మొహం పగిలింది!

-శ్రీనివాస్ బందా

నొప్పికి భాషతో సంబంధంలేదు.

నొప్పికి రకరకాల అవతారాలున్నాయి.

కమిలిన చోటైనా కవుకు దెబ్బైనా నొప్పి మాత్రం ఒకేలా బాధిస్తుంది.

అందరికీ తెలియాల్సినవే కానీ కొన్ని నొప్పులు కొందరికే తెలుస్తాయి.

          అలాంటి ఒక నొప్పిని, అందరికీ నొప్పి తెలిసేట్లు గుచ్చి మరీ చెప్పిన సినిమా –   ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’.

ఏమిటా నొప్పి?

          మన దేశంలోనే కాదు – చాలా దేశాల్లో ఒక అసమానత చాలా సహజంగా వాడుకలో ఉంది. ఆడ. మగ. ఇద్దరూ మనుషులే. ఇద్దరికీ ఒకేలాంటి ఇంద్రియాలున్నాయి. వాళ్ళ శరీర నిర్మాణంలోనూ, అవి పని చేసే తీరుల్లోనూ సహజమైన తేడాలున్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఉంది ఒక అసహజమైన, అతి క్రూరమైన తేడా. దాని ఉనికి – గాలిలా – మనందరికీ ప్రతి రోజూ ప్రతి విషయంలోనూ తెలుస్తూనే ఉంది. ‘పదుగురాడు మాట పాడియై ధరఁజెల్లు’  అన్న చందాన, ఆ తేడా – ఆ వివక్ష అలా  శతాబ్దాల తరబడి పాటించబడుతూ ఒక వ్యవస్థగా రూపుదాల్చింది. పెకలించలేని మహా విషవృక్షమై పాతుకుపోయింది. రకరకాల పేర్లతో స్త్రీని వంటింటికీ, పరుపుకీ,  చీపురికీ కట్టిపడేసింది.  

          ఎంతో ఇష్టంగా నేర్చుకున్న డాన్స్ కి సహజంగా కామా పెట్టి, పెళ్లి జరిగిపోయి, మెట్టింటికి వస్తుందో పిల్ల. అదో లంకంత ఇల్లు. అందులో అత్తగారొక అలుపెరగని చీమ. కొత్త పెళ్లికూతురు శక్తి మేరకు తనని తాను చెక్కుకుంటో, ఆ యింటి తీరుకి నప్పే ప్రయత్నం చేస్తోంది. ‘యింటి తీరు’ అంటే, బ్రష్షూ పేస్టూ అందిస్తేగానీ పళ్ళు తోముకో లేని, లోపలి నుంచి చెప్పులు తెచ్చి కాళ్ళ ముందు పెడితేగానీ, తొడుక్కుని బయటకు వెళ్ళలేని మామగారు. అలాగని ఆయన ఏమీ చెయ్యలేడని కాదు.  పగలంతా పడక్కుర్చీ లోంచి పేపర్లో ఈదడం, తెచ్చిచ్చిన కాఫీని చప్పరించడం, సుష్టుగా తింటూ, నమిలిన ఎంగిలి తుక్కుని తింటున్న కంచం చుట్టూ పడెయ్యడం. మంచంమీదకి చేరి యూట్యూబ్ ని పరిశీలించడం, వొలిచి ఇచ్చిన నగలని బీరువాలో పెట్టి తాళం చెవులు మొల్లో కట్టుకోవడం, ‘ఇవాళ ఫలానా వంటకం చెయ్యి’ అని ఫర్మానాలు చెయ్యడం వగైరాలన్నీ ఆయన చక్కగా చెయ్యగలడు.  

          స్కూల్లో పిల్లలకి సోషియాలజీ పాఠాలు చెప్పే కొడుకు కూడా, క్రమం తప్పకుండా కొన్ని చేస్తాడు. యోగా. ప్రాణాయామం. తినేటప్పుడు తండ్రి అలవాట్లనే పాటించడం. ఫోర్‌ప్లే లేకుండా కుతి తీర్చుకోవడం.

