నారి సారించిన నవల-31

వి.ఎస్. రమాదేవి-2

                      -కాత్యాయనీ విద్మహే

          వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత వ్యధా భరిత చిత్రం ఈ నవల.  ఏలూరులో ఉన్న రోజులలో చుట్టుపక్కల ఇళ్లలో చూసిన   వితంతు స్త్రీల దుస్థితి,  వాళ్ళ  అనుభావాలను వింటూ  పొందిన బాధ ఆమెను ఈ నవలా రచనకు ప్రేరేపించాయి.  1950 లనాటికి స్త్రీలకు చదువులు ఉద్యోగాలు ఇంకా అలవాటు కాని కాలం. ఆస్తి హక్కు లేకపోవటం వలన  భర్త మరణిస్తే పోషణకు అత్తింటి వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి రావటం, లేదా పుట్టిల్లు చేరటం, బంధువులలో ఏ ఇంట అవసరమొచ్చినా వెళ్లి చాకిరీ చెయ్యవలసి రావటం వితంతు స్త్రీకి అనివార్యం.  కుటుంబంలో దగ్గరి బంధువుల నుండి ఎదురయ్యే లైంగిక వేధింపులు, రహస్య సంబంధాలు,  గర్భస్రావాలు వంటి చీదరలు ఎన్నో వాళ్ళు భరించాలి. మధ్య తరగతి ఆస్తి సంబంధాల, అధికార సంబంధాల కుటుంబం లో వితంతువైన ఇద్దరు బిడ్డలతల్లి జీవితం ఎలా ఉంటుందో చూపిన నవల తల్లీ బిడ్డలు. 

          తల్లి శాంతమ్మ.  బిడ్డలు శేషగిరి, సరోజిని. నవల ప్రారంభం అయేటప్పటికి విశాఖపట్టణంలో పెదనాన్నగారి ఇంట్లో ఉండి చదువుకొంటున్న శేషగిరి ఎమ్మె పరీక్షలు వ్రాసి శేషగిరి వేసవి సెలవులకు ఏలూరు లో వున్న తల్లిదగ్గరకు వచ్చాడు. సరోజిని తల్లితోనే ఉంటూ పీయూసీ పరీక్షలు వ్రాసింది. వచ్చిన రోజు రాత్రి మంచినీళ్లకు అని లేచి వంటింటి వైపు వెళ్లిన శేషగిరి తల్లిని అనూహ్యమైన స్థితిలో చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు,  అశాంతికి గురై తల్లి ప్రవర్తనను లోలోన ఏవగించుకొంటూ ఆ మర్నాడు ఇక అక్కడ ఉండలేక స్నేహితుడి పెళ్లి నెపం  పెట్టి  విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ మొదలైన కథ అనేక మలుపులు తిరుగుతూ తల్లి వైపు నుండి సమస్యను అర్ధం చేసుకోగలిగిన స్థాయికి చేరుకొన్న శేషగిరి ఏలూరు రావటంతో ముగుస్తుంది. వేసవిలో మొదలైన కథ దసరా సెలవుల తరువాత బహుశా డిసెంబర్ లో ముగింపుకు వచ్చిందని అనుకోవచ్చు.         

