“బషీర్ కథలు”

   -పి.జ్యోతి

వైక్కం మొహమ్మద్ బషీర్ మళయాళ రచయిత. తన రచనా కాలంలో కేవలం 30 పుస్తకాలే రాసి గొప్ప పేరు తెచ్చుకున్నారాయన. వారి మళయాళ కథల అనువాదం ఈ “బషీర్ కథలు”. హైద్రరాబ్ బుక్ ట్రస్ట్ వారు ఆగస్టు 2009 లో ప్రధమంగా ముద్రించిన ఈ కథలు బషీర్ ను తలుగు పాఠకులకు పరిచయం చేసే చక్కని ప్రయత్నం. కేరళ లో దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన బషీర్ కథలు మానవ జీవన విశ్లేషణకు సజీవ రూపాలు. వీరి కథలలో మధ్యతరగతి మానవుల జీవితం, వారి సంబంధ బాంధవ్యాలు, వారి బలహీనతలు గురించి విపులంగా చర్చ ఉంటుంది. కథలలో విషాదం తో పాటూ వ్యంగ్యం ఉంటుంది. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన  బషీర్ ఒకానొక సందర్భంలో మానసికంగా అస్వస్థకు లోనయి చికిత్స కూడా తీసుకున్నారు. ఆ రోజులలోని దిగువ మద్యతరగతి ముస్లిం జీవితాలను, వారి సంస్కృతిని దేశానికి పరిచయం చేసారు బషీర్. వీరి కథలు చదువుతున్నంత సేపూ తెలుగులో నటరాజన్ కథలు గుర్తుకు వస్తాయి. ముస్లిం మతస్తులలో విద్య అవసరం చాలా ఉంది అని గ్రహించిన వ్యక్తి బషీర్. తాను రాసిన కథలని తన సోదరులే చదవలేకపోవడం వెనుక వారి అవిద్య పెద్ద కారణం అని వారికి తెలుసు. తన మతంలోని పిడివాదం, ఛాందసత్వం, అజ్ఞానాలను తీక్షణంగా విమర్శిస్తూనే, మళయాళంలో ముస్లిం సాహిత్య సృష్టీ చేస్తూ వెళ్ళారు. దీని కారణంగా భయంకర ఒంటరితనాన్ని అనుభవించారు. మళయాళ సాహిత్యం మాత్రం ఆయనను కేవలం ముస్లిం సాహీతీవేత్తగా చూడలేదు. బషీర్ పేదలు కూడా తన పుస్తకాలు చదవాలనే ఉద్దేశంతో తాను చిన్న చిన్న పుస్తకాలనే రాస్తూ వచ్చానని ఎన్నో సార్లు చెప్పుకున్నారు. మైనారిటీలు మెజారిటీ వర్గాలతో విడిపోయి జీవించవలసిన అవసరం లేదిని, కొంత మేధోమధనం తో ఇరు వర్గాలు సామరస్యంగా మసలే వ్యవస్థ ఈ దేశంలో సృష్టించుకోవచ్చని గాఢంగా నమ్మిన సాహితీవేత్త బషీర్. 

