పేషంట్ చెప్పే కథలు

మరోసారి ఎందుకు (రచయిత్రి ముందుమాట)

ఆలూరి విజయలక్ష్మి

            సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం  “పేషెంట్ చెప్పే కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో వారం వారం ప్రచురింపబడ్డాయి.  ఆంధ్రజ్యోతి వార పత్రిక అప్పటి  సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రోత్సాహంతో వాటిని రాశాను. ‘పేషెంట్ చెప్పే కథలు’ అనే శీర్షికను శ్రీశర్మగారే పెట్టారు.  అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలతో వచ్చే పేషెంట్స్  వాస్తవిక జీవితాల్ని,వారి సంక్లిష్ట మనస్తత్వాల్ని చిత్రిస్తూ చిన్ని చిన్ని కథలు పత్రికలో ఒక్క పేజీ నిడివికి సరిపోయేలా రాయమని ఆయన కోరారు.  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారిచ్చిన  ప్రోత్సాహంతో పేషెంట్స్ చెప్పే కథలు రూపకల్పన జరిగింది. ప్రతి కథకు మూలం వాస్తవ జీవితంలో ఉంది.  స్త్రీల జీవితాల గురించే ప్రధానంగా రాసినప్పటికీ, స్త్రీ ల జీవితాలు పురుషుల జీవితాలతో పెనవేసుకొనే ఉంటాయి కాబట్టి సహజంగానే పురుషుల జీవితాలు మనస్తత్వాలు కూడా కథల్లో కనిపిస్తాయి. 

            అయితే 20 సంవత్సరాల క్రితం రాసిన కథల్లో కొన్ని సమస్యలు మారలేదా? స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో,వారి మనస్తత్వాలలో , జీవితాల్లో,  ఆ జీవితాల్ని నియంత్రిస్తున్న శక్తుల్లో మార్పేమీ రాలేదా? ఈ కథలు రెలవెన్స్ ని   కోల్పోలేదా?! సమస్యల స్వరూపంలోనూ స్థాయిలోనూ ఈ రెండు దశాబ్దాల్లోనూ  ఎంతో కొంత మార్పు వచ్చినప్పటికీ అవి ఉనికిని కోల్పోయి మటుమాయమయిపోలేదు. పైగా కొన్ని సమస్యలు మరింత జటిలంగా వికృతంగా పరిణమించాయి. 

            ఇప్పటికీ, స్త్రీ స్థానం ఇల్లు, పురుషుడి స్థానం సమాజం అనే భావనకు కాలం      చెల్లి పోలేదు. ఇంటికే పరిమితమై భర్త చుట్టూ తమ జీవితాలను అల్లుకుని అదే లోకంగా బ్రతికే  స్త్రీలు నిత్యం అభద్రతకు గురవుతూ స్వల్ప విషయాలకే  కల్లోల పడుతూ మానసిక అస్థిరతకు గురవుతారు.

            దారిద్య్రం,మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలకు తోడు పురుషుల బాధ్యతా రాహిత్యం, జీవితం నుండి పారిపోయే క్రమంలో చేసుకునే వ్యసనాలు, ఆ వ్యసనాల కారణంగా కుటుంబ నిర్వహణ భారం  స్త్రీలపై పడడం,మితిమీరిన చాకిరీ,బాధ్యతలు స్త్రీల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని బలి చేస్తున్నాయి. 

            మహిళలకు  తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, తమ వృత్తి నైపుణ్యాల్ని  మెరుగు పరచుకోవడానికి, తమ ఉద్యోగ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికి తగిన విజ్ఞానాన్ని పొందడానికి స్వంత సమయం లభించడం గగనకుసుమంగానే ఉంది. ఇంటిపని బాధ్యత ప్రాధమికంగా స్త్రీదేనన్న సంప్రదాయ భావన ఆర్థిక అవసరాల కోసం స్త్రీని ఇంటి గడప దాటించి సమాజంలో కి తీసుకు వచ్చిన ఆధునిక కాలంలో కూడా బలంగానే ఉంది.  తమ జీవిత లక్ష్యాల గురించి పూర్తి అవగాహన ఉండి కూడా వాటిని సాధించడానికి అవరోధంగా నిలుస్తున్న  పరిస్థితుల్ని జయించే చొరవ తీసుకోలేని అసహాయత  స్త్రీలను క్షోభ పెడుతుంది.

