చిత్రం-30

-గణేశ్వరరావు 

ఇది పాల్ గాగెన్ వేసిన చిత్రం. పేరు : ‘ఇవాళ మేం మార్కెట్ కి వెళ్ళం!’. పాల్, విన్సెంట్ వాంగో మిత్రుడు, అతనిలాగే తన జీవితకాలం లో గుర్తింపు పొంద లేదు, తోటి చిత్రకారులను ప్రభావితం చేసాడు. అయన మరణం తర్వాత, ఒక ఆర్ట్ డీలర్ చొరవ వలన ఆయన వేసిన చిత్రాలు అమ్ముడయాయి, క్రమంగా గుర్తింపు లభించింది. అది అలా ఉంచితే, ఈ చిత్రాన్ని – దాని వెనుక ఉన్న కథ తెలియకపోతే – అర్థం చేసుకోలేము. ఆ వివరాలు ఆసక్తికరంగా ఉండటం వలన – ఈ చిత్రం కూడా అందరూ చూడాల్సిన 1001 చిత్రాల జాబితాలో స్థానం సంపాదించు కోవడం వలన – అవి మీకు ఇక్కడ ఇస్తున్నాను. నిజానికి పాల్ కు సమకాలీన సమాజం యొక్క వాస్తవికతను చిత్రించడం ఏ మాత్రం ఇష్టం లేదు, ఇదొక్కటే అందుకు భిన్నంగా అతను గీసిన చిత్రం. చిత్రానికి పెట్టిన పేరు కొంత సహాయకారిగా ఉంది.
 
పాల్, తాహితిలో కొంత కాలం గడిపాడు, అక్కడ గీసిన చిత్రం ఇది. ఇందులో ఉన్న వారు వేశ్యలు. అప్పటికే – 18వ శతాబ్దం నాటికి – వేశ్యలకు అక్కడి అధికారులు ‘హెల్త్ సర్టిఫికెట్స్’ ఇస్తున్నారు, వాళ్ళ చేతుల్లో ఉన్నవి అవే! టైటిల్ ప్రకారం ఆ రోజు వాళ్ళు తమ ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు, ‘ఫ్లెష్ మార్కెట్’ కు వెళ్ళబోవటం లేదు. ‘తాహితి’ పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉన్నంత కాలం – అదొక ‘స్వర్గం’, కాని ఆ సంస్కృతి చేసిన దాడి ఫలితానికి ఇదొక ఉదాహరణ – పసుపు రంగు దుస్తుల్లో ఉన్న ఆమె చేతిలోని సిగరెట్. వాళ్ళందరూ వరుసగా ఒక బెంచి పైన కూర్చున్నప్పటికీ – ఎవరూ విటుడి కోసం ఎదురు చూడటం లేదు, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. వెనకగా, నేపథ్యంలో జాలరులు కనిపిస్తున్నారు. చిత్రంలో కదలిక ఏదైనా ఉందంటే, అదొక్కటే – జాలరులు చేపలను మోసుకొని పోవటం, ఇదే లేకపోతే చిత్రం – ఘనీభవించిన చిత్రంగా మిగిలేది, ఈజిప్షన్ సమాధుల్లో లో చిత్రాలు అలాగే ఉంటాయి. ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకునే అంశం – ఆ ఐదుగురు ముద్దుగుమ్మలు తమ చేతులను నాట్య భంగిమలలో ప్రదర్శించడం ! నిజానికి వలసరాజ్యాలు నృత్యం ని ప్రోత్సహించవు . కాగా పాల్ కు సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో మోజు, నిజమైన సంస్కృతికి అవి ప్రతీకలని అతని ఉద్దేశం. తన చిత్రంలో తాహితీ వాసుల చర్యను సమర్థిస్తున్నట్లు ఆ స్త్రీలను చిత్రించాడు.
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.