ఏకాంతం..!!

-శివ మంచాల

ఏకాంతం కావాలని 
సరైన సమయం కోసం 
అనువైన స్థలం కోసం వెతుకుతున్నాను!
 
అక్కడొక బాల్యం కనపడింది..
ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంది 
ఎర్రని ఎండలో చెట్టునీడ దొరికినంత సంబరపడ్డాను
పట్టుకోబోయాను దొరకలేదు..
దాని వెనక పరుగెత్తి పట్టుకోబోయాను
నాకంటే వేగంగా పరుగెత్తుతుంది అది
అప్పుడర్ధమయ్యింది..
దానంతట అది పరుగెత్తట్లేదని
బాల్యానికి ఇష్టం ఉన్నా లేకపోయినా 
తల్లి తండ్రుల ఇష్టానికే దాన్ని బలవంతంగా లాగుతుంటారని!
 
అమ్మ నాన్నల లాలనలలో
ఆటా పాటలతో బాల్యం సాగిందనేగాని
మనం కోరుకున్న ఏకాంతం ఎక్కడుందని..?
ఎవరిష్టానికి వారు పిల్లల్ని పెంచాలనుకుంటారుగాని
బాల్యం ఇష్టా ఇష్టాలు ఎవరు గమనించారని..?
పిల్లల ఇష్టా ఇష్టాలను గమనించలేనప్పుడు..
గొడ్డుబోతుల్లా మిగిలిపోక.. 
బిడ్డల్ని కనటం ఎందుకు.. మీ పిండకూడెందుకు..?
మంచో చెడో.. కుటుంబ ప్రభావం 
పసి మనసులపై పడుతుందంటారు
కానీ నేనంటాను.. 
పుట్టుకతోనే గుణాలను తోడు తెచ్చుకుంటామని!
 
అటువైపు కొన్ని బాల్యాలు
అమ్మ ప్రేమకు, నాన్న ముద్దుకు దూరమై..
కవుల కలాలకు కథా వస్తువులవుతూ
నలుపు తెలుపు ఛాయా చిత్రాలకు రంగులద్దుతూ
అవార్డులు రివార్డులు సంపాదించి పెడుతుటుంటాయి
అవి మాత్రం కుప్పతొట్టి దగ్గర 
బతుకు మెతుకుల కోసం కుక్కలతో పోటీ పడుతున్నాయి.!
 
ఎవరో చేసిన పాపం ఈ పసి బాల్యంపై పడింది 
ఏదైనా పెట్టి పుట్టుండాలి అని అంటుంటాం కదా..
మనది కర్మ భూమి, కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతాం
కానీ, పులుపు తిని బులుపుతో కొవ్వెక్కి..
కండకావరముతో వొళ్ళు బలిచి చీకటి పాపాలలో
బురదలో పందుల వలే పొర్లాడేటప్పుడు తెలియదా..?
కుప్పతొట్టి బాల్యానికి కర్మ, కర్త, క్రియ తామే అవుతామని.!
ఇటువంటివారికి అది కోసి ఉప్పు కారం పెట్టాలి..!
 
దిగులుగా తన కోసం..
ఎదురు చూస్తూ కూర్చుంది ఒక మనసు
అదొక కడలి తీరం!
కెరటం వెనుక కెరటం 
ప్రయత్నిస్తూనే ఉన్నాయి తీరాన్ని చేరాలని.!
మధ్యలో ఎన్ని కెరటాలు
నలిగి విరిగి పడితేనో 
ఒకే ఒక్క కెరటం తీరం చేరుతుంది!
యవ్వనంలో ప్రేమ కూడా అంతే..
అదృష్టం అనుకో దురదృష్టం అనుకో
సర్దుకుపోతూ తృప్తి పడాలి, లేకపోతే చావాలి!
చచ్చి సాధించేది ఏమి లేనప్పుడు.. ఎందుకు చావాలి.?
 
సముద్రం వెనుక కచ్చితంగా ఇంకో తీరం ఉంటుంది 
అన్ని తీరాలు ఒకేలా ఉండవు
కెరటాలన్నీ ఒకే తీరులా ఎగసిపడవు
ఆటు పోటుల జీవితం అందరికీ సహజమే!
వయసుడిగిన సమయంలో 
బిడ్డలేగా తల్లి తండ్రులకు అసలైన బలం!
బిడ్డలు ఏ తీరాలలో సేదతీరుతుంటారో.. లేక –
ఇసుకలో రాసుకున్న ప్రేమ రాతల్లో కలిసిపోతూ
మరో చరిత్రలో పేర్లు చేర్చుకుంటూ పోతారో తెలియదు 
ఇక్కడ మాత్రం..
కాలమనే కడలి కెరటాలతో 
ముసలి గుండె తీరాలు కోతకు గురవుతూనే ఉంటాయి!
 