            స్త్రీలకు ఇంట్లోనూ, బయట సమాజంలోనూ ఎక్కడ భద్రత లేని పరిస్థితి,స్వంత బంధువులు సన్నిహితులు,పరిచితులు అయిన పురుషుల నుండి బాలికలు ముప్పు ఎదుర్కొనే దారుణ పరిస్థితి నేటికీ కొనసాగడమే కాదు, సమస్య మరింత తీవ్రమైంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో మారుతున్న సాంస్కృతిక విలువలు,కుటుంబ విలువలు,ఆర్థిక సంక్షోభాలు,స్త్రీ పురుష సంబంధాల్ని మరింత హీనస్థితికి దిగజార్చి స్త్రీలు సోదరుల నుండి, తండ్రుల నుండి కూడా లైంగిక అత్యాచారాల్ని ఎదుర్కొంటున్నారు. 

            పురుషుడికి అగ్రస్థానాన్ని నిచ్చి, స్త్రీ పుట్టుకనే ఒక దుఃఖం గా మార్చిన పితృస్వామ్య సమాజం లో స్త్రీల విలువ,జీవితం పురుష సంతానాన్ని కనడం మీద ఆధారపడి ఉన్నాయి. స్త్రీ అయినా కారణంగా అంతులేని వేధింపుల్ని,అవమానాల్ని తమ జీవితం తాలూకు అన్ని దశల్లోనూ సహించే స్త్రీలు ఆడ సంతానాన్ని కన్న కారణంగా అదనపు కష్టాల్ని భరించవలసి వస్తూంది. ముఖ్యంగా  మధ్య తరగతి స్త్రీలు కాపురాన్ని కోల్పోతామేమోనని భీతిల్లుతూ బ్రతకవలసి వస్తూంది. 

            దారిద్య్రము, అవిద్య, అజ్ఞానం, అపోహల కారణంగా మనదేశంలో పసికందులు అనేక రకాల వ్యాధులకు గురయి అకాల మరణాలు బారిన పడుతున్నారు,  లేక అశక్తులుగా  గా మారి జీవితంలో సుఖసంతోషాలకు దూరమవుతున్నారు.  ఇది కేవలం కుటుంబ సమస్య కాదు,సామాజిక సమస్య,మొత్తం దేశానికి సంబంధించిన సమస్య. ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొని దేశసంపదను పెంపొందించడంలో భాగస్వామ్యులవ్వాల్సిన  వీరి  పోషణ బాధ్యత,చికిత్సా భారం సమాజం మీద, ప్రభుత్వాల మీద పడుతోంది. సరళీకరణల ప్రభావం తో సామజిక బాధ్యతల నుండి సంక్షేమ బాధ్యతలు నుండి తప్పుకోవడానికి ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తున్న దశలో ఇలాంటి నిర్భాగ్యుల గతి ఏమి కానుందో ఊహించుకోవాల్సిందే. 

            స్త్రీల స్త్రీత్వం,సెక్సువాలిటీ చుట్టూ అల్లిన భావజాలంతో స్త్రీలను అదుపు చేయడమే కాక వివాహ వ్యవస్థలో పవిత్రత,పాతివ్రత్య నియమాలను స్త్రీలకు పరిమితం చేసి నియమాల్ని ఉల్లంఘించిన పురుషులని ఉపేక్షించడమో, సమర్థించడమో చేస్తుంది పురుషస్వామ్య సమాజం. ఈ పరిస్థితి వివాహ వ్యవస్థను అస్థిర పరచడమేకాక స్త్రీలు అభద్రతకు లోనయి హిస్టీరికల్ గ ప్రవర్తించేందుకు దారి తీస్తుంది. 

