కథాకాహళి- 21

ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

  యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ విరమణ చేశారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు. ఆమె తండ్రి ఎం. ఆర్. చంద్ర  నుండి వారసత్వంగా వచ్చిన రచనా వ్యాసంగంలో ఇప్పటికి రెండు వందల కథలు రాశారు. ఇండియా టుడే, ఈనాడు, సాక్షి ,భూమిక, చినుకు, జాగృతి, సాహితీ ప్రస్థానం, పత్రిక, నవ్య, ఆంధ్రజ్యోతి ,ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ, వార్తవిశాలాంధ్ర ,మూసి, ” చిత్తూరుకథ”, ” రాయలసీమ రచయిత్రుల కథలు”–  తదితర అన్ని దిన, వార, పక్ష మాసపత్రికల్లో కథలు ప్రచురించబడ్డాయి. కొన్ని కథలకు పోటీల్లో బహుమతులు, అవార్డులు వచ్చాయి. కడప, తిరుపతి  ఆకాశవాణిలో అరుణ కుమారి కథలు, కవితలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి. 1994లో దూరదర్శన్, ఆకాశవాణి కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆమె ఇంత వరకు వెలువరించిన కథాసంపుటాలు వేగుచుక్క (1996), సాగర కోయిల (2003), మన్నులో మన్నున్నె ( 2006) “కన్నీటి చేవ్రాలు” నవల 2020లో విశాలాంధ్ర వారు ప్రచురించారు. ఈమె రచనలు నేలవిడిచి సాము చెయ్యవు. సమాజంలో తన చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలు, వారి వెతలే ఆమె కథావస్తువులు. ముఖ్యంగా ఎంత  చదువు చదువుకున్నా, ఉన్నత ఉద్యోగం చేస్తున్నా స్త్రీలను వేధిస్తున్న కట్టుబాట్లు, మనసు విప్పిచెప్పుకోలేని వ్యధలు గృహ, పనిచేసే చోట్లలో – శారీరక, మానసిక హింసలు, ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమె రాసిన కవితలు, కథలు ఆమెను “స్త్రీవాద రచయిత్రి”గా ముద్ర వేశాయి. తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ,ప్రథమ శ్రేణి పౌరులుగా  గుర్తింపు కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం ,ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛకోసం ప్రశ్నించడం, పోరాడడమే ఆమె రచనల లక్ష్యం.  మానవ హక్కులన్నీ మహిళా హక్కులు కావాలన్న తపన,  ఆమె  రచనల లక్ష్యం. చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షురాలిగా,  కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కార సంఘం సభ్యులుగా, బౌద్ధదమ్మ సంఘం సభ్యులుగా, జనవిజ్ఞానవేదిక, సమత కన్వీనర్ గా జిల్లా అధికార భాషా సంఘం సభ్యులుగా- తెలుగు భాషకు ఇతోధికంగా కృషి చేస్తున్నారు. తన తండ్రి చంద్రశేఖర్  పేరుతో యం.ఆర్. చంద్ర మెమోరియల్ ట్రస్ట్, అబ్బాయి పేరుతో పూర్ణ చైతన్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సాహితీ, సామాజిక సేవలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ముఖ్యంగా అవయవ దానం పట్ల, హెల్మెట్ల వాడకం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తూన్నారు. సాహిత్యంతో పాటు  ప్రజాసంక్షేమ కార్యక్రమాలలో  నిమగ్నమై వుంటారు.

