బతుకు అద్దం

-కాళ్ళకూరి శైలజ

ఆంధ్రప్రదేశ్ సర్జికల్ కాన్ఫరెన్స్ కి  వెళ్లడమంటే గణపతి మాష్టార్ని కలుసుకోవడం కోసం కూడా.ఇప్పుడు ఆయనున్న ఊరు, విజయనగరం లోనే.ఆ ఊరికి కూడా ఒక కోట ఉంది. 

ఇప్పటికి నేను చూసినవి గుత్తి కోట, కర్నూలు బురుజు. మా అమ్మ “,అనంతూ.నా మనసుకు నువ్వే రాజువి”, అంటూ ప్రేమ గా పెంచింది.

        కోట ఒక ప్రాంతానికి ఐ.డీ.నంబర్ లా అనిపిస్తుంది! మాది మధ్యతరగతి కుటుంబం.అమ్మా, నాన్నా స్కూలు టీచర్లు.నన్నూ,చెల్లి నీ శ్రద్ధ గా  పెంచారు.అమ్మానాన్నే మనకి తొలి స్నేహితులనిపిస్తుందిపుడు.

            కానీ తరువాతి జీవితం లో కొందరు పరిచయమౌతారు. మనమేమిటో మనకి చూపించి వాళ్ళు జీవితాన్నే మార్చేస్తారు .అలాంటి వారే గణపతి మాస్టర్.

             చిన్నప్పటి నుంచీ పట్టుదల గా చదివి ఎమ్.బి.బి.యస్.చేసాను.కానీ తరువాత, పీజీ ఎంట్రన్స్ ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది. రెండేళ్ళ గేప్ వచ్చింది.ఈ మధ్యలో గవర్నమెంట్ సర్వీసులో చేరాను. పిఠాపురం లో ఉద్యోగం.పక్క నర్సింగ్ హోమ్ లో అదనంగా డ్యూటీ చేసేవాణ్ణి.దానికి ఓనర్ రామం గారు.23 ఏళ్ల కి చేతిలో డబ్బులు పడితే ఆ మజా మామూలుగా ఉండదు కదా! మంచి బట్టలు, ఖరీదైన బండి.’ఇగో’ అంటే అదే.మనం కొనేవి,అహాన్ని తృప్తి పరచడానికి అనుకుంటాం.కానీ నిజానికి ఇంకొంచెం పెంచడానికి.

అప్పుడు ఈ విషయం తెలీదు.ఇంటికి డబ్బులు కొద్దిగా,అబద్ధాలు దండిగా పంపేవాణ్ణి. రెండేళ్ళు! ఐసు ముక్కల్లా  కరిగి పోయాయి! ఔను.కాస్త అలవాట్లు మొదలయ్యాయి.

అప్పుడు, వచ్చారాయన. డా.రామం 

గారికి స్నేహితుడు.నా బ్రతుకులో ఒక వెలుగు రేఖ… డా.గణపతి గారు.’గన్ ‘అంటారు.ఆరడుగుల ఎత్తు. ఎడమ చేతి వాటం.ఆయన నడుస్తుంటే ఒక ప్రవాహం సాగుతున్నట్టుగా ఉంది.శరీరం ఒక కరెంట్ తీగలా సజీవ చైతన్యంతో చకచకా కదులుతోంది. వరుసగా మూడు పెద్ద ఆపరేషన్ లు చేసారు.ఎడమ చెంప మీద గడ్డ, పేగులో దోషం, పిత్తాశయంలో రాళ్లు. నేను సహాయకుడిని. నర్సుకు సర్దుకోవడం సమయం పట్టిందేమో గానీ ఆయనది ఆలస్యం లేదు.

             ఆపరేషన్ చేసే ముందు, ప్రతి రోగినీ తానే సాంతం వివరంగా చూసేరు.పక్కనున్న వారితో మాట్లాడేరు.పది నిమిషాల లో పేషెంట్ కు అన్నో, తమ్ముడో,కొడుకో అయిపోయేవాడు.ఏం చదువుకోని రోగి తో సైతం మెల్లగా మాట్లాడుతూ, ఆపరేషన్ అవసరం ఏమిటి,ఎన్నాళ్ళ కు కుట్లు మానుతాయి, శరీరంలో జరగబోయే మార్పులు, భవిష్యత్ లో సమస్యలు, పత్యం,మత్తిచ్చే విధానం అన్నీ చెప్పేరు.

