పాలవాసన 

-విజయ మంచెం

అదే వాసన. చాలా పరిచయమైన వాసన. కొన్ని వేల మైళ్ళు దూరంలో, కొన్ని సముద్రాల అవతల, ఇక్కడ ఇలా కమ్మగా…. అమ్మ ప్రేమలా …..మొదటి ముద్దులా …. కార్ పక్కకి పార్క్ చేసి వచ్చి చిన్న పిల్లలా కలతిరిగేసాను చుట్టూ… 

అక్కడకి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్న సేరాని గట్టిగా కౌగలించేసుకున్నాను.  తనలో అయోమయం! తనకి తెలియదు నాలోని సంతోషం హద్దులు దాటిందని! జాతరలో తప్పిపోయిన పిల్లోడు దొరికినపుడు  తల్లిలో పొంగిపొర్లే ఆనందం నాది అని!

“నాకు పది లీటర్ల కావాలి సేరా!” అని అడిగితే ఆశ్చర్యం గా చూసింది నన్ను, పది లీటర్లు  ఏం  చేసుకుంటావు ఒకేసారి అన్నట్టు గా!

అవును మరి ఇన్ని ఏళ్ళు తాగని, చూడని, చిక్కటి పాలు, అప్పుడే పితికిన స్వచ్ఛమైన పాలు ఏమైనా చేసుకుంటాను. 

నవ్వి సరే అని వెళ్ళింది లోపలికి. బయట shack లో అంత స్టాక్ లేదు మరి. నా ఆశ కి సరిపడేంత!

నిండుగా చూడటానికి చక్కగా ఉంటుంది సేరా. ప్యాంటు టీ షర్ట్ మీద సన్నని ఫ్లీస్, పెద్ద పెద్ద మట్టి పట్టిన బూట్లు వేసుకుని, చక్కగా దువ్విన జుట్టు, చెక్కు చెదరని నవ్వుతో అటు ఇటు తిరుగుతూ, పాల కోసం వచ్చిన వాళ్ళని పలకరిస్తూ….. 350 ఎకరాల యజమాని లాగా అస్సలు ఉండదు. 

హార్రీ, సేరా కొడుకు పొలంలో ట్రాక్టర్ నడుపుతున్నాడు. మొత్తం ఒక యాభై ఆవులుండొచ్చు. వసంతకాలపు ఎండని ఆస్వాదిస్తూ ఆ ఎండకి కొత్తగా మొలిచిన గడ్డిని తింటూ హాయిగా తిరుగుతున్నాయి. ఇంకా ఓ అరడజను కుక్కల్ని కూడా పెంచుతున్నారు.  ఆ పక్కనే కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి స్వేచ్ఛగా తిరుగుతూ…

“ఈ కొత్త గడ్డిని తిని ఇచ్చిన పాల నుండి వచ్చే వెన్న చాలా పచ్చగా, రుచిగా ఉంటుంది అంట కదా” 

అన్నాను జాన్ తో. జాన్ సారా వాళ్ళ ఆయన. అవునని నవ్వుతూ తల ఊపి,

“మిమ్మల్ని ఎప్పుడూ చూళ్ళేదు కొత్తగా వచ్చారా “ అని అడిగాడు. 

తనది కూడా భలే అందమైన నవ్వు. తల పైన టోపీ. మట్టి పట్టిన బట్టలు. వీళ్ళు ముగ్గురే పని చేస్తారు అంత పెద్ద ఫార్మ్ లో. పని వాళ్ళు ఎవ్వరూ  కనిపించలేదు.

“ఊరికి పాత వాళ్ళమే కానీ కొత్తగా తెలుసుకున్నాం మీ గురించి. ఇలా పితికిన వెంటనే, పచ్చి పాలు ఇక్కడ  దొరుకుతాయని మాకు ఇప్పటివరకు తెలీదు. చాలా ఆనందం గా వుంది” అన్నాను కళ్ళు పెద్దవి చేసుకుని చిన్న పిల్లలా.

వెల్కమ్ టు ది ఫ్యామిలీ థెన్ అని షాక్ హ్యాండ్ ఇచ్చాడు జాన్.