అరుణకుమారి వివిధ దశలలో స్త్రీలు అనుభవిస్తున్న అనేక సమస్యలను తనకథలలో చిత్రిక పట్టగలిగారు. మాతృమూర్తిగా, స్త్రీల గౌరవానికి వచ్చిన కొదవేముంది అని వాదించే వాళ్ళకు  ఈమె కథల్లో మాతృమూర్తులుగా స్త్రీలు పడుతున్నయాతనాంశాలు చక్కని సమాధానం అవగలవు. ఈమె కథల్లో సాధారణ స్త్రీల నుండి విభిన్న జీవితాన్ని గడుపుతున్న  స్త్రీలవరకు పాత్రలుగా మలచబడ్డారు. ముఖ్యంగా “చెమ్మగిల్లనీ…!”, “రహదారి బతుకులు” చాలా అరుదైన కథలు.  తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదట ఎండార్ఫిన్ గురించి ప్రస్థావింవిన కథ “చెమ్మగిల్లనీ…!”. దాంపత్యజీవితంలో సంస్కారంవున్నా, లేకున్నా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తమ వాంఛలు తప్ప భార్యలుగా వాళ్ళ  స్పందనలకు, తృప్తికి తామెంత భాద్యత వహిస్తున్నామన్న దృష్టి పురుషులకు వుండదు. సంస్కారులైతే హాస్యం, సరసం పేరుతో భార్యల లైంగికతను వ్యంగ్యంగా ఆక్షేపిస్తారు. కుసంస్కారులైతే, స్త్రీల శరీరం పట్ల, వయసురీత్యా వస్తున్న మార్పుల పట్ల సరైన అవగాహనలేని పురుషుల మాటలు ఎంత వేదనకు గురిచేస్తాయో ఈకథలో చిత్రించడాన్ని ఇక్కడ గమనించొచ్చు. 

“అందాలెటూ లేవు. కనీసం ఆడతనమన్నా సరిగా ఏడిస్తే కదా! ఛ ఛ! నీతో ఒక సుఖములేదు సంతోషమూ లేదు. నీకన్నా దున్నపోతు నయం”

మనశ్శరీరాలను నిర్దయగా సజీవ దహనం చేసే మాటలు! గుండెను తూట్లు పొడిచే మాటల తూటాలు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్న చిగర్భని ప్రేమ! తరగని అసహ్యం! భార్యంటేనే అసహ్యం. ఆమె మొహం చూడాలంటేనే చిరాకు. ఆమె మాటంటే పరాకు. మటమటలు, చిటపటలే గాని చిరునవ్వులు, సరదాలు, సరసాలు, అనురాగం, ఆత్మీయతతో కూడిన దాంపత్య జీవనం ఆమె పెళ్ళి పుస్తకంలోని ఏ పుటలోనూ దుర్బిణీ వేసి వెతికినా కన్పించదు.

“పురుషుడు సెక్స్ కోసం స్త్రీని ప్రేమిస్తే, స్త్రీ ప్రేమ కోసం పురుషుడికి సెక్స్ నందిస్తుంది”. చాలా మంది ఒప్పుకొనే మాటే ఇది. కథకురాలికి కనీసం సెక్స్ సమయంలో కూడా ఆమె పట్ల ఏ మాత్రం ప్రేమ కన్పించనీయని భర్త సమాగమం భరించడంలోని అగత్యాన్ని అరుణ ఈకథలో చర్చకు ఆహ్వానిస్తుంది.

సెక్స్కు ముందు ఒకర్నొకరు ఆకర్షించటానికి, ఆకట్టుకోవటానికి ప్రత్యేక సంకేతాలు, పిలుపులు, వాసనలు,  ఆప్యాయంగా స్పర్శించుకోవటం, పూర్వరతి క్రీడలతో ప్రేరేపించుకొన్న  తర్వాతే స్రవాల విసర్జన జరుగుతుంది.  ఆతరువాతే జతకట్టడం ఆనందించడం సాధ్యం. స్త్రీలను పశువంటూ ఈసడించుకొంటున్న మగపశువులకు  సున్నిత భావాల గురించి  తెలిస్తే, ఈకథ రాయవలసిన అవసరం వుండేదికాదు. పగలంతా బండెడు చాకిరీతో అలసిన స్త్రీల శరీరాలను సుఖం పేరుతో మరింత హింసించటమేగానీ… సేదదీర్చటం కాదు. అసలు దాంపత్యమంటే ఏమిటి? నరాల ఒత్తిడి, కండరాల రాపిడినే కాపురమనుకొంటున్న పురుషుల కాముకత్వాన్ని ఈకథలో రచయిత్రి బట్టబయలు చేస్తుంది. 