ఈ సంకలనంలో బషీర్ రాసిన 21 కథలున్నాయి. ‘ఒక ప్రేమ లేఖ” కథను తెలుగులోకి అనంత్ అనువదించారు. కేశవన్ నాయర్ అనే చిరుద్యోగి సారమ్మ అనే యువతిని ప్రేమించడం, ఆమెకు ప్రేమ లేఖ రాయడంతో కథ మొదలవుతుంది. తనకో ఉద్యోగం చూడమని చెప్పిన సారమ్మను తన ప్రేయసిగా ఉద్యోగం ఇస్తాడు కేశవన్. అతనితో చనువుగా ఉంటూ అతని దగ్గర నెల జీతం హక్కుగా తీసుకునే సారమ్మ, ఆ జీతాన్ని ఇస్తూ ఆమె పై హక్కుని స్థిరపరచుకునే కేశవన్ ఇద్దరిలో కూడా ఆర్ధిక అవసరాల ప్రభావం తో మొదలయిన సంబంధం కనిపిస్తుంది. కాని ఇది తరువాత బలపడి స్వచ్చమైన ప్రేమగా మారడం చూస్తాం. నాయర్ హిందువు, సారమ్మ క్రైస్తవ మతాన్ని నమ్ముతుంది. ఆర్ధిక అవసరాలు వారిని దగ్గరకు చేస్తాయి. మధ్యలో పురుషాహంకారం, కులాహంకారం పైకి లేసినా తరువాత ఆ బంధం ప్రేమ దిశగా అడుగులు వేయడం చూస్తాం. అన్ని సంబంధాలు ఆర్ధిక సంబంధాలే అయినా వాటి మధ్యన కూడా పురి విప్పి ఆడే మానవ అనుభూతులు, సెంటిమెంట్ల గురించి అధ్బుతమైన వివరన ఇచ్చిన కధ ఇది. “ఏనుగుల దొంగ బంగారు శిలువ” అనే కథలో చాలా ప్రశ్నలు చూస్తాం. దేవునికి బంగారు శిలువ ఎందుకు అని దాన్ని దొంగతనం చేసే దొంగ తన వాదాన్ని వినిపిస్తాడు. అలాగే ఆ ఏనుగులను దొంగతనం చేయాలనే వారి ప్రయత్నం చివరకు అది విఫలమయినా తమ మంచికే అలా జరిగిందని అనుకుని సమాధానపడే మానవ లాజిక్ ఇవన్నీ ఈ కథలో చూస్తాం. ఈ కథను జి. షేక్ బుడన్ మళయాళం  నుంచి తెలుగులోకి అనువదించారు. 

తరువాతి కథ “పూవన్ బనానా”. దీన్ని విమల గారు అనువదించారు. పూవన్ బనానా అంటే ఒక రకమైన అరటి పండు. జమీలాబీబీ యూనివర్సిటీ డిగ్రీ ఉన్న స్త్రీ. ఆమెను అబ్ధుల్ ఖాదీర్ సాహిబ్ వివాహం చేసుకుంటాడు. అతను జమీలా బీబీ తండ్రి బీడి ఫాక్టరీ లో పని చేస్తూ ఉంటాడు. పెద్దగా చదువుకోలేదు. అతన్ని వివాహం చేసుకుని సంస్కరించాలి అని అనుకుంటుంది జమీలా. అతన్ని అతని స్నేహ బృందం నుండి వేరు చేసి, అతని జీవన సరళి ని మార్చాలనుకుంటుంది. వివాహం అయిన తరువాత, ఒక రోజు తనకి పూవన్ బనానా లు తినాలనుందని కోరుతుంది. అవి ఎక్కడా దొరక్కపోవడంతో అతను నది ఈదుకుంటూ వెళ్ళి అక్కడా ఆవలి ఒడ్డున కూడా అరటిపండ్లు దొరకకపోతే, కమలా పళ్ళు తీసుకుని వస్తాడు. అయితే అవి తిననని ఆమె మొండి కేస్తున్నప్పుడు ఆమెను లొంగదీసుకోవడానికి ఆమె పై చేయి చేసుకుంటాదు. మెల్లిగా ఆమె పై ఆధిపత్యం ఎలా సంపాదించాలో అతనికి అర్దం అవుతుంది. వివాహం అనే సిస్టం లో  పురుషుని అధికారంలోకి స్త్రీ ఎలా లాగివేయబడుతుందో చెప్పిన కథ ఇది. హాస్యం, వ్యంగ్యం కలగలసిన కథ. “బంగారు ఉంగరం” అనే కథను ప్రభాకర్ మందార అనువదించారు. గర్భవతి అయిన భార్య వద్ద ఆమె పూర్వికుల బంగారు ఉంగరం చూసి అది సాధించాలని ఆమెతో పందెం కట్టీ, అలాగే తోటి మిత్రులతో కూడా తనకు పుట్టబోయే బిడ్డ గురించి పందెం కట్టి వారిద్దరి వద్ద పందెం ఓడిపోయి, ఆ విషయం బుకాయించి వారి వద్ద డబ్బు వసూలు చెసి చివరకు వారు తిరగబడినప్పుడు మిత్రులను హిందూ అహంకారులుగా పరిగణించి వారి డబ్బు వారికి ఇస్తూ చివరకు లాటరీ లో వచ్చిన డబ్బుతో సంతోషించిన ఒక సామాన్య ముస్లిం కథ ఇది. అవసరానికి అనుగుణంగా తన ఆలోచన పంధాను మార్చుకుంటూ అడిగినవారిని దబాయించి తాను మాట్లాడిందే నిజం అని బుకాయించే సామాన్య మానవుని నైజాన్ని హాస్యంగా ఈ కథలో వ్యక్తీకరించారు బషీర్.