ప్రేమ పేరుతో మోసపోయామనో.. లేక విఫల మయ్యామనో
బలవంతంగా ప్రాణాలను తీసుసుకొంటూ కొందరు
కోపంతో ఊగిపోతూ గొంతులు కోసి
ప్రాణాలను బలి తీసుకునేవారు కొందరు
తల్లి తండ్రుల కడుపు కోతకు గురి చేస్తున్న 
ఈ ముర్ఖపు సంతానం పుట్టినా గిట్టినా ఒకటే..!
వీరి పార్దివ దేహాలను బహిరంగంగా ..
కుక్కలకో నక్కలకో వేయాలి!
ప్రాణ హననానికి పాల్పడినవారిని
నడిబజారులో ఉరి తియ్యాలి!
 
ప్రేమ, పెళ్ళి.., సంసారం, సంతానం
బ్రతకటానికో.. బ్రతికించుకోవటానికో
ఏదైతేనేం.. తీరిక సమయాల్లో 
జమా ఖర్చులు.. భవిష్యత్ ప్రణాళికలు 
ఎదుగుతున్న పిల్లలు ఎదురుంగా బాధ్యతలు 
చెమటను చలువపందిళ్ళుగా చేసుకోవాలి
కష్టాలను కన్నీళ్ళను చేతి రుమాలుతో తుడిచేయాలి
ఎంత చేసినా తృప్తి పడని కాపురం
ఎంతెంత సంపాదించినా ఏదో ఒక కొత్త అవసరం
ఏదో సాధించాలనే తపనతో మనలను మనమే మర్చిపోతాం!
 
మనసు, మమత పండించుకునే జంటలు కొన్ని 
అనుమానం, అసహనంతో రగిలే మంటలు కొన్ని 
అవగాహన లేని దాపంత్యం, అవమానాల పర్వం
గుమ్మానికి కట్టిన మామిడాకులు, 
విడాకులతో ఎండిపోతాయి
సరిలేని పెంపకం, పెడసరి సంతానం 
ఛిన్నాభిన్నం అయ్యాక.. 
తిరిగి కట్టుకోలేని, తట్టుకోలేని బలైపోయే సంసారాలు
చీరకొంగుతో ఒకరు.. పురుగు మందుతో మరొకరు 
చావటానికే సంసారమైతే..
అసలు పెళ్లెందుకు పేరంటం ఎందుకు..?
 
అవసరానికి మించి అత్యాశతో.. అవినీతికి అలవాటై
నేలమాళిగల్లో తమ వ్యక్తిత్వాలను నల్ల ధనంలా మార్చి
పూడ్చి దాచిపెట్టుకుంటున్న దేశద్రోహులు ఎందరో ఎందరెందరో 
తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు..
ఈ దేశద్రోహులు రాజకీయ అవతారం ఎత్తుతారు
ప్రజల ధన మాన ప్రాణాలను హరించుకుపోతుంటారు
అడుగంటి పోయేవారేగాని వీరిని ఎదిరించి అడిగేవారుండరు
ఇటువంటి దేశద్రోహుల్ని తోలుతీసి ఎముకలు చితగొట్టాలి.!
 
బుక్కెడు మెతుకులు కడుపులో వేసుకుంటే –
గుప్పెడు మాత్రలు మింగాల్సి వస్తుంది ఇప్పుడు.!
చెట్టు ఆకులు రాల్చుకుంటుంది, 
తిరిగి చిగురులు వేస్తుంది నేను కూడా అలా అయితే?
అని అనుకుంటూ ఉంటానెప్పుడు!
పక్షిరాజువలే తిరిగి యవ్వనం తెచ్చుకోవాలని కానీ, 
దాని తెగువలో నూరవ వంతుకూడా మనకు లేదు కదా!
 
ఆహారం లేక నీరసించిపోయినా సరే..
దానికి బరువైన ఈకలు తనంతట తానే పీకేసుకుంటుంది
బలహీనమైన దాని గోళ్ళను అదే ఊడగొట్టుకుంటుంది!
ఎంతో కఠినమైన శ్రమతో 
తిరిగి నలభై ఏళ్ల ఆయుషు పెంచుకుంటుంది!
 
మరి మనమో.. బరువైన జ్ఞాపకాల్ని వదులుకోలేము
భవబంధాలను తెంచుకోలేము
ముగిసిపోయే బతుకు ముతక వాసనలో కూడా..
మేడలు మిద్దెలు ఇష్టమైన బిడ్డలకు ఒకరకంగా –
ఇష్టం కాని బిడ్డలకు మరో రకంగా 
పంచే ఆలోచనలతోనే బ్రతుకుతూ చస్తాం..!
 
