ఎంతైనా మగాడు మరి

-కృపాకర్ పోతుల

 “మాధురిగారేనా”

 “అవునండీ మాధురినే మాట్లడుతున్నాను. మీరు…?”

 “మధూ నేనూ… చైతన్యని. గుర్తుపట్టేవా?”

      ‘చైతన్య’ అన్న మాట విన్న మాధురి కొన్ని క్షణాలపాటూ మాట్లాడకుండా  మౌనంగా ఉండిపోయింది.

     ‘మధూఅన్న చైతన్య పిలుపు మళ్ళీ  చెవిని పడ్డాక…

     “చైతన్య!!…అంటే…ఆంధ్రా యూనివర్సిటీ … ఎమ్మే ఇంగ్లీష్ …?” అంటూ ఆగిపోయింది వాక్యం పూర్తిచెయ్యకుండా. 

     “అవును మధూ. ద సేమ్ ఓల్డ్ చైతన్య. యువర్ చైతన్య.  మరచిపోయుంటావనుకున్నాను మధూ. గుర్తుంచుకున్నందుకు  చాలా థేంక్స్.  ఇరవైఏళ్ళైపోలేదూ మనం కలుసుకొని? ప్రశ్నించాడు చైతన్య గొంతునిండా ఆర్ద్రత నింపుకొని. 

     “ఇరవైఏళ్ళా! అప్పుడే ఇరవైఏళ్ళైపోయిందా!! హౌ టైం ఫ్లైస్!!! సరే గాని ఏంటి ఇన్నేళ్ళ తరవాత, ఉరుమూ మెరుపూ లేని పిడుగులా…ఇంత సడన్ గాఇంతకూ నా ఫోన్ నెంబరెలా తెలిసింది నీకు” ప్రశ్నించింది మాధురి. 

     “ఏదో చిన్న పనిమీద వచ్చేనులే. నీ ఫోన్ నెంబర్ ఎలా సంపాదించానంటావా? మనసుంటే మార్గం ఉండదా మధూ?” తిరిగి ప్రశ్నించాడు గోముగా. “వచ్చిన పనైపోయింది.  రేపుదయం ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళేముందు నిన్నొకసారి కలవాలని అనుకుంటున్నాను.  ఈరోజు నీకు  వీలౌతుందా మధూ?” అడిగాడు గొంతునిండా మార్దవం నింపుకొని. 

     మాధురి సమాధానం చెప్పలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయింది.  

     “మాట్లాడవేం మధూ? కెన్ వియ్ మీట్ ఫర్ లంచ్ టుడే?” అడిగాడు చైతన్య కొన్ని క్షణాల తరవాత,  నిశ్శబ్దాన్ని భంగంచేస్తూ. 

     ‘అదంత అవసరమా ఇప్పుడు ప్రశ్నించింది మాధురి, మృదువుగానే అయినా,  సూటిగా.

     “అసలు నేనిక్కడికి  వచ్చిందే నిన్ను కలవొచ్చన్న ఆశతో. లేకపోతే నేను రావాల్సిన అవసరమే లేదు.  నాకింద పనిచేసే వాడెవడ్నో ఒకడ్ని డెప్యూట్ చేస్తే సరిపోయేది” సమాధానం ఇచ్చాడు చైతన్య దర్పంగా.  

     “కొంచెం కష్టమే చైతన్యా. ఈరోజింకా రెండో తారీఖే కదా. బేంకులో చాలా బిజీగా ఉంటుంది. ఏదైనా ప్రోబ్లెం వస్తే, చీఫ్ మేనేజర్ని, నేను లేకపోతే ఇబ్బందౌతుంది.” చెప్పింది నిర్లక్ష్యంగా,  చీఫ్ మేనేజర్ని అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. 

     “లంచికి వీలుకాకపోతే, కనీసం డిన్నరుకైనా కలుద్దాం మధూ. కాదనకు ప్లీజ్” ప్రాదేయపడ్డాడు చైతన్య. అతనలా బతిమాలుతుంటే జాలేసింది  మాధురికి.  అయినా సరే బింకం సడలనీయకుండా…

     “లంచ్ ఔటాఫ్ క్వశ్చిన్లే గాని,  డిన్నర్ అంటున్నావు కదా… లెట్ మీ సీ. మ్మ్… ఓకే…డిన్నర్ కి కలవొచ్చు.  ఎక్కడ కలుద్దాం?” అడిగింది మాధురి, చైతన్య మాట కాదనలేక మత్రమే ఒప్పుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తూ. 

