సర్దుకొని పో

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-వడలి లక్ష్మీనాథ్

చిన్నప్పుడు అమ్మ చెప్పే కాకి పావురము కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేమిటంటే…
కాకికి ఎప్పుడూ చింతగా ఉండేదిట. అందరూ పావురాలకి గింజలు దాణా వేస్తారు. తద్దినాలప్పుడో తప్ప కాకి ఎవరికీ గుర్తురాదు. పైపెచ్చు  రోజువారీగా కాకిని తరిమేస్తారు.

కాకి దేవుడిని ప్రార్దించిందిట.
దేవుడు ప్రత్యక్షమైఏంకావాలి?” అని అడిగితే,
నాకు పావురం లాటి అందమైన రూపం కావాలిఅని
అడిగిందట.

వెంటనే దేవుడు కాకి కోరుకొన్నట్టు అందమైన తెల్లటి శరీరాన్ని ఇచ్చాడట.

పైన కాకికి రోజూ పండగే. పావురాల గుంపులో చేరి తృప్తి తీరా తినసాగింది. ఒకనాడు  ఆనందం తట్టుకోలేక పాట పాడడం మొదలు పెట్టిందిట.

అప్పటిదాకా అది పావురం అనుకుని కలిసిపోయిన పావురాల గుంపు, కాకి గొంతు వినగానే దాని మీదకు దాడికి వచ్చాయట.

దాంతో చేసేది లేక కాకి తమ పాత గుంపుని వెతుక్కుంటూ వచ్చి, కాకుల గుంపులో చేరిందట. అందర్నీ చూసిన సంతోషంలో గట్టి గట్టిగా కావ్ కావ్ మని అరిచేసరికి, కాకులన్నీ తెల్లగా ఉంటూ కాకి లా అరిచే కొత్త పక్షనుకొని తరిమేసాయట.
ఇదీ కథ.

ఇలాంటి ఒక అమ్మ కథ ఇప్పుడు నేను చెప్పపోయేది. అయితే, ఇక్కడ కథలో అమ్మ కాకి కాదు, ఏమీ కోరుకోలేదు. కానీ, పిల్ల కాకుల వల్ల అమ్మ పడుతున్న ఇబ్బందులను చెప్పాలని నా తాపత్రయం.

***

రంగడి రిక్షా బెల్లుతో దొడ్లో నీళ్లు కాచడానికి పుల్లలు పెట్టి వెలిగిస్తున్న అమ్ములు ఒక్క ఉదుటున వీధి వైపుకు వచ్చింది.

రిక్షా నుండి దిగుతున్న శాంతమ్మను పట్టుకొని పగలపడి నవ్వసాగింది.
మారిపోయావు వదినా! పూర్తిగా మారిపోయావుఅంటూ నవ్వుతోంది.

మీరేటి అమ్మగోరూ, నేను పోల్చుకోలేకపోయాను. అమ్మగోరే నన్ను పోల్చుకొని. కేకెడితే  ఇగ్గో ఇలా వెలిపొచ్చేసానుఅంటూ రిక్షాలో సూట్ కేస్  తీసుకొని లోపలికి  వచ్చాడు రంగడు.

నువ్వసలు మారలేదు అమ్ములు. నీ జుట్టే కొంత నెరిసిందిఅంది సున్నితంగా శాంతమ్మ.

లోపలికి  ఇల్లంతా కలియజూస్తోంది. ఇల్లు, వాకిలి అంతా పేడతో కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టినట్టుంది అమ్ములు. పేడ వాసన కొంత ముక్కుకి ఘాటుగా తగులుతోంది శాంతమ్మకి.

ఏడేళ్లుగా ఎప్పుడూ కల్లోకి వచ్చే ఇల్లు.
ఇన్నాళ్లు వదిలేసి బెంగ పెట్టుకొన్న ఇల్లు.

