తప్పని తరింపు

-చందలూరి నారాయణరావు

రెపరెపలాడే చూపులే
ఎగిసే కెరటాలు.
మిణుకుమనే మాటలే
దుమికే గుర్రాలు.

అరిగిన ఎముకలనే
ఆసరాగా బతికే ఆశ
పాదాలను ములుకర్రతో అదిలించి
ఇరుకు దారిలోనూ ఉరుకుపట్టిస్తుంది.

ప్రకృతి చట్టానికి లోబడే
వయసు వదర ముప్పులో చిక్కినా…
లోపలి మనసులో
గుండెల్లో కొండలు పేలినా
దారి నడకల్ని కూల్చినా

కొట్టుకుపోని జీవసంబంధానికి
కొనఊపిరికి
మిణుకుమిణుకులను ముడేసి
ఆఖరి క్షణాలకు
రెపరెపలను పెనేసి…

ఉక్కుబంధంతో
తెగినచోట తపన తాపడంతో
తనువు తహతహలాడటం
ప్రతి ఒక్కరి కథలో
తప్పని తరింపేమో!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.