ఒక భార్గవి – కొన్ని రాగాలు -19

సంక్లిష్ట భావ పరిమళాలని వెదజల్లే రాగం జైజవంతి (ద్విజావంతి)

-భార్గవి

అసలు ఈ జైజవంతి అనే పేరు వింటేనే ఒక విచిత్రమైన ఫీలింగ్ ,ఒక్కసారిగా మదిలో చామంతులు విరిసినట్టూ,వేయి మతాబాలు వెలిగినట్టూ అనిపిస్తుంది

మండు వేసవిలో మునిమాపు వేళ చల్లగా వీచే యేటి గాలిలా మనసును సేద తీర్చే రాగం జైజవంతి( ద్విజావంతి).

ఇది మిశ్ర భావనలు ప్రతిఫలించే  రాగం అంటారు.

ఒక సంతోషమూ ,ఒక విజయం సాధించిన తృప్తీ తో పాటు ,కొంత కోల్పోయిన భావన కూడా కలిగించే రాగమనీ అందుకే జీవితంలో వచ్చే జయాపజయాలనీ ,  సుఖదుఃఖాలనీ తట్టుకునే ఒక స్థితప్రజ్ఞత( సమతౌల్యాన్ని ) ని కలగజేస్తుందనీ అంటారు .శృంగారాన్నీ,ప్రణయాన్నీ, భక్తినీ కూడా చేరవేసే రాగం.

ఇది ప్రధానంగా హిందూస్థానీ రాగం,దీనిని వారు జైజవంతి అని పిలుస్తారు,ఖమాస్ థాట్ కి చెందిన రాగమని చెబుతారు.సిక్కుల తొమ్మిదో గురువైన గురు తేజ్ బహదూర్ ఈ రాగంలో  గురుబాణీ లోని కొన్ని పవిత్ర ప్రార్థనలని రూపొందించారు.

మన కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షతర్ ద్విజావంతి అనే పేరుతో ఈ రాగాన్ని మన దక్షిణాది వారికి పరిచయం చేసినట్టు చెబుతారు.  ఈ ద్విజావంతి 28వ మేళకర్త అయిన హరికాంభోజి నుండీ వచ్చిన జన్య రాగం.దీక్షతర్ 

ఈ రాగంలో కొన్ని కీర్తనలు రూపొందించి పాడి బాగా ప్రాచుర్యం కలిపించారు.ఆయన రచించిన “అఖిలాండేశ్వరి” ,”చేతహ శ్రీ బాలకృష్ణం” ఈ రాగంలో బాగా పేరొందిన కీర్తనలు.కర్ణాటక సంగీతంలో కొన్ని యక్షగానాలలో కూడా ఈ రాగాన్ని వుపయోగించడం కనపడుతుంది.

లాల్ గుడి జయరామన్ ,బాలమురళీ కృష్ణ ఈ రాగంలో చక్కని తిల్లానాలు రూపొందించారు.

సాయంత్రం ఆరుగంటలనుండీ తొమ్మిది గంటల లోపు పాడవలసిన రాగంగా పరిగణిస్తారు.

సినిమా పాటలలోనే కాకుండా ప్రయివేట్ గా పాడిన లలితగీతాలలో కూడా ఈ రాగాన్ని సొగసుగా వుపయోగించడం కనపడుతుంది.

బాలాంత్రపు రజనీ కాంతరావు గారు రచించి,జైజవంతిలో స్వరపరిన “మనసౌనే ఓ రాధ మరల వేణువూద” అనే అతి చక్కని గీతాన్ని హిందూస్థానీ సంగీతాన్ని అతి తేలికగా అలవోకగా  పలికించే ఓలేటి వెంకటేశ్వర్లు గారు గొంతులో వింటుంటే యెంత హాయిగా వుంటుందో.

అలాగే విశ్వనాథ సత్యనారాయణగారు రాసిన భావగీతం “కన్నె కాటుక కళ్లు చిన్ని నాధుని చూసి కదలు లాడిన వేళ కందళించిన వేళ” —

దీనికి చాలామంది చాలా బాణీలు కట్టి వుండవచ్చు,అయితే కొచ్చర్లకోట సూర్య ప్రకాశరావు గారు కట్టిన బాణీలో యం.విద్యుల్లత పాడిన పాట జైజవంతిలో బహు చక్కగా వుంటుంది ,ఆపాట సాహిత్యం లాగే.

