అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ

(తథాగతుని అడుగుజాడలుపుస్తక పరిచయం)

  -ఎన్.వేణుగోపాల్

ఎప్పుడూ ఇవాళ లోనే జీవిస్తుంటాం. రేపు గురించి ఆశలతో సందేహాలతో వేగిపోతుంటాం. అయినా నిన్న మీద తరగని ఆసక్తి ఉండడం మానవ స్వభావంలో అనివార్యమైన, అవిభాజ్యమైన లక్షణం కావచ్చు.

అది ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వెనుకచూపు కానక్కర లేదు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే భయం గొలిపే పునరుద్ధరణ వాదమూ కానక్కర లేదు. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అనుకున్నా సరే, ఆ కొంచెమైనా తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇవాళ కనబడుతున్న ప్రతి సమస్యకూ బీజం నిన్నలోనే ఉండే అవకాశం ఉంది గనుక ఆ నిన్నను తెలుసుకోవాలని ఉంటుంది. నిన్నను సరిగ్గా తెలుసుకుంటే ఇవాళ కూడ సరిగ్గా తెలుస్తుందనే ఆలోచన కూడ ఉంటుంది. ‘ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే ఎక్కడికి పోతున్నామో తెలియదు’ అని కొడవటిగంటి కుటుంబరావు అపారమైన అర్థాన్ని కూర్చి చెప్పిన చిన్నమాట గుర్తుకొస్తూ ఉంటుంది. ఇవేవీ లేకపోయినా, గతాన్ని తెలుసుకోవాలనే సాధారణమైన కుతూహలం ఉంటుంది. మొత్తం మీద గతం పట్ల ఆసక్తి లేని మనిషి దాదాపుగా ఉండరు. అందులోనూ, ఆ గతం విస్మరణకు గురైన ఒక వైభవోజ్వల గతం అయినప్పుడు, వర్తమానంలో కనబడుతున్న క్లేశాలు లేనిదిగా, ఒకరకంగా వర్తమానానికి మార్గనిర్దేశనం చేయగలదిగా కనబడుతున్నప్పుడు ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది.

ఆ గతం బుద్ధుడికో, బౌద్ధానికో సంబంధించినదైతే ఆ ఆసక్తి మరింత తీవ్రమవుతుంది. దాని వైశాల్యమూ లోతూ పెరుగుతాయి. అటువంటి ఆసక్తిని రెండువేల ఏళ్లుగా నిరంతరాయంగా రేకెత్తిస్తున్న, విస్తరిస్తున్న మన ఉజ్వల చారిత్రక గతం బౌద్ధం. తథాగతుడు పుట్టి పెరిగి తన ఆలోచనలు వెదజల్లిన ఉత్తర భారతంలో మాత్రమే కాదు, దేశమంతా ఆ ఆసక్తి ఉంది. ఆయన జీవించి ఉన్నకాలం లోనే మొదలై, తర్వాత దాదాపు వెయ్యి సంవత్సరాలు విస్తరించిన తెలుగుసీమలో బౌద్ధం గురించిన ఆలోచనలూ అన్వేషణలూ కూడా అందుకే చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి.

గౌతమ బుద్ధుని బోధనల గురించి విని గోదావరి తీరం నుంచి ఆయనను కలవడానికి తన శిష్యులను పంపిన బావరి చరిత్ర, అశోకుడి పాలనలో తెలుగుసీమలోకి బౌద్ధం ప్రవేశించిన చరిత్ర, శాతవాహనుల, ఇక్ష్వాకుల, శాలంకాయనుల, విష్ణుకుండినుల కాలాల్లో బౌద్ధానికి దొరికిన ఆదరణ, జన సామాన్యంలో బౌద్ధ వ్యాప్తి, ఇవాళ్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిసి కనీసం వంద చోట్ల బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు వంటి ఎన్నో ఆకరాలున్నాయి తెలుగుసీమలో తథాగతుడి అడుగుజాడలను గుర్తించడానికి.

విశాఖపట్నం పరిసరాల్లో తొట్లకొండ మీద క్రీ.పూ. మూడో శతాబ్ది నుంచి క్రీ.శ. మూడో శతాబ్ది మధ్య కాలానివని చెప్పదగిన బౌద్ధ నిర్మాణాలు యాదృచ్ఛికంగా బైటపడిన తర్వాత 1988-93 మధ్య జరిగిన పురాతత్వ తవ్వకాలతో ఆసక్తి కలిగి, ఆ ఆసక్తిని అధ్యయనంగా, అవగాహనగా, విశ్లేషణగా విస్తరించుకుని రాణీ శర్మ ఈమని రాసిన ఇంగ్లిష్ అముద్రిత పుస్తకానికి తెలుగుసేత తథాగతుని అడుగుజాడలు అనే అద్భుతమైన పుస్తకం. కథకుడు, నవలారచయిత ఉణుదుర్తి సుధాకర్ ఈ కృషిలో ఆమెకు సహకరించారు.