 రెండు శరీరాల మధ్య సన్నిహితం మానసిక సాన్నిహిత్యాన్ని కల్గించాలి. ఆమె శరీరమే కాదు మనసు కూడా నాది, నా కోసమే… అన్న భరోసాను, నిశ్చింతను కల్గించాలి.  ’నువ్వు‘, ‘నేను అని కాక మనిద్దరం ఒక్కటేఅన్న ప్రేమైక భావన ఒకరి నుండి మరొకరిలోకి ప్రవహింపచేసే స్పర్శేదాంపత్యం! అలాంటి కలయిక శారీరక, మానసిక ఒత్తిళ్ళను తగ్గించి అనుబంధాన్ని, అనురాగాన్ని మరింత బలపరస్తుంది. ఆరోగ్యపరంగా కూడా సెక్స్ వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై నొప్పులు తగ్గి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని డాక్టర్లు, సెక్సాలజిస్టులు చెప్తారు. ఎండార్ఫిన్స్ స్రవించకపోవటం వల్లనే స్త్రీలకు లైంగిక చర్యలో నొప్పులు మరింత ఎక్కువవుతాయి. ఎండార్ఫిన్స్ స్రవించక పోవటం  స్త్రీల తప్పుకాకపోవచ్చు.

 స్విచ్ నొక్కగానే బల్బు వెలిగినట్లు… అతనొచ్చిపైన పడగానే… నరాలన్నీ పొంగిపోతాయా. శారీరక క్రియలో మానసిక ప్రేరణే… ఉత్ప్రేరకం కాదా? ఆ ప్రేరణ కల్గించే ఆనందం తను పొందలేదు కదా… తదనుగుణంగా రసాయన ప్రక్రియలో శరీరం స్పందించేది… స్రవించేదీ? స్రావాలు లేవని… తనసలు ఆడదేకాదని… దున్నపోతని అంటున్న మూర్ఖుడికి… భర్త ప్రేమానురాగాల వర్షపు చినుకులకే భార్య మనసు తడుస్తుందని… అతడే.. కోరికల్ని… అవయవా చెమ్మగిల్లిస్తాయనీ… చెప్పినా అర్థమవుతుందా! అని పరితపించే స్త్రీల వ్యక్తీకరింపబడని లైంగిక వేదనల వ్యక్తరూపం ఈకథ. 

భార్యతో సంగమించే సమయంలో “ప్రభావతీ… మై డార్లింగ్…” అంటూ పలవరించే అతని ఫాంటసైజేషన్ వల్ల భార్య నరనరాల్లో పాకుతున్న యాతన. తనపై తనకే అసహ్యం! లాగిపెట్టి… స్పాట్లో… ఒకే ఒక తన్ను తన్నాలన్న బలీయమైన కోరిక అణిచివేతలో బిగుసుకొంటున్న పళ్ళు… పిడికిళ్ళు కానీ ఆపని చేయలేని నిస్సహాయత. “నీకన్నా ప్రభావతే… ఎంతోనయం! డబ్బుపోతే పోయే! సుఖమన్నా దక్కుతుంది. తడి… తడిగా… ఓ… వండ్రఫుల్… ప్రభావతీ…!” అతని పలవరింతలతో పాటు దెప్పిపొడుపుల పర్వంలో ఏ ఎండార్ఫిన్స్ విడుదలౌతాయి.

“నువ్వో శిఖండివి. అందరు ఆడాళ్ళకు వీపులు మైదానాల్లా ఉంటే నీకు….. మైదానం!. నా ఖర్మ! వెనుక పర్సనాలిటీ.. ముందర మున్సిపాలిటీ! బతుకంతా…. మోసపోయా!  సుఖమా! సంతోషమా! ఛీ! ఛీ!” ఈసడింపులతో, వేపుకు తినే భర్తతో బతికినన్నాళ్ళూ స్త్రీలు యాతనలకు గురవుతున్న క్రమాన్ని ఈకథ బహిర్గతం చేయగలిగింది.

మర్మావయవాలలో తడిపుట్టని లేదా ఇంకిపోయిన క్రమంలో భర్తల ఈసడింపు సంభాషణల్లోని ఎత్తిపొడుపులు, ఎగతాళి ఎంత దారుణంగా వుంటుందో వూహించలేనిదేమి కాదు. ఈ హేళనలను కనీసం ఆత్మీయులతో కూడా చెప్పుకోలేని స్థితి స్త్రీలది. అలా చెప్పుకోవడం వలన తమతోటి స్త్రీలు కూడా సానుభూతిగా సమస్యను అర్థంచేసుకోవడంగానీ, భర్తల భావదారిద్ర్యాన్ని ప్రశ్నించడం గానీ జరగదు. పైగా  ఆలాంటి హేళన తమ స్త్రీత్వానికే అవమానంగా, ఆటంకంగా భావించడం ఒక కారణమైతే, అలాంటి హేళనలకు వీళ్ళు కూడా తోడవడం జరుగుతుందనే సందేహం మరో కారణం. వ్యక్తిగత రాజకీయాలను ఎంత అర్థం చేసుకున్నా ఇంకా  లైంగికాంశాలలో నూన్యతాతలం నుండి స్త్రీలు తప్పుకోలేకపోతున్న ఒక క్రమాన్ని ఈకథ నమోదు చేయగలిగింది.