          అక్కడక్కడా వేరువేరు సందర్భాలలో వేరువేరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణల వల్ల  శాంతమ్మ జీవిత చిత్రపటాన్ని రూపు కట్టించింది రమాదేవి. శాంతమ్మ తండ్రి చనిపోవటంతో , అన్నలిద్దరు ఆస్తులు పంచుకొని వేరు పడి ఆమె పెళ్ళిసంగతి పట్టించు కోకపోయేసరికి,  తల్లి పుట్టింటి వాళ్ళు తనకు ఇచ్చిన పొలాన్ని తాకట్టుపెట్టి పెద్ద అల్లుడి సలహా మీద   రెండవ పెళ్లి  వాడైన ఒక డాక్టరుకు ఇచ్చి పెళ్ళిచేసింది. ఇద్దరికీ వయసులో తేడా బాగానే ఉంది. పదహారేళ్లు దాటుతుండగా పెళ్లయిన శాంతమ్మ  కొడుకు కు ఆరేళ్ళ వయసులో భర్తను కోల్పోయింది. కొడుకు కన్నా కూతురు మరో మూడు నాలుగేళ్లు చిన్నది. అంటే శాంతమ్మ ఇరవైనాలుగు, ఇరవై అయిదేళ్ల వయసులో వితంతువయింది. భర్త డాక్టరు, స్వంత డిస్పెన్సరీ ఉంది. సంపాదించింది సంపాదించినట్లు ఖర్చుచేసే తత్వం వల్ల ఆయన మిగిల్చిపోయింది కూడా పెద్దగా లేదు. తల్లితో పాటు నాలుగేళ్లు అక్క బావల ఇంట ఉండి ఏలూరులో ఇంతకు పూర్వం అద్దెకున్న ఇల్లు అమ్మకానికి వస్తే డిస్పెన్సరీ అమ్మేస్తే వచ్చిన డబ్బుతో కొని కూతురితో ఆ ఇంట్లో ఉండటం మొదలు పెట్టింది. శేషగిరి పెదనాన్న దగ్గరే ఉండి చదువుకున్నాడు.  నాలుగు ఎకరాల పొలం మీద ఆ దాయంతో ఆమె ఇల్లూ పిల్లల  చదువు నిర్వహించుకొంటూ వచ్చింది. దానిమీద అప్పులు చేయ వలసి వచ్చిందేమో నవలా కథ ప్రారంభానికి  ఆ పొలం కూడా అమ్మెయ్యవలసి వచ్చింది. 

          ఇతివృత్తంలో తీవ్ర సంఘర్షణకు కారణమైన అంశం శాంతమ్మకు ఉన్న ఒక రహస్య సంబంధం. అది ఎవరితో ఎప్పటి నుండి అన్నది ముఖ్యం కాదు. ఆ సంబంధాలలో శాంతమ్మ అనుభవాలు, ఆనందాలు, సమస్యలు, సంఘర్షణలు ఏమిటన్నదానితో కూడా ఇతివృత్తానికి పని లేదు. లోకం ఏమనుకొంటున్నది అన్న దానితో కూడా  పనిలేదు. కన్నబిడ్డలకు ఆ విషయం తెలిస్తే వాళ్ళ ప్రతిస్పందన ఎలావుంటుంది? ఎలావుండాలని రచయిత్రి ఉద్దేశించింది అన్నది ముఖ్యం. ఎవరో చెప్తే గాక తానే ప్రత్యక్షంగా ఆ విషయం తెలుసుకొన్న శేషగిరి ప్రపంచం తలకిందులై పోయింది. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాడు. తల్లిని సూటిగా చూడలేకపోయాడు. మామూలుగా మాట్లాడలేకపోయాడు. అన్నం సరిగా తినలేకపోయాడు. తల్లిని తప్పించుకు పోతేగానీ శాంతి లేదనుకొన్నాడు. ఇంటి నుండి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఇంటి వాతావరణంతో తాను సమాధాన పడగలననే ధైర్యం కోల్పోయాడు. తనకు తగిలిన దెబ్బ చెల్లికి తగిలితే తట్టుకో లేదనుకొన్నాడు. తన దగ్గరకు తీసుకువెళ్లి చదివించాలనుకొన్నాడు. తనకు చెల్లి , చెల్లికి తను ఉన్నారు అనుకొన్నాడు. 

