ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ)

తమిళం: లతా రఘునాధన్

అనువాదం: గౌరీ కృపానందన్

బాబిని మెల్లగా లేవనెత్తి వడిలో కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక భాగాన్ని అటూ ఇటూ జరుపుతూ తనకు సౌకర్యంగా ఉండే ఒక భంగిమను బాబి కనుక్కోవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. 

చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి పెట్టి, వెనక్కి తిరిగాడు బాబి. “ఇప్పుడు చెప్పు” అంటూ, తలను ఒక వైపుగా వంచి తండ్రి వైపు చూసాడు. ఏదో ఎదురు చూస్తున్నట్లు బాబి కళ్ళు మెరిసాయి.

పుస్తకం పుట కంటికి కనిపించ లేదు. చూపును అడ్డగించిన కొడుకు తలను కొద్దిగా జరిపాడు. చటుక్కున తండ్రి చేతిని తోసేస్తూ, ముందు ఉన్న భంగిమలోనే తల పెట్టుకుంటూ పెద్ద గొంతుతో బాబు ఫిర్యాదు చేశాడు.

“తొయ్యొద్దు. అమ్మా! నాన్న  నా తలను తోస్తున్నాడే.”

“కాస్సేపు పిల్లవాడిని చూసుకోమని చెప్పకూడదు కదా. ఏదైనా చేసి ఏడిపించి మళ్ళీ నా దగ్గర పంపించడానికి ఏదైనా దారి చూస్తూ ఉంటారు. ఏదో సెలవు రోజు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాబును చూసుకోవడం చేత కాదు. ఏం చెప్పను? నా జాతకం అలా ఉంది. నాకంటూ దక్కింది ఏదీ సరిగ్గా లేదు. దేని గురించి మొర పెట్టుకోను? కన్నా! నాన్న దగ్గర కధల పుస్తకం ఇవ్వు. చదివి కధ చెప్పమను.”

“అవును. గోల్డ్ లాక్ కధ చెప్పాలి” అంటూ అధికారంతో ఉత్తర్వు జారీ చేశాడు సుపుత్రుడు. 

అతను చదివిన కధలకు కొంచం కూడా సంబంధం లేని కధలనే చెప్పాలి. కారణం అతని భార్య కొడుక్కు అలా నేర్పించి పెట్టింది. ఇంత వరకు చదవని కధను పుస్తకంలో వెతికాడు.  సందులో తలకి పక్కగా కనపడిన కొన్ని వాక్యాలను అతను పెద్ద గొంతుతో చదవ సాగాడు.

“అయ్యో అమ్మా! నాన్నకి కధ చెప్పడం తెలియడం లేదు. ఊరికే చదువుతూ ఉన్నాడు.”

“ఉండరా మరి! నాన్నకి కధ తెలియదు కదా. చదవనీ. ఇదిగో చూడండీ. ప్రొద్దున్న మీరు పేపరు చదువుతారు కదా. అలా గంటల తరబడి చదువుతూ ఉండకండి. త్వరగా చదివి అర్ధం చేసుకుని కధ చెప్పండి.”

ఎప్పటి లాగే కధ చెప్పడానికి కూడా తనకి తెలివితేటలు లేవు అన్న స్పృహ మెల్లిగా మనసులో కదలాడింది. కూడ బలుక్కుని ఎలాగో కధ చెప్ప సాగాడు.

“అమ్మా! నాన్నకు కధ తెలియడం లేదు. తప్పు తప్పుగా చెబుతున్నాడు.”

“ఏమండీ! పిల్లవాడు చెప్పింది విన్నారా? మీ కధలన్నీ నా దగ్గరే చెల్లుతాయి. బాబిగాడి దగ్గర చెల్లవు.”

అతను మౌనం వహించాడు. మాట్లాడనీ… ఏదైనా ఒక కొత్త కధ బ్రద్దలవుతుందో ఏమో. చప్పుడు ఏమీ వినబడలేదు. కాస్త మనశ్శాంతిగా అనిపించింది. అదే సమయం భయం కూడా కలిగింది. వ్యతిరేక భావాలు ఇప్పుడు అతనికి అలవాటు అయి పోయాయి.

కధను కొనసాగించాడు.

“ఈ కధ వద్దు.” బాబి పుస్తకం దబ్బుమని మూసేశాడు.

“ఏంట్రా బాబీ! అమ్మ చెప్పినట్లుగా లేదా? ఏమండీ! వేరే కధ చెప్పండి.”

ముణుక్కు ముణుక్కు మంటూ మెల్లగా తలనొప్పి ప్రారంభం అయ్యింది. కాఫీ తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. కానీ అడగాలంటే జంకుగా అనిపించింది. అడగకుండా ఉండి పోయాడు.

“నాన్నా! కధ చెప్పు మరి.” మెల్లగా గునుస్తున్నట్లుగా బాబి గొంతు వినబడింది.

“ఇంద్రధనుస్సు కధ చెప్పనా?”

“ఇంద్రధనుస్సా? అంటే ఏంటీ?