తూరుపు కనుమలు, తొట్లకొండ, సంఘం, ఆరామం, బౌద్ధ జనబాహుళ్యం, ఉపసంహారం అనే ఆరు అధ్యాయాలలో, 180 పేజీలలో ఆమె తథాగతుని అడుగుజాడల చరిత్రను, గతాన్ని మాత్రమే కాదు, వర్తమానాన్ని, భవిష్యత్తును, సాహిత్యాన్ని, రాజకీయార్థిక, సామాజిక, పాలనా అంశాలను అద్భుతమైన, ఆసక్తిదాయకమైన శైలిలో వివరించారు.

“బౌద్ధం ఒక చారిత్రక విశేషం మాత్రమే కాదు; సమకాలీన, ఆధునిక సమాజానికి కూడా వర్తించే అంశాలు అందులో అనేకం ఉన్నాయి. కుల, వర్గాలకు అతీతంగా, పురుషులనూ, స్త్రీలనూ సమాన దృష్టితో చూస్తూ, పండితులూ, పామరులూ అనే విభజన చేయకుండా, సాధువులూ, సంసారులూ అనే తేడాలు చూపకుండా – రెండువేల  సంవత్సరాల క్రితమే – ప్రతి ఒక్కర్నీ అక్కువ చేర్చుకున్న ఏకైక ధర్మంగా బౌద్ధం ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఎవరేది చెప్పినా విశ్వసించనవసరం లేదనీ, ఎవరికి వారు స్వయంగా జ్ఞానాన్వేషణ చేసుకోవాలనీ, ఎవరి మోక్ష సాధనకు వాళ్లే పాటుపడాలనీ చెప్పిన ధర్మం అప్పటికీ, ఇప్పటికీ బౌద్ధం ఒక్కటే” అనే అవగాహనతో ఆమె ఈ పుస్తకం రాశారు.

ఆ రకంగా ‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్న ఇ ఎచ్ కార్ పరిశీలనకు ఈ పుస్తకం ఒక మంచి నిదర్శనం. ఈ పుస్తకం రెండువేల ఏళ్ల కింద ఉజ్వల ప్రతిపత్తితో ఉండి, ఇవాళ శిథిలాలుగా ఉన్న స్థలంలోకి వెళ్లి, మననూ తీసుకువెళ్లి, ఆ గత చరిత్రను చెప్పడం మాత్రమే కాదు, వర్తమాన అభివృద్ధి నమూనానూ, రియల్ ఎస్టేట్ భూదాహానికి బలి అయిపోతున్న మన చారిత్రక వారసత్వ సంపదనూ చూపి కర్తవ్య బోధ చేస్తుంది. “హడావుడిగా వచ్చి వెళ్లిపోయేందుకు అవి పిక్నిక్ ప్రదేశాలు కావనీ, తమ చరిత్రను తెలుసుకొమ్మని ఘోషిస్తున్న రెండువేల ఏళ్ల నాటి అపురూపమైన కట్టడాలనీ ఎంతమంది అనుకుంటున్నారు? పూర్వీకులు వదిలివెళ్లిన ఈ పురాతత్వ సంపదను తామూ తమ పిల్లలూ సంపూర్ణంగా ఆస్వాదించాలనీ, రాబోయే తరాలకు భద్రంగా అందజేయాలనీ ఎవరనుకుంటున్నారు? ఇందుకుగాను ప్రభుత్వ విభాగాలూ, ఔత్సాహిక చరిత్రకారులూ, పురజనులూ ఏమి చెయ్యాలి? …” ఇటువంటి ఆలోచనలు రేకెత్తించడమే ఈ పుస్తకం లక్ష్యమని స్పష్టంగానే చెప్పుకున్నారు.

ఈ లక్ష్యం పుస్తక నిర్మాణంలో ప్రతిచోటా వ్యక్తమవుతుంది. ఉదాహరణకు తొట్లకొండను పరిచయం చేసే రెండో అధ్యాయం కేవలం తొట్లకొండ నిర్మాణాల భౌతిక పట్టిక కాదు. దాంట్లో రచయిత కొండ కింది గ్రామపు మత్స్యకారులతో, గ్రామీణులతో జరిపిన సంభాషణలుంటాయి, తన ప్రయాణ బడలిక వివరాలుంటాయి. ప్రకృతి సౌందర్య వర్ణన ఉంటుంది. బృహత్ శిలా యుగం నుంచి సాగుతూ వచ్చి బౌద్ధంలోకి ప్రవేశించిన మృతుల సంస్మరణ చిహ్న నిర్మాణాల సంప్రదాయం గురించి చర్చ ఉంటుంది. బుద్ధుడికీ ఆనందుడికీ మధ్య జరిగిన చివరి సంభాషణ, బుద్ధుడి బోధనలు ఉంటాయి. వారసులను నియమించడం గురించి బుద్ధుడి అవగాహన ఉంటుంది. అక్కడి నుంచి స్థూప నిర్మాణాల సంప్రదాయం ఎలా మొదలయిందో, దేశంలో, ఉపఖండంలో బౌద్ధ స్థూపాలు ఎక్కడెక్కడ దొరికాయో వివరణ ఉంటుంది. ఆసక్తిని నిలిపి ఉంచుతూ, కొత్త కుతూహలాన్ని రేకెత్తిస్తూ, అదే సమయంలో బహు మార్గాలలో ఆలోచనను నడిపిస్తూ, అధ్యాయం ముగిసేటప్పటికి చదువరి అవగాహనను ఉన్నతీకరించే అద్భుతమైన రచనా శిల్పం, వివరణా నైపుణ్యం ఇది.