          శేషగిరి ఎందుకలా తలకిందులయ్యాడు? సమాజం నిర్దేశించిన, ప్రచారంలో పెట్టిన లైంగిక  నైతిక విలువలు ఒంటబట్టిన సాధారణ మానవుడు కనుక. స్త్రీల లైంగికత ఎన్నో విధినిషేధాలతో నియంత్రించబడుతున్న వ్యవస్థ ఇది. స్త్రీ శీలం,  పవిత్రత విలువను సంతరించుకొనటం ఆ క్రమం లోనే జరిగింది. పెళ్లి లేకుండా స్త్రీపురుష సంబంధాలు అనైతికం. స్త్రీవిషయంలో నైతే అది శీలం కోల్పోవటం. పెళ్లయిన పురుషుడికి ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నా తప్పు పట్టని లోకంలో  స్త్రీ చాటుమాటు సంబంధాలు చెడిపోవటం కింద లెక్క. జీవితకాలమే కాదు , భర్త మరణించాక తాను మరణించి అతనిని చేరేవరకు అతనికి నిబద్ధురాలై ఉండటం స్త్రీధర్మం అని మనుస్మృతి వంటివి బోధపోశాయి. అదే  పతివ్రతా లక్షణంగా చలామణి అయింది. స్త్రీకి ఆదర్శం చేయబడింది. ఈ రకమైన సామాజిక భావజాల ప్రపంచం లో భాగమైన శేషగిరికి తల్లి ప్రవర్తన తప్పుగా అనిపించటం సహజం. భర్త చనిపోయిన స్త్రీ పిల్లలకోసం బతకాలని చెప్పి ఆమెకు తనదైన జీవితం వేరే లేదన్నట్లుగా చేసి చెప్పే సంస్కృతిలో పెరిగిన శేషగిరికి తల్లి చాటుమాటు సంబంధాలు కుటుంబ వాతావరణాన్ని పాడుచేసినవిగానో, మర్యాదకు భంగకరమైనవిగానో అనిపించి  అసహనానికి గురి చేశాయి. పతివ్రతల నమూనాను ధిక్కరించిన తల్లికి కొడుకు కావటం సామాజికంగా పెద్ద అసౌకర్యం. అవమానకరం. అలాంటి తల్లిని పూర్తిగా వదిలేసుకొనటానికి కూడా అతను సిద్ధ మవుతున్నట్లు కనబడుతుంది. చెల్లిని తనదగ్గరకు తెచ్చుకొనాలి, తనకు ఆమె ఆమెకు తాను అని అతను అనుకొనటంలో అర్ధం అదే. తల్లిని లైంగిక నీతిని విడనాడిన దోషిగా నిర్ధారించటం, ఆమె వాదం ఏమిటో తెలుసుకొందామని కూడా అనుకోకుండా వదిలెయ్యటాన్ని తీర్పుగా నిర్ణయించటం – ఇవి అన్నీ స్త్రీలపట్ల పురుష న్యాయం ఎలా ఉంటుందో సూచిస్తాయి. 