“అరె దేవుడా! పిల్లవాడికి అర్ధం అయ్యేలా ఏదైనా చెప్పకూడదా?” ఆవాలు తాలింపు శబ్దంతో కలగలిసి భార్య గొంతు వినబడింది.

“చెప్పు నాన్నా? ఇంద్రధనుస్సు అంటే ఏమిటీ?”

మెల్లగా మనసులో రూపొందిన ఇంద్రధనుస్సు సౌందర్యంలో మునిగి పోయాడు. రంగుల్లోపల దూరి బైటికి వచ్చాడు. బైటికి వచ్చినప్పుడు తను కూడా ఆ రంగులో మారి పోయి ఉండడం ఆశ్చర్యంగా గమనించాడు. ఇంద్రధనుస్సును హారం లాగా మెడలో వేసుకున్నాడు. కరఘోషాలు. శభాసులు అతడిని చుట్టూ ముట్టాయి. చక్రవర్తి లాగా అనుభూతి కలిగింది. చటుక్కున జోకర్ లాగా కూడా అనిపించింది. ఆ జోకర్ ఇంద్రధనుస్సు రంగులని విడిగా విడదీసి, రిబ్బన్ లాగా చేసి, ఒకదానికి ఒకటి ముడి వేసి ఒక పెద్ద ఇంద్రధనుస్సు తాడులాగా మార్చి వేసి, దానిని పట్టుకుని ఆకాశం నుంచి నేల మీదికి దిగాడు. తలనొప్పి కొద్ది కొద్దిగా తొలిగి పోసాగింది. కలల ప్రపంచం నుంచి భైట పడి యదార్ధ లోకానికి వచ్చాడు.

“ఆకాశంలో ఎప్పుడైనా కనిపిస్తుంది. ఏడు రంగుల్లో అర్ధ చంద్రాకారంలో, నీలి ఆకాశంలో మెడకు వేసిన పూల దండలాగా చూడడానికి అద్భుతంగా ఉంటుంది.”

“ఏడు రంగులా?”

“అవును. అద్భుతమైన రంగులు. విడి విడిగా కాకుండా ఒకదానితో ఒకటి పెన వేసుకున్నట్లుగా… రంగుల మేఘంలా, రంగుల తోరణంలాగా, ఒక…”

“ఏ ఏ రంగులు?”

“వయలెట్, ఇండిగో…” అతను చెప్పి ముగించాడు.

“తరువాత?”

“అవి మాత్రమే. ఈ ఏడూ రంగులే ఇంద్రధనుస్సులో ఉంటాయి.”

“అమ్మా! నాన్న తప్పుగా చెబుతున్నాడే. రెండు రంగులు వదిలేశాడు.”

“చూసారా? నా బాబిగాడి తెలివితేటల్ని! ఒరేయ్! తండ్రికే పాఠంనేర్పించిన గురువురా నువ్వు. పిల్లవాడికి చక్కగా నేర్పించండి.”

మెల్లగా లోగొంతుతో తనకి తనే చెప్పుకున్నాడు.

“నేను సరిగ్గానే కదా చెబుతున్నాను.”

 బాబిగాడు తుళ్ళినట్టుగా లేచి నిలబడ్డాడు. “లేదు. తప్పు! నలుపు, తెలుపు రెండు రంగులను వదిలేసావు.”

“లేదురా కన్నా! ఆ రెండూ ఇంద్రధనుస్సు రంగుల్లో లేవు.”

“అయ్యే! ఉన్నాయి.”

“ఇదిగో చూడు. లెక్క పెట్టుకో. ఎరుపు, నీలం…” వేళ్ళను విడిచి లెక్క పెడుతూ ఏడు వేళ్ళను చూపించాడు.

“లేదు. ఉన్నాయి. ఇంద్రధనుస్సులో తొమ్మిది రంగులు. నలుపు, తెలుపు… తరువాత నువ్వు చెప్పావు చూడూ… ఆ రంగులు కూడా ఉన్నాయి.”

“లేదు. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు మాత్రమే, నలుపు, తెలుపు లేవు.”

“ఉన్నాయి… ఉన్నాయి.” గొంతు పెంచి అరిచాడు బాబి.

“అయ్యో రామా! ఏంటండీ మీతో పెద్ద గొడవ! రెండు నిమిషాలు బాబిగాడిని ఏడవకుండా చూసుకోవడం చేతకాని మనిషి. ఎందుకు రభస చేస్తున్నారు? బాబిగాడు చెబుతున్నాడుగా. ఇంద్రధనుస్సులో నలుపు, తెలుపు రంగులు కూడా ఉన్నాయనుకుంటే  ఏం కొంప మునిగి పోతుందని ఇలా మొండిపట్టు పడుతున్నారు?”

తలనొప్పి ఇప్పుడు పూర్తిగా తీవ్రస్థాయికి చేరింది. మెల్లగా ఊపిరి లోపలికి తీసుకుని నిదానంగా బైటికివదిలాడు.

నిదానంగా… ధృడంగా అన్నాడు.

“అవును. ఇంద్రధనుస్సుకు తొమ్మిది రంగులు.”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.