దొడ్డి వైపుకెళ్ళి చూసింది. చెట్లన్నీ పెద్దవైపోయాయి. కొబ్బరి చెట్టు నిండా గెలలు ఉన్నాయి. మామిడి చెట్టునిండా పూతతో నిండు గర్భిణీలా ఉంది .

చెట్లు పెద్దవైపోయాయిఅంది.

రూపముతో పాటు బాస కూడా మారిపోనాది. వదినా! నువ్వు మా వదినవేనా!” నవ్వుతూ అంది అమ్ములు.
స్నానికి ఎన్నీళ్ళు పెట్టుంచేసినాను. నే ఎల్లి ఇంట్లో  ఆళ్ళకి కూడెత్తేసి, నీక్కూడా అట్టుకొచ్చేస్తాను. నీ పెట్టెలో పెట్టిన చీరలు ఓమారు ఉతికి ఆరేసేసి మడతెట్టేసినాను. నే యెల్లి ఎగిరాం వెళ్పోచేత్తానుఅంటూ అమ్ములు ఇంటికి వెళ్ళిపోయింది .

అమ్ములు స్వయానా శాంతమ్మకు ఆడపడచు . శాంతమ్మ ఇంటి దగ్గర్లోనే ఉంటుంది. రంగడికి, అమ్ములుకి ఇల్లు అప్పచెప్పి పిల్లల దగ్గరకు ఢిల్లీ వెళ్ళింది శాంతమ్మ .

శాంతమ్మ ఇల్లంతా పరిక్షీస్తూ చూస్తోంది. కిటికీలకు తెరలు లేకపోవడముతో  వెలుతురు ఎక్కువగా వస్తున్నట్టు  కళ్ళకి ఇబ్బంది పెడుతోంది.

లేచి స్నానికి వెళ్ళింది. గుండిగలో అమ్ములు పెట్టిన వేడినీళ్లు బక్కెట్లోకి పోసుకొని తడికలతో కట్టిన స్నానాల గదిలోకి వెళ్ళింది. పైకప్పు లేదు. చెట్ల నీడన వున్నా, ఆరుబయట స్నానం చేస్తున్ట్టుంది శాంతమ్మకి.

నీళ్లు ఒంటిమీద పోసుకొంటే ఒకటే పొగ వాసన . ప్రయాణం చేసి వచ్చిందేమో, మరి కాసిని వేణ్ణీళ్లు ఉంటే బాగుణ్ణు అనుకోంది శాంతమ్మ. కొన్నేళ్లుగా స్విచ్చేస్తే కావాల్సినన్ని వేణ్ణీళ్లు పోసుకోవడం అలవాటైంది. నోరు కడుక్కుందామని గుక్కెడు నీళ్లు పుక్కిలిస్తే ఉప్పు కషాయం.

ఎలాగో స్నానం చేసి లోపలికి వచ్చి, కాళ్ళు చూసుకుంటే,   దొడ్లోని  మట్టి కాళ్ళకు అంటుకొని, గుచ్చుకున్నట్టుగా అనిపించింది. అమ్ములు ఆరేసి మడత వేసిన పాత చీరలు తీసింది కట్టుకుందామని.

రంగులు కొంచం ముదురుగా, మెతకగా అనిపించాయి. అన్నీ అంచు చీరలే. అవి కట్టుకుంటే బరువుగా వుంటాయేమోనని అనిపించింది. ఢిల్లీలో వున్నప్పుడు కొడుకు కొన్న షిఫాన్ చీర తీసి కట్టుకుంది.

అమ్ములు భోజనం పట్టుకొని వచ్చి పీట తెచ్చి తినమంది . కంచం నిండా అన్నం పెట్టుకొని పప్పేసి, పక్కనే గిన్నెడు కూర వేసి తెచ్చింది.
నేను ఇంత అన్నము తినలేను అమ్ములుఅంది శాంతమ్మ .
మరీ చెపుతావు వదినా! నీ తిండి పూర్తిగా తగ్గినట్టుంది. అందుకే ఆలా సిక్కిపోనావుఅంది.
కింద కూర్చుని భోజనం చేయడం కొంత అసౌకర్యంగా వుంది. మోకాళ్ళ నొప్పులు. కూర కారంగా వుంది ఒగర్చుకుంటూనే తింటోంది శాంతమ్మ.