*  *  *

నా చిన్నప్పుడు మా ఊరులో  మా సొంత నాయనమ్మ వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డు మీద ఉండేది. మా పెద్ద నాన్నమ్మ అంటే నాన్నమ్మ తోడికోడలు అన్నమాట. వాళ్ళ ఇల్లు “ఆఈధి” లో ఉండేది.  ఆఈధి అని ఎందుకు అంటారు  అంటే, ఈ వీధికి అది ఆ ఈధే  కదా అందుకన్నమాట.

తాత వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలు అంతా ఆఈధిలో ఉంటారు. మా సొంత నానమ్మ మాత్రం పట్టణం నుండి వచ్చింది కదా !  నేను చచ్చినా  ఆ వీధిలో ఉండను పేడ కంపు బాబోయ్!  అని కాపురం మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇంటికి, మా తాత తో  గొడవపడి మార్పించేసింది అంట. 

నేను మాత్రం మా ఊరికి ఆఈధి కి వెళ్ళడానికి మాత్రమే వెళ్లే దాన్ని.  ఆఈధి ఊరికి  కొంచెం దూరంగా  కాల్వ గట్టు మీద ఉంటుంది.  అక్కడ వుండే గేదెలన్నా అవి వేసే పేడతో నాకోసం భోగి పిడకలు చేసే మనుషులన్నా  ఎందుకో గొప్ప అభిమానం.  ఆవీధి లో నడిచి వెళ్తుంటే అందరూ ఆపి గుర్తుపట్టి  మాటాడే ప్రతి పలకరింపు వాన పడినప్పుడు వచ్చే మట్టి వాసనలా ఉంటుంది.  

అక్కడ కాల్వలో దూకి ఈతకొట్టే పిల్లలందర్ని రోజంతా చూస్తూ గడిపేయడం నాకు మహా సరదా. ఆ వీధి లో అందరికి  పాడి ఉండేది. మా పెద్ద నాన్నమ్మ ఇంటి దొడ్లో రెండు గేదెలు, వాటి దూడలు. ఆ చిక్కటి పాలు పితికి పెరుగు తోడేసి, ఆ కమ్మటి పెరుగు ని మజ్జిగగా చిలుకుతున్నపుడు ఎగిరిపడే బుడగలు, అందులో నుండి వచ్చే వెన్న, దాంతో ఎర్రగా కాసిన నెయ్యి, ఆ నేతితో చేసే పిండి వంటలు. అబ్బా! మళ్ళీ ఎప్పుడూ  అంటే ఇప్పటి వరకూ నేను అలాంటి అద్భుతం చూళ్ళేదు. ఆ వయసులో అది నాకో అద్భుతమే మరి.  

అన్నంలో గడ్డ పెరుగు కలుపుకుని పొలంలో నుండి తెచ్చి బియ్యం డబ్బా లో ముగ్గేసిన అరటిపండు నంచుకుని తిని, చివరకి వేళ్ళకి అంటిన మీగడని నాకినప్పుడు  ఆ కమ్మదనం కడుపుకి చల్లగా తియ్యగా…హాయిగా ఎంత బాగుంటుంది!

ఇంటికొచ్చే ప్రతి ఒక్కళ్లకి గలాసు నిండా మజ్జిగ. ఆ మజ్జిగే  కదా కుండ నిండా నింపి అందులో అల్లం కర్వేపాకు కలిపి ఇంటి అరుగు మీద పెడితే ఎండకి మాడిపోయి ఆ దారిలో వచ్చే పోయే వాళ్లంతా ఆవురావురాంటూ చల్లగా గొంతు తడుపుకునేవాళ్ళు. పెదనాన్నమ్మ మనసు చాలా గొప్పది, పెద్దది. 

ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లినా అదే కమ్మని పాడి వాసన. నాన్నమ్మ చీరలో,గిన్నెల్లో, గోడల్లో ఏది ముట్టుకున్నా అదే కమ్మని వాసన. చాలా బాగా నచ్చే వాసన. చిన్న పిల్లాడు తల్లిపాలు తాగినప్పుడు ఆ పిల్లాడినుండే వచ్చే వాసన లాగా…..బోసి గా… స్వచ్ఛంగా …

ఒకసారి కాల్వ గట్టుమీద ఆడుకుంటూ  జారి అదే కాల్వ లో పడిపోతే ఆ గట్టుమీద బట్టలుతుక్కుంటున్న  ఒకామె నన్ను బయటకి తీసి పెదనానమ్మ కి అప్పగించింది. 

