పేండమిక్ అమ్మ

-రాజేశ్వరి దివాకర్ల

సూర్యుని తూరుపు కిటికీ 

తలుపుల వారకు 

పరచుకున్న నీడలన్నింటిని 

గరిక చీపురు కట్టతో చిమ్మేసి 

జన వాసాల వీధులను శుభ్రం చేసేందుకు 

విస విసల చీరకుచ్చిళ్ళను 

నడుం చుట్టుకు బిగించేసి 

వచ్చేసింది విధులకు  ఏమాత్రం 

తప్పని పుర సేవకి పెద్దమ్మ 

పేండమిక్ అమ్మ. 

ఎరుపు విచ్చిన వెలుగులో 

తెలుపు గౌను గుండె తడిని వత్తుకుంటూ

ఊయలలో పాపని 

ఊరుకో బెట్టమని 

విడువలేక  అమ్మకు అప్పగిస్తూ 

మరి ఏ బిడ్డకు తల్లి ఎడబాటు 

కలుగ కూడదన్న గుబులుతో 

చను బాలను 

చిన్న మూతి సీసా  బిరడాలకు మూసి 

జన సేవలకు కదిలింది 

పెద్ద మనసు పేద పేండమిక్ నర్సమ్మ. 

ఇంట్లో నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. 

మీకోసమే నేను 

చెదరని విశ్వాసంతో 

చౌరస్తాలో నిలుచుని 

కట్టడి చేస్తున్నాను 

అంటూ 

మునుపటి వలె లాఠీ పట్టక 

అట్ట మీద రాసుకున్న కంటి నీటి అక్షరాలతో 

విన్న పాలనుచేసింది 

కటిక ఎండల కు ఎదురు నిలిచిన 

చెమట ఉప్పు పెదవుల 

పేండమిక్ పోలీసమ్మ 

తలుపులు మూసుకున్న నగరం 

గోడకి తాళం చెవులను తీసి 

విచ్చల విడిగా తిరిగే 

జనాలకు 

టీకా రక్షణలున్నా 

వచ్చి వాలే ప్రమాదానికి 

హెచ్చరికలు చేస్తూనే 

సమయ  నిబంధనలను 

పాటిస్తూ దిన వెచ్చపు 

సరకుల చిన్న దుకాణం తెరిచింది

బ్రతుకు తెరువు 

బాధ్యతలకు తప్పని 

పేండమిక్ చిన్నమ్మ ,

మట్టిని తలదాల్చి పుట్టిన తరువు అమ్మ ,

వీవెన లూదక వీచిన చెట్టు అమ్మ, 

తర తరాల జన్మ గాధల 

స్వయంభువు  పాదపం అమ్మ, …..

అనేక ఋతువుల ఆగమనానికి 

గర్భ కోశ పలాశి అమ్మ, 

ప్రతిఫలమును ఆశించదు 

కొమ్మగాలుల ఆమ్ల జనక 

ఆరోగ్య పవన నినాదమే పేండమిక్  అమ్మ …


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.