          ఇలా సజావుగా సాగిపోకుండా, గర్భవతియైన కూతురికి ‘సాయ’పడడానికి అత్తగారు ఎగ్జిట్ అయ్యాక మొదలవుతుంది అసలు కథ.

          తరగడం, కోయడం, వండడం, వడ్డించడం, తుడవడం, కడగడం, తోమడం, ఊడవడం, దీపం పెట్టడం, కుళ్ళు వాసనతో లీకవుతున్న సింక్ నీళ్ళని మానేజ్ చెయ్యడం, మృగసాదృశ్యమైన కుదుపులని భరించడం… ఇలా చాలావరకూ తనని తాను పరుచుకుంటూ కుంచించుకుపోతుంటుంది కొత్త కోడలు.

          ఇప్పుడు మామగారు చెప్పులు స్వయంగానే వేసుకుంటున్నారు. కానీ ఆయన కోసం అన్నం కుక్కర్లో కాక, పొయ్యి మీదే వండాలి. ఆయన బట్టలని మిషన్లో కాక చేత్తోనే ఉతకాలి. ఆయన కాదంటే ఉద్యోగానికి అప్లై చెయ్యకూడదు.

          బండి గాడిలో పడుతోందనగా, మూడు రోజుల సమస్య వచ్చిపడుతుంది. ఆమె విడిగా ఉండాలి. వేరే గదిలో. నేలమీదే పడుకోవాలి. దేన్నీ, ఎవరినీ తాకకూడదు.  ఎవరికీ ఎదురుపడకూడదు. వంటా, ఇంటి పనులూ వేరే మనిషితో జరుగుతాయి.

          అప్పుడు మొదలౌతాయి ప్రశ్నలు. ఆమెలో.

          – ఆ మూడు రోజులూ మంచం మీద ఎందుకు పడుకోకూడదు?

          – తులసి మొక్క ఆకులని – జలుబు చేసినప్పుడు రసంకోసమైనా సరే  –  ఎందుకు తాకకూడదు?

          – స్కూటీ మీదనుంచి జారిపడిన భర్తని పైకి లేవదీయడానికైనా – ఆ మూడు రోజుల్లో ఎందుకు ముట్టుకోకూడదు?

          – హోటల్లో పాటించే టేబుల్ మేనర్స్ ని ఇంట్లో ఎందుకు పాటించరని – భర్తని ఎందుకు అడగకూడదు?

          – ఫోర్‌ప్లే కావాలని భర్తని ఎందుకు అడగకూడదు? దాన్ని గురించి తెలియడమంటే చెడిపోవడమన్నట్లే చూస్తాడెందుకు?

          తెలిసినా ఎవరూ సమాధానాలు చెప్పని ప్రశ్నలు.

          ఇంతలో, ఎవరో ఒక్కసారి చెప్పగానే భర్త అయ్యప్ప మాల వేసుకుంటాడు. లీకవుతున్న సింక్ పైపు కంపుని భరిస్తున్న భార్య అప్పటికి ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మాత్రం బాగు చేయించడు.

          అప్పుడామె ఏం చేసింది? చూడటమే సరైంది.

          పితృస్వామ్య వ్యవస్థలో, భార్య హోదాలో స్త్రీ సహించే దురాగతాలని పిండి ఆరేసిన ఈ మళయాళీ సినిమాని, అందరం కళ్ళు తెరుచుకుని మరీ చూడాలి.  సినిమా అయి పోయినా ఆ కళ్ళు తెరుచుకునే ఉండాలి. ఆ గాలి స్పర్శని అనుభవించాలి. ప్రశ్నలు వేసుకోవాలి. సమాధానాలు వెతుక్కోవాలి. దొరికిన సమాధానాలని పట్టుకుని చుట్టుకుని మనలోకి ఇంకించుకోవాలి.   

పేరు – ది గ్రేట్ ఇండియన్ కిచెన్

దర్శకత్వం – జియో బేబీ

నటీనటులు – నిమీషా సజయన్, సూరజ్ వెంజరమూడు, టి. సురేశ్ తదితరులు

భాష – మళయాళం (ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ ఉన్నాయి)

నిడివి – 100 నిముషాలు

అందుబాటు – అమెజాన్ ప్రైం లో

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.