భోజనము అయిపోగానే అమ్ములు అందిఏంటి వదినా ఇదివరకటిలా మాట్లాడటం లేదు. అలసట వల్లనేమో కాస్సేపు పడుకొని లేఅని తలుపు దగ్గరగా వేసి వెళ్లింది.

శాంతమ్మ అమ్ములు వెళ్ళిపోగానే పక్క దులుపుకొని నులకమంచం మీద పడుకొంది. మంచం మీదున్న ముడులు  వీపున గుచ్చుకుంటున్నట్టుంది. పైన పెంకులతో కట్టిన పై కప్పుకేసి తదేకంగా చూస్తోంది. పదమూడో ఏట అడుగుపెట్టింది ఇంట్లోకి, మేనత్త కొడుకును పెళ్లి చేసుకొని. భర్త పోయాకా, ఉన్న భూమిని అమ్మి కొడుకు చదువు, కూతురి పెళ్లి చేసింది. కొడుకు వేరేకులం అమ్మాయిని చేసుకొని వస్తే ఊరందరినీ ఎదురించి కోడల్ని ఇంట్లోకి తెచ్చుకుంది.

బాధ్యతలన్నీ తీరాయి. ఏదో ఉన్నదాంట్లో ఇంత తిని ప్రశాంతంగా ఉందామనుకొన్న సమయంలో కొడుకు నుండి పిలుపు………కోడలు నీళ్లోసుకుంది. ఇద్దరి ఉద్యోగాలు కాబట్టి పిల్లల్ని పెంచడానికి రమ్మని.

నువ్వు ఊరిలో ఒంటరిగా ఉండి ఏం  చేస్తావని“.
వార్త వినగానే శాంతమ్మ ఊరు ఊరందరికీ విందులు చేసుకొంది,” నా కొడుకు కాబట్టి నన్ను పట్నం తీసుకొని వెళ్తున్నాడుఅని.

పల్లెటూరు నుండి ఢిల్లీ మహానగరానికి ప్రయాణం.
ఊరవతల గేటెడ్ కమ్యూనిటీలో అపార్టుమెంట్. ఇల్లంతా కిటికీలకి తెరలు. ఎప్పుడూ తలుపులు బిగించి ఉండటం. పలకడానికి  మనిషి లేకపోవటం. రెండు రోజులకి ఊపిరి ఆగిపోయినట్టుంది శాంతమ్మకి.

ఆరుబయట అమ్మలక్కల కబుర్లు, స్వచ్ఛమైన గాలిని తలుచుకొని   బెంగపడింది. ఊరికే  ఉదయించే సూర్యుణ్ణి చూడాలంటే, ఒక గంట బాల్కనీలో మాత్రమే  కనపడి, తరువాత మళ్ళీ రేపటికి అంటూ దోబూచులాడుతాడు .

వారం రోజులకి కొడుకు నుండి మొదటి హెచ్చరిక వచ్చింది……..పల్లెల్లో లాగా పట్టణాల్లో గట్టిగా మాట్లాడకూడదని, తర్వాత ఎన్నో హెచ్చరికలు దానికి తోడయ్యాయి .

ముఖ్యంగా చుట్టూ ఉన్న బంధు మిత్రుల కబుర్లు లేక పోయే సరికి ఒంటరితనం ఆవహించింది శాంతమ్మకి. పల్లెలో ఉన్నప్పుడు ఎవరింట్లో పండగ, పెళ్లిళ్లు, విందులు, వినోదాలున్నా శాంతమ్మ గాడి పొయ్యి దగ్గరకు కూర్చోవలసిందే. వంట చేయడములో ఆరి తేరిన చెయ్యి.