“దుడ్డూలాఠో పణిక్కర్” అనే కథను వనజ తెలుగులోకి అనుదించారు. అహంకారి, దుర్మార్గుడు అయిన ఒక పోలీస్ పై చాలా మందికి కోపం ఉంటుంది. అతన్ని చంపాలని ఆ విధంగా అతను ప్రదర్శించిన అహంకారానికి జవాబివ్వాలని కొందరి కోరిక. కాని అతన్ని చంపిన వ్యక్తి కూడా తాను అనుకున్నట్లుగా కసిదీరా అతన్ని చంపలేకపోయానని బాధపడడం, ఒక్క గుద్దుకే అతను చనిపోయాడని అతన్ని చంపిన ఆనందం కూడా తనకు కలగలేదని వాపోవడం ఈ కథలో చూస్తాం. ఒక మనిషి పై పెంచుకున్న ద్వేషం అతని చావు కన్నా భయంకరంగా ఉండే సందర్భాలు ఉంటాయని తెలియపరిచిన కథ ఇది. “అమ్మ” అన్న కథ హెచ్చార్కె గారు అనువాదం చేసారు. చాలా గొప్ప కథ ఇది. ఉద్యమంలో పాల్గొనే కొడుకుల కోసం ఎదురు చూసే ప్రతి తల్లి కథ. బిడ్డ కోసం ప్రతి రోజు అన్నం వండి అతను వస్తాడని ఆశపడే తల్లుల కథ ఇది. “మోసకారి కూతురు” పి. సత్యవతి గారు అనువాదం చేసారు. ఒక ఊరిలో ఒట్టకణ్ణన్ పొక్కర్ అనే వ్యక్తి ఉంటాడు. జనంతో జూదం ఆడిస్తూ డబ్బు సంపాదిస్తాడు అతను. అతని కూతురు జైనబా. అదే ఊరిలో మండన్ అనే తెలివి తక్కువ వ్యక్తి ఉంటాడు. అతను జైనబా ని ప్రేమిస్తాడు. కాని అతనికి కూతురుని ఇచ్చి పెళ్ళి చేయడానికి పొక్కర్ ఇష్టపడడు. చివరకు పొక్కర్ ని జూదంలోనే ఓడించి డబ్బు సంపాదించి టీ కొట్టూ పెట్టి ఊర్లో వారి చేత శభాష్ అనిపించుకుని పంచాయితి వారిని ఒప్పించి జైనబా ని వివాహం చేసుకుంటాడు మండన్. తనను ఆ తెలివి తక్కువవాడు జూదం లో ఎలా ఓడీంచాడొ పొక్కర్ కి అర్ధం కాదు. చివరకు తన కూతురే తన ఆట రహస్యాలు మండన్ కి చెప్పి అతను తనను ఓడించడంలో సహకరించిందని తెలుసుకుని అవ్వాక్కవుతాడు పొక్కర్. 

“తాయెత్తు” కథను ఎస్. జయ అనువదించారు. బట్టతల పై వెంట్రుకలు తాయెత్తుతో మొలుస్తాయి అని నమ్మి అబ్దుల్ అజీజ్ తనకు తన స్నేహితుడు శంకర్ అయ్యరు కు తావీజులు కోంటాడు. కొన్ని రోజులకు ఆ తయెత్తులో మహిమలు లేవని నిర్దారించుకుని అవి పడేస్తాడు. కాని అతని మిత్రుడు, ఆ తాయెత్తులు కట్టుకున్న రోజునుండీ తనకు ఆర్ధికంగా బాగా కలిసి వచ్చిందని, ఇంకొన్ని పంపమని జాబు రాస్తాడు. ముస్లిం దర్గాల దర్శనానికి, తాయెత్తుల పై హిందువులలో ఎంతో నమ్మకం ఈ రోజులకీ చూస్తాం. దాని మీద రాసిన కథ ఇది. “విశ్వవిఖ్యాత ముక్కు” కథ భార్గవ గారు అనువాదించారు. ఒక వ్యక్తి ముక్కు అనుకోకుండా అతి పెద్దగా పెరుగుతుంది. దాని పై జరిగే రాజకీయం, అది దేశ ప్రధాన సమస్య అవడం గురించి రాస్తూ మన దేశంలొ రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు ఎంత హీన స్థితిలో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చెసారు బషీర్. 