ఇక తెలుగూ,హిందీ సినిమా పాటలలో తగు మాత్రంగా వుపయోగింపబడిన రాగంగా చెప్పుకోవచ్చు.

“డాక్టర్ చక్రవర్తి” సినిమాలో  ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” అనేపాట.ఈ పాటకి ఆధారం జైజవంతి రాగమే ,ఆ రాగంలో ఒలికే ఒక రకమైన డిటాచ్ మెంట్ ,నిర్వేదం సరిగ్గా ఆ సన్నివేశానికి సరిపోవడమే కాక దానికి బలం చేకూర్చాయి కూడా.ఈ పాటను అలా తీర్చి దిద్దింది సంగీత దర్శకుడు యస్ .రాజేశ్వరరావు ,ఇక తాత్త్విక ధోరణిలో పాడిన ఘంటసాల గురించి వేరే చెప్పే పనేముంది.

 “చెంచులక్ష్మి” చిత్రంలో ఘంటసాల ,జిక్కీ పాడిన యుగళం “ఆనందమాయె అలి నీల వేణి” అనే పాట ని కూడా జైజవంతిలో తీర్చిదిద్దింది రాజేశ్వరరావే,బాక్ గ్రౌండ్ లో వచ్చే ఆలాప్ కూడా యెంత బాగుంటుందో

“భక్త జయదేవ “లో  “ప్రియే చారుశీలే “అనే జయదేవుని అష్టపదిని జైజవంతిలో మనసు మధురమైన లయలో కరిగి పోయేటట్టుగా స్వరపరిచి ఘంటసాల చేత పాడించిన ఘనత కూడా రాజేశ్వరరావుకే చెందుతుంది.

మన ఘంటసాల మాష్టారు మాత్రం తక్కువ తిన్నారా “పాండవ వనవాసం” లో “హిమగిరి సొగసులూ” అనే పాట ని జైజవంతి లో యెంత బాగా చేశారనీ! అసలు సుశీల మొదట్లో యెత్తుకునే ఆలాపన ఒక అద్భుతమైతే ,మధ్యలో వచ్చే నాదస్వరం, ఆపైన భీముడి వేషంలోని యన్ .టి.ఆర్ గొంతుకి సరిపోయేటట్టు ప్రతి చరణం లోనూ హిందూస్థానీ బిరకాలతో ఘంటసాల చేసే  ఆలాపన ,ఆయన తప్ప ఇంకెవ్వరూ పాడి రక్తి కట్టించలేరనిపిస్తుంది.భలే చక్కని పాట,భీముడికి సౌగంధిక పుష్పం దొరికిన సంగతేమో కానీ,మనకి  దొరికిన ఈ పాట మాత్రం ఒక సౌగంధిక అనడంలో సందేహం లేదు.

సంగీత దర్శకులలో పెండ్యాల నాగేశ్వరరావు దొక ప్రత్యేక స్థానం ,స్వరాలను చెక్కి సంగతులు పలికిస్తాడనీ,గాయనీ గాయకులను నుండీ అత్యుత్తమమైన ఫలితాలను సాధిస్తారనీ ప్రతీతి.ఆయన ,ఆరుద్ర,దర్శకుడు కె.బి.తిలక్ అనుపమ సంస్థ తరఫున పని చేసిన చిత్రాలలో చాలా చక్కటి పాటలు కుదిరాయి.వాటిలో “అత్తా ఒకింటి కోడలే “సినిమాలో పి.సుశీల పాడిన “నీదయరాదా ఈ దాసి పైన “అనే పాట చాలా బాగుంటుంది ,చక్కని ఆలాపనతో మొదలయ్యే ఈ పాటకి ఆధారం జైజవంతి నే.

పెండ్యాల గారు చేసినదే మరో అతి చక్కని పాట దేవులపల్లి వారి రచన,పి.బి శ్రీనివాస్ పాడగా ,”భక్త శబరి” కోసం రికార్డు చేసినది “ఏమి రామకథ శబరీ శబరీ “అనేది. అయితే ఇది రాగమాలిక ,పాట పల్లవి అంతా జైజవంతి లో వుంటుంది.

“స్వర్ణగౌరి” అనే సినిమా కన్నడం నుండీ తెలుగుకు డబ్ చేశారు ,అందులో యం.వెంకట రాజు సంగీత సారథ్యంలో యస్ .జానకి,యం.చిత్తరంజన్ కలిసి పాడిన “జయమీవే జగదీశ్వరీ” అనే పాట స్వరాలతో సహా వీనులకు విందు చేసేది జైజవంతి లోనే .ఇప్పుడు యూట్యూబ్ లో వెదుకుతుంటే తెలుగు పాట దొరకడంలా,కన్నడ వర్షన్ మాత్రమే దొరుకుతోంది.

“అందాలు చిందేటి ఆనంద సీమ” అంటూ పి.భానుమతీ,ఎ.యం. రాజా  హాయిగా జైజవంతి లో పాడినఈ పాట “చింతామణి” లోనిది ,సంగీత దర్శకుడు అద్దేపల్లి రామారావు.

ఈ మధ్యలో వచ్చిన కమలహాసన్ సినిమాలలో రెండింటిలో ఈ రాగం ఆధారంగా రెండు పాటలు వినపడటం విశేషం

“ముకుందా ముకుందా” —వేటూరి రచన –పాడింది సాధనా సర్గమ్ —హిమేష్ రహమ్మియా సంగీత సారథ్యం—“దశావతారం” సినిమాలో

“విశ్వరూపం” సినిమాలో శంకర్ మహాదేవన్ పాడిన “ఉండలేనంది నా కన్ను నిను గానక వెన్న దొంగా మరి వేథించకు”

హిందీ సినిమాల విషయానికొస్తే శంకర్ జైకిషన్ ద్వయం పేరెన్నిక గన్నవారు వారికి ప్రీతిపాత్రమైన రాగాలు భైరవి (మన కర్ణాటక సంగీతంలో సింధుభైరవి),శివరంజని ,అయితే యేం “సీమ” అనే సినిమాలో లతా చేత జైజవంతిలో “మన్ మోహన బడే ఝూట్ “అనే పాట యెంత హాయిగా పాడించారో

అలాగే మదన్ మోహన్ హిందీ సినీ సంగీతంలో అత్యంత విలువైన పేరు–ఆయన “దేఖ్ కబీరా రోయే “అనే సినిమా లో చేసినవన్నీ ఆణి ముత్యాలే ,వాటిలో ఒక ముత్యం “బైరన్ హోగయీ రైన్ “అని మన్నాడే జైజవంతిలో పాడిన పాట.మన్నాడే సంగతి చెప్పాలా క్లాసికల్ పాడే అవకాశ మొస్తే అవలీలగా మనసులు కొల్లగొట్టేట్టు పాడేస్తాడుగా.

యస్ .డి.బర్మన్ అంటేనే మన్నికైన పాట,ఆయన “గైడ్ “చిత్రంలో చేసిన పాటలన్నీ రసగుళికలే ,వాటిలో ఒకటి మహ్మద్ రఫీ పాడిన “తెరే మేరే సపనే అబ్ యేక్ రంగ్ హై” అనేది,దీనికి ఆధారం జైజవంతీనే మరి.

హిందీ సినీ సంగీత దర్శకుల గురించి చెప్పేటప్పుడు తప్పని సరిగా చెప్పుకోవలసిన పేరు నౌషాద్ .ఆయన “ఉడన్ ఖటోలా” సినిమాలో రఫీ చేత పాడించిన “మొహబ్బత్ కీ రాహోంమే చల్ నా సమ్హల్ కే” అనే పాట కి ఆధారం జైజవంతి.

ఈ పాటలన్నీ వింటుంటే జైజవంతి (ద్విజావంతి)రాగంలో భక్తి,కరుణ ,శృంగార రసాలు యెలా పలికేదీ,యెలా మిశ్రమైన అనుభూతులు వొలికేదీ అనుభవానికి వచ్చి రాగ స్వరూపం బోధపడిందని భావిస్తున్నాను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.