నడక దారిలో-15

-శీలా సుభద్రా దేవి

 నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.
 
         అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.
 
         ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.
 
           మర్నాడు టిఫిన్లు చేసి అన్నయ్యలు ఇద్దరూ బయటకు వెళ్ళారు.అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని అన్నయ్య గదిలో ఉన్న వీర్రాజు గారికి ఇవ్వటానికి వెళ్ళాను. నాకు మొదటినుంచీ చొచ్చుకు పోయి మాట్లాడే స్వభావం లేకపోవటం వలన మనసులో ఉన్నది పేపర్ మీద పెట్టగలను. మాట మాత్రం గొంతులోంచి పెగల్లేదు. ఎప్పుడూ లేనిది గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకే వినిపిస్తుంది.
 
               నేను మాట్లాడలేదు సరే ఆయనా చాలా సేపు మాట్లాడలేదు. ‘స్త్రీ మనస్తత్వ విశ్లేషణతో ఇన్ని ప్రేమకథలు ఎలా రాసారబ్బా’ అని మనసులోనే అనుకున్నాను. కొన్ని నిముషాల తర్వాత “నువ్వు రాసిన కథలు తీసుకురా చదువుతాను” గోడతో అన్నట్లు అన్నారు.
 
                మాట్లాడకుండా వెళ్ళి తీసుకు వచ్చి ఇచ్చాను. ఎందుకో నాకు అసంతృప్తిగా అనిపించింది. నా మనసు చదివినట్లు ఆయన మళ్ళా ఎందుకనో “తర్వాత చదువుతానులే” అని అవి పక్కన పెట్టి నా ముఖంలోకి చూసి ” నువ్వని తెలిసి భలే ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు మరీ ఇంత చిన్నపిల్లలా ఉంటావనుకోలేదు” అన్నారు.
 
            నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
             “మనం సభా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నువ్వేమంటావు?”
             మాటలతో కాకుండా తల ఊపి “నా చదువు పూర్తయ్యాక” మెల్లగా అన్నాను.         
           
             “పెళ్ళయ్యాక ఇక్కడే ఉండి చదువుకోవచ్చులే. మా అమ్మ సంవత్సరీకాలకు ముందే చేసుకోవాలని  అనుకుంటున్నాను. అందుకే ఏప్రిల్ లోపున చేసుకుందామని. “అంటూ నా ముఖంలోకి చూసారు.
 
              ‘ఆధునికంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రాలపెళ్ళి వద్దు అని, మళ్ళీ ఈ సెంటిమెంట్ ఏమిటి. నమ్మకం, సెంటిమెంట్ వేర్వేరేనా’ ఆలోచనలో పడ్డాను. నా నా చదువు సక్రమంగా కొనసాగుతుందా అనే సందిగ్ధంలో కూరుకుపోయి ఏమీ  సమాధానం చెప్పలేకపోయాను. మొదటిసారి కలిసిన సందర్భం ఇలా మరీ ఇంత పొడిగా ఉండటం నాకేమీ బాగా అనిపించలేదు.
 
                ఆరోజు సాయంత్రం పెద్దమామయ్య వచ్చారు.అన్నయ్యలూ, వీర్రాజు గారూ అమ్మ అందరు కలిసి సంప్రదించుకున్నారు. ఆ సందర్భంలోనే వీర్రాజు గారు తన చెల్లెల్ని చిన్నన్నయ్య కిచ్చి పెళ్ళి చేయటాన్ని ప్రస్తావించారు.
 
                పక్కగదిలో కూర్చుని వారి మాటలు వింటున్న నాకు ఒక్కసారి మనసుకి ముల్లు గుచ్చుకున్నట్లు అయ్యింది. ‘ ఈయన నాకోసం వచ్చారా? చెల్లెలి పెళ్ళి సంబంధం స్థిరపరచుకోటం కోసం వచ్చారా?  ఇప్పుడే ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? మా పెళ్ళి తర్వాతైనా అడగొచ్చు కదా?’ మొదట్లోనే అసంతృప్తి మనసులోకి వస్తుంటే నన్ను నేను సరి చేసుకోటానికి ప్రయత్నించాను.
 
               అంతలో చిన్నన్నయ్య “చేసుకుంటాను గానీ అన్నయ్యకీ, చెల్లెలికీ  అయ్యే వరకూ ఎన్నాళ్ళు అయినాసరే  చేసుకోను. అది మీకు ఇష్టమైతేనే.”అన్నాడు.
               