అంతెత్తు గ్యాస్ పొయ్యి మీద వంట చెయ్యడము శాంతమ్మకు చేత కావట్లేదు. భోజనం ఆలా బల్ల మీద తినాలంటే చేతనయ్యేది కాదు.

కొన్ని నెలలు మనవడి పెంపకంలో కొంత విషయాలు పక్కకు జరిగాయి. పిల్లవాడికి ఆరు నెలలు దాటాకా సాయంత్రంవేళ బండిలో వేసి చల్లగాలికి తిప్పాలన్నది కోడలి మాట.

సాయంత్రం ఆలా బయటకు వెళ్లినప్పుడు ముతక చీరలు, అంచు చీరలు కట్టుకోకూడదని నాలుగు షిఫాన్ చీరలు కొని బహూకరించింది కోడలు పిల్ల. చీరలు ఒంటిమీద నిలబడక వాటిని కట్టుకోలేక నానా ఇబ్బంది పడేది శాంతమ్మ. అక్కడ ఎవరైనా పలకరిస్తే ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చారు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులవడముతో కమ్యూనిటీలో ఎవరు పిల్చినా, శాంతమ్మను హాజరు వేయించుకోమని చెప్పేవారు. అక్కడ ఎలా మాట్లాడాలో కూడా చెప్పేవారు. తెల్ల జుట్టుకు డై వేసి నల్ల జుట్టుగా మార్చేసారు.
కొంత కాలమయ్యాకా శాంతమ్మకు ఊరు మీద బెంగ పట్టుకుంది. ప్రయాణానికి ప్రతిపాదన పెట్టింది .
అప్పుడు కూతురు, కొడుకు తల్లికి, “అమ్మా ఎప్పటికైనా నువ్వు కొడుకు దగ్గర ఉండక తప్పదు. నువ్వు ఇక్కడి వాతావరణానికి సర్దుకొని పోవాలిఅంటూ హితవు పలికారు.

శాంతమ్మకు పిల్లలు చెప్పింది సబబుగా తోచింది. రేపు కాలు ఒంగినా, చెయ్యి వంగినా చూడాల్సింది కొడుకే. అప్పుడైనా వాతావరణం అలవాటు చేసుకోవాలి …..అని తనకు తానే సర్ది చెప్పుకుంది.

నెమ్మదిగా ఊరు గుర్తుకు వచ్చినప్పుడు తనకు తానె సర్ది చెప్పుకునేది. ఇంతలో రెండేళ్ళకి మనవరాలు పుట్టింది. శాంతమ్మకి ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరికేది కాదు.

కానీ, పండుగలు వచ్చినప్పుడు ఊరి విషయాలు గుర్తుకు వచ్చి రెండు మూడు రోజులు కొంత డల్ గా వుండేది .

వాకిట్లో అలజడితో శాంతమ్మ లేచి వాకిట్లోకి వచ్చింది. శాంతమ్మ ఊరు  వచ్చిందన్న విషయం నోటా నోటా విన్న స్నేహితులు, చుట్టాలు శాంతమ్మను పలకరించడానికి వచ్చి పోతున్నారు.

అందరినోట ఒకటే మాట….. శాంతమ్మ నైసు తేరిందని, మొత్తం పట్నం మనిషిలా మారిపోయిందని.

శాంతమ్మకి వాళ్ల మాట తీరు, వేళాకోళము నచ్చటం లేదు.
వాళ్ళతో తాను పంచుకోవలసిన విషయాలు ఎక్కువేమీ లేవు. మాట్లాడినా పట్నంలో ముక్కున పట్టిన కొన్ని ఇంగ్లీష్ పదాలు నోట జారుతున్నాయి .