             ” గన్! నువ్వేం మారలేదు రా! నీ చాదస్తం అలాగే ఉంది.ఆపరేషన్ అని వాళ్ళకి చెప్పెసేం.మళ్ళీ నీకెందుకు రా ఈ శ్రమ ?” అని మందలించేరు రామంగారు.

” ఇదుగో అమ్మా !ఆపరేషన్ వివరాలు , పరీక్ష లు,ఆస్తి పత్రాల్లా జాగ్రత్తగా  దాచుకోవాలి సుమా!” అని ఆఖరు మాట కూడా చెప్పాక, “ఒరేయ్,

రామం.పిలవడం వరకే నీ పని.ఆ తర్వాత, నా పని.నన్ను కంట్రోల్ చేయాలంటే కుదురుతుందా?” అని కన్ను గీటేరు గణపతి గారు.                              మరో రెండు మూడు సార్లు ఆయన్ను కలిసాక ఇక నాకు ఉద్యోగం, సరదాలు ఏమీ కళ్ళకి కనబడడం మానేసాయి.బతికితే ఆయనలా బతకాలిరా! అనిపించింది.

      ఆయనకూ నేను నచ్చాను.కారణం నా కళ్ళలో ఆరాధనా భావం కావచ్చు.

అరుదుగా, కాకినాడ కి రమ్మని పిలుపు వచ్చేది.ఆయన స్కాచ్ పుచ్చుకునే వారు.క్రికెట్ కి వీరాభిమాని.రెండో పెగ్ తో ఆపేసి, లేచి నిలబడి మరీ క్రికెట్ షాట్లు చెప్పేవారు.ఇంగ్లీషు నవలల గురించి కూడా.మరీ ముఖ్యంగా డాక్టర్ల పై వచ్చిన కథల గురించి.నాతో,”నువు ఆఫ్ హ్యూమన్ బాండేజ్ చదవాలోయ్.నీలా ఉద్యోగం చేస్తూనే ఇంకా చదువుకున్న డాక్టర్ కథ! “

అనేవారు.

                 ఆయన తో గడపాలన్న ఇష్టం నాకు ఎంట్రన్స్ లో సీట్ తెచ్చిపెట్టింది. మా అమ్మ,” నిన్ను వెతుక్కుంటూ వచ్చిన గురువు ఈయనెవరో గానీ, నీ మార్గదర్శి” అంది.నేను మరింతగా ఆయన్ను గమనించాను.

        మాస్టారు నాలుగడుగులు నడిస్తే ఒక ‘స్వస్థత సామ్రాజ్యం’ లా ఉండేది.

ఆయన చెప్పే పది మాటలు మా విద్యార్థుల పాలిటి పరమాద్భుత పాఠాలు.ఎవరే తప్పు చెప్పినా,చేసినా తిట్టేవారు కాదు.ఆ క్షణం మా మనసుల్లో దాగి ఉన్న సందిగ్ధత, అనుమానం, నిర్లక్ష్యం అన్నీ తొలగించి,  సబ్జెక్ట్ తీరిగ్గా,ఓపికగా చెప్పుకొచ్చేవారు.తప్పులు తగ్గిన కొద్దీ మేం చేసేవి ఒప్పులయేవి,!

                  ఆయన చేసే సర్జరీ చూసేందుకు రెండు కళ్ళు చాలవు.ఒక కళాకారుడు వీణ మీటినట్టు….ఒక పెయింటింగ్ వేసినట్టు…. అలవోకగా ఆ చేతులు తిరిగేవి.రక్తనాళాలు,నరాలు, కండరాలు,పేగులు పక్కకు తప్పుకుని ,

జబ్బును పైకి తోసి ‘పట్టుకుపోండి సారూ! మాకు ఊపిరి ఆడాల్న’ అన్నట్టుండేది. మా ట్రైనీ లకు చేతులు ఏ కోణంలో పెట్టాలి,ఎలా కదపాలి అంటూ ఆయన బోధిస్తే కత్తి,సూది,దారం అన్నీ మా శరీరంలో భాగాలైన ఫీలింగ్! మూడు సంవత్సరాల విద్యా వసంతం గడిపి,స్వర్గం లాంటి కాలేజీ నుండి బాధ్యత గల సర్జన్ గా బయటికి వచ్చాను.

        ఆ తర్వాత కొన్నాళ్లకు చెల్లి పెళ్లి,మరుసటి ఏడాది నా  పెళ్లి, అయ్యాయి.నాకు గుంటూరు కాలేజీ లో ఉద్యోగం వచ్చింది.ఆయన ప్రియ శిష్యుల్లో నేనూ ఒకడిని.ఇపుడిలా విజయనగరం వెళ్తున్నాను.