పాపం తను ఏడుస్తూ,  నా పొడుగాటి రెండు జడలు విప్పి ఆరబెట్టి, ఒళ్ళు తుడిచి, వేడి వేడి పాలు గలాసు నిండా ఇచ్చింది. మీ నాన్నమ్మ  కి తెల్సింది అంటే ఇంక నిన్ను ఇక్కడికి పంపదే తల్లీ! అని ఒకటే కంగారు. అదృష్టం కొద్దీ ఎవరో చూసారు లేకపోతే అంటూ కన్నీళ్లు…

పాలు తాగి, మూతి తుడుచుకొని, నేను చెప్పనులే మా నాన్నమ్మకి  అని తనని కౌగలించుకున్నప్పుడు  ఆ కౌగిలి లో వెచ్చదనంతో పాటూ వచ్చిన కమ్మని వాసన ఇంకా గుర్తే నాకు..

పాశ్చరైజేషన్ కల్చర్ వచ్చాక మళ్ళీ ఎప్పుడు పాలు ముట్టబుద్ధి కాలేదు. కాఫీ టీలు మానేసి చాలా ఏళ్ళు అయింది. పెరుగు డబ్బాలు కొనడం కూడా మానేశాను ఎక్కడ ఆ మీగడ కనపడదే? పాలు కాస్తే తొరక కట్టదే ?

దేశాలు పట్టి పోయాక, మళ్ళీ ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇప్పుడు నాన్నమ్మ లేదు ఆ పాడి లేదు. మూడేళ్ళ క్రితం ఊరెళ్తే పెదనానమ్మ మనవడు అంటే నాకు తమ్ముడి వరస వాడొక్కడే  ఆఈధిలో వున్నాడు. మిగతా వాళ్లంతా లాభసాటిగా లేదు అని  ఊళ్ళు వదిలి పట్నానికి వలసపోయారు.

ఒరేయ్ అక్క, బావ వచ్చారు. కలర్ కాయలో రెండు ఆట్రా రా!  అని ఓ పిల్లాడిని పంపబోతే, వాడిని పక్కకి తీసుకెళ్లి ఒరేయ్ మజ్జిగ తాగుదామని వస్తే ఏంట్రా కలర్ కాయ? అంటే వాడు తల గోక్కోని, అంటే బావ మొదటిసారి ఫారిన్ నుండి వచ్చాడు కదా అని నసిగాడు . వాడు తర్వాత మాకు ఇచ్చిన మజ్జిగలో ఆ రుచి లేదు, ఆ కమ్మదనం లేదు. ఆ తర్వాత రెండేళ్లకు వాడు కూడా పట్నానికి వలస. 

 *    *    *

పాల సీసాలు కార్ లో పెట్టి “జాన్ ఎలా పే చెయ్యాలి? కాష్ ఆర్ కార్డ్ “ అని అడిగాను.

“అక్కడ ఆ పాల డబ్బాలో వేసేయ్ డబ్బులు ఉంటే లేదా ఆన్లైన్ అయినా పర్లేదు ”అన్నాడు 

చూస్తె అక్కడ ఒక పెద్ద పాల క్యాన్  దాని మీద “ఆనేస్టీ బాక్స్” అని రాసి ఉంది ప్రశ్నార్ధకం గా జాన్ వంక చూసాను అర్ధం కానట్టు.

“మేము ముగ్గురం రోజంతా  పనిలో బిజీగా  ఉంటాం కదా. ఇంక ఇక్కడ మనిషిని పెట్టలేదు. మీకు ఎన్ని పాలు కావాలో తీసుకుని డబ్బులు అందులో వేయడమే”  అని జాన్ చెప్తుంటే, నాకు నోట మాట రాలేదు.

ప్రతి పెన్నీ లెక్కేసుకునే ఈ దేశం లో ఇంత పెద్ద పాల ఫార్మ్ లో కేవలం మనుషుల మీద నమ్మకం తో వ్యాపారం ఎలా చేస్తున్నారు వీళ్ళు? అర్ధం కావట్లేదు. అందరూ ఖచ్చితంగా అందులో సరిగ్గా డబ్బులు వేస్తారా? ఎవరూ మోసం చేయరా? 

అదే మాట పైకి అనేసాను.