అబ్బో బాష కూడా మార్చేసావేఅంటూ నవ్వుతున్నారు.
భౌతికంగా ఉన్న మార్పులకు, నువ్వు మారిపోయావు అంటున్నారు……….అక్కడి విషయాలు చెబితే ఇంకేమన్నా అంటారు అని మూగ పోయింది శాంతమ్మ.

ఊరులోని పంటల విషయాలు, పిండివంటల విషయాలు, పిల్లల పెళ్లిళ్లు విషయాల మీద పెద్ద ఆసక్తి చూపించడం లేదు శాంతమ్మ. పట్నంలోని మనవలు మీద బెంగ పట్టుకుంది.

వచ్చి పది రోజులు గడిచింది. దోమల బాధ ఇల్లు అలుక్కోవడం, వాకిళ్లు చిమ్ముకోవడం అలవాటు తప్పిన శాంతమ్మకి ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చినట్లయింది. .

వారాంతంలో కూతురుఅన్నతోసహా కాన్ఫరెన్స్ కాల్ చేసింది. అప్పుడు  శాంతమ్మ, “పిల్లలూ, నాకు ఇక్కడి వాతావరణం సరిపోవట్లేదు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానుచెప్పింది.

సరిపోయిందమ్మా! అక్కడున్నన్నాళ్ళూ ఊరు ఊరు అన్నావు కదా! ఇప్పుడు ఊరిలో ఉండు…..
….. అంటే ఉండలేను అంటే ఎలా?” ప్రశ్నించింది కూతురు.

మీరే కదా! అమ్మా పట్నం లోనే ఉండాలి….. సర్దుకొనిపో అని చెప్పారు. నేను నెమ్మదిగా నా జీవన విధానాన్ని అక్కడున్న సదుపాయాలకు అనువుగా మార్చుకున్నాను.”చెబుతున్న మాటను ఆపి కొడుకు

ఇప్పుడు నువ్వున్నది పుట్టినప్పటినుండి ఉన్న వాతావరణమే కదా అమ్మా! ఇన్నాళ్లు నువ్వు కోరుకున్నది అదే కదా అమ్మాఅన్నాడు.

అవును నేను చిన్నప్పటి నుండి చూసిన వాతావరణమే. నీ దగ్గరకొచ్చాకా, ఇప్పటికీ నాకు ఏడేళ్లు వయసు పెరిగిందినీ పిల్లల్ని వయసులో పెంచడముతో ఇంకొక నాలుగేళ్ల బలమూ తగ్గింది. నాకూ కొత్తగా కాళ్ళ నొప్పులు  వచ్చాయి. ఓపిక తగ్గింది. వయసులో నేను వంటరిగా ఉండలేకపోతున్నాను. ఇక్కడున్న మనుషుల మనసుల్లోంచి నన్ను పక్కన పెట్టేసారు. నేను కూడా నా మనవలకు దూరంగా ఉండలేకపోతున్నాను. అందుచేత,నేను ఊరిలో వాళ్ళ విషయాల్లో పూర్వంలాగా ఆసక్తిని చూపించలేకపోతున్నానుచెప్పసాగింది శాంతమ్మ.

అమ్మానువ్వు అర్ధం చేసుకో …… పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ళకి పడుకోవడానికి, చదువుకోవడానికి ప్రత్యేకంగా గది అవసరము. నువ్వు టివి పెట్టుకున్నా పిల్లలకి ఇబ్బంది. కొన్నాళ్ళు సర్దుకో అమ్మా ……..పిల్లలు పెద్దాళ్ళయ్యాకా మళ్ళీ తీసుకొని వెళ్తానుసర్ది చెప్పాడు కొడుకు.

ఫోన్ పెట్టేసిన శాంతమ్మ, “సర్దుకొని పోవాలిసర్దుకొని పోవాలితనలో తానే గొణుక్కొంటోంది .

                                                                    (సమాప్తం)

****

Please follow and like us:

3 thoughts on “సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.