           “అనంత్! నేనిక్కడ ఉండగా నువ్వు లెక్చర్ ఇస్తే వినడం  నాకు ముచ్చట” అన్నారు గణపతి గారు.

వాళ్లింట్లోనే బస.

ఆరోజు రాత్రి…….

 “నాకు లివర్ క్యాన్సర్ అని తెలిసింది అనంతూ!” అన్నారు.అవాక్కయ్యాను.

“ఆకలి తగ్గిందని చూపిస్తే బయట పడింది!” ఏ ఉద్వేగం లేకుండా చెప్పారు. మాస్టారి కుర్చీ పక్కన కూర్చుని ఆయన ఒడిలో తలపెట్టి మౌనంగా ఉండిపోయాను.

     నా చేతిలో ఏ ఆపరేషన్ వికటించలేదంటే, ఆ పద్ధతి ఆయన నేర్పినదే .పేషంట్లతో సౌమ్యం గా నడుచుకోవడం నేర్పించిన చలువ మాస్టారిదే.ఏ సందేహం వచ్చినా మొదటి ఫోన్ ఆయనకే.

గురు పూజోత్సవం వస్తే, తొలి శుభాకాంక్షల పలకరింపు ఆయనకే.

ఇప్పుడిక నాకు పెద్ద దిక్కు ఎవరు?

        మాస్టారు నా తల మీద చెయ్యి వేసారు.కాలం ఘనీభవించింది.

                           ……………..

ఇది జరిగిన రెండేళ్ల కి విశ్వ మా యూనిట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ గా చేరాడు. నన్ను తెగ బాధ పెడుతున్నాడు.సమయానికి వార్డుకు రాడు. రౌండ్స్ చేయడు.పని తన జూనియర్ల కు వదిలేసి వెళ్లిపోతాడు.

నోరు తెరిస్తే వంకలు.మొన్న వార్డు బాయ్ తో, క్రితం నెల డ్యూటీ నర్సు తో, గత వారం ఏకంగా కాజువాలిటీ డాక్టర్ తో గొడవలు.రెండు మూడు సార్లు పలకరించబోతే నువ్వెంత? అన్నట్టు తల ఎగరేసి పక్కకు పోయాడు. వాడొక ‘మానవ బాంబు’ లా కనిపించాడు.ఎవ్వరి మాటా వినక పోయేసరికి, అందరూ పక్కకు తప్పుకున్నారు.నాకు మాత్రం నా ‘పాత నేను’ కనిపించాను. 

    వెనువెంట గన్ గారు…… ఎదురుగా ఉంటే అనిపించింది. రెండు రోజులు గా విశ్వ రావట్లేదు.ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.

        నేను వాడుండే చోటికి వెళ్ళాను. గ్రౌండు ఫ్లోర్ లో రెండు వాటాలు.వీళ్ళ గుమ్మం దగ్గర తలుపు కొట్టాను.

బాదాను. తీయలేదు.పక్కనున్న వాటాలోంచి ఒకాయన వచ్చి,” ముందు వైపు తలుపు వేసుకుని వెనుక తలుపుకి తాళం పెడతారు.డూప్లికేట్ తాళం ఇక్కడ ఉంటుంది ” అని షేడ్ మీద నుంచి తీసి ఇచ్చారు.”మీరెవరు?” అడిగారు. ” విశ్వ కి బంధువు ని ” జవాబు చెప్పి, తాళం తీసి లోపలికి వెళ్ళాను.

        హాలంతా బీరు సీసాలు,స్విగ్గీ లో వచ్చిన ఫుడ్ పేకట్లు,బట్టలు, చిందరవందరగా పడి ఉన్నాయి .కిచెన్ లో నీళ్ళు సన్న ధారతో పోతున్న సవ్వడి.మొబైల్ లో అరుపులు,కేకల తో సినిమా ప్లే ఔతోంది.అస్తవ్యస్తంగా పడున్నాడు విశ్వ. దగ్గరకెళ్ళి కుదిపాను.” ఏయ్” అని అరిచాడు, దుర్వాసన! నీళ్ళు తెచ్చి మొహం మీద కొట్టాను.

విసుక్కుంటూ లేచి సగం తెరిచిన కళ్ళతో, “మీరా?!” అన్నాడు ఆశ్చర్యంగా. ” నిద్రపోతే లేపగలను.

ఇలా మత్తులో కూరుకు పోతే ఎలా ?” అన్నాను.” సర్” అంటూ ఏదో అనబోయాడు”. 