     “ఓహ్!!! థాంక్యూ మధూ, థాంక్యూ సో మచ్.” అన్నాడు చైతన్య ఆనందంతో ఉప్పొంగిపోతూ. “అప్సరా హోటల్లో కలుద్దాం మధూ, మన ఫేవరిట్ హాంట్ ఆ రోజుల్లో. జస్ట్ ఫర్ ద ఓల్డ్ టైమ్స్ సేక్. ఏమంటావ్?” అడిగాడు హుషారుగా.    

    “అప్సరానా? ఇప్పుడు అప్సరాహొటల్ ఎక్కడుంది గాని నువ్వెక్కడ దిగావ్?” ప్రశ్నించింది మాధురి.

     “నోవాటెల్” చెప్తున్నప్పుడు చైతన్య గొంతునిండా కావలసినంత  గర్వపు జీర.

     “అయితే ఇంకేం!  ఎనిమిది గంటలకి అక్కడే రెస్టారెంట్లో కలవచ్చుగా” అన్నది మాధురి.

     “సరే మధూ. ఏజ్ యూ ప్లీజ్.  ఎదురుచూస్తుంటాను నీకోసం. లేట్ చెయ్యకు.  వీలైతే కాస్త ముందు రావడానికె ప్రయత్నించు. ప్లీజ్” అన్నాడు చైతన్య క్షణం ఆలస్యం అయినా సరే భరించలేని వాడిలా. 

     “అన్నట్టు, మా హజ్బెండ్ ఊళ్ళో లేరు. బాంబే వెళ్ళారు ఏదో బిజినెస్ పనిమీద.  అయినా పరవాలేదు. ఓల్డ్ ఫ్రెండ్ని  కలవడానికి  వెళ్తున్నానంటే కాదనరు. ఆయనకో మాట చెప్పి…ఎనిమిదికల్లా వస్తానక్కడికి. ఉంటామరి.” అని అవసరం లేకపోయినా తన భర్త గురించిన ప్రస్తావన ఒకసారి తీసుకొచ్చి మరీ, ఫోన్ కట్ చేసింది మాధురి.

     తరవాత నిలబడడానికి కూడా శక్తి లేనిదానిలా పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. ఏవో ఆలోచనల్లోకి జారిపోయి, శూన్యంలోకి చూస్తూ, నిశ్చలంగా కూర్చుండిపోయింది చాలాసేపు. ఆలోచనల్లోనుండి బయటపడి, టైం చూసింది. అప్పటికే పదకొండు దాటిపోయింది.  బేంకుకి వెళ్ళాలని అనిపించలేదు. రావట్లేదని ఫోన్ చేసి చెప్పేసి, నెమ్మదిగా బెడ్రూంలోకి దారితీసి, మంచంమీద వాలిపోయింది. ఇక  అక్కడే ఉండిపోయింది సాయంత్రం వరకూ. 

*****

     “మనం యూనివర్సిటీలో ఉన్నప్పటిలాగానే ఉన్నావ్ మధూ. అస్సలు మారనేలేదు. అఫ్కోర్స్…కొంచెం ఒళ్ళు చేసావనుకో. అందుకే ఇంకా అందంగా ఉన్నావ్” అన్నాడు చైతన్య తన ఎదురుగా కూర్చున్న మాధురి కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ. సమాధానం చెప్పకుండా,   చిన్నగా నవ్వి ఊరుకుంది మాధురి. 

     “ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావ్?” అడిగాడు.

     “ముందు నీ సంగతులు చెప్పు. చూస్తే బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు.  ఏ ఊళ్ళో ఉంటున్నావు? నీ వైఫ్…తన పేరేంటివర్క్ చేస్తారా ఆవిడ? ఎంత మంది పిల్లలు? వాళ్ళేం చేస్తున్నారు?” ప్రశ్నల వర్షం కురిపించింది మాధురి.