          తనకు తగిలిన దెబ్బ చెల్లెలికి తగిలితే తట్టుకోలేదు అని శేషగిరి అనుకొన్నాడు కానీ ఆ చెల్లి సరోజిని తల్లితోనే ఉంటుంది కనుక  ఈ విషయం ఆమెకు  అప్పటికే తెలుసు. మొదటిసారి  ఆమె కు భయంవేసింది. నాన్నతో పాటు అమ్మ కూడా తనకు లేకుండా పోతుందా అన్న భయం అది. ఆ భయం నెమ్మది నెమ్మదిగా తీరింది. ఎలా తీరి వుంటుంది అని ప్రశ్నించుకొంటే బహుశా తల్లితో నిత్యం ఉండటం వలన ఆమెకు తమపట్ల ఉన్న ప్రేమలో,  శ్రద్ధలో, తమ అభివృద్ధి గురించిన తాపత్రయంలో మార్పేమీ లేకపోవటాన్ని గమనించటం  వల్ల కావచ్చు.  రెండేళ్లలో మూడు సార్లు మాత్రమే అలాంటి  పరిస్థితి ఎదురవటం వల్ల తల్లికి అది వ్యసనం కాదని ఆమెకు అర్ధం కావటం వల్ల కావచ్చు. మరి ఎందుకలా  అని ఆలోచించే కొద్దీ సరోజినికి తల్లి మీద జాలి ప్రేమ ఎక్కువయ్యాయి అని రచయిత్రి కథనం. తల్లి గురించి సానుభూతితో ఆలోచించగలిగిన పరిణితి ఇరవై ఏళ్ల వయసులో శేషగిరి లో లేనిది అతనికంటే నాలుగేళ్లు చిన్నదైన సరోజినిలో ఎలా సాధ్యమైంది?   ఆడపిల్ల కావటం వలన.  వయసుకు అవసరమైన , కష్టసుఖాలను పంచుకోగలిగిన తోడు లేని తల్లి  జీవితంలోని వెలితిని తట్టుకొనటానికి ఆ మాత్రపు ఊరటను  కోరుకొనటంలోని సమంజస్యం అర్ధం అవుతూ రావటం వలన. తనకు అర్ధమైంది కనుకనే అన్నకు దానిని అర్ధం చేయించటానికి ప్రయత్నించింది. మనసులో ఏదో పెట్టుకొని బాధపడటం మంచిది కాదని మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉత్తరాలు వ్రాసింది. చివరకు ఆమె వ్రాసిన ఉత్తరమే అతనిని ఆలోచింపచేసింది. తల్లి పట్ల తాను ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో  అర్ధం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేట్లు చేసింది. 

          శేషగిరిని ఇంట్లోపెట్టుకొని చదివించిన చిదంబరం శేషగిరికి పెద్దమ్మ భర్త.  అతనెప్పుడూ శాంతమ్మ ప్రవర్తనను గుణాన్ని తప్పు పట్టే సూటీపోటీ మాటలు అంటూనే ఉంటాడు. తల్లిని తప్పించుకొని వచ్చిన శేషగిరి పెదనాన్న మాటలు సరికొత్తగా అర్ధం అవుతూ అశాంతిని పెంచాయి. అటువంటి సమయంలోనే చనిపోయిన పెదబావమరిది కొడుకు మురళి కి తనకూతురిని ఇచ్చి పెళ్ళిచేయాలనుకొంటున్న ఆయన దగ్గరకు చినబావమరిది లక్ష్మీ పతి మురళి అర్ధరాత్రిళ్ళు, అపరాత్రిళ్ళు శాంతమ్మ ఇంటికి సరోజిని కోసం తిరుగుతున్నట్లు వార్త మోశాడు. సంతానం లేని అన్న ఆస్తికి తానే వారసుడు కానీ దత్తు వచ్చిన మురళి  కాదని కోర్టులలో కేసులు నడుపుతున్న లక్ష్మీపతికి  మురళిని నైతికంగా దెబ్బకొట్టటం ఒక అవసరమైంది. లక్ష్మి పతి వ్రాసిన ఉత్తరం పట్టుకొని చిదంబరం  “ నాకు శాంతమ్మ గుణం మొదటి నుండి తెలుసు. నేనందుకే ఈడొచ్చిన పిల్లను అక్కడ ఒంటరిగా ఉంచడం బాగుండదని , ఎలాగైనా ఈ సంవత్సరం ఇక్కడికి రప్పించమంటే, అదీ పడనీయలేదు శాంతమ్మ. తను చెడటమే కాకుండా పిల్లని కూడా చెడగొడుతుంది.”  కోపంతో  ఎగిరిపడ్డాడు. సెలవల్లో తాను వెళ్లిన నాటి రాత్రి చూసిన దృశ్యం నేపథ్యంలో పెత్తండ్రి మాటల్లో సత్యముందనిపించి తల్లి మీద అసహ్యంతో చెల్లిమీద కోపంతో శేషగిరి వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా సరోజినీ వ్రాసిన ఉత్తరం అది. 

