కాళరాత్రి-2

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

ఇది 1942 చివరలో జరిగింది. అటు తరువాత జీవితాలు మామూలుగా సాగుతున్నాయి.

రోజూ లండన్‌, రేడియో వింటుండే వాళ్ళం. జర్మనీ స్టాలిన్‌ గ్రాడ్‌ బాంబింగ్సు గురించి వింటుంటే సిఘెట్‌లోని యూదు లందరూ తమకు మంచి రోజులు రానున్నాయని నమ్మారు.

నా చదువు యధావిధిగా కొనసాగించాను ` పగలు టల్‌ముడ్‌, రాత్రి కబాలా! నాన్న తన వ్యాపారం నడుపుతూ కమ్యూనిటీ బాగోగులు చూస్తుండేవాడు. మా తాత రోష్‌హానా మాతో గడపటానికి వచ్చాడు. బోర్ష్‌ రబీ ప్రవచనాలు వినటానికి అదే అదును. అమ్మ హిల్డాకి మంచి సంబంధం చూడాలను కుంటున్నది.

అలా 1943 గడిచిపోయింది. 1944 వసంతకాలం ` రష్యన్‌ ఫ్రంట్‌ నుంచి శుభవార్త జర్మనీ ఓడిపోబోతున్నది, నెలలో, వారాలో గడవాలంతే.

చెట్టు ఆకులు, పూలతో నిండుతున్నాయి. పెళ్ళిళ్ళు, శుభ కార్యాలు, జననాలు మామూలుగా జరుగుతున్నాయి. ఎర్రసైన్యం ముందుకు సాగుతున్నది. హిట్లర్‌ మనకు హాని తలపెట్టినా సాధించలేడు.

మమ్మల్ని మట్టుపెట్టాలనే అతని ఆలోచన వమ్ము అవుతుంది.

ఒక జాతినంతా మట్టుపెట్టటమా ` ఎన్నో దేశాలలో స్థిరపడిన జనాన్ని  తుడిచి పెట్టటమా? ఎన్నో మిలియన్ల ప్రజలను, ఈ 20వ శతాబ్దంలో ఎలా మట్టుపెడతారు?

మా పెద్దలంతా రాజకీయాలు, ఎత్తులూ, సమాధాన పరచటంనిజం అంటూ ఎన్నో విషయాల గురించి తికమక పడుతున్నారు. వాళ్ళ గతేమిటో వారికి తెలియదు.

మోషే ది బీడిల్‌ గూడా శబ్దం చేయడం లేదు. మాట్లాడి మాట్లాడి అలసి పోయాడు. సినెగాగ్‌లోనికి, రోడ్ల మీద తిరుగు తుంటాడు. ఎవరి వైపూ చూడటం లేదు.

ఆ రోజుల్లో పాలస్తీనా ఇమిగ్రేషన్‌ సర్టిఫికెట్లు కొనే వీలున్నది. నాన్నను వ్యాపారం కట్టిపెట్టి వెళ్ళిపోదామన్నాను.

‘‘నాకు వయసు మీదపడుతున్నది. కొత్త చోటుకు వెళ్ళి జీవితం ప్రారంభించగల శక్తి లేదు’’ అన్నాడు.

బుడాఫెస్ట్‌ రేడియో వార్తలు ` ‘‘పాసిస్టు పార్టీ పవరు చేపట్టింది’’ రీజెంట్‌ మికోస్‌హార్ధీని బలవంతపెడుతున్నారు. ప్రొనాజ్‌ నిలాస్‌ పార్టీ లీడర్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని. అయినా మేము ఏమీ ఆందోళన చెందలేదు ఫాసిస్టుల గురించి విన్నాము. మంత్రివర్గం మార్పే అనుకున్నాం.

మరురోజు ఆందోళనకరమైన వార్త. జర్మన్‌ సిపాయిలు ప్రభుత్వ అనుమతితో హంగరీ భూభాగంలోకి చొచ్చుకొచ్చారని.

ఇక జనం ఆందోళన చెందనారంభించారు. నాన్న హితుడు మోషే ఛెమ్‌ బెర్కో విట్స్‌ పాస్‌ఓవర్‌’ (ఇజ్రాయల్‌ ఈజిప్ట్‌ నుండి విముక్తి చెందిన సందర్భంగా జరుపుకునే పండుగ)కి రాజధాని నగరం నుంచి వచ్చాడు. ‘‘బుడాపెస్టు ప్రజలు భయభ్రాంతులతో నివసిస్తున్నారు. ప్రతిరోజు యూదులకు వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫాసిస్టులు యూదుల షాపులు, సినెగాగ్‌ల మీద విరుచుకు పడుతున్నారు. పరిస్థితి దారుణంగా మారుతున్నది’’ అన్నాడు.

ఆ వార్తలు సిఘెట్‌ అంతా వ్యాపించాయి. అందరూ ఆ విషయాలే ప్రస్తావిస్తున్నారు. కానీ త్వరలోనే ఆశాభావం తిరిగి వచ్చింది. జర్మన్లు ఇంత దూరం రాలేరు. వాళ్ళు బుడాఫెస్ట్‌లోనే ఉండిపోతారు. రాజకీయ ఎత్తుగడల కారణాల వల్ల అని ఆశించారు. కానీ మూడు రోజులలోనే ` జర్మన్‌ వాహనాలు మా వీధుల్లో తిరగసాగాయి.

