన గొప్ప వ్యవస్థీకృత లెక్సిగ్రాఫిక్ వెంచర్ మలయాళ లెక్సికాన్. రోమన్ లిపిలో లిప్యంతరీకరణతో మలయాళ పదం, ధ్వనిశాస్త్రం మరియు అక్షరాల కూర్పు, వైవిధ్యాలు, ఆ పద అర్థాన్ని సూచించే ఇతర ద్రావిడ భాషా పదాలు , శబ్ద ఉత్పత్తి శాస్త్రం అనుసరించి ఆ పదం వివరాలు , పదనిర్మాణ కూర్పు, వ్యాకరణ వర్గం, మలయాళం మరియు ఆంగ్లంలో అర్థం, అదనపు భాషా సమాచారం, అనేకార్థ సూచికలు , పర్యాయపదాలు, అనులేఖనాలు, కాలక్రమానుసారం, క్రియల వర్గీకరణ, ఆ పదానికి నిర్ధారించిన జెండర్ ( లింగం) లేబుల్స్, ఇటాలిక్స్ లో జంతు, వృక్ష శాస్త్ర సంబంధ సూచికలు, సామెతలు, పలుకు బడులు, వివిధ మాండలికాల సూచన , క్రాస్ రిఫరెన్స్-ఫొనలాజికల్ మరియు సెమాంటిక్, హోమోనిమి యొక్క సూచన, ఉపయోగాలు, అధికారిక సూచనలు మరియు మరెన్నో లక్షణాలు దీనిని ప్రత్యేకమైన నిఘంటువుగా చేయాలని, ఈ పని తరతరాలకు తరగని పెన్నిధిగా నిలిచిపోవాలని ఈ ప్రాజెక్టు అధికారి సూరనాడ్ కుంజన్ పిళ్ళై గారి తాపత్రయం.

భాషా శాస్త్రము మాత్రమే కాక పిళ్ళై గారు ఇతర సాహిత్య ప్రక్రియల్లో కూడా చేయి తిరిగిన వారే!! అంబ దేవి అన్న వారి నవల బహుళ జనాదరణ పొందింది. కల్యాణ సౌధం మరొక నవల. ఈ రెండు నవలను కేరళీయులు ఎంతగానో ఆదరించారు. వాటిని పాఠ్య గ్రంథాలుగా గుర్తించటం కూడా జరిగింది. కొ చ్చి ( కొచ్చిన్) మహారాజా వారిని సత్కరించి ‘ సాహిత్య నిపుణన్ అని బిరుదు కూడా ప్రదానం చేశారట అప్పటికే !! Tiruvananthapuram State Manuval తయారీలో వారిదే సింహభాగ కృషి అన్నది అందరికీ తెలిసిన సత్య మట !! Malabar in the eyes of Travellers, Swathi Tirunal మొదలైన వారి రచనలు ఇంగ్లీషులో కూడా ఉన్నాయి.

విశ్వవిద్యాలయంలో పిళ్ళై గారి సౌజన్యం తనకెంతో నచ్చింది. ముఖ్యంగా సంస్కృత సాహిత్యం పట్ల వారికున్న అధికారం, ఆసక్తి అద్భుతం. తీరిక దొరికినప్పుడల్లా తనను గదికి పిలిపించుకుని సంస్కృత సాహిత్య చర్చలు చేయటం ఆయనకు ఎంతో ఇష్టం . కొన్నిసార్లు సంస్కృత రచనకు దగ్గరగా ఉండే ప్రాచీన మలయాళ కవిత్వ విశేషాలను కూడా ఆయన చెబుతుంటారు. కథాకళి గురించి ఎన్నో విశేషాలు ఆయన తనకు చెప్పటం చూస్తున్న చాలామంది అక్కడి అధికారులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక తెలుగు వ్యక్తి తో సూరనాడ్ కుంజన్ పిళ్ళై లాంటి అధికారి గంటల తరబడి చర్చించటం వారికి వింతగా కనిపిస్తోంది . తానేదో ఆయన్ని కాకా పడుతున్నట్టుగా వారి భావన. వారి తాపత్రయం చూస్తుంటే, ఒకటే నవ్వు వస్తుంది తనకు !! కాకా పట్టడం అన్నది తన స్వభావం లోనే లేని గుణం. అటువంటిది, వీళ్లు తన గురించి ఇలా అనుమాన పడటం చూస్తుంటే పుట్టపర్తికి నవ్వు కాక మరి ఏం వస్తుంది !!