              తర్వాత వివాహ విధానం గురించి చర్చ జరిగింది. మామయ్య అందరూ కలిసి మాఘమాసం లో తేదిని నిర్ణయించుకుందాం అనుకున్నారు. రెండుమూడు రోజుల్లో తేదీ చెప్తానని మామయ్య అన్నారు.
             
              అందరి అంగీకారంతో చర్చముగించారు.
 
              ఆ మర్నాడు నేను రాసిన నా కథలలో మూడు కథల్ని ఎంపిక చేసి ఒకటి తాను తీసుకు వెళ్ళి ఎమ్. రాజేంద్ర సంపాదకత్వం తో వస్తున్న పొలికేక వారపత్రిక కు ఇస్తాననీ, మిగతా రెండు నన్నే జ్యోతి మాసపత్రిక కు పంపమన్నారు.
                 
              తర్వాతి రోజు నా చెంపల పై ఒక తీపి సంతకం వేసి తిరుగు ప్రయాణమయ్యారు.
                 
              మళ్ళీ మర్నాటి నుంచి కాలేజీ కి వెళ్ళటం కొనసాగించాను. ఉషా వలనా, కుమారి వలనా విషయం తెలుసుకున్న మిత్రులు నన్ను ఆట పట్టించారు. “చదువూ, ఉద్యోగం అని అప్పుడే పెళ్ళి చేసేసుకుంటున్నావేంటోయ్ ” అంటూ.
               
              “నిజమే ఎందుకు తొందరపడ్డాను. పరీక్షలు అయ్యాకే చేసుకుంటే బాగుండేది. అదేమిటీ మనసులోని మాట ఎందుకు చెప్పలేకపోయాను.”
             
              అప్పుడప్పుడు మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది.
             
             ఎదురుగా చెప్పలేక మూగపోయాను. కానీ మళ్ళీ ఉత్తరంలో ఈ విషయం ప్రస్తావించాను. “పెళ్ళయినా చదువుకుందూగానిలే. మళ్ళీ అనుమానమెందుకు” అన్నారు.
         
             మాటిమాటికీ అదే విషయాన్ని ప్రస్తావించటం బాగుండదని ఊరుకున్నాను.                                                 
             అక్టోబర్ నెలలో ఒకవారం పొలికేక సంచిక లో నామొట్టమొదటి కథ కొడవంటి సుభద్రా దేవి పేరుతో  “పరాజిత” ప్రచురితం అయ్యింది. నాకు ఒక రెండు సంచికలు పంపారు. అందులో ఒకటి కాలేజీకి తీసుకువెళ్ళి నామిత్రులకీ, మాతెలుగు లెక్చరర్ సుందరీమేడం కి చూపించాను. అందరూ సంతోషంగా అభినందించారు. అంతకు ముందు కాలేజీ మాగజైన్ల లో తప్పని సరిగా ఒక రచన ప్రచురితం అవుతున్నా ఇలా ఒక వారపత్రికలో నాపేరు చూసుకోవటం భలే సంతోషం కలిగింది.
 
             ఈకథకూ ఒక నేపధ్యం ఉంది. కొడవటిగంటి కుటుంబరావు గారి కురూపి నవలలో కథానాయిక అందంగా ఉండదు. కాని ఎమ్మే చదివిందని రాసారు. అది చదివాక నిజమే కదా! కథానాయిక తప్పని సరిగా సకల సద్గణవంతురాలూ, సౌందర్యరాశి అయి ఉండాలా? ఈ ఆలోచనలతో మాకాలేజీలో నా సహాధ్యాయి అయిన ఒక మరుగుజ్జు అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని పరాజిత కథని రాసాను.                                                                                                   
             మొత్తంమీద మా కాలేజీ లో రచయిత్రిని ఐపోయాను. మిగిలిన రెండు కథల్నికూడా జ్యోతి పత్రికకి పోస్ట్ చేసాను. అవి నా వివాహం అయ్యాకే ప్రచురితం అయ్యాయి.
 
