అమ్మ బహుమతి!

-డా|| కె. గీత

నిన్నా మొన్నటి

శిశుత్వంలోంచి

నవ యౌవ్వనవతివై 

నడిచొచ్చిన

నా చిట్టితల్లీ!

నీ కోసం నిరంతరం తపించే

నా హృదయాక్షరాలే 

అక్షతలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా

నీకు పద్ధెనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు!

నీ చిన్నప్పుడు

మొదటి టీకా రాత్రి నువ్వు కింకపెడుతూ ఏడుస్తున్నపుడు

తడిసిన నా భుజాన కన్నీళ్లు నావే

వచ్చీరాని నడకల్తో

నాకోసం గేటు దగ్గిర కాపలా కాసి

వీథి చివరకి పరుగెత్తుకొచ్చి పడ్డప్పుడు

నీ మోకాలి మీద చివికిన రక్తం నాదే

నీ ముద్దు ముద్దు మాటలు

ఇంకా తాజాగా నా గుండెల్లో

రోజూ పూస్తూనే ఉన్నాయి

నీ బుల్లి అరచేత పండిన గోరింట

నా మస్తకంలో అందంగా

అప్పటి నుంచీ అలా వేళ్లాడుతూనే ఉంది

క్రమశిక్షణా పర్వంలో

నేను నిన్ను దార్లో పెట్టడం పోయి

నువ్వు నన్ను దూరం పెట్టినపుడల్లా

మథనపడ్డ క్షణాలు

గుండె చాటునెక్కడో చురుక్కున పొడిచినా

అంతలోనే గువ్వ పిట్టవై

నా భుజాన నువ్వు గారాల కువకువలాడినప్పుడల్లా

మొలిచిన మందహాసం

ఇప్పటికీ నా పెదాలనంటుకునే ఉంది

నువ్వంటే ఉన్న ఇష్టానికి

చాలని మాటల చాటున

కన్నీళ్లు కేంద్రీకృతమైన అమ్మ మనసు ఉంది

ఆడపిల్లంటే

నేనే కదూ!

నువ్వు నాలోంచి మొలిచిన

ధృవ తారవు కదూ!

ప్రపంచంలోకి ఉరకలేస్తూ

అడుగుపెట్టే పద్ధెనిమిదో ఏట

నిన్ను చూస్తే

కలల్ని అలలుగా

ధరించి ఆకాశంలోకి

రెక్కలొచ్చిన పిట్టలా

ఎగిరిన జ్ఞాపకం వస్తూంది

దారంటా గుచ్చుకున్న ముళ్లతోనే

విరిగిపడ్డ రెక్కల్ని కుట్టుకున్న

ధైర్యమూ జ్ఞాపకం వస్తూంది

జాగరూకురాలివై ఉండు తల్లీ!

చీకట్ల కోరలు పటపటలాడించే

దుష్ట ప్రపంచంలో

అనుక్షణం  

వెలుతురు వైపు 

చూపు సారించి

సెలయేటి శబ్దం కోసం 

చెవులు రిక్కించి

అడుగెయ్యి

నడుస్తున్న అడుగుల చాటున

సూదంటురాళ్లతో బాటూ కాలసర్పాలూ

ఉంటాయి

తలమీద ఎగిరే

కారుమేఘాలతో బాటూ రాబందులూ

ఉంటాయి

అయినా

సిద్ధంగా ఉండు

ఎక్కడ కార్చిచ్చు రగిలినా

నీటిబుగ్గవై మొలకెత్తు

ఎప్పుడు ఉప్పెన ముంచెత్తినా

కత్తిపడవవై తెరచాచు

బురదలో కూరుకుపోతున్నపుడు

మెరుపు తీగవై ఎగబాకు

పోరాటం తప్పనిసరి అయినపుడు

కాగడావై చెలరేగు           

ఏదేమైనా అడుగెప్పుడూ ముందుకని

జ్ఞాపకం పెట్టుకో!

నీ మీద పంచప్రాణాలూ పెట్టుకున్న ఈ అమ్మ బహుమతిగా

నాకు త్రోవ వెంట దొరికిన మిణుగురుల్ని

జాజిమల్లెల్లా నీ జడకు కుడుతున్నా

తప్పిపోయినప్పుడు నీకు కొండగుర్తులై దారి చూపిస్తాయి    

నా గతాన్ని ఆభరణంగా నీ మెళ్లో వేస్తున్నా

అందులో అక్కడక్కడా గుచ్చుకునే రాళ్లున్నాయి

నేను గతించిపోయినా

అవి నిన్ను వజ్రాలై ఆదుకుంటాయి 

*****

Please follow and like us:

3 thoughts on “అమ్మ బహుమతి! (కవిత)”

 1. “అమ్మ బహుమతి” కవితలో అమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు గీతా. ప్రతి అమ్మ మనసును చెమరింప జేసే కవిత ఇది. మీరు వాడిన ఉపమలు, రూపకాలంకారాలు కవితలో భావావేశాన్ని చదువరుల గుండెలకు చేర్చాయి. ఒక అమ్మ హ్రుదయ స్పందన అందరి అమ్మల గుండె లయగా మారి వినిపిస్తోంది.ఆత్మాశ్రయ కవిత్వంలో అందమే అది ఇంత భావస్ఫోరకమైన కవితను అందించినందుకు అందుకోమ్మా అభినందనలు.

  1. ఆత్మీయమైన మీ మాటలకి అనేక నెనర్లు మీరాబాయి గారూ!

 2. ఎద మీద పెరిగిన చిట్టి పాపాయి అనుభూతులను , మరుపు రాని జ్ఞాపకాలను వల్లే వేస్తూనే …।

  అదుపులేని హార్మోన్ల హోరు ,
  ఆపలేని వయసు జోరు ,
  గమ్యం నుండి మళ్ళించే తుఫాను లో తన చిట్టి తల్లి కొట్టుకుపోకుండా తల్లి పడే ఆవేదన ,తపన ……
  అమృతమయం ..।।

Leave a Reply

Your email address will not be published.