రంగు పానీయాలు

-కందేపి రాణి ప్రసాద్

అడవి అంత కోలాహలంగా పిల్ల జంతువులన్నీ ఒకే వైపుకు పరిగెడుతున్నాయి. ఆనందంగా గంతులేస్తూ పోతున్నాయి. నాలుకలు చప్పరించుకుంటూ సంతోషంగా వెళుతున్నాయి. పిల్ల కోతులు, పిల్ల ఎలుగుబంట్లు, పిల్ల పులులు, పిల్ల కుందేళ్ళు ఒకటేమిటి సమస్త జంతువులు పిల్లలన్ని పరుగులు తీసుకుంటూ పోతున్నాయి.
పెద్ద జంతువులకేమి అర్థం కాలేదు ఇవన్ని ఎక్కడికి పోతున్నాయో? పడమటి దిక్కుకు పోయి వచ్చిన పిల్ల జంతువులన్నీ మిగతా వాటి చెవుల్లో ఏమో చెపుతున్నాయి ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, కళ్ళు పెద్దవి చేసుకుని వింటూ అవి కూడా అటువైపే దరి తీస్తున్నాయి. చెట్టు మీద కూర్చుని చూస్తున్న ఎలుగుబంటికి ఏమి అర్థం కావడం లేదు.
దారిలో వెళుతున్న ఆవు పరుగులు తీస్తున్న పిల్లల్ని ఆపి విషయమేమిటని అడిగింది. అప్పుడో  పిల్లకోతి ఇలా చెప్పింది “ పడమటి దిక్కునున్న పెద్ద మర్రిచెట్టు కింద నక్క కొత్త రకం పానీయాలు అమ్ముతున్నది చాల రుచిగా ఉన్నాయి. అవి తాగక చాల హుషారుగా ఉన్నది. ఆ నక్క పట్నం నుంచి వచ్చిందట అందరు ఆ పానీయాలు తాగటానికే వెళుతున్నారు” అని చెప్తూ తుర్రుమని పారిపోయింది.
ఎలుగుబంటి ఆవు నడిగి విషయం తెలుసుకున్నది. నక్క ఏమి పానీయాలు అమ్ముతున్నది చూద్దాం అనుకుని ఎలుగుబంటి, ఆవు, ఏనుగు, పులి వంటి జంతువులన్నీ పడమటి దిక్కుకు వెళ్ళాయి. అక్కడ నక్క ఆరంజ్, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో ఉన్న పైయలు గాజు సీసాలు పెట్టుకొని ఉన్నది ఎదురుగ పిల్లలన్ని ఎగురుకుంటూ, గెంతుకుంటూ గ్లాసుల్లో పోయించుకుని తాగుతున్నాయి. అవన్నీ మనుషులు పట్నంలో తాగే కూల్ డ్రింక్స్.
అడవిలో పెద్ద జంతువులన్నీ సమావేశమయ్యాయి. ఈ మధ్య కాలంలో మనుష్యులే ఈ కూల్ డ్రింక్స్ ను నిషేదిస్తున్నారు మనకు స్వచ్చమైన అడవి తోడుండగా ఈ కృత్రిమమైన పానీయాలు ఎందుకు తాగాలి? తియ్యని లేత కొబ్బరి బొండాలు కమ్మనైన ఆవుపాలు, స్వచ్చమైన అమృతం లాంటి తేనె వంటి ప్రకృతిలో దొరికే సహజ పానీయాలు మనకుండగా ఈ విషపూరిత రసాయనాలు ఎందుకు తాగటం. కానీ ఈ విషయాలన్నీ పిల్లలకు ఎవరు చెప్పాలి? నక్కకు బుద్ధి చెప్పి ఎవరు అమ్మటం మాన్పించాలి ప్రకృతి తల్లి అందించిన సహజ పానియాలనే తాగాలి కూల్ డ్రింక్స్ తాగి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ఇవన్ని చర్చించుకొని జంతువులు అన్ని కలసి ఏనుగు మీద భాద్యతను పెట్టాయి. నక్కను అమ్మకుండా చూడాలి. పిల్లలకు హితోపదేశం చేయాలి.
ఏనుగు తన వాళ్ళ మంచి కార్యం జరుగుతుందని సంతోషంగా అంగీకరించింది. మొదటగా పిల్లలందర్నీ ఒకచోట సమావేశ పరిచి కూల్ డ్రింక్స్ లో విష రసాయనాల గురించి, వాటి వాళ్ళ శరీరంలో జరిగే నష్టం గురించి ఏనుగు చెప్పింది. అడవి తల్లి అందించే చక్కని ఫలాలు, పండ్లు, పుట్టతేనె వాళ్ళ జరిగే మంచి గురించి చెప్పింది. చివరకు పిల్లలన్ని కూల్ డ్రింక్స్ తాగమని అంగీకరించాయి.
తర్వాత ఏనుగు నక్క దగ్గరకు వెళ్లి ఈ పానీయాల అమ్మకం మానేయమని చెప్పింది. మానేయకపోతే నిన్ను మనుష్యులుండే పట్నానికే పంపిస్తాం. అడవిలోకి రానివ్వం అని బెదిరించింది. పట్నంలో ఉంటె మనుష్యులు తనను బతకనివ్వరని తెలుసు అందుకే వెంటనే నక్క పానీయాల అమ్మకాన్ని ఆపేస్తానని అంగీకరించింది. ఆ సమస్య అలా పరిష్కృతమైంది. అడవి జంతువులు ప్రకృతి ఉత్పత్తులనే ఆహారంగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటున్నాయి.

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.