సంఘం అనే మూడో అధ్యాయమూ అంతే. విశాఖపట్నానికి వచ్చే మిత్రులకు తొట్లకొండను చూపడం తనకు ఆనవాయితీగా మారిందనే వ్యక్తిగత విశేషంతో ప్రారంభించి, ఆ ప్రదేశాలు గురైన విస్మరణనూ, నిర్లక్ష్యాన్నీ ప్రస్తావించి, రెండువేల ఏళ్ల కింద అక్కడ విలసిల్లిన భిక్షువుల సంఘ జీవిత వివరణ దగ్గరికి తీసుకుపోతారు. మళ్లీ అందులోనూ గతానికీ వర్తమానానికీ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ప్రస్తావనవశాత్తూ అన్నట్టుగా బౌద్ధ ధర్మ విశేషాలు, తథాగతుడి జీవిత ఘటనలు, బోధనలు కూడా వస్తాయి. స్త్రీలను సంఘంలో చేర్చుకోవడం విషయంలో జరిగిన చర్చ, భిన్న వాదనల వివరణ, సంఘంలో అన్ని కులాల, వర్గాల వారినీ చేర్చుకోవడం, సంఘ క్రమశిక్షణ గురించి చర్చ కూడా వస్తాయి. ఆ సంఘ నిర్మాణానికీ, మూలవాసి, స్థానిక గణరాజ్యాల మౌలిక స్వభావానికీ అభేదం గురించి మౌలికమైన ఆలోచనలను ప్రేరేపించే చర్చ కూడా వస్తుంది.

తర్వాతి అధ్యాయమైన ఆరామం, ఆ ప్రాచీన నిర్మాణ పద్ధతులనూ, ఆధునిక నిర్మాణ పద్ధతులనూ పోల్చి చూస్తుంది. బౌద్ధ విద్యా సంస్థల గురించి చర్చించి, ఆధునిక విద్యతో పోలుస్తుంది.

చివరి రెండు అధ్యాయాలూ చాల లోతయిన పరిశీలన, విశ్లేషణతో విస్తారమైన అంశాలను చర్చకు పెడతాయి. ఈ రెండు అధ్యాయాలూ చరిత్ర పట్ల, సమాజం పట్ల, సమాజ భవిష్యత్తు పట్ల, మన సమాజానికి భూమిక అయిన బహుళత్వం పట్లా నెనరు ఉన్న ప్రతి ఒక్కరూ నిశితంగా చదవవలసినవి. 

మరొక మూడు నాలుగు అంశాలు కూడా ఈ పుస్తకంలో భాగమైతే బాగుండునని, ఈ పుస్తకం విలువ ఇంకా పెరిగేదని నాకనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం బౌద్ధ స్థలాల్లో మూడో వంతు ఈ ఉత్తరాంధ్ర (తూర్పు కనుమల) ప్రాంతంలోనే ఉండడం వెనుక కళింగ యుద్ధం పాత్ర, అశోకుడి పాత్ర గురించి మరి కాస్త వివరంగా ఉంటే బాగుండేది. అది ప్రస్తావన వశాత్తూ వచ్చింది గాని, అంత మాత్రమే కాక, ఆ నేపథ్యంలో బౌద్ధం విజేత మతంగా, అప్పటికి ఏ వ్యవస్థీకృత మతాచారాలూ లేని ఆదివాసీ జీవితం లోకి చొచ్చుకు వచ్చిందా చర్చించవలసే ఉంది. అలాగే బౌద్ధం గురించిన చర్చలో బౌద్ధంలోకి ఎంతో కొంత ఇతర మతాచారాల చొరబాటుకు మార్గం సుగమం చేసిన నాగార్జునుడి గురించీ, “మహాయానం” గురించీ, మొత్తంగా బౌద్ధాన్ని ధ్వంసం చేయడానికి బ్రాహ్మణ్యం చేసిన కుటిల యత్నాల గురించీ కూడా ఉంటే బాగుండేదని నాకనిపించింది.   

మొత్తంగా పుస్తకం కలిగించే సంతృప్తి ముందర ఈ అసంతృప్తులు చాలా చిన్నవి. ‘తథాగతుని అడుగుజాడలు’ తప్పకుండా చదవవలసిందిగా మిత్రులందరినీ కోరుతున్నాను.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.