     ప్రశ్నలు విన్న చైతన్య ఉండేలు దెబ్బ తిన్న పక్షిలా విలవిలలాడాడు కొన్ని క్షణాలపాటు. తరవాత,  జాలితో కూడిన  బాధాతప్త  దృక్కులు సారించాడు  మాధురి వేపు.  కళ్ళు రెండూ గట్టిగా మూసుకొని, తల అటూఇటూ రెండుసార్లు విదిలించాడు, తనను అమితమైన అశాంతికి గురిచేస్తున్న భయంకరమైన జ్ఞాపకాలను తన మస్తిష్కంనుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నవాడిలా.  తరవాత నెమ్మదిగా కళ్ళు తెరిచి,

     “ఈ టైంలో కూడా ఆ విషయాలెందుకులే మధూ.  ఇరవై సంవత్సరాలుగా చస్తూ బతుకుతున్నాను ప్రతీరోజూ! నిన్ను తలంచుకోని క్షణం లేదంటే నమ్ముతావా? నిన్ను దూరం చేసుకొని ఎంత కోల్పోయానో రియలైజ్ అయ్యేసరికే…చేతులు పూర్తిగా కాలిపోయాయి” అన్నాడు విషాదంగా.

     “అదేంటి చైతన్యా. అప్పుడా అమ్మాయిని కోరి మరీ చేసుకున్నావుగా, మావఁగారు మంచి పొజిషన్లో ఉన్నారనీ, నీకు కావలసిన అండదండలు అన్నివిధాలా అందిస్తారనీ! కట్నం కూడా బాగానే ముట్టజెప్పినట్టున్నారేమో!!” అడిగింది మాధురి కాస్త  వ్యంగ్యంగా.

     “అదే మధూ, అదే నేను చేసిన పెద్ద బ్లండర్. డబ్బుకి కక్కుర్తిపడి, దేవతలాంటి నిన్ను కాలదన్నుకొని, పెద్ద గుదిబండను తగిలించుకున్నాను మెడకి. జీవితంలో సుఖశాంతులకి దూరమయ్యాను.   అలాంటి వెధవపని చేసినందుకు నన్ను నేను శపించుకోని రోజు లేదంటే నమ్ముతావా” చెప్పాడు గిల్టీగా నేలచూపులు చూస్తూ. “నా సంగతి సరే. స్వయంకృతం.  ఈ జీవితం ఇలా తెల్లారాల్సిందే. నువ్వైనా జీవితంలో ఆనందంగా ఉండాలన్నదే నాకున్న ఏకైక కోరిక మధూ? టెల్ మీ, హౌ ఈజ్ యువర్ లైఫ్మీ హబ్బీ మంచివారేనా? నిన్ను బాగా చూసుకుంటారా? పిల్లలు…?” ప్రశ్నలు గుప్పించాడు  లేని హుషారు తెచ్చుకుంటూ.

     “భగవంతుని దయవల్ల నాకు సమస్యలంటూ ఏమీ లేవు చైతన్యా.  మావారు నిజంగా దేవుడనుకో. నిజంగా నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు.  మాకిద్దరమ్మాయిలు. పెద్దది ఇక్కడే మెడిసిన్ చేస్తోంది. రెండోది ఇంటర్మీడియెట్ చదువుతోంది. తోచక, ఏదో కాలక్షేపం కొరకు ఉద్యోగం చేస్తున్నానే గాని, నాకసలు చెయ్యాల్సిన అవసరమే లేదు.” చెప్పింది మెరుస్తున్న కళ్ళతో.

     “అదృష్టవంతురాలివి.” అన్నాడు చైతన్య నీరసంగా. “ఎప్పుడైనా నీ చైతూ జ్ఞాపకం వస్తాడా మధూ” అడిగాడు  దీనంగా.

     “నిజం చెప్పనా? నిన్ను గుర్తుచేసుకునేటంత సమయం, అవసరం,  తీరికా మూడూ లేవు చైతన్యా నాకు” అంది మాధురి తమాషాగా తల ఎగరేస్తూ.

     మాధురివేపు గిలగిలలాడుతూ చూసాడు చైతన్య, తన గుండెల మీద నెమ్మదిగా అరచేత్తో రాసుకుంటూ. ఏదో చెప్పాలని నోరు తెరిచాడుగాని, ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.  ఇంతలో బేరర్ ఫూడ్ తీసుకురావడంతో,  తెచ్చిన తిండికి న్యాయం చెయ్యడంలో నిమగ్నమై, మౌనం వహించేడు.