“ఏకాంత తీరం” కథను అనంత్ అనువదించారు. ఇద్దరు ప్రేమికుల కలయిక, విడిపోవడం వెనుక దుఖం ఈ కథలో చూస్తాం. “గోడలు” కథను తెలుగులోకి కాత్యాయని గారు అనువదించారు. దీన్ని మమ్ముటీ తో మళయాళంలో ఆదూర్ గోపాలకృష్ణన్ సినిమాగా కూడా తీసారు. ఈ కథలో రాజకీయ ఖైదిగా ఉన్న బషీర్ ఒంటరితనాన్ని, దుఖాన్ని అవతలి స్త్రీల జైలు నుండి ఒక స్త్రీ కేవలం తన మాటతో ఎలా దూరం చేసిందో చెప్తారు బషీర్. స్త్రీ సాన్నిహిత్యం పురుషునికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో చెప్పే అద్బుతమైన కథ ఇది. చివరకు తనకు అంతటి శక్తిని ఇచ్చిన నారాయణి ని కలవకుండా ఆమెకు ఏమీ చెప్పకుండా జైలు వదిలి స్వేచ్చా ప్రపంచంలోకి రావడం ఎంత భాధాకరమో రచయిత రాసింది చదువుతున్నప్పుడు స్వేచ్చ అంటే ఏంటీ ? అన్న ప్రశ్న మనలో కలగక మానదు. “ఒక నాటి ప్రేమ కథ” ను ఆకెళ్ళ శివప్రసాద్ గారు అనువాదం చేసారు. ఒక స్త్రీని చూసి మోహించి ఆమె కోసం గోడ దూకి వెళ్ళి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ఒక మోటు పల్లెటూరి వ్యక్తి అని తెలిసి నిరాశపడి తన అత్మగౌరవాన్ని ఆ ప్రేమ దెబ్బతీయలేదని తృప్తి పడిన ఒక విఫల ప్రేమికుడి కథ ఇది. 

“పుట్టిన రోజు” కథను డి. చంద్రశేఖర రేడ్డి గారు అనువదించారు. కడుపులో ఆకలి తో పోరాడుతూ తన సమాజ గౌరవానికి భంగం రానీయకుండా ప్రవర్తించవలసి రావడం ఎంత పెద్ద శిక్షో చెప్పిన కథ ఇది. ఆకలితో మాడుతూ కూడా కడుపు నిండినట్లు పుట్టినరోజు నాడు నటించవలసి రావడం లో ని వ్యధను చూపించే కథ. “టైగర్” కథ కూడా అకలికి సంబంధించినదే. దీన్ని తెలుగులోకి సంధ్య అనువదించారు. ఆకలితో మాడుతున్న ఖైదీలకు, ఆ పోలీస్ స్టేషన్ లో స్వేచ్చగా తిరుగుతూ కడుపునిండా తిండి తినే కుక్కకు  మధ్య పెరిగిన వైరం, దానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పిన కథ ఇది.

 “ఒక మనిషి” ఈ సంకలనంలో నాకు వ్యక్తిగతంగా నచ్చిన కథ. మానవ మనసు అందులోని లోతులను గొప్పగా చర్చించిన కథ ఇది. హోటల్ లో భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి తన పర్సు ఎవరో కొట్టేసారని బిల్లు కట్టేటప్పుడు చూస్తాడు. అయితే అది నమ్మని హోటల్ యాజమాన్యం అందరి ముందు అతని బట్టలు విప్పిస్తారు. అతన్ని పూర్తి నగ్నంగా నిలబెట్టే సమయంలొ ఒక వ్యక్తి వారిని వారించి ఆ బిల్లు తానే కడతాడు. చివరకు అతనే తన పర్సు దొంగతనం చేసిన వ్యక్తి అని తెలిసినా అతన్ని తన ఆత్మియుడిగా తలచి అతనిచ్చిన పర్సు ని సంతోషంగా తీసుకుని వెళ్లిపోతాడు ఆ అవమానం పొందిన వ్యక్తి. ఆలోచింపజేసే కథ ఇది. 