            సంతానం కలగని దంపతులు ఇద్దరూ ఎవరిలో లోపం ఉందో పరీక్షలు చేయించుకుని తెలుసుకుని చికిత్స పొందాల్సిన సందర్భంలో ‘నాలో ఏ లోపమూ లేదు, నేనేం పరీక్షలు చేయించు కోనక్కర్లేదు’ అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి నిరాకరించే మూర్ఖ శిఖామణులు తనలోనే లోపం ఉందని తెలిసి కూడా భార్యలోనే లోపం ఉందని నిరూపించడానికి ప్రయత్నించే ప్రబుద్ధులూ,  పిల్లలు కలగ లేదనే సాకుతో నో మరి ఏదో సాకుతో ను భార్యను వదిలించుకోవడానికి తెగించే పురుష పుంగవులు ఉన్నారు. 

            నిరుద్యోగం, లేమి, బ్రతుకులో తగిలే ఎదురుదెబ్బలు నిర్మలంగా, నిజాయితీగా, నింపాదిగా జీవిద్దామనుకునే  వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి. దారిద్య్రం  చుట్టు ముట్టినప్పుడు ఆకలే ఒక పెను వ్యాధి గా రూపం దాలుస్తుంది. 

            జీవితంలో విజేతగా నిలవాలని తపనతో డబ్బు వెంటపడి పరిగెడుతూ కుటుంబ సభ్యులకు అందమైన అనుభూతులకు ఆప్యాయతలకు దూరమై కోల్పోయింది ఏమిటో ఆలస్యంగా గ్రహించేసరికి తిరిగిరాని జీవితం దూరంగా జరిగి పోయిన ఆప్తులు మిగిలేది విషాదం. కానీఎప్పుడో చూపిన రవ్వంత ఆప్యాయతకు ప్రతిగా కొండంత ప్రేమ కృతజ్ఞత లభించడం మనిషిని ఆశావహుడిని  చేస్తుంది. 

            ఆర్థిక సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్య సహజంగా ఉండవలసిన ఆత్మీయ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. మెత్తని వాడిని చూస్తే మొత్తబుద్ధేస్తుందన్న సామెత కన్న తల్లికి కూడా వర్తించి ప్రవర్తిస్తే అభాగ్యురాలైన కూతురికి మిగిలేది శోకమే. 

            ఇంటి యజమానికి అతి సులభంగా డబ్బు వచ్చిపడే ఉద్యోగం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు విచ్చల విడిగా  డబ్బులు ఖర్చు పెట్టడం, ఏ పనీ చేయకుండా ఏ బాధ్యతలని  తీసుకోకుండా రికామీగా తిరగడం రివాజే. నిజాయితీకి ఆత్మగౌరవానికి శ్రమించి ప్రతిఫలాన్ని అనుభవించాలనే తత్వానికి విలువనిచ్చే యువతి ఆ కుటుంబంలోకి కోడలుగా వస్తే ఆ కల్చరల్ గ్యాప్కి తట్టుకుని ఇమిడిపోగలగడం  కష్టమే. 

            భవిష్యత్తులో యుద్ధాలు నీళ్ల కోసం జరుగుతాయి అంటారు. భవిష్యత్తులోనే కాదు వర్తమానంలో కూడా చిన్న సైజు యుద్ధాలు నీళ్లకోసం జరుగుతూ బడుగు జీవుల బ్రతుకులు బ్రద్దలవుతున్నాయి!

            వరకట్నాలివ్వలేని స్థితిలో మధ్యతరగతి ఆడపిల్లల పెళ్లిళ్లు వాయిదా పడటం,పెళ్లి  కంటే ఆర్థికంగా సశక్తురాలవడం ప్రధానం అనే అవగాహనలేక చదువు, నైపుణ్యాలను సంపాదించుకునే పట్టుదలను చూపడం కాక పూజా పునస్కారాలతో ప్రొద్దుపుచ్చడం, ఏ ఏ మహాద్భుతమో జరిగి జీవితం చక్కబడుతుందనే ఆశతో నిష్క్రియాపరులుగా కాలం వెళ్లబుచ్చడం కనపడే దృశ్యమే. 