          ఆ ఉత్తరంలో సరోజినీ తల్లి పక్షాన నిలబడి చేసిన వాదం ఈ నవలకు కీలకమైనది. ఒక సమస్యను నిరపేక్షం గా చూసి తీర్పులు ఇయ్యటం పాక్షికం అనీ  పూర్వాపరాల సంబంధంలో అర్ధం చేసుకొన్నప్పుడే అసలు సత్యం ఆవిష్కృతం అవుతుందని తెలియ చెప్పిన ఉత్తరం అది. అమ్మ రక్షణలో ఉండి చెడిపోయావు అని అన్న చేసిన ఆరోపణను తిప్పికొట్టటం అందులో మొదటి విషయం. నిజంగానే తాను చెడిపోతే దానికి అమ్మ బాధ్యురాలు కాదు అని చెప్పటమే కాదు చెడిపోయిన తల్లి అయినా సరే తనపిల్లలను  మంచి మార్గంలో ఉంచాలని కనిపెట్టుకు చూస్తుంది కానీ చెడిపోవాలని కాంక్షించదు అని తల్లి మనసును ఆవిష్కరించింది.  రెండవది అతి ముఖ్యమైంది ఆమె రక్తం పంచుకొని పుట్టి ఆస్తిపాస్తుల్ని పంచుకొని అనుభవించిన పిల్లలుగా ఆమె నీతి నియమాలను భరించటమే తమ కర్తవ్యం అని చెప్పటమే కాదు ఆమె విషయంలో తీర్పు చెప్పి శిక్ష వేసే అధికారం లేదు అని నిర్ధారించటం. మూడవది  అన్నగారి ఆస్తిని చేజిక్కించుకొనాలని ఆయన దత్తుకొడుకు మీద వారసత్వ దావా నడిపే చిన్న మేనమామకు, తల్లికి రావలసిన ఆస్తిని అమ్మమ్మను మోసం చేసి తన పేరుమీదికి మార్చుకున్న పెదనాన్నకి అమ్మ నైతికతను తప్పు పెట్టె  అధికారం ఎక్కడిదని ప్రశ్నించటం. శీలం అనేది లైంగికతకు మాత్రమే సంబంధించినదిగా కాక ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంగా సరోజిని  భావిస్తున్నదని  ఈ ప్రశ్నే చెబుతుంది. 

          అన్నిటికన్నా ముఖ్యమైనది సమస్యను తల్లి కోణం నుండి చూసి అర్ధం చేసుకొనటానికి ప్రయ్నతించాలని సూచించటం. పెదతండ్రికి తల్లి మీద కోపానికి బయటకు కనిపించే కారణం ఉబ్బసం తో బాధపడుతున్న అక్కకు సేవ చేసుకొంటూ వండిపెడుతూ తన ఇంట్లోనే ఉండక స్వంత ఇల్లు ఏర్పరచుకొని వెళ్ళిపోవటం. కానీ అంతకంటే బలమైనది ఆమె తనకు లొంగి రాలేదన్నది. తన అధికారాన్ని ధిక్కరించిందన్నది.   తానొకసారి పెద్దమ్మ వ్రాసిన ఉత్తరాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరం ఆడవాళ్ళమే ఇక్కడ ఎందుకు మనం కూడా పెదనాన్నగారి దగ్గరకు వెళ్ళి పోదాం అన్నప్పుడు తల్లి కంచె చేనుమేస్తే అన్న సామెత చెప్పి ఇంతో ఉన్న మగవాళ్లే మనలను నాశనం చేయవచ్చు అని బాధగా చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ వాటితో కలిపి అమ్మను అర్ధం చేసుకోవాలని  అన్న ఆలోచించవలసిన పద్ధతిని సూచించింది. తల్లికి ఇంకొక పురుషుడితో ఏర్పడిన సంబంధాన్ని స్నేహం అని గౌరవంగా సంబోధించగలిన పరిణితి సరోజినిది. ఎలాంటి పరిస్థితులతో ఆయనతో స్నేహం కలిసిందో అంటూ ఆ స్నేహమే తల్లికి కష్టాలన్నింటినీ ఎదుర్కొనే బలాన్ని ఇస్తున్నదేమో ! అని కూడా సరోజిని సానుకూలంగా మాట్లాడగలిగింది.