 “వయసు, యాంత్రికత, రోగాలు, అందుకోసం వాడే మందుల ప్రభావాలు, తీవ్రమైన ఒత్తిడి…! సహజమైన చెమ్మలేనపుడు.. జెల్లీలు వాడడం తప్ప గత్యంతరంలేదు”. అని మహిళా డాక్టర్ మాటల్లోని వాస్తవం పురుషాధిక్య ప్రపంచంలో ఎంతమందిపురుషులకు తెలుసు అన్న భావన కలుగుతుంది. పురుష స్పర్శకు స్పందించని జడపదార్థాలుగా స్త్రీలెందుకు మారుతున్నారో అని ఆలోచించలేని పురుష అహంభావాన్ని కథనం చేయడంలో అరుణ ఎంత చొరవ చూపారో, పురుషుడిగా అతని ఆనందంలోని కృతిమత్వాన్ని కూడా కథలో చర్చించడం వలన ఒక సమగ్రతను ఈ కథ సంతరించుకో గలిగింది.    

“ఏంటీ… ప్రదర్శనా? నీకే ఉన్నాయనా? సిగ్గుగా లేదా? పైట మడతలు పెట్టి పిన్ను పెట్టుకోలేకపోయావా?” బస్టాండులోనే నలుగురి మధ్య భర్త.. భార్యను కసిరిన గద్దింపులు. స్త్రీల మనసులను తాచుల్లా కాటేసిన బాధ నుండి స్త్రీలెలా తప్పుకోగలరు?.ఈ విషయంలో స్పందిస్తే బరితెగించిన దానిలాగా చూస్తారేమోనన్న నూన్యత.

ఆడతనం, అమ్మతనం… స్త్రీకున్న వరాలంటూ.. కవులు గేయాలు… పాటలూ…రాసినవాళ్ళు, పాడినవాళ్ళంతా పురుషులే.  స్త్రీల అంగాంగ వర్ణనలు, ఉపమానాలు…. వాళ్ళను సంతోషపెడ్తాయన్న భ్రమ. స్త్రీల పాలిండ్లు… చిన్నారుల ఆకలి తీర్చే అమృత భాండాగారాలుగా కంటే తమ సుఖ సంతోషాల కోసమే సృష్టించబడ్డ రతి ఉపకరణాలని…! ఇంకా… ఇంకా భ్రమ.. అంత పెద్దగా ఉంటే, పురుషులకు లభించే ఆనందం. పైట కన్పించగానే స్తనాల పొంగులు చూసే కాముక వాంచ. సభ్యత, సంస్కారాలు, వావివరసలు అన్నీ మరచిపోయే వున్మాదం.

 కాటుక కంటనీరు… చనుకట్టుపయింబడ ఏడ్చిందంటూ వరూధినినేనా… అపర సరస్వతీదేవిని కూడా వదలకుండా వర్ణించిన కాముకత్వం. “సంగీత సాహిత్య స్తనయుగళే! అనకపోతే… ఏ నేత్ర యుగళేఅనరాదా!…” అని మగాళ్ళ ఈ లైంగికత్వ భావనల వల్ల ఎందరు స్త్రీలు నరకయాతన పడ్తున్నారో! పెద్దగా ఉంటే అనుమానం! చిన్నగా ఉంటే చిత్రహింస!. ఇవి స్త్రీలు లోలోపలే చెప్పుకోలేక వచ్చే దుఃఖాలను దిగమింగలేని పరిస్థితి. ఈ నీచమైన అవమానాలను, ఏ తల్లిదండ్రులతో మొరపెట్టుకోగలరూ? ఏ లాయర్ తో చర్చించగలరూ? ఏ జడ్జి తీర్పును ఆశించగలరు. ఇలాంటి వేదనలను ఇండియన్ పీనల్ కోడ్  నిర్వచించగలదా? అన్న ఆవేదన ఈకథ చదివిన పాఠకులను వెన్నాడుతుంది.