     మాధురి మాత్రం వసపిట్టలా వాగుతూనేఉంది తింటున్నంతసేపూ. ఆ కబుర్లన్నీ తన భర్త గొప్పదనం గురించీ, మంచితనం గురించీ; పిల్లలిద్దరూ ఎంత తెలివైనవారో, బుద్దిమంతులో, అందగత్తెలో… వాటి గురించే. కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తినడం పూర్తి చేసారిద్దరూ.  బిల్ పే చేయడానికి చైతన్య హాఫ్ హార్టెడ్ ఎటెమ్ట్ఒకటి, చిన్నది,  చేసాడు గాని, “మా ఊరొచ్చి నువ్వు పే చెయ్యడమేంటి అసహ్యంగా” అని చెప్పి మాధురి అందుకు ఒప్పుకోలేదు.  తనే పే చేసింది. ఆ తరవాత  టైం చూసుకున్న మాధురి ఒక్కసారిగా తుళ్ళిపడింది.  

     “మై గాడ్ చైతన్యా, పదైపొయింది. పిల్లలిద్దరే ఉన్నారు ఇంట్లో. అదీగాక, ఆయన ఊర్లో లేనప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేసే టైం కూడా ఇది.  నేనిక వెళ్తాను. ఈసారి వచ్చినప్పుడు నీ మిసెస్నీ, పిల్లల్నీ కూడా తప్పకుండా తీసుకొని రా.” అంది వెళ్ళడానికి ఉద్యుక్తురాలౌతూ.

     “అప్పుడే వెళ్ళిపోతావా మధూ. రూంకి వచ్చి కాసేపు స్పెండ్ చేస్తావేమో అనుకున్నాను” అన్నాడు మాధురి వేపు అర్దవంతంగా చూస్తూ.

     ఒక్క క్షణం చైతన్య వేపు నిశ్చలంగా చూసింది మాధురి.  “నేనలా అనుకోలేదులే చైతన్యా. వెళ్దామనే అనుకున్నాను. గుడ్ నైట్”  అని చెప్పి, చిన్న నవ్వొకటి వేళాకోళంగా నవ్వి వడివడిగా నిష్క్రమించింది అక్కడ్నుండి.

     వెళ్తున్న మాధురివేపు సాలోచనగా చూస్తూ, పక్కనే ఉన్న తన మొబైల్  చేతిలోకి తీసుకొని, తన గుదిబండకు రింగ్ చేసాడు చైతన్య.

     “హాయ్ డార్లింగ్. ఎలా ఉన్నావు రా? వచ్చిన పని, ఏదో అయ్యిందంటే అయ్యింది గాని, నేననుకున్నట్టుగా కాలేదురా. అయాం రిటర్నింగ్ టుమారో.  మార్నింగ్ ఏడుగంటలకే ఫ్లైట్. అన్నట్టు…నువ్వు  లేకుండా, ఒంటరిగా ప్రయాణం చేసి దశాబ్దకాలం దాటిపోలేదూ! నిజంగా ఎంత బోరు కొట్టిందో తెలుసా.  నువ్వు పక్కన లేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ రెండ్రోజుల్లోనూ బాగా బోధపడిందిరా బంగారం.  ఇంకెప్పుడూ ఇలాంటి దండగమారి కేంపులు పెట్టుకోకూడదని నీమీద ఒట్టేసుకున్నాను. లవ్యూ సో మచ్ డియరీ. సీ యూ టుమారో. మ్చ్… మ్చ్…” అంటూ మొబైల్లోకి అరడజను ముద్దులు పారేసి మరీ, రెస్టారెంట్లోనుండి బయటకు నడిచాడు చైతన్య…ఎంతైనా… మగాడు కదా మరి!!!!

*****

Please follow and like us:

2 thoughts on “ఎంతైనా మగాడు మరి (కథ)”

  1. బావుందండి కథ.
    కొసమెరుపేమిటంటే – అతని దిమ్మ తిరిగే జవాబు చెప్పించారు ఆమె చేత.
    అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.