“నేను సర్ కాదు. నువు విశ్వ, నేను అనంత్.అంతే”అన్నాను.

   తలపట్టుకున్నాడు.”ఇక్కడికి ఎందుకొచ్చారు? ఎవరిచ్చారీ ఎడ్రస్?”

అన్నాడు తడబడుతూ.

” నువ్వెక్కడికో పోతున్నావు.నాదగ్గరికి లాక్కుందామని వచ్చాను”,అన్నాను.

      గట్టిగా నవ్వాడు.”మీరు నాకేమైనా ఫ్రెండా, బంధువా?” అన్నాడు.

“రేయ్.నువ్వు చెడిపోతే ప్రపంచానికేం నష్టం లేదు.నిన్ను సరిదిద్దే ప్రయత్నం  చేయకపోతే నాకే నష్టం”అన్నాను. 

          తల అడ్డంగా ఊపి,”నీతులు చెప్పొద్దు” అని వాడు అంటూండగానే, “నీ కోపానికి కారణం చెప్పు”అన్నాను.

         విశ్వ మౌనంగా ఉండిపోయాడు.

“అందరితో కొట్లాటలు.అడిగితే జవాబు  చెప్పవు.నీకు డిగ్రీ వద్దా?” అడిగాను.

“మీకెందుకిదంతా? నా అనుభవం అంత లేదు నీ వయస్సు అని డైలాగ్ కొట్టకండి”, విశ్వ  విసురుగా అన్నాడు.

         “మరీ ముసలాడిని కాదులే!నాకు 38.నీకు ఓ పాతికేళ్లు.ఔనా?

మనిద్దరి మధ్య చదువుంది. ఎంత కష్టపడితే గవర్నమెంట్ కాలేజీ లో సీటొస్తుంది ? నీకెక్కడ బాగాలేదో నాకు చెప్పు, నీ వైపు నుంచి చూడడానికే నేనిక్కడకొచ్చాను” అన్నాను.

              వాడు మెత్తబడ్డాడు.

“మా నాన్న డయాబెటిక్.ఆయనకి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయాలి.అమ్మ, తమ్ముడు ఎలాగో నెట్టుకొస్తున్నారు. అక్కడ డాక్టర్లు అందని ద్రాక్ష.

ఇక్కడ పేషెంట్లకు మేం లెక్క లోకి రాం.రక్తం ఇమ్మంటే పేషెంట్ బంధువులు నాతో గొడవ పడ్డారు.

వార్డులో కట్లు కట్టే బేండేజెస్ లేవంటే నర్సుకి కోపం.‌అందరూ తలో మాట చెప్పి నన్ను చెడ్డవాడ్ని చేసారు.

ప్రొఫెసర్ వార్డుకు రావద్దని నాకు శిక్ష వేసేరు.ఇంకేం చేయను?”అన్నాడు.

“నాతో  ఉండు !”అన్నాను.

నాకేసి పిచ్చోడిని చూసినట్టు చూసాడు.చాలా సేపు నచ్చచెప్పాను.

” ఓ నెల రోజుల పాటు నాతో కలిసి పనిచేయ్.వ్యవస్థ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అలా అని లైఫ్ పాడు చేసుకుంటామా?మీ నాన్న కి వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? నాకు తెలిసిన వాళ్లుంటే ఒక మాట చెప్తాను”, అన్నాను.వాడిని నాతో తీసికెళ్ళాను. స్నేహితుల్లా కలిసాం.

                           పని చేయడం లో ఆసక్తి, టెక్నిక్ పట్ల శ్రధ్ధ మప్పాను. మెల్లగా వాడిలో ఆవేశం తగ్గింది.మాట తీరు మారింది.

          ఆరోజు మేం డ్యూటీ చేస్తున్నాం. బస్ తిరగబడి ఒకేసారి 40 కి పైగా జనం కాజువాలిటీకి వచ్చారు. విశ్వ త్వరగా జూనియర్ రెసిడెన్సీ చేసే  డాక్టర్లను మరో ఆరుగురిని పిలిచాడు.

అందరినీ చిన్న చిన్న జట్లు గా చేసాడు. 

పేషంట్లను చూసేవారు,కట్టు కట్టే వారు, కుట్లు వేసేవారు,ప్రాణ ప్రమాదం గా ఉన్నవాళ్లని ఆపరేషన్ కి సిద్దం చేయడం అని డాక్టర్లను టీమ్స్ గా విభజించాడు. రెండు గంటల్లో దాదాపు అందరకూ చికిత్స అందించాం.మా ప్రొఫెసర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ అభినందించారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు.      