ఇకపోతే, తిరువనంతపురం ప్రకృతి సౌందర్యం పుట్టపర్తిని కట్టిపడేసింది. ఎటు చూసినా పచ్చదనపు పరవళ్ళు !! ఎటు దృష్టి మళ్లించినా , ఆధ్యాత్మిక సౌరభం !! ఏ రుతువులో నైనా పొంగి పా రుతుండే జలవనరులు !! ఇవన్నీ చూస్తూ, పరవశిస్తున్న పుట్టపర్తికి, కార్యాలయంలో, నగర నివాసంలో అనుభవాలు కూడా వైవిధ్యభరితంగా అనిపించాయి ఏమో !! అప్పుడప్పుడూ, తన దగ్గరున్న చిన్న దైనిక డైరీ లాంటి బుక్కులో తన భావాలు రాసుకునేవారు పుట్టపర్తి ఈ క్రింది విధంగా !!

13-8-1954 Very first day, I imprinted my individuality on them. My Sanskrit compositions were very much appreciated by them. The Principal of the Sanskrit College was immensely pleased.

కృష్ణ స్వామి అయ్యంగార్ (తమిళ)

పరమ శివం పిళ్ళై (మళయాళం)

కృష్ణ నాయర్ (ఇంగ్లిష్ ఫైలాలజీ)

నేను చేరిన రోజు, యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాను. ప్రాకృతాలు లేనట్టే!! ‘This university is supposed to be the centre of culture ‘

అన్నాను. పైమాటతో నొచ్చుకున్నట్టుంది. దానిపై చాలాసేపు వ్యాఖ్యానించారు.’

‘ నంబూద్రీలిట వైదికులు. రాజ్య దానము చేసినది, మార్తాండ వర్మ. దానిపై, ‘పద్మనాభదాస. ఇప్పటి రాజు కొంత భక్తుడు.

వాడిప్పటికీ గుడికి వచ్చి, నాల్గుసార్లు విష్ణుసహస్ర నామం నిలబడి చెప్పుతాడు. వీరిది వంబి వంశము. (అక్షరాలు సరిగా లేవు) చేర

దేశము. తరువాత వేరైనది.’

శంకర్ కురుప్పా – నేడితడు పెద్ద మళయాళ కవి.’

నంబూద్రీలకు అమావాస్య తర్పణాలు లేవు. అంతా తద్దినం నాడే.”

‘ఒక అరటి, ఖర్జూరం వలె ఉంటుంది. రెమ్మలు, పండ్లు వాడరు. శుభ కార్యాలలో ఇండ్లకు మాత్రం కడతారు. అరటి కూర ఎక్కువ

తింటారు. మగ వ్యభిచారులు ఎక్కువ. హెచ్చరికగా ఉండవలె!! ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. మగవాండ్లు ఇళ్ళలో ఉంటారు. ఏమి చిత్రమో!!’

‘ఎళుత్తచ్చన్ ‘అధ్యాత్మ రామాయణము, ‘సంగ్రహ భారతమూ ‘బుద్ధ చరితమూ మొదలైనవి వ్రాశాడు. నారాయణ భట్టు గొప్ప

సంస్కృత కవి. భాగవతం వ్రాసెను. ఇంకా అనేక గ్రంధాలు. కానీ, మళయాళం దాటి బైటికి రాలేదు..’

‘త్రిశూర్, ఎర్నాకుళం దగ్గర , బస్సులో ప్రయాణం!! అందరూ నాయర్లే!! ఈ దేశాన్ని గురించి విన్నదంతా నిజమే!!

మందులూ, మాకులూ, మంత్రాలూ – అన్నీ జరుగుతాయి!! ఎక్కువగా , ఆడ మళయాళమే!!’

‘ఇక్కడి స్త్రీలలో, శూద్రులలో మంత్రవాదమెక్కువ. మందులూ మాకులూ ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలె..’

(సశేషం)

****

ఫోటో: డా. సూరనాడ్ కుంజన్ పుళ్లై గారు (1954 లో తిరువనంతపురం మలయాళం లెక్సికన్ నిర్మాణ సమయం లో పుట్టపర్తికి అధికారి)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.