            జీవితంలో దాదాపు సగభాగం గడిచాక దంపతులైన స్త్రీ పురుషులు స్వప్నాల లో జీవించడం గాక జీవిత యధార్థాన్ని అంగీకరించి జీవించాలని గతాన్ని తవ్వుకుంటూ జీవితానందాల్ని  కోల్పోవడం కాక వర్తమానాన్ని ఫలప్రదం చేసుకునేందుకు, భవిష్యత్తును ఉజ్వలంగా రూపొందించుకునేందుకు  ప్రయత్నించాలని భావించే స్వభావం బ్రతుకును కొంత సజావుగా నడిపిస్తుంది. 

            పెద్దలు తమ కోపతాపాలునీ, జీవన వైఫల్యాల ఒత్తిడిని పసివారిపై  చూపెడితే అది వారి  మనసుల్ని తీవ్రంగా గాయపరిచి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. 

            ‘చావడం సాహసం కాదు, బ్రతకడమే సాహసం’ అనుకుంటూ బ్రతుకు భయానికి లోనై జీవితాన్ని అంతం చేసుకోవడానికి, ఆర్థిక పరిస్థితులు, ఇతర సమస్యలకి తోడు  స్త్రీల    స్త్రీత్వం, సంతానోత్పత్తి కి సంబంధించిన అనేక అంశాలు కారణమవుతాయి. బిడ్డలు పుట్టక పోవడం ఒక వయసులో బిడ్డను కనడం స్త్రీ అవమానపడడానికి హేతువు అవుతాయి. 

            మనుషుల్ని ప్రేమ బంధాల కంటే డబ్బు సంబంధాలే శాసిస్తున్న కాలంలో తల్లి మృత్యుముఖం లో ఉన్నందుకు దుఃఖం, బెంగకంటే ఆమె చనిపోయాక ఆమె వారసురాలిగా తనకు లభించే  బంగారం మీద దృష్టి ఉండటం విడ్డూరం కాదు. 

            స్త్రీ శరీరం వ్యాపార వస్తువు అయినపుడు ఆ వ్యాపారంలో మానవీయ స్పర్శ మిగలడం అరుదు. అరుదు గానే అయినా బ్రతుకు సాలెగూట్లో చిక్కి విలవిలలాడే జీవి దుఃఖానికి ఆ స్పర్శ చల్లటి లేపనమౌతుంది. 

            మేనరికాలు చేసుకోవడం వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి శాస్త్రీయమైన అంశాల్ని తమ ఆర్ధిక అవకాశవాదాల కనుగుణంగా పట్టించుకోవడం,పట్టించుకోక పోవడం రివాజయింది. పెళ్లి విషయం లో ఆడపిల్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, అభ్యంతరాల్ని పట్టించుకోవడం అలవాటులేని సమాజాల్లో ఆడపిల్లల కడుపు కోతనూ కన్నీళ్లనూ పట్టించుకోరు. 

            భార్యల్ని కొట్టడానికి భర్తలు చూపే కారణాలలో ప్రధానమైనది ఆమె లైంగిక  పవిత్రత మీద అనుమానం. ఆ అనుమానపు పురుగు తొలుస్తున్న పురుషుడు రాక్షసుడే  అవుతాడు.  

            పెళ్లి,సెక్స్  అనేవి  అర్థం కాని పసి బాలిక కు పెళ్లి చేస్తే మారిటల్ రేప్ కి గురయి మనసు చెదిరి ,శరీరం ఛిద్రమై నెత్తుటి ముద్దవడం  కలచివేసే దృశ్యం. 

            కుల, మత, ప్రాంత ఆశ్రిత పక్షపాతలు, బంధుప్రీతి, లంచగొండితనం ఒక వైపు మేధో హత్యలు చేస్తుండగా మరోవైపు మెరుగైన  అవకాశాల్ని  వెదుక్కుంటూ మేధో  వలసలు జరగడం స్వతంత్ర భారతదేశపు విషాదాల్లో ఒకటి. 

            సినిమాల్లో లాగా జీవించాలని రంగు రంగుల కలల్లో అనుక్షణం తేలిపోతూ,ఆ కలలు వాస్తవిక జీవితం లో నెరవేరేవి కావనే స్పృహ లేక,ఫలించని కలల్ని చూసి తట్టుకోగలిగే నిబ్బరం లేక విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తూ ఇంటిని నరక ప్రాయం చేసే స్త్రీలూ ఉన్నారు. 