పకృతి లో జీవాలన్నిటితో కలిసి బ్రతకాలని చెప్పే కథ “అవని తల్లికి అసలైన వారసులు”. దీన్ని కలేకూరి ప్రసాద్ గారు అనువాదం చేసారు. “అనల్ హఖ్” కథను కూడా వీరే అనువదించారు. మంజూర్-అల్-హల్లాజ్ అనే ఒక గురువు కథ ఇది. ప్రభుత్వం అతని నిజాయితికి భయపడి ఎలా అతన్ని హత్య చేయించిందో చెప్పిన కథ. సోక్రటిస్ జీవితం కనిపిస్తుంది ఇందులో. “శబ్దాలు” కథ సాహిత్యంలో ఒక సాహసం అనే చెప్పాలి. ఒక అనాధ యువకుడు స్త్రీ అనుకుని ఒక హిజ్రా ను ప్రేమించడం, తద్వారా సుఖవ్యాదులు అంటుకుని చివరకు వీధిలో బిచ్చగాళ్ల మధ్య గడపవలసి రావడం, ఒక సైనికుడి గా అతను జీవించిన గతం నుండి ఆత్మహత్యా ప్రయత్నం చేసే వరకు అతనికి ఎదురైన అనుభవాలు చెప్పే కథ ఇది. చాలా భయం గొల్పేలా ఉంటుంది. “ఏనుగు పిలక’ ఒక హాస్య కథ అనవచ్చు. దీన్నిపట్నం ఉమాదేవి గారు అనువదించారు. 

ఇక చివరగా వచ్చే “పోత్తుమ్మా మేక కథా నేపద్యం” దోపిడి మీద వచ్చిన అద్భుతమైన కథ. కుటుంబంలోని సంబంధాల మధ్య ఉండే ఆర్ధిక కొలతలు, మనిషి మధ్య పెంచే దూరాలు, మనిషి చూపించే స్వార్దం, చివరకు అందులో అంతర్గత దోపిడి ని అద్భుతంగా చూపిన కథ. దోచుకోబడుతున్న వ్యక్తి కి తన కేం జరుగుతుందో కూడా అర్ధం కాకుండా ఉండవలసిన స్థితి మనసును కలిచి వేస్తుంది. ఇది కుటుంబమయినా, రాష్ట్రమైనా, దేశమయినా, దోపిడి ఆ వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది. ఎవరిని నిందించాలో, ఎవరి నుండి ఎవరిని రక్షించాలో అర్ధం కాని పరిస్థితి. ఇంతటి గంభీరమైన సమస్యను ఒక మేక, దాని పాలు అనే అంశంతో చూపించిన భషీర్ నిజంగా ప్రజా రచయిత. 

బషీర్ కథలన్నీ కూడా జనం నుండి తీసుకున్న ఇతివృత్తాలతో జనం కోసం రాసిన రచనలు. కబీర్ సామాన్యునికి జ్ఞానబోధ చేయడానికి కష్టజీవుల జీవిత వస్తువుని తీసుకుని ఎలా వారికి బోధలు చేసారో బషీర్ అదే దారిలో కథా రచన చేసారు. వీరి కథలలో ఏనుగులు, మేకలు, అరటి పళ్ళూ, గబ్బిలాలు, ప్రధాన పాత్ర వహిస్తాయి. జనజీవనానికి అర్ధం అయ్యే విధంగా గంభీరమైన విషయాలను వ్యవస్థలోని లోపాలను గురించి వివరించే ప్రయత్నం చేసిన ప్రజా రచయత బషీర్. వీరి కథలు తెలుగు లో రావడం అదృష్టం. ఈ సంకలనం లోని కథలను అనువదించిన రచయితలందరూ బషీర్ ఆత్మను తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో కృతక్రుత్యులయ్యారు.  

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.