ధనం కన్నా మంచి గుణాలతో వారిని పెంచాలని
మంచితనం, మానవత్వం చూపాలనే ధ్యాస…
వారిలో పాదుగొలపాలని – 
నీతి నిజాయితీగా ఎలా బ్రతకాలో నేర్పించాలనే
ఇంగిత జ్ఞానమే తల్లి తండ్రులకు లేనప్పుడు..
ఎన్ని ఆస్తులు బిడ్డలకు పంచి ఇస్తే ఏం లాభం.!
నెత్తినేసి కొట్టుకోవటానికి.. బేవర్సాలుగా మార్చటానికా!
 
నా ఇల్లు, నా సంసారం, నాది నేను అంటూ..
స్వలాభం స్వార్ధంతో నీతి జాతి లేని ఇటువంటి 
దగుల్బాజీ అవినీతి గాళ్ళను ఊరికే వదలకూడదు
ముక్కు పిండి తిన్నదంతా కక్కేదాక 
బొక్కలో వేసి బొక్కలిరగ్గొట్టాలి బాడ్కవ్ గాళ్ళని.!
 
మంచమెక్కిన వృద్ధాప్యం.. 
సహాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది 
చావు బతుకుల మధ్య 
పాప పుణ్యాల లెక్కలతో సతమతమవుతూ ఉంటుంది!
 
మంచితనం – మంకుతనం
మానవత్వం – దానవత్వం
ఇక్కడే బయటపపడుతుంటాయి!
 
అప్పటికప్పుడు హోటల్లో దొరికే అల్పాహారం లాగా
బిడ్డలకు వృద్ధాశ్రమాలు గుర్తుకు వస్తుంటాయి 
ఎత్తుకొని ఆడించిన భుజాలు..
నిసత్తువుగా వణుకుతుంటాయి
వారు తన్నుతూ ఆడుకున్న గుండె గదులు..
జ్ఞాపకాల తడితో మూలుగుతుంటాయి
వారి బంగారు భవిష్యత్తు కోసం..
ఎన్ని రాత్రులు నిద్ర లేని రోజులు గడిపి ఉంటావో కదా!
ఆ కళ్ళు ఇప్పుడు నీళ్ళు మింగిన ఇంకుడు గుంతలే కదూ!
 
తమ చెమటను చలువ యంత్రాలుగా మార్చి..
బిడ్డల్ని ఏసి గదుల్లో సీమ పందుల్లా పెంచితే –
చివరికి తల్లి తండ్రులను 
అనాధల్లా నడివీధిలో వదిలేసే 
దున్నపోతు బడుద్దాయిలను బట్టలూడదీసి
బజారువెంట పరిగెత్తేలా తరిమి తరిమి కొట్టాలి.!
 
ఇన్ని గందరగోళాల జంజాటంలో..
అనుకున్నా అనుకోకపోయినా
ఆ చివరి రోజు రానే వస్తుంది
బతుకు చిత్రం ఆగిపోతుంది 
ఈ జీవన యాత్ర ముగిసిపోతోంది.!
 
ఊపిరి పోసుకోగానే మొదటి స్నానం 
ఇప్పుడు ఊపిరి పోయాక చివరి స్నానం.!
 
నలుగురు మోయటానికి..
మరికొందరు వెంటరావటానికి.. 
ఉన్నారో లేరో కూడా తెలియదు
 
ఊర్లో మొదలయిన డప్పుల మోత
ఊరిబైట వైకుంఠధామం వరకు సాగుతుంది.!
 
ఒంటరిగా రావటం.. ఒంటరిగా పోవటం
మధ్యన జరిగేదంతా..
పరమపద సోపానపటంలోని ఆట!
సజీవ దేహం నిర్జీవమయ్యాక.. 
నీవారెవరో తనవారెవరో..?
చితిమంటల మధ్య..
రూప లావణ్యాలు కాలిబూడిదై పోతాయ్
సృష్టిలో నీ, నా ఆనవాలు కనుమరుగై పోతాయ్
దాచుకున్నవి, దోచుకున్నవి ఏవి మన వెంట రావు.!
 
బ్రతికి ఉండగా చెప్పుకోకపోయినా
కనీసం చచ్చిన తర్వాతనైనా..
అందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలి
మంచి, మానవత్వపు చరిత్ర పుటల్లో మనం ఉండాలి 
అదే సరైన సమయం
అదే అనువైన అసలైన స్థలం
అప్పుడే మన ఆత్మకు నిజమైన ఏకాంతం..!!

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.