             మా మధ్య ఉత్తరాలు కొనసాగుతున్నాయి అయితే ఆయన రాసే ఉత్తరాల థోరణి కొంత మారింది. నేను చదువు ఒత్తిడి వల్లా వెంటనే రాయలేక పోయాను. అయినా యథా ప్రకారం నేను చదివిన పుస్తకాల గురించి, నేను విన్నా నేర్చుకున్న పాటలు గురించి కాలేజీ విషయాలూ, స్నేహితులు విషయాలూ రాస్తూనే ఉన్నాను. ఒక రోజు ఆయననుండి చాలా చాలా పెద్ద ఉత్తరం వచ్చింది అది చదువుతూ చదువుతూంటే భయకంపితురాలిని ఐపోయాను. చివరకు వచ్చేసరికి ఒక పెద్ద నిట్టూర్పుతో తేలిక పడ్డాను. ఇంతకీ అదేమిటంటే సెప్టెంబర్ 24 వతేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయం అకస్మాత్తుగా రోడ్లమీద  ఒగురుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ ప్రజలంతా పరుగులు తీస్తూ “గండిపేట తెగింది, పానీ ఆ రహా హై” అంటూ లక్షల సంఖ్యలో పరుగులు తీస్తూ జంటనగరాల్లోని అందరూ ఎత్తైన ప్రదేశాలకూ, ఇళ్ళపైకీ, డాబాలమీదకీ ప్రాణాల్ని పిడికిట్లో పట్టుకుని పైపైకి పల్లపు ప్రాంతం నుండేకాక అన్ని ప్రాంతాల నుండీ పరుగులు తీసారు. ఆ తోపులాటలో తొక్కిసలాట లో పరిగెత్తటం లో వాహనాలకింద పడి గాయాలపాలయ్యారు. ఏవీథిలో చూసినా జనప్రవాహాలే. చార్మీనారు పై శిఖరం వరకూ నీరు వచ్చేసిందని సుల్తాన్ బజార్ కొట్లు మునిగిపోయాయనీ చెప్పుకుంటూ పరుగులు తీస్తున్నారు. అంతకుముందు మూడురోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో హుస్సేన్ సాగర్, గండిపేట నిండిపోవటం ఒక భవనం కూలటం వలన వర్ధిల్లాలని చాలామంది చనిపోవటం వల్ల ఈ పుకారు ప్రజల్ని భయకంపితులను చేసింది.
 
             వీర్రాజుగారూ వాళ్ళు కూడా వాళ్ళింటి పైన డాబా పైకి ముఖ్యమైన వస్తువులతో చేరుకున్నారట.హైదరాబాద్ అంతటా సందట్లో సడేమియా అని లూటీలూ, దొంగతనాలూ, దోపిడీలతో అల్లకల్లోలం అయిపోయింది. నలభై నిముషాలు తర్వాత పోలీసులూ, ఆతర్వాత రేడియోలద్వారా అదంతా పుకార్లేనని పదేపదే ప్రకటనలు చేస్తే అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అప్పట్లో వార్తల కి రేడియోనే ఆధారం. మాకు విజయవాడ రేడియో ప్రసారాలు వస్తాయి కనుక ఈ విషయాలు మాకు తెలియలేదు.         
 
             అప్పట్లోనే ఈసంఘటన ఆధారంగా వాసిరెడ్డి సీతాదేవి “పానీ ఆ రహా హై” అని మంచికథ  రాసింది. డిసెంబర్లో నా పుట్టినరోజు మరో వారం రోజులు ఉందనగా అనుకోకుండా నాకు వీర్రాజు గారినుండి పార్సిల్ ద్వారా లేత నిమ్మపండు రంగు ఫుల్ వాయిల్ చీర అందుకున్నాను. ఏదో తప్పనిసరి బాధ్యతగా ఇంట్లో ఏడాదికొకసారిి కొనే చీర  కాకుండా ఆత్మీయంగా అచ్చంగా నాకోసం అందుకున్న ఆ చీరతో ఆ ఏడాది నాపుట్టిన రోజు నాకు చాలా ప్రత్యేకం గా అనిపించింది. ఆ సంతోషాన్ని అక్షరాల్లో నింపి  రాజధాని నగరానికి ఓ లేఖని  పావురంలా ఎగరేసాను.

*****

Please follow and like us:

2 thoughts on “నడక దారిలో(భాగం-15)”

  1. ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ

  2. చెమ్పలపై ఒక తీపి సంతకం….అనడం చాలా బాగుంది మేడం. మీ మొదటి కథ గురించి తెలిసింది. హైదరాబాద్ వరద ఉదంతం సమయానికి నేను ఖైరతాబాద్ లైబ్రరీ లో ఉన్నా ను.విషయం తెలిసి నేను ఇన్టికి నడక మొదలు పెట్టాను. ఈలోగా నాకోసం మా అన్నయ్య నాకోసం చెమటలు కక్కుతూ పరిగెత్తుకు వస్తున్నారు. అది గుర్తొచ్చింది. మీ కథనం చదువుతూంటే నవల చదువుతున్న భావన కలుగుతుంది. అభినందనలు, శుభాకాంక్షలు మీకు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

Leave a Reply

Your email address will not be published.