      నేను విశ్వను అభినందించాను.

 ” పని పెద్దదైనపుడు టీం వర్క్ కావాలి.అలా టీం కావాలంటే మనం అందరితో  ‘రేపో’ మెయింటైన్ చేయాలి”,కదా? సార్! “అని నవ్వాడు.

“పనిదేముంది?ఎవరైనా చేస్తారు.

పదిమందితో పని చేయించడమే ముఖ్యం”,అన్నాడు నవ్వుతూ. 

వాడి కళ్ళు మెరిసాయి!

గర్వంతో కాదు.ఛాలెంజింగ్ పనిని సవ్యంగా చేస్తే వచ్చే తృప్తి తో. “కంగ్రాట్స్. ఇదే నిజం” అన్నాన్నేను.

           అంతలో,” సర్! సర్జరీ పేషెంట్ బంధువులు పిలుస్తున్నారు .ఏ పాజిటివ్ రక్తం ప్రస్తుతం మన బ్లడ్ బాంక్ లో  లేదు”, అంటూ ఇంటర్న్ వచ్చాడు. 

      విశ్వ,” నేను చెప్తానుండు “, అంటూ,ముందుకు సాగాడు. 

    “ఇక నుంచీ నీలోనే నేను జీవించి ఉంటాను”, గణపతి మాస్టారి మాటలు చెవుల్లో మోగి,కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి.

****

Please follow and like us:

11 thoughts on “బతుకు అద్దం”

  1. చాలా బాగుంది కథ, రచయిత రాసిన తీరు అద్భుతం, ప్రతి ఒక్కరూ అలా మారాలి సమాజ శ్రేయస్సుకు అంకితం కావాలి…మంచి సందేశం హాట్స్ ఆఫ్ శైలజ…

  2. చాలా చక్కటి కథ, అంతకన్నా చక్కగా సాగిన కథనం. శైలజా, మంచి సందేశం ఇచ్చిన ఈ కథ నీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది🙏🙏 ~ ~చంద్ర

  3. డ్యూటీలో మీరెలాఉంటారో, కనీసం ఎలాఉండాలను కొంటారో ఈకథ చెపుతోందిమేడమ్. మీరు ఈ ఒక్కకథేకాదు. “డాక్టర్లకు-డాక్టర్లకు” “డాక్టర్లకు – పేషంట్లకు,” మధ్యజరిగే సన్నివేశాలతో చాలాకథలు రాయాలి మేడమ్..! నాకుకథరాసే అలవాటులేదు, అలాంటిది మీకథ చదవగానే కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో కథరాస్తే ఎలా ఉంటుందబ్బా అనిపించింది. ఒకప్పుడు మాకాలేజ్ లో కొందరు విద్యార్ధులు డిగ్రీలో కొంచెం బేలన్స్ తప్పుతూంటే జాగ్రత్తగా లైన్ లో పెట్టి ఇప్పుడు వాళ్ళను ఉపాధ్యాయులుగా,అందులోనూ తెలుగు ఉపాధ్యాయులుగా తీర్చగలిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి మేడమ్. ఒక్కో ఉపాధ్యాయులు మనజీవితంలో తారసపడటం,మనల్ని ప్రభావితుల్ని చెయ్యటం. మన అదృష్టం. మంచికథ రాసారు.అభినందనలు.

  4. విలువైన కథ
    శైలజ గారికి అభినందనలు

  5. Emotional. But we need those Gurus. Someone needs to be on our page. To all those who try to share our perspective and still make as chase excellence – big shout out

  6. బావుంది.
    మనిషి ఏలబతకాలో,
    మనిషిని ఎలా మార్చాలి అనేది ఒకరు వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటే, మన ప్రయత్నంతో ఇంకొకరిలో మార్పు.
    అందరూ చెయ్యాలి.

  7. బ్రతుకులు బాగు పడాలంటే , అద్దం లోనిమనిషి బాగుపడాలి అంటారు కదా.?..ఆ అద్దo నుండి పారిపోతున్న వారికి, అద్దాన్ని చూపించే నేస్తం దొరకటం ఎంతో అదృష్టం. ఆ అవకాశం ఉన్న ఉపాధ్యాయులు , ఆ మార్పును చైతన్యాన్ని అందుకొగల శిష్యులకు …. అంకితం .🙏

Leave a Reply

Your email address will not be published.