వలస కార్మికుల జీవితంలో చోటుచేసుకున్న అర్దాంతర చావులను ప్రస్తావించిన కథ “రహదారి బతుకులు”. వున్న వూర్లో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న క్రమంలో  మామిడిపళ్ళ సీజన్ నాలుగు నెలలు కుటుంబాలకు దూరంగా వుండటంలోని వాంఛ, చేతిలో పడిన డబ్బు, శరీర సుఖాల  ప్రలోభం జహీర్, ను, అతని భార్య బూబమ్మను, రోజాను కూడా చిలకమ్మ లాంటి వలసజీవుల బతుకులు మృత్యువాత పడటంలోని విషాదాన్ని పంచుతూ, మౌనంగానే ప్రమాద హెచ్చరికలను జారీచేస్తాయి.

 “నిశ్శబ్ద కెరటాలు” అన్న కథలో పేద ముస్లిం కుటుంబాల్లో పన్నెండేళ్ళు కూడా నిండని అమ్మాయిల్ని అరవైయేళ్ళు పైబడిన అరబ్ షేక్ లకు పెళ్ళి పేరుతో  అమ్ముకొనే దయనీయ పరిస్థితి చిత్రించబడింది. ఈకథలో  అమీనా అనే అమ్మాయి తల్లిదండ్రులకు  ఎదురు తిరిగి తనను తాను ఎగుమతి చేయబడే దుస్థితినుండి కాపాడుకుంటుంది. నజీర్ లాంటి బ్రోకర్లకు బుద్ధి చెబుతుంది. అలాగే ’లేతవెన్నెల’ కథలో బురఖా వేసుకోలేదని  ఓముస్లిం యువతి ముఖం మీద కొందరు మతోన్మాదులు ఆసిడ్ పోసిన సంఘటన ఆధారంగా రాసినది. ముస్లిం స్త్రీల జీవితాల్లో తోంగిచూసే నీలినీడల్ని వారి మనోవేదన తెలియజెప్పే ఈకథలు “మన్నులో మన్నై” కథా సంకలనంలో సులభశైలిలో రాశారు. గిరిజన మహిళ గురించి రాసిన  కథ “అడవిపువ్వు” తల్లిని మోసం చేసిన అతనికి బుద్ది చెప్పడం కోసం అతని కొడుకుతో కలసి ప్రేమనాటకమాడి, పదిమందిముందు తన తల్లికి జరిగిన మోసాన్ని ఒప్పుకునేట్లు చేసిన గిరిజన యువతి మోతి సామర్థ్యాన్ని ధైర్యాన్ని నిరూపించిన కథ ఇది.

నిరక్ష్యరాస్యురాలైన గిరిజన యువతి ’కాళి’  శేఖరం ఇంట్లోనే పనిమనిషిగా వుంటుంది. అనేక అవకాశాలున్నప్పటికీ అతను చేసిన మోసాన్ని బట్టబయలు చేయలేకపోతుంది. కానీ కాళీ కూతురు చదువుకున్న గిరిజన యువతిగా మోతి తన తల్లికి జరిగిన అన్యాయాన్ని మౌనంగా సహించలేక పరిస్థితులను  ఎదిరిస్తుంది. తల్లికే న్యాయం చేయగలిగేంత చైతన్యస్థాయిలో మోతి పాత్రను ఉన్నంతగా అరుణ కుమారి తీర్చదిద్దగలిగారు. కానీ అంతవరకు శేఖర్ మోసాన్ని ప్రశ్నించలేని కాళి, కూతురు చొరవకు దైర్యం చూపిన కాళి, అతను కట్టబోయిన తాళిని  అతని మోహంపైకి విసిరివేయటం శేఖర్ మోసాన్నితెలిసికూడా అతనితో జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరం తనకు లేదని నిర్భయంగా తన నిర్ణయాన్ని తెలపడం ఇవన్నీ ఆ పాత్ర ఆలోచనా పరిణామాన్ని పట్టిస్తుంది. రచయిత ఆలోచనల్లో స్త్రీల వ్యక్తిత్వం పట్ల, వంచనల పట్ల, సంస్కారం పట్లగల అవగాహనకు, ఆదర్శాలకు కాళీ, మోతి పాత్రలను రచయిత్రి ప్రతీకాత్మకంగా తీర్చిదిద్దారు.