            నిరక్షరాస్యత,దారిద్య్రం,ఉపాధి అవకాశాలు,రవాణా సౌకర్యాలు లేకపోవడం,బాల్య వివాహాలు,పసి వయసు లో గర్భాలు,వైద్య సదుపాయాలు అందుబాటులో లేక పోవడం, అందుబాటులో వున్న సదుపాయాల్ని కూడా వినియోగించుకోలేక పోవడం, లభించే సదుపాయాలలో  నాణ్యత లేకపోవటం  మొదలైన అనేక కారణాలతో గర్భం,ప్రసవం సమయంలో చనిపోతున్న స్త్రీల సంఖ్య మనదేశం లో రెండు దశాబ్దాల ముందుకంటే కొంత తగ్గినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే ఎంతో ఎక్కువగా వుంది. 

            వ్యక్తులు,ముఖ్యంగా స్త్రీలు తమ దుఃఖాల్ని,కష్టాల్ని,అవమానాల్ని,సమస్యల్ని బంధువుల తోనూ ,స్నేహితుల తోనూ చెప్పుకోవడానికి చిన్నతనంగా భావిస్తారు. తాము వారి దృష్టి లో చులకన అవుతామని, తమను వారు హేళనగా చూస్తారనీ భయపడతారు. తమ కోసం కొంత సమయం కేటాయించి,రవ్వంత సానుభూతిని చూపే డాక్టరు  దొరికితే తమ శారీరక బాధల గురించి చెప్పడం తో  పాటు మానసిక గాయాల గురించి కూడా చెప్పుకుంటారు. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనో,మంత్రం వేసినట్లు తమ సమస్యలు మాటు మాయ మౌతాయనే ఆశతోనో డాక్టరుతో తమ సమస్యల్ని చెప్పుకునే వారు అరుదు. సహనం తో తాము చెప్పేది రాగద్వేషాల కతీతంగా వినడం, ఓదార్పునీ, ధైర్యాన్నీ ఇచ్చే మాటలు చెప్పి తమ మానసిక వేదనను తగ్గించడం, నీ పక్కన నేనున్నాననే భరోసా ఇవ్వడం-ఇవే వారు సామాన్యంగా డాక్టరు నుండి కోరుకునేది. 

            అసలు తమ సమస్యను ఒకరికి మనసు విప్పి చెప్పుకోవడం లోనే ఆ సమస్య విడిపోయినట్లు, ఏదో ఒక మార్గం కనపడినట్లు అనిపిస్తుంది. తమ చదువు, విజ్ఞానం    లోకానుభవంతో ఒక సమస్యను సజావుగా విశ్లేషించి పరిష్కారం సూచించగలరన్న  విశ్వాసం కూడా పేషెంట్స్ తమ కథల్ని డాక్టర్ కి చెప్పడానికి పురికొల్పవచ్చు. 

            సమస్యల పరిష్కారాలు సరళరేఖల్లా ఉండవు, అనేక ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయాంశాలు వంకరటింకర గీతల్తో చిక్కుముడుల్ని వేస్తాయి అనే అవగాహన అంత  స్పష్టంగా పేసెంట్స్ కీ, డాక్టర్ కీ  కూడా ఉండకపోవచ్చు . మనసులో పేరుకుని మేట వేసుకున్న దుఃఖాన్ని దింపుకొనే దారి, తమ ఆలోచనల్ని, అనుభూతుల్ని, కలతల్ని, ఆందోళనల్ని విప్పి  చెప్పుకునే అవకాశం ఉండడమే పేషంట్స్ ఆశించేది.

            20 ఏళ్ల క్రితం ‘పేషంట్స్ చెప్పే కథలు’ లోని  అంశాలు, ఇప్పుడు పేషెంట్స్ చెప్తున్న కథల్లో ఉండడం వాస్తవం. ఆనాటి సమస్యలు రెలెవెన్స్  కోల్పోకపోవడం వాస్తవం. 

            అందుకే మరోసారి ఈ కథలు, “పేషెంట్స్  చెప్పే కథలు. “

           *****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.