సామాజిక బాధ్యత”

-లలితా వర్మ

బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది.

పిల్లల చదువులకు ఆటంకం  కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికిఅద్దెకి యిల్లు చూడమని చెప్పా.

వారం తిరక్కుండానే నా స్నేహితుడు యిల్లు చూశానని , పనిమనిషిని కూడా మాట్లాడానని

హాపీగా వొచ్చి జాయినై పొమ్మని   ఫోన్ చేశాడు.

కావలసిన సరంజామా అంతా శ్రీమతి సిద్ధం చేయగా 

పిల్లలకు, ఆవిడకు తగిన జాగ్రత్తలు చెప్పి బయలుదేరి వరంగల్ వెళ్లా.

నా స్నేహితుడి సహాయంతో యిల్లు సర్దుకుని 

తెల్లవారి బ్యాంకుకి వెళ్లి  ఛార్జ్ తీసుకున్నా.

అంతకు ముందు రైతులు తీసుకున్న ఋణాలు,

రికవరీలు వివరాలన్నీ స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశా.

బ్యాంకులో యెంత పని చేసినా యింటికొచ్చేసరికి హాయిగా వుండేది.

పనిమనిషి యిల్లు అద్దంలా వుంచేది.

రుచికరమైన తెలంగాణా వంటకాలు చేసి పెట్టేది.

నేను యింటి కెళ్లగానే ఎక్కడెక్కడ ఏమేమి వున్నాయో చెప్పి” ఎల్లొత్తా సారూ” అంటూ వెళ్లిపోయేది.

ఆమె పేరు రాజమ్మ.  నలభై ప్లస్ వుంటుంది వయసు. నుదుట విభూతి చూసి అనుకున్నా భర్తని కోల్పోయివుంటుందని. అంతకన్నా ఆమె గురించి వివరాలు తెలుసుకోలేదు ఆసక్తిలేదు గనక.

నా అర్థాంగి, పిల్లలు లేని లోటు తప్ప యే లోటు లేదు.

ఈ అకడమిక్ ఇయర్ గడిచిపోయినవెంటనే వాళ్లని తీసికొచ్చేస్తే యే బాధా వుండదిక.

మాయావిడకి రాజమ్మ దగ్గర  తెలంగాణా వంటకాల్లో ట్రైనింగ్ యిప్పించాలి అనుకున్నా.

బ్యాంకు రికవరీలకు ఒక పద్ధతి యెంచుకున్నా

వెళ్లాల్సిన ఊరిలో ముందుగానే అనౌన్స్ చేయించి, రైతులు తీసుకున్న ఋణాలు, వాళ్లు కట్టాల్సిన మొత్తం పేర్కొంటూ, లిస్ట్ తయారు చేసుకుని 

ఒక చోట కెనోపీ, టేబుల్  వేయించుకుని 

కూర్చుని , వాళ్ల పేర్లు చదువుతూ కట్టాల్సిన మొత్తం తెలియజేసి, యెన్ని వాయిదాల్లో కట్టొచ్చో వివరించడం.    

ఈ పద్ధతి మంచి ఫలితాన్నే యిచ్చింది.

ఒకరోజు పక్కనే వున్న పల్లెటూరికి వెళ్లా. లిస్ట్ లో పేర్లన్నీ రొటీన్ గా చదివేసి , అక్కడకి రానివారికి తెలియజేయాలని వచ్చినవారిని కోరి ,

పని పూర్తి చేసుకుని యింటికి వెళ్లా.

రెండు రోజులు గడిచాయి.

ఒకరోజు యింటికి వెళ్లాక ఎప్పటిలా అన్నీ చెప్పి  వెళ్లిపోకుండా అలాగే నిలబడింది రాజమ్మ.

నాకు కొంచం ఇబ్బందిగా వుంది.

వెళ్లమని చెప్పాలంటే  ఏదో మొహమాటం.

ఏదో చెప్పాలనుకున్నట్లుంది రాజమ్మ వాలకం.

కానీ చెప్పట్లేదు.

నేను యే గదిలో కెళితే ఆ గది బయట తచ్చాడుతుంది.

ఇలా కాదని అడిగా “ఏమైనా  కావాలా రాజమ్మా?”

అని.

అది సారూ” అంటూ  నసుగుతుంది తలొంచుకుని

నేనే మొహమాటస్థున్ని అనుకుంటే ఆవిడ అంతకన్నా 

మొహమాట పడుతుంది.

ఇక లాభం లేదని నేనే అడిగా 

చెప్పు రాజమ్మా !” అని.

సారూ! జీతం” అంటూ ఆగింది.

ఓ జీతమా? యిస్తా”నంటూ ప్యాంటు జేబులోనుంచి

పర్సు తీయబోతుంటే 

గిప్పుడియ్యమంటలె సారూ మెల్లగనె ఇయ్యుండ్రి గనిజీతంల ముప్పై రూపాయలు పట్టుకొని ఇయ్యుండ్రి. మొన్న వూర్లె నా పేరు జదివిన్రంట. 

బ్యాంకుకి బాకీ వున్న పైసలు, మా పక్కింటామె చెప్పింది సారూ” అంది.

నోరెళ్లబెట్టాను.

లిస్ట్ కంప్యూటర్ నుండి తీసినప్పుడు అన్నీ వివరంగా ప్రింటవుట్లొస్తాయి. అలా వొచ్చింది రాజమ్మ పేరు. ఆవిడ బాకీ ముప్పై రూపాయలు.

రొటీన్ గా చదివానేమో, అది విన్నావిడ రాజమ్మ కి చెప్పివుంటుంది. 

నేను నోరు మూసేలోపు  రాజమ్మ వెళ్లిపోయింది.

తర్వాత తెలిసిన విషయం అసలు బాకీ ఏభైవేలు కట్టలేక రాజమ్మ భర్త పురుగులమందు తాగి చనిపోతే

రాజమ్మ యిలా ఇళ్లల్లో పనులు, వంటలు చేస్తూ అప్పు తీర్చిందట. 

ప్రభుత్వం యిచ్చిన నష్ట పరిహారంతో అమ్మాయి పెళ్లి చేసిందట.

చివరికి ముప్పై రూపాయల అప్పు కూడా తీర్చాలని

తాపత్రయపడుతుంది.

ఈ సమాజం నుండి తనెంత నష్టపోయినా తనవంతు సామాజిక బాధ్యత మరవని రాజమ్మకు మనసులోనే నమస్కరించుకున్నాను చెమ్మగిలిన కళ్లతో.

(సమాప్తం)

******

Please follow and like us:

2 thoughts on “ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ”

Leave a Reply

Your email address will not be published.