జర్మన్‌ సిపాయిలు మృత్యువును చూపే గుర్తు గల స్టీలు హెల్మెట్లు ధరించి కనిపించినా ఏదో ఆశ. కొందరు జర్మను ఆఫీసర్లు మా యిళ్ళల్లో ఉంటున్నా నమ్రతగానే ఉన్నట్లు ఉన్నారు. వాళ్ళు తగని డిమాండ్లు ఏమీ చేయలేదు. చెడుగా మాట్లాడలేదు. ఒక్కోసారి యింటి యజమానురాలు వైపు చిరునవ్వుతో చూసేవారు. ఒక జర్మను ఆఫీసరు మా యింటి ఎదురుగా కాహ్న ఇంటిలోనే బస చేశాడు. మర్యాదస్తుడనిపించాడు. ఒకనాడు మిసెస్‌ కాహ్నకి చాక్‌లెట్‌ డబ్బా తెచ్చియిచ్చాడు. కొందరు జర్మన్ల గురించి మంచిగా మాట్లాడుతున్నారు కూడా.

పాస్‌ఓవర్‌ఎనిమిది రోజులూ వాతావరణం బాగున్నది. మా అమ్మ వంట యింటి పనులు చూసుకుంటున్నది. సినెగాగులు మూతబడ్డాయి. జనం ప్రైవేటు ఇళ్ళల్లోనే కలుసుకున్నారు. జర్మన్లను రెచ్చగొట్ట గూడదనే ఉద్దేశ్యంతో.

ప్రతి రబీ యిల్లు ప్రార్థనా మందిరమయింది.

మామూలుగా తింటున్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం. బైబిలు ఈ ఎనిమిది రోజులూ ఆనందంగా గడపమని చెబుతున్నది. కాని మాలో ఉత్సాహం లేదు. ఈ వేడుక రోజులు, త్వరగా గడిచిపోతే చాలు అనుకున్నాం. ఏడవరోజు జర్మన్లు కొందరు మా కమ్యూనిటీ నాయకుల్ని అరెస్ట్‌ చేశారు. ఆనాటి నుండి అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. మేము మా మృత్యువు ముఖంలోకి పోతున్నామని తెలిసింది.

మొదటి ఆర్డరు ` మూడు రోజులు యూదులెవ్వరూ యిళ్ళ నుండి బయటికి రాగూడదు, వస్తే చావే శిక్ష.

మోషే పరుగు పరుగున మా యింటికి వచ్చాడు. ‘‘నేను ముందే వార్నింగు యిచ్చాను’’ అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.

అదేరోజు హంగరీ పోలీసులు యూదులందరి యిళ్ళలోకి చొచ్చుకుని వచ్చారు. ఏ ఒక్క యూదు దగ్గర, బంగారం, నగలు యితర విలువైన వస్తువులూ ఉండరాదు. అన్నీ అధికారులకు అప్పజెప్పాలి. మా నాన్న మా బేస్‌మెంట్‌లోకి పోయి మా వస్తువులు పాతిపెట్టాడు. మా అమ్మ యధావిధిగా అన్ని పనులూ చేసుకుంటూ పోయింది. ఒక్కోసారి మావైపు అలా చూస్తూ ఉండిపోయేది మాటాపలుకూ లేకుండా.

మూడు రోజుల, తదుపరి ప్రతి యూదు పసుపు పచ్చ నక్షత్రాలు ధరించాలి అని ఆర్డరు. కమ్యూనిటీ లీడర్లు మా నాన్న సలహా కోసం వచ్చారు. ఆయనకు హంగరీ పోలీసు అధికారులతో పరిచయం ఉన్నది. నాన్న వారిని యింకా భయపెట్టకూడదని పరిస్థితి అంత విషమంగా లేదన్నాడు. పసుపు పచ్చ నక్షత్రమా, అదేమంత ప్రాణాంతకమయింది కాదుగా అన్నాడు. పిచ్చినాన్న దానితోనే చనిపోయాడుగా!?

మిగతా ఆర్డర్లు వెంటనే వచ్చాయి. యూదులెవ్వరూ హోటళ్ళల్లోకి వెళ్ళగూడదు. ట్రెయిన్‌ ప్రయాణాలు నిషిద్ధం. సిన్‌గాగ్స్‌కి పోకూడదు. సాయంత్రం 6 గంటల తరువాత రోడ్లమీద కనిపించగూడదు.

తరువాత ఘట్టం గెటోలు (ఆనాటి మైనారిటీ పేదల ఇళ్ళు)

సిఘెట్‌లో గెటోలు సృష్టించారు. పెద్ద గెటో ఊరి మధ్యలో నాలుగు రోడ్ల కూడలిలో, చిన్న గెటో ఊరి బయట అనేక గల్లీలు కలుపుతూ వచ్చింది. మేముండే సర్పెంట్‌స్ట్రీట్‌ పెద్దగెటో కిందికి రావటం వలన మేము మా ఇంటిలోనే ఉండగలిగాము. రోడ్డు వైపుకున్న కిటికీలన్నీ మూసివేశారు. ముందు కొన్ని గదులు బంధువులకిచ్చాం. వారు వాళ్ళ యిళ్ళ నుండి తరిమి వేయబడ్డారు.

నెమ్మదిగా ఆ జీవితానికి అలవాటు పడ్డాం. మమ్మల్ని దాటనీయని ముళ్ళకంచ మాకంత యిబ్బంది అనిపించలేదు. మంచిదే లోపల ఉన్నవాళ్ళం అందరం కలసి మెలసి ఉంటు న్నామని సంతోషించాం. చిన్న యూదు కౌన్సిల్‌ ఏర్పడిరది. యూదు పోలీస్‌ ఫోర్స్‌, వెల్‌ఫేర్‌ ఏజన్సీ, లేబర్‌ కమిటీ, హెల్త్‌ ఏజన్సీ ఏర్పడ్డాయి ` చిన్న యూదు రిపబ్లిక్‌ అన్నమాట.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.