యం. ఆర్. అరుణకూమారి  వైవిధ్య భరితమైన చక్కని కథా వస్తువులను తీసుకున్నందువలన సరళమైన భాష ఇతివృత్తాలకు పాత్రల స్వభావానికి అనుగుణంగా మలచడం వలన సాధారణ పాఠకులు సైతం అర్థంచేసుకోవడానికి ఎలాంటి శిల్పసంబంధమైన అంశాలు అడ్డంకిగా మారలేదు. సగటు పాఠకుల అభిరుచిని, అవగాహనను పెంచడానికి దోహదపడిన మంచి కథలు అందించగలుగుతారు.

  ప్రేమించానని వెంటబడిన  యువకుడితో నేను నిన్ను ప్రేమించలేదని  చెప్పినా వినకుండా ఒకసారి ఆమెను రేప్ చేస్తే  చచ్చినట్లు పెళ్ళాడుతుందికదా అనే మోసపూరితంగా ప్రవర్తించిన యువకున్ని ఆమె తిరస్కరిస్తుంది. ఒకసారి అత్యాచారానికి గురైనానని అతన్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడితే జీవితాంతం అతని చేతిలో అత్యచారానికి గురి అవ్వటమేనని చెప్పిన మోతి పాత్రను చాలా హైట్స్ లో మలచారు. గిరిజన స్త్రీల అత్మాబిమానాన్ని, నిష్కపటాన్ని యం. ఆర్. అరుణకుమారి ఈకథలో సృజించారు.

     ఈమె కథల్లోని స్త్రీపాత్రలు అభ్యుదయంగా అలోచిస్తాయి. ప్రేమ, పెళ్ళి పట్ల అరుణ కుమారికి వున్న అవగాహన ఫలితంగానే ఈమె కథల్లొని స్త్రీ పాత్రలు చక్కని వ్యక్తివంతో వ్యవహరించగలిగాయి. “అడవిపూలు” కథలోని  కాళీ పాత్రకూడా పాతతరానికి చెందిన యువతే అయిన తనకు జరిగిన మోసాన్ని ఎదిరించే చైతన్యం లేక మౌనంగా వుంటుందేకాని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నమ్మించి మోసం చేసి పారిపోయిన వాణ్ణి స్వీకరించడానికి సిద్ద పడక తానే స్వచ్చందంగా శేఖరాన్ని తిరస్కరిస్తుంది, అరుణ తన అన్ని కథల్లో కూడా ముగింపు విషయంలో పాఠకులు ఊహించలేని కొసమెరుపులతో స్త్రీపాత్రలను ఉన్నతీకరిస్తారు. ఈవిషయాలను పరిశీలించినట్లయితే పితృస్వమ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను మరింత లోతుగా అధ్యయనం చేయగలిగితే భవిష్యత్తుల్లో సీరియస్  స్త్రీవాద రచయితగా ఆవిష్కరింపబడతారు. 

ఈ కథలో మోతి ఒక గిరిజన యువతిగా వుండి ధనబలంతో అగ్రకులంలోనుంచి  వచ్చిన శేఖరం కొడుకుతో తన తల్లికి జరిగిన మోసాన్ని తెలిపి, అతన్ని ప్రేమ నాటకానికి ఒప్పించడం. మోతి తల్లికి న్యాయం చేయడం కోసం తన తల్లి గురించి ఆలోచించకుండా తండ్రికి  మరోపెళ్ళి చేయడానికి ఒప్పించటం ఇవన్నీ చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. వాస్తవం కంటే నాటకీకరణకే ఈకథ  దగ్గరగా వుంటుంది. ఈ అననుకూల పరిస్థితులన్నీ అలవోకగానూ, రెడిమేడ్ గాను సమాజంలో చకాచకా జరిగిపోవు. రెండు భిన్న వర్గాల మధ్యగల వైరుధ్యాలు ఏ సామాజిక సంఘర్షణ లేకుండా సామాజిక సమస్యలు సుఖాంతంకావు. అలా జరిగిందీ అంటే ఆ కథలో రచయిత  అలోచనా దృక్పథంలో ఏదో లోపం అనివార్యంగా వుంటుంది. దాన్ని అధిగమించగలిగితే, మరింత ప్రయోజనం అందే అవకాశం వుంది.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.