“ఇంత దూరం వచ్చి పాలు తీసుకుని డబ్బులు వేయకుండా వెళ్లారు అంటే అది వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు లేకపోయి ఉండాలి. ఆ పాలు వాళ్ళ పిల్లల ఆకలిని తీరుస్తాయి అంటే మాకు ఇంక అంతకన్నా ఏం కావాలి” అన్నాడు జాన్. 

“పైగా మాకు వచ్చే ఆదాయం ఎక్కువ మటుకు కాడ్బరీ కంపెనీ వాళ్ళు మా నుండి కొనే పాల నుండి వస్తుంది.

ఈ shack ఇదిగో మీ లాంటి వాళ్ళందరికోసం నడుపుతున్నాం అంతే”.

తెగ నచ్చేసారు నాకు సేరా  అండ్ జాన్.  ఇంక అప్పటినుండి వాళ్ళు నిజంగానే ఫ్యామిలీ అయిపోయారు.

“నేను ఎకౌంటు లో వేసేస్తాను జాన్” అని ఎకౌంటు డీటెయిల్స్ తీసుకున్నాను. 

ఇంక అప్పటినుండి ప్రతివారం అరగంట ప్రయాణం చేసి ఫార్మ్ కి వెళ్లడం రొటీన్ అయిపోయింది. ముందు పాలు తీసుకుని ఇంటికెళ్లాక, ఖాళీ అయ్యాక డబ్బులు వేస్తాను. ఒక్కోసారి మర్చిపోయి వారం వరకు వేయకపోయినా ఎపుడూ వాళ్ళు అడగలేదు. మనమే గుర్తు పెట్టుకుని వెయ్యాలి అంతే. వాళ్ళు అడగరు !

అక్టోబర్ నెలలో వాళ్ళ పొలంలో యాపిల్ చెట్ల నుండి రాలిన పళ్లన్నీ అక్కడే shack లో పెట్టి ఉచితంగా కావాల్సినన్ని  తీసుకెళ్లమంటారు.

క్రిస్మస్ వస్తే గిఫ్ట్ గా ఒక పెద్ద బట్టర్ బ్లాక్ ఫార్మ్ కి వచ్చే వాళ్ళందరికీ ఇస్తారు. పిల్లలు ఫార్మ్ చూడాలంటున్నారు అంటే ట్రాక్టర్ మీద కూర్చోపెట్టి మొత్తం సొంత మనవలని తిప్పినట్టు తిప్పి చూపిస్తారు.

ఇండియా వెళ్తున్నాం మా కుక్కని మీ దగ్గర వదిలి వెళ్ళొచ్చా అంటే దాందేముంది తప్పకుండా మా కుక్కలతో పాటు ఇది కూడా అని డబ్బులు తీసుకోకుండా  దగ్గర ఉంచుకుంటారు. కనీసం దాని తిండి కైనా డబ్బులు తీసుకోండి అంటే పర్లేదు వద్దు అంటారు.

తిరిగి ఏమి ఆశించని గొప్ప ప్రేమ వాళ్ళది. మా పెదనాన్నమ్మ తర్వాత మళ్ళీ అదే ప్రేమ ఇక్కడ ఇలా ఈ దేశంలో….

ఇన్నాళ్లు నాలో పూడ్చలేని లోటు ని ఇక్కడ సెరా జాన్ లు తీరుస్తున్నారు సొంత వాళ్ళలా… ఆత్మీయుల్లా…

****

Please follow and like us:

2 thoughts on “పాలవాసన (కథ)”

  1. విజయ మంచె గారూ,

    మీ కథ చదవగానే నా జ్ఞాపకాలు ఒక యాభై-అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. విజయనగరంలో లంకవీధిలో గురమ్మ అని ఒకామె ఉండేది. అంతా ఆమెని పాలగురమ్మ అనేవారు. ఆ వీధిలో ఎక్కువగా ఇలా పాల వర్తకం చేసుకునే వారు ఉండే వారు. దారికి అడ్డంగా గేదెలు పడుక్కుని వీధంతా మీరు రాసిన అచ్చం ‘ఆఈధి ‘లా ఉండేది.

    ఇప్పుడు మహానగరాల్లో జీవితానికి అలవాటు పడ్డాక, ఆ పచ్చిపాల వాసనలన్నీ కేవలం జ్ఞాపకాల్లోనే.

    హృదయపూర్వక అభినందనలు.
    NS మూర్తి

Leave a Reply

Your email address will not be published.