మెరుపులు- కొరతలు

అసురవేదం -‘బహుశా’ వేణుగోపాల్ కథ 

                                                                – డా.కే.వి.రమణరావు

అడవిజంతువుల పట్ల మనుషుల స్వార్థపూరిత హింసాప్రవృత్తిని ఒక ‘అసురత్వం’గా ఈకథలో వర్ణించారు రచయిత బహుశా’ వేణుగోపాల్. ఈ సమకాలీన లక్షణాన్ని ఒక సంఘటనద్వారా వివరిస్తూ దానిని రామాయణంలోని ఒక ప్రధాన సంఘటనతో ప్రతీకాత్మకంగా పోలుస్తూ చెప్పిన కథ ఇది. 

స్థూలంగా ఇదీ కథ.

అడవినానుకుని ఉన్న ఒక ఇరవై గుడిసెల గూడెంలో మగాళ్లంతా పొగాకుబేరన్లకి మొద్దులు నరకడానికి తెల్లవార్ఝామున అడవికి బయల్దేర్తుండగా ఊరిబావిలో పడిన జంతువు అలికిడి వింటారు. చూస్తే అది జింక. దాన్ని గట్టుకు తీసి మరుసటిరోజు కోసుకుని భాగాలు చేసుకుని తినాలని నిశ్చయించుకుంటారు. దాన్ని ఎప్పుడూ చింతచెట్టుకింద మంచంమీద కూర్చునుండే సుబ్బమ్మామ్మ గుడిసె అరుగు గుంజకు కట్టేసి అడవికి వెళ్లిపోతారు. 

రాక్షసులంటే భయపడే ఆగూడెం పిల్లలు ఆరోజు స్కూలు ఎగ్గొట్టి జింకనుచూడ్డానికి వస్తారు. సుబ్బమ్మామ్మ ఆ పిల్లలకు రామాయణంలోని సీతాపహరణం ఘట్టం చెప్తుంది. ముక్కు చెవులు కోయించుకున్న శూర్పణఖ రావణుడి దగ్గరకెళ్లి సీతగురించి చెప్పడం, రావణుడు మారీచుడి ‘గుడిసె ‘కెళ్లి అతన్ని మాయజింకరూపంలో వెళ్లి సీతను అపహరించడంలో తనకు సహాయం చెయ్యమని అడగడం, అతను రాముడి గొప్పదనంగురించి రావణుడికి వివరించి హితబోధ చెయ్యడం, రావణుడు బెదిరించడం, మారీచుడు విధిలేక బంగారు మాయజింక రూపంలో వెళ్లడం, సీత దాన్ని కావాలని మొండికెయ్యడం, రాముడు దాన్ని వెంటాడుతూ వెళ్లి చంపడం ఇవన్నీ తనదైన శైలిలో వివరంగా చెపుతుంది సుబ్బమ్మామ్మ.

సుబ్బమ్మామ్మ కథ ప్రభావం ఆపిల్లల్లోవున్న ఆరేళ్ల చిట్టిమీద పడుతుంది. చిట్టి ఆ జింకనెలా రక్షించడమా అని మదనపడుతుంది. స్కూలు టీచరు వస్తే అయన్ను జింకనెలాగైనా రక్షించమని బతిమాల్తుంది. మనిషిలోని అసురుడున్నాడని, అదంత సులభంకాదని ఆయన అంటాడు. 

ఆ రాత్రి సుబ్బమ్మామ్మ చెప్పిన కథలో బంగారు జింక చావుకు కారణమైన రావణుడు, జింక కావాలని పట్టుబట్టిన సీత, చంపిన రాముడు వీళ్లలో కూడా అసురుడున్నాడా అని చిట్టి చింతిస్తుంది. అర్ధరాత్రి వెళ్లి తాడువిప్పి జింకకు స్వేచ్చను కలిగించడానికి ప్రయత్నించి విఫలమౌతుంది. 