          వితంతు స్త్రీల ఆస్తుల మీద , శరీరాల మీద అధికారాన్ని స్థాపించుకొనటానికి  స్వప్రయోజన పరులై  కుటుంబంలో దగ్గరి బంధువులే అయిన పురుషులు పన్నే సాలెగూడు వ్యూహాలలో చిక్కుకొని గిజగిజలాడే స్త్రీల చరిత్ర చీకటి చరిత్రే. దానిని ధిక్కరించటానికి ప్రయ్నతించే స్త్రీల కోవలోకి శాంతమ్మ వస్తుంది. అందుకు బావగారితో బలవంతపు రహస్య సంబంధంలో చస్తూ బతకటం కంటే  ఒంటరిగా తనబతుకు తాను బతకడానికి మొగ్గు చూపటంలో ఆమె ఆత్మాభిమానమే కీలకం. ఇల్లు కొనుక్కొనటం దగ్గర నుండి కూతురి పెళ్లికోసం ఇల్లు తాకట్టు పెట్టి అప్పుతెచ్చుకొనటం వరకు ఆమెకు సహాయపడిన వ్యక్తి సూర్యనారాయణ. అతనితో శాంతమ్మ స్నేహం బలవంతం కాదు. తన ఇష్టానికి అందులో ప్రమేయం ఉంది. అందుకే ఆమె దానిని సహజ పరిణామంగా స్వీకరించిందే కానీ అపరాధభావానికి లోను కాలేదు. బహుశా తల్లిలోని ఆ లక్షణాన్ని గుర్తించటం వల్లనే కావచ్చు సరోజిని ఆమె  మీద ప్రేమను పెంచుకోగలిగింది. 

          శాంతమ్మ జీవిత పరిణామాలను పిల్లలకు ఆమెకు మధ్య సంబంధాన్ని కేంద్రంగా చేసి స్త్రీల లైంగికతకు సంబంధించిన గతానుగతిక విధినిషేధ వ్యవస్థకు వ్యక్తి అవసరాలకు, ఆకాంక్షలకు మధ్య వాస్తవ జీవితంలో భిన్న సందర్భాలలో వచ్చే వైరుధ్యాలను చర్చకు పెట్టడంతో పాటు చదువులు, కళాశాల రాజకీయాలు, విద్యార్థుల మనస్తత్వాలు,  మేనత్త మేనమామ పిల్లల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు మొదలైనవి తల్లీబిడ్డలు నవల ఇతివృత్తంలో భాగం అయ్యాయి. ఆస్తులు, పంపకాలు, వారసత్వ తగాదాలు, వ్యక్తి స్వార్ధాలు, ప్రయోజనాలు,  నైతిక విలువలు  కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంటాయో చూపిన నవల ఇది. 

          ఈ నవల చదువుతుంటే చివరకు మిగిలేది నవలకు మరొక కోణం అనిపిస్తుంది. తోడు,  దమయంతి కూతురు వంటి  కథలు  గుర్తుకు వస్తాయి. తెలుగులో స్త్రీవాద సాహిత్య  ఉద్యమం మొదలుకావటానికి పాతికేళ్ల ముందర స్ఫుటమైన  వ్యక్తిత్వం గల  శాంతమ్మ వంటి పాత్రను, చైతన్యవంతురాలైన సరోజిని వంటి  పాత్రను సృష్టించిన రమాదేవి ఆధునిక మహిళా దృక్పథం అబ్బురపరుస్తుంది.   

          ఈ నవలను రమాదేవి పెద్దక్క వెంకట నరసమ్మకి – బావ శేషారావుగార్కి , అక్క నాగమణికి- బావ శేషగిరి రావు గార్కి అంకితం ఇచ్చింది.  

    ( ఇంకా ఉంది)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.