పొద్దున్నే ఊరివాళ్లు జింకను చంపడానికి ఉద్యుక్తులౌతుండగా స్కూలు టీచరు చేసిన ఫిర్యాదుతో జీపులో వచ్చిన ఫారెస్ట్ డిపార్టుమెంటు అధికారులు ఊరివాళ్లను బెదిరించి ఆ జింకను తీసుకెళ్తారు. విచారకరమైన కొసమెరుపేమిటంటే ఆ అటవీశాఖవాళ్లు ఆ రాత్రి ఆ జింకను కోసుకు తినేస్తారు.

బావిలోపడి ప్రాణభయంతో కొట్టుకుంటున్న అడవి జంతువు జింకను పైకితీసి తిరిగి అడవిలో వదలిపెట్టాల్సిన ఊరివాళ్లు దాన్ని కోసుకుతినాలనుకోవడంతో ప్రారంభైమన కథ అడవి జంతువులను రక్షించడమే కర్తవ్యంగా ఉన్న అటవీశాఖవారు అదేపని చేయడంతోకథ ముగుస్తుంది. మనుషుల్లో ఉన్న ఈ లక్షణాన్నే రచయిత అసురగుణంగా అభివర్ణించారు. జంతువులపట్ల కరుణ ఉండాలన్నది కథ ప్రధాన ఆశయంగా కనపడినా మనుషుల్లోని అసురగుణాన్ని గురించే రచయిత ఎక్కువగా ప్రస్తావించారు. దాన్ని ఇతర సమకాలీన హింసారూపాలకు పొడిగించారు.

ఈవిషయాన్ని నొక్కిచెప్పడానికి రచయిత రామాయణ సంఘటనను సుబ్బమ్మామ్మతో చెప్పించారు. ఆమె మాండలీకశైలిలో చెప్పిన తీరు బావుంది. సుబ్బమ్మామ్మ రామాయణ కథను మూలకథను అనుసరిస్తూనే తనదైన తాత్విక ధోరణిలో చెప్తుంది. అందులోని పాత్రలు రామాయణాన్ని ఆమె జీవితానుభవంద్వారా అర్థంచేసుకున్న విధంలోంచి పుట్టుకొచ్చాయి, అదేవిధంగా మాట్లాడతాయి. మారీచుడు రావణుడితో చెప్పినట్టుగా రాముడిగురించి, సీతగురించి సుబ్బమ్మామ్మ ఇలాచెప్తుంది.

“… రాములోరు సాచ్చాత్తు ధర్మపెబువు, ధర్మమనే మాట మనిసైతే రాములోరవుతారు. అంతేగాదు దేముడాయన. సీతమ్మోరుని ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటాండాడు… రాముడు గునమంతుడు. నువ్వూ (రావణుడు) మంసోడివే అయినా నీ గునం గుడిసేటిది. రాములోరు తల్చుకుంటే ఈ భూమ్మీద రాచ్చసుడు అనేవోడు లేకుండా సేత్తాడు. అంత సేతైనోడు… నువ్వు రాములోరితో యిద్దాన్ని సెయ్యి లేదా మానుకో. నన్ను మాత్రం ఇందులోకి లాగకు” 

“సీతమ్మోరు మహా పతివ్రొత. రాములోరిని యిడిసి ఉండ్లేదు. అందుకేగద రాజ్యాన్ని వొగ్గేసి రాములోరెంట అడికొచ్చేసింది. సీతమ్మోరంటే ఎవరు? అగ్గిలాంటావిడ. అందుకే నామాటిని ఆవిడ జోలికి పోకు”

ఇంకా మారీచుడు ధర్మంగురించి ఇలా హితబోధ చేస్తాడు. “ఓ రాచ్చసరాజా నీ చుట్టూ ఎప్పుడూ నిన్ను పొగిడేవోళ్లు, ఎక్కేసేవోళ్లు ఉంటారు. నీకు ఇతం సెప్పేవోళ్లుండరు. ఒకేల అలాంటోల్లున్నా నీలంటి రాజులు ఆళ్లు సెప్పే మాటలు సెవికెక్కింసుకోరు”. 

దానికి రావణుడు ఉగ్రుడై “ఓ మారీసా నీ మాటలు పనికిమాలినయ్యి. లాభం లేనియ్యి. నీమాటలిని మడిసికి భయపడే పిరికిపందను కాను. నేను అగ్గినే మాడిసేత్తాను. సావునే సంపేత్తాను. రాముడికి మూడింది… నువ్వు నాకు తోడురాకపోతే నీ తల తీయిత్తా. అంతేగాని నేను సేసేది తప్పా ఒప్పా అని నిన్నడగలేదు. రాముడ్ని తెగ పొగిడావు. రాముడికే బుద్ధుంటే పినతల్లి సేసిన సెడ్డని తిప్పిగొట్టడా రాజవ్వడా… మంత్రులు రాజులడిగినప్పుడు ఇనయంగా సేతులు కట్టుకుని సమాధానం సెప్పాలి. అదీ కూడా రాజు ఇష్టపడే మాటలే సెప్పాలి. నువ్వు సెప్పేదాంట్లో ఎంత ఇతమున్నా ఆ ఇతాన్ని రాజులు ఒప్పుకోరు… రాజునుఎదిరించి ఎవరూ సుకంగా బతకలేరని తెలుసుకో” అని రాజులదగ్గర ఎలావుండలో చెప్పి మారీచుణ్ణి బెదిరిస్తాడు

ఇక విధిలేక మారీచుడు ‘యములోడా యమపాసాల్లాంటి నీ యిరవై సేతుల్లో సచ్చేకంటే ధర్మపెభువైన రాములోరు సేతిలో సత్తే పున్నెంతోపాటు మోచ్చం పొందుతా..’ అని ఆ పనికి ఒప్పుకుంటాడు. 

రచయిత ఈ చర్చలో రామాయణంలోని రావణుడి పాత్రద్వారా అసురగుణం ఎలావుంటుందో చెప్పడమేకాకుండా అలాంటివాళ్లు రాజులుగావున్నప్పుడు మంచివాళ్లుకూడా చెడ్డపనులు చేయాల్సివస్తుందంటూ ‘“ఆ యుగంలోనైనా ఈ యుగంలోనైనా బక్కోడికి ఇష్టం లేకపోయినా బలవంతుడు సెప్పినట్టు లొంగి బతకాలి” అని సుబ్బమ్మామ్మచేత గాద్గదికంగా కథ ముగింపజేసి దాన్ని ప్రస్తుతకాలానిక్కూడా వర్తింపజేసారు.

ఈ రామాయణ కథద్వారా చిట్టికి ఏదో తెలిసినట్టనిపించినా తమ గూడెంలో బంధించబడిన జింకనెలా రక్షించాలో బోధపడదు. అందుకే జింకను కాపాడమని చిట్టి తన స్కూలు టీచరును అడుగుతుంది. అతను ”మాంసంరుచికి మనిషి బానిస. అతడిలో అడవి జంతువునైనా వేటాడే రాక్షసత్వం ఉంటుంది. మనిషిలో రాక్షసుడుంటాడు.. రాక్షసుడున్న చోట మనిషుండడు” అంటూ అసురగుణాన్ని గురించి మరింత స్పష్టంగా చెప్తాడు.

ఈకథలో సాధుజంతువుల్ని వేటాడిచంపే మనిషి మనస్తత్వాన్ని అసురగుణంగా రచయిత ప్రత్యక్షంగా అభివర్ణించారని అనుకోవాలి. అది అడవిపొలిమేరల్లో నివసించే నాగరికులు, జంతువుల్ని రక్షించాల్సిన అధికారులు లేక మరెవరైనా కావచ్చు.

దాన్ని రామాయణంలోని బంగారుజింకకు, ఆ ఘట్టంలో జరిగే ధర్మాధర్మ చర్చకు రచయిత అన్వయించారు. నిజానికి దాన్ని అలాగే తీసుకుంటే అన్వయం అంతగా సరిపోదు. ఎందుకంటే అది నిజమైన జింకకాదు, (రాక్షస)మాయజింక అని రామలక్ష్మణులకు తెలుసు. అందుకే చివర రాముడు దాన్ని చంపాడు. సీత దాని అందంచూసి ముచ్చటపడి పెంచుకోవడానికేగాని దాన్ని కోసుకుని తినడానికి తెమ్మనదు. ఇక్కడ జింకతప్ప వేరే సామ్యం చప్పున కనపడదు. కథలో ఈ విషయమై చిట్టికూడా కొంత మీమాంసలో పడుతుంది. 

అయితే ఈ రామాయణ ఘట్టాన్ని ఒక ప్రతీకగా తీసుకుని, అందులోని రావణుడి మనస్తత్వాన్ని, ధర్మాధర్మాలగురించిన చర్చను ఈ కాలాపు పరిస్తితులకు, జరిగే సంఘటనలకు, మనుషుల (ముఖ్యంగా బలహీనులను హింసించే బలవంతుల) స్వార్థానికి అన్వయించుకుంటే చాలావరకు సరిపోతుంది. దీన్నే రచయిత ఉద్దేశించినట్టుగా కనబడుతుంది. 

మారొకచోట స్కూలు మాస్టారు “రాక్షసుడు పచ్చి మాంసాన్ని తింటాడు, మానవుడు వండుకుని తింటాడు. అదే తేడా” అంటాడు. దీన్ని యథాతథంగా తీసుకుంటే, మనుషుల్లో  తొంభైశాతం మాంసాహారులైన ఈ ప్రపంచంలో దాని అర్థం చాలా అసందర్భంగా ఉంటుంది. అలాకాకుండా ప్రతీకాత్మకంగా ‘స్వార్థపరులైన బలవంతుల్లో బలహీనులను బాధించే హింసా మానసిక ప్రవృత్తిగా’ తీసుకుంటే సరిపోతుంది.

ఈకథలో శిల్పరీత్యా అక్కడక్కడా కొంత అసంబద్ధత లేకపోలేదు. ఉదాహరణకు కథ నిడివిలో రామాయణ ఉపకథే ఎక్కువభాగం ఆక్రమించింది. కథనంలో ప్రతీకాత్మకంగా చెప్పిన రామాయణ ఘట్టానికి, ప్రధానకథకు అంత మృదువుగా అతుకు పడలేదు. సంభాషణలు తప్ప మిగతా కథంతా సాధారణ వ్యావహారికంలో రాయబడిన కథనంలో ఒకచోట ‘ఎల్లిపోయారు’ అని మాండలీకంలో ఉంటుంది. మరోచోట స్కూలు మాస్టారు ‘అదిసరేగాని ఈరోజు పాఠం వేదాలగురించి చెప్పానమ్మా’ అని చిట్టితో అనడం, ఆ సంభాషణను కొంత పొడిగించడం సహజంగాలేక కథకోసం అతికించినట్టుంది. ఐతే ఇలాంటి సర్దుబాట్లు ఎంత అనుభవంగల రచయితలకైనా అప్పుడప్పుడూ తప్పవు. 

ఇలా ప్రతీకాత్మకంగా చెప్పిన కథలు, ఇంకా ఇతర ఆధునిక ప్రయోగాలైన మ్యాజిక్ రియలిజమ్ లాంటి వాటి ద్వారా చెప్పిన కథలు మామూలు కథలకు భిన్నంగా, కొంత అస్పష్టంగా ఉండి ఒక్కోసారి వివిధ అర్థాలను స్పురింపజేస్తాయి. ఐతే ఇలాంటి కథలద్వారా పాఠకులకు అందే సందేశం బలంగా ఉంటుంది. 

కథలో రామాయణ ఉపకథను సుబ్బమ్మామ్మ స్వతంత్ర ఆంతర్యంలో, వేదనలో తాత్వికంగా రూపుదిద్దుకున్న తరువాత దాన్ని వెలికితీసి, ఆమె భాషలో చెప్పించడంలో రచయిత చాలా నైపుణ్యాన్ని, నిజాయతీని చూపించారు (ఉపకథకు ప్రధానసమస్యతో స్థూలంగా అన్వయం కుదరకపోవడానికి అదే కారణం కావచ్చు). ఇది ఈకథలోని ఒక మంచి శిల్పవిశేషం. కథను ఆసక్తికరమైన ఒరవడిలో, అందమైన ప్రతీకాత్మక ధోరణిలో రాసిన ‘బహుశా’ వేణుగోపాల్ గారు అభినందనీయులు.

*****

[అనురవేదం కథ ప్రచురణ ఆంధ్రజ్యోతి ఆదివారం